ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 27

1. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట. ఇక నేనెవరికి భయపడవలెను?
2. దుష్టులు, విరోధులు నా మీదకెత్తి వచ్చి నన్ను కబళింప జూచినచో వారే కుప్పకూలి పోవుదురు.
3.సైన్యము నా మీదికి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడదు. శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు.
4. నేను ప్రభువును ఒక్క వరము కోరుకొంటిని, నాకు కావలసినది ఇది ఒక్కటియే నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెనని, ఆయన అందమైన ముఖమును గాంచవలెనని, ఆయన సలహా అడుగుకొన వలెననియే నా కోరిక.
5. ఆపత్కాలమున అతడు నన్ను తన మందిరమున దాచియుంచును. తన దేవాలయమున నన్ను సురక్షితముగా మనుచును. నన్ను భద్రముగా కొండ కొమ్మున నిల్పును.
6. కనుక నన్ను చుట్టుముట్టిన శత్రువులను నేను ఓడింతును. సంతోష నాదముతో ప్రభు మందిరమున బలిని అర్పింతును. ఆయనను స్తుతించుచు కీర్తనలు పాడుదును.
7. ప్రభూ! నేను నీకు మొరపెట్టినపుడు,నీవు నా వేడికోలును ఆలింపుము. నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తర మిమ్ము.
8. నీవు నన్ను "నా సన్నిధిలోనికి రమ్ము” అని పిలిచితివి. "ప్రభూ! నేను నీ సన్నిధిని వెదకుచున్నాను" అని నా హృదయము నీకు ప్రత్యుత్తరమిచ్చెను.
9. నీ ముఖమును నా నుండి దాచుకొనకుము. నీ దాసుడనైన నాపై కోపింపకుము. నీ యెదుటినుండి నన్ను గెంటివేయకుము. నన్ను ఆదుకొనువాడవు నీవే. నా రక్షకుడవైన ప్రభూ! నీవు నన్ను చేయి విడువకుము, పరిత్యజింపకుము.
10. నా తల్లిదండ్రులు నన్ను విడనాడిననుప్రభువు నన్ను చేరదీసి పరామర్శించును.
11. ప్రభూ! నీ చిత్తమును నాకు తెలియజేయుము. శత్రువులు నన్ను పీడించినను, సురక్షితమైన మార్గమున నన్ను నడిపింపుము.
12. నన్ను విరోధుల చేతికి చిక్కనీయకుము. వారు నా మీద కూటసాక్ష్యములు చెప్పుచున్నారు. దౌర్జన్యముతో బుసలు కొట్టుచు, నన్ను బెదరించుచున్నారు.
13. ఈ లోకమున నేను ప్రభువు మంచి తనమును చూడ కలుగుదునని నా నమ్మకము.
14. నీవు ప్రభువును నమ్ముము, ధైర్యము తెచ్చుకొనుము. గుండెదిటవు కలిగియుండుము, నీవు ప్రభువుకై నిరీక్షింపుము.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services