ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 8

 1. అటుతరువాత షూహా నగరవాసి బిల్థదు మాటలాడుచు ఇట్లనెను:

2. "అయ్యా! నీ మాటలకు అంతములేదా? నీ నోటి పలుకులు సుడిగాలివలె ఉన్నవి.

3. దేవుడు న్యాయమును చెరచునా? ఆయన ధర్మమును మంటగలుపునా?

4. నీ కుమారులు దేవునికి ద్రోహము చేసియుందురేని ఆయన వారిని తగిన రీతిగనే శిక్షించెను.

5-6. నీవిపుడు దేవునికి మొర పెట్టుకొనుము. నీవు నిజముగా భక్తుడవేని ప్రభువు నీకు తప్పక తోడ్పడును. నీ కుటుంబమును కాపాడును.

7. నీవు కోల్పోయిన దానికంటె అదనముగనే సిరిసంపదలు ఆయన దయచేయును.

8. నీవు పూర్వయుగముల వారిని ప్రశ్నించి చూడుము. మన పూర్వుల విజ్ఞానమును పరిశీలించి చూడుము

9. నిన్న మొన్నటి వారలమైన మనకేమి తెలియును? మన జీవితము నీడవలె సాగిపోవునది.

10. కాని ఆ పూర్వులను అడిగినచో వారు నీకు బోధచేయుదురు. వారు నీతో చెప్పు సంగతులివి.

11. జమ్ము బురదలోతప్ప వేరు తావున పెరుగునా? నీరులేని తావున తుంగలు ఎదుగునా?

12. నీరెండిపోగానే ఆ గడ్డిమొక్కలు వాడిపోవును. ఇతర గడ్డిమొక్కలకంటె వేగముగనే మాడిపోవును

13. దేవుని విస్మరించువాడును ఇట్లేయగును. ఆయనను నమ్మనివాడు సర్వనాశనమగును.

14. వాని నమ్మకము నూలుపోగువలె సన్నమైనది, సాలీడు గూడువలె పేలవమైనది.

15. అతడు తన ఇంటికి ఆనుకొనినచో అది నిలువదు. దానిమీదికి ఒరిగినచో అది కూలిపోవును.

16. అతడు సూర్యకిరణములకు చెట్టువలె ఎదిగి తోట అంతట కొమ్మలు చాచును.

17. ఆ చెట్టు వ్రేళ్ళు రాళ్ళలోనికి ప్రాకి శిలలను పెనవేసికొనును.

18. కాని ఆ చెట్టును అచటినుండి పెరికివేసినచో దాని పూర్వస్థానము ఎవరికిని గుర్తుండదు.

19. ఇదే అతని సంతోషకర జీవనవిధానము ఆ భూమినుండి వేరొకరు వచ్చెదరు.

20. ప్రభువు సన్మార్గులను చేయివిడువడు. దుర్మార్గులను ఆదరింపడు.

21. ప్రభువు నీవు మరల సంతసముతో నవ్వునట్లు చేయును. నీవు ఆనందముతో ప్రేలునట్లు చేయును.

22. కాని అతడు నీ శత్రువులను అవమానమున ముంచును. వారి నివాసములను సర్వనాశనము చేయును.”