1. తరువాత యోబు ఇట్లనెను:
2. "ఇట్టి మాటలు నేను మునుపే వినియుంటిని. నాకు మీ వలన ఓదార్పు గాక బాధయే కలుగుచున్నది
3. ఎంత కాలము మీరీ అర్ధములేని పలుకులు వల్లించెదరు. కడన మీ వాదమునే నెగ్గించుకోవలెననియా మీ కోరిక?
4. నేను కూడ మీ స్థానములో నున్నచో మీవలె మాటలాడి ఉందును. మీవలె తల ఆడించి ఉందును. దీర్ఘవాదములతో మిమ్ము తికమకలు పెట్టి ఉందును
5. ఉపశమనవాక్యములతో మీకు ఉపదేశము చేసియుందును.
6. కాని, నేను మాటలాడినచో నా బాధ తగ్గదు. మౌనముగా ఉన్నను ఉపశాంతి కలుగదు.
7. ఇపుడు నా స్నేహితుడు నన్ను విసిగించుచున్నాడు. అతడు, అతని తోడివారు నన్ను హింసించుచున్నారు
8. నా దేహమంతయు ముడతలు పడునట్లు చేసియున్నావు ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది.
9. అతడు నా శరీరమును ముక్కలు ముక్కలుగా చీల్చివేసి, పండ్లు కొరకుచు నావైపు రౌద్రముగా చూచుచున్నాడు. నా శత్రువులు నాపై క్రూరచూపులను ప్రసరించుచున్నారు
10. వారెల్లరు ఏకమైనా చెంపలు వాయించుచున్నారు
11. ప్రభువు నన్ను దుర్మార్గుల వశముచేసెను. దుష్టుల చేతికి నన్ను చిక్కించెను.
12. నేను నిశ్చింతగా జీవించుచుండగా ప్రభువు నన్ను నేలకు విసిరికొట్టి ముక్కలుచేసెను. నా మెడపట్టి లాగి తన బాణములకు నన్ను గురిచేసెను.
13. ఆయన నలువైపులనుండి నా మీద అంబులు రువ్వి నిర్దయతో నన్ను తీవ్రముగా గాయపరచెను. నా పైత్యపు నీరు కారి నేలబడునట్లు చేసెను.
14. అతడు ప్రతిపక్ష యోధునివలె నామీద పడి నన్ను దెబ్బమీద దెబ్బకొట్టెను.
15. నేను దిగులుతో గోనె తాల్చితిని. ఓడిపోయి ఈ మంటిమీద బోరగిలబడితిని.
16. ఏడ్చి ఏడ్చి నా మొగము కందినది. నా కన్నులు వాచి నల్లబడినవి.
17. అయినను నేనేపాపము చేయలేదు. నా ప్రార్ధనలో చిత్తశుద్ధి లోపింపలేదు.
18. ఓ భూమీ! నా రక్తమును కప్పివేయకుము. న్యాయముకొరకు నేనుచేయు ఆక్రోశమును అణచివేయవలదు.
19. ఇకమీదట పరలోకమున నా పక్షమున ఒక సాక్షి నిలిచి ఉండి నన్ను సమర్థించి మాటలాడును.
20. నా కన్నులు అశ్రువులు కార్చుచుండగా నా ఆక్రోశమే న్యాయవాదియై దేవునియెదుట నన్ను సమర్ధించును,
21. నరుడు తన స్నేహితుని కొరకువలె నా కొరకు దేవునితో ఎవరైన మనవి చేసిన ఎంత బాగుండును!
22. నా కాలము సమీపించినది , నేను నరులు తిరిగిరాని చోటికి వెడలిపోనున్నాను