ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 25

1. ప్రభూ! నేను నీకు ప్రార్థన చేయుచున్నాను.
2. నా దేవా! నేను నిన్నే నమ్మితిని. నా విరోధులు నా పతనము చూచి సంతసింపకుండునట్లు చేయుము. వారి వలన నేను అవహేళనకు గురికాకుండునట్లు చేయుము.
3. నిన్ను నమ్మినవారు ఎన్నడును అవమానమునకు గురికాకుందురు గాక! నీ మీద తిరుగుబాటుచేయు దుర్మార్గులకే తలవంపులు వచ్చును గాక!
4. ప్రభూ! నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకెరిగింపుము.
5. నన్ను నీ సత్యము నందు నడిపింపుము. నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు భోధింపుము. ఎల్లవేళల నీ కొరకై వేచియుందును.
6. ప్రభూ! చిరకాలము నుండి నీవు నాపట్ల చూపుచువచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము.
7. యవ్వనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనకుము. నీ ప్రేమను బట్టియు నీ మంచి తనమును బట్టియు, నీవు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుము.
8. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును.
9. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును.
10. ప్రభువు నిబంధనలను, ఆజ్ఞలను పాటించువారికి ఆయన మార్గములు స్థిరమైనవి, నమ్మదగినవి.
11. ప్రభూ! నీ పేరునకు తగినట్లుగానా ఘోర పాపములను మన్నింపుము.
12. ప్రభునకు భయపడువారు, తాము నడువ వలసిన త్రోవను, ఆయన నుండియే తెలిసికొందురు.
13. వారు సదా శుభములు బడయుదురు . వారి సంతానము భూమిని స్వాధీనము చేసికొనును .
14. ప్రభువునకు భయపడువారు ఆయనకు సన్నిహితులగుదురు. ఆయన తన నిబంధనమును వారికి తెలియజేయును.
15. నేను ఎప్పుడు ప్రభువు సహాయము కొరకు కనిపెట్టుకొని యందును. నా పాదముల ను బంధముల నుండి విడిపించు వాడు అతడే.
16. ప్రభూ! నీ దృష్టిని నా మీదికి మరల్చి నన్ను కరుణింపుము. నేను ఏకాకిని, దరిద్రుడను.
17. నా విచారములెల్ల తొలగింపుము. నా బాధలనెల్ల తుదిముట్టింపుము.
18. నా దైన్యమును నా వెతలను పరిశీలింపుము.నా పాపములన్నింటిని క్షమింపుము.
19. నాకెంత మంది శత్రువులున్నారో చూడుము. వారికి నేననిన ఎంత ద్వేషమో చూడుము.
20. నీవు నన్ను కాపాడి సంరక్షింపుము. నేను నినాశ్రయించితిని కనుక, నా శత్రువుల వలన అవహేళనకు గురికాకుండునట్లు చేయుము.
21. నీ మంచితనము , ధర్మవర్తనమును నన్ను కాపాడునుగాక. నేను నీ కొరకై వేచియుంటిమి .
22. ప్రభూ! యిస్రాయేలును సకల విపత్తుల నుండి రక్షింపుము.