ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 24

1. ప్రభువు న్యాయము తీర్చు దినమును నిర్ణయింపడేల? తన సేవకులకు తీర్పుచెప్పు రోజును నియమింపడేల?
2. దుర్మార్గులు పొలములోని గట్టురాళ్ళను ఊడబీకుచున్నారు. గొఱ్ఱెలను వాని కాపరులను గూడ అపహరించుచున్నారు.
3. అనాథల గాడిదలను తోలుకొని పోవుచున్నారు. వితంతువుల ఎడ్లను కుదువ సొమ్ముగా కొనిపోవుచున్నారు.
4. పేదలకు న్యాయము జరుగకుండ అడ్డుపడుచున్నారు, నిరుపేదలు పారిపోయి దాగుకొనునట్లు చేయుచున్నారు.
5. పేదలు కూటి కొరకు గాలించుచు, అడవిగాడిదలవలె ఎడారిలో తిరుగాడుచున్నారు. వారిబిడ్డలకు మరి ఎచ్చటను కూడు దొరకును?
6. పేదలు దుర్మార్గుల పొలములలో కోతకోయవలయును. దుష్టుల ద్రాక్షతోటలలో పండ్లు కోయవలెను.
7. వారు రేయి చలికి బాధ చెందుచు, బట్టలు కప్పుకొనకయే నిద్రింపవలెను.
8. కొండలలో కురియు వానలు వారిని , తడిపి ముద్దజేయును. వారు దిక్కులేక కొండ బండల మాటున ఒదుగుకొందురు.
9. అనాథలను బానిసలుగా కొనిపోవుచున్నారు. బాకీలు తీర్పని పేదల పిల్లలను లాగుకొని పోవుచున్నారు.
10. పేదలు బట్టలులేక దిగంబరులుగానే పనికి పోవలెను. ఆకలితో నకనకలాడుచు పైరుకోసి కట్టలు కట్టవలెను.
11. వారు ఓలివులను చిదిమి నూనె తీయుదురు. ద్రాక్షలను చిదిమి రసము తీయుదురు. కాని వారికి మాత్రము త్రాగుటకేమియు దొరకదు
12. నగరములలో మరణించువారు బాధతో మూల్గుదురు. గాయపడిన వారు గొంతెత్తి అరచుదురు. కాని దేవుడు వారి వేడుకోలును ఆలించుట లేదు.
13. కొందరు వెలుగును ద్వేషింతురు. వారు జ్యోతిని గ్రహింపరు, దాని మార్గమున నడువరు.
14. నరహంత వేకువనేపోయి పేదవానిని చంపును. రేయి పరులసొమ్ము దొంగిలించును.
15. వ్యభిచారి మసక చీకటికై కాచుకొని ఉండును. ఇతరులు తన్ను గుర్తింపకుండుటకుగాను ముసుగు వేసికొని తిరుగును.
16. రాత్రివేళ దొంగలు ఇండ్లకు కన్నము వేయుదురు పగటిపూట మాత్రము వెలుతురును పరిహరించి దాగుకొనియుందురు.
17. వారికి పగటి వెలుగు చావునీడలా భయము పుట్టించును. రాత్రి దారుణములకు మాత్రము వారు స్నేహితులు.
18. “దుష్టులను వరదలు ముంచివేయును. వారి పొలములను దేవుడు శపించును. కనుక వారిక తమ ద్రాక్షతోటలో పనిచేయజాలరు.
19. వేడికి, బెట్టకు మంచు కరిగిపోయినట్లే  దుర్మార్గుడు సజీవుల లోకమునుండి మాయమగును.
20. కన్నతల్లికూడ అతనిని స్మరింపదు. పురుగులు అతనిని తినివేయును. పడిపోయిన చెట్టువలె అతడు నాశనమగును.
21. వితంతువులను పీడించి, గొడ్రాళ్ళను నిరాదరణము చేసెను గనుక దుష్టుడిట్టి కడగండ్ల వాతపడును.
22. ప్రభువు బలవంతులనుగూడ నాశనము చేయును అతడు చేయిచేసికొనగా దుష్టుడు కన్నుమూయును
23. ప్రభువు దుర్మార్గుని సురక్షితముగా బ్రతకనిచ్చినను, అతనిని ఒక కంట కనిపెట్టియే ఉండును.
24. పాపి తాత్కాలికముగా వృద్ధిచెందినను, పెరికివేసిన కలుపు మొక్కవలె వాడిపోవును, కోసిన వెన్నువలె ఎండిపోవును.
25. ఈ సంగతులను ఎవరైన కాదనగలరా? నా పలుకులు అసత్యములని ఎవరైన నిరూపింపగలరా?"