ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 34

1. ఎలీహు తన సంభాషణనిట్లు కొనసాగించెను:
2. “అయ్యలారా! విజ్ఞానవేత్తలు వివేకవంతులైన మీరు నా పలుకులు ఆలింపుడు.
3. నాలుక భోజనరుచులను ఎరిగినట్లే, శ్రవణము విజ్ఞాన వాక్యములను ఎరుగును.
4. కనుక మనమిప్పుడు న్యాయమేదియో పరిశీలింతము. మంచి యేదియో నిర్ణయింతము.
5. యోబు 'నేను నిర్దోషినైనను, దేవుడు నాకు న్యాయము జరిగించుట లేదాయెను.
6. నేను నీతిమంతుడనైనను అబద్దీకునిగా నెంచబడితిని. తప్పుచేయకున్నను దెబ్బలు తినవలసి వచ్చినది' అని మొరపెట్టుచున్నాడు.
7. ఈ యోబు వంటి వానిని మీరెందైన కంటిరా? అతనికి దేవునిపట్ల భయభక్తులు లేవు.
8. దుష్టులతో కలిసి తిరుగుచున్నాడు. దుర్మార్గులతో చేతులు కలుపుచున్నాడు.
9. 'దేవుని చిత్తమును పాటించుట వలన నరుని కెట్టి లాభము లేదు' అని వాదించుచున్నాడు.
10. విజ్ఞాన నిధులైన మీరు నా పలుకులు ఆలింపుడు ప్రభువు అన్యాయమునకు పాల్పడువాడు కాదు.
11. అతడు నరుల కార్యములకు తగిన బహుమతినిచ్చును. ఎవరికి తగినట్లుగా వారిని సంభావించును.
12. ప్రభువు అక్రమమునకు ఒడిగట్టడు, న్యాయమును చెరుపడు.
13. దేవునికెవడైన ఈ లోకముమీద పెత్తనమిచ్చెనా? జగత్తునెవడైన ఆయన ఆధీనమున ఉంచెనా?
14. ఆయన ప్రాణులకొసగిన ఊపిరిని తీసికొనెనేని, తానిచ్చిన ప్రాణములు తాను మరల చేకొనెనేని
15. జీవులన్నియు నశించును. నరుడు మట్టిలో కలిసిపోవును.
16. మీరు విజ్ఞానవేత్తలగుదురేని నా పలుకులు ఆలింపుడు.
17. న్యాయమూర్తియైన దేవుని మీరు ఖండింపగలరా? ఆయన న్యాయమును లెక్కచేయనివాడా?
18. ఎవడేని రాజుతో 'నీవు నిష్ప్రయోజకుడవు' అని చెప్పునా? పాలకులతో “మీరు దుర్మార్గులు' అని పలుకునా?
19. దేవుడు అధిపతుల కోపు తీసికొనడు. దరిద్రులకంటె ధనికులనెక్కువగా ఆదరింపడు. అందరిని కలిగించినవాడు ఆయనే కదా?
20. దేవుడు శిక్షింపగా నరులు అకస్మాత్తుగా చత్తురు. గొప్పవారు కూడ రేయి ప్రాణములు విడతురు. నిరంకుశుడైన పాలకుడుకూడ గతించును.
21. ప్రభువు కళ్ళు నరుల పోకడలనెల్ల గమనించును. వారి చర్యలనెల్ల గుర్తించును.
22. గాఢాంధకారముకూడ దేవుని కంటబడకుండ దుర్మార్గులను దాచియుంచలేదు.
23. నరుని తన చెంతకు పిలిపించి తీర్పు చెప్పుటకు, ఆయన ప్రత్యేకమైన కాలమేమియు నియమింపడు
24. ఆయన విచారణ జరిపింపకయే నాయకులను పదవినుండి తొలగించును. కొత్తవారికి ఆ పదవిని అప్పగించును.
25. ఆ నాయకుల చెయిదములు ఆయనకు తెలియును గనుక వారిని రాత్రికాలమున కూలద్రోసి నాశనము చేయును.
26. దేవుడు దుర్మార్గులను శిక్షించును. ఆ శిక్ష యెల్లరికి తెలియునట్లు చేయును.
27. వారు ప్రభువుకు లొంగరైరి కనుకను, ఆయన ఆజ్ఞలను పాటింపరైరి కనుకను,
28. పేదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.
29. దేవుడు మౌనముగానున్నచో ఆయనను ఖండించగల వారెవరు? తన మొగమును దాచుకొన్నచో ఆయనను చూడగల వాడెవడు? అది దేశమైనను లేదా నరుడైనను కావచ్చు!
30. దుష్టులు పరిపాలింపకుండునట్లు వారు ప్రజలను పీడింపకుండునట్లు, బలవంతులను ఆయన నాశనము చేయును.
31. ఎవడేని దేవునితో 'నా అపరాధములు ఒప్పుకొంటిని, శిక్షనొందితిని, ఇట్టి తప్పులను మరల చేయనని బాసచేసితిని,
32. నా దోషములను తెలియజేయుమని అర్ధించుచుంటిని, ఇక మీద ఇట్టి దుష్కార్యములు చేయనని మాట ఇచ్చుచుంటిని' అని పలుకగలడా?
33. నీవేమో దేవుని చెయిదములను విమర్శించుచున్నావు. ఆయన నీవు చెప్పినట్లు చేయవలయునా ఏమి?
34. యోబు పలుకులలో విజ్ఞానము లేదనియు, ఆయన మాటలకు అర్థము పర్గము లేదనియు,
35. తెలివిగలవాడెవడైన అంగీకరించును. నా పలుకులు వినువాడెవడైనను ఒప్పుకొనును.
36. మీరు యోబు వాక్యములను పరిశీలించి చూడుడు అతడు దుర్మార్గునివలె మాటలాడుచున్నాడు.
37. పాపము చేసినది చాలక తిరుగుబాటును చేయుచున్నాడు. మన అందరి యెదుట పెద్దగొంతుచేసికొని చప్పట్లు కొట్టుచు దేవుని అవహేళన చేయుచున్నాడు”.