ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 7

 1. మానవజీవితము యుద్ధమున నిర్బంధపోరాటము వంటిదికాదా? కూలివాడు కూలికి పనిచేయుట వంటిదికాదా?

2. బానిస నీడకొరకు తపించుచు శ్రమచేయుట వంటిది. పనివాడు జీతముకొరకు కాయకష్టము చేయుట వంటిది.

3. ఎట్టి ఆశయు లేకయే నేను నెలలు గడపితిని. విచారముతో రాత్రులు వెళ్ళబుచ్చితిని.

4. నేను పరుండినపుడు 'పగలెప్పుడు వచ్చునా' అనుకొందును. తిరిగి 'ఎప్పుడు లేచెదనా' అనుకొందును. వేకువదాక నిద్దురపట్టక బాధపడుదును.

5. నా ఒడలి నిండ పుండ్లు లేచి పురుగులు పడినవి. నా చర్మము పగిలి రసికారుచున్నది.

6. నా రోజులు నేతగాని నాడెకంటె వేగముగా పరుగిడుచున్నవి. అవి నాకెట్టి ఆశ మిగుల్పకుండనే వెడలిపోవుచున్నవి.

7. ప్రభూ! నా జీవితము శ్వాసవలె క్షణికమైనది. నా కన్ను ఇక మేలును చూడదు.

8. పూర్వము నన్నెరిగినవారికి నేనిక కన్పింపబోను. నీవు నన్ను చూచుచుండగనే మరుగైపోయెదను.

9. మబ్బు కరిగి మాయమైపోవును. అట్లే పాతాళమునకు పోవువాడు మరల పైకి రాజాలడు.

10. అతడు తన ఇంటికి తిరిగిరాడు. ఇక అతడినెవరు జ్ఞప్తియందుంచుకొనరు.

11. ఇట్టి పరిస్థితులలో నేను మౌనముగా ఉండజాలను నా బాధలలో నేను మాటలాడక తప్పదు. నా మనోవేదనలో నేను మొరపెట్టెదను.

12. ప్రభూ! నన్ను నిరంతరము నీ అదుపులో ఉంచుకొనుటకు నేనేమి సముద్రమును అనుకొంటివా లేక సముద్రములోని మహాసర్పమనుకొంటివా?

13. 'నేను పడకపై పరుండి విశ్రాంతి పొందగోరెదను. నా బాధలనుండి ఉపశాంతి చెందగోరెదను'.

14. కాని నీ స్వప్నములతో నీవు నన్ను భయపెట్టుచున్నావు. నీ దర్శనములతో నన్ను కలవరపెట్టుచున్నావు.

15. ఈ వేదనలు అనుభవించుటకంటె నేను చచ్చుట మేలు. ఎముకల గూడునైన నేను మరణమును ఆశించుచున్నాను.

16. నాకు నిరాశకలిగినది, ఇక జీవించి లాభములేదు నీవిక నా జోలికి రాకుము, నా జీవితము నిరర్ధకమైనది.

17. నీవు ఇంతగా పట్టించుకొనుటకు, ఇంతగా పరిశీలించి చూచుటకు, నరుడు ఏ పాటివాడు? అతని బండారమెంత?

18. నీవు ప్రతిదినము అతనిని పరీక్షించి చూడవలయునా? ప్రతిక్షణము అతనిని పరిశీలించి చూడవలయునా?

19. నీ నేత్రములను నానుండి ప్రక్కకు త్రిప్పవా? కనీసము గుటక వేయునంత కాలమైన నన్ను విడిచిపెట్టవా?

20. నీవేమో అహోరాత్రులు నరులను గమనించుచున్నావుగాని, నేను తప్పుచేసినను నా పాపము నిన్నెట్లు బాధించినదో చెప్పుము. నీవు నన్ను నీ కోపమునకు గురిచేయవలయునా? నేను నీకు అంత భారమైతినా?

21. నీవు నా పాపమును సహింపలేవా? నా దోషమును మన్నింపలేవా? నేను శీఘ్రమే మట్టిలో కలిసిపోయెదను. నీవు నన్ను వెదకుదువుగాని నేను నీ కంటబడను”

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services