ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 1

 1. ఊజు దేశమున యోబు అను పేరుగల నరుడొకడు ఉండెడివాడు. అతడు ఋజువర్తనుడును, న్యాయవంతుడును మరియు దేవునిపట్ల భయభక్తులు కలిగి, పాపమునకు దూరముగా ఉండువాడు.

2. అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కలిగిరి.

3. అతనికి ఏడువేల గొఱ్ఱెలు, మూడువేల ఒంటెలు, ఐదు వందల జతల ఎద్దులు, ఐదువందల ఆడుగాడిదలు, చాలమంది సేవకులుండిరి. తూర్పు దేశీయులందరికంటే అతడు మహాసంపన్నుడు.

4. యోబు కుమారులు తమ ఇండ్లలో వంతులవారిగా విందులు ఏర్పాటు చేసెడివారు. వారు ఆ విందులను తమ ముగ్గురు ఆడు తోబుట్టువులతో కలిసి అన్నపానీయములు ఆరగించుటకు ఆహ్వానించెడివారు.

5. వారివారి విందుదినములు ముగియగనే యోబు కుమారులను పిలిపించి శుద్ధిచేయించెడివాడు. వేకువనే లేచి ఒక్కొక్కపుత్రుని కొరకు దహనబలిని అర్పించి, ఒకవేళ తన కుమారులు పొరపాటున దేవుని నిందించి పాపము కట్టుకొనిరేమోయని భయపడి, వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెడివాడు. ఇట్లు యోబు ఎల్లప్పుడును చేయుచుండెడివాడు.

6. ఒక దినము దేవదూతలు దేవుని సమక్షమునకు వచ్చిరి. వారితోపాటు సాతానుకూడ వచ్చెను. వచ్చిరి. వారితోపాటు సాతానుకూడ వచ్చెను.

7. దేవుడు సాతానుని నీవు ఎక్కడనుండి వచ్చితివి అని అడుగగా అతడు నేను భూలోకమున అటునిటు సంచారము చేసి వచ్చితిని అని ప్రత్యుత్తరమిచ్చెను.

8. దేవుడతనితో “నీవు నా సేవకుడైన యోబును చూచితివా? అతడు ఋజువర్తనుడును, న్యాయవంతుడును మరియు దేవునిపట్ల భయభక్తులు కలిగి, పాపమునకు దూరముగా ఉండువాడు. అట్టివాడు మరియొకడు భూలోకమునలేడు” అనెను.

9. అతని గురించి నీవెప్పుడైనా ఆలోచించితివా? అని అడుగగా, సాతాను దేవునితో "యోబు ఉట్టినే దేవుని యందు భయభక్తులు చూపువాడా?

10. నీవు అతనికిని, అతని కుటుంబమునకును, అతని సిరిసంపదలకును చుట్టు కంచెవేసి కాపాడుచున్నావు కదా? నీవు అతడు చేపట్టిన కార్యములనెల్ల దీవించుటచే, అతనికున్నదెల్ల దేశములో బహుగా వృద్ధిచెందినది.

11. అయినను నీవు ఇపుడు నీ చేయిచాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినచో, నీ ముఖముననే నిన్ను దూషించి నిన్ను విడనాడును” అని పలుకుగా

12. దేవుడు సాతానుతో “సరియే, అతనికి కలిగిన సమస్తమును నీ ఆధీనమున నున్నది. నీవు మాత్రము అతనిమీద చేయిచేసికోవలదు” అని చెప్పెను. అంతట సాతాను దేవునిసన్నిధినుండి వెడలి పోయెను.

13. ఒక దినము యోబు కుమారులు, కుమార్తెలు వారి పెద్దన్న ఇంట విందును ఆరగించుచు ద్రాక్షసారాయములను సేవించుచుండిరి.

14. అప్పుడు సేవకుడొకడు యోబు చెంతకు వచ్చి "అయ్యా! నీ ఎడ్లు పొలము దున్నుచున్నవి. వాని ప్రక్కనే నీ గాడిదలు మేయుచున్నవి.

15. ఇంతలో షబాయీయులు వచ్చి పడి ఆ పశువులన్నిటిని తోలుకొనిపోయిరి. వారు నీ సేవకులనెల్ల ఖడ్గములతో పొడిచి చంపివేసిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకు ఈ సంగతి చెప్పుచున్నాను” అనెను.

16. అతడు తన మాటలను ముగించెనో లేదో మరియొక సేవకుడు వచ్చి "అయ్యా! ఆకాశము నుండి ఒక మెరపువచ్చి నీ గొఱ్ఱెలను వాని కాపరులను కాల్చి వేసినది. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకు ఈ వార్త తెలుపుచున్నాను” అని పలికెను.

17. అతడు తన మాటలను ముగింపకమునుపే వేరొక సేవకుడు వచ్చి “అయ్యా! కల్దీయులు మూడుదండులుగా వచ్చి నీ ఒంటెలమీదపడి వానిని అపహరించుకొనిపోయిరి. వారు నీ సేవకులను కూడ కత్తులతో పొడిచి చంపి వేసిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకు ఈ విషయమును తెలియజేయుచున్నాను" అని పలికెను.

18. అతడు తన పలుకులను ముగింపక పూర్వమే ఇంకొక సేవకుడు వచ్చి “అయ్యా! నీ కుమారులు, కుమార్తెలు వారి పెద్దన్న ఇంట విందారగించుచు ద్రాక్షసారాయమును సేవించుచుండిరి.

19. అంతలో ఎడారినుండి ఒక ప్రచండమైన సుడిగాలివచ్చి ఆ ఇంటి నాలుగుమూలలను బాదెను. ఇల్లుకూలి యువకుల మీద పడగా వారందరును చనిపోయిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకు ఈ సంగతి విన్నవించుకొనుచున్నాను” అని పలికెను.

20. ఆ మాటలు విని యోబు లేచి సంతాప సూచకముగా పై వస్త్రమును చించుకొనెను. తల గొరిగించుకొనెను. నేలపై బోరగిలపడి దేవునికి దండము పెట్టి:

21. “నేను దిగంబరుడనుగానే తల్లి కడుపు నుండి వెలువడితిని, దిగంబరుడనుగానే ఇచ్చటి నుండి వెడలిపోయెదను. ప్రభువు ఇచ్చెను, ప్రభువే తీసుకొనెను. ప్రభువు నామమునకు స్తుతి కలుగునుగాక!” అని పలికెను.

22. ఇన్ని దురదృష్టములును వాటిల్లి నను యోబు ఏ పాపమును కట్టుకొనలేదు, దేవుడు అన్యాయము చేసెను అని పెదవులతో సైతము పలుకలేదు.