ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 22

1. తరువాత తేమాను నగరవాసి ఎలీఫసు ఇట్లనెను:

2. 'నరుని వలన దేవునికేమి ఉపయోగమున్నది? విజ్ఞానియైన నరుడుగూడ ఆయనకు ఉపయోగపడడు.

3. నీవు ధర్మాత్ముడవైనందున దేవునికి ఏమి లాభము? నీవు పుణ్యపురుషుడవైనందున ఆయనకు ఏమి ఫలము?

4. నిన్ను ఆయన శిక్షించినదిగాని, నీకు తీర్పు విధించినదిగాని నీవు ఆయనపట్ల భయభక్తులతో జీవించుటచే కాదు.

5. అనంతమైన నీ దుష్టవర్తనమునకుగాను, లెక్కల కందని నీ దుష్కార్యములకుగాను నిన్ను ఆయన దండించుచున్నాడు.

6. తోడివారు నీ వద్ద అప్పుతీసికొన్న సొమ్మునకుగాను నీవు వారి బట్టలను కుదువ సొమ్ముగా పుచ్చుకొని వారిని దిగంబరులను గావించితివి.

7. ఆకలి గొన్నవారికి పిడికెడుకూడు పెట్టవైతివి. దప్పిక గొన్నవారికి గ్రుక్కెడు నీళ్ళీయ వైతివి,

8. బాహుబలము కలవానికే భూమి దక్కును. ఘనుడని ఎంచబడినవాడు దానిలో నివసింతురు.

9. వితంతువులను వట్టిచేతులతో పంపివేసితివి. అనాథలకు అన్యాయము చేసితివి.

10. కనుకనే శత్రువులు నీకు అన్నివైపుల ఉచ్చులు పన్నిరి. అకస్మాత్తుగా భయములు నిన్ను ఆవరించినవి.

11. నీ చుట్టు చీకట్లు క్రమ్ముకొనగా నీవు మార్గము కనజాలవైతివి. జల ప్రవాహములు నిన్ను ముంచియెత్తినవి.

12. దేవుడు మహోన్నతమైన స్వర్గసీమన వసించును గదా! ఉన్నతముననున్న నక్షత్రములను అవలోకించుటకు క్రిందికి పారచూచును.

13. అయినను 'అంత ఎత్తున నున్న దేవునికి ఏమి తెలియును. మేఘములు అడ్డుపడుట వలన మనము ఆయనకు కనుమరుగైపోమా?” అని నీవు అడుగుచున్నావు. 

14. ప్రభువు ఆకాశపుటంచుల మీద నడచునప్పుడు, గాఢ మేఘములు ఆయన దృష్టిని నిరోధించునని నీవు ఎంచుచున్నావు.

15. పూర్వమునుండి దుష్టులు నడచుచు వచ్చిన దుర్మార్గముననే నీవుకూడ పయనింపగోరెదవా?

16. ఆ నీచులను వారికాలము రాకమునుపే మహాప్రవాహము తుడిచిపెట్టినది.

17. 'మా నుండి తొలగిపొమ్ము. ఆ సర్వశక్తుడు మాకు చేయునదేమి?" అని ఆయన తమ్ము కదిలింపజాలడని వారు ఊహించిరి.

18. అయినను ఆ దుర్జనులను ధనాఢ్యులుగ చేసినది ప్రభువే. వారు మాత్రము ఆయనను తలంపునకు తెచ్చుకోరైరి

19. ఆ దుష్టుల పతనమును జూచి పుణ్యపురుషులు సంతసించిరి. ధర్మాత్ములు మందహాసము చేసిరి.

20. వారి సంపదలు అన్నియు నాశనమైనవి. వారి సొత్తంతయు బుగ్గియైనది.

21. కనుక మిత్రమా! నీవు దేవునితో రాజీపడుము. అప్పుడు నీకు క్షేమము కలుగును.

22. ఆయన ఆజ్ఞలు చేకొనుము. ఆయన ఆదేశమును నీ యెదలో పదిల పరచుకొనుము.

23. వినయముతో దేవుని వద్దకు తిరిగిరమ్ము. నీ ఇంటినుండి పాపకార్యమునెల్ల పోద్రోలుము.

24. నీ బంగారమును ధూళిగానెంచి బయట పారవేయుము. నీ ఓఫీరు మేలిమి బంగారమును ఏటి యొడ్డున దొరకు చిన్నరాళ్ళనుగా భావించి బయటికి విసరివేయుము.

25. అప్పుడు నీకు దేవుడే బంగారమగును. ఆ ప్రభువే నీకు వెండికుప్ప అగును.

26. అప్పుడు దేవుడు నీకు ఆనందనిధి అగును. నీవు ఆయన వైపు తలెత్తగలవు.

27. నీవు ఆయనను వేడుకొందువు, ఆయన నీ మొరాలకించును. నీవు పట్టిన వ్రతములను తీర్చుకొందువు.

28. నీవు తలపెట్టిన కార్యములెల్ల విజయవంతములగును. నీ మార్గమున వెలుగు ప్రకాశించును.

29. గర్వాత్ముల పొగరును అణగదొక్కు ప్రభువే వినయవంతులకు రక్షణము దయచేయును.

30. ప్రభువు నిరోషియగు నరుని రక్షించును. పాపకార్యములకు పాల్పడవేని నిన్ను కూడ ఆదుకొనును.”