ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 28

1. నాకు రక్షణదుర్గమవైన ప్రభూ! నేను నీకు మొర పెట్టు కొనుచున్నాను. నీవు మౌనము వహింపవలదు. నీవు మౌనము వహింతువేని నాకును మృతలోకమునకేగువారి గతియే పట్టును.
2. నేను గొంతెత్తి నీకు మొరపెట్టుకొనుచున్నాను.నీ సహాయమును అర్థించుచున్నాను.నీవు నా వేడుకోలును ఆలింపుము. నేను నీ పవిత్ర మందిరము వైపు చేతులెత్తుచున్నాను.
3. దుష్కార్యములు చేయు దుష్టులతోపాటు నన్ను గోనిపోకుము . వారు కుటిల మనస్కులై శాంతి కాముకులుగా నటింతురు. వారు బయటికి చెలిమి ఉట్టిపడునట్లు మాటలాడుదురు.
4. ప్రభూ! వారి చెయిదములకుగాను,వారు చేసిన దుష్కార్యములకుగాను,నీవు వారిని దండింపుము. వారు చేసినచెడ్డపనులన్నింటికిగాను వారికి ప్రతిఫలమిమ్ము.
5. వారు ప్రభువు చేసిన కార్యములను గుర్తింపరైరి. ఆయన చేసిన సృష్టిని గమనింపరైరి. కనుక ప్రభువు వారిని నిర్మూలనము చేయును. ఆయన వారిని మరల వృద్ధిలోనికి తీసికొనిరాడు.
6. ప్రభువునకు స్తుతికలుగునుగాక! ఎందుకన, ఆయన నా ప్రార్థన ఆలకించెను.
7. ప్రభువే నాకు బలము, నాకు డాలు. ఆయనయందే నా నమ్మకము. ఆయన నన్నాదుకొనెను కనుక నేను సంతసింతును.ఆయనను స్తుతించి కీర్తనలు పాడుదును.
8. ప్రభువు తన ప్రజలకు బలమును దయచేయును. ఆయనయే తన అభిషక్తునికి రక్షణ దుర్గము.
9. ప్రభూ! నీ జనులను కాపాడుము. నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము. నీవు వీరికి కాపరివి కమ్ము. వీరిని సదా ఆదుకొమ్ము .

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services