ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 15

 1. అటు పిమ్మట తేమాను వాసి అయిన ఎలీఫసు ఇట్లనెను:

2. “విజ్ఞాని అయినవాడు ఇట్టి వాదము చేయుచు వ్యర్థపు మాటలు వినియోగించునా?

3. తెలివిగల వాడెవడైన నీవలె నిరర్థక పదజాలముతో తననుతాను సమర్ధించుకొనునా?

4. నీకు దైవభయము లేదు. దేవునికి మొరపెట్టుకోవలెనన్న కోరికయు లేదు.

5. నీవు దోషివి కనుకనే ఇట్టి పలుకులు పలికి కపటముతో నీ తప్పును కప్పిపెట్టుకోగోరుచున్నావు

6. నేను గాదు, నీ మాటలే నీవు దోషివని నిరూపించుచున్నవి.

7. నీ పలుకులే నీకు వ్యతిరేకముగా సాక్ష్యమిచ్చుచున్నవి నీవు లోకములో మొట్టమొదట జన్మించిన నరుడవా? లేక దేవుడు పర్వతాలను సృజింపకముందే పుట్టినవాడవా?

8. నీవు దేవుని ఆలోచనకర్తలలో ఒకడవా? విజ్ఞానమునకు నీవే కాణాచిననుకొంటివా?

9. నీకు తెలిసినంత మాకును తెలియును. నీవు గ్రహించినంత మేమును గ్రహింతుము.

10. తల నరసిన ముదివగ్గులనుండియే మేము జ్ఞానమును ఆర్జించితిమి. వారు మీ తండ్రికంటె వయోవృద్ధులు సుమా!

11. ప్రభువు నీకు ఉపశాంతి నొసగగా నీవు కాదందువా? మేము నీతో ఎంత మృదువుగా సంభాషింపలేదు?

12. కాని నీవు కోపముతో మండిపోవుచున్నావు, మిడిగ్రుడ్లతో మా వైపు తేరిచూచుచున్నావు,

13. నీవు దేవునిమీద ఆగ్రహము తెచ్చుకొని ఇట్టి వాదములు చేయుచున్నావు.

14. అసలు ఏ నరుడు నిష్కళంకుడో చెప్పుము? నారికి జన్మించిన నరులలో పుణ్యశీలుడు ఎవడు?

15. ప్రభువు దేవదూతలనే నమ్మడు. దూతగణములే అతని కంటికి నిర్దోషములుగా కన్పింపవు.

16. అట్లయినచో పాపమును నీటినివలె మ్రింగివేయు దబ్బరజాతికి చెందిన నికృష్టమానవుడా అతని దృష్టిలో నిర్మలుడు?

17. ఓయి! నీవు నా సందేశమును ఆలకింపుము. నేను నా అనుభవమును చెప్పెదను.

18. విజ్ఞులు వారి పితరుల బోధలు నాకెరిగించిరి. ఆ ఉపదేశములనే నేను నీకు విన్పించెదను.

19. వారికాలమున అన్యదేశీయులు మన నేలమీద వసింపలేదు. ఈ దేశమున వారు మాత్రమే వారసముగా నివసించిరి.

20. దుర్మార్గుడు నిరంతరము బాధలను అనుభవించును పరపీడకుడు జీవితాంతము వేదనలకు గురియగును.

21. అనవరతము భీకరధ్వనులు అతని చెవులలో మారుమ్రోగును. తాను సురక్షితముగా ఉన్నానని తలంచినపుడే దోపిడిగాండ్రువచ్చి అతనిమీద పడుదురు.

22. అతడిక చీకటినుండి తప్పించుకోజాలడు. తాను కత్తివాత బడుదునని గ్రహించును.

23. 'ఆహారమెక్కడ దొరకునా'యని అతడు దాని కొరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియును.

24. దురదృష్టములు, వేదనలు అతనిని భయపెట్టును వినాశము బలాఢ్యుడైన రాజువలె అతని మీదికెత్తి వచ్చును.

25. ఆ దుర్మార్గుడు ప్రభువు నెదిరించి ఆయనను సవాలు చేసెను.

26. దళసరి డాలు చేతబూని ప్రభువు మీదికి పోరాటమునకు వచ్చెను.

27. వాని ముఖము క్రొవ్వు పట్టి ఉన్నది. వాని నడుముచుట్టు క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి

28. అతడు నగరములను పట్టుకొని యజమానులు వీడిపోయిన గృహములను స్వాధీనము చేసికొనెను. కాని ఈ నగరములును, గృహములును నేలమట్టమగును.

29. అతని సంపదలు దీర్ఘకాలము నిలువవు. అతని ఆస్తిపాస్తులు మంట గలిసిపోవును. అతడి పొలము పంటతో బరువెక్కి నేలకు వంగదు.

30. అతడు చీకటిని తప్పించుకొనడు. అగ్నిజ్వాల అతని లేతకొమ్మలను దహించును. అతని చిగురులు గాలిచే రాలిపోవును.

31. అతడు స్వీయబలమును నమ్ముకొనెనేని ఆ నమ్మకము వ్యర్థమే అగును.

32. అతడు తన ఆయుస్సు తీరకముందే వాడిపోయిన కొమ్మవలె ఎండిపోవును. ఆ కొమ్మ మరల చిగురింపనేరదు.

33. అతడు పిందె రాలిపోయిన ద్రాక్షతీగవంటివాడును, పూత రాలిపోయిన ఓలివుచెట్టు వంటివాడును అగును.

34. దుర్మార్గుల సంతానము వృద్ధి చెందదు. లంచములతో కట్టిన ఇండ్లు మంటలలో కాలిపోవును

35. దుష్టులు దురాలోచనతో దుష్కార్యములు చేయుదురు వారి యెదలో కపటము గూడుకట్టుకొని ఉండును.”