ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 10

 1.నాకు జీవితము మీద విసుగు పుట్టినది. మిత్రమా! నీవు నా మొరలాలింపుము. నేను నా ఆవేదన కొలది మాటలాడెదను. నేను దేవునితో ఇట్లు పలుకుదును:

2. "ప్రభూ! నీవు నన్ను దోషిగా నిర్ణయింపవలదు. అసలు నా అపరాధమేమిటో తెలియజెప్పుము.

3. నీవు స్వయముగా కలిగించిన నన్ను అనాదరముచేసి ఇప్పుడు ఈ రీతిగా బాధించుట న్యాయమా? నీవు దుర్మార్గుల పన్నాగములను అనుమతింతువా?

4. నీ కన్నులు మా కన్నుల వంటివేనా? నీవు నరులు చూచిన చూపున చూతువా?

5. నీ జీవితము నరుల జీవితమువలె హ్రస్వకాలికమైనదా? నీ రోజులు నరుల రోజులవలె సాగిపోవునవా?

6. కానిచో నీవు నా దోషములను విచారింపనేల? నా అపరాధములను గాలింపనేల?

7. నేను నిర్దోషినని, నీ చేతినుండి నన్నెవరు విడిపింపలేరని నీవెరుగుదువు.

8. నీవే నన్ను సృజించి నాకు ఈ రూపము నిచ్చితివి కాని నీవే నన్నిపుడు నాశనము చేయబూనితివి.

9. నీవు నన్ను మట్టినుండి మలిచితివి. తిరిగి నన్ను మట్టిపాలు కావింతువా? "

10. పాలనుండి వెన్న ఏర్పడినట్లుగా నీవు నన్ను మాతృగర్భమున రూపొందించితివి.

11. నీవు నాకు వస్త్రమువలె చర్మము తొడిగితివి. ఎముకలతో, నరములతో నన్ను బట్టవలె నేసితివి

12. అటుపిమ్మట నాకు ఊపిరి పోసి ప్రేమతో నన్ను పరామర్శించితివి.

13. కాని ఇంత చేసియు నీవు మోసముతో వర్తించి, నాకు హానిచేయుటకు సమయము కొరకై వేచియుంటివని ఇప్పుడు నేను గుర్తించితిని.

14. నేను పాపము చేసినచో, ఆ నాకు క్షమాభిక్ష నిరాకరింపవచ్చునని, నీవు కనిపెట్టుకొనియుంటివి.

15. కనుక నేను తప్పుచేసినచో సర్వనాశనమయ్యెదను నేను నీతిమంతుడనైనను తలెత్తుకోలేకున్నాను. నేను బాధావమానములతో క్రుంగిపోవుచున్నాను

16. నేనొకవేళ తల ఎత్తుకొని తిరిగినా నీవు సింహమువలె నన్ను వేటాడి  నీ విజయములను హెచ్చించుకొందువు

17. నీవు నామీదకు మరలమరల దాడిచేసి నన్ను దెబ్బమీద దెబ్బకొట్టుదువు

18. నీవసలు నన్ను మాతృగర్భమునుండి వెలికితీయనేల? నేనపుడే చనిపోయినచో నన్నెవరు చూచియుండెడివారుకారు.

19. నేను మాతృగర్భమునుండే నేరుగా సమాధి కేగినచో, అసలు జన్మింపకనే ఉండెడివాడనుకదా?

20. నా రోజులు ముగియనే ముగిసినవి. నీ చూపునిక నా నుండి మరల్పుము. ఈ మిగిలిన స్వల్పకాలమైన, నేను కొంచెము ఊరడిల్లెదను.

21. నేనిక నరులు తిరిగిరాని చోటికి వెళ్ళిపోయెదను. అంధకార విషాదములు అలముకొనిన తావును చేరుకొందును. 

22. అచట కటికచీకటి, నీడలు గందరగోళము ఉండును వెలుతురు కూడ గాఢ తమస్సువలె ఉండును.”