ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 29

1. దైవతనయులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయన మహిమ ప్రతాపములను కీర్తింపుడు.
2. మహిమాన్వితమైన ఆయన దివ్యనామమును కొనియాడుడు. ప్రభువు పవిత్రమందిరమున ఆయనను ఆరాధింపుడు.
3. ప్రభువు స్వరము జలముల మీద విన్పించుచున్నది. మహిమాన్వితుడైన ప్రభువు ఉరుములతో గర్జించు చున్నాడు. ఆయన స్వరము సాగరము మీద విన్పించుచున్నది.
4. ప్రభువు స్వరము మహాబలమైనది. ఆయన స్వరము మహాప్రభావము కలది.
5. ప్రభువు స్వరము దేవదారులను పెల్లగించును. లెబానోను కొండల మీది దేవదారులను ముక్కచెక్కలు చేయును.
6. ఆయన లెబానోను కొండలను దూడలను వలె దూకించును. షిర్యోను కొండను కోడెదూడను వలె గంతులు వేయించును.
7. ప్రభువు స్వరము మిలమిల మెరయు నిప్పులను వెదజల్లును.
8. ఆయన స్వరము వలన ఎడారి తల్లడిల్లును,కాదేషు ఎడారి కంపించును.
9. ప్రభువు స్వరము సింధూరములను అల్ల ల్లాడించును. అడవిలోని మ్రాకులను మోడులు చేయును. కాని ఆయన మందిరమున ఎల్లరు ప్రభువునకు "మహిమ? అని నినాదము చేయుదురు.
10. ప్రభువు ప్రళయజలములమీద సింహాసనాసీనుడయ్యెను. ఆయన కలకాలము రాజుగా నుండి పరిపాలనము చేయును.
11. ఆయన తన ప్రజలకు బలమును దయచేయును. శాంతి సమాధానములతో వారిని దీవించును.