ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 41

1. మొసలిని నీవు గాలముతో పట్టగలవా? దాని నాలుకను త్రాటితో కట్టగలవా?
2. దాని ముక్కురంధ్రములలో త్రాటిని దూర్చగలవా? దాని దౌడలకు కొక్కెము వేయగలవా?
3. మకరము తన్ను విడిపింపుమని నిన్ను బతిమాలునా? తనమీద దయచూపుమని నిన్ను వేడుకొనునా?
4. అది నీతో ఒప్పందము చేసికొని, జీవితాంతము నీకు సేవచేయుటకు అంగీకరించునా?
5. దానిని నీవు పెంపుడు పక్షినివలె బంధింపగలవా? నీ పనికత్తెలు దానితో ఆటలాడుకోగలరా?
6. బెస్తలు దానిని బేరమాడికొందురా? వ్యాపారులు దానిని ముక్కలు ముక్కలుగా కోసి అమ్ముదురా?
7. నీవు దాని చర్మమును ఈటెతో గ్రుచ్చగలవా? దాని తలను శూలముతో పొడువగలవా?
8. నీవు ఒకసారి దానిని చేతితో తాకితివా, మరల దానిమీద వ్రేలుపెట్టవు. అది నీతో సలుపు పోరును ఏనాటికిని మరువవు. \
9. మకరమును కంటితో చూచినవాడు గుండెలవిసి నేలకొరగును.
10. దానిని రెచ్చగొట్టితిమా అది ఉగ్రస్వరూపము తాల్చును. దానిని ఎదిరించుటకెవడు సాహసింపడు.
11. దానితో పోరుకు తలపడి ప్రాణములు దక్కించుకొనువాడు ఈ విశాల ప్రపంచమున ఒక్కడును లేడు.
12. మకరము అవయవములను వర్ణింతును. అనన్యమైన దాని బలమును నీకు విశదము చేయుదును. 
13. దాని చర్మమును చీల్చువాడెవడును లేడు. దాని కవచమును తూట్లు పొడువగలవాడు ఎవడును లేడు.
14. మకరము ముఖద్వారమును తెరవగల వాడెవడు? దాని దంతాల వరుసలో భయము నాట్యమాడుచుండును.
15. దాని వీపు ఒకదానితో నొకటి పేర్చిన డాళ్ళవరుసలవలెనుండి పాషాణమన్నట్లు గట్టిగా నుండును.
16. ఆ వరుసలు ఒకదాని కొకటి దగ్గరగా అతుకుకొని ఉండును. వాని మధ్య గాలి కూడ దూరజాలదు.
17. ఆ వరుసలు ఒకదానితో నొకటి కలిసి ఉండును. వానిని విడదీయను ఎవరితరము కాదు.
18. అది తుమ్మినపుడు ప్రకాశము వెలువడును దాని నేత్రములు ఉదయభానునివలె తేజరిల్లును
19. దాని నోటి నుండి జ్వాలలు వెలువడును. అగ్నికణములు పైకెగయును.
20. నిప్పుల మీద కాగు డేగిస నుండి వలె దాని ముక్కురంధ్రములనుండి పొగలు వెలువడును
21. దాని ఉచ్చ్వాసములు అగ్నినెగజిమ్మును. దాని నోటినుండి మంటలు బయల్వెడలును.
22. మొసలి మెడ మహాబలముగా ఉండును. దాని గమనమును చూచిన వారెల్ల భయభ్రాంతులగుదురు.
23. దాని చర్మమున మెత్తని భాగముండదు. అంతయు ఇనుమువలె గట్టిగానుండును.
24. దాని గుండె రాయి వలె కర్కశముగా నుండును. తిరుగటి రాయివలె కఠినముగా ఉండును.
25. అది లేచి నిలుచుండినపుడు, బలాడ్యులే భయపడి వెనుకకు మళ్ళుదురు.
26. కత్తులు దానిని గాయపరచలేవు. ఈటెలు బల్లెములు బాణములు దానిని బాధింపలేవు.
27. అది ఇనుమును తృణప్రాయముగను, ఇత్తడిని పుచ్చిన కొయ్యవలె గణించును.
28. అది బాణమునకు జడిసి పరుగెత్తదు. రాళ్ళురువ్వినచో గడ్డిపోచలతో మోదినట్లుగా భావించును
29. గుదియతో మోదినచో గడ్డిపరకతో కొట్టినట్లుగా నెంచును. ఈటెను విసిరినచో పరియాచకము చేసి ఊరకుండును.
30. దాని ఉదరము చిల్లపెంకులతో, కప్పినట్లుగా నుండును. అవి బురదను గొర్రుతో దున్నినట్లుగా గోకివేయును
31. మకరము సముద్రమును చిలకగా దాని జలము సలసల మరుగుచున్న నీళ్ళవలె కన్పించును. చిటపట మరుగుచున్న చమురువలె చూపట్టును
32. అది ఈదిన చోట తళతళ మెరయు దారి కన్పించును.  సముద్రము తెల్లని నురగతో నిండును.
33. భువిలో మొసలికి సాటి ప్రాణి లేదు. భయమననేమో దానికి తెలియదు.
34. అది పొగరుగల మృగములనుగూడ  చిన్నచూపు చూచును. వన్యమృగములన్నిటికి అదియే రాజు.”