1. దేవా! నా మొర వినుము. నా విన్నపమును పెడచెవిని పెట్టకుము.
2. నా వేడుకోలును ఆలించి నాకు ప్రత్యుత్తరమిమ్ము నేను చింతలవలన మిక్కిలి అలసిపోతిని. శత్రువుల బెదరింపు కేకలకును దుష్టులపీడనకును నేను జంకెదను.
3. వారు నన్ను బాధపెట్టుచున్నారు. నా మీద ఆగ్రహము చెందుచున్నారు.
4. నా హృదయము లోలోపలనే వేదననొందుచున్నది. మృత్యుభయము నన్నావరించినది.
5. నేను భీతితో కంపించుచున్నాను. వెరపు నన్ను చుట్టుముట్టినది.
6. “పావురమునకువలె నాకును రెక్కలుండిన , ఎంత బాగుగానుండెడిది. నేనెగిరిపోయి విశ్రాంతినొందెడివాడనుకదా!
7. దూరముగా ఎగసిపోయి ఎడారిలో వసించెడి వాడనుకదా!
8. వడివడిగా దూసుకొనిపోయి పెనుగాలినుండియు, తుఫానునుండియు తప్పించుకొనెడివాడనుగదా!” అని నేను తలంచితిని.
9. ప్రభూ! నీవు శత్రువులను నాశనముచేసి వారి భాషను తారుమారు చేయుము. పట్టణమున హింసయు కొట్లాటలును కన్పించుచున్నవి.
10. విరోధులు దివారాత్రములు ప్రాకారములమీద నడచుచు, నగరము చుట్టును తిరుగాడుచున్నారు. పట్టణము నేరములతోను, దుష్కార్యములతోను నిండియున్నది.
11. పురము వినాశనమునకు నిలయమైనది. సంతవీధులు పీడనకును, వంచనకును ఆటపట్టులైనవి.
12. విరోధి ఎవడైన నన్ను అవమానించినచో నేను సహించియుండెడివాడను, ప్రత్యర్థి ఎవడైన నన్ను కించపరచినచో నేను అతని కంటబడకుండ దాగుకొనియుండెడి వాడను.
13. కాని నాకు సరిసమానుడవు, సహచరుడవు, చెలికాడవునైన నీవే ఇట్లు చేసితివి.
14. నీవును, నేనును ఆప్యాయముగా సుద్దులు చెప్పుకొనెడివారము. భక్తసమూహముతో గూడి దేవాలయమునకు వెళ్ళెడివారము.
15. మృత్యువు నా శత్రువుల పైకి హఠాత్తుగా దిగివచ్చునుగాక! వారు సజీవులుగానే పాతాళమునకు పోవుదురుగాక! దుష్టత్వము వారి నివాసములో, హృదయములోనున్నది.
16. నా మట్టుకు నేను దేవునికి మొరపెట్టెదను. అతడు నన్ను కాపాడును.
17. సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము నేనతనికి ఫిర్యాదు చేయుచు అంగలార్చెదను. అతడు నా వేడుకోలునాలించును.
18. బహు శత్రువర్గములు నాతో సల్పు పోరాటమున అతడు నా ప్రాణములను సురక్షితముగా కాచికాపాడును.
19. అనాదికాలము నుండియు పరిపాలనము చేయుచున్న దేవుడు నా మొరనాలించి వారిని ఓడించును. ఆ విరోధులు, దేవునికి భయపడరు, పరివర్తనము చెందరు.
20. నాతోటివాడు తన మిత్రులమీదికి దాడిచేసెను. అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోడయ్యెను.
21. అతని పలుకులు వెన్నకంటెను మెత్తగా నుండును. కాని అతని యెదలో ద్వేషమున్నది. అతని మాటలు తైలము పూసినట్లుగా మృదువుగా నుండును. కాని అవి ఒరనుండి వెలికితీసిన కత్తులవంటివి.
22. నీ భారమును ప్రభువు మీద మోపుము ఆయన నిన్ను భరించును. ఆయన సజ్జనుని ఎన్నడును కలత జెందనీయడు.
23. దేవా! నీవు ఆ నరహంతలను, ఆ వంచకులను, వారి ఆయుష్కాలము ఇంకను సగమైనను ముగియకమునుపే లోతైన గోతిలో పడత్రోయుదువు. నేను మాత్రము నిన్నే నమ్మెదను.