1. తోబీతునైన నా గాథ యిది. మా తండ్రి, తాతలు క్రమముగా తోబియేలు, అనానీయేలు, అదూవేలు, గబాయేలులు. వారు నఫ్తాలి తెగకు చెందిన అసీయేలు సంతతివారు.
2. నేను అస్సిరియా రాజైన షల్మనేసరు కాలమున తిష్బేనుండి బందీగా కొనిరాబడితిని. ఈ నగరము గలిలీయసీమ ఉత్తర భాగముననున్నది. మరియు అది నఫ్తాలి మండలములోని కాదేషునకు దక్షిణమున హాసోరునకు ఎగువగా, షేపటునకు ఉత్తరమున ఉన్నది.
3. తోబీతునైన నేను నా జీవితమందు ఎల్లపుడును ధర్మమును పాటించుచు సత్కార్యములు చేయుచు వచ్చితిని. నా వలెనె నీనెవె పట్టణమునకు ప్రవాసులుగా కొనిరాబడిన తోటియూదులకు, మా బంధువులకు నేను మిక్కిలిగా దానధర్మములు చేసితిని.
4. నేను బాలుడనుగా ఉండినపుడు మా యిస్రాయేలు దేశమున వసించితిని. అప్పుడు మా నఫ్తాలి తెగవారందరును యెరూషలేము నగరమును, దావీదు వంశరాజులను తిరస్కరించిరి. కానీ ప్రభువు యిస్రాయేలు నగరములన్నిటిలో ఆ యెరూషలేము నగరముననే తన శాశ్వత నివాసమునకుగాను పవిత్ర మందిరమును నిర్మింపగోరెను. యిస్రాయేలీయులు ఎల్లరును ఏ తావుననే బలులను అర్పింపవలెను.
5. అయినను నఫ్తాలి తెగకు చెందిన ఎల్లప్రజలవలె, మా కుటుంబము వారును, గలిలీయలోని ప్రతి కొండకు ఎగువన యిస్రాయేలు రాజు యరొబాము దాను నగరమున నెలకొల్పిన దూడ విగ్రహములకు బలులు అర్పించెడివారు. ధర్మశాస్త్రము ప్రకారము యిస్రాయేలీయులెల్లరు పండుగలలో పాల్గొనుటకు యెరూషలేమునకు పోవలెను. ఇది నిత్యవిధి.
6. కాని తరచుగా నేనొక్కడినే అచటికి యాత్ర చేసెడివాడను. మా పొలమున పండిన ప్రథమపంటను, మా గొడ్లు ఈనిన తొలిచూలు పిల్లలను, మా పశువులలో పదియవవంతును, మా గొఱ్ఱెల నుండి కత్తిరించిన ప్రథమఉన్నిని తీసుకొని నేను త్వరత్వరగా యెరూషలేమునకు ప్రయాణము చేసెడివాడను.
7. అచటి దేవాలయమునందు, బలిపీఠము ముందట నిలిచి ఈ కానుకలనెల్ల అహరోను వంశజులైన యాజకులకు అర్పించెడివాడను. యెరూషలేమున దేవుని సేవించు లేవీయులకు నా ధాన్యమునందు, ద్రాక్షసారాయము నందు, ఓలివు తైలమునందు, దానిమ్మలు, అంజూరములు మొదలైన ఫలములందు పదియవవంతు సమర్పించెడివాడను. ఒక్క యేడవయేడు తప్ప, ప్రతి ఆరేండ్లు నాకు పండిన పంటలో ఇంకొక పదియవవంతు గూడ విక్రయించి ఆ సొమ్మును యెరూషలేమున ఉత్సవభోజనమునకు వినియోగించెడివాడను.
8. ప్రతి మూడవయేడు నా పంటలో వేరొక పదియవ వంతును గూడ గొనివచ్చి యెరూషలేమున వితంతువులకు, అనాథలకు యిస్రాయేలీయుల మధ్య వసించు విదేశీయులకు కానుకగా ఇచ్చెడివాడను. వారును, నేనును కలిసే ఉత్సవ భోజనము భుజించెడివారము. నేను మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈ కార్యములెల్లచేసితిని. మా తండ్రి అనానీయేలును, తల్లి దెబొరాకూడ ఇట్టి కార్యములు చేయవలెనని నాతో చెప్పెను. (చిన్ననాడే మా తండ్రి చనిపోయినందున నేను అనాథనైతిని)
9. నేను పెరిగి పెద్దవాడనైన పిదప అన్నా అను మా తెగపిల్లనే పెండ్లియాడితిని. మాకొక బిడ్డడు కలుగగా వానికి తోబియా అని పేరు పెట్టితిమి.
10. తరువాత మమ్ము అస్సిరియా ప్రవాసమునకు కొనివచ్చినపుడు నన్ను నీనెవెకు తీసికొని వచ్చిరి. అచట మా బంధువులు, తోటి యూదులు ఆ దేశీయులు భుజించు ఆహారమునే తినెడివారు.
11. కాని నేను మాత్రము వారి కూడు ముట్టుకొనలేదు.
12. నేను సర్వోన్నతుడైన ప్రభువు ఆజ్ఞలను నిండు హృదయముతో పాటించితిని.
13. కనుక ఆ ప్రభువు నేను షల్మనేసరు దయకు నోచుకొనునట్లు చేసెను. ఆ రాజు తనకు వలసిన వస్తుసంభారములు కొనుటకు నన్ను నియమించెను.
14. అతడు చనిపోవువరకు నేను మాదియా దేశమునకు ప్రయాణము చేయుచు, అచట అతనికి కావలసిన పదార్థములు కొనెడివాడను. ఒకసారి నేను మాదియాలోని రాగీసు పట్టణమునకు పోయినపుడు గాబ్రియాసు సోదరుడైన గబాయేలు ఇంట పదిసంచుల వెండినాణెములు దాచితిని.
15. షల్మనేసరు చనిపోయిన పిదప అతని కుమారుడు సన్హరీబు రాజయ్యెను. తరువాత మాధియాకు ప్రయాణముచేయుట సులభము కానందున నేనచటికి వెళ్ళనే లేదు.
16. షల్మనేసరు బ్రతికియున్న కాలమున నేను మా జాతివారికి పెక్కుదానధర్మములు చేసితిని.
17. వారు ఆకలిగొని వచ్చినపుడు నేను వారికి భోజనము పెట్టెడివాడను. బట్టలు లేనివారికి బట్టలు ఇచ్చెడివాడను. నీనెవె పౌరులు మా జాతివారి శవములను పట్టణ ప్రాకారము వెలుపల పడవేసినపుడు నేను వానిని పాతి పెట్టెడివాడను.
18. సన్హరీబు యూదా మీదికి దాడి చేసినపుడు ఆకాశమందలి ప్రభువును దూషింపగా, ఆయన ఆ రాజును శిక్షించెను. కనుక సన్హరీబు యూదాను విడిచి రావలసి వచ్చెను. అట్లు తిరిగివచ్చినపిదప అతడు కోపావేశముతో చాలమంది యిస్రాయేలీయులను సంహరించెను. నేను వారి శవములను రహస్యముగా కొనిపోయి పాతి పెట్టితిని. అటు తరువాత రాజు ఆ శవముల కొరకు గాలింపగా అవి అతనికి దొరకలేదు.
19. అప్పుడు నీనెవె పౌరుడొకడు రాజు చంపించిన వారి శవములను రహస్యముగా పాతి పెట్టినది నేనేయని అతనితో చెప్పెను. నేను ఆ సంగతి తెలిసికొంటిని. రాజభటులు నా ప్రాణములు తీయుటకు నా కొరకు గాలించుచుండిరి. కనుక నేను భయపడి నీనెవెనుండి పారిపోతిని.
20. వారు నా సొత్తునంతటిని స్వాధీనము చేసికొని, రాజు కోశాగారమునకు అప్పజెప్పిరి. ఇక నా భార్య అన్నా నా కుమారుడు తోబియా తప్ప నాకేమియు మిగులలేదు.
21. తరువాత ఏబది దినములు గడువకముందే సన్హరీబు కుమారులిద్దరు తమ తండ్రిని హత్యచేసి అరారతు కొండలకు పారి పోయిరి. సన్హరీబు తనయుడు ఏసర్హద్ధోను తండ్రికి బదులు రాజయ్యెను. ఆ రాజు నా సోదరుడైన అనాయేలు కుమారుడగు అహీకారును, తన రాజ్యమున ఆర్ధిక వ్యవహారములను పరిశీలించు అధికారిగా నియమించెను.
22. అతడు సన్హరీబునకు గూడ గృహ నిర్వాహకుడు, కోశాధికారి, లేఖకుడు, ముద్రాధికారి. కనుక ఏసర్హద్ధోను గూడ అతనిని పూర్వ పదవిలో కొనసాగనిచ్చెను, నా సోదరుని తనయుడు ఈ అహీకారు నా తరపున రాజునకు మనవిచేయగా నన్ను తిరిగి నీనెవెకు రానిచ్చిరి.
1. ఆ రీతిగ ఏసరద్రోను పరిపాలనా కాలమున నేను మరల ఇల్లు చేరుకొంటిని. నా భార్య అన్నా, నా కుమారుడు తోబియాకూడ నాయొద్దకు తిరిగివచ్చిరి. ఏబదినాళ్ళకు వచ్చు పెంతెకొస్తు అనువారముల పండుగకు మేము మంచివిందు సిద్ధము చేసికొంటిమి. నేను భోజనము చేయనెంచితిని.
2. బల్లమీద చాల భోజన పదార్దములు కనిపించినవి. నేను, నా కుమారుడు తోబియాతో “నాయనా!నీవు బయటికి వెళ్ళి మనవలె ఈ పట్టణమున ప్రవాసమున జీవించుచున్న పేద యిస్రాయేలీయుని ఒకనిని తోడ్కొని రమ్ము. కాని అతడు దేవునిపట్ల భయభక్తులు చూపువాడై ఉండవలెను. అతనిని మనతో కలుపుకొని భుజింతము. నీవు వచ్చువరకు నేను వేచియుందును” అని చెప్పితిని.
3. తోబియా పేదవానిని వెదకి తీసికొనిరాబోయెను కాని అతడు కొంచెము సేపటిలోనే తిరిగివచ్చి 'నాయనా! నాయనా!” అని పిలిచెను. నేను ఏమి జరిగినదని అడిగితిని. అతడు “మన జాతివానినొకనిని ఇప్పుడే గొంతు పిసికి చంపి సంతవీధిలో పడవేసిరి” అని చెప్పెను.
4. నేను భోజనము ముట్టుకొనకుండ వెంటనే లేచి వెళ్ళితిని. సంతనుండి శవమును తీసికొనివచ్చి ఒక పాకలో ఉంచితిని. సాయంకాలమైన పిదప దానిని పాతి పెట్టవచ్చును అనుకొంటిని.
5-6. తరువాత ఇంటికివచ్చి స్నానముచేసి శుద్ధిని పొందితిని. పిమ్మట విచారముతో విందు ఆరగించితిని. అప్పుడు ఆమోసు ప్రవక్త బేతేలును గూర్చి, “నీ పండుగలు శోకదినములగును. నీ ఆనందగీతములు శోకగీతములగును” . అని పలికిన వాక్యము నాకు జ్ఞప్తికి వచ్చెను. నేను దిగులుతో ఏడ్చితిని.
7. ప్రొద్దుగ్రుంకిన తరువాత గోతిని త్రవ్వి శవమును పాతిపెట్టితిని.
8. ఇరుగు పొరుగువారు నన్ను పరిహాసము చేసి “నీకే మాత్రము భయములేదా? పూర్వము నీవిట్టి పనిని చేసినందుకు వారు నీ ప్రాణములు తీయగోరిరి కదా! నీవప్పుడు పారిపోయి ప్రాణములు రక్షించుకొంటివి. అదరు బెదరు లేక ఇప్పుడు మరల శవములను పాతిపెట్టుచున్నావా?" అనిరి.
9. ఆ రాత్రి నేను స్నానము చేసి శుద్ధినిపొంది మా ఇంటి ముంగిట గోడ ప్రక్కన పడుకొంటిని. వాతావరణము వేడిగానున్నందున మొగమును బట్టతో కప్పుకోనైతిని.
10. ఆ గోడమీద పిచ్చుకలు ఉన్నవి. కాని ఆ సంగతి నాకు తెలియదు. అవి తమ వేడి రెట్టను చివాలున నా కన్నులలో జారవిడిచెను. నా నేత్రములలో తెల్లని పొరలేర్పడెను. నేను వైద్యుని తరువాత వైద్యుని సందర్శించితిని. కాని వారి లేపనముల వలన నా కంటిపొరలు ఇంక ముదిరినవి. చివరికి చూపుపూర్తిగా మందగించినది. నేను నాలుగేండ్లపాటు గ్రుడ్డివాడుగా ఉంటిని. అహీకారు రెండేండ్ల వరకు నన్ను పోషించెను. తరువాత అతడు ఏలామునకు వెళ్ళిపోయెను.
11. నా భార్య సామాన్య స్త్రీలవలె కూలిపని చేయవలసివచ్చెను. ఆమె మగ్గముమీద నేతనేసెడిది.
12. ఆ నేసిన బట్టను తీసికొనిపోయినపుడు యజమానులు ఆమెకు కూలి ఇచ్చెడివారు. ఒక పర్యాయము ఐదవనెల ఏడవదినమున అన్నా ఒక బట్టను నేసి యజమానుల వద్దకు కొనిపోయెను. వారు ఆమెకు పూర్తివేతనము చెల్లించుట మాత్రమేగాక ఒక మేక పిల్లనుగూడ కానుకగా ఇచ్చిరి.
13. అది మా ఇంటికి రాగానే అరచుట మొదలుపెట్టెను. నేను నా భార్యను పిలిచి “ఈ మేకపిల్ల ఎక్కడిది? నీవు దానిని ఎవరి యొద్దనుండియైన దొంగిలించుకొని వచ్చితివా ఏమి? పోయి, వెంటనే దానిని దాని ఇంటివారికి అప్పగించి రమ్ము. దొంగసొమ్మును భుజించుట న్యాయము కాదు” అంటిని.
14. అన్నా “ఇది దొంగసొమ్ము కాదు. వేతనముతో పాటు దీనిని గూడ నాకు బహుమతిగా ఇచ్చిరి" అని చెప్పెను. కాని నేను ఆమె పలుకులు నమ్మనైతిని. ఆమె చేసినపనికి నేను మొగమెత్తుకోజాలనైతిని. కనుక ఆ మేకకూనను దాని యజమానులకు ఇచ్చిరమ్మని పట్టుపట్టితిని. కాని ఆమె కోపముతో “నీ దానధర్మము లన్నియు ఏమైనవి? నీ సత్కార్యములన్నియు ఏ గాలికి పోయినవి? ఆ పుణ్యమంతయు ఏ వరదన పోయినది? ఇప్పుడు నీ హృదయము నాకు అర్ధమైనదిలే” అని విరుచుకొనిపడెను.
1. ఆ మాటలకు నేను సంతాపము చెంది నిట్టూర్పు విడిచితిని, ఏడ్చితిని. ఈ క్రింది శోకగీతమును జపించితిని:
2. "ప్రభూ! నీవు న్యాయవంతుడవు. నీ కార్యములన్నియు న్యాయసమ్మతములైనవి. నీవు నమ్మదగినవాడుగా మెలగుదువు. నీవు ఈ లోకమునకు న్యాయాధిపతివి.
3. నన్ను కరుణతో బ్రోవుము. నా పాపములకు నన్ను శిక్షింపకుము. తెలియక చేసిన తప్పిదములకుగాను నన్ను దండింపకుము. మా పితరుల పాపములకు నన్ను శిక్షింపకుము.
4. మేము నీ ఆజ్ఞలను మీరితిమి. నీకు ద్రోహముగా పాపము చేసితిమి. నీవు మమ్ము మా శత్రువుల చేతికి అప్పగింపగా వారు మమ్ము దోచుకొనిరి. మమ్ము బందీలుగా కొనిపోయి చంపివేసిరి. మేము ఏఏ జాతుల మధ్య చెల్లాచెదరైతిమో వారెల్లరును మమ్ము ఆడిపోసికొని, అవహేళన చేయునట్లు చేసితివి.
5. నీవు మా పితరులకు వారి పాపములకు తగిన శిక్షను, నాకు నా పాపములకు తగిన శిక్షను విధించితివి. మేము నీ ఆజ్ఞలను పాటింపలేదు. నీపట్ల చిత్తశుద్ధితో ప్రవర్తింపలేదు. కనుక మేము పొందిన శిక్ష సముచితమైనదే.
6. ఇప్పుడు నన్ను నీ ఇష్టము వచ్చినట్లు చేయుము. నా ప్రాణములు తీసి నన్ను ఈ లోకమునుండి కొనిపొమ్ము. నా శరీరము మట్టిలో కలిసిపోవునుగాక! నేను కన్నుమూయుటయే మేలు. నేను పొందగూడని అవమానములు పొంది , విచారమనస్కుడనైతిని, ప్రభో! నీవు ఆజ్ఞ యిచ్చిన చాలును, నాకు చావు ప్రాప్తించి, ఈ వెతలన్ని తీరిపోవును. నేను శాశ్వతపదము చేరుకొందును. కనుక నీవు నా మనవిని త్రోసిపుచ్చకుము. ఇట్టి దైన్య జీవితము జీవించుటకంటె, ఇట్టి క్రూరావమానములు భరించుటకంటె, చచ్చుటమేలు.”
7. ఆరోజుననే మాదియా దేశమునందలి ఎక్బటానా నగరమున వసించుచున్న రగూవేలు పుత్రిక సారాను ఆమె తండ్రి పనికత్తె అవ మానించెను.
8. ఈ సారాకు ఏడుసార్లు పెండ్లియైనది. కాని అస్మోదియసు అను దుష్ట పిశాచము ప్రతిపర్యాయము సారా వరులు ఆమెను కూడకమునుపే వారిని చంపివేసెడిది. పనికత్తె సారాతో “నీ భర్తలను నీవే చంపివేయుచున్నావు. ఇప్పటికే నిన్ను ఏడుగురుకు కట్టబెట్టిరి. కాని వారిలో ఒక్కరివలనను నీకు పిల్లలు పుట్టలేదు.
9. నీ మగలు చచ్చిరి కనుక నీవు మమ్ము దండింతువాయేమి? నీవును పోయి ఆ చచ్చిన వరులతో కలియుము. అప్పుడు నీ సంతానమును కంటితో చూచు దుర్గతి మాకు పట్టదు” అనెను.
10. ఆ మాటలకు సారా విచారముతో వెక్కి వెక్కి ఏడ్చెను. ఉరిపెట్టుకొని చత్తుననుకొని మేడమీదకు ఎక్కిపోయి తండ్రిగది ప్రవేశించెను. కాని ఆమె మరల “నేనిట్లు చేసినచో ప్రజలు నా తండ్రిని నిందింపరా? వారు 'నీకొక్కతియే కుమార్తె. నీవామెను గారాబముగా పెంచుకొంటివి. కాని ఇప్పుడామె దిగులుతో ఉరి పెట్టుకొనినది” అని అనరా? నేను వృద్దుడైన నా తండ్రిని దుఃఖపెట్టి ఆ ముసలిప్రాణి విచారముతో మృత్యులోకము చేరుకొనునట్లు చేయుటేమి న్యాయము? కనుక నేను వివేకముతో ప్రవర్తించి ఈ ఆత్మహత్యాయత్నమును మానుకోవలెను. నన్ను తీసికొనిపొమ్మని మాత్రము ఆ ప్రభువును వేడికొందును. అప్పుడు ఈ అవమానములను భరింపనక్కరలేదు” అనుకొనెను.
11. అంతట ఆమె గవాక్షముచెంత నిలుచుండి చేతులెత్తి ప్రభువును ఈ రీతిగా ప్రార్ధించెను: “దయామయుడవైన ప్రభూ! నీకు స్తుతి కలుగునుగాక! నీ దివ్యనామము సదా కీర్తింపబడునుగాక! నీవు చేసిన ఈ సృష్టి అంతయు నిన్ను సన్నుతించునుగాక!
12. నేను నీ వైపు కన్నులెత్తి నిన్ను శరణువేడుచున్నాను.
13. నీవు ఒక్కమాట పలికి నా ప్రాణములను కొనిపొమ్ము. నేను ఈ అవమానములను ఇక భరింపజాలను.
14. ప్రభూ! నా కన్యత్వము ఇంతవరకును చెడలేదు. ఏ పురుషుడును నన్నింతవరకు ముట్టుకొనలేదు. ఈ సంగతి నీకు తెలియును.
15. నేను ఈ ప్రవాసదేశమున ఇంతవరకు ఎట్టి చెడ్డపేరు తెచ్చుకోలేదు, మా తండ్రికి అపకీర్తి తేలేదు. నేను మా తండ్రికి ఏకైకపుత్రికను. అతనికి మరియే వారసులును లేరు. నేను పెండ్లియాడుటకు మా తండ్రి తరపు చుట్టములు గూడ ఎవరును లేరు, ఇప్పటికే నా భర్తలు ఏడుగురు చచ్చిరి. ఇక నేను బ్రతికి ఏమి లాభము ? నా ప్రాణములను గొనిపోవుట నీకిష్టము కాదేని ప్రభూ! నన్ను ఆదరముతోనైన చూడుము. ఈ అవమానములను మాత్రము నేనిక భరింపజాలను.”
16. తోబీతు మరియు సారా చేసిన ఈ ప్రార్ధనలను దేవుడు ఆకాశమునుండి ఆలించెను.
17. అతడు వారికి తోడ్పడుటకు తన దూతయైన రఫాయేలును పంపెను. తోబీతు కన్నులలోని పొరలను తొలగించి అతనికి మరల చూపు దయచేయుటకును, సారా తోబియాలకు పెండ్లి కుదుర్చుటకును, ఆమె నుండి అస్మోదియసు అను దుష్టపిశాచమును పారద్రోలుటకును దేవుడు ఆ దూతను పంపెను. తోబియా సారాకు అయినవాడు కనుక ఆమెను పెండ్లియాడు హక్కు ఇతర వరులు అందరికంటెగూడ అదనముగా అతనికి కలదు. అచట తోబీతు ముంగిటినుండి ఇంటి లోనికి అడుగుపెట్టినపుడే ఇచట సారాకూడ మీది గది నుండి క్రిందికి దిగివచ్చెను.
1. ఆ రోజుననే తోబీతు పూర్వము తాను మాదియా దేశమునందలి రాగీసు పట్టణమున గబాయేలు ఇంట దాచియుంచిన ధనమును జ్ఞప్తికి తెచ్చుకొనెను.
2. అతడు నాకిపుడు చావురావలెనని ప్రార్థన చేసికొంటినిగదా! కాని నేను చనిపోకముందు నా కుమారుడైన తోబియాకు ఆ డబ్బు సంగతి చెప్పవలెను గదా అనుకొనెను.
3-4. కనుక అతడు పుత్రుని పిలిచి ఇట్లు చెప్పెను: “నాయనా! నేను చనిపోయినపుడు నన్ను అన్ని మర్యాదలతో భూస్థాపనము చేయుము. నేను దాటిపోయిన తరువాత మీ అమ్మను గౌరవముతో చూడుము. ఆమె బ్రతికి ఉన్నంతకాలము ఆమెను పోషింపుము. ఆమె చనిపోయినపుడు నా ప్రక్కనే పాతి పెట్టుము. నిన్ను గర్భమున మోసి కనినపుడు ఆమె ఎన్ని అపాయములకు గురియైనదో జ్ఞప్తికి తెచ్చుకొనుము. కనుక నీవు ఆమె కోరినదెల్ల చేయుము. ఎన్నడును నీతల్లి మనసు కష్టపెట్టకుము.
5. నీ జీవితమున ప్రతిదినము ప్రభువును గుర్తుంచుకొనుము. ఏనాడును పాపము చేయకుము. దేవునిఆజ్ఞ మీరకుము. ఎప్పుడును సత్కార్యములే చేయుము, దుష్కార్యములు మానుకొనుము.
6. నీవు సత్యవర్తనుడవు అయ్యెదవేని ప్రతికార్యమున నీకు విజయము చేకూరును.
7. దేవునిపట్ల భయభక్తులు చూపువారికి నీ సొత్తునుండి దానధర్మములు చేయుము. నీవు పేదలను అనాదరము చేయకుందువేని దేవుడును నిన్ను అనాదరముచేయడు.
8. నీకున్న దానినిబట్టి దానము చేయుము. ఎక్కువగా నున్నచో ఎక్కువగానే ఇమ్ము. తక్కువగానున్నచో తక్కుగానే ఇమ్ము. కాని ఇచ్చుటలో మాత్రము ఎప్పుడును వెనుకాడకుము.
9. ఇచ్చిన దానము ఆపత్కాలమున పెద్దనిధివలె సాయపడును.
10-11. దానము ఆకాశమునందలి దేవునికి ఇష్టమైన కానుక. కనుక దానము చేయువానిని ఆయన అంధకార బంధురమైన మృత్యులోకమునుండి రక్షించును.
12. నాయనా! వేశ్యలనుగూర్చి జాగ్రత్తగా ఉండుము. మన తెగ నుండే ఒక పిల్లను పెండ్లి చేసికొనుము. మన తెగకు చెందనివారి పిల్లలను పరిణయమాడకుము. మనము ప్రవక్తల వంశమున పుట్టితిమి. మన పూర్వులైన నోవా, అబ్రహాము, ఈసాకు, యాకోబు మొదలైన వారందరును వారితెగకు చెందిన పిల్లలనే పెండ్లియాడిరి. కనుక దేవుడు వారికి సంతానమును దయచేసెను. ఆ సంతానము యిస్రాయేలు దేశమును భుక్తము చేసికొనెను.
13. కావున నీవును మనతెగకు చెందిన వారిని ఆదరింపుము. మనవారి పిల్లలలో ఒకతెను పెండ్లియాడుము. గర్వముతో మన బంధువుల బాలబాలికలను చిన్నచూపు చూడకుము. గర్వము విచారమును, వినాశమును తెచ్చి పెట్టును. సోమరితనము పేదరికమును కొని తెచ్చును. లేమికి కారణము సోమరితనమే.
14. నీకు పనిచేసిన వారి కూలిని ఏ రోజు కారోజు చెల్లింపవలయునే కాని మరుసటి రోజువరకు అట్టిపెట్టుకోరాదు. నీవు ఈ నియమమును పాటించి దేవుని గౌరవింతువేని ఆయన నిన్ను బహూకరించును. నీ పనులన్నింటను జాగ్రత్తగానుండుము. ఎల్లవేళల సక్రమముగా ప్రవర్తింపుము.
15. ఇతరులెట్టి కార్యము చేసిన నీకు అప్రియము కలుగునో, అట్టికార్యమును నీవును ఇతరులకు చేయరాదు. నీవు ద్రాక్షసారాయమును త్రప్పడాగి మత్తుడవు కావలదు. త్రాగుడు వ్యసనమునకు లొంగిపోవలదు.
16. ఆకలిగొనినవారికి ఆహారము పెట్టుము, బట్టలులేని వారికి బట్టలిమ్ము. నీకు సమృద్ధిగానున్న ప్రతి వస్తువు నుండి కొంతభాగమును దానము గానిమ్ము. ఇచ్చెడు దానిని ప్రీతితోనిమ్ము.
17. పుణ్యాత్ములు చనిపోయినపుడు వారి కుటుంబమునకు ఆహారము పెట్టుము. కాని పాపాత్ములు చనిపోయినపుడు ఈ కార్యము చేయవలదు.
18. బుద్ధిమంతుల సలహాను పాటింపుము. మంచి ఉపదేశమును ఎప్పుడును పెడచెవిన పెట్టవలదు.
19. ప్రతి కార్యమునందును దేవుని స్తుతింపుము. నీవు చేపట్టిన కార్యములనెల్ల సఫలము చేయుమని అతనిని వేడుకొనుము. అతడు ఇతర జాతులకు వివేకమును దయచేయడు. నరులకు మంచి వరములన్నింటిని దయచేయువాడు ప్రభువే. కానీ, అతడు జనులను పాతాళమునకు అణగదొక్కువాడు కూడా. నాయనా! నీవు ఈ ఉపదేశములనెల్ల జ్ఞప్తియందుంచుకొనుము. వీనిని నీహృదయమునందు మాసిపోనీయకుము.
20. కుమారా! నేను మాదియా దేశములోని రాగీసు పట్టణమున వసించు గాబ్రియా సోదరుడగు గబాయేలు వద్ద పదిసంచుల వెండి నాణెములు దాచియుంచితిని.
21. ఇప్పుడు మనము పేదవారిమైతిమి. కాని దీనికి నీవు విచారపడనక్కరలేదు. నీవు దేవునికి వెరచి పాపకార్యములను విడనాడి అతనికి ప్రియమగు పనులను చేయుదువేని నీకు పెద్దసంపద అబ్బినట్లే.
1. తోబియా తండ్రితో “నేను నీవు చెప్పినదెల్ల చేయుదును.
2. కాని నేను గబాయేలునుండి డబ్బు తెచ్చుకొనుటయెట్లు? నేనతనిని ఎరుగను, అతడు నన్నెరుగడు. అతడు నన్ను నమ్మి నాకు సొమ్ము ఇచ్చుటకు నేను అతనికేమి ఆనవాలు చూపవలెను? అదియునుగాక మాదియాకు ఏత్రోవన పోవలెనోకూడ నాకు తెలియదు” అనెను.
3. అందుకు తోబీతు కుమారునితో “పూర్వము నేనును, గబాయేలును ఒక పత్రముపై సంతకము చేసితిమి. దానిని రెండు ముక్కలుగా చించి, నేనొక ముక్కను తీసికొంటిని. అతని ముక్కను సొమ్ముతో చేర్చియుంచితిని. ఇరువది యేండ్ల నాడు ఈ సొమ్మును అతని వద్ద దాచితిని. కుమారా! ఇప్పుడు నీతోపాటు మాదియాకు అచటినుండి మరల ఇచటకు ప్రయాణము చేయుటకు అంగీకరించు నమ్మకస్తుడు ఒకనిని వెదకి తెచ్చుకొనుము. నీవు తిరిగివచ్చు రోజువరకును అతనికి వేతనము చెల్లింతము. నీవు అతనితో పోయి గబాయేలు వద్దనుండి ఆ సొమ్ము తీసికొనిరావచ్చును” అని చెప్పెను.
4. కనుక తోబియా తనను మాదియాకు తీసికొని పోవు నమ్మకస్తుని వెదకబోయెను. బయటికి వెళ్ళగనే రఫాయేలు దేవదూత అతనికి ప్రత్యక్షమయ్యెను. కాని తోబియాకు అతడు దేవదూతయని తెలియదు.
5. కనుక తోబియా "అయ్యా! మీది ఏ ఊరు?” అని అతనిని అడిగెను. రఫాయేలు "నేను కూడ యిస్రాయేలీయుడనే, పనియేమైన దొరుకునేమో అని ఈ పట్టణమునకు వచ్చితిని" అనెను. “నీకు మాదియాకు దారి తెలియునా?” అని తోబియా ప్రశ్నించెను.
6. అందులకు రఫాయేలు “తెలియకేమి? నేనచటికి చాలసార్లు వెళ్ళితిని. అచటికి పోవుదారులన్నియు నాకు సుపరిచితములే. నేను ఆ దేశమునకు పోయినపుడెల్ల రాగీసు నగరమున వసించు మా బంధువు గబాయేలు ఇంట బసచేసెడివాడను. ఎక్బటానా నుండి రాగీసును చేరుకొనుటకు రెండు నాళ్ళు పట్టును. ఎక్బటానా మైదానములలోనున్నది. రాగీసు కొండలలో ఉన్నది” అని పలికెను.
7. తోబియా “చెలికాడా! నేను మా తండ్రితో ఈ సంగతి చెప్పి వచ్చెదను, నీవు కొంచెము సేపు ఇక్కడనే నిలువుము. నీవు నా వెంట ప్రయాణము చేయవలెను. మేము నీకు వేతనము చెల్లింతుము” అనెను.
8. ఆ మాటలకు రఫాయేలు “సరియే, నీవు కోరినట్లే నేనిచట వేచియుందును. కాని నీవు మాత్రము జాగుచేయవద్దు” అనెను.
9. తోబియా తండ్రి చెంతకు పోయి “నాతో ప్రయాణము చేయుటకు మన జాతివాడొకడు దొరకెను” అని చెప్పెను. తండ్రి “అతనిని ఇచటికి తీసికొని రమ్ము. అతడు ఏ తెగకు, ఏ కుటుంబమునకు చెందిన వాడో తెలిసికొందును. నీకు నమ్మదగిన నేస్తుడు ఔనో కాదో గూడ పరిశీలించి చూతును” అని నుడివెను. కనుక తోబియా బయటికి వెళ్ళి మా తండ్రి నిన్ను చూడగోరుచున్నాడని చెప్పి రఫాయేలును పిలుచుకొని వచ్చెను.
10. రఫాయేలు ఇంటిలోనికి రాగానే తోబీతు అతనికి స్వాగతము చెప్పెను. దేవదూత “నీకు కుశలమేనా?” అని అడిగెను. తోబీతు “బాబూ! నాకు కుశలమెక్కడిది? నేను కన్నులు లేని కబోదిని. చనిపోయిన వారివలె నేనును వెలుగును చూడజాలకున్నాను. నా బ్రతుకు సజీవ సమాధివలె ఉన్నది. నరులు మాట్లాడుట విందునుగాని, వారి రూపమును మాత్రము చూడజాలను” అని అంగలార్చెను. రఫాయేలు "అయ్యా! విచారింపకుము. దేవుడు శీఘ్రముగనే నీకు చూపు దయచేయును” అని చెప్పెను. తోబీతు “నా కుమారుడు తోబియా మాదియా దేశమునకు వెళ్ళవలెను. నీవు అతనికి తోడుగా వెళ్ళి మార్గము చూపించగలవా? మేము నీకు వేతనము చెల్లింతుము” అని అడిగెను. దేవదూత “నేను అతనితో తప్పక వెళ్ళెదను. నేను మాదియాకు చాలమారులు వెళ్ళితిని. ఆ దేశమునందలి కొండలలో, మైదానములలో తిరిగితిని. అందలి దారులన్నియు నాకు తెలియును” అని పలికెను.
11. తోబీతు “నాయనా! నీది ఏతెగ? ఏ కుటుంబము? అని అడిగెను.
12. రఫాయేలు “నా తెగతో నీకేమి అవసరము?” అనెను. తోబీతు “నీవెవరి కుమారుడవో, నీ పేరేదో నేను రూఢిగా తెలిసికోగోరెదను” అనెను.
13. దేవదూత “నా పేరు అసరయా. నేను నీ చుట్టమైన పెదఅననీయా కుమారుడను” అని చెప్పెను.
14. తోబీతు "కుమారా! నీకు స్వాగతము. నేను నీ కుటుంబమును గూర్చి తెలిసికోగోరినందులకు నీవు అన్యధా భావింపవలదు. నీవు మంచి పరపతిగల కుటుంబమునకు చెందినవాడవు. మాకు అయినవాడవు కూడ. పెదషేమయా కుమారులు అననీయా, నాతాను నాకు బాగుగా తెలియును. వారు ప్రభువు ఆజ్ఞలను తు.చ. తప్పకుండ పాటించెడివారు. మేమందరము కలిసే యెరూషలేమునకు యాత్రకు వెళ్ళెడివారము. అచట ప్రభువును సేవించుకొనెడివారలము. నీ బంధువులు మంచివారు. మీ కుటుంబము యోగ్యమైనదే” అని పలికెను.
15. తోబీతు ఇంకను “నేను నీకు పూటకొక్క రూక చొప్పున వేతనము చెల్లింతును. నా కుమారునికి వలె నీకును దారిబత్తెము నిత్తును. నీవు నా తనయునితో కలిసి పయనము చేయుము.
16. కడన జీతమునేగాక మరికొంత సొమ్మునుగూడ ముట్టజెప్పుదును” అని పలికెను. దేవదూత “నేను నీ కుమారునితో పోయెదను. నీవేమీయు భయపడవలదు. మేము అచటికిని, మరల యిచటికిని గూడ సురక్షితముగా ప్రయాణము చేయగలము. మార్గమున ఎట్టి అపాయమును కలుగదు” అని పలికెను.
17. తోబీతు దేవదూతతో “దేవుడు నిన్ను దీవించుగాక!” అనెను. అటుతరువాత అతడు పుత్రుని పిలిచి “కుమారా! ప్రయాణమునకు అవసరమైన వస్తువులనెల్ల సిద్ధము చేసికొని నీ స్నేహితుని వెంటపొమ్ము. ఆకాశమునందలి దేవుడు దారిలో మిమ్ము కాపాడునుగాక! ఆయన మిమ్ములనిరువురిని మరల సురక్షితముగా నా చెంతకు తోడ్కొనివచ్చును గాక! ప్రభువుదూత కూడ మీతో పయనించి మీకు బాసటగా నుండునుగాక!" అని నుడివెను. తోబియా తల్లిదండ్రులను ముద్దాడి మాదియాకు పయనము కట్టెను. తండ్రి అతనితో భద్రముగా ప్రయాణము చేయుమని చెప్పెను.
18. అప్పుడు తోబియా తల్లి అన్నా వెక్కివెక్కి ఏడ్చుచు భర్తతో “నీవు నా బిడ్డను ఇట్లు పంపుదువా? వానిమీద ఆధారపడిగదా మనము జీవించునది? ఇక మనకు దిక్కెవరు?
19. డబ్బు అంత అమూల్యమైనదా? దాని కొరకు మన గారాబు బిడ్డ ప్రాణములనే అపాయముపాలు చేయవచ్చునా?
20. దేవుడు మనకిచ్చిన దానితోనే సరిపెట్టుకొని ఈ బ్రతుకును ఎటులయినను ఈడ్వవచ్చును గదా?” అని వాపోయెను.
21. అందుకు తోబీతు “నీవు విచారింపకుము. మన బిడ్డ సురక్షితముగా పోయి చెక్కుచెదరకుండ తిరిగివచ్చును. వాడు భద్రముగా ఇల్లు చేరుటను నీ కంటితోనే చూతువు. కనుక నీవు వానిమీద బెంగ పెట్టుకొనకుము.
22. యోగ్యుడైన దేవదూత మనబిడ్డతో పోవును. వాడు ప్రయాణమును విజయవంతముగా ముగించుకొని క్షేమముగా తిరిగివచ్చును” అని పలికెను. ఆ మాటలకు అన్నా ఏడుపు చాలించెను.
1. తోబియా దేవదూతతో పయనమయ్యెను. అతని కుక్కగూడ అతని వెంటపోయెను. వారు మునిమాపు వరకు నడక సాగించి టిగ్రీసు నదీతీరమున విడిదిచేసిరి.
2. తోబియా కాళ్ళు కడుగుకొనుటకు ఏటిలోనికి దిగెను. వెంటనే పెద్ద చేపయొకటి నీటిలోనుండి దుమికి వచ్చి అతని పాదమును పట్టుకోబోయెను. దానిని చూచి ఆ కుఱ్ఱడు పెద్దగా కేక పెట్టెను.
3. దేవదూత అతనితో “ఓయి! ఆ మత్స్యమును పట్టుకొనుము, జారిపోనీ యకుము” అనెను. తోబియా ఆ మీనమును పట్టుకొని ఒడ్డుకు లాగెను.
4. దేవదూత “చేప కడుపును చీల్చి దాని పిత్తమును, కాలేయమును, గుండెను తీసి నీ యొద్ద ఉంచుకొనుము. దాని ప్రేవులను మాత్రము అవతల పారవేయుము” అని చెప్పెను.
5. తోబియా దేవదూత చెప్పినట్లే చేసెను. అతడు చేపలో కొంతభాగ మును కాల్చి భుజించెను. మరి కొంతభాగమును ఉప్పులో ఊరవేసెను. తరువాత వారిరువురు ప్రయాణము సాగించి మాదియా దరిదాపులలోనికి వచ్చిరి.
6. ఆ యువకుడు దేవదూతను చూచి "నేస్తమా! అసరయా! చేపపిత్తము, కాలేయము, గుండెలతో ఏఏ రోగములను కుదుర్పవచ్చును?” అని అడిగెను.
7. అతడు చేపగుండెను, కాలేయమును కాల్చి పొగ వేసినచో నరులను పట్టిపీడించు భూతముగాని, పిశాచము గాని పారిపోవును. ఆ నరులకు మరల పిశాచబాధ సోకదు.
8. పిత్తమును తెల్లనిపొరలు కమ్మినవారి కన్నులకు లేపనముగా ఉపయోగింపవచ్చును. దానిని కంటిపొరలమీద పూసి వానిమీద ఊదిన చాలు, పొరలు తొలగిపోవును” అని చెప్పెను.
9. వారిరువురు మాదియా దేశమున ప్రవేశించి ఎక్బటానా నగరమును సమీపించిరి.
10. అప్పుడు దేవదూత తోబియాను పేరెత్తి పిలువగా అతడు “చెప్పుము నేను వినుచున్నాను” అనెను. దేవదూత “నేటి రాత్రి మనము నీ బంధువైన రగూవేలు ఇంట బస చేయవలెను. అతనికి సారా అను కుమార్తె కలదు. ఆమె తప్ప అతనికి ఇతర సంతానము లేదు.
11. ఆ కన్య నీకు దగ్గరిచుట్టము కనుక అందరికంటెగూడ అదనముగా నీకు ఆమెను పెండ్లియాడు హక్కు కలదు. ఆమె తండ్రి ఆస్తియును నీకే దక్కును.
12. ఆ యువతి తెలివి కలది, ధైర్యము కలది, చక్కనిది కూడ. సారా తండ్రి చాల మంచివాడు. ఈ రాత్రియే నేనతనితో సారా వివాహము గూర్చి మాట్లాడుదును. ఆమెను నీకు ప్రధానము చేయింతును. మనము రాగీసునుండి తిరిగివచ్చునపుడు నీవు ఆ బాలికను వివాహమాడ వచ్చును. రగూవేలు నీ వేడికోలును త్రోసిపుచ్చి కూతురును మరియొకరికి ఈయజాలడు. అట్లు చేసినచో మోషే ధర్మశాస్త్రము ప్రకారము అతడు చంపదగిన వాడగును. చుట్టరికముబట్టి తన కుమార్తెను పరిణయమాడుటకు నీకు ఎక్కువ అర్హతకలదని అతనికి తెలియును. కనుక ఇప్పుడు నీవు నా మాట వినుము. ఈ రాత్రియే మేము వివాహ విషయమును ముచ్చటించి సారాను నీకు ప్రధానము చేయింతుము. మనము రాగీసునుండి తిరిగివచ్చునపుడు ఆమెను మనతో ఇంటికి తీసికొనిపోవచ్చును” అనెను.
13. తోబియా రఫాయేలుతో “నేస్తమా! ఆ యువతిని ఇదివరకే వరుసగా ఏడుగురు వరులకిచ్చి పెండ్లి చేసిరి. వారిలో ప్రతివాడు మొదటి రేయినే శోభనపు గదిలోనే చచ్చెను. ఈ సంగతులెల్ల నాకు తెలియును.
14. ఆమెను పట్టియున్న భూతమే ఆ వరులను సంహరించెననియు వింటిని. ఆ భూతము సారా కెట్టి హానియు చేయదట. ఆమెను సమీపించు పురుషులను మాత్రము పట్టి చంపునట. నా మట్టుకు నాకు ఆ పిశాచమనిన భయముగా ఉన్నది. మా తండ్రికి నేనొక్కడనే కుమారుడను. చావవలెనను కోరిక నాకు లేదు. నేను చనిపోయినచో మా తల్లిదండ్రులు దిగులుతో సమాధి చేరుకొందురు. అప్పుడు వారిని పాతి పెట్టు దిక్కు కూడ ఉండదు” అనెను.
15. దేవదూత “ఓయి! నీవింతలోనే మీ తండ్రి ఉపదేశమును మరచితివా? అతడు నీవు మీతెగ నుండే వధువును ఎన్నుకోవలెనని చెప్పలేదా? కనుక ఇప్పుడు నా మాట వినుము. ఆ భూతమును తలచుకొని భయపడకుము. సారాను స్వీకరింపుము. ఈ రాత్రియే రగూవేలు ఆ యువతిని నీకు ప్రధానము చేయును.
16. నీవు ఆమెతో పడుక గదిలోనికి పోయినపుడు చేపగుండెను, కాలేయమును తీసికొని కాలుచున్న సాంబ్రాణి మీద వేయుము.
17. వెంటనే గది అంతట వాసన వ్యాపించును. ఆ వాసనకు భూతము పారిపోవును. అది మరల సారా చెంతకు రాదు. నీవు ఆ యువతిని కూడకముందే మీరిరువురు లేచి నిలుచుండి దేవుని ప్రార్థింపుడు. ఆకాశములోని దేవుడు మిమ్ము చల్లనిచూపు చూచి భూతముపీడనుండి కాపాడవలెనని మనవిచేయుడు. నీవేమాత్రము భయపడవలదు. సృష్ట్యాదినుండి సారా నీకు వధువుగా నిర్ణయింపబడినది. ఆమె నీ వెంట మీ ఇంటికి వచ్చును. మీకు బిడ్డలు కలుగుదురు. వారిని నీవు అనురాగముతో చూచుకొందువు. నా మాట నమ్ముము” అని పలికెను. తోబియా రఫాయేలు చెప్పిన మాటలు వినెను. తండ్రి వైపున సారా తనకు చుట్టమని గ్రహించెను. అతడు సారాను గాఢముగా ప్రేమించి తన హృదయమును ఆమెకు అర్పించెను.
1. వారు ఎక్బటానా నగరమును చేరగనే తోబియా “నేస్తమా అసరయా! నన్ను వెంటనే రగూవేలు ఇంటికి తీసికొని పొమ్ము” అనెను. దేవదూత తోబియాను అతనింటికి కొనిపోయెను. వారు వెళ్ళునప్పటికి రగూవేలు తన లోగిలి ముంగిట తలుపునొద్ద కూర్చుండి ఉండెను. వారే మొదట రగూవేలును పలుకరించిరి. అతడు “సోదరులారా! మీకు స్వాగతము” అని చెప్పి వారిని ఇంటిలోనికి తీసికొనిపోయెను.
2. తన భార్య ఎద్నాతో “చూచితివా! ఈ యువకుడు అచ్చముగా నా జ్ఞాతియైన తోబీతువలె ఉన్నాడు” అనెను. ఆమె అతిధులను “మీరు ఎచ్చటినుండి వచ్చితిరి?” అని ప్రశ్నించెను.
3. వారు “మేము నఫ్తాలి తెగకు చెందిన వారము. ప్రస్తుతము నీనెవె పట్టణములో ప్రవాసమున ఉన్నవారము” అని చెప్పిరి.
4. ఆమె మరల “మా దాయాది తోబీతు మీకు తెలియునా? అని ప్రశ్నించెను. వారు "అతడు మాకు బాగుగా తెలియును” అనిరి.
5. ఆమె "అతనికి కుశలమేనా?” అని అడుగగా వారు “అతడు బ్రతికిపోయున్నాడు, క్షేమముగానే యున్నాడు” అని చెప్పిరి. తోబియా "అతడు మా తండ్రియే” అని చెప్పెను.
6. ఆ పలుకులు విని రగూవేలు తటాలున లేచి ఆనందభాష్పములతో తోబియాను ముద్దాడెను.
7. అతడు ఆ యువకునితో “నాయనా! దేవుడు నిన్ను దీవించునుగాక! నీ తండ్రి ఉత్తముడు. అంతటి పుణ్య పురుషుడు, అన్ని సత్కార్యములు చేసినవాడు, చూపు కోల్పోవుటెంత దారుణము!” అని పలుకుచు తోబియా మెడమీద చేతులువేసి అతని భుజములమీద వాలి బోరున ఏడ్చెను.
8. అతని భార్య ఎద్నా, కుమార్తె సారా కూడ తోబీతు దుర్గతిని తలంచుకొని పరితపించిరి.
9. రగూవేలు అతిధులను హృదయపూర్వకముగా ఆహ్వానించెను. వారి కొరకు తన మందలలో నుండి ఒక పొట్టేలుని కోయించి విందు సిద్ధము చేయించెను. అతిథులు స్నానముచేసి భోజనమునకు కూర్చుండ బోవుచుండగా తోబియా “నేస్తమా అసరయా! నీవు సారాను నాకిచ్చి పెండ్లి చేయుము అని రగూవేలును అడుగవా?” అనెను.
10. రగూవేలు ప్రక్కనుండి ఆ మాటలు విని తోబియాతో “నాయనా! మొదట విందారగించి పానీయము సేవింపుము. ఈ సాయంకాలమును సుఖముగా గడుపుము. మా అమ్మాయి సారాను పెండ్లియాడుటకు నీవు తప్ప మరెవరును అర్హులుకారు. నీవు మాకు అయినవాడవు. కనుక మా అమ్మాయిని మరియొకరి కిచ్చు అధికారము నాకు లేదు. కాని నేను నీతో నిజము చెప్పవలెను.
11. నేను ఆమెను ఇది వరకే మా బంధువులకు ఏడుగురికి ఇచ్చితిని. వారిలో ఒక్కొ క్కడును తొలిరేయి శోభనపు గదిలోనికి ప్రవేశింపగనే హతుడయ్యెను. కాని నాయనా ప్రస్తుతము నీవు కొంచెము అన్నము తిని పానీయము సేవింపుము. ప్రభువే మిమ్ము కాపాడును” అని పలికెను. తోబియా ఈ విషయమున నీవు నాకు మాటిచ్చినదాకా నేను అన్నపానీయములు ముట్టుకోనని చెప్పెను. రగూవేలు “సరియే మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే నేను సారాను నీకిత్తును. పరమండలమందలి దేవుడు ఆమెను నీదానిగా నిర్ణయించెను. కనుక నీవు ఆమెను స్వీకరింపవచ్చును. ఇప్పటినుండి నీవు ఆమెకు భర్తవు, ఆమె నీకు భార్య. నేటినుండి కలకాలము వరకును సారా నీకు ధర్మపత్ని అగును. ఆకాశమందలిదేవుడు ఈ రేయి మిమ్మిరువురిని కరుణతో కాపాడునుగాక!" అని పలికెను.
12. అంతట రగూవేలు సారాను పిలిపించి ఆ యువతి చేయిపట్టుకొని ఆమెను తోబియా కర్పించెను. “నేను ఈ పడుచును నీకు అప్పగించుచున్నాను. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే నీవు ఈమెను భార్యగా స్వీకరింపుము. ఈమెను సురక్షితముగా మీ యింటికి కొనిపొమ్ము. ఆకాశాధిపతి అయిన దేవుని అనుగ్రహము వలన మీరిరువురు కలిసి సుఖముగా జీవింతురుగాక!” అని పలికెను.
13. అటుపిమ్మట రగూవేలు భార్యను పిలిచి ఒప్పందము వ్రాయుటకు పత్రము తీసికొని రమ్మనెను. ఆమె పత్రము తీసికొని రాగా అతడు మోషే ధర్మశాస్త్రము ఆదేశించినట్లే సారాను తోబియాకు ఇచ్చితినని పెండ్లి ఒడంబడిక వ్రాసెను.
14. అటు తరువాత వారు అన్నపానీయములు పుచ్చుకొనిరి.
15. రగూవేలు భార్యను పిలిచి ఖాళీ గదిని సిద్ధము చేసి సారాను అచ్చటికి తీసికొనిపొమ్మని చెప్పెను.
16. ఆమె భర్త చెప్పినట్లే ఆ గదిలో పడక సిద్ధము చేసి సారాను అచటికి తోడ్కొనిపోయెను. ఎద్నా కొంచెము సేపు కూతురిమీద వాలి ఏడ్చి కన్నీరు తుడుచుకొనెను.
17. "తల్లీ! ధైర్యముగా నుండుము. ఆకాశాధిపతియైన దేవుడు ఈ మారు నీ దుఃఖమును సంతోషముగా మార్చునుగాక! నీమట్టుకు నీవు గుండె దిటవు చేసికొనుము” అని చెప్పి తాను గదినుండి వెలుపలికి వచ్చెను.
1. వారు అన్నపానీయములు సేవించి ముగించిన పిదప రేయి నిదురపోవు సమయమయ్యెను. అప్పుడు సారా తల్లితండ్రులు తోబియాను శోభనపు గదిలోనికి తీసికొనిపోయిరి.
2. అతడు రఫాయేలు సలహాను జ్ఞప్తికి తెచ్చుకొని తన సంచిలోనుండి చేపగుండెను, కాలేయమును వెలుపలికి తీసి వానిలో కొంత భాగమును మండుచున్న సాంబ్రాణి మీద వేసెను.
3. భూతము ఆ వాసనను భరింపజాలక ఐగుప్తుదేశము ఎగువ భాగమునకు పారిపోయెను. రఫాయేలు భూతము వెంటపడి తరిమెను. ఆ దేశమున దానిని పట్టుకొని దాని కాలుసేతులు బంధించెను.
4. సారా తల్లిదండ్రులు గదితలుపులు మూయగా తోబియా పడుక మీదినుండి లేచి సారాతో “నీవు లేచి నిలుచుండుము. ప్రభువు మనమీద కరుణబూని మనలను కాపాడుటకు ఇరువురము ప్రార్ధన చేయుదుము” అని చెప్పెను.
5. సారా లేచి నిలుచుండగా ఇరువురు ప్రభువు తమను రక్షింపవలెనని మనవిచేయసాగిరి. తోబియా ఇట్లు జపించెను: “మా పితరుల దేవుడవైన ప్రభూ! నీకు స్తుతి కలుగునుగాక! నీ దివ్య నామమునకు కలకాలము కీర్తి కలుగును గాక! ఆకాశము, నీవు చేసిన సృష్టి అంతయు సదా నిన్ను కొనియాడునుగాక!
6. నీవు ఆదామును సృజించితివి, అతనికి భార్యగాను, ఆదరువుగాను, తోడుగాను ఉండుటకై ఏవను చేసితివి. వారి నుండే మానవజాతి ఉద్భవించెను. 'నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. అతనికి సాటియైన తోడునుగూడ చేసెదను' అని నీవు నిశ్చయించుకొంటివి.
7. నేను కామతృప్తి కొరకు కాక దైవాజ్ఞకు లొంగి ఈ సారాను స్వీకరించితిని. నీవు మమ్ము కరుణతో జూచి, ముసలిప్రాయము వరకు మేమిరువురము తోడూనీడగా జీవించునట్లు దయచేయుము.”
8. ప్రార్థన ముగిసిన తరువాత వధూవరులిరువురును 'ఆమెన్' అని జవాబు చెప్పిరి.
9. ఆ రేయి యిరువురు కలిసి శయనించిరి. ఆ రాత్రి రగూవేలు సేవకులను తీసికొనిపోయి సమాధి త్రవ్వించెను.
10. అతడు “బహుశ తోబియా కూడ మృత్యువువాత బడియుండును, ఇరుగు పొరుగు వారు మమ్ము హేళన చేయుదురు కాబోలు” అని అనుకొనెను.
11. సమాధిని త్రవ్వి ముగించినపిదప అతడు ఇంటిలోనికి పోయి భార్యను పిలిచి,
12. “ఒక పని పిల్లను శోభనపు గదిలోనికి పంపి తోబియా బ్రతికియున్నాడో లేదో తెలిసికొనిరమ్మని చెప్పుము. అతడు చనిపోయెనేని ఎవరికి తెలియకుండ వెంటనే పాతిపెట్టుదుము” అని చెప్పెను.
13. కావున వారు పనికత్తెను పిలిచి దీపము వెలిగించిరి. గది తలుపు తెరచి ఆమెను లోపలికి పంపిరి. ఆమె లోపలికి వెళ్ళి చూడగా వధూవరులిద్దరు గాఢనిద్రలో మునిగియుండిరి.
14. కనుక పనికత్తె వెలుపలికి వచ్చి అతడు చనిపోలేదు. బాగుగానే యున్నాడని చెప్పెను.
15. అప్పుడు రగూవేలు ఆకాశాధిపతిన దేవుని ఇట్లు స్తుతించెను: “ప్రభూ! నీవు స్తుతిచేయదగినవాడవు. నీ ప్రజలు నిన్ను సదా కీర్తింతురుగాక! నిర్మల హృదయముతోనే వారు నిన్ను స్తుతింతురుగాక!
16. నీవు నన్ను సంతోషచిత్తుని చేసితివి. కనుక నేను నిన్ను వినుతింతును. నేను మాకు కష్టములు వాటిల్లునని వెరచితిని. కాని నీ కృపవలన అట్లు జరుగలేదు. నీవు మాపట్ల ఎనలేని నెనరు చూపితివి.
17. ఈ ఏకైక పుత్రుని ఈ ఏకైక పుత్రికను నీవు కరుణతో మన్నించితివి కనుక నీకు ఇవే మా మ్రొక్కులు. ప్రభూ! ఈ దంపతులకు నీ కృపను, నీ రక్షణను దయచేయుము. ఆనందము అనురాగములతో జీవించునట్లు నీవు వీరిని దీవింపుము.”
18. అంతట రగూవేలు తెల్లవారకమునుపే సేవకులచేత సమాధి పూడ్పించెను.
19. అతడు భార్యతో రొట్టెలను సమృద్ధిగా కాల్చుమని చెప్పెను. తాను మందలయొద్దకు బోయి రెండు కోడెదూడలను, నాలుగు పొట్టేళ్ళను తోలుకొని వచ్చెను. వానిని కోసి వివాహోత్సవమునకుగాను విందు సిద్ధము చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను.
20. తోబియాను పిలిచి “నీవు రెండువారముల పాటు మాయింటినుండి కదలకూడదు. కనుక ఇచటనే ఉండుము. మనము ఇరువురము కలిసే అన్నపానీయములు సేవింతము. అమ్మాయి యిన్ని కడగండ్ల పాలయిన తరువాత ఇప్పుడు నీవు ఆమెను సంతోషపెట్టవలెను కదా!
21. రెండువారములు గడచిన తరువాత నీవు నా సొత్తులో సగము తీసికొని సురక్షితముగా నీ తండ్రి చెంతకు వెళ్ళవచ్చును. మీ అత్త, నేను గతించిన తరువాత మిగిలిన సగము నీకే దక్కును. నీపట్ల మాకు గల అనురాగము గూర్చి నీవు ఏ మాత్రమును శంకింపవలదు. ఇంత వరకు సారాకు మేమెట్లు తల్లిదండ్రులమైతిమో ఇకమీదట నీకును అట్లే తల్లిదండ్రులమగుదుము. కనుక నీవేమి సందేహింపవలదు” అని చెప్పెను.
1. అటు తరువాత తోబియా రఫాయేలును పిలిచి
2. “నేస్తమా! నీవు నలుగురు సేవకులను రెండు ఒంటెలను వెంటబెట్టుకొని రాగీసునందలి గబాయేలు ఇంటికి పొమ్ము.
3. అతనికి ఈ చేవ్రాలు కల పత్రము చూపి సొమ్మునడుగుము. అతనిని కూడ నీ వెంట వివాహ మహోత్సవమునకు తోడ్కొనిరమ్ము.
4. మా నాయన నా కొరకై రోజులు లెక్కపెట్టుకొనుచుండునని నీకు తెలియును. నేను ఒక్క రోజు జాగుచేసిన అతడు మిగుల దుఃఖించును.
5. మా మామ రగూవేలు నన్నిక్కడ ఇన్నినాళ్ళు ఉండుమని నిర్బంధము చేసెను. అతని మాట నేను కాదనలేకపోతిని” అని చెప్పెను.
6. కనుక రఫాయేలు నలుగురు సేవకులను రెండు ఒంటెలను వెంటనిడుకొని మాదియా దేశములోని రాగీసునకు వెళ్ళెను. దేవదూత గబాయేలు ఇంటనే బసచేసి అతనికి చేవ్రాలుగల పత్రమును చూపించెను. తోబీతు కుమారుడు తోబియా పెండ్లి సంగతి చెప్పి అతనిని వివాహమహోత్సవమునకు ఆహ్వానించెను. వెంటనే గబాయేలు వెండినాణెముల సంచులను లెక్కపెట్టి యిచ్చెను. అప్పటివరకు వానికి వేసిన ముద్రలు కూడ ఊడిపోలేదు. ఆ సంచులను ఒంటెలమీదికి ఎక్కించిరి. వారు మరుసటిదినము వేకువనే పెండ్లిపండుగకు పయనము కట్టిరి. ఆ మిత్రులు రగూవేలు ఇల్లు చేరుకొనునప్పటికి తోబియా భోజనము చేయుచుండెను. అతడు లేచి నిలుచుండి గబాయేలునకు స్వాగతము చెప్పెను. గబాయేలు ఆనందభాష్పములు రాల్చుచు తోబీయాను ఇట్లు దీవించెను: “నాయనా! మీ తండ్రి ధర్మాత్ముడు, ఉదారస్వభావుడు. నీవు ఆ తండ్రికి తగిన కుమారుడవే. ఆకాశమునందలి దేవుడు నిన్ను, నీ ఇల్లాలిని, నీ అత్తమామలను దీవించుగాక! అచ్చముగా నా దాయాది తోబీతువలెనున్న నిన్ను కన్నులారా చూచు భాగ్యమును దేవుడునాకు దయచేసెను. ఆ ప్రభువునకు కీర్తి కలుగును గాక!”
1. అచట తోబీతు ప్రతిదినము తన కుమారుడు రాగీసునకు పోయి తిరిగివచ్చుటకు పట్టు రోజును లెక్కపెట్టుకొనుచుండెను. తాను అంచనావేసిన రోజులు గతించిననూ తోబియా తిరిగిరాడయ్యెను.
2-3. కనుక అతడు "కుమారునికి అక్కడేమి ఆలస్యము జరిగినదో! ఒకవేళ గబాయేలు చనిపోయినందున అచట సొమ్ము ఇచ్చువారెవరు లేరేమో!” అని అనుకొనుచు విచారింపసాగెను.
4. అతని భార్య అన్నా “నా కుమారుడు గతించెను. వాడిక నాకంటబడడు” అనుచు పెద్దగా ఏడ్వదొడగెను.
5. ఆమె ఇంకను “నాయనా! నీవు నా కంటికి దీపమువు, నేను నిన్నెందుకు వెళ్ళిపోనిచ్చితిని? అని అంగలార్చెను.
6. తోబీతు “అన్నా! నీవిట్లు విచారింపకుము. మన బిడ్డకు ఏ అపాయము కలిగియుండదు. అచటేదియో జరుగుట వలననే వారు జాగుచేసియుందురు. తోబియాతో పోయిన నేస్తుడు నమ్మదగినవాడు, మనకు అయినవాడుకూడ. నీవు దిగులుపడవలదు. మన కుమారుడు శీఘ్రమే తిరిగివచ్చును” అని భార్యను ఓదార్చేను.
7. కాని ఆమె “నీవిక మాటలుచెప్పవద్దు. నన్ను ఒంటరిగ వదలి వేయుము. నీవు నన్ను మోసగింపకుము. నా బిడ్డడు నిక్కముగా చనిపోయెను” అని పలికెను. ప్రతిదినము ఆమె తటాలున ఇంటిలో నుండి వెలుపలికి బోయి తన కుమారుడు పోయిన త్రోవ వెంట ప్రొద్దువాలు వరకు పారజూచెడిది. ఎవరైన తనను ఓదార్పబోయినను, వారి మాట వినెడిదికాదు. ఇంటికొచ్చిన తరువాత కన్ను వాల్చకుండ రేయంత కుమారుని కొరకు పలవరించెడిది. రగూవేలు తన కూతురు సారా వివాహ సందర్భమున జరుప నిశ్చయించిన పదునాలుగు దినముల ఉత్సవము ముగిసెను. తోబియా మామచెంతకు వచ్చి “నన్ను వెళ్ళిపోనిమ్ము. మా తల్లిదండ్రులు నన్ను కంటితో చూచు ఆశను వదలుకొనియుందురు. కనుక నన్నిక మా యింటికి వెళ్ళిపోనిమ్ము. నేను ప్రయాణమై వచ్చినపుడు మా నాయన ఎట్టి దుస్థితిలోనున్నాడో నీకు ముందే విన్నవించితిని గదా!” అనెను.
8. రగూవేలు “నాయన! నీవు ఇప్పుడే వెళ్ళనేల? మరి కొన్నినాళ్ళు మా యింట వసింపుము. నేను నీ తండ్రి యొద్దకు దూతలను పంపి నీవు క్షేమముగానే ఉన్నావని చెప్పింతును” అని పలికెను.
9. కాని తోబియా పట్టిన పట్టు విడువక నన్ను మా తండ్రియొద్దకు వెళ్ళిపోనిమ్మని బ్రతిమాలెను.
10. రగూవేలు ఇక జాగుచేయక సారాను తోబియా కప్పగించెను. అతడు తనసొత్తులో సగభాగమును బానిసలు, ఎడ్లు, గొఱ్ఱెలు, గాడిదలు, ఒంటెలు, దుస్తులు, డబ్బు, సామానులు మొదలైన వానిలో సగము అల్లునికిచ్చెను.
11. అతడు తోబియాను సాగనంపుచు అతనిని ఆలింగనము చేసికొని 'నాయనా! సురక్షితముగా పోయిరమ్ము. ఆకాశాధిపతియైన దేవుడు నిన్ను, సారాను కాపాడునుగాక! నేను కన్నుమూయక మునుపే నీ బిడ్డలను చూతునుగాక!” అని దీవించెను.
12. సారాను సాగనంపుచు "తల్లీ! నీ భర్తతో వెళ్ళి నీ అత్తగారి యింట కాపురము చేయుము. ఇకమీదట మీ అత్తమామలు నీకు కన్న తల్లిదండ్రుల వంటి వారు. నేను బ్రతికి ఉన్నంతకాలము నీ నడవడికను గూర్చి మంచివార్తలే విందునుగాక!” అని దీవించెను. అంతట అతడు వారికి వీడుకోలు చెప్పెను. అప్పుడు ఎద్నా తోబియాతో “నాయనా! దేవుడు నిన్ను సురక్షితముగా ఇల్లు జేర్చునుగాక! నేను మీ బిడ్డలను చూచువరకు జీవింతునుగాక! దేవుడు సాక్షిగా నేను నా బిడ్డను నీకు అప్పగించుచున్నాను. నీవు జీవించునంత కాలము ఆమెను ఎప్పుడును దుఃఖపెట్టకుము. సురక్షితముగా పోయిరమ్ము. ఇప్పటి నుండి సారా నీకు భార్య, నేను నీకు తల్లిని. మనము బ్రతికియున్నంత కాలము సుఖముగా జీవింతుము గాక!” అనెను. ఆమె అల్లుని కూతురును ముద్దాడి సాగనంపెను.
13. తోబియా సంతోషముతో రగూవేలు ఇంటి నుండి బయలుదేరెను. అతడు తన ప్రయాణము విజయవంతమయ్యెను గనుక ఆకాశాధిపతియు లోక పాలకుడైన దేవుని స్తుతించెను. ఇల్లు వీడకముందు తన అత్త మామలను వారు బ్రతికియున్నంతకాలము గౌరవముతో చూచుకొందునని మాటిచ్చెను.
1. వారు ప్రయాణము చేయుచు నీనెవె చెంతగల కసెరీను నగరము దాపులోనికొచ్చిరి.
2. అప్పుడు రఫాయేలు తోబియాతో “మనము బయలుదేరినప్పుడు నీ తండ్రి ఎట్టి దీనస్థితిలో ఉండెనో నీకు తెలియునుగదా!
3. కనుక ఇప్పుడు మనము నీ భార్య కంటే ముందుగా పోయి ఇంటిని సిద్ధము చేయుదము. ఆమె తోడి ప్రయాణీకులతో నిదానముగా వచ్చును.
4. నీవు ఆ చేపపిత్తమును తెచ్చుట మాత్రము మరువకుము” అని చెప్పెను. అటుల వారు ముందు నడువగా తోబియా కుక్క వారివెంటబోయెను.
5. అక్కడ అన్నా కుమారుని కొరకు ఎదురు చూచుచు త్రోవవైపు పారజూచుచు కూర్చుండెను.
6. ఆమె తటాలున తోబియా వచ్చుటను చూచి పెనిమిటితో “అదిగో! మన బిడ్డ నేస్తునితో వచ్చుచున్నాడు” అని చెప్పెను.
7. తోబియా తన తండ్రి చెంతకు వెళ్ళకమునుపే రఫాయేలు అతనితో “నీవు నా మాట నమ్ముము. నీ తండ్రికి మరల చూపువచ్చును.
8. నీవు ఈ చేప పిత్తమును మీ నాయన కన్నులకు పూయవలయును. ఆ మందువలన అతని కంటిలోని పొరలు కుదించు కొనిపోవును. వెంటనే మీ నాయనకు చూపువచ్చును” అని చెప్పెను.
9. అప్పుడు అన్నా పరిగెత్తుకొనివచ్చి కుమారుని కౌగలించుకొనెను. “నాయనా! నిన్ను కన్నులార చూచితిని గనుక ఇక నిశ్చింతగా ప్రాణములు విడుతును” అనుచు సంతోషముతో కన్నీరుగార్చెను.
10. తోబీతు తడవుకొనుచు ముంగిలి తలుపుగుండ వెలుపలికి నడచివచ్చెను.
11. తోబియా చేపపిత్తముతో తండ్రి ఎదుటికి వచ్చెను. అతడు తండ్రి కన్నులమీద ఊది అతనిని తన చేతితో పట్టుకొని “నాయనా! ధైర్యము తెచ్చుకొనుము” అని చెప్పెను.
12-13. అంతట అతడు చేప పిత్తమును తండ్రి కనులకుపూసెను. ఆ వృద్ధుని కన్నులలోనుండి కంటికొనలతో మొదలు పెట్టి తెల్లని పొరలను పెరికివేసెను.
14. తోబీతు కుమారుని మెడ మీద చేతులు ఆనించి సంతోషముతో కన్నీరు కార్చెను. “నాయనా! నా కంటికి దీపమువైన నీవు ఇపుడు నాకు కన్పించుచున్నావుసుమా!" అని పలికెను. అతడు ఇంకను: “ప్రభువును స్తుతింపుడు. అతని మాహాత్మ్యమును కొనియాడుడు. పవిత్రులైన అతని దూతలను కీర్తింపుడు. అతని మాహాత్మ్యమును కలకాలము స్తుతింపుడు.
15. అతడు నన్ను గ్రుడ్డితనముతో శిక్షించెను. కాని ఇప్పుడు నన్ను కరుణించెను. కనుకనే ఇప్పుడు నేను నా కుమారుని చూడగలిగితిని” అని అనెను. అంతట తోబియా సంతోషముతో దేవుని బిగ్గరగా స్తుతించుచు ఇంటిలోనికి వెళ్ళెను. తరువాత అతడు తండ్రికి తన సంగతి అంతా చెప్పెను. తన ప్రయాణము సఫలమైనదనియు, తాను సొమ్మును కొనివచ్చితిననియు, అంతమాత్రమే కాక రగూవేలు కుమార్తె అయిన సారాను గూడ పెండ్లియాడితిననియు, ఆమె గూడ వెనువెంటనే వచ్చుచున్నదనియు, అప్పటికే ఆమె నీనెవె నగర ద్వారములను చేరియుండును” అని వివరించెను.
16. తోబీతు కోడలిని కలసికొనుటకై పట్టణ ద్వారమువద్దకు బయలుదేరెను. అతడు దారి పొడవున ప్రభువును స్తుతించుచు వెళ్ళెను. అతడు తోడు లేకుండ గబగబనడచుట జూచి నేనెవె పౌరులు విస్తుపోయిరి.
17. దేవుడు తనను కరుణించి తనకు దృష్టి దయచేసెనని తోబీతు పురజనులతో చెప్పెను. అంతట అతడు తన కోడలు సారాను కలసికొని ఆమెకిట్లు స్వాగతము చెప్పెను: “కుమారీ! నీకు స్వాగతము. దేవుడు నిన్ను మా ఇంటికి కొనివచ్చెను గనుక, ఆ ప్రభువునకు స్తోత్రములు. అతడు నీ తండ్రిని, నిన్ను, నా కుమారుని దీవించునుగాక! ఇప్పుడు నీ సొంత ఇంటిలో అడుగిడుము. నీకు ఎల్లవేళల ఆరోగ్యము, సంతోషము, దీవెనలు సిద్ధించునుగాక! కుమారీ! నీకు స్వాగతము.” తోబీతు ఆ రోజు నేనెవెలోని యూదులు అందరికి విందు చేసెను.
18. అతని సోదరుని కుమారులైన అహీకారు, నాదాబు అనువారు కూడ ఆ విందుకు వచ్చిరి.
1. వివాహఉత్సవము ముగిసిన తరువాత తోబీతు కుమారుని పిలిచి “నాయనా! నీ స్నేహితునికి వేతనము చెల్లింపవలెనుగదా! అతనికి మనమొప్పు కొనిన దానికంటే ఎక్కువగానే సొమ్ము చెల్లింపుము" అని చెప్పెను.
2. కుమారుడు తండ్రితో “నాయనా! నన్ను ఇతనికి ఎంత చెల్లింపుమందువు? మేము తెచ్చిన సొత్తులో సగము ఇతనికిచ్చినను నష్టము లేదు.
3. ఇతడు నన్ను సురక్షితముగా నీ చెంతకు కొనివచ్చెను. గబాయేలు వద్దకు వెళ్ళి మన సొమ్మును తీసికొని వచ్చెను. నా భార్యకు భూతవిముక్తి, నీకు రోగవిముక్తి కలిగించెను. ఈ ఉపకారములు అన్నిటికిగాను ఇతనికి ఎంత సొమ్ము చెల్లింపమందువు?” అని అడిగెను.
4. తోబీతు “అతడు కొనివచ్చిన సొత్తులో సగము పంచియిమ్ము. అతడు అంత వేతనమునకు అర్హుడు” అని చెప్పెను.
5. కనుక తోబియా రఫాయేలును పిలిచి “నేస్తమా! నీవు తీసికొనివచ్చిన డబ్బులో సగము పుచ్చుకొనుము. నీవు నాకు చేసిన మేలుకు ఇది బహుమానము. ఇక క్షేమముగా మీ ఇంటికి పొమ్ము” అని చెప్పెను.
6. అప్పుడు రఫాయేలు ఆ తండ్రి కొడుకులను ప్రక్కకు పిలిచి వారితో ఇట్లనెను: “మీరు ప్రభువును స్తుతింపుడు. అతడు మీకు చేసిన ఉపకారములను ఎల్లరికిని విదితము చేయుడు. అప్పుడు ఇతరులు కూడ ఆ ప్రభువును సన్నుతించి కీర్తింతురు. ప్రభువు చేసిన ఉపకారములను ఎల్లరికిని తెలియజేయుడు. మీరు ఎన్నడు అతనిని స్తుతించుట మానవలదు.
7. రాజును గూర్చిన రహస్యమును ఎవరికి చెప్ప కుండుట మేలు. కాని దేవుడు చేసిన మేలును ఎల్లరికి ప్రకటించుట మంచిది. అప్పుడు అందరు ఆయనను గౌరవింతురు. మీరు మంచిచేయుదురేని మీకెట్టి కీడును కలుగదు.
8. ధనమును కూడబెట్టుకొని దుష్ట జీవితము జీవించుట కంటె చిత్తశుద్ధితో ప్రార్థనచేయుట, మంచి జీవితమును గడుపుచు దానధర్మములు చేయుట మెరుగు. బంగారమును కూడబెట్టుకొనుటకంటెను, దానముచేయుట మేలు.
9. దానము మిమ్ము మృత్యువునుండి కాపాడును. మీ పాపములనెల్ల కడిగి వేయును. దానము చేయువారు దీర్ఘాయుష్మంతులు అగుదురు.
10. పాపపు పనులను, దుష్కార్యములను చేయువారు తమకుతామే కీడుతెచ్చుకొందురు.
11. రాజును గూర్చిన రహస్యమును గుప్తముగా నుంచవలెననియు, దేవుడుచేసిన మేలులను ఎల్లరికిని ప్రకటింపవలెననియు నేను ముందుగనే చెప్పితిని. ఇప్పుడు ఏమియు దాచక మీకు పూర్ణసత్యమును తెలియజేసెదను.
12. తోబీతు! నీవు, సారా ప్రార్ధనము చేసినపుడు మీ మనవులను నేను దేవుని దివ్యసన్నిధిలో అర్పించితిని. నీవు చచ్చినవారిని పాతి పెట్టినపుడును నేనట్లే చేసితిని.
13. నీవు భోజనమునకు కూర్చుండి ఆహారము తినకయే లేచిపోయి శవమును పాతిపెట్టి వచ్చినపుడు ప్రభువు నీ విశ్వాసమును పరీక్షించుటకు నన్ను పంపెను.
14. మరియు నీకు ఆరోగ్యదానము చేయుటకును, నీ కోడలు సారాను పిశాచ పీడనము నుండి విడిపించుటకును దేవుడు నన్ను పంపెను.
15. నేను దేవుని దివ్యసన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగా నుండు ఏడుగురు దేవదూత లలో ఒకడైన రఫాయేలును.”
16. ఆ పలుకులు విని ఆ తండ్రి కొడుకులు భయకంపితులై గడగడ వణకుచు నేలమీద బోరగిల బడిరి.
17. కాని దేవదూత వారితో “మీరు భయపడకుడు. మీకెట్టి కీడు కలుగదు. ప్రభువును సదా కీర్తింపుడు.
18. నాయంతట నేను మీయొద్దకు రాలేదు. మీకు తోడ్పడుటకు ప్రభువే నన్ను మీ చెంతకు పంపెను. కనుక మీ జీవితకాలమంతయు ఆ ప్రభువును కీర్తింపుడు.
19. మీకు నేను భోజనము చేయుచున్నట్లే కన్పించితిని. మీ దృష్టికి అటుల కనిపించితినేగాని నేను యథార్ధముగా భోజనము చేయలేదు.
20. మీరు ఈ భూమి మీద ప్రభువును స్తుతించి కీర్తింపుడు. ఇపుడు నేను నన్ను పంపిన దేవుని చెంతకు వెళ్ళవలెను. మీకు జరిగిన సంఘటనలన్నిటిని పుస్తకమున వ్రాసి ఉంచుకొనుడు” అని చెప్పెను.
21. ఇట్లు చెప్పి దేవదూత ఆకసమునకు ఎగసెను. తోబీతు, తోబియా నేలమీదనుండి లేచి నిలుచుండిరి. కాని అతడు వారికి మరల కన్పింపలేదు.
22. వారు కీర్తనలతో దేవుని స్తుతించిరి. దేవదూత తమ చెంత నున్నపుడు ఆ ప్రభువు తమకు చేసిన అద్భుత వ్యాయాకార్యములకుగాను అతనిని కీర్తించిరి.
1. అప్పుడు తోబీతు ఇట్లు ప్రార్ధించెను: “నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక! ఆయన ఎల్లకాలము పరిపాలనచేయును.
2. ఆయన నరులను శిక్షించును. మరల వారిని కరుణించును. నరులను పాతాళమునకు అణగదొక్కును. మరల వారిని అచటినుండి పైకికొనివచ్చును. ఆయన నుండి తప్పించుకొను వాడెవడునులేడు.
3. యిస్రాయేలీయులారా! ప్రభువు మిమ్ము ప్రవాసమునకు పంపిన జాతుల మధ్య నుండియే మీరతనిని సన్నుతింపుడు.
4. ఈ ప్రవాసమునందుగూడ ప్రభువు తన మాహాత్మ్యమును ప్రదర్శించెను. బ్రతికున్న వారందరికిని మీరు ఆయన స్తుతులు విన్పింపుడు. ఎల్లకాలము ఆయన మనకు యజమానుడు, మనకు దేవుడు, జనకుడుగూడ.
5. ఆయన మీ దుర్వర్తనమునకు మిమ్ము శిక్షించినను, మిమ్ము మరల కరుణతో ఆదరించును. మీరు చెల్లాచెదరైయున్న అన్యజాతుల నడుమనుండి మిమ్ము మరల స్వదేశమునకు కొనిపోవును.
6. మీరు పూర్ణహృదయముతో ప్రభువును ఆశ్రయించి చిత్తశుద్ధితో ఆయనకు విధేయులుకండు. అప్పుడు ఆయన మీనుండి మొగము మరల్చుకొనక మిమ్ము ఆదుకొనుటకు సంసిద్ధుడగును. ప్రభువు మీకుచేసిన ఉపకారములకుగాను ఆయనకు వందనములు అర్పింపుడు. న్యాయమును జరిగించు ప్రభువును కీర్తింపుడు. శాశ్వతుడైన రాజును వినుతింపుడు. నామట్టుకు నేను ఈ ప్రవాసభూమినుండి ప్రభువును స్తుతించెదను. పాపపు జాతియైన ఈ ప్రజకు, ఆయన మహాశక్తిని ఎరిగించెదను. పాపాత్ములారా! మీరు దుష్కార్యములను విడనాడి ప్రభువునకు ప్రీతికలిగించు పనులుచేయుడు. అప్పుడు ఆయన మీపై కరుణబూని, మిమ్ము దయతో మనునట్లు చేయునేమో!
7. నామట్టుకు నేను ప్రభువును కీర్తింతును. ఆకాశాధిపతియైన రాజును తలంచుకొని ఆనందింతును.
8. ఎల్లరును ఆయన మాహాత్మ్యమును ఉగ్గడింతురుగాక! యెరూషలేములో ఆ ప్రభువును కీర్తింతురుగాక!
9. పవిత్రనగరమైన యెరూషలేమా! నీ ప్రజల దుష్కార్యములకుగాను ప్రభువు నిన్ను శిక్షించెను. కాని సద్వర్తనులందరిని ఆయన కరుణించును.
10. ప్రభువు మంచివాడు కనుక ఆయనను వినుతింపుడు. శాశ్వతుడైన రాజును వినుతింపుడు. యెరూషలేమూ! నీ దేవాలయమును పునర్నిర్మింతురు. నీ పౌరులు ప్రమోదము చెందుదురు. ప్రవాసమునకు పోయిన నీ ప్రజలను ప్రభువు ఆనందభరితులను చేయును. వ్యధలను అనుభవించు నీ ప్రజలను ప్రభువు కలకాలము వరకును ఆదరించును.
11. యెరూషలేమూ! ప్రతిదేశమున నీ వెలుగు దేదీప్యమానముగా ప్రకాశించును. దూరప్రాంతములనుండి పలుజాతులు నీ చెంతకువచ్చి నీ ప్రభువైన దేవుని కొనియాడుదురు. వారు ఆకాశాధిపతికి కానుకలు గూడ కొనివత్తురు. నీ వీధులలో పలుతరముల ప్రజలు సంతసముతో ప్రభువును కీర్తింతురు. నీవు దేవుడు ఎన్నుకొనిన నగరముగా , కలకాలమువరకు కీర్తిని పొందుదువు.
12. నిన్ను ముట్టడించువారు శాపగ్రస్తులగుదురుగాక! నిన్ను నాశనముచేసి నీ గోడలను కూల్చువారు, నీ బురుజులను పడగొట్టి నీ ఇండ్లను కాల్చివేయువారు శాపము పాలగుదురుగాక! నిన్ను పునర్నిర్మాణము చేయువారు దీవెనలు పొందుదురుగాక!
13. యెరూషలేమా! ధర్మవర్తనులైన నీ ప్రజలను చూచి సంతసింపుము. వారు ప్రవాసమునుండి తిరిగివచ్చి నీ వీధులలో శాశ్వతుడైన ప్రభువును సన్నుతింతురు.
14. నిన్ను ఆదరాభిమానములతో చూచువారు నీ వృద్ధిని చూచి ఆనందించువారు ధన్యులు. నీప్రస్తుత శ్రమలను చూచి వ్యధచెందువారు నీకు ప్రాప్తించు సౌభాగ్యములను చూచి అచిరకాలముననే ఆనందము చెందుదురు.
15. నేను మహాప్రభువైన దేవుని సన్నుతింతును.
16. యెరూషలేమును పునర్నిర్మాణము చేయుదురు. ఆ నగరము కలకాలము ప్రభువునకు వాసస్థలమగును. యెరూషలేమూ! నీ భావిసంతానము నీ వైభవమును కన్నులార గాంచి ఆకాశాధిపతియైన దేవుని సన్నుతించునపుడు నేనెంతగా ప్రమోదము చెందుదునో! నీ ద్వారములను నీలమణులతోను, పచ్చలతోను పునర్నిర్మింతురు. నీ ప్రాకారములను విలువగల రాళ్ళతో కట్టుదురు. నీ కోటలను బంగారముతో కట్టుదురు. వాని బురుజులను మేలిమి బంగారముతో నిర్మింతురు.
17. నీ వీధులలో గోమేధికములను, చలువరాళ్ళను పరుచుదురు. నీ వీధులలో సంతోషగీతములు విన్పించును. నీ గృహములన్నిటినుండి “యిస్రాయేలు ప్రభువునకు స్తుతికలుగునుగాక!” అను నినాదము పిక్కటిల్లును. యెరూషలేమూ! ప్రభువు నీ ప్రజలను దీవించును. వారు అతని దివ్యనామమును సదా కీర్తింతురు.
1-2. తోబీతు ఈ రీతిగా స్తుతిగీతమును ముగించెను. గ్రుడ్డివాడగునప్పటికి తోబీతునకు అరువది రెండేండ్లు. దృష్టిని పొందినపిదప అతడు మరల సంపన్నుడయ్యెను. మరల దానధర్మములు చేసెను. దేవుని స్తుతించి అతని మాహాత్మ్యమును ఎల్లరికిని వెల్లడి చేసెను. అటు తరువాత అతడు తన నూటపండ్రెండవ యేట మరణించెను. అతనిని నీనెవె నగరముననే గౌరవప్రదముగా పాతిపెట్టిరి.
3. తోబీతు చనిపోకముందు కుమారుని పిలిచి ఇట్లు ఉపదేశము చేసెను:
4. “నాయనా! నీవు నీ పిల్లలను తీసికొని సత్వరమే మాదియాకు వెళ్ళిపొమ్ము. నీనెవె పట్టణమునకు శిక్షపడునని ప్రభువు నహూము ప్రవక్తచేత పలికించిన ప్రవచనము అనతికాలముననే నెరవేరితీరునని నా నమ్మకము. నీనెవె నగరమును గూర్చియు, అస్సిరియా రాజ్యమును గూర్చియు ప్రభువు దూతలైన యిస్రాయేలు ప్రవక్తలు పలికిన ప్రవచనము లన్నియు నెరవేరి తీరును. తగుకాలము వచ్చినపుడు వారు చెప్పిన సంగతులన్నియు నెరవేరును. ప్రభువు పలికినపలుకులు తప్పక నెరవేరునని నేను గాఢముగా విశ్వసించుచున్నాను. ప్రవక్తల ప్రవచనములలో ఒక్కటియు తప్పిపోదు. నీ మట్టుకు నీవు అస్సిరియా బబులోనియా దేశములలోకంటె మాదియాలోనే భద్రముగా ఉందువు. శత్రువులు యిస్రాయేలు దేశమున వసించు మనతోడి యూదులను ఆ నేలమీదినుండి చెదరగొట్టి ప్రవాసమునకు కొనిపోదురు. యిస్రాయేలు దేశమంత బీడువడును. సమరియా యెరూషలేము నగరములు పాడువడును. శత్రువులు దేవుని మందిరమును కూలద్రోసి కాల్చివేయగా అది కొంతకాలముపాటు శిథిలమై ఉండును.
5. కాని ప్రభువు మరల తన ప్రజలను కరుణించి వారిని యిస్రాయేలు దేశమునకు కొనివచ్చును. వారు దేవుని మందిరమును మరల కట్టుదురు. కాని అది మొదటి మందిరమంత సుందరముగా ఉండదు. తగుకాలము వచ్చువరకు ఆ మందిరము ఆ రీతిగనే ఉండును. కాని ఉచితకాలము రాగానే యిస్రాయేలీయులెల్లరును ప్రవాసమునుండి తిరిగివచ్చి యెరూషలేము నగరమును పూర్వపు రీతినే సుందరముగా నిర్మింతురు. వారు యిస్రాయేలు ప్రవక్తలు నుడివినట్లే యెరూషలేమున దేవునిమందిరమును గూడ నిర్మింతురు.
6. అప్పుడు సకలజాతి ప్రజలు ప్రభువునొద్దకు తిరిగివత్తురు. వారు ఆయన ఒక్కనినే నిజమైన దేవునిగ భావించి పూజింతురు. తమను అపమార్గము పట్టించిన విగ్రహములను విడనాడుదురు.
7. ఆ జనులెల్లరు శాశ్వతుడైన ప్రభువుచిత్తము ప్రకారము జీవించుచు, అన్నివేళల ఆయనను కొనియాడుదురు. ఆ కాలమున ప్రభువు తనకు విధేయులైన యిస్రాయేలీయులు అందరిని రక్షించును. ప్రభువు వారినెల్లరిని యెరూషలేమునకు కొనిరాగా వారు అబ్రహాము భుక్తము చేసికొనిన భూమిని స్వాధీనము కావించుకొని ఆ నేలమీద కలకాలము సురక్షితముగా వసింతురు. ప్రభువును చిత్తశుద్ధితో సేవించువారందరు ప్రమోదము చెందుదురు. కాని పాపకార్యములు చేయు దుర్మార్గులను మాత్రము ఆయన నేలమీదినుండి తుడిచివేయును.
8. నాయనలారా! మీరు నా ఉపదేశములను పాటింపుడు. దేవుని చిత్తశుద్ధితో సేవింపుడు. ఆయనకు ప్రియమైన కార్యములను చేయుడు.
9. దేవుని ఆజ్ఞల ప్రకారము జీవింపవలెననియు, పేదలకు దానధర్మ ములు చేయవలెననియు, ఎల్లవేళలందు ప్రభువును జ్ఞప్తియందుంచుకొని ఆయనను పూర్ణహృదయముతో కీర్తింపవలెననియు మీ బిడ్డలకు నేర్పుడు.
10. కుమారా! నీవు నీనెవెను విడనాడి వెళ్ళి పొమ్ము. ఇచట వసింపకుము. నీ తల్లి చనిపోయినపుడు ఆమెను నా ప్రక్కనే పాతి పెట్టుము. అటుపిమ్మట ఒకనాడు కూడ జాగుచేయక ఈ నగరమును విడిచి వెళ్ళిపొమ్ము. ఇచటి ప్రజలు దుష్టులు. సిగ్గు సెరము లేక పాపకార్యములు చేయువారు. నాదాబు తన పెంపుడు తండ్రియైన అహీకారునకు ఎట్టి కీడుతల పెట్టెనో చూడుము. నాదాబు అహీకారును భయ పెట్టగా అతడు సమాధిలో దాగుకొనెను. అయినను అహీకారు సమాధినుండి వెలుపలికి వచ్చి మరల వెలుగునుచూచెను. కాని అహీకారును చంపయత్నించి నందులకుగాను దేవుడు నాదాబును నిత్యాంధకారములోనికి త్రోసివేసెను. అహీకారు దానధర్మములు చేసెను గనుకనే అతడు నాదాబుపన్నిన మృత్యుపాశములలో తగులుకొనలేదు. కాని నాదాబు తానుపన్నిన ఉచ్చులలో తానే తగుల్కొని నాశనమయ్యెను.
11. దీనిని బట్టే దానము చేయుటవలన కలుగు మేలెట్టిదో, కీడు తల పెట్టుటవలన కలుగు వినాశనమెట్టిదో గుర్తింపుడు. ఇతరులకు కీడు చేయుటవలన చావుమూడును. నాయనా! ఇక నా బలము సన్నగిల్లిపోవుచున్నది.” అంతట వారు తోబీతును పడకమీద పరుండబెట్టగా అతడు కన్నుమూసెను. వారు అతనిని గౌరవ మర్యాదలతో పాతిపెట్టిరి.
12. తరువాత తల్లి చనిపోగా తోబియా ఆమెను తండ్రి ప్రక్కనే పాతి పెట్టెను. తదనంతరము అతడు భార్యతోను, పిల్లలతోను మాదియా దేశములోని ఎక్బటానాకు వెళ్ళి అచట తన మామ రగూవేలునింట వసించెను.
13. అతడు వృద్ధులైన అత్తమామలను మిగుల గౌరవముతో చూచుకొనెను. ఆ వృద్దులు చనిపోయినపుడు వారిని ఎక్బటానాలోనే పాతి పెట్టెను. తోబియా తండ్రి ఆస్తికివలె, మామ ఆస్తికిని వారసు డయ్యెను.
14. అతడు ఎల్లరి మన్ననలకును పాత్రుడై నూటపదునేడేండ్లు జీవించి తనువు చాలించెను.
15. తాను చనిపోకముందు నీనెవె నాశనమగుట గూర్చి మాదియారాజు సియాఖరు నీనెవె పౌరులను బందీలుగా కొనిపోవుట గూర్చియు వినెను. ప్రభువు అస్సిరియా రాజు నెబుకద్నెసరును, అతని ప్రజలను, నీనెవె పౌరులను శిక్షించినందుకుగాను ఆయనను స్తుతించెను. తోబియా చనిపోకముందు నీనెవె నగరము నకు పట్టిన దుర్గతిని చూచి సంతసించి నిత్యుడైన దేవునికి వందనములు అర్పించెను.