ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 39

1. “నేను నా కార్యములనుగూర్చి జాగ్రత్తపడుదును. నా నాలుకతో పాపము కట్టుకొనకుండ ఉందును. -దుష్టులు చేరువలో ఉన్నపుడు నా నోరు కళ్ళెముతో మూసికొని ఉందును" అని చెప్పితిని.
2. నేను ఏమియు పలుకక మూగవలె మౌనముగానుంటిని. మంచిని గూర్చియైనను ఏమియు మాట్లాడనైతిని. అయినను నా బాధ ఇంకను అధికమయ్యెను.
3. " నా హృదయము వ్యధతో నిండిపోయెను. నేను ఆలోచించిన కొలది అని నా వేదన మిక్కుటమయ్యెను. కనుక నేనిట్లు నుడివితిని:
4. "ప్రభూ! నాజీవితమెపుడు ముగియునో,  నా జీవిత కొలమానిక ఏమిటో, నా జీవితమెంత క్షణికమైనదో నీవే నాకు ఎరిగింపుము.
5. నీవు నాకు క్షణభంగురమైన ఆయువును ఒసగితివి. నీ దృష్టిలో నా ఆయుస్సు అత్యల్పమైనది. భూమిమీద వసించు నరులెల్లరును ఊదిన శ్వాసము వంటివారు.
6. ప్రతి మనుజుడును నీడవంటివాడు. అతని ఆర్బాటములు నిరుపయోగమైనవి. అతడు కూడబెట్టిన సొత్తు ఎవని పాలగునో తెలియదు.
7. ప్రభూ! ఇట్టి పరిస్థితులలో నేనేమి ఆశింపగలను! నేను నిన్నే నమ్మితిని.
8. నా పాపములన్నిటినుండియు - నీవు నన్ను విమోచింపుము. మూర్ఖులు నన్ను గేలిచేయకుండునట్లు చేయుము.
9. నేను మూగవాడను మౌనము వహింతును. నన్ను ఈ అగచాట్లపాలు చేసినది నీవే.
10. నీ దెబ్బలను నానుండి తొలగింపుము. నీ చేతి దెబ్బలవలన నేను చనిపోవుచున్నాను.
11. నీవు నరుని పాపములకుగాను అతనిని చీవాట్లు పెట్టి దండింతువు,  అతడు అభిమానించు వానినెల్ల నీవు చిమ్మటవలె నాశనము చేయుదువు. నరుడు ఊదిన శ్వాసము వంటివాడు.
12. ప్రభూ! నా ప్రార్ధన వినుము. నా మొరను ఆలింపుము. నా కన్నీటిని అనాదరము చేయకుము. నేను నీకు అనతికాల అతిథి వంటివాడను, మా పూర్వులందరివలెనే నేనును స్థిరనివాసములేని పరదేశిని.
13. నీ కోపదృష్టిని నా నుండి ప్రక్కకు తిప్పుకొనుము. అప్పుడు, నేను గతించి శూన్యములో కలిసిపోకముందు ఒకింత ఆనందమును అనుభవింతును.”

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services