ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 23

1. తరువాత యోబు ఇట్లనెను:

2. "నేనింకను దేవుని కెదురుతిరిగి నిష్ఠురములు పలుకుచున్నాను. నా మూలుగులను అణచుకోజాలకున్నాను.

3. ఆ ప్రభువును సమీపించు మార్గము, ఆయనను చేరుకొను విధానము తెలియవచ్చిన ఎంత బాగుండును!

4. అప్పుడు నా అభియోగమును ఆయనకు తెల్పుకొందును. నావాదములన్నిటిని ఆయనకు విన్పించుకొందును

5. ఆయన తన వాదమునెట్లు సమర్ధించుకొనునో చూతును. ఆయన నాతో నుడువు పలుకులను జాగ్రత్తగా ఆలింతును.

6. ఆయన బలముగా వాదించి నా నోరు మూయించునా? అట్లు చేయడు, నా పలుకులు ఆలకించితీరును.

7. తాను నిజవర్తనునితో మాటాడుచుంటినని ఆయన గ్రహించును. కనుక నేను ఎన్నటికి నా న్యాయాధిపతిచే శిక్షింపబడను.

8. నేను తూర్పునకు వెళ్ళినచో ప్రభువు అచట కన్పించుట లేదు. పడమటికి వెళ్ళినచో అచటను కన్పించుట లేదు.

9. ఉత్తరమువైపు వెదకినచో అచట పొడచూపుట లేదు. దక్షిణపు వైపు వెదకినచో అచటను దొరకుట లేదు.

10. అయిననునా కార్యములన్ని ఆయనకు తెలియును ఆయన నన్ను పరీక్షించినచో నేను నిర్దోషినని తెలియును.

11. నేను ప్రభువు నిర్ణయించిన మార్గముననే నడచితిని కుడియెడమలకు బెత్తడైనను జరుగనైతిని.

12. ఆయన ఆజ్ఞలనెల్ల పాటించితిని. అతని చిత్తమును అనుసరించి జీవించితిని.

13. కాని ప్రభువు సంకల్పమును ఎవ్వరును మార్పజాలరు. ఆయన చేయనెంచిన కార్యమును ఎవ్వరును ఆపజాలరు.

14. కావున ఆయన నాకు చేయగోరిన కార్యమును చేసితీరును. ఆయన ఇతర నిర్ణయమువలె ఇదియు జరిగిపోవును

15. అందుచే నేను ఆయన సమక్షమున భీతితో కంపించుచున్నాను. ఈ సంగతిని తలచుకొన్న కొలది నాకు భయమెక్కు వగుచున్నది.

16. ప్రభువు నా గుండెను నీరు చేసెను. నన్ను భయముతో నింపివేసెను.

17. చీకటి ఆయనను నానుండి మరుగుచేయుచున్నది అయినను నేను తమస్సునకుగాక దేవునికే భయపడుచున్నాను.