1. అటుతరువాత యోబు మాట్లాడుచు ఇట్లనెను:
2. “నీవు చెప్పినది నిజమే. నరుడు దేవునితో వాదించి నెగ్గగలడా?
3. ఎవరైన దేవునితో వాదమునకు దిగినయెడల ఆయన వేయి ప్రశ్నలడుగును వానిలో ఒక్కదానికి మనము జవాబు చెప్పలేము.
4. ఆయన విజ్ఞాననిధి, శక్తి సంపన్నుడు, ఆయనను ఎవరు ఎదిరింపగలరు?
5. అతడు కొండలకు చెప్పకుండనే వానిని కదలించును. కోపముతో వానిని క్రింద పడద్రోయును.
6. భూకంపములను పంపి నేలను కదలించును. భూమిని భరించు స్తంభములను గడగడ వణకించును.
7. ఆయన ఆజ్ఞాపించి సూర్యోదయమును నిరోధింపగలడు. చుక్కలను ప్రకాశింపనీయకుండ అడ్డుపడగలడు.
8. ఆయనే ఆకాశమును దుప్పటివలె విప్పును. అలలను అణగదొక్కి సముద్రమును అదుపులో పెట్టుకొనును.
9. ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని, దక్షిణ నక్షత్రరాసులను చేసినవాడు. "
10. ఆయన లెక్కలకందని మహాకార్యములు చేయును గణింపశక్యముకాని అద్భుతకార్యములు సల్పును
11. ఆయన నా ప్రక్కగా వెడలిపోయిన, నేను ఆయనను గుర్తింపలేను. ఆయన గమనమును కనిపెట్టజాలను.
12. ఆయన తాను తీసికోదలచినది తీసికొనును. నీవు చేయుచున్నదేమిటి?' అని ఎవరును ఆయనను అడ్డగింపజాలరు.
13. ఆయన కోపమునకు తిరుగులేదు. ఆయన తన శత్రువులనెల్ల నేలబెట్టి కాలరాచును.
14. అట్టి ప్రభువుతో నేను వాదింపగలనా? ఆయనకు బదులు చెప్పుటకు నాకు మాటలు దొరకునా?
15. నేను నిర్దోషినైనను, నన్ను నేను సమర్ధించుకోగలనా? న్యాయాధిపతియైన దేవుని కరుణింపుమని వేడుటకన్న నేను చేయగలిగినది ఏమున్నది?
16. ఆయన నన్ను మాటలాడనిచ్చినను నా పలుకులు ఆలించునా?
17. ఆయన నాకు కష్టములను పంపి నిష్కారణముగా నన్ను బాధించుచున్నాడు.
18. గ్రుక్కకూడ త్రిప్పుకోనీయకుండ నన్ను కడగండ్లపాలు చేయుచున్నాడు.
19. దేవునిమీద నా బలమును చూపెద ననుకొన్నచో ఆయన మహాశక్తిమంతుడు. ఆయన మీద వ్యాజ్యెమాడెదనన్న ఆయన నెవరు పిలుచుకొనివత్తురు?
20. నేను నిర్దోషినైనను నా నోరు నన్ను ఖండించును. నాయందు తప్పులేకున్నను ఆయన వాక్కు నన్ను దోషినిచేయును.
21. నేనసలు నిర్దోషినేనా? నాకే తెలియరాకున్నది. ఈ జీవితము నాకు దుర్బరముగా నున్నది.
22. అంతయు ఒకటే కావున దోషిని, నిర్దోషినిగూడ ఆయన సమముగనే నాశనము చేయునని నేనంటిని,
23. నిర్దోషి తలవని తలంపుగా నాశనముకాగా దేవుడు నవ్వి ఊరకుండును.
24. ఆయన దేశమును క్రూరుడైన పాలకుని వశము కావించి అందలి న్యాయాధిపతుల ముఖములను కప్పివేయును. అతడు కాకున్న ఈ కార్యమును మరి ఎవరు చేయుదురు?
25. నా దినములు మహావేగముగా పరుగిడుచున్నవి. వానివల్ల ప్రయోజనమేమియు లేదు.
26. జమ్ముతో చేసిన నావవలె వేగముగా వెడలిపోవును పక్షి మీదికి దుముకు డేగవలె త్వరగా పరుగిడుచున్నవి.
27. 'నేను నా విచారమును మరచిపోయి నగుమోమును చూపెట్టాలనుకొన్నచో
28. నా బాధలన్ని తిరిగి వచ్చుచున్నవి. దేవుడు నన్ను దోషినిగా గణించుచున్నాడు.
29. నేను దోషినైనచో ఇక ఈ వ్యర్థప్రయాసలన్ని ఎందులకు?
30. నేను మంచుతో శుద్ధిచేసికొనినను, నా చేతులను సబ్బుతో తెల్లగా కడుగుకొనినను లాభములేదు.
31. దేవుడు నన్ను మురికిగుంటలో పడద్రోసెను. నా బట్టలు నన్ను చూచి సిగ్గుపడుచున్నవి.
32. ఆయన నావలె నరుడుకాడు గనుక నేను ఆయనతో వాదింపజాలను. ఆయనతో వ్యాజ్యెమాడజాలను.
33. ఆయనకూ నాకు రాజీ కుదుర్చు మధ్యవర్తి ఎవడును లేడు కనుక
34. ఆయన తన దండమును నానుండి తీసివేయవలయును. నేను భయపడకుండ ఆయనమహాత్మ్యములు నాకు అగుపించవలెను.
35. అయినను నేను వెరవక మాటలాడెదను. ఏలయనగా నేను అట్టివాడను కానని అనుకొనుచున్నాను.