ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 6

 1. తరువాత యోబు మాటలాడుచు ఇట్లనెను:

2. “నా బాధలను తూచగలమేని, నా వ్యధలను తక్కెడలో పెట్టి తూయగలుగుదుమేని,

3. అవి సముద్రపు ఇసుక దిబ్బలకంటె ఎక్కువ బరువుగా ఉండును. కనుకనే నేను దుడుకుగా మాట్లాడితిని.

4. ప్రభువు అంబులు నా దేహములో గ్రుచ్చుకొనినవి. నా హృదయమువాని విషముతో నిండిపోయినది ప్రభువు పంపు యాతనలు నా మీదికి బారులుతీరి వచ్చుచున్నవి.

5. పచ్చిక దొరకిన గాడిద ఓండ్రపెట్టునా? ఎండుగడ్డి దొరకిన ఎద్దు రంకెవేయునా?

6. ఉప్పులేని చప్పిడి భోజనము ఎవరికి రుచించును? కోడిగుడ్డులోని తెలుపులో రుచిగలదా?

7. నేను ముట్టుకొనని వస్తువులు నాకు హేయములు అయినను, అవియే నాకు భోజనపదార్ధములు అయినవి.

8. ప్రభువు నా మొర ఆలకించి నా వేడుకోలును అనుగ్రహించును గాక!

9. ప్రభువు తన చిత్తమువచ్చినట్లు నన్ను ఛిద్రము చేయునుగాక! అతడు నన్ను నాశనము చేసిన ఎంత మేలగును!

10. అట్లయిన నేనెంతయో సంతసించియుందును. నా బాధ ఎంత గొప్పదయినను ఉపశాంతి పొంది ఉందును. నేను పవిత్రుడైన ప్రభువు శాసనములను మీరలేదు

11. నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట ఏల? నా అంతము ఏపాటిది? నేను తట్టుకొనుట ఏల?

12. నేనేమి శిలనా? నాది ఇత్తడి దేహమా ఏమి?

13. ఇక నాలో ఏమి శక్తి మిగిలియున్నది! ఇక నాకేమి దిక్కు కలదు?

14. నిరాశవలన దేవుని నమ్మలేనివారికి స్నేహితుల అండదండలు ఎంతయో ఆవశ్యకముకదా?

15. నా సోదరమిత్రులు ఎండినవాగువలె, పారీపారని జలప్రవాహములవలె నమ్మకూడని వారైరి.

16. అట్టి ప్రవాహములు కరిగిపోయిన మంచుగడ్డలతో హిమముతో అంచులవరకు పొంగిపారును.

17. కాని బెట్టవేడిమివలన ఆ యేరులు ఎండిపోవును వానిలోని నీరెల్ల యింకిపోవును.

18. బిడారులు ఎడారిలో ఆయేరులకొరకు గాలింతురు వాని కొరకు చాలదూరమువరకు పోయి నాశనమగుదురు.

19. తేమా, షేబా బిడారులు ఆ యేరుల కొరకు ఆశతో గాలింతురు.

20. కాని ఆ ఎండిపోయిన యేరులను చేరుకొనగానే వారి ఆశలెల్ల నిరాశలగును.

21. మీరును నాపట్ల ఆ యేరులవంటివారలు అయితిరి మీరు నన్ను గాంచి భయముతో వెనుదీయుచున్నారు.

22. 'నేను మిమ్ము ఏమైనా ఈయుడు' అని అడిగితినా? నా నిమిత్తము 'మీ కలిమినుండి లంచమును ఈయుడు' అంటినా?

23. శత్రువు బారినుండి నన్ను రక్షింపుడని అంటినా? హింసకుని బానిసత్వమునుండి నన్ను విడిపింపుమంటినా?

24. మీరు నాకు బోధచేయుడు, నేను మౌనముగా విందును. నా దోషము ఎట్టిదో మీరే నిరూపింపుడు.

25. యథార్థము చెప్పిన సహింపవచ్చును. కాని మీ వాదముతో మీరు నన్ను ఇట్లు నిందింపనేల?

26. నిరుత్సాహముతోనున్న నా మాటలు పొల్లువలె ఎగిరిపోవు తేలికమాటలు కనుక వానిని చులకన చేయవచ్చునని మీ భావమా?

27. మీరు అనాధ శిశువులను బానిసలుగా కొన చీట్లువేసెదరు. మీ మిత్రులవలన లాభము బడయజూతురు.

28. మీరు నా మొగములోనికి చూచి మాటలాడుడు. నేను కల్లలాడువాడను కాను.

29. ఆగుడు! న్యాయముగా నన్ను విచారింపుడు నాయెడ తప్పిదములేదు. కనుక నేను దోషినని తీర్పుచెప్పకుడు.

30. నేను అబద్దములాడితినని మీరు అనుకొంటిరా? మంచిచెడ్డలకుగల వ్యత్యాసము నాకు తెలియదనుకొంటిరా?