1. అటు పిమ్మట నామా దేశీయుడు సోఫరు ఇట్లనెను:
2. "అయ్యా! నీ పలుకులకు జవాబులేదనుకొంటివా? అతిగావాగివాని వాదమే ఒప్పుకానక్కరలేదు కదా?
3. నీ ప్రలాపములు ఆలించి ఊరకుండుటకు మేమేమి మూగవారలమా? నీ అపహాసవాక్యములను మేము ఖండింప లేమనుకొంటివా?
4. 'నా పలుకులు సత్యములని దేవుని దృష్టిలో నేను పవిత్రుడననియు' అని నీవు వాదించుచున్నావు.
5. కాని దేవుడు నోరు విప్పి నీకు బదులు చెప్పినచో విజ్ఞాన మర్మములు నీకు తెలియజేసినచో,నీ తెలివితేటలు ఎందుకు కొరగాకుండబోవును
6. నీ తప్పిదములకుగాను అతడు నిన్ను లెక్క అడుగునని నీవు గ్రహింతువు.
7. అసలు నీవు దేవుని మర్మమును గ్రహింపగలవా? ఆయన మహాత్మ్యమును తెలిసికోగలవా?
8. అది ఆకాశముకంటె ఉన్నతమైనది. నీవు దానినెట్లు గ్రహింతువు? పాతాళముకంటె గంభీరమైనది. నీవు దానినెట్లు గుర్తింతువు?
9. అది పుడమికంటెను నిడువైనది. సాగరముకంటెను విశాలమైనది.
10. దేవుడు నిన్ను తీర్పుకు రమ్మని పిల్చినచో ఆయనను ఎవరు వారింపగలరు?
11. దేవుడు నరుని కోరగాని తనమును ఎరుగును. మనుషుని దోషములను బాగుగా గుర్తించును.
12. అయితే అడవి గాడిదపిల్ల నరుడై, పుట్టవచ్చునేమోగాని, బుద్దీహీనుడు వివేకికాడు.
13. ఓయి! నీవు నీ హృదయమును సరిదిద్దుకొని ఆ ప్రభువు ముందు చేతులు జోడింపుము.
14. నీ దోషమును విడనాడుము. అధర్మమును నీ ఇంటినుండి వెడలింపుము.
15. అప్పుడు నీవెట్టి భయమునకు గురికాక, లోకమందు తలయెత్తుకొని తిరుగుదువు.
16. అప్పుడు దాటిపోయిన వరదలవలె నీ వ్యధలను విస్మరింపగలుగుదువు.
17. నీ జీవితము మిట్టమధ్యాహ్నపు సూర్యతేజమువలె ప్రకాశించును. తమస్సులు విచ్చిపోయి, ఉషోదయము ప్రాప్తించును
18. నీవు నమ్మకముతో భద్రముగా బ్రతుకుదువు. ప్రభువు నిన్ను సురక్షితముగా కాపాడును.
19. ఇక శత్రువు లెవరు నిన్ను భయపెట్టజాలరు. ఎల్లరు నీ మన్ననల నాశింతురు.
20. కాని దుర్మార్గులు మాత్రము నలువైపులు పరికించి తప్పించుకొనుమార్గము లేదని గ్రహించి చావుకు సంసిద్ధులగుదురు.”