1. అటు తరువాత తేమాను నగరవాసి ఎలీఫసు మాట్లాడుచు ఇట్లనెను:
2. "అయ్యా! నేను మాటలాడినచో నీకు బాధ కలుగదుగదా! | నేను ఇక మౌనము వహింపజాలను.
3. పూర్వము నీవు చాలమందికి సద్బోధ చేసి బలహీనమైన చేతులను బలపరిచినవాడవు
4. కాలుజారి పడువారికి నీ మాటలు సత్తువ నొసగెను. కాళ్ళు వణకువారికి నీ పలుకులు ధైర్యము నొసగెను.
5. కాని ఇప్పుడు నీ వంతు రాగా నీవు ధైర్యము కోల్పోయితివి. ఆ బాధలు నిన్ను పట్టి పీడింపగా నీవు దుఃఖితుడవైతివి.
6. నీ దైవభీతి నీ కేల నమ్మకము పుట్టింపలేదు? యదార్ధవర్తనమైన నీ జీవితము నీకేల ఓదార్పు నొసగలేదు?
7. ఋజువర్తనుడు నాశనమగుటగాని న్యాయవంతుడు చెడుటగాని నీవు ఎన్నడైన కంటివా?
8. నేను చూచిన సంగతి చెప్పుచున్నాను వినుము. దుష్టత్వమను పొలమునుదున్ని దుర్మార్గమను పైరువేసిన వారు, కడన పాపపు పంటనే కోసికొందురు.
9. దేవుని శ్వాసము వారిని నాశనము చేయును. అతని ఉగ్రశ్వాసమువలన వారు బుగ్గియగుదురు
10. వారు సింహమువలె గర్జించి ఆర్భటింతురు. కాని దేవుడు వారి కోరలను విరుగగొట్టును.
11. వారు తిండి దొరకని సింగమువలె చత్తురు. వారు సింహము పిల్లలువలె చెల్లాచెదరగును.
12. నాకొక సందేశము విన్పించినది. నా చెవులొక మెల్లని స్వరమును ఆలకించినవి.
13. నరునికి కలలు వచ్చువేళ, గాఢముగా నిద్రపట్టువేళ ఈ సంఘటన జరిగినది.
14. అపుడు నేను మిగుల భయపడి గడగడ వణకితిని నా దేహమంత భీతితో కంపించిపోయినది.
15. నా మొగము మీదుగా మెల్లనిగాలి వీచినది. వెంటనే నా శరీరము గగుర్పొడిచినది.
16. నా ఎదుట ఎవ్వరో నిల్చియున్నట్లు కన్పించినది. నేను ఆయన రూపురేఖలను కాంచజాలనైతిని. ఆయన మాత్రము నా ఎదుట నిల్చియున్నట్లు చూపట్టెను. కొంతతడవు నిశ్శబ్దము అంతట నేనొక స్వరము వింటిని:
17. "ఏ నరుడైనను దేవుని యెదుట నీతిమంతునిగా కన్పింపగలడా? ఎవడైనను సృష్టికర్త ముందట పవిత్రుడుగా చూపట్టగలడా?
18. దేవుడు స్వరములోని తన సేవకులనే నమ్మడు. ఆయన దేవదూతల గణములోనే తప్పుపట్టును
19. అట్టివాడు మట్టి ఇండ్లలో జీవించే మర్త్యుని, దుమ్ముతో తయారైన నరుని, చిమ్మటవలె చితికిపోవు మానవుని నమ్మునా?
20. నరుడు ఉదయముండి, సాయంకాలమునకు గతించును. ఇక శాశ్వతముగా కనుమరుగైపోవును. ఆ మీదట అతనిని ఎవ్వరును జ్ఞప్తియందు ఉంచుకొనరు.
21. వారి ఘనత కొట్టివేయబడగా వారు జ్ఞానహీనులై నశించుదురు."