ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 22

1. నా దేవా! నా దేవా! నన్నేల చేయివిడిచితివి? నేను నీకు మొరపెట్టితిని గాని నీవు నన్నింకను ఆదుకోవైతివి.
2. ప్రభూ! నేను పగలెల్ల మొరపెట్టిన, నీవు ఆలింపవు. రేయెల్ల నీకు మనవి చేసిన, ఉపశాంతి లేదు.
3. నీవు పరమ పవిత్రుడవు. యిస్రాయేలీయుల స్తుతులనెడు సింహాసనము మీద ఆసీనుడవై ఉండు వాడవు.
4. మా పితరులు నిన్ను నమ్మిరి. నిన్ను నమ్మగా నీవు వారిని రక్షించితివి.
5. వారు నిన్ను శరణువేడి ఆపద నుండి తప్పించు కొనిరి. నిన్ను నమ్మి నిరాశ చెందరైరి.
6. నా మట్టుకు నేనిపుడు పురుగునుగాని నరుడను గాను. ఎల్లరును నన్ను చిన్నచూపు చూచి ఎగతాళి చేయుచున్నారు.
7. నావైపు చూచిన వారెల్ల నన్ను గేలి చేయుచున్నారు.నాలుక వెళ్లబెట్టి తల ఊపుచున్నారు.
8. "ఇతడు ప్రభువును నమ్మెను. ఆయన ఇతనిని రక్షించునేమో చూతము. ఇతడు ప్రభువునకు ఇష్టుడైనచో ఆయన ఇతనిని కాపాడునేమో చూతము" అని అనుచున్నారు.
9. తల్లి కడుపు నుండి నన్ను సురక్షితముగాబయటికి కొనివచ్చినది నీవే. నేను మాతృ స్తన్యము గ్రోలి భద్రముగా మనునట్లు చేసినది నీవే.
10. మాతృ గర్భము నుండి వెలువడినప్పటి నుండి నేను నీ మీదనే ఆధారపడితిని. నేను జన్మించినప్పటి నుండి నీవే నాకు దేవుడవు.
11. నేను ఆపదలలో వున్నాను. నీవు నాకు దూరముగా ఉండ వలదు. నీవు తప్ప నన్ను ఆదుకొను వాడెవ్వడును లేడు.
12. వృషభములు అనేకములు నన్ను చుట్టుముట్టినవి. బాషాను మండల బలిష్ట వృషభములు నా చుట్టు క్రమ్ముకొనినవి.
13. అవి సింహములవలె నోళ్లు తెరచి రంకెలు వేయుచున్నవి.
14. నా బలము నేల మీద పారబోసిన నీటివలె ఇంకి పోయినది. నా యెముకలన్ని పట్టు దప్పినవి. నా గుండె నాలోనే మైనమువలె కరిగిపోయినది.
15. నా శక్తి పెంకు వలె ఎండిపోయినది.నా నాలుక అంగిటికి అంటుకొనుచున్నది. నేను చచ్చి దుమ్ములో పడియుండునట్లు చేసితివి.
16. శునకములు నన్ను చుట్టుముట్టినవి. దుష్టబృందము నా చుట్టు క్రమ్ముకొనినది. వారు నా కాలుచేతులను చీల్చుచున్నారు.
17. నా ఎముకలన్నిటిని లెక్కపెట్టవచ్చును. శత్రువులు సంతసముతో నావైపు చూచుచున్నారు.
18. వారు నా బట్టలను తమలో తాము పంచు కొనుచున్నారు. నా దుస్తుల కొరకు చీట్లు వేసికొనుచున్నారు.
19. ప్రభూ! నీవు నాకు దూరముగా ఉండవలదు. నా బలము నీవు. నన్నాదుకొనుటకు శీఘ్రమే రమ్ము.
20. ఖడ్గము నుండి నన్ను కాపాడుము. శునకముల నుండి నా ప్రాణములను రక్షింపుము.
21. సింహము నోటి నుండి నన్ను తప్పింపుము. అడవి ఎద్దు కొమ్ముల నుండి నన్ను కాపాడుము.
22. నేను మా ప్రజలకు నీ మహిమను వెల్లడింతును. భక్త సమాజమున నిన్ను కీర్తింతును.
23. ప్రభువు భక్తులారా! మీరతనిని స్తుతింపుడు. యాకోబు వంశజులారా! మీరతనిని మ హిమ పరపుడు. యిశ్రాయేలు ప్రజలారా! మీరతనిని భజింపుడు.
24. అతడు దీనులను చిన్నచూపు చూడడు. వారి శ్రమలను అనాదరము చేయడు. వారి నుండి తన ముఖమును దాచు కొనడు. వారు తనకు మొర పెట్టినపుడు,వారి వేడుకోలును ఆలించును.
25. మహా భక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నీ భక్త బృందమెదుట నా మ్రొక్కు బడులు చెల్లింతును.
26.పేదలు తనివిదీర భుజింతురు. ప్రభువును అభిలషించువారు అతనిని నుతింతురు. ఆ జనులు ఎల్లవేళల శుభములు బడయుదురు గాక!
27. లోకములోని జాతులెల్ల ప్రభువును జ్ఞప్తికి తెచ్చుకొని, ఆయన యొద్దకు మరలి వచ్చెదరు. సకల జాతులును ఆయనను పూజించెదరు.
28. ప్రభువు రాజ్యము చేయును, జాతులనెల్ల పరిపాలించును.
29. గర్వాత్ములెల్లరు ఆయనకు దండము పెట్టుదురు. మృత్యువు వాతబడు నరమాత్రులెల్లరు.ఆయనకు తల ఒగ్గుదురు.
30. భావితరముల వారు ఆయనను సేవింతురు. ప్రజలు రాబోవు తరముల వారికి,ప్రభువును గూర్చి చెప్పుదురు.
31. ఇక పుట్టబోవు జనులకు ప్రభువు తన ప్రజలకు దయచేసిన రక్షణమును గూర్చి వివరింతురు.