1. ప్రభూ! నీతియుక్తమైన నా మొరను ఆలకింపుము. నీ సహాయము అర్థించుచు, నేను చేయు వేడుకోలును వినుము. నా యందు కపటములేదు కనుక నా ప్రార్ధనమును అంగీకరింపుము.
2. నీ నుండి నాకు న్యాయము జరుగును గాక! నీ నేత్రములు ధర్మమును గాంచును గాక !
3. నీవు నా హృదయమును పరిశీలించినా, రాత్రి వేళ నన్ను దర్శించినా, నీవు నన్ను పరీక్షించినా, నాయందు నీకెట్టి దురాలోచన కన్పింపదు.నా నోరు అపరాధము పలుకదు.
4. నేనితరుల వలె చెడ్డ మాటలు పలుకలేదు. నేను నీ ఆజ్ఞలను పాటించితిని. పరహింసకు పాల్పడనైతిని.
5. నేనెల్లప్పుడు నీ మార్గముననే నడచితిని,నీ త్రోవ నుండి బెతెడైన తొలగనైతిని.
6. నీవు నా మొర విందువు కనుకనేను నీకు విన్నపము చేయుచున్నాను.నీవు చెవియొగ్గి నా పలుకులాలింపుము.
7. నీ అద్భుతమైన కరుణను నాకు చూపింపుము. నీ శరణు జొచ్చిన వారిని నీవు రక్షింతువు. నీ రక్షణమును బడసి మేము శత్రువుల నుండి తప్పించుకొందుము.
8–9. నన్ను నీ కంటిపాపవలె కాపాడుము. నా విరోధులు పట్టరాని ద్వేషముతో నన్ను చుట్టుముట్టుచున్నారు. దుష్టుల చేతికి చిక్కకుండునట్లు నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము.
10. వారికి దయ లేశమైన లేదు.వారు గర్వముతో ప్రగల్భములు పలుకుచున్నారు.
11. నేనెటు వెళ్లినను వారు నా మీదికి వచ్చుచున్నారు. నన్ను కూలద్రోయవలెననియే వారి కోరిక
12. వారు సింహమువలె నన్ను ముక్కముక్కలుగా చీల్చివేయ కోరుచున్నారు. సింగపు కొదమవలె నా మీదికి దుముకుటకు మరుగున పొంచియున్నారు.
13. ప్రభూ! లెమ్ము ! నా శత్రువుల నెదిరించి వారిని జయింపుము. నీ ఖడ్గముతో దుర్మార్గుల నుండి నన్ను కాపాడుము.
14. నీ శక్తితో నన్ను ఈ దుష్టుల నుండి రక్షింపుము. వారు ఇహలోక జీవితముతోనే తృప్తినొందువారు. నీ సంపదలను వారికి సమృద్దిగా దయచేయుము. వారి పుత్రులకు, పౌత్రులకు కూడ వానిని దక్కనీయము.
15. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నేను మేల్కొనినపుడు నీ దివ్యరూపమును గాంచి సంతృప్తి చెందుదును.