ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 31

1. ప్రభూ! నేను నిన్ను శరణువేడుచున్నాను. నన్ను ఎన్నడును సిగ్గుపడనీయకుము. నీ న్యాయమునుబట్టి విముక్తుని చేయుము.
2. నీవు నా మనవినాలించి నన్ను శీఘ్రమే రక్షింపుము. నాకు కోటవై నన్నాదుకొనుము. సురక్షితదుర్గమై నన్ను రక్షింపుము.
3. నాకు ఆశ్రయస్థానమును, నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము.
4. శత్రువులు పన్నిన ఉరులనుండి నేను తప్పించుకొందునుగాక! నా దుర్గము నీవే.
5. నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభూ! నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు.
6. నిరర్ధకములైన విగ్రహములను కొలుచువారిని నీవు అసహ్యించుకొందువు, కాని నేను నిన్ను నమ్మితిని.
7. నీ స్థిరమైన కృపను తలంచుకొని నేను మిగుల సంతసింతును. నీవు నా వ్యధ గుర్తించితివి, నా బాధలను గ్రహించితివి.
8. నన్ను శత్రువుల చేతికి అప్పగింపలేదు. విశాలస్థలమున నా పాదములు నిలబెట్టితివి.
9. ప్రభూ! నన్ను కరుణింపుము, నేను విపత్తులలో చిక్కుకొంటిని. విచారము వలన నా నేత్రములు క్షీణించినవి. నేను పూర్తిగా క్రుంగిపోతిని.
10. నేను దుఃఖముతో బ్రతుకీడ్చుచున్నాను. నిట్టూర్పులతోనే నా యేండ్లు సాగిపోవుచున్నవి. ఆపదలవలన నేను సత్తువను కోల్పోతిని. నా ఎముకలుకూడ పటుత్వమును కోల్పోయినవి.
11. శత్రువులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. ఇరుగుపొరుగువారు నన్ను ఏవగించుకొనుచున్నారు. పరిచితులు నన్ను చూచి బెదరిపోవుచున్నారు. వీధులలో నాకెదురుపడువారు నన్నుగాంచి గబగబ దాటిపోవుచున్నారు.
12. ప్రజలు నన్ను చచ్చినవానినివలె మరచిపోయిరి. నేను పనికిరాదని మూలన పడవేసిన వస్తువువంటి వాడనైతిని.
13. శత్రువులు నన్ను గూర్చి గుసగుసలాడుచున్నారు. నలువైపులనుండి బెదరింపులు వినిపించుచున్నవి. విరోధులు గుమికూడి నా మీద కుట్రలు పన్ని నా ప్రాణములు తీయజూచుచున్నారు.
14. కాని ప్రభూ! నేను నిన్నే నమ్మితిని. “నీవే నా దేవుడవు"అని పలికితిని.
15. నేను ఎల్లపుడు నీ అండదండలలోనే ఉంటిని కనుక నన్ను హింసించు శత్రువులనుండి నీవు నన్ను కాపాడుము.
16. నీ ముఖతేజస్సును నీ దాసునిమీద పడనిమ్ము. నీ కరుణతో నన్ను కాపాడుము.
17. ప్రభూ! నేను నీకు మొరపెట్టుచున్నాను. నీవు నన్ను అవమానమున ముంచకుము. దుష్ఠులే అవమానమునకు గురియగుదురుగాక! వారు మృతలోకము చేరి తమ నోరు మూసికొందురుగాక!
18. అహంకారముతో పుణ్యపురుషులను చులకనచేసెడి అబద్ధీకుల నోళ్ళను నీవే మూయింపుము.
19. ప్రభూ! నీ పట్ల భయభక్తులు చూపువారికి నీవు ప్రశస్తభాగ్యములెన్నియైనను దయచేయుదువు. ఎల్లరును చూచుచుండగా, నిన్ను నమ్మినవారికి నీవు దొడ్డభాగ్యములను ప్రసాదింతువు.
20. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకొందువు. దుష్టుల కపటోపాయములనుండి వారిని రక్షింతువు. 
21. ముట్టడింపబడిన పట్టణమువలె నేను బందీగా ఉన్నపుడు ప్రభువు నా కొరకు అద్భుతకార్యములు చేసెను. అతనికి స్తుతి కలుగునుగాక!
22. నేను భయము చెందితిని. “నీ సన్నిధినుండి నన్ను దూరముగా గెంటివేసితివి” అని తలంచితిని. కాని నేను నీకు మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి.
23. ప్రభు భక్తులారా! మీరు ప్రభువును ప్రేమింపుడు. అతడు తన దాసులను కాపాడును. కాని అతడు గర్వాత్ములను కఠినముగా దండించును.
24. ప్రభువును నమ్మెడువారందరును ఆ ధైర్యముతెచ్చుకొని నిబ్బరముగా నుండుడు.