1. ఈ సంగతులెల్ల నేను కన్నులార చూచియు చెవులార వినియు తెలిసికొంటిని.
2. మీరెరిగిన అంశములు నేను ఎరుగుదును. నేను మీ కంటే తక్కువవాడనేమి కాదు.
3. కాని నేను మీతోగాక దేవునితో మాట్లాడగోరెదను. నేను వాదింపగోరినది ప్రభువుతోనే.
4. మీరు అబద్దాలతో మీ వాదనలను సమర్థించుకొనుచున్నారు. వ్యాధులను కుదర్పలేని వైద్యుల వంటివారు మీరు.
5. మీరిక నోరు మూసికొనినచో బాగుగానుండును. మౌనమే మీకు విజ్ఞతయగునుగాక!
6. మీరిక నా వాదమును వినుడు. నా పెదవుల మనవుల నాలకింపుడు.
7. మీరు మీ మిథ్యావచనములతో దేవుని తరపున వాదింపనక్కరలేదు.
8. పక్షపాత బుద్ధికలవారు ఆయన క్షమున న్యాయవాదులుగా వ్యవహరింపగలరా?
9. ఆయన మీ లోగుట్టును తెలిసికోలేడా? నరులనువలె దేవుని వంచింపగలమా?
10. మీరు రహస్యముగా పక్షపాతము చూపించినచో ప్రభువు మిమ్ము తీవ్రముగా మందలించును.
11. ఆయన వైభవమును చూచి మీరు భయభ్రాంతులై భీతితో కంపించిపోవుదురు
12. మీ విజ్ఞానసూక్తులు బూడిదవలె విలువ లేనివి. మీ వాదములు మట్టివలె బలము చాలనివి.
13. మీరిక మౌనము వహించి నన్ను మాటాడనిండు. నాకు జరగబోవునది జరుగును గాక!
14. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను ఈ పట్టున ప్రాణములు ఒడ్డుటకు నేను వెనుకాడనుగాని ప్రాణములకు తెగించి మాట్లాడుదును.
15. నేను ఆశలనెల్ల విడనాడితిని. దేవుడు నన్ను చంపిన చంపుగాక! ఆయన ముందు నేను నిర్దోషినని మాత్రము నిరూపించుకొందును.
16. దైవభక్తిలేని వాడెవడును దేవుని ఎదుటికి రాజాలడు కనుక నా ఈ సాహసము నన్ను రక్షించిన రక్షింపవచ్చును.
17. మీరు నా మాటలు ఆలకింపుడు. నా పలుకులు సావధానముగా వినుడు.
18. నేను నిరపరాధినన్న నమ్మకము నాకు ఉన్నది కనుక నా అభియోగమును విన్నవించుకొందును.
19. దేవుడు నా మీద నేరము మోపుటకు వచ్చిన రానిండు. మౌనముగా ప్రాణములు త్యజించుటకు నేను సంసిద్దుడనే.
20. ప్రభూ! నీవు నాకు రెండు వరములు దయచేయుము. నేను నీనుండి దాచి పెట్టునది ఏమియులేదు.
21. మొదట నీవు నన్ను బాధించుట మానుకొనుము. నీ భయమును నాయొద్దనుండి తొలగింపుము.
22. ఆ పిమ్మట నీవు నన్ను ప్రశ్నింపుము. నేను నీకు బదులు చెప్పెదను. లేదా నేనే నిన్ను ప్రశ్నింతును, నీవు నాకు బదులు చెప్పుము.
23. నేనేమి తప్పులు చేసితిని? ఏమి పాపములు కట్టుకొంటిని? ఏ అపరాధములు సల్పితిని? ఏ ఆజ్ఞలు మీరితిని?
24. నీవు ఇపుడు మొగము చాటుచేసికోనేల? నన్ను నీ శత్రువునిగా భావింపనేల?
25. గాలికెగిరిపోవు ఈయాకునా నీవు భయపెట్టునది? ఎండిపోయిన ఈ తాలునా నీవు వెంటాడునది?
26. నేను బాలుడిగా ఉన్నప్పుడు చేసిన పాపములకు నీవు నామీద ఘోరమైన నేరములుమోపుచున్నావు
27. నీవు నా పాదములను బండకొయ్యలో బిగించితివి. నేను పోవు మార్గములను, నా అడుగుజాడలను గుర్తుపట్టితివి.
28. నేను చివికిపోయిన కొయ్యవలెను, చిమ్మటలు కొట్టిన వస్త్రములవలెను తుత్తునియలు అయితిని. నా ప్రవర్తననంతయు నీవు గిరిగీసి కనిపెట్టుచున్నావు