1. దుష్టుని హృదయమున పాపము మంతనము చేయును. అతడికి దైవభీతి ఉండదు.
2. అతడు తనను తాను ఘనముగా ఎంచును. దేవుడు తన పాపమును గుర్తుపట్టడనియు, తన దోషమును ఖండింపడనియు తలంచును.
3. అతడి పలుకులు దుష్టత్వముతోను, అబద్దములతోను నిండియుండును. అతడు జ్ఞానమును విడనాడెను కనుక ఇక మంచిని చేయజాలడు."
4. అతడు పడకమీద పరుండి, చెడు పన్నాగమును పన్నును. దుష్ట మార్గమున నడచును, అధర్మమును అంగీకరించును.
5. ప్రభూ! నీ కృప ఆకాశమును అంటును. నీ నమ్మదగినతనము మబ్బులను తాకును.
6. నీ నీతి మహాపర్వతములవలె స్థిరమైనది. నీ ఆజ్ఞలు అగాధసముద్రములవలె లోతైనవి. నీవు నరులను, మృగములనుకూడ కాపాడుదువు.
7. నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులకు నీ రెక్కల మాటున ఆశ్రయము దొరకును.
8. వారు నీ ఆలయమున సమృద్ధిగా లభించు భోజనమును ఆరగింతురు. నీ మంచితనము అను నదినుండి , పానీయమును సేవింతురు.
9. నీవు జీవపు చెలమవు. నీ వెలుగు వలననే మేము వెలుగును గాంతుము.
10. నిన్నెరిగిన భక్తులకు నీ కృపను దయచేయుచుండుము. సజ్జనులకు నీ నీతిని ప్రసాదించుచుండుము.
11. గర్వాత్ములు నన్ను అణగదొక్కకుందురుగాక! దుష్టులు నన్ను పారద్రోలకుందురుగాక!
12. దుష్టులు తాము పడిన చోటనే పడియుందురు. మరల పైకిలేవరు.