ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 45

1. నా హృదయము రమ్యమైన , భావముతో పొంగిపొరలుచున్నది. నా ఈ గీతమును రాజుకు విన్పింతును. నా నాలుక నిపుణుడైన వ్రాతగాని లేఖినివలె పనిచేయును.
2. నీవు నరులలోకెల్ల సుందరరూపుడవు. సొగసైన వాక్చాతుర్యము కలవాడవు. ప్రభువు నిన్ను నిత్యము దీవించుచునే యుండును.
3. మహావీరుడవైన రాజా! ఖడ్గమును ధరింపుము! నీవు వైభవమును ఠీవియు గలవాడవు.
4. ప్రాభవముతో రథారూఢుడవై స్వారివెడలుము. సత్యమును, దయను, న్యాయమును నెలకొల్పుము. నీవు స్వీయబలము వలన మహావిజయములు సాధింతువు.
5. నీ వాడి బాణములు నీ శత్రువుల గుండెలలో గ్రుచ్చుకొనును. అన్యజాతి ప్రజలు నీ పాదముల మీద వాలుదురు.
6. దేవా! నీ సింహాసనము కలకాలము నిల్చును. నీవు న్యాయముతో నీ రాజదండమును త్రిప్పుదువు.
7. నీవు ధర్మమును అభిమానించి దౌష్ట్యమును ఏవగించుకొందువు. కనుకనే నీ దేవుడైన ప్రభువు నిన్ను ఎన్నుకొని, సాటి రాజుల కంటే నీకు ఎక్కువ ఆనందమును దయచేయు తైలముతో నిన్నభిషేకించెను.
8. నీ వస్త్రములు అగరు, లవంగపట్ట, గోపరసముల సువాసనలతో గుబాళించుచున్నవి. దంతముపొదిగిన , ప్రాసాదమున తంత్రీ వాద్యకారులు నీకు ప్రమోదము చేకూర్తురు.
9. రాజపుత్రికలు నీకు కొలువు చేయుదురు. రాణి ఓఫిరుదేశ మేలిమిబంగారు నగలతో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుండును.
10. కుమారీ! నీవు నా పలుకులు సావధానముగా వినుము. మీ ప్రజలను, మీ పుట్టినింటిని ఇక మరచిపొమ్ము.
11. రాజు నీ సౌందర్యమునకు మురిసిపోవును. అతడు నీకు అధిపతి కనుక  నీవు అతనికి నమస్కరింపుము.
12. తూరు దేశపు కుమార్తెలు, నీకు కానుకలు కొనివత్తురు. సంపన్నులు నీ మన్నన బడయగోరుదురు.
13. రాజకుమారి ప్రాసాదమున ఉన్నది, ఆమె పూర్ణ సౌందర్యవతి ఆమె ఉడుపులను పసిడిపోగులతో నేసిరి.
14. బహువర్ణ వస్త్రములు తాల్చిన రాజకుమారిని ఆమె చెలికత్తెలతోపాటు రాజు వద్దకు కొనివచ్చుచున్నారు.
15. వారెల్లరును ఆనందోత్సాహములతో కదలివచ్చి రాచనగరును ప్రవేశించుచున్నారు.
16. రాజా! గతించిన మీ పూర్వుల రాజ్యాధికారమును కొనసాగించుటకు నీవు కొమరులను బడయుదువు. విశ్వధాత్రికి వారిని అధిపతులను చేయుదువు.
17. నేను నీ ఖ్యాతిని తరతరములు నిలుపుదును. కావున ప్రజలు నిన్ను ఎల్లకాలము కొనియాడుదురు.