ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 26

1. తరువాత యోబు ఇట్లనెను:

2. “ఓయి! దుర్బలుడనైన నాకు నీవు ఎంతటి సాయము జేసితివి! బలహీనుడనైన నాకు నీ వెంతటి ఆశ్రయము నొసగితివి!

3. జ్ఞానములేనివానికి నీవెంత మంచి సలహాలిచ్చితివి నా మేలుకొరకు నీ భావములను ఎంత చక్కగా వివరించితివి!

4. కాని నీ మాటలను ఎవరాలింతురు? ఎవరి సాయమున నీవిట్టి పలుకులు పలికితివి?

5. పాతాళ వాసులు గడగడ వణుకుదురు. పాతాళజలములు అందలి భూతములు కంపించును

6. పాతాళమునందలి మృతులు దేవునికి స్పష్టముగా కన్పింతురు. ఆయన కంటికి కన్పింపకుండ వారిని దాచగలిగినది ఏదియును లేదు.

7. ఆకాశ ఉత్తరభాగమును వ్యాపింపచేసినవాడు ఆయనే భూమిని శూన్యమున వ్రేలాడదీసినవాడు ఆయనే

8. ప్రభువు మేఘములను నీటితో నింపును. అయినను అవి జలభారముచే పిగిలిపోవు.

9. ఆయన పూర్ణచంద్రుని మబ్బుతో కప్పివేయును.

10. సముద్రము మీద ఒక వలయమునేర్పరచి, వెలుగును చీకటినుండి వేరుపరచును.

11. ఆయన ఆకాశమును భరించు స్తంభములను గద్దింపగా అవి భీతితో కంపించును.

12. ఆయన మహాబలముతో సముద్రమును జయించెను. నేర్పుతో రాహాబును హతమార్చెను.

13. తన శ్వాసతో ఆకాశమును జ్యోతిర్మయము గావించెను. పారిపోవు మహాసర్పమును స్వహస్తముతో మట్టు పెట్టెను.

14. ఈ కార్యములన్నియు ఆయన బల సూచకములు మాత్రమే. మనము వినునది ఆయన అస్పష్ట శబ్దములు మాత్రమే ఆ ప్రభువు మహాబలమునెవరు గుర్తింపగలరు?”