1. నీ వేడుకోలును ఆలకించువారు ఎవరైన ఉన్నచో మొర పెట్టుకొనుము. ఏ దేవదూతయైన నీ గోడును ఆలకించునేమో చూడుము.
2. కోపము వలన బుద్దిహీనుడు నశించును. అసూయ వలన తెలివితక్కువవాడు చెడును.
3. బుద్దిహీనులు మొదట సురక్షితముగా ఉన్నట్లే కన్పించిరి. అంతలోనే నేను వారి ఇండ్లను శపింతును.
4. ఒక్క దెబ్బతో వారి తనయులు నిరాశ్రయులైరి. ఇక వారికి ఆదరువు చేకూర్చువారు ఎవరునులేరైరి
5. ఆ మందమతుల పంట ఆకలిగొనినవారి పాలయ్యెను దేవుడు వారిని ఆ పంటను అనుభవింపనీయడయ్యెను. దప్పికగొనినవారు వారి సంపదను ఆశించిరి.
6. వ్యధలు మట్టిలో నుండి పుట్టుకరావు. తిప్పలు నేలలోనుండి మొలకెత్తవు.
7. నిప్పురవ్వ ఆకాశమునకు ఎగిసినంత సులువుగా నరుడు తన తిప్పలను తానే కొనితెచ్చుకొనును.
8. నాకు నేను దేవుని వెదకి, నా గోడును అతడికి విన్పించుకొందును.
9. ఆయన మనము గ్రహింపలేని మహాకార్యములు చేయును. ఆయన అద్భుతకార్యములకు అంతమే లేదు.
10. ఆయన భూమిమీద వానలు కురియించును. పొలముల మీద నీళ్ళు కుమ్మరించును.
11. దీనులను ఆసనముల మీదికి ఎక్కించును. దుఃఖితులకు ఆనందమును ఒసగును.
12. మోసగాండ్ర పన్నాగములు వమ్ముచేయును. వారి కుతంత్రములను రూపుమాపును.
13. లౌకికులు వారి వలలలో వారే చిక్కుకొనునట్లు చేయును. వంచకుల కార్యములు విఫలమగునట్లు చేయును
14. వారికి మధ్యాహ్నముకూడ రాత్రివలె చూపట్టును వారు పట్టపగలుకూడ , దారి తెలియక తడుములాడుదురు.
15. ఆయన పేదలను మృత్యువు బారినుండి కాపాడును. దరిద్రులను పరపీడనమునుండి రక్షించును.
16. దీనుల ఆశలను చిగురింపజేయును. దుర్మార్గుల నోళ్ళు మూయించును.
17. దేవుడు శిక్షించి చక్కదిద్దిన నరుడు ధన్యుడు. కనుక నీవు ప్రభువు శిక్షకు కోపింపవలదు.
18. దేవుడు గాయపరచువాడు, కట్టుగట్టువాడుకూడ దెబ్బలు కొట్టువాడు, చికిత్స చేయువాడుకూడ.
19. ఆయన ఆరున్నొక్క కష్టములలో నిన్ను కాపాడును. కనుక పదిన్నొక్క కష్టములలో నీ కెట్టి కీడు వాటిల్లదు.
20. కరువుకాలములో ఆయన నిన్ను చావునుండి కాపాడును. యుద్ధకాలములో ఖడ్గమునుండి తప్పించును.
21. ఆయన కొండెములు చెప్పువానినుండి నిన్ను రక్షించును. దుర్మార్గుల దుండగములనుండి నిన్ను బ్రోచును,
22. దౌర్జన్యము, ఆకలియు నిన్ను బాధింపజాలవు. వన్యమృగములు నిన్ను భయపెట్టజాలవు.
23. నీవు పొలములోని రాళ్ళతో సఖ్యముగా ఉందువు క్రూరమృగములు నీతో చెలిమిచేయును.
24. నీ గుడారము క్షేమముగా ఉన్నదని తెలుసుకొందువు నీ మందను పర్యవేక్షించి ఏదీకూడా పోగొట్టుకోలేదని తెలుసుకొందువు.
25. నీ సంతానము తామరతంపరగా వృద్ధి చెందును నీ బిడ్డలు పొలములోని పచ్చికవలె వర్దిల్లుదురు
26. పంటకారువరకు పండి నిలిచిన గోధుమ పైరువలె నీవు పండువంటి నిండు జీవితము గడపుదువు.
27. అయ్యా! మేమీ సంగతులనెల్ల పరిశీలించి తెలిసికొంటిమి. ఇవి సత్యములు గావున నీవు వీనిని గ్రహించుట మంచిది."