ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 12

 1-2. తరువాత యోబు ఇట్లనెను; “ఓయి! లోకములోని నరుల భావములే నీనోట వచ్చుచున్నవి అసలు విజ్ఞానము నీతోనే అంతరించునేమోనని అన్పించుచున్నది

3. నాకుకూడ నీపాటి తెలివితేటలున్నవి. నేను నీకంటె తక్కువవాడను కాను. నీవు చెప్పిన సంగతులెల్లరికిని తెలిసినవే.

4. నా స్నేహితులిపుడు నన్ను చూచి నవ్వుచున్నారు. నేను నిర్దోషినైనప్పటికీ నవ్వులపాలయితిని. అంకాని పూర్వము దేవుడు నా మొర ఆలకించెను.

5. నీకు చీకుచింతలేదు కనుక నన్ను గేలిచేయుచున్నావు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.

6. కాని లోకములో దోపిడిమూకలు హాయిగా బ్రతుకుచున్నవి. దేవుని లక్ష్యపెట్టనివారు సురక్షితముగా జీవించుచున్నారు. వారెల్లరు తమ స్వీయశక్తియే తమకు దేవుడనుకొందురు.

7. నీవింకను తెలిసికోగోరెదవేని మృగములను అడుగుము. పక్షుల నడుగుము అవియెల్ల నీకు నేర్పును.

8. నేలనడిగిన నీకు బోధచేయును. సముద్రమునందలి చేపలు నీకు పాఠము చెప్పును

9. ప్రభువే తమను చేసెనని ప్రాణులకెల్ల తెలియును

10. జీవించు ప్రతి ప్రాణి ప్రాణము, ప్రతి నరుని ఊపిరి, ఆయన ఆధీనములో ఉన్నది.

11. జిహ్వ భోజనపు రుచివలన సంతసించినట్లే శ్రవణము వినికిడివలన సంతుష్టిచెందును.

12. వృద్ధులు విజ్ఞానమును ఆర్జింతురు. పెద్ద ప్రాయమువలన వివేకము పుట్టును.

13. కాని దేవునియందు విజ్ఞానమును,శౌర్యమును కలదు ఆయన వివేకవంతుడు క్రియాపరుడుకూడ.

14. ఆయన కూలద్రోసిన ఇంటినెవ్వరు తిరిగి కట్టజాలరు. ఆయన చెరగొనిన నరునెవ్వరు విడిపింపజాలరు

15. ఆయన వానలను ఆపివేయగా అనావృష్టి కలుగుచున్నది. జలములను వదలివేయగా వరదలు వచ్చి నేలను పాడుచేయును.

16. ఆయన బలాఢ్యుడు విజేతకూడ, మోసగాడు, మోసమునకు గురియైనవాడుకూడ ఆయనకు లొంగుదురు.

17. ఆయన సలహాదారుల తెలివిని వమ్ముచేయును. న్యాయాధిపతులను మూర్ఖులను చేయును.

18. రాజులను కూలద్రోసి బందీలను చేయును.

19. యాజకులకు తలవంపులు తెచ్చును. ఆ బలాడ్యులను లొంగదీసికొనును.

20. మాటకారులను మూగలను చేయును. వృద్ధులు వివేకమును కోల్పోవునట్లు చేయును.

21. అభిజాత్యము కలవారిని మన్ను గరపించును. రాజుల బలము గాలికి పోవునట్లు చేయును.

22. అగాధములలోని తమస్సులను తొలగించును. జ్యోతిని గాఢాంధకారముతో కప్పివేయును.

23. జాతులను వృద్ధిలోనికి తెచ్చి మరల జారవిడుచును ప్రజలకు పెంపుదయచేసి తిరుగచేయి విడుచును

24. దేశనాయకులకు బుద్ధిమాంద్యము కలిగించి, వారు దారులులేని ఎడారులలో తిరుగాడునట్లు

25. వెలుతురులేని చీకటితావులలో కొట్టుమిట్టాడునట్లు తప్పత్రాగినవారివలె తూలిపడిపోవునట్లు చేయును