1. నేను ప్రభువునకు ఎల్లవేళల వందనములర్పింతును. నిరంతరము ఆయనను కీర్తింతును.
2. ప్రభువు నాకు చేసిన మేలులకుగాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక!
3. మీరును నాతోగూడి ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలసి ఆయన దివ్యనామమును కీర్తింతము.
4. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొరవినెను. నా భయములెల్ల తొలగించెను.
5. ఆయన వైపు చూడుడు. మీ ముఖములు ప్రకాశింపనిండు. అపుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికి కలుగదు.
6. దరిద్రుడు ప్రభువునకు మొర పెట్టగా ఆయన వినును. సకల క్లేశములనుండియు అతనిని కాపాడును.
7. ప్రభువునకు భయపడువారి చుట్టును ఆయనదూత శిబిరము పన్నును. సకల ఆపదలనుండి వారిని కాపాడును.
8. ప్రభువు ఎంత ఉత్తముడోయని రుచిచూసి తెలుసుకొనుడు. ఆయనను శరణువేడువాడు ధన్యుడు.
9. యావే భక్తులారా! మీరు ప్రభువునకు భయపడుడు. ఆయనకు భయపడు వారికి ఏ కొదవయు వాటిల్లదు.
10. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును. కాని ప్రభువును ఆశ్రయించువారికి ఎల్ల మేలులు సిద్ధించును.
11. పిల్లలారా రండు, నా ఉపదేశమును ఆలింపుడు! నేను మీకు దైవభీతిని నేర్పింతును.
12. మీరు బ్రతుకగోరినచో, దీర్ఘకాలము జీవించి శుభములు బడయగోరినచో
13. చెడ్డమాటలు పలుకకుడు, అబద్ధములు ఆడకుడు.
14. చెడునుండి వైదొలగి మంచిని చేపట్టుడు. శాంతిని కాంక్షించి దానిని సాధించుటకు పూనుకొనుడు.
15. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టియుండును. వారి అంగలార్పులు ఆలించును.
16. కాని ఆయన దుష్కార్యములు చేయువారిని ఎదిరించును. భూమి మీదినుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును.
17. నీతిమంతులు మొర పెట్టినచో ప్రభువు ఆలించును. సకల విపత్తులనుండియు వారిని కాపాడును.
18. వేదన వలన గుండెలు పగిలిన వారికి , ప్రభువు చేరువలోనే యుండును. బాధలవలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును.
19. పుణ్యపురుషుని చాల ఆపదలు చుట్టుముట్టును. కాని ఆ విపత్తులన్నిటి నుండి ప్రభువు అతనిని రక్షించును.
20. ప్రభువతనిని సురక్షితముగా కాచి కాపాడును. అతని ఎముక ఒక్కటియు విరుగదు.
21. కాని చెడు అనునది దుష్టులను నాశనము చేయును. సత్పురుషులను ద్వేషించువారు దండన పొందుదురు.
22. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును. ఆయనను శరణువేడువారు దండనను తప్పించుకొందురు.