ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 18

1. ప్రభూ! నేను నిన్ను ప్రేమించుచున్నాను నాబలము నీవే.
2. ప్రభువు నాకు శైలము, కోట. నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను ఆయన మరుగుజొత్తును. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు,రక్షణ సాధనము, ఆశ్రయ స్థానము.
3. నేను ప్రభువునకు మొరపెట్టగా, ఆయన నన్ను శత్రువుల నుండి కాపాడెను. ఆయన స్తుతింపదగిన వాడు.
4. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను. అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను. 
5. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనెను.మృత్యుబంధములు నన్ను పెనవేసికోనెను .
6. నా ఆపదలో నేను ప్రభునకు మొరపెట్టితిని.నా దేవుని వేడుకొంటిని. ఆయన తన దేవాలయము నుండి నా వేడుకోలు ఆలించెను. నా మొర ఆయన చెవిని పడెను.
7. అపుడు ప్రభువు కోపోద్రిక్తుడుకాగా భూమి కంపించి దద్దరిల్లెను, పర్వతముల పునాదులు వణకెను.
8. ఆయన నాసికారంధ్రముల నుండి పొగలు ఎగసెను. ఆయన నుండి సర్వమును దహించు జ్వాలలును, గనగన మండు నిప్పు కణికలును బయల్వెడలెను.
9. ప్రభువు ఆకాశమును తెరవలె తొలగించి క్రిందికి దిగివచ్చెను. ఆయన పాదముల క్రింద కారుమబ్బులు క్రమ్మియుండెను.
10. ఆయన కేరూబు మీద స్వారిచేయుచు వచ్చెను. వాయువు రెక్కలమీద ఎక్కి శీఘ్రముగా విచ్చేసెను.
11. అంధకారమును తన చుట్టు ఆవరింప చేసికొనెను. దట్టమైన నల్లని మబ్బులను ఆయన గుడారముగా చేసికొనెను.
12. ఆయన ముందట మెరపులు మొరసెను. వాని నుండి వడగండ్లు, గన గన మండు నిప్పు కణికలు వెడలెను.
13. ప్రభువు ఆకాశము నుండి గర్జించెను. మహోన్నతుని ఘోషణము విన్పించెను.
14. ఆయన బాణములు రువ్వి శత్రువులను చిందర వందర చేసెను. మెరుపులు విసరి వారిని చీకాకు పరచెను.
15. ప్రభూ! నీవు శత్రువులను గద్దించగా,నీ నాసికారంధ్రముల నుండి ఉగ్రశ్వాసమును విడువగా, సముద్రగర్భము తేటతెల్లముగా కన్పించెను. జగత్తు పునాదులు స్పష్టముగా చూపట్టెను.
16. ప్రభువు ఆకాశము నుండి దిగివచ్చి తన చేతితో పట్టుకొనెను. అగాధ జలరాశిలో నుండి నన్ను బయటకి లాగెను.
17. బలాఢ్యులైన నా ప్రత్యర్దుల నుండియు,నన్ను ద్వేషించు విరోధుల నుండియు అతడు నన్ను కాపాడెను. వారు నా కంటెను బలవంతులు.
18. నాకు ఆపద వాటిల్లినపుడు శత్రువులు నా మీదికెత్తివచ్చిరి. కాని ప్రభువు నన్ను అదుకొనెను.
19. ఆయన నన్ను విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చెను. నేననిన ప్రభువునకు ఇష్టము కనుక,నన్ను కాపాడెను.
20. నేను ధర్మమును పాటించితిని కనుక,ప్రభువు నన్ను సన్మానించెను. నేను నిర్దోషిని కనుక, నన్ను బహూకరించెను.
21. నేను ప్రభువు ఆజ్ఞలకు విధేయుడనైతిని. ఆయన నుండి వైదొలగనైతిని.
22. నేను ఆయన విధులనెల్ల పాటించితిని. ఆయన ఆజ్ఞలను ఏమాత్రము మీరనైతిని.
23. ఆయన నన్ను దోషరహితునిగా ఎంచెను. నేను కిల్బిషమునకు దూరముగా ఉంటిని.
24. నేను ధర్మవర్తనుడను గనుక ప్రభువు నన్ను సత్కరించెను. నా విశుద్ధవర్తనమునకు తగినట్లుగా నాకు ప్రతిఫలమొసగెను.
25. ప్రభూ! నీవు నీతిమంతులపట్ల నీతిమంతుడవుగా, ఉత్తముల ఎడల ఉత్తముడవుగా మెలగుదువు.
26. విశుద్దులపట్ల విశుద్దుడవుగా, కపటాత్ముల యెడల కపటముగ వర్తింతువు.
27. నీవు వినయాత్మలను రక్షింతువు.పొగరు బోతులను మన్నుగరపింతువు.
28. ప్రభూ! నీవు దీపమును వెలిగింతువు. నా త్రోవలోని చీకటిని తొలగింతువు.
29. నీ బలముతో నేను శత్రుసేనలను జయించి, వారి దుర్గములను స్వాధీనము చేసికొందును.
30. ఈ దేవుని మార్గములు పరిపూర్ణమైనవి, ప్రభుని వాగ్దానములు నమ్మదగినవి. తనను ఆశ్రయించిన వారిని ఆయన డాలు వలె కాపాడును.
31. ప్రభువు తప్ప దేవుడెవరు? ఆయన తప్ప మనలను కాపాడు వాడెవరు?
32. నాకు బలము దయచేయు దేవుడాయనే. నా మార్గమును సురక్షితము చేయువాడాయనే.
33. ఆయన నా పాదములను జింక పాదముల వలె దృఢము చేసెను. నేను జారిపడకుండ కొండ కొమ్మున నిల్చునట్లు చేసెను.
34. ఆయన నాకు యుద్ధము చేయుటకు తర్ఫీదు నిచ్చెను. కనుక నేను బలిష్టమైన ధనస్సును ఉపయోగింప గల్గితిని.
35. నీవు నాకు నీ రక్షణ డాలు నందించితివి.నీ కుడిచేయి నన్ను ఆదుకొనెను. నీ కరుణ వలన నేను గొప్పవాడనైతిని.
36. నీవు నేను ఇరుకాటమున చిక్కకుండునట్లు చేసితివి. కావున నేను కూలిపోనైతిని.
37. నేను నా శత్రువులను వెనాడి పట్టుకొంటిని. వారిని నాశము చేసినదాక పోరు నుండి వెనుదిరుగనైతిని.
38. నేను వారిని పడగొట్టగా వారు పైకి లేవజాలరైరి. వారు ఓడిపోయి నా పాదముల చెంత్ర పదిరి.
39. రణమున పోరాడుటకు నీవు నాకు శక్తిని ఒసగితివి. నా శత్రువులు నాకు లొంగిపోవునట్లు చేసితివి.
40. నా విరోధులు నా యెదుటి నుండి పారిపోవునట్లు చేసితివి. నన్ను ద్వేషించు వారిని, నేను హతమార్చునట్లు చేసితివి.
41. శత్రువులు మొరపెట్టిరిగాని వారిని రక్షించు వాడెవడు లేడయ్యెను. వారు ప్రభువునకు మనవి చేసిరిగాని ఆయన వారికి ప్రత్యుత్తరము ఈయలేదు.
42. నేను వారిని గాలికెగిరిపోవు ధూళివలె పొడిపొడి చేసితిని. వీధులలోని బురద వలె నలుగదొక్కితిని.
43. నా మీద తిరుగుబాటు చేసిన వారి నుండి నీవు నన్ను కాపాడితివి. అన్యజాతులకు నన్ను అధిపతిని గావించితివి. నేనెన్నడును ఎరుగని జనులు నాకిపుడు దాసులైరి.
44. వారు నా పేరు వినగనే నాకు విధేయులగుచున్నారు. అన్యజాతి ప్రజలు నాకు లొంగి దండము పెట్టుచున్నారు.
45. వారు ధైర్యము కోల్పోయి గడగడ వణకుచు,తమ కోటల నుండి కదలి వచ్చుచున్నారు.
46. ప్రభువునకు దీర్గాయువు, నా రక్షకునకు నమస్కృతులు. నన్ను కాపాడిన దేవునికి మహాస్తుతులు .
47. ఆయన వలన నేను నా విరోధులను జయించితిని. అన్యజాతులు నాకు లొంగిపోయిరి.
48. నా శత్రువుల నుండి నన్ను విడిపించిన దెవరు? ఆయన నా మీదికి లేచువారి కంటె ఎక్కువగా నన్ను లేవనెత్తును. హింసాత్ముల చెర నుండి నన్ను విడిపించును.
49. కనుక ప్రభూ! అన్యజాతుల నడుమ నేను నిన్ను కొనియాడెదను. నీ దివ్యనామమును స్తుతించి కీర్తించెదను.
50. ప్రభువు తన రాజునకు మహావిజయములుదయచేయును. అతడు తాను ఎన్నుకొనిన దావీదునకు, అతని సంతతికి కలకాలము కరుణ చూపును.