ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 3

 1. కడన యోబు నోరు విప్పెను.

2. అతడు తాను పుట్టిన దినమును శపించుచు ఇట్లనెను:

3. “నా తల్లి గర్భద్వారమును అది మూయనందుకు నా నేత్రములకు అది బాధను మరుగుచేయనందులకు నేను పుట్టినదినము లేకపోవునుగాక! 'ఒక మగబిడ్డ ఆమె కడుపునపడెను'.  అని ఒకడు చెప్పిన రేయి లేకపోవునుగాక!

4. పైనున్న దేవుడు ఆ రోజును స్మరింపకుండుగాక! ఆ దినము అంధకారబంధురమగుగాక! దానికి వెలుగు ప్రాప్తింపకుండుగాక!

5. తమస్సును, మృత్యుఛాయయు దానిని కప్పివేయుగాక! మేఘము దానినావరించుగాక! దానికి సూర్యప్రకాశము కలుగకుండుగాక!

6. చీకట్లు ఆ రేయిని అలముకొనుగాక! దానిని సంవత్సర దినములలో గణింపకుందురుగాక! . మాసదినములలో లెక్కింపకుందురు గాక!

7. ఆ రేయి గొడ్డుబోవుగాక! ఆ రాత్రి ఆనందనాదమేదియు విన్పింపకుండుగాక!

8. సముద్రభూతమును మేలుకొల్పు మాంత్రికులు ఆ రేయిని శపింతురుగాక!

9. ఆ రాత్రి సంధ్యానక్షత్రకాంతిని కోల్పోవును గాక! దానికి ప్రకాశము సోకకుండుగాక! వేకువ వెలుగు ప్రాప్తింపకుండుగాక!

10. ఆ రేయి మా తల్లి గర్భకవాటమును మూసివేసి నాయీశోకమును వారింపజాలదయ్యెను.

11. నేను మా తల్లి కడుపున ఉన్నపుడే యేల చావనైతిని? లేదా, పురిటిలోనే యేల కన్నుమూయనైతిని?

12. మా అమ్మ నాడు మోకాళ్లూని నన్ను స్వీకరింపనేల? స్తన్యమిచ్చి నన్ను పోషింపనేల?

13. నేనప్పుడే చనిపోయి ఉండినచో ఇప్పుడు శాంతికి నిలయమైన సుఖనిద్రను అనుభవించుచుండెడి వాడనేకదా!

14. తమ కొరకు బీడుభూములయందు భవనములు నిర్మించుకొనిన రాజులతోను, మంత్రులతోను కలిసి నిద్రించుచుండెడివాడనేకదా!

15. తమ భవనములో వెండిబంగారములు కూడబెట్టుకొనిన రాజకుమారులతో కలిసి శయనించుచుండెడివాడనే కదా!

16. తల్లి కడుపునుండి చనిపోయిపుట్టి , వెలుగు కాంచజాలని మృతపిండముతో కలిసి నిద్రించుచుండెడివాడనే కదా!

17. ఆ పాతాళలోకమున దుర్మార్గులితరులను పీడింపజాలరు. అచట అలసిపోయిన పనివారు విశ్రాంతి చెందుదురు.

18. అక్కడ బందీలుకూడ అధికారి ఆజ్ఞలకు గురికాక విశ్రాంతిని అనుభవింతురు.

19. అచట అధికులు, అల్పులు కూడ ఉందురు. యజమానుల పీడ విరగడైన సేవకులు ఉందురు

20. ప్రభువు విచారగ్రస్తులకు వెలుగు ఈయనేల? దుఃఖితులకు జీవనభాగ్యము దయచేయనేల?

21. వారు మృత్యువు కొరకు వేచియున్నను, అది వారి చెంతకు రాదు, నిధికొరకువలె చావుకొరకు గాలించినను అది వారికి దొరకదు.

22. వారు తమ సమాధిని గాంచి ఆనందింప గోరుదురు. తమ గోరీని చేరుకొని సంతసింపగోరుదురు.

23. కన్నులతో మార్గముచూడలేని వానికి, దేవుడు చుట్టుకంచెవేసిన వానికి వెలుగునివ్వనేల? ఆ మార్గములన్నీ నిరోధించినచో, వానికి వెలుగేల?

24. సంతాపమే నాకు ఆహారమైనది. నా నిట్టూర్పులకు అంతమేలేదు.

25. నేను దేనికి వెరతునో, దేనిని గూర్చి భయపడుదునో, అదియే నాకు జరుగుచున్నది.

26. నాకు శాంతిసమాధానములు లేవు నా శ్రమలకు అంతము లేదు.”