ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

విలాప గీతములు

 1. ఒకప్పుడు జనసంపూర్ణమైయున్న నగరము నేడు ఎట్లు ఏకాకియైనది? జాతులలో పేరెన్నికగనినది నేడు వితంతువైనది. దేశములకు మకుటమైనది నేడు బానిసఅయ్యెను.

2. ఆ పురము రేయెల్ల ఏడ్చుచున్నది. దాని చెంపలపై కన్నీళ్ళు జారిపడుచున్నవి. పూర్వప్రియులలో ఒక్కడును దానినోదార్చుటలేదు స్నేహితులందరును దానిని వంచించి, దానికి విరోధులైరి.

3. యూదీయులు శ్రమలనుభవించి, బానిసత్వమున జిక్కి బందీలైరి. వారు జాతులనడుమ వసించుచు విశ్రాంతిని బడయజాలకున్నారు. శత్రువులు చుట్టుముట్టిరి కాన వారికి తప్పించుకొను మార్గమే లేదు.

4. సియోనునకు పోవు మార్గములు విలపించుచున్నవి. నగరమున జరుగు పండుగలకు నియామకబృందములు ఎవరును వచ్చుటలేదు ఆ నగరద్వారములు నిర్మానుష్యమైనవి. యాజకులు దుఃఖించుచున్నారు.అచట పాటలు పాడు యువతులు బాధలకు గురియైరి. నగరము ఘోరవ్యధను అనుభవించుచున్నది.

5. శత్రువులు విజయమును చేపట్టి నగరముమీద అధికారము నెరపుచున్నారు. ఆ నగరము చేసిన బహు పాపములకుగాను ప్రభువు దానిని శ్రమలపాలు చేసెను. విరోధులు దాని బిడ్డలను బంధించి చెరగొనిపోయిరి.

6. సియోను కుమారి వైభవము అంతరించెను. దాని నాయకులు మేత దొరకక చిక్కిపోయిన దుప్పులవంటి వారైరి. వేటకాండ్రనుండి పారిపోయి బలము కోల్పోయిన లేళ్ళవంటి వారైరి.

7. యెరూషలేము తన బాధలలో తన పూర్వఔన్నత్యమును జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఆ నగరప్రజలు శత్రువులకు చిక్కి హతులైనపుడు, దానినెవ్వరును ఆదుకోరైరి. విరోధులు దాని ప్రతిష్ఠంభనను చూచి దానిని అపహాస్యము చేసిరి.

8. యెరూషలేము ఘోరపాపములు చేసి అపవిత్రురాలయ్యెను. పూర్వము మెచ్చుకొనినవారు ఇపుడు దానిని చిన్నచూపు చూచిరి. వారు దాని నగ్నత్వమును గాంచిరి. అది శోకించుచు ప్రక్కకు తిరిగెను.

9. ఆమె అపవిత్రత అందరికి తెలిసిపోయెను. అది తనకు పట్టనున్న దుర్గతిని గూర్చి భయపడదయ్యెను. అది దారుణముగా పడిపోయెను. దానిని ఓదార్చువారెవరును లేరైరి. ప్రభూ! శత్రువులు నన్నోడించిరి. నీవు నా వేదన చూడుమని అది ఘోషించున్నది.

10. శత్రువులు దాని నిధులనెల్ల దోచుకొనిరి. ప్రభూ! నీవు నీ భక్త సమాజమున ప్రవేశింపరాదని శాసించిన అన్యజాతివారు దేవాలయమును ప్రవేశించుటను అది చూచెను.

11. ఆ నగర పౌరులు భోజనము కొరకు అలమటించుచున్నారు. వారు తమ నిధులను భోజనము కొరకు మారకము చేసికొని, తమ ప్రాణములను నిలబెట్టుకోగోరుచున్నారు. ప్రభూ! నాకెంతటి హీనదశ ప్రాప్తించినదో చూడుమని ఆ నగరము రోదించున్నది.

12. ఈ త్రోవవెంట పోవువారందరును నావైపు పారజూడుడు. ప్రభువు ఉగ్రకోపముతో నన్ను శిక్షించెను. నాకు కలిగిన దుఃఖమువంటి దుఃఖము మరెవరికైన కలిగినదేమో మీరే చూడుడు.

13. ప్రభువు పైనుండి అగ్నిని పంపెను. అది నన్ను లోలోపల దహించెను. ఆయన నా పాదములకు ఉచ్చులు పన్ని నన్ను క్రింద పడవేసెను. నన్ను పరిత్యజించి నేను నిరంతర బాధను అనుభవించునట్లు చేసెను.

14. ఆయన నా పాపములను పరిశీలించి చూచెను. వానినెల్ల మూటగట్టి కాడివలె నా మెడకు అంటగట్టెను. వాని బరువు నా మీద బడగా, నేను బలమును కోల్పోతిని. ఆయన నన్ను శత్రువుల చేతికి అప్పగించెను. నేను వారి నెదిరింపజాలనైతిని.

15. బలాఢ్యులైన నా సైనికులను ప్రభువు చిన్నచూపు చూచెను. ఆయన పంపిన సైన్యము ఆ యువకులను నాశనము చేసెను. ఆయన నా ప్రజలను గానుగలో ద్రాక్షపండ్లవలె నలగదొక్కెను.

16. కావుననే నేను విలపించుచున్నాను. నా నేత్రములు దుఃఖబాష్పములతో నిండియున్నవి. నన్ను ఓదార్చి తెప్పరిల్లజేయు వారెవ్వరును లేరాయెను. నా శత్రువు నన్నోడించెను. నా బిడ్డలు నాశనమైపోయిరి.

17. ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. యావే యాకోబునకు చుట్టునున్న వారిని విరోధులుగా నియమించగా, యెరూషలేము వారికి మైలపడినదానిగా నెంచబడెను.

18. ప్రభువు న్యాయవంతుడు. నేను ఆయన ఆజ్ఞలను ధిక్కరించితిని. జాతులెల్ల నా పలుకులాలించునుగాక! నా బాధనవలోకించునుగాక! , నా యువతీయువకులను బానిసలుగా కొనిపోయిరి.

19. నా ప్రియుల నుండి సహాయము అర్ధించితినిగాని వారు నన్నుమోసము చేసిరి. నా యాజకులును, నాయకులును తమ ప్రాణములు నిలబెట్టుకొనుటకుగాను, భోజనము కొరకు గాలించుచు, నగరవీధులలో కన్నుమూసిరి.

20. ప్రభూ! నీవు నా వేదనను గుర్తింపుము, నేను ఘోరవ్యధను అనుభవించుచున్నాను. నేను నీపై తిరుగుబాటు చేసితిని. కనుక నా హృదయము సంతాపము చెందుచున్నది. వెలుపల ప్రజలు కత్తివాత బడుచున్నారు, మృత్యువు ఇండ్లలో కూడ ప్రవేశించినది.

21. నా నిట్టూర్పులు గమనింపుము. నన్ను ఓదార్చు వాడెవడును లేడాయెను. నీవు నన్ను నాశనము చేయగా చూచి, నా శత్రువులు సంతసించుచున్నారు. నీవు పేర్కొనిన శిక్షాదినమును కొనిరమ్ము. నావలె నా శత్రువులను కూడ బాధలకు గురిచేయుము.

22. నీవు వారి దుష్కార్యములను గమనింపుము. నా పాపములకు నన్ను దండించినట్లే, వారిని గూడ దండింపుము. నేను మిగుల నిట్టూర్పు విడుచుచున్నాను. నా గుండె దుర్బలమైపోయినది”.

 1. ప్రభువాగ్రహము చెంది సియోను కుమారిని చీకటిలో ముంచెను. ఆయన యిస్రాయేలు వైభవమును నేలమీదికి విసరికొట్టెను. తాను కోపము చెందిన దినమున తన పాదపీఠమును గూడ జ్ఞాపకము చేసుకొనలేకపోయెను.

2. ప్రభువు నిర్దయతో యూదాలోని పల్లెలన్నిటిని నాశనము చేసెను. ఆగ్రహముతో యూదా కోటలను కూల్చివేసెను. ఆ రాజ్యమును, దాని పాలకులను , క్రిందపడద్రోసి అవమానమున ముంచెను.

3. ఆయన ప్రచండకోపముతో యిస్రాయేలు బలమును ధ్వంసము చేసెను. శత్రువు మన మీదికెత్తివచ్చినపుడు తన సహాయమును నిరాకరించెను. మనపై ఆగ్రహము చెందిన అగ్గివలెమండి సమస్తమును కాల్చివేసెను.

4. ఆయన శత్రువువలె విల్లువంచి మన మీదికి బాణములు గురిపెట్టెను. కంటికి ప్రమోదమును గూర్చు వాటినన్నింటిని వధించెను. సియోను కుమారిమీద తన కోపమును నిప్పువలె కురిపించెను.

5. ఆయన పగవానివలె యిస్రాయేలును నాశనము చేసెను. దాని ప్రాసాదములను కోటలను నేలమట్టము చేసెను. యూదా కుమారిని తీవ్ర శోకమున ముంచెను.

6. ఆయన తన నివాస గృహమును తోటలోని గుడిసెనువలె కూల్చివేసెను. భక్తసమాజము ప్రోగగు మందిరమును , ధ్వంసము చేసెను. సియోను ప్రజలు తమ ఉత్సవ దినములను, విశ్రాంతి దినములను విస్మరించునట్లు చేసెను. ఉగ్రకోపముతో రాజును, యాజకుని త్రోసివేసెను.

7. ప్రభువు తన బలిపీఠమును పరిత్యజించెను. తన దేవాలయమును అసహ్యించుకొనెను. శత్రువులు ఆ దేవాలయ గోడలను కూల్చివేయునట్లు చేసెను. ఉత్సవదినమున మనము ఆలయములో, హర్షనాదము చేసినట్లే, విరోధులు ఆ దేవాలయమున విజయనాదము చేసిరి.

8. ప్రభువు సియోను కుమారి ప్రాకారములు కూలిపోవలెనని సంకల్పించుకొనెను. "ఆయన వానిని కొలనూలుతో కొలిచి పూర్ణ వినాశనమునకు గురిచేసెను.  బురుజులును, గోడలును శోకించి నేలకొరిగినవి.

9. నగరద్వారములు కూలి నేలలో దిగబడినవి. వాని అడ్డుగడెలు విరిగిపోయినవి. రాజును, అధిపతులును ప్రవాసమునకు పోయిరి. ధర్మశాస్త్రమును బోధించువారు లేరాయెను. ప్రవక్తలు ప్రభువునుండి దర్శనములు బడయజాలరైరి.

10. సియోను వృద్దులు నేలపై చతికిలబడి మౌనము వహించిరి. గోనెతాల్చి తలపై బూడిద చల్లుకొనిరి. యోరుషలేము యువతులు తలలు నేలమీదికి వంచిరి.

11. ఏడ్చి ఏడ్చి నా కన్నులు మసకలు క్రమ్మినవి. నా అంతరాత్మ అంగలార్చుచున్నది. నా ప్రజల వినాశనమును గాంచి నేను శోకముతో క్రుంగిపోతిని. చిన్నపిల్లలు, పసికందులు పురవీధులలో సొమ్మసిల్లి పడిపోవుచున్నారు.

12. వారు తమ తల్లులను చూచి మాకు అన్నపానీయములేవి? అని అలమటించుచున్నారు. గాయపడిన వారివలె నగరవీధులలో కూలుచున్నారు. తల్లుల ఒడిలో ఒదిగి ప్రాణములు విడుచుచున్నారు.

13. యోరూషలేము కుమారీ! నేను నిన్ను ఎట్టి మాటలచే హెచ్చరించుదును? నిన్నెవరితో సమపోల్చగలను? సియోను కుమారీ! నేను నిన్నెట్లు ఓదారును? నీవలె వ్యధలు అనుభవించిన వారెవ్వరు? నీ వినాశనము సముద్రమువలె అనంతమైనది. నిన్ను ఉద్దరింపగల వారెవ్వరు?

14. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములను చూచిరి. నీవు చెరలోనికి పోకుండ తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్ధమైన ఉపదేశములను పొందినవారైరి. త్రోవతప్పించు దర్శనములను చూచినవారైరి.

15. నీ ప్రక్కగా పోవువారు నిన్ను చూచి నవ్వుచు చప్పట్లు కొట్టుదురు. యెరూషలేము కుమారీ! వారు నిన్ను గాంచి తలలూపి గేలిచేయుదురు. “సంపూర్ణ సౌందర్యరాశి, లోకమంతటికిని సంతోషదాయినియైన నగరమని పిలువబడునది ఇదియేనా? అని వినోదింతురు.

16. నీ శత్రువులు నీవైపు చూచి నోరు తెరచి వేళాకోళము చేయుదురు. పెదవులు విరచి పండ్లు కొరికి మనమీ నగరమును నాశనము చేసితిమి. ఆహా! ఈ రోజు కొరకే మనము వేచియుంటిమి. దానిని కంటితో చూచితిమి కదా! అని పలుకుదురు.

17. ప్రభువు తన సంకల్పము నెరవేర్చుకొనెను. పూర్వమే తాను నిర్ణయించిన కార్యమును నిర్వహించెను. నిర్ధయతో మనలను నాశనము చేసెను. శత్రువులు మనలను జయించి ఆనందముతో పొంగిపోవునట్లు చేసెను.

18. యెరూషలేము కుమారీ! నీ ప్రాకారములు ప్రభువునకు మొర పెట్టునుగాక! నీ కన్నీళ్ళు రేయింబవళ్ళు ఏరువలే ప్రవహించునుగాక! నీవు ఎడతెగక విశ్రాంతి నొందక బాష్పము లొలుకుదువుగాక!

19. నీవు రేయి ప్రతి జామున లేచి ప్రభువునకు మొరపెట్టుము. నీ హృదయమును విప్పి ప్రభువు ఎదుట మనవి చేయుము. ఆకలివలన వీధి మూలలో చనిపోవు నీ బిడ్డలకొరకు ఆయనను ప్రార్ధింపుము.

20. ప్రభూ చూడుము! నీవు ఎవరికైనను ఇన్ని శ్రమలు తెచ్చిపెట్టితివా? స్త్రీలు తాము కని, లాలించిన బిడ్డలనే తినవలెనా? యాజకులను, ప్రవక్తలను నీ దేవాలయములోనే వధింపవలెనా?

21. వృద్దులును, పిల్లలును వీధులలో చచ్చిపడిపోయిరి. యువతీయువకులు శత్రువుల కత్తికి బలియైరి. నీకు కోపము వచ్చిన రోజున నీవు వారిని నిర్దయతో చంపివేసితివి.

22. నీవు నలుదిక్కులనుండి శత్రువులను నా మీదికి రప్పించితివి. వారు ఉత్సవమునకు వచ్చినట్లుగా నా మీదికెత్తివచ్చిరి. నీవు కోపించిన దినమున ఎవడును తప్పించుకోలేదు, ఎవడును మిగులలేదు. నేను పెంచి పెద్దచేసిన పిల్లలనే - నా శత్రువులు హతమార్చిరి.

 1. నేను ప్రభువు కోపదండనమునకు గురియై బాధలను చవిచూచితిని.

2. ఆయన నన్ను నెట్టుకొనిపోయి  వెలుగు ఏ మాత్రము లేని చీకటిలో నడిపించెను

3. నామీద చేయిచేసికొని దినమెల్ల నన్ను కొట్టెను.

4. నా శరీరము, నా చర్మము కృశించిపోవునట్లు చేసి, నా ఎముకలను విరుగగొట్టెను.

5. దుఃఖమయమును, విషాదపూరితమునైన చెరలో నన్ను బంధించెను.

6. నన్ను నిర్బంధ పెట్టి, పూర్వమే గతించినవారు నివసించు చీకటిలో నేనును వసించునట్లు చేసెను.

7. ఆయన నా చుట్టు కంచెవేసెను. గొలుసులతో నేను బందీనైతిని, ఇక తప్పించుకోజాలను.

8. నేను సాయము కొరకు పెద్దగా అరచి గీ పెట్టినను, ఆయన నా ప్రార్ధననాలింపలేదు.

9. ఆయన రాతిగోడలతో నామార్గమును నిరోధించెను నా త్రోవకు అడ్డములు పెట్టెను.

10. ఎలుగుబంటివలె నా కొరకు పొంచియుండెను. సింగమువలె నా మీదికి దుమికెను.

11. నన్ను త్రోవనుండి ప్రక్కకు తరిమి ముక్కలు ముక్కలుగా చీల్చివేసి, అక్కడనే వదలివేసెను.

12. తన విల్లు వంచి, నా మీదికి బాణములెక్కుపెట్టెను.

13. తన అమ్ములపొదిలోని బాణములను నా శరీరమున గ్రుచ్చుకొనునట్లు రువ్వెను.

14. ప్రజలెల్లరును నన్ను చూచి నవ్వుచున్నారు. దినమెల్ల నన్నెగతాళి చేయుచున్నారు.

15. చేదు వస్తువులే నాకు అన్నపానీయములైనవి. మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను.

16. నన్ను బండల మీద పడవేసి నా పండ్లు రాలగొట్టెను. బూడిదలో నన్ను పొర్లించెను.

17. నేను శాంతి సంక్షేమములను విస్మరింపవలసి వచ్చినది.

18. నా సత్తువ క్షీణించిపోయినది. ప్రభువుమీద నమ్మకము తొలగిపోయినదనుకొంటిని.

19. నా దురావస్థను, నా వ్యాకులమును నేను త్రాగిన మాచిపత్రి చేదును జ్ఞాపకముంచుకొనుము.

20. నాకు నిత్యము ఆ తలపులే తట్టుచున్నవి నేను విషాదమున మునిగితిని.

21. కాని ఈ అంశమును తలంచుకొనగా నాకు మరల నమ్మకము కలుగుచున్నది.

22. ప్రభువు ప్రేమ గతింపలేదు. ఆయన కరుణ సమసిపోలేదు.

23. ప్రతి ఉదయమున ఆయన ఆ భాగ్యములు క్రొత్తగా దయచేయును. ఆయన నమ్మదగినతనము అంత గొప్పది.

24. ప్రభువు నాకు భాగధేయము కనుక నేను ఆయనను నమ్మెదను.

25. తనను నమ్మువారికి, తనను వెదుకువారికి ప్రభువు మేలుచేయును.

26. కావున మనము ప్రభువు రక్షణము కొరకు ఓపికతో వేచియుండుట మేలు.

27. మనము బాల్యమునుండే ఈ ఓపికను అలవరచుకొనుట మంచిది.

28. ప్రభువు మనలను కడగండ్లపాలు చేసినపుడు మనము ఏకాంతముగను, మౌనముగను కూర్చుండవలెను.

29. మనము దైవచిత్తమునకు పూర్తిగా లొంగవలెను. అపుడు ఆయన ఆదుకోలు లభించిన లభింపవచ్చును.

30. ఆయన మనలను చెంపలు వాయించి అవమానమున ముంచినను మనము సహింపవలయును.

31. ప్రభువు నరులను శాశ్వతముగా పరిత్యజింపడు.

32. ఆయన మనలను దుఃఖముపాలు చేసినప్పుడును, మహాప్రేమతో మనలను కరుణించును.

33. నరులను బాధించి దుఃఖపెట్టుటవలన ఆయనకు ప్రీతి కలుగదు.

34. శత్రువులు దేశములోని బందీలను కాళ్ళక్రింద పడవేసి తొక్కినపుడు

35. మహోన్నతుని లెక్కచేయక నరులహక్కులను భంగపరచినపుడు,

36. న్యాయస్థానమున న్యాయమును చెరచినపుడు, ప్రభువు గమనించితీరును,

37. ప్రభువు అనుమతి లేనిదే ఎవరును ఏ కార్యములను జరుపజాలరు.

38. మహోన్నతుని ఆజ్ఞవలననే మంచిగాని, చెడుగాని జరుగును.

39. దేవుడు మన పాపములకు మనలను శిక్షించినపుడు, మనము ఫిర్యాదు చేయనేల?

40. మనము మన మార్గములను పరిశీలించి చూచుకొని ప్రభువువద్దకు తిరిగివత్తము.

41. ఆకాశమందున్న దేవునివైపు మనసు త్రిప్పి, చేతులెత్తి ఇట్లు ప్రార్థింతము.

42. మేము నీ మీద తిరుగబడితిమి, పాపము కట్టుకొంటిమి. నీవు మమ్ము క్షమింపవైతివి.

43. నీ కోపము నిన్ను మా నుండి మరుగుపరచెను. నీవు మమ్ము వెన్నాడి నిర్దయతో చంపివేసితివి.

44. నీవు ఆగ్రహమును మేఘమువలె కప్పుకొంటివి. మాప్రార్థనలు ఆ మబ్బులోనికి ప్రవేశింప జాలవయ్యెను.

45. నీవు మమ్ము లోకములోని ప్రజలకు చెత్తదిబ్బను చేసితివి.

46. మా శత్రువులు మమ్ము గేలిచేసి అవమానించిరి.

47. మేము భయాపాయములకు గురియైతిమి, వినాశమున చిక్కితిమి.

48. నా ప్రజల దుస్థితి చూడగా, నా నేత్రముల నుండి కన్నీరు ఏరులుగా పారుచున్నది.

49-50. ప్రభువు ఆకాశమునుండి క్రిందికి పారజూచి మనలను గమనించువరకును నా కన్నీళ్ళు ఏటివలె ఎడతెగక ప్రవహించుచునే ఉండును.

51. నగరములోని స్త్రీలకు పట్టిన దుర్గతిచూచి నా హృదయము వ్యధచెందుచున్నది.

52. శత్రువులు నన్ను నిష్కారణముగా ద్వేషించి, పక్షినివలె వేటాడిరి.

53. వారు నన్ను సజీవునిగా గోతిలో పడద్రోసి, దానిని బండతో కప్పివేసిరి.

54. నీళ్ళు నన్ను ముంచివేసెను. ఇక నాకు చావు తప్పదనుకొంటిని.

55. ప్రభూ! గోతి అడుగుననుండి నేను నీకు మొరపెట్టితిని.

56. నా మొర వినుమని నేను వేడుకొనగా నీవు నా ప్రార్థననాలించితివి.

57. నేను నీకు విన్నపము చేసినపుడు, నీవు నా చెంతకు వచ్చి, భయపడకుమని పలికి నాకు అభయమిచ్చితివి.

58. ప్రభూ! నీవు నాపక్షమున నిలిచి నన్నాదుకొంటివి. నా ప్రాణమును కాపాడితివి.

59. నీవు నాకు అనుకూలముగా తీర్పు చెప్పుము. నాకు జరిగిన అన్యాయము నీకు తెలియును.

60. నా శత్రువులు నన్ను ద్వేషించి, నా మీద కుట్రలు పన్నుటను నీవెరుగుదువు.

61. ప్రభూ! వారు నన్ను తిట్టుచుండగా నీవు వింటివి. వారి కుతంత్రములు నీకు తెలియును.

62. వారు దినమెల్ల నన్నుగూర్చి మాటలాడుచున్నారు నా మీద పన్నాగములు పన్నుచున్నారు.

63. వారు కూర్చుండుటను, లేచుటను చూడుము. నేను వారి గెలి పాటలకు భావమైతిని.

64. ప్రభూ! వారి చెయిదములకుగాను నీవు వారికి ప్రతీకారముచేయుము.

65. వారిని శపించి నిరాశపాలుచేయుము.

66. వారిని కోపముతో వెన్నాడుము. ఆకాశము క్రింద వారిని అడపొడ కానరాకుండ చేయుము.”

 1. మన బంగారమునకు వన్నెతరిగెను. మన మేలిమిబంగారము, కాంతిని కోల్పోయెను. దేవాలయపు రాళ్ళను కొనిపోయి వీధులలో పడవేసిరి.

2. సియోను యువకులు మేలిమిబంగారము వంటివారు. కాని యిపుడు వారిని కుమ్మరి చేసిన మట్టికుండలతో సమానముగా నెంచిరి.

3. నక్కలు కూడ పిల్లలకు పాలిచ్చి పెంచును. కాని నా ప్రజలు ఎడారిలోని నిప్పుకోళ్ళవలె తమ పిల్లలపట్ల క్రూరముగా ప్రవర్తించిరి.

4. దప్పికవలన చంటిబిడ్డల నాలుకలు అంగిటికంటుకొని పోవుచున్నవి. పసిగందులు అన్నముకొరకు ఏడ్చుచున్నారు గాని ఎవరును తిండి పెట్టుటలేదు.

5. పూర్వము శ్రేష్ఠమైన భోజనములు ఆరగించినవారు ఇపుడు వీధులలో అలమటించుచున్నారు. పూర్వము రాజవస్త్రములు తొడిగినవారు ఇపుడు కూటి కొరకు చెత్తకుప్పలు గాలించుచున్నారు.

6. నా ప్రజలకు పడిన శిక్ష సొదొమ ప్రజల శిక్షను మించినది. దైవహస్తము సొదొమ ప్రజలను అకస్మాతుగా శిక్షించెను

7. పూర్వము మన రాజకుమారులు పాలకంటెను, మంచుకంటెను నిర్మలముగా ఉండిరి. వారి తనువులు కెంపులవలె అరుణ కాంతులొలికెను. నీలమణులవలె ప్రకాశించెను.

8. కాని ఇప్పుడు వారి మొగములు బొగ్గువలె నల్లబారెను. వీధులలో వారిని గుర్తించువారే లేరైరి. వారి చర్మము కొయ్యవలె ఎండిపోయి ఎముకలకంటుకొనెను.

9. ఆకలివలన చనిపోవు వారికంటె యుద్ధమున గతించిన వారే మెరుగు. ఆకటివాత బడినవారు తిండి దొరకక నవిసినవిసి చనిపోయిరి.

10. ప్రేమ హృదయులయిన స్త్రీలు తమ చేతులతోనే తమ శిశువులను ఉడుకబెట్టుకొనిరి. నా ప్రజలకు తిప్పలు వచ్చిన వేళ ఆ పసిగందులే వారికి ఆహారమైరి.

11. ప్రభువు మహోగ్రుడై తన ఆగ్రహమును కుమ్మరించెను. ఆయన సియోనునకు నిప్పుపెట్టగా, అది ఆ నగర పునాదులను కూడ కాల్చివేసెను.

12. లోకములోని జనులుకాని, అన్యజాతుల రాజులుకాని, శత్రువులు యెరూషలేము ద్వారములలో ప్రవేశింతురని అనుకొనలేదు.

13. ప్రవక్తల పాపమువలన, యాజకుల అపరాధమువలనను ఈ కార్యము జరిగెను. వారు నగరమున నిర్దోషుల రక్తము నొలికించిరి.

14. వారు నెత్తురు మరకలతో అపవిత్రులైరి గ్రుడ్డివారివలె పురవీధులలో తిరిగిరి. కావున ప్రజలు వారి బట్టలను కూడ ముట్టరయిరి

15. ప్రజలు వారిని చూచి, దూరముగా పొండు, మీరు అపవిత్రులైతిరి, దూరముగా పొండు మమ్ము ముట్టుకొనకుడు అని అరచిరి. వారు అన్యజాతులవద్దకు పోయిరి కాని ఆ ప్రజలు వారు మనలో వసింపరాదు అని స్వీకరింపలేదు.

16. ప్రభువు వారిని పట్టించుకోడయ్యెను ఆయన వారిని తరిమివేసెను. ఆయన మన యాజకులను కరుణింపలేదు. మన పెద్దలను దయచూడలేదు.

17. మనము నిరకముగా సహాయము కొరకెదురు చూచితిమి. మనలను రక్షింపలేని దేశమునుండి " గంపెడాశతో ఆశ్రయము కొరకు ఎదురుచూచితిమి.

18. శత్రువులు మన కొరకు కాచుకొనియుండిరి. కనుక మనము వీధులలో నడవజాలమైతిమి. మన రోజులు ముగిసెను. మన అంతము సమీపించెను.

19. మన విరోధులు గరుడపక్షి కంటే వేగముగా మన మీదికి దిగివచ్చిరి. ఆ వారు కొండలపై మనలను వెన్నాడిరి. ఎడారిలో మన కొరకు పొంచియుండిరి.

20. మనకు ప్రాణాధారమైన వానిని, ప్రభువు అభిషేకించిన వానిని, అన్యజాతులనుండి మనలను కాపాడునని ఆశించినవానిని, శత్రువులు పట్టుకొనిరి.

21. ఎదోము ఊజు ప్రజలారా! మీరు సంతసముతో పొంగిపొండు. మీరును వినాశపాత్రములోని రసమును త్రాగుదురు. తప్పద్రాగి దిగంబరులై తూలిపడుదురు.

22. సియోను ప్రజలు తమ పాపములకు పూర్ణశిక్షను అనుభవించిరి. ప్రభువు వారిని మరల ప్రవాసమునకు పంపడు. కాని ఎదోము జనులారా! ప్రభువు మిమ్ము దండించును ఆయన మీ దోషములను బట్టబయలు చేయును.

 1. ప్రభూ! మాకు కలిగిన ఆపదను జ్ఞప్తికి తెచ్చుకొనుము. మాకు కలిగిన అవమానమును పరిశీలించిచూడుము.

2. అన్యులు మా వారసత్వ పొలములను ఆక్రమించుకొనిరి. పరజాతి ప్రజలు మా ఇండ్లను స్వాధీనము చేసికొనిరి.

3. మేము మా తండ్రులను కోల్పోయి అనాథలమైతిమి. ఇపుడు మా తల్లులు వితంతువులైరి.

4. మా నీళ్ళనే మేము డబ్బిచ్చికొని తెచ్చుకోవలసి వచ్చినది. మా వంటచెరకునే మేము వెలయిచ్చి తెచ్చుకోవలసి వచ్చినది.

5. శత్రువులు మా మెడ మీద కాడి మోపి మమ్ము హింసించిరి. మేము అలసిపోయినను, మాకు విశ్రాంతి దొరకుటలేదు.

6. మేము అస్సిరియాను, ఐగుప్తును బిచ్చమడిగి, మా ప్రాణములు నిలుపుకొనుటకు వారికి లోబడియున్నాము.

7. మా పూర్వులు పాపము చేసి గతించిరి. వారి దోషములకు మేము శిక్ష అనుభవింపవలసి వచ్చినది.

8. బానిసలు మమ్మేలుచున్నారు. వారి బారినుండి మమ్ము తప్పించువారు ఎవరును లేరు.

9. నరహంతకులు పొలములో తిరుగాడుచున్నారు. మేము కూడు సంపాదించుకొనుటకు బయటికి వెళ్ళినచో, మా ప్రాణములు దక్కుటలేదు.

10. ఆకలి వలన మాకు కాక ఎక్కినది, మా చర్మము పొయ్యివలె నలుపెక్కినది.

11. శత్రువులు సియోనులో స్త్రీలను మానభంగము చేసిరి. యూదా నగరములలో కన్నెలను చెరచిరి.

12. వారు మా నాయకులను ఉరివేసిరి. మా వృద్ధులను గౌరవముతో చూడరైరి.

13. యువకులు తిరుగళ్ళు త్రిప్పవలసి వచ్చినది. బాలురు కట్టెలు మోయలేక పడిపోయిరి.

14. వృద్ధులు నగరద్వారముచెంత ప్రోగగుటలేదు. యువకులు సంగీతము ఆలపించుట లేదు.

15. మా హృదయములలో సంతోషము అంతరించెను మా నాట్యము విచారముగా మారిపోయెను.

16. మా తలమీది కిరీటము పడిపోయెను. మేము పాపము చేసి నాశనము తెచ్చుకొంటిమి.

17-18. సియోను కొండ నాశనమయ్యెను. నక్కలు దానిమీద తిరుగాడుచున్నవి. కావున మా హృదయములు వ్యధతో నిండిపోయినవి. , కన్నీటి ధారలవలన మా కన్నులకు మసకలు క్రమ్మినవి.

19. ప్రభూ! నీవు శాశ్వతముగా పరిపాలనము చేయుదువు. నీ సింహాసనము కలకాలము నిలుచును.

20. నీవు మమ్ము ఇన్నాళ్ళు పరిత్యజించితి వేల? మమ్ము సదా విస్మరింతువా?

21. ప్రభూ! మమ్ము నీ చెంతకు త్రిప్పుకొనుము. మేము పునరుద్ధరింపబడుదుము. మా పూర్వస్థితిని మాకు మరల కలుగజేయుము.

22. నీవు మమ్ము శాశ్వతముగా పరిత్యజించితివా? నీ కోపమునకు హద్దులు లేవా?