1. ఆ ఉరుములు గర్జన రాగానే నా గుండె వేగముగా కొట్టుకొని గడగడ లాడుచున్నది.
2. మీరెల్లరు ప్రభువు స్వరము వినుడు. ఆయన నోటినుండి వెలువడు గర్జనమును ఆలకింపుడు.
3. ఆయన ఆకాశమునుండి మెరుపులు పంపును. అవి నేలకొనల వరకు ప్రసరించును.
4. అటు తరువాత ఆయన స్వరము విన్పించును. అది ఉరుముల భీకరధ్వానము. మెరుపులు మాత్రము నిరతము మిరుమిట్లు గొలుపుచునే ఉండును.
5. ప్రభువాజ్ఞ ఈయగా అద్భుతకార్యములు జరుగును ఆయన మహాకార్యములను మనము అర్థము చేసికోజాలము.
6. ఆయన ఆజ్ఞాపింపగా నేలమీద మంచుపడును. వర్షము కురిసి భూమి జలమయమగును.
7. ఆయన నరుల కార్యములను స్తంభింపజేసి వారు తన శక్తిని గుర్తించునట్లు చేయును.
8. వన్యమృగములు పొదలలో దూరి, గుహలలో దాగుకొనును.
9. తుఫాను గాలులు దక్షిణమునుండి వచ్చును. చలిగాలులు ఉత్తరమునుండి వచ్చును.
10. దేవుడు తన ఊపిరి నూదగా నీళ్ళు చల్లనై మంచుగా మారిపోవును.
11. ఆయనే మబ్బులను నీటితో నింపును. వాని నుండి మెరుపులు మెరయును.
12. ఆయనే స్వయముగా ఆ మబ్బులను నడిపింపగా అవి ఎల్లయెడల తిరుగాడును. నేల నాలుగుచెరగుల సంచరించును. అవి ఆయన ఆజ్ఞను ఖండితముగా పాటించును.
13. నేలమీది నరులను శిక్షించుటకుగాను కరుణించుటకుగాను ఆయన మబ్బులను పంపును
14. యోబూ! ఒక్క క్షణము ఈ సంగతులెల్ల ఆలోచింపుము. ప్రభువు అద్భుతకార్యములను పరిశీలించి చూడుము.
15. దేవుడు ఆజ్ఞ ఈయగా మబ్బులలో నుండి మెరపులెట్లు మెరయునో నీకు తెలియునా?
16. దేవుని అద్భుతకౌశలము వలన మేఘములు ఆకాశమున ఎట్లు తేలియాడునో నీ వెరుగుదువా?
17. దక్షిణపు గాలి తోలి, నేల అట్టుడికినట్లు ఉడికిపోవునపుడు, నీ బట్టలు వేడియైనది నీకు తెలియదా?
18. దేవుడు ఆకాశమును విప్పారజేసి దానిని లోహపు దర్పణమువలె కఠినము గావించెనుగదా! మరి ఆ క్రియలో నీవు ఆయనకు సహాయపడగలవా?
19. దేవునికేమి చెప్పవలెనో నీవే తెల్పుము. మాకు ఆలోచనలు తట్టుటలేదు, మా నోట మాటలు రావు.
20. నేను మాటాడుదునని ఆయనతో ఎవడైన చెప్పునా? ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరుకొనునా?
21. కొన్నిసారులు కారుమబ్బులడ్డుపడుటచే ఆకాశమునుండి వెలుగు ప్రసరింపదు. కాని ఇప్పుడు గాలివీచి మేఘములను తోలివేసినది ఆకాశము కాంతితో తళతళలాడుచున్నది.
22. ఉత్తరమున సువర్ణచ్ఛాయ వెలుగొందుచున్నది. దేవుని తేజస్సు మనలను భయభ్రాంతులను చేయుచున్నది.
23. మనము అగోచరుడైన ప్రభువును సమీపింపజాలము. ఆయన మహాశక్తిమంతుడు, ధర్మమూర్తి నీతినతిక్రమింపడు. నరులను న్యాయముతో చూచువాడు.
24. కావున ఎల్లరును ఆయనను చూచి గడగడలాడుదురు మేము జ్ఞానులమనుకొను వారిని ఆయన లెక్కచేయడు