ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 2

1. అన్యజాతులు తిరుగుబాటునకు పూనుకోనేల? జనులు నిరర్ధకముగా కుట్రలు పన్ననేల?
2. ప్రభువును, అతడు అభిషేకించిన రాజును ఎదిరించుటకుగాను ఈ లోకపు రాజులు సంసిద్దులగుచున్నారు. పాలకులందరు కలిసి దురాలోచనలు చేయుచున్నారు:
3. “మనము వారి బంధములను తెంపుదము. వారి పాశములను ఛేదింతము" అని చెప్పుకొను చున్నారు.
4. కాని స్వర్గమున సింహాసనాసీనుడైయున్న ప్రభువు వారి మాటలు విని నవ్వును, వారిని అపహాసము చేయును.
5. అతడు కోపముతో వారితో మాటలాడును. తీవ్ర ఆగ్రహముతో వారిని భయపెట్టుచు ఇట్లనును:
6. నా పవిత్ర పర్వతమైన సియోను మీద నేను నా రాజును సింహాసనాసీనుని చేసియుంటిని .
7. నేను ప్రభువు శాసనమును ఎరిగించెదను. ప్రభువు నాతో ఇట్లనెను: 'నీవు నా కుమారుడవు, నీవు నాకు జనించితివి.
8. నన్నడుగుము, నేను జాతులనెల్ల నీకు ధారాదత్తము చేసెదను. ఈ భూమండలము నెల్ల నీకు స్వాధీనము చేసెదను.
9. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టుదువు. మట్టికుండను వలె వారిని ముక్కచెక్కలు చేయుదువు.”
10. కనుక రాజులారా! మీరు జ్ఞానమును తెచ్చుకొనుడు. భూపతులారా! మీరు నా హెచ్చరికలు ఆలకింపుడు.
11. మీరు భయభక్తులతో ప్రభువును సేవింపుడు. గడగడలాడుచు అతని పాదములు ముద్దిడుకొనుడు.
12. లేదేని అతడు కోపించిన మీరు చత్తురు. అతడు శీఘ్రముగా ఆగ్రహించును. కావున, ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు.