1. భూమియు దానిమీద నున్న సమస్త వస్తువులును ప్రభునివే. ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులెల్ల ఆయనకు చెందినవే.
2. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించెను. అంతః ప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను.
3. ప్రభు పర్వతమును ఎక్కుటకు ఆర్హుడైవడు? ఆయన పవిత్ర స్థలమున అడుగిడుటకు యోగ్యుడెవడు?
4. నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రముల ను ఆరాధింపని వాడు, వ్యర్థ క్రియలపై మనస్సు పెట్టని వాడు, అబద్ద ప్రమాణములు చేయనివాడు ఎవడో, అతడే యోగ్యుడు.
5. అతడు ప్రభువు నుండి దీవెనలు పొందును. అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును.
6. ప్రభువును వెదకుకొనుచు వచ్చెడివారు,యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చెడివారు, ఇట్టివారే.
7. మందిర ద్వారములారా! మీ తలలను పైకెత్తుకొనుడు. పురాతనములైన తలుపులారా! మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు.
8. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు?ఆయన మహాబలవంతుడు, మహావీరుడునైన ప్రభువు, యుద్ధ రంగమున యోధాను యోధుడైన ప్రభువు.
9. మందిర ద్వారములారా! మీ తలలను పైకెత్తుకొనుడు. పురాతనములైన తలుపులారా! మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు.
10. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఆయన సైన్యములకు అధిపతియైన ప్రభువు,మ హిమాన్వితుడైన ప్రభువు ఆయనే.