ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 19

1. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. అంతరిక్షము ప్రభువు సృష్టిని వెల్లడి చేయుచున్నది.
2. ఒక పగలు మరియొక పగటికి ఈ సంగతిని బోధచేయుచున్నది. ఒక రేయి మరొక రేయికి జ్ఞానమును తెలియచేయుచున్నది.
3. ఆ రేయింబవళ్లకు భాషగాని, మాటలుగాని లేవు. వాని నుండి ఎట్టి ధ్వని విన్పింపదు.
4. ఐనను వాని స్వరము భూమియందు అంతట వ్యాపించినది. వాని సందేశము నేల అంచులవరకు విన్పించుచున్నది.
5. ప్రభువు ఆకసమున సూర్యునికి ఒక గుడారమును నిర్మించెను. సూర్యబింబము పెండ్లి పందిరి నుండి వరునివలె వెలువడును. క్రీడాకారునివలె సంతసముతో పరుగునకు పూనుకొనును.
6. అది ఆకాశమున ఈ అంచు నుండి బయలుదేరి ఆ అంచు వరకును పయనించును. దాని వేడిమి నేదియు తప్పించుకోజాలదు.
7. ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది. అది ఆత్మకు నూత్న జీవమును ఒసగును. ప్రభువు ఆజ్ఞలు నమ్మదగినవి. అవి తెలివి లేని వారికి జ్ఞానమును ఒసగును.
8. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి. అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు విధులు నిర్మలమైనవి. అవి మనస్సునకు వివేచనము ఒసగును. 
9. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము మనును. ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్ని ధర్మమైనవే.
10. అవి మేలిమి బంగారము కంటె ఎక్కువగా ఆశింపదగినవి. తేనెపట్టు నుండి చిప్పిలు తేనె కంటె తీయనైనవి.
11. అవి నీ దాసుడనైన నన్ను హెచ్చరించును. వానిని పాటించుటవలన నాకు గొప్ప బహుమతి లభించును.
12. తన తప్పులను తాను తెలిసికోగల వాడెవడు? నేను తెలియక చేసిన తప్పిదములనెల్ల తుడిచివేయుము.
13. నేను తెలిసి చేసిన తప్పిదములనుండియు, నీ దాసుడైన నన్ను కాపాడుము. నేను ఆ తప్పిదములకు లొంగి పోకుండునట్లు చేయుము. అప్పుడు నేను దోష రహితుడను అగుదును. ఘోరమైన పాపము నుండి తప్పుకొందును.
14. నాకు ఆశ్రయణీయుడవు, విమోచకుడవునైన ప్రభూ! నా పలుకులు, నా ఎదలోని తలంపులు,నీ మన్నన బడయును గాక!

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services