ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 32

1. యోబు తనదృష్టికి తాను నిర్దోషినని విశ్వ సించియున్నాడని ఆ ముగ్గురు మిత్రులు గ్రహించి, అతడికి జవాబు చెప్పక మౌనము వహించిరి.
2. కాని యోబు తన్ను తాను సమర్ధించుకొని దేవుని తప్పుపట్టుటను చూచి బరకేయేలు కుమారుడు ఎలీహు కోపముతో మండిపడెను. అతడు బూసీయుడును, రాము వంశమునకు చెందినవాడు.
3. అతడు ఆ ముగ్గురు మిత్రులమీదకూడ ఆగ్రహము చెందెను. వారు యోబునకు సమాధానము చెప్పజాలక దేవునిదే తప్పు అన్నట్లుగా మౌనము వహించిరికదా!
4. వారెల్లరు ఎలీహు కంటే పెద్దవారు కనుక వారు మాట్లాడునపుడు అతడు మాటలాడడయ్యెను.
5-6. కాని ఆ ముగ్గురు యోబుకు జవాబునీయకుండిరి. కనుక ఎలీహు కోపము తెచ్చుకొని ఇట్లు బదులు పలికెను: “నేను చిన్నవాడను, మీరు వయోవృద్ధులు అగుటచే మీ ఎదుట నా అభిప్రాయమును వెలిబుచ్చజంకితిని.
7. పెద్దవారలే మాట్లాడవలయును, వృద్దులే విజ్ఞానవాక్యములు పలుకవలయును అని నేను భావించితిని.
8. కాని మహోన్నతుని ఆత్మయే నరులలో నెలకొనియుండి, వారికి విజ్ఞాన మొసగునని నేనిపుడు గ్రహించితిని
9. వృద్ధులైనంత మాత్రముననే విజ్ఞానము అలవడదు ఏండ్లు చెల్లినంతనే వివేకమబ్బదు.
10. కనుక మీరిపుడు నా పలుకులు ఆలింపుడు. నా అభిప్రాయము శ్రద్ధగా వినుడు.
11. నేను మీ పలుకులను ఓపికగా వింటిని. మీరు పదములను వెదకుకొని మాటలాడుట గుర్తించితిని.
12. మీ మాటలను సావధానముగా వింటిని, మీరు యోబును ఖండింపలేదు. అతని మాటలకు జవాబీయలేదు.
13. ఇక మీకు విజ్ఞానము కలదని నమ్ముట ఎట్లు? ఈ కార్యము మీవలన కాలేదు గనుక దేవుడే యోబునకు బదులు చెప్పవలయును.
14. యోబు నాతో వాదింపలేదు. నేను మీ మాటలనుబట్టి అతనికి జవాబునివ్వను.
15. యోబూ! వీరు విస్మయముతో నోరెత్త జాలరైరి. వీరి నోటివెంట మాటలు పెకలవయ్యెను.
16. వీరు మౌనము వహించిరి కనుక నేను ఊరకుండవలయునా? అదిగో! వీరు నోటమాట లేక నిలుచుండిరి.
17. కనుక నేనిపుడు జవాబు చెప్పెదను. నా అభిప్రాయము తెలియజేసెదను.
18. నా తల భావములతో నిండియున్నది. నాలోనిఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది.
19. నేను మాటాడనేని క్రొత్త ద్రాక్షసారాయము పోయుటవలన ఒత్తిడికి గురియైన తిత్తివలె పిగిలి పోవుదునేమో.
20. మాటలాడిననే తప్ప నాకిపుడు ఉపశమనము లేదు. కనుక నా అభిప్రాయము వెల్లడింతును.
21. నాకెవరిపట్ల పక్షపాతము లేదు. నేనెవరిని పొగడువాడను కాను.
22. పొగడుటకు నాకు నేర్పు కూడ లేదు. ముఖస్తుతికి పూనుకొందునేని దేవుడు నన్ను శిక్షించును.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services