ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 30

1. ప్రభూ! నీవు నన్ను విపత్తునుండి తప్పించితివి. శత్రువులు నా పతనమును చూచి సంతసింపకుండునట్లు చేసితివి. కనుక నేను నిన్ను స్తుతింతును.
2. నా దేవుడైన ప్రభూ! నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఆరోగ్యమును దయచేసితివి.
3. ప్రభూ! నీవు నన్ను పాతాళలోకమునుండి వెలుపలికి కొనివచ్చితివి. మృతలోకమునకు ఏగువారినుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి.
4. ప్రభు భక్తులారా! ఆయనను స్తుతించి కీర్తింపుడు. ఆయన నామమునకు వందనములర్పింపుడు.
5. ఆయన క్షణకాలము కోపించును. ఆయన అనుగ్రహము మాత్రము వాడట జీవితాంతముండును. ఆ మంత రేయి దుఃఖమువలన కన్నీళ్ళు కారును. కాని వేకువనే ఆనందము చేకూరును.
6. నేను సురక్షితముగా నున్నప్పుడు “నాకెన్నడు కీడు వాటిల్లదు" అని పలికితిని.
7. ప్రభూ! నీవు నన్ను కరుణతో అభేద్యమైన పర్వతదుర్గముగా మలచితివి. కాని నీవు నీ ముఖమును నా నుండి , దాచుకొనగనే నేను కలత చెందితిని.
8. ప్రభూ! నేను నీకు మనవి చేసితిని. నీ సహాయమును అర్ధించుచు
9. “నేను చనిపోయి పాతాళము చేరుకొనినయెడల నీకేమి లాభము కలుగును? మృతులు నిన్ను స్తుతింతురా? .ధూళి నిన్ను స్తుతించగలదా?  మేరలేని నీ మంచితనమును కీర్తించగలదా?
10. ప్రభూ! నీవు నా మొరనాలించి, నా మీద దయచూపుము. దేవా! నన్నాదుకొనుము" అని వేడుకొంటిని.
11. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి. సంతాప సూచకముగా నేను తాల్చియున్న గోనెను తొలగించితివి. నాకు ఆనందకరమైన వస్త్రములను కట్టబెట్టితివి. 
12. కనుక నేనిక మౌనముగా నుండక నీ స్తుతులను పాడెదను. నా ప్రభువైన దేవా! నేను నీకు సదా వందనములర్పింతును.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services