1. అటుపిమ్మట యావేదేవుడు సుడిగాలిలోనుండి యోబుతో ఇట్లు పలికెను:
2. జ్ఞానహీనమైన పలుకులతో ఆలోచనను చెరపుచున్న వీడెవడు?
3. నీవిపుడు ధైర్యముతో నిలిచి నా ప్రశ్నలకు జవాబు చెప్పుము.
4. నేను ఈ భూమికి పునాదులెత్తినపుడు నీవు ఉంటివా? నీకంతటి విజ్ఞానమున్నచో నాకు జవాబుచెప్పుము
5. ఈ భూమి వైశాల్యమును నిర్ణయించినదెవరో, దానిని కొలచినదెవరో నీ వెరుగుదువా?
6. నేలను మోయు స్తంభములు దేనిమీద నిల్చునో, ఈ నేలకు పునాది వేసినదెవరో నీకేమైన తెలియునా?
7. ఆనాటి వేకువ చుక్కలు గుమిగూడి పాటలు పాడెను దేవదూతలు సంతోషముతో గానముచేసిరి.
8. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినపుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు?
9. సాగరము మీద మేఘములనుకప్పి దానిని పొగమంచుతో నింపినది నేనుకాదా?
10. కడలికి ఎల్లలు నిర్ణయించి, అది నేను గీసిన గిరిదాటకుండునట్లు చేసితిని.
11. 'నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును. నీ బలమైన కెరటములిచ్చట ఆగిపోవలయును'. అని నేను కడలికి కట్టడచేసితిని.
12. యోబూ! నీ వెన్నడైనను దినమును ఆజ్ఞాపించి అది వేకువను కొనివచ్చునట్లు చేయగలిగితివా?
13. ఉదయము క్రమముగా భూమిని ఆక్రమించుకొని దుర్మార్గులను తమ స్థావరములనుండి వెళ్ళగొట్టునట్లుగా ఆజ్ఞలీయగలిగితివా?
14. ఉదయము వెలుగొందగా మిట్టపల్లములు బట్టలలోని మడతలవలె, మట్టిమీద వేసిన ముద్రవలె స్పష్టముగా కన్పించును.
15. వేకువ వెలుగు దుష్టుల పొగరణచి వారి దౌర్జన్యములను తుదముట్టించును.
16. నీవు సముద్రముల జన్మస్థలమును కాంచితివా? సాగరముల గర్భమున సంచరించితివా?
17. మృతలోక ద్వారములను వీక్షించితివా? ఆ తమోలోక ద్వారమును కనుగొంటివా?
18. ఈ లోకమెంత విశాలమైనదో నీకు తెలియునా? తెలియునేని నాకు జవాబు చెప్పుము.
19. తేజస్సు నివాసమెక్కడున్నది? తమస్సు గృహమెక్కడున్నది?
20. నీవు ఆ చీకటి వెలుగులను వాని గమ్యస్థానమునకు పంపగలవా? మరల వానిని పూర్వస్థానములకు కొనిరాగలవా?
21. ఈ కార్యములెల్ల చేయగలుగుదువేని, నీవు ఆ ప్రకృతిశక్తులు పుట్టినప్పుడే పుట్టి ఉందువు ఇప్పుడు చాల వయోవృద్ధుడవై ఉందువుకూడ.
22. నేను మంచును ఏ కొట్టులో దాచిఉంతునో, వడగండ్లను ఏ తావున భద్రపరతునో నీ వెన్నడైన చూచితివా?
23. కష్టదినములందును, యుద్ధకాలమునందును వినియోగించుటకు నేను వానిని అట్టిపెట్టి ఉంచుదును.
24. సూర్యుడెచటినుండి బయలుదేరునో తూర్పు వడగాలులు ఎచటినుండి పుట్టునో నీవెరుగుదువా?
25. పెనువానలకు మార్గములు కల్పించినదెవరు? పిడుగులకు త్రోవలు సిద్ధము చేసినదెవరు?
26. జనసంచారము లేని మరుభూములలోకూడ వర్షములు కురిపించునదెవరు?
27. ఎండి బీటలువారిన నేలలను నీటిచుక్కలతో తడిపి గ్రాసము ఎదిగించునదెవరు?
28. వానకు తండ్రి కలడా? పొగమంచుకు జనకుడు కలడా?
29. మంచునకు తల్లి కలదా? నేలపై పేరుకొనునూగుమంచునకు జనని కలదా?
30. ఆ మంచు వలన జలములు రాయివలె గట్టిపడును. అగాధజలము గడ్డకట్టుకొని పోవును.
31. నీవు కృత్తికా నక్షత్రములను , దండగా కూర్చగలవా? మృగశిర తారలను విభజించి వేరుపరపగలవా?
32. నక్షత్రరాశులను వాటివాటి సమయమునకు తగినట్లుగా నడిపింపగలవా? నక్షత్రమండలములకును, వారి ఉపనక్షత్రములకును దారి చూపగలవా?
33. ఆకాశమందలి నియమములను నీవెరుగుదువా? ఆ సూత్రములను భూమికిగూడ వర్తింపజేయగలవా?
34. నీవు మేఘముల నాజ్ఞాపింపగలవా? వానిచే కుండపోతగా వానలు కురియింపగలవా?
35. మెరపులను ఆజ్ఞాపింపగలవా? అవి నీ కట్టడలను పాటించునా?
36. అంతర్యింద్రియములలో జ్ఞానముంచిన వాడు ఎవడు? హృదయమునకు తెలివినొసగినదెవరు? శకున పక్షికి విజ్ఞానమిచ్చినదెవరు కోడిపుంజునకు తెలివినొసగినదెవరు?
37. ఆకాశములోని మేఘములను లెక్కించి వానిచే వానలు కురియించునదెవరు?
38. ఆ వానలు ఈ భూమిమీది ధూళిని గట్టి ముద్దగాజేసి మట్టిపెళ్ళలు గట్టిపడునట్లు చేయునుగదా!
39-40.గుహలలో దాగుకొని పొదలలో పొంచి ఉండెడి సింహములకు నీవు ఎరను చేకూర్చి పెట్టగలవా? సింగపు కొదములకు ఆహారము సంపాదించి పెట్టగలవా?
41. ఆకలితో తిరుగాడు కాకులను కలు పోషించునదెవరు? ఆ కాకుల పిల్లలు ఆకలిగొని నాకు మొరపెట్టగా వానికి తిండి పెట్టునదెవరు?