1. నేను ప్రభువు శరణుజొచ్చి యున్నాను. "నీవు పక్షివలె కొండలకు పారిపొమ్మని,మీరు నాతో చెప్పుటెందుకు?
2. దుష్టులు విల్లువంచి, బాణములు ఎక్కుపెట్టి, దొంగచాటుగా సజ్జనులపై సంధించుటకై సిద్ధముగా ఉన్నారు.
3. పునాదులే కూలిపోవునపుడు సజ్జనులు ఏమి చేయగలరు? అని మీరు నాతో నుడువనేల?
4. ప్రభువు తన పవిత్ర మందిరమున ఉన్నాడు. ఆయన సింహాసనము అకాశమున ఉన్నది. ఆయన భూలోకము మీదికి దృష్టి ప్రసరించి యున్నాడు. ఆయన కళ్లు నరులను అందరిని పరీశీలించి చూచును.
5. ప్రభువు మంచి వారిని, చెడ్డ వారిని కూడ పరీక్షించి చూచును. హింసకు ఒడిగట్టు వారిని అతడు అసహ్యించుకొనును.
6. అతడు దుష్టుల మీద నిప్పు కణికలు, అగ్ని గంధకము కురిపించును. వేడిగాడ్పులతో వారిని శిక్షించును.
7. ప్రభువు నీతిమంతుడు, నీతిని కాంక్షించువాడు. నీతిమంతులు అతని దివ్యముఖమును దర్శింతురు.