1. నా రోజులు ముగిసినవి, నా శ్వాసము మందగించినది. నాకు సమాధి సిద్ధముగా ఉన్నది.
2. ఎల్లరు నన్ను అపహాసము చేయుచున్నారు. వారికి నాపట్లగల అయిష్టమును, నేను గమనించితిని.
3. నాకు హామీగానుండువాడు ఎవడునులేడు కనుక ప్రభూ! నీవే నా పక్షమున హామీగా నిలువుము.
4. నీవు నా మిత్రుల బుద్ధిని మందగింపచేసితివి. వారు నన్ను అణగదొక్కకుండునట్లు చేయుము.
5. సొంతకుమారులు ఆకలితో అలమటించుచుండగా తండ్రి తన ఆస్తిని మిత్రులకు పంచియిచ్చినట్లయ్యెను.
6. ప్రజలెల్లరు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నా మొగముమీద ఉమ్మి వేయుచున్నారు.
7. ఏడ్చియేడ్చి నా కన్నులకు చీకట్లు క్రమ్ముచున్నవి. నా శరీరావయవములన్ని చిక్కి శల్యమైపోయినవి
8. దైవభక్తులము అనుకొనువారు నన్ను చూచి విస్తుపోవుచున్నారు. నేను పాపినని నన్ను నిందించుచున్నారు
9. ధర్మాత్ములు అనుకొనువారు నన్ను గూర్చిన తమభావనలే నిజమని రూఢిగా నమ్ముచున్నారు.
10. కాని వారెల్లరు నా సమక్షమునకు వచ్చినచో వీరిలో సుజ్ఞాని ఒక్కడు లేడని రుజువగును.
11. నా జీవితము నేను తలవని రీతిగా సాగిపోయినది నా హృదయతంత్రులు తెగిపోయినవి. ఆశయములు అణగారినవి.
12. చీకటి వ్యాపింపగా , వెలుగు సమీపించెననుచున్నారు వెలుతురు చీకటిని పారద్రోలునని జనులు చెప్పుదురు.
13. కాని నేను మాత్రము మృతలోకము చేరుకోవలసినదే. అచటి పెనుచీకటిలో నిదురింపవలసినదే.
14. నా సమాధి 'నాకు తండ్రి' అని, నన్ను తినివేయు పురుగులు 'నాకు తల్లి, తోబుట్టువులు' అని నేను చెప్పుకొందును
15. ఇక నాకు ఆశ ఎక్కడిది? నాకు మంచి రోజులున్నవని ఎవరైన ఊహింతురా?
16. ధూళిలో నిదురింపగా అది పాతాళపు , అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది”.