ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 20

 1. తరువాత నామా దేశీయుడైన సోఫరు ఇట్లనెను:

2. “ఓయి! నేను నీకు సత్వరమే జవాబు చెప్పవలయును. నీకు బదులు చెప్పుటకునేను వేగిరపడుచున్నాను.

3. నీ వాదము నాకు ఎంతమాత్రమును నీకెట్లు ప్రత్యుత్తరమియ్యవలెనో నాకు తెలియును.

4. నరుడు భూమి మీద అవతరించిన ఆదిమకాలమునుండ ఈ సత్యము రుజువగుచున్నది ఇది నీకును తెలియును.

5. దుర్మార్గుడు స్వల్పకాలము మాత్రము సంతసించును. వాని సంబరము కొద్దికాలము మాత్రమే నిలుచును

6. దుష్టుడు ఆకాశమువరకు ఎదిగి మేఘమండలమును తాకవచ్చుగాక! 

7. కాని అతడు మలమువలె నశించిపోవును. పూర్వము అతనిని ఎరిగియున్నవారు ఇప్పుడు అతడు ఏమయ్యెను' అని ప్రశ్నింతురు.

8. అతడు స్వప్నమువలె మరుగైపోవును. నిద్రలో కన్పించిన దృశ్యమువలె మాయమైపోవును

9. పూర్వము అతడినెరిగినవారు మరల అతనిని చూడజాలరు. అతడు వసించిన గృహమునను మరల అతనిని కాంచజాలదు.

10. అతని సంతతి పేదల దయను కాంక్షింతురు. వారి చేతులు అతని ఆస్తిని తిరిగి అప్పగించును.

11. పూర్వమతని శరీరము యవ్వనబలముతో విరాజిల్లినది. కాని ఇప్పుడది మన్నయి పోనున్నది,

12-13. దౌష్ట్యము అతనికి తీపిగా ఉండెను కనుక దానిని తన నాలుక క్రింద నానబెట్టుకొని జారిపోనీకుండ చప్పరించెను.

14. కాని ఆ భోజనము అతని ఉదరమునకు చేటు తెచ్చెను అది అతని కడుపులో సర్పవిషముగా మారిపోయెను

15. అతడు తాను మ్రింగిన సొత్తునంతటిని కక్కివేయవలసినదే. ప్రభువే అతనికి వాంతి పుట్టించి ఆ సొమ్మును కక్కించును.

16. అతడు నాగుపాము విషమును మ్రింగెను, కనుక విషసర్పము కాటువలన చచ్చితీరును.

17. అతడిక ఏరులైపారుచున్న పాలుతేనెలతో ప్రవహించు నదులనుగాని చూడజాలడు.

18. తాను సంపాదించిన సొత్తునంతటిని విడనాడవలసినదే. తాను కూడబెట్టిన సొమ్మును తాను అనుభవింపజాలడు

19. అతడు పేదలను పీడించి పిప్పిచేసెను. తాను కట్టని ఇండ్లను స్వాధీనము చేసికొనెను.

20. అతని దురాశకు అంతము లేదయ్యెను. కాని అతడు కూడబెట్టిన సొమ్ము ఇప్పుడతనిని రక్షింపజాలదు.

21. ఇప్పుడతనికి తినుటకు ఏమియు లేదు. అతని ఐశ్వర్యమంతయు మంటగలసి పోయినది

22. ఉచ్చదశనందుకొనినంతనే సంకటములు అతనిని చుట్టుముట్టినవి.

23. ప్రభువు కోపము అతనిమీద రగుల్కొనెను. ప్రభువు అతనిపై అమ్ములను ముమ్మరముగా రువ్వెను.

24. అతడు ఇనుపకత్తినుండి తప్పించుకొనినను, ఆ కంచువిల్లు వానిని పడగొట్టకమానదు.

25. అతని వీపున అమ్ము దిగబడును. మిలమిల మెరయు బాణపుమొన అతని పిత్తమున దిగబడును. అతడు భయభ్రాంతుడగును.

26. అతని ధననిధులను అంధకారము కమ్మివేయును. మెరపుతాకిడికి అతని ఇల్లు బుగ్గియగును.

27. ఆ దుర్మార్గుని పాపమును దివి బట్టబయలు చేయును అతడు ద్రోహియని భువిసాక్ష్యము చెప్పును.

28. ప్రభువు కోపము వరదవలె వచ్చి చుట్టుముట్టగా, అతని సంపదలన్ని కొట్టుకొనిపోవును.

29. దుర్జనునికి పట్టెడి దుర్గతి ఇట్టిది. ప్రభువతనికి విధించెడి శిక్ష ఇట్టిది.”