ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము

 1. ఎఫ్రాయీము పర్వతసీమలో రామతయిమ్ సోఫీము అను పట్టణము కలదు. ఆ పట్టణమున ఎల్కానా అనునతడుండెను. ఎల్కానా ఎఫ్రాయీము తెగకు చెందిన సూపు కుమారుడు. సూపు తోహూ కుమారుడు, తోహూ ఎలీహు కుమారుడు, ఎలీహు యెరోహాము కుమారుడు.

2. ఎల్కానాకు హన్నా, పెనిన్నా అను భార్యలిద్దరు కలరు. పెనిన్నాకు బిడ్డలు కలరు గాని హన్నాకు సంతానము లేదు.

3. ఎల్కానా ఏటేట షిలో నగరమునకు వెళ్ళి సైన్యములకధిపతియైన యావేను ఆరాధించి బలులు అర్పించుచుండెను. ఏలీ కుమారులైన హోప్నీ, ఫీనెహాసు అనువారు ఆ రోజు లలో యావే యాజకులుగా నుండిరి.

4. ఒకమారు ఎల్కానా యధాప్రకారముగా బలి అర్పించెను. అతడు బలి అర్పించునపుడు పెనిన్నాకును, ఆమె కుమారులకును, కుమార్తెలకును, నైవేద్యమున భాగములు ఇచ్చుచుండెను.

5. హన్నాకు మాత్రము ఒక్కభాగమే ఒసగెడివాడు. అతడు హన్నాను అధికముగా ప్రేమించినను, ఆమె గొడ్రాలు గావున అటుల చేసెడివాడు.

6. ప్రభువు హన్నాకు బిడ్డలను ప్రసాదింపక పోవుటచే సవతికూడ ఆమెను ఎగతాళి చేసి ఏడ్పించుచుండెడిది.

7. ఏటేట ఇట్లే జరుగుచుండెడిది. వారు యావే మందిరమునకు పోయినపుడెల్ల సవతి హన్నాను దెప్పిపొడిచెడిది. అందుచే హన్నా చాల దుఃఖించి ఆహారము తినుట మానివేసెడిది.

8. అప్పుడు ఎల్కానా “హన్నా! ఈ ఏడుపు ఈ దిగులు ఎందులకు? భోజనము మానివేయనేల? నేను నీకు పదిమంది కుమారులకంటెను ఎక్కువ కానా?” అని ఆమెను ఓదార్చెడివాడు.

9. వారు షిలోవద్ద బలి అర్పించి భోజనము భుజించిన పిమ్మట మరియు పానీయము సేవించిన పిమ్మట హన్నా లేచి, యాజకుడైన ఏలీ ఆలయ స్తంభము చెంత ఆసీనుడైయుండగా,

10. హృదయవేదనతో ఆమె కన్నీరుమున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను.

11. “సైన్యములకధిపతివైన యావే ప్రభూ! ఈ దాసురాలి బాధను పరికింపుము. ఈ దీనురాలిని జ్ఞప్తియుంచుకొనుము. నీ దాసురాలనైన నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము. ఆ శిశువును ఆమరణాంతము నీకే సమర్పించుకొందును. క్షురకత్తి అతని తలవెంట్రుకలు తాకదు" అని మ్రొక్కుకొనెను.

12. హన్నా ఈ రీతిగా ప్రభువు ఎదుట ప్రార్థించు చుండగా యాజకుడైన ఏలీ ఆమె ముఖమును పరిశీలించుచుండెను.

13. హన్నా హృదయమునందే ప్రార్ధన చేసికొనుచుండెను. ఆమె పెదవులు కదలుచుండినవి గాని నోటినుండి మాటమాత్రము వెలువడుట లేదు. కావున యాజకుడైన ఏలీ ఆమె తప్పతాగి కైపెక్కియున్నదనుకొని

14. “ఎంతసేపు ఇట్లు మత్తుతో మసలెదవు? ఆ ద్రాక్షసారాయమిక వదిలించుకో” అనెను.

15. అందులకు హన్నా "అయ్యా! నేను తీరని వెతతో బాధపడుచున్నాను. నీవనుకొనినట్లు నేను ద్రాక్షసారాయమునుగాని, కైపెక్కించు మద్యమునుగాని సేవింపలేదు. ఇంతవరకును ప్రభువు ముందు మనసు విప్పి మాటలాడుచున్నాను అంతే.

16. ఈ దాసురాలు పనికిమాలినదని భావింపవలదు. మిగుల కోపతాపములతో హృదయము బ్రద్దలైపోవుచుండగా ఇంత సేపు ప్రభువుయెదుట మాటలాడుచుంటినే గాని వేరేమియుగాదు” అని ప్రత్యుత్తరమిచ్చెను.

17. అంతట యాజకుడైన ఏలీ “అట్లయిన ప్రశాంతముగా పోయిరమ్ము. యిస్రాయేలుదేవుడు నీ మనవి ఆలించుగాక!” అని చెప్పెను.

18. అంతట హన్నా "అయ్యా! ఈ దాసురాలిని అనుగ్రహింపుడు. అదియేచాలు” అని పలికి తన తావునకు వెళ్ళిపోయెను. ఆమె అన్నము తిన్నపిమ్మట దుఃఖముకూడ తీరిపోయెను.

19. అంతట వారు వేకువనే నిద్రలేచి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయిరి. ఎల్కానా తన భార్య యైన హన్నాను కూడెను. ప్రభువు ఆమెను జ్ఞప్తి యందుంచుకొనెను.

20. ఆమె గర్భవతియై బిడ్డను కనెను. “ప్రభువును బిడ్డనడిగితిని” అనుకొని శిశువునకు సమూవేలు' అని పేరు పెట్టెను.

21. ఎల్కానా ప్రభువునకు బలి అర్పించి మ్రొక్కు తీర్చుకొనుటకు మరల కుటుంబముతో బయలు దేరెను.

22. కాని హన్నా వెళ్ళలేదు. ఆమె ఎల్కానాతో “నేనిప్పుడురాను. పాలుమానినపిదప బాలుని కొనివచ్చి యావేకు సమర్పింతును. ఆ పిమ్మటవాడు యావే సన్నిధిలోనే ఉండిపోవును” అనెను.

23. ఎల్కానా “నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము. బిడ్డ పాలుమాను వరకు నీవు అక్కడికి రానక్కరలేదు. ప్రభువు కూడ నీ కోరిక తీర్చునుగాక!" అని చెప్పెను. హన్నా ఇంటిపట్టుననే యుండి బిడ్డను పెంచి పెద్దచేసి పాలుమాన్పించెను.

24. అంతట హన్నా బాలుని తీసికొని మూడేండ్ల కోడెదూడను తోలించుకొని, తూమెడు పిండితో, తిత్తెడు ద్రాక్షసారాయముతో షిలోలోని యావే మందిరమునకు వచ్చెను. బాలుడింకను పసివాడు.

25. అచ్చట దూడను వధించి బలిసమర్పించిన పిదప హన్నా బాలుని వెంటబెట్టుకొని యాజకుడైన ఏలీ వద్దకు వచ్చెను.

26. ఆమె అతనితో "అయ్యా! చిత్తగింపవలెను. మునుపు ఇచ్చట ప్రార్థనచేసికొనుచు నీ కంటబడినదానను నేనే.

27. నేను ఈ బిడ్డకొరకు ప్రార్థించి తిని. ప్రభువు నా మనవి ఆలించి నా కోరిక తీర్చెను.

28. కావున నేను ఈ పసికందును ప్రభువునకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంతకాలము ప్రభువునకే ఊడిగము చేయుచుండును” అనెను. అంతట వారు ప్రభువునకు మ్రొక్కిరి.

 1. హన్నా ఇట్లు ప్రార్ధించెను: “నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించెదను. నేను శత్రువులను అపహసించెదను. ప్రభూ! నేను నీ రక్షణమునుగాంచి సంతసించెదను.

2. ప్రభువు వలె పరిశుద్ధుడెవడును లేడు. ప్రభూ! నీవు తప్ప ఇక ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దురము వేరే లేదు.

3. గర్వముతో విఱ్ఱవీగుచు మాటలాడకుడు. అహంకారోక్తులు నోటరానీయకుడు. ప్రభువు సమస్తమును ఎరిగినవాడు. సమస్త కార్యములు పరీక్షించువాడు.

4. బలశాలుల విల్లులు తుత్తునియలయ్యెను. బలహీనులు బలాఢ్యులైరి.

5. కలవారు కూటికై కూలికిపోయిరి. ఆకలిగొనిన దరిద్రులు అన్నము బడసిరి. గొడ్రాలు ఏడుగురు బిడ్డలను కనెను. సంతానవతి బిడ్డలను కోల్పోయెను.

6. చంపువాడు, ప్రాణమిచ్చువాడు ప్రభువే. పాతాళమునకు కొనిపోవువాడు, పైకి కొనివచ్చువాడు ప్రభువే.

7. ధనికుని చేయువాడు, దరిద్రుని చేయువాడు ప్రభువే! అణగదొక్కువాడు, అతిశయింపజేయువాడు ప్రభువే.

8. దరిద్రులను నేలమీది నుండి లేవనెత్తి, బిచ్చగాండ్రను పెంటప్రోగుల మీదినుండి పైకి లేపి, గౌరవముగల ఆసనములొసగి గొప్పవాండ్ర సరసన కూర్చుండబెట్టునది ప్రభువే. జగత్తు పునాదులు ఆయన వశము, లోకమును ఆ పునాదులపై నిల్పినది ప్రభువే.

9. ప్రభువు తన భక్తుల పాదములు తొట్రిల్లక కాపాడును. దుష్టులు చీకటిలో మటుమాయమగుదురు. సొంతబలము వలన ఎవడును బాగుపడడు.

10. ప్రభువు ఆకాశము నుండి గర్జించుచుండ అతని శత్రువులెల్ల చెల్లాచెదరగుదురు. ప్రభువు నేల నాలుగుచెరగుల తీర్పులు తీర్చును. తన రాజునకు తేజ మొసగును, తన అభిషిక్తుని అతిశయింపజేయును.”

11. హన్నా రామాకు వెడలిపోయెను. సమూవేలు దేవాలయముననే ఉండి యాజకుడైన ఏలీ పర్యవేక్షణలో యావేకు పరిచర్యచేయుచుండెను.

12. ఏలీ కుమారులు పరమదుర్మార్గులు. వారు యావేను లెక్క చేసెడివారుకారు.

13. ఎవరైనా బలి అర్పించుటకు షిలోకు వచ్చినయెడల యాజకుని పనివాడు మూడు చీలికల పెద్దగరిటను చేతబట్టి మాంసములు వండుచోటికి వచ్చును.

14. మాంసము ఉడికెడి కుండ, బాణలి, కాగు మొదలైన పాత్రలలో గరిటెను గ్రుచ్చగా వచ్చినంత మాంసమును తీసికొనిపోయి యాజకునకిచ్చును. బలులు అర్పించుటకై షిలోకు వచ్చిన యాత్రికులందరిపట్లను వీరు ఇట్లే ప్రవర్తించెడివారు.

15. పైగా యాత్రికులు బలిపశువు క్రొవ్వును పీఠముపై దహింపకముందే యాజకుని పనివాడు వచ్చి “మా యాజకునికి వడ్డించుటకై మాంసము మాకిండు. మాకు పచ్చిమాంసము కావలయును. ఉడుకబెట్టిన మాంసము మాకక్కరలేదు” అని చెప్పును.

16. అందులకు బలియర్పించువారు "అయ్యా! ఇదిగో క్రొవ్వు వేల్వబోవుచునే యున్నాము. కొంచెము ఆగుడు. ఆ పిమ్మట మీకు వలసినంత మాంసము తీసికొనిపొండు” అని అనినచో పనివాడు “కాదుకాదు, మీరిప్పుడే ఈయవలెను. లేనిచో నేనే బలవంతముగా తీసికొందును” అని బెదిరించును.

17. ఈ రీతిని యాజకులు యావే ఎదుట బహుగా పాపము మూటకట్టుకొనిరి. వారివలన యావేకు సమర్పించుబలికి గౌరవముకూడ పోయెను.

18. సమూవేలు యావేకు పరిచర్య చేయు చుండెను. ఆ బాలుడు యాజకులు ధరించు నార బట్టతో చేయబడిన ఎఫోదు తొడుగుకొని యావేకు పరిచర్య చేయుచుండెను.

19. సమూవేలు తల్లి ఏటేట బలి అర్పించుటకు భర్తతో కలసి వచ్చినపుడెల్ల అట్టి ఒక చిన్నఅంగీని కుట్టుకొని వచ్చి బాలునకు తొడిగెడిది.

20. అప్పుడు ఏలీ ఆ దంపతులను దీవించి ఎల్కానాతో “ఈమె తన బిడ్డను ప్రభువునకు కానుక ఇచ్చినది. దానికి బదులుగా ప్రభువు ఈమెవలన నీకు బిడ్డలను ప్రసాదించునుగాక!” అని చెప్పుచుండును. ఆ మీదట వారు తమ ఇంటికి తిరిగిపోయెడివారు.

21. యావే అనుగ్రహమువలన హన్నా మరల ముగ్గురు మగ బిడ్డలను, ఇద్దరు ఆడుబిడ్డలను కనెను. ఇంతలో సమూవేలు ప్రభువునెదుట ఎదుగుచుండెను.

22. ఏలీ అప్పటికే ముదివొగ్గు. అతడు తన కుమారులు యిస్రాయేలు ప్రజలకు చేయు దుష్కార్య ములను గూర్చి వినెను. వారు ప్రభుదర్శనము లభించు గుడారపు గుమ్మము వద్ద పరిచర్య చేయు పనికత్తెలను కూడిరనియు తెలిసికొనెను.

23. అతడు "కుమారులారా! ప్రజలందరు మీరు చెడు పనులు చేయుచున్నారని చెప్పుకొనుచున్నారు. ఇట్టి పనులు చేయనేల?

24. నాయనలారా! నేను వినిన వార్తలు మంచివి కావు. ఇది మీకు తగదు.

25. నరుడు నరునిపట్ల అపరాధము చేసినచో దేవుడు తీర్పు చెప్పును. కాని నరుడు దేవునిపట్ల పాపము చేసినచో ఇక వాని పక్షమున విజ్ఞాపన చేయగలవాడెవడు?" అని మందలించెను. అయినను యావే వారిని నాశనము చేయనెంచెను కనుక వారు తండ్రిమాట పెడ చెవిని పెట్టిరి.

26. సమూవేలు మాత్రము పెరిగి పెద్దవాడై దేవుని దయకును, ప్రజల మన్ననకును పాత్రుడయ్యెను.

27. అటుపిమ్మట దైవభక్తుడు యొకడు ఏలీ చెంతకువచ్చి “యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నీ పితరుని ఇంటివారు ఐగుప్తునందు ఫరోకు బానిసలైయుండగా నేను ప్రత్యక్షము కాలేదా?

28. నేను యిస్రాయేలు తెగలన్నింటిలోను లేవీ తెగనే ఎన్ను కొంటిని. వారు మాత్రమే నాకు యాజకులైనా యెదుట ఏఫోదు పవిత్రఅంగీని దాల్చి నా బలిపీఠముపై బలులర్పించి నా సమక్షమున ధూపము వేయవలయునని ఏర్పర్చుకొంటిని. యిస్రాయేలు ప్రజలర్పించు బలి భోజ్యములన్నిటిని నీ పూర్వులకే కైవసము చేసితినిగదా!

29. ' ఇన్ని ఉపకారములు చేసినపిదపగూడ నేను నిర్ణయించిన యీ బలులను మీరు చిన్నచూపు చూడనేల? నా భక్తులైన యిస్రాయేలు ప్రజలు సమర్పించు బలిభోజ్యములను మెక్కి కండలు పెంచుకొని తిరుగు నీ కుమారులను గౌరవించి నన్ను అలక్ష్యము చేయుచున్నావు గదా!

30. నీ తండ్రి కుటుంబమువారు, నీ కుటుంబము వారు కలకాలము నా సన్నిధిని నిలిచి పరిచర్య చేయుదురనెడు ప్రభుని వాగ్దానము ఒకటి కలదు. కాని ఆ వాగ్దానమును నేనిక నిలుపుకొనను. నన్ను గౌరవించువారిని నేను గౌరవింతును, నన్ను తృణీకరించువారిని నేనును తృణీకరింతును.

31. ఇక వినుము, నీ ఇంటి బలమును, నీ తండ్రి ఇంటి బలమును తగ్గింపుచేయు రోజులు దగ్గరకు వచ్చినవి. ఇక నీ కుటుంబములో ముసలివాడు ఒక్కడును ఉండడు.

32. నేను యిస్రాయేలు ప్రజలకు చేయు మేలు విషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగ నీవు చూచెదవు. ఇక నీ సంతతి వారందరును లేత ప్రాయముననే చత్తురు.

33. నీ సంతతివాడు ఎవడైనను మిగిలి నా బలిపీఠము చెంత పరిచర్య చేసెనేని వాని కన్నులకు మసకక్రమ్మును. వాని ఉసురు అణగారిపోవును. వాని బిడ్డలు క్రుళ్ళి కృశించి చత్తురు.

34. నీ కుమారులు ఇద్దరకు ముప్పు వాటిల్లును. అది నీకొక గుర్తుగా నుండును. వారిద్దరు ఒక్కరోజుననే చత్తురు.

35. కాని నేను విశ్వసనీయుడైన యాజకు నొకనిని ఏర్పరచుకొందును. అతడు నా చిత్తము చొప్పున నడచుకొనును. అతని సంతతివారు తరతరములవరకు నా అభిషిక్తుని ఎదుట మన్నన పొందుదురు.

36. ఇక నీ వంశమున మిగిలిన వారందరు అతని చెంతకు వచ్చి సాగిలపడి ఒక వెండికాసునో, లేక పిడికెడు కూటినో యాచింతురు. మాకు యాజక పరిచర్యలో పని కల్పింపుడు, పిడికెడు కూడు తిని బ్రతికిపోయెదము అని ప్రార్థింతురు” అని చెప్పెను.

 1. బాలుడైన సమూవేలు ఏలీ పర్యవేక్షణము క్రింద యావేకు పరిచర్య చేయుచుండెను. ఆ రోజులలో యావే వాక్కు చాల అరుదుగా విన్పించెడిది. ప్రభువు సాధారణముగా సాక్షాత్కారమయ్యెడివాడు కాడు.

2. ఒకనాటి రాత్రి ఏలీ పరుండియుండెను. అతని కన్నులకు మసకలు క్రమ్మియుండుటచే చూపానదయ్యెను.

3. ప్రభువుముందట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు. సమూవేలు కూడ దైవమందసము ఉన్న యావే మందిరములో పండుకొని నిద్రించు చుండెను.

4-5. అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనుచు లేచి గబాలున ఏలి యొద్దకు పరిగెత్తుకొని పోయి “నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో! వచ్చితిని” అనెను. ఏలీ “నేను నిన్ను పిలువలేదు. వెళ్ళిపడుకొమ్ము” అని చెప్పెను. బాలుడు వెళ్ళి పరుండెను.

6. యావే సమూవేలును మరల పిలిచెను. అతడు లేచి ఏలీ చెంతకు పోయి “నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో! వచ్చితిని” అనెను. ఏలి “నాయనా! నేను నిన్ను పిలువలేదు. వెళ్ళి పడుకొమ్ము' అని అనెను.

7. సమూవేలునకు యావే గూర్చి ఇంకను తెలియదు. యావే వాక్కు అతనికి ఇంకను ప్రత్యక్షము కాలేదు.

8. ప్రభువు సమూవేలును మూడవ సారి కూడ పిలిచెను. అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి “నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో! వచ్చితిని" అనేను. ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలీ అప్పుడు గ్రహింపగలిగెను.

9. అతడు సమూవేలుతో “వెళ్ళి పడుకొమ్ము. నిన్నెవ్వరైన పిలిచినచో 'ప్రభూ! ఆనతి యిమ్ము. నీ దాసుడు ఆలించుచునే యున్నాడు' అని పలుకుము” అని చెప్పెను. సమూవేలు వెళ్ళి తన తావున పరుండెను.

10. అంతట ప్రభువు ప్రత్యక్షమై నిలిచి వెనుకటి మాదిరిగా “సమూవేలూ!” అని పిలిచెను. అతడు “ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునే యున్నాడు” అనెను.

11. యావే “యిస్రాయేలు జనులయెదుట నేనొక కార్యము చేసెదను. దానిని గూర్చి వినినవారి రెండు చెవులు గింగురుమనును.

12. ఆ దినమున, ఏలీ కుటుంబమునకు నేను చేసెదనన్న కార్యము చేసితీరెదను. నా పని పూర్తిచేసెదను.

13. నేను ఏలీ కుటుంబమును చాలకాలమువరకు శపించితినని తెలియజేయుము. తన కుమారులిద్దరును దేవుని నిందించుచున్నారని ఎరిగియు అతడు మందలింపడయ్యెను.

14. ఇదిగో! నేను శపథము చేసి చెప్పుచున్నాను వినుము. బలులుగాని, కానుకలుకాని ఏలీ తనయుల పాపములకు ఇక ప్రాయశ్చిత్తము చేయజాలవు” అని పలికెను.

15. సమూవేలు తెల్లవారువరకు పరుండెను. పిమ్మట దేవాలయ తలుపులు తెరచెను. అతడు ప్రభు దర్శనమును ఏలీకి ఎరిగింపవెరచెను.

16. ఏలీ “నాయనా” అని సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనెను.

17. ఏలీ “ఆయన నీతో ఏమి చెప్పెను? నా వద్ద ఏమియు దాచవలదు. ఆయన చెప్పిన మాటలలో ఏదియైన దాచెదవేని ప్రభువు నీకెంతటి కీడైన చేయునుగాక!” అనెను.

18. అంత సమూవేలు ఏలీకి అంతయు తెలియజెప్పెను. ఏలీ “సెలవిచ్చిన వాడు యావే. ఆయన చేయదలచుకొన్న కార్యము చేయునుగాక!” అనెను.

19. సమూవేలు పెరిగి పెద్దవాడయ్యెను. ప్రభువు అతనికి తోడుగానుండెను. కావున అతడు పలికిన పలుకొక్కటియు వ్యర్థముగాలేదు.

20. దాను నగరమునుండి బేర్షెబా వరకు గల యిస్రాయేలు ప్రజలందరు సమూవేలు యావే ప్రవక్త అయ్యెనని తెలిసికొనిరి.

21. షిలో వద్ద ప్రభువు సమూవేలుకు పలుమార్లు సాక్షాత్కరించెను. అచట అతనికి ప్రభుదర్శనము లభించుచుండెను.

 1. సమూవేలు మాట యిస్రాయేలీయులందరికిని వెల్లడాయెను. ఆ రోజులలో ఫిలిస్తీయులు యిస్రాయేలీయులపై దాడివెడలి ఆఫెకువద్ద మోహరించియుండిరి. యిస్రాయేలీయులు కూడ వారిని ఎదుర్కొనుటకు ఎబెనెసెరు చెంత విడిదిచేసిరి.

2. ఫిలిస్తీయులు యుద్ధ సన్నద్దులై యిస్రాయేలీయులను ఎదుర్కొనిరి. యిస్రాయేలీయులు ఓడిపోగా వారి వీరులు ఇంచుమించు నాలుగు వేలమంది రణరంగమున ప్రాణములు కోల్పోయిరి.

3. యిస్రాయేలు సైన్యములు శిబిరము చేరగనే వారి పెద్దలు ప్రోగై “ఎందుకు యావే నేడు మనలను ఫిలిస్తీయులచే ఓడించెను. షిలో నుండి దైవమందసము తెప్పింతము. అదియే శత్రువుల బారినుండి మనలను కాపాడగలదు” అని ఆలోచన చేసిరి.

4. కావున సైనికులు షిలోకు మనుష్యులను పంపి సైన్యములకు అధిపతియై, కెరూబు దూతలకు ఎగువ నెలకొనియుండు యావే ప్రభుని మందసము తెప్పించిరి. ఏలీ కుమారులు హోఫ్ని, ఫీనెహాసులు కూడ మందసముతో వచ్చిరి.

5. యావే మందసము శిబిరము చేరగనే యిస్రాయేలీయులు నేల దద్దరిల్లి పోవునట్లు మహానాదము చేసిరి.

6. ఆ నాదమువిని ఫిలిస్తీయులు హెబ్రీయుల శిబిరము నుండి గావుకేకలు వినిపించుచున్నవి ఎందుకోయని విస్తుపోయిరి. యావే మందసము శిబిరము చేరినదని గ్రహించిరి.

7. అప్పుడు ఫిలిస్తీయులకు గుండె చెదరినది. వారు “హా! చచ్చితిమిగదా! దేవుడు వారి శిబిరమునకొచ్చెను. ఇంతవరకెన్నడు ఇట్టిది జరిగియుండలేదు.

8. మహాశక్తిమంతుడైన ఈ దేవుని బారినుండి మనలనెవ్వడు కాపాడగలడు? ఐగుప్తు ప్రజలను మహాఉపద్రవములతో మట్టుపెట్టినది ఈ దేవుడే గదా? హా! చెడితిమి.. చెడితిమి!

9. అయినను ఫిలిస్తీయులారా! ధైర్యమువహింపుడు. మగవారివలె నిలువుడు. లేదేని ఈ హెబ్రీయులు మనకు దాసులైనట్లే మనము వీరికి దాసులమయ్యెదము. కావున మగవారి వలె నిలిచి పోరాడుడు” అనిరి.

10. ఇట్లనుచు ఫిలిస్తీయులు యుద్దమారంభించిరి. యిస్రాయేలీయులు ఓడిపోయి ఎవరి గుడారములకు వారు పారిపోయిరి. ఫిలిస్తీయులు యిస్రాయేలీయులను తునుమాడి ముప్పదివేలమంది కాలిబంటులను కూల్చిరి.

11. పైగా దైవమందసమును పట్టుకొనిరి. ఏలీ కుమారులైన హోప్ని, ఫీనెహాసులను చంపిరి.

12. ఆ దినముననే బెన్యామీను తెగవాడు ఒకడు యుద్ధభూమి నుండి షిలోకు పరిగెత్తుకొని వచ్చెను. అతడు బట్టలుచించుకొని తలపై దుమ్ము పోసికొనెను.

13. అతడు వచ్చునప్పటికి ఏలీ బాటప్రక్క పీటముపై కూర్చుండి యుద్ధవార్తలకై ఎదురుచూచుచుండెను. దైవమందసము ఏమగునోయని అతని హృదయము దడదడ కొట్టు కొనుచుండెను. ఆ వచ్చినవాడు వార్తలెరిగింపగనే పురజనులందరు పెడబొబ్బలు పెట్టిరి.

14. ఏలీ ఆ కేకలు విని “ఈ అంగలార్పులేమి” అని ప్రశ్నించెను.

15. ఏలీ తొంబది ఎనిమిదేండ్ల వయసువాడు. కన్నులకు మసకలు క్రమ్ముటచే చూపు ఆనదయ్యెను.

16. ఆ వార్తాహరుడు ఏలీని సమీపించి “శిబిరము నుండి వచ్చినవాడను నేనే. నేనే మన సైన్యము నుండి పరుగెత్తుకొనివచ్చితిని” అనెను. ఏలీ “నాయనా అచ్చటి వార్తలేమి” అని అడిగెను.

17. అతడు “యిస్రాయేలీయులు ఫిలిస్తీయుల ముందు నిలువలేక పారిపోయిరి. ఫిలిస్తీయులు మన సైనికులను చాలమందిని చంపిరి. నీ ఇరువురు కుమారులైన హోఫ్ని, ఫీనెహాసులును మరణించిరి. వారు దేవుని మందసమును కూడ పట్టుకొనిరి” అని చెప్పెను.

18. దైవమందసము పట్టువడినదని వినగనే ఏలీ ఆసనము మీదినుండి వెనుకకు వెల్లికిలపడి మెడవిరిగి చనిపోయెను. ఏలయనగ అతడు వృద్ధుడై బహుస్థూలకాయుడై యుండెను. ఏలీ నలుబదియేండ్ల కాలము యిస్రాయేలీయులకు తీర్పుతీర్చెను.

19. ఏలీ కోడలు ఫీనెహాసు భార్య నిండు చూలాలు. ఆమెకు ప్రసవ దినములు సమీపించియుండెను. దైవమందసము పట్టువడినదనియు, మామ, మగడు చనిపోయిరనియు వినగానే ఆమెకు నొప్పులు వచ్చెను. ఉన్నది ఉన్నట్లుగనే నేలమీదికి వంగి మోకాళ్ళూని బిడ్డను కనెను.

20. ఆమె చనిపోవు చుండగా చుట్టు గుమికూడియున్న స్త్రీలు “భయపడకుము, నీవు మగబిడ్డనే కంటివి” అనిరి. కాని ఆమె వారి మాటలు వినిపించుకోలేదు.

21. ఏలీ కోడలు మందసము పట్టుపడినదనియు మామ, మగడు చనిపోయిరనియు చింతించి, ఇక దేవుని మహిమ యిస్రాయేలీయులను విడిచిపోయినదని తన కుమారునకు ఈకాబోద్' అని పేరు పెట్టెను.

22. మందసము శత్రువుల చేతబడినది కనుక దేవుని మహిమ యిస్రాయేలీయుల నుండి వెడలిపోయెనని పలికెను.

 1. ఫిలిస్తీయులు ప్రభుమందసమును కైవసము చేసికొని ఎబెనె సెరు నుండి అష్డోదునకు కొనితెచ్చిరి.

2. అచ్చట దాగోను దేవాలయమునకు కొనిపోయి దాగోను సమీపమున నుంచిరి.

3. అష్డోదు ప్రజలు మరునాడు వేకువనే నిద్ర మేల్కొని చూడగా, దాగోను ప్రభుమందసము నెదుట నేలపై బోరగిలబడిఉండెను. వారు దాగోనును లేవనెత్తి అతని స్థానమున నిలిపిరి.

4. మరుసటి రోజు ప్రజలు తెల్లవారకమునుపే నిద్రలేచిచూడగా, మరల దాగోను యావే మందసము నెదుట బోరగిలబడియుండెను. దాగోను తల, రెండు చేతులు నరికివేయబడి గడపచెంత యుండెను. మొండెము మాత్రమే దాగోను స్థానమున పడియుండెను.

5. ఈ కారణము చేతనే దాగోను యాజకులుగాని, అతని మందిరమున ప్రవేశించు భక్తులుగాని నేటికిని అష్డోదులోని దాసోను గుడి గడపతొక్కరు.

6. యావే అష్డోదును దాని పరిసరములయందలి ప్రజలను బొబ్బలతో పీడించి బాధ పెట్టెను.

7. అష్డోదు పౌరులు ఆ ఉపద్రవమునకు తట్టుకోలేక “యిస్రాయేలు దేవుని మందసము మనతో నుండరాదు. అతడు మనలను, మనము కొలుచు దాగోనును పీడించి పిప్పిచేయుచున్నాడు” అని అనుకొనిరి.

8. కనుక వారు ఫిలిస్తీయుల అధికారులను సమావేశపరచి యిప్రాయేలు దేవుని మందసమును ఏమి చేయుదమా అని ఆలోచన చేసిరి. చివరకు దానిని గాతునకు కొనిపోవలయునని కలియబలుకుకొని ఆ నగరమునకు చేర్చిరి.

9. కాని మందసము గాతును చేరగనే ప్రభువు ఆ పట్టణ ప్రజలను ఘోరముగా పీడించుటచే చాల మంది చచ్చిరి. పెద్దలనక, పిల్లలనక పురములోని జనులందరు రహస్యస్థానములలో బొబ్బలులేచి బాధపడజొచ్చిరి.

10. అందుచే గాతు ప్రజలు మందసమును ఎక్రోనునకు పంపివేసిరి. కానీ మందసము ఎక్రోను చేరగానే పురప్రజలందరు పెద్ద పెట్టున కేకలువేసి “మనలను, మన ప్రజలను చంపుటకు ఈ యిస్రాయేలు దేవుని మందసమును ఇచ్చటికి కొనితెచ్చిరి" అనిరి.

11. వారు ఫిలిస్తీయుల అధికారులను పిలిపించి “యిస్రాయేలు దేవుని మందసమును పంపివేయుడు. దాని తావునకు దానిని చేర్చుడు. మమ్మును మా ప్రజలను చావునుండి తప్పింపుడు” అని వేడుకొనిరి. ప్రభువు ఎక్రోను ప్రజలను మిక్కిలిగా పీడించుటచే నగరమంతట జనులు కుప్ప తెప్పలుగా పడిచచ్చిరి.

12. చావక బ్రతికినవారు పెడబొబ్బలు పెట్టి కెవ్వున ఏడ్చిరి. వారి అంగలార్పులు మిన్నుముట్టెను.

 1. ప్రభుమందసము ఏడుమాసముల వరకు ఫిలిస్తీయుల దేశముననుండెను.

2. అప్పుడు ఫిలిస్తీయులు వారి యాజకులను, మాంత్రికులను పిలిపించి “ప్రభువు మందసమునేమి చేయుదము? దాని తావునకు దానిని పంపివేయవలెనన్న ఏఏ కానుకలతో పంపవలెను?” అని అడిగిరి.

3. వారు “ప్రభుమందసమును పంపివేయకోరెదరేని ఊరికే పంపరాదు. మీ అపరాధములకు ప్రాయశ్చిత్తముగా కానుకలు అర్పించుకొనుడు. అప్పుడు మీ వ్యాధి కుదురును. ప్రభువు ఇంతవరకు మిమ్మును పీడించి పిప్పిచేయుట ఏల మానలేదో కూడ తెలిసికొందురు” అనిరి.

4. ప్రజలు “అటులయిన ప్రాయశ్చిత్తముగా ఏమి కానుకలను అర్పింపవలయును?" అని మరల అడుగగా వారు "ఫిలిస్తీయుల దొరలు ఐదుగురు కదా! ఈ ఐదుగురిని ఉద్దేశించి ఐదు బంగారపు ఎలుకలు, ఐదు బంగారపు బొబ్బలు చేసి పంపుడు. మిమ్మును మీ పాలకులను పీడించు వ్యాధి ఒక్కటియే.

5. కావున మీకు లేచిన బొబ్బలకు, మీ నేలను పాడుచేసిన ఎలుకలకు గుర్తులుగా బొమ్మలు చేసిపంపుడు. వీనివలన యిస్రాయేలు దేవునికి మహిమ కలిగింతురు. అతడు మీ సమర్పణములను చూచి మిమ్మును, మీ వేల్పులను, మీ దేశమును పీడించుట మానివేయునేమో!

6. ఐగుప్తు ప్రజలవలె, ఫరోవలె మీరు గుండె బండ జేసికోనేల? నాడు ప్రభువు వారికి ఉపద్రవములు కలిగింపగా వారు యిస్రాయేలు ప్రజలను పోనీయలేదా?

7. కనుక వెంటనే క్రొత్తబండిని సిద్ధము చేయింపుడు. కాడి మోయని పాడి ఆవులను రెండింటిని బండికి పూన్పుడు. వానీ లేగలను తల్లులనుండి వేరుచేసి కొట్టమునకు తోలుకొనిపొండు.

8. ప్రభు మందసమునెత్తి బండిపై బెట్టుడు. అపరాధమునకు ప్రాయశ్చిత్తముగా మీరు అర్పించు బంగారుబొమ్మలను ఒక పెట్టెలో పెట్టి మందసము ప్రక్కనుంచి బండి సాగదోలుడు.

9. మందసము ఏవైపు వెళ్ళునో పరికింపుడు. అది నేరుగా తన తావునకు పోవు బాట పట్టిపోయి బేత్ షేమేషు పట్టణము చేరుకొనెనేని మనకు ఈ విపత్తు తెచ్చిపెట్టిన వాడు ప్రభువేయని తేటతెల్లమగును. కాదేని అతడుగాక, మరియేదో శక్తి తలవని తలంపుగా మనలను పీడించెనని తెలిసిపోవును" అనిరి.

10. వారు చెప్పినట్లే ప్రజలు రెండు పాడి ఆవులను తోలుకొనివచ్చి బండికి కట్టి వాని దూడలను కొట్టమున కట్టివేసిరి.

11. ప్రభుమందసము బండి పైకెత్తి బంగారపు ఎలుకలు, బంగారు బొబ్బలు నుంచిన పెట్టెను మందసము చెంత నుంచిరి.

12. అంతట బండిని కదలింపగా గోవులు బేత్షె మేషు త్రోవబట్టి అంబాయని అరచుచు కుడికిగాని ఎడమకు గాని కదలక నేరుగా సాగిపోయెను. ఫిలిస్తీయుల దొరలును బేత్ షోమేషు పొలిమేరల వరకు శకటము వెంట నడచివెళ్ళిరి.

13. అప్పుడు బేత్ షెమేషు పౌరులు పొలములో గోధుమ పంట కోయుచుండిరి. మందసము కంట బడగనే వారు అమితానందము నొందిరి.

14. బేత్ షెమేషు పౌరుడైన యెహోషువ చేనిచెంతకు వచ్చి బండి ఆగిపోయెను. అచ్చటనొక పెద్దబండకలదు. పొలమునందలి వారు కొయ్యను నరికి గోవులను వధించి ప్రభువునకు దహనబలినర్పించిరి.

15. లేవీయులు ప్రభుమందసమును దానిచెంతనున్న బంగారుబొమ్మల పెట్టెను దింపి బండపై పెట్టిరి. ఆనాడు బేత్ షెమేషు పౌరులు ప్రభువునకు బలులను, దహనబలులను సమర్పించిరి.

16. ఫిలిస్తీయుల అధికారులు ఐదుగురును జరిగినదెల్ల కన్నులార చూచి జాగుచేయక నాడే ఎక్రోనునకు వెడలిపోయిరి.

17. అష్డోదు, గాజా, అష్కేలోను, గాతు, ఎక్రోను అను ఐదు ఫిలిస్తీయ పట్టణములకు అపరాధ ప్రాయశ్చిత్తముగా ఫిలిస్తీయులు ఐదు బంగారుబొబ్బలను సమర్పించుకొనిరి. 

18. ఐదుగురు ఫిలిస్తీయ అధికారుల అధీనమున ఉన్న రక్షితపట్టణములకు, అరక్షిత గ్రామములకు ఒక్కొక్కటి చొప్పున బంగారపు ఎలుకలను గూడ సమర్పించుకొనిరి. బేత్ షెమేషు పౌరుడైన యెహోషువ చేనిచెంత ప్రభుమందసము నుంచిన ఆ పెద్దబండ నేటికిని ఈ గాథకు సాక్ష్యముగా నిలిచియున్నది.

19. బేత్ షెమేషు పౌరులలో కొంతమంది మందసములోనికి చూడగా దేవుడు వారిలో డెబ్బదిమందిని చంపివేసెను. ప్రభువు అంతమంది ప్రాణములు తీసెను గనుక పురజనులు గోడుగోడున విలపించిరి.

20. అంతట బేత్ షెమేషు పౌరులు “పరమ పవిత్రుడైన ఈ యావే ప్రభువు ముందటెవడు నిలువ గలడు? మన యొద్దనుండి ఇక ఈ ప్రభువునెవరి చెంతకు పంపెదము” అని మథనపడిరి.

21. కనుక వారు కిర్యత్యారీము నగరమునకు దూతలనంపి “ఫిలిస్తీయులు మందసమును పంపిరి. దిగిరండు, దీనిని మీ నగరమునకు గొనిపొండు” అని వార్త పంపిరి.

 1. ఆ వార్త విని కిర్యత్యారీము పౌరులు దిగివచ్చి, ప్రభుమందసమును కొనిపోయి కొండ పైనున్న అబీనాదాబు ఇంటజేర్చిరి. అతని కుమారుడు ఎలియెజెరును శుద్ధిచేసి దైవమందసమును కాపాడు టకు నియమించిరి.

2. మందసము కిర్యత్యారీమున నెలకొనిన పిమ్మట ఇరువదియేండ్లు గడచిపోయెను. అప్పుడు యిస్రాయేలు ప్రజలకు మరల యావేమీద భక్తి కుదిరెను.

3. సమూవేలు ప్రజలతో “మీరు హృదయపూర్వకముగా యావే వద్దకు మరలి రాగోరెదరేని, మీరు కొలుచు అన్యదైవములనెల్ల వదలివేయుడు. అష్టోరోతును గూడ మీ చెంతనుండి గెంటివేయుడు. యావేపై మనసునిల్పి ఆ ప్రభుని మాత్రమే సేవింపుడు, అప్పుడతడు ఫిలిస్తీయుల బెడదనుండి మిమ్ము కాపాడును” అనెను.

4. ఆ ప్రకారముగా యిస్రాయేలీయులు బాలుదేవతను, అష్టోరోతును వదలివేసి ప్రభుని మాత్రమే సేవించిరి.

5. అంతట సమూవేలు “యిస్రాయేలు జనులు అందరు మిస్ఫావద్ద గుమికూడవలయును. అచ్చట మీ తరపున ప్రభువునకు విన్నపము చేసెదను” అని చెప్పెను.

6. కావున ప్రజలందరు మిస్పావద్ద ప్రోగై, నీళ్ళుతోడి యావే ముందట కుమ్మరించిరి. ఆ దినము ఉపవాసముండి 'యావే ఆజ్ఞమీరి అపరాధము చేసితిమి' అని ఒప్పుకొనిరి. మిస్పాయొద్దనే సమూవేలు యిస్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చెను.

7. యిస్రాయేలు జనులు మిస్ఫావద్ద గుమిగూడి యున్నారని ఫిలిస్తీయులు వినిరి. వెంటనే వారి నాయకులు యిస్రాయేలుపై దాడికి వెడలిరి. ఈ వార్త చెవినిబడగనే యిస్రాయేలీయులకు గుండెచెదరెను.

8. వారు సమూవేలును చేరి, ఫిలిస్తీయుల బారినుండి మనలను కాపాడవలసినదిగా దేవునికి మొరపెట్టుమని వేడుకొనిరి.

9. అప్పుడు సమూవేలు పాలుగుడుచు గొఱ్ఱె పిల్లను ప్రభువునకు దహనబలిగా సమర్పించి ప్రజల తరపున మొరపెట్టెను. యావే అతని వేడుకోలు వినెను.

10. సమూవేలు దహనబలి సమర్పించినపుడే ఫిలిస్తీయులు కూడ యిస్రాయేలీయులను తాకి పోరాటము మొదలిడిరి. కాని ప్రభువు ఉరుమువలె పెద్ద స్వరముతో గర్జించి ఫిలిస్తీయులను చిందరవందర చేసెను. వారు చీకాకుపడి యిస్రాయేలీయుల ముందు నిలువలేక పారిపోయిరి.

11. కాని యిస్రాయేలు సైన్యములు మిస్పానుండి ఫిలిస్తీయులను వెన్నాడెను. బెత్కారుపల్లము వరకు శత్రువులను తరుముకొని పోయి చిక్కినవారినిచిక్కినట్లు చీల్చిచెండాడెను.

12. సమూవేలు మిస్పాకు, షేనుకు మధ్య ఒక రాతినిపాతి, యావే ఇంతవరకు మనకు సహాయము చేసెనను అర్థముగా దానికి 'ఎబెనెసెర్'' అని పేరు పెట్టెను.

13. ఈ విధముగా ఫిలిస్తీయులు అణచబడిన వారై మరల యిస్రాయేలు పొలిమేరలపై అడుగు మోపలేదు. సమూవేలు జీవించియున్నంత కాలము ప్రభువు వారిని అణచివేసెను. కనుక క్రుక్కిన పేనువలె పడియుండిరి.

14. ఎక్రోను నుండి గాతు వరకు ఫిలిస్తీయులు తాము వశముచేసికొనిన పట్టణములన్నిటిని యిస్రాయేలీయులకు తిరిగి యిచ్చివేసిరి. యిస్రాయేలు ఫిలిస్తీయుల బారినుండి తన సరిహద్దులను గూడ సంరక్షించుకొనెను. అమోరీయులకు, యిస్రాయేలీయులకు మధ్యగూడ శాంతి నెలకొనెను.

15. సమూవేలు బ్రతికియున్నంతకాలము యిస్రాయేలీయులకు తీర్పు తీర్చుచునే యుండెను.

16. ఏటేట అతడు బేతేలు, గిల్గాలు, మిస్పా పట్టణములను వరుసగా చుట్టివచ్చి అచ్చటి జనులకు తీర్పు తీర్చెడి వాడు.

17. అటుపిమ్మట రామాలోని తన ఇంటికి తిరిగివచ్చి అక్కడ కూడ తీర్పుచెప్పెడివాడు. అతడు రామావద్ద ప్రభువునకు ఒక బలిపీఠము కూడ నిర్మించెను.

 1. సమూవేలుకు పెద్ద ప్రాయము వచ్చెను. అందుచే అతడు తన ఇద్దరు కుమారులను యిస్రాయేలీయులకు తీర్పరులను చేసెను.

2. వారిలో పెద్దవాని పేరు యోవేలు, చిన్నవాని పేరు అబీయా. వారిద్దరు బేర్షెబాలో న్యాయాధిపతులైరి.

3. కాని ఈ కుమారు లకు తండ్రి గుణములు అబ్బలేదు. వారు కాసులకు దాసులై లంచములు పుచ్చుకొని ధర్మమును చెరచిరి.

4. అందుచే యిస్రాయేలు వృద్ధులందరు ప్రోగై సమూవేలును కలిసికొనుటకు రామాకు వచ్చిరి.

5. అతనితో "అయ్యా! నీవా, ప్రాయము చెల్లినవాడవు. నీ కుమారులందుమా, నీ అడుగుజాడలలో నడుచువారుకారు. ఇక మాకు న్యాయము తీర్చువారులేరు. కనుక అన్యజాతులకువలె మాకును ఒక రాజును నియమింపుము" అని విన్నవించుకొనిరి.

6. న్యాయము తీర్చుటకు రాజును నియమింపుమనిన పెద్దల వేడుకోలు సమూవేలునకు నచ్చలేదు. కనుక అతడు ప్రభువును ప్రార్థించెను.

7. యావే అతనితో “ఈ ప్రజలమాట వినుము. వారు నిన్ను నిరాకరించలేదు, వారిని యేలకుండ నన్నే నిరాకరించుచుండిరి.

8. ఐగుప్తునుండి వీరిని విడిపించుకొని వచ్చిన నాటినుండి ఈ జనులు నాకెట్టి అపచారము చేయుచుండిరో నేడు నీకును అట్టి అపచారమే చేసిరి. ఈ ప్రజలు నన్ను విడచి వేరు దేవరలను కొలిచిరి.

9. నీవు ఇపుడు మాత్రము వారి మాటలను వినుము. అయినను వారిని గట్టిగా హెచ్చరించి చూడుము. రాజును నియమించినచో అతడు ఏ తీరున పరిపాలనము చేయునో ధృడముగా తెలియజెప్పుము” అనెను.

10. ప్రభువు తనతో పలికిన పలుకులన్నియు రాజు కావలెనని అడుగుచున్న ప్రజలకు సమూవేలు తెలియబలికెను.

11. “మీరు కోరుకొనిన రాజు ఏ తీరున పరిపాలించునో వినుడు. అతడు మీ కుమారులను తీసికొని వెళ్ళి తన రథములను తోలుటకు, గుఱ్ఱములను కాపాడుటకు వినియోగించుకొనును. వారతని రథములముందు పరుగెత్తువారినిగా చేయును.

12. తన సైన్యములలో వేయిమందికో, ఏబదిమందికో వారిని అధిపతులుగా నియమించును. వారిచే తన పొలములు దున్నించి కోతకోయించుకొనును. యుద్ధములకును, రథములకును వలసిన పనిముట్లను చేయించుకొనును.

13. మీ కుమార్తెలను తీసికొని వెళ్ళి అత్తరులు పూయుటకును, వంటలు వండుటకును, రొట్టెలు కాల్చుటకును వాడుకొనును.

14. మీ పొలములో సారముగల చేలను, మీ ద్రాక్షతోటలను, ఓలివు తోపులను గైకొని తన ఉద్యోగులకు ఇచ్చివేయును.

15. మీరు పండించిన పంటలో, కాయించిన ద్రాక్ష పండ్లలో పదియవవంతు తీసికొని తన నౌకరులకు ఇచ్చివేయును. 

16. మీ బానిసలను, మీ గాడిదలలో పశులలో తానెన్నుకొన్నవానిని తీసికొని సొంతపనులు చేయించుకొనును.

17. మీ మందలలో పదియవ భాగము పుచ్చుకొనును. ఇక మీరందరు అతని బానిసలగుదురు.

18. నేడు మీరెన్నుకొనిన రాజును తలంచుకొని ఒకనాడు పెద్దపెట్టున ఎడ్తురు. ఆనాడు ప్రభువు మీ మొర విన్పించుకోడు” అని చెప్పెను.

19. అయినను ప్రజలు సమూవేలు మాట పెడచెవిని పెట్టి మాకు రాజును నియమించి తీరవలయునని పట్టుబట్టిరి. 

20. “ఇతర జాతులవలె మాకును రాజు కావలయును. మా రాజు మాకు న్యాయము చెప్పవలెను. మా యుద్ధములలో ముందు నడచి శత్రువులతో పోరాడవలయును” అని పలికిరి.

21. సమూవేలు ఈ మాటలన్నిటిని విన్నవానిని వినినట్లు యావేకు నివేదించెను.

22. “వారి యిచ్చ వచ్చినట్లే రాజును నియమింపుము” అని ప్రభువు సమూవేలునకు సెలవిచ్చెను. అంతట సమూవేలు "మీమీ పట్టణములకు తిరిగిపొండు” అని ఆనతిచ్చి ప్రజలను సాగనంపెను.

 1. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడగు సెరోరునకు జన్మించిన అబీయేలు కుమారుడు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. అతడు భాగ్యవంతుడు.

2. కీషు కుమారుడు సౌలు. సౌలు పడుచువాడు, చక్కనివాడు. యిస్రాయేలీయులలో అతనికంటె అందమైనవాడు లేడు. ఇతరులు అతని భుజముల వరకైనను రారు.

3. ఒక దినము కీషు గాడిదలు తప్పిపోయెను. కనుక అతడు కుమారుని పిలిచి “నాయనా! సేవకుని వెంట బెట్టుకొనిపోయి గాడిదలను వెదకిరమ్ము” అని చెప్పెను.

4. వారు ప్రయాణమైపోయి ఎఫ్రాయీము కొండసీమలు దాటిరి. షాలీషా పొలములు గాలించిరి. కాని గాడిదలు కనిపించలేదు. షాలీము, బెన్యామీను పొలిమేరలు దాటినను వాని జాడ తెలియరాలేదు.

5. అంతట వారు సూపు సీమ చేరుకొనిరి. అప్పుడు సౌలు తనవెంట వచ్చు బంటుతో. “ఇక తిరిగిపోదము. లేకున్న నాయన గాడిదల మాట మరచి మనలను గూర్చి చింతించును” అనెను.

6. అందుకు పనివాడు “అయ్యా! ఈ నగరమున దైవభక్తుడు ఒకడున్నాడు. అతడనిన అందరికి మిగుల గౌరవము. అతడు చెప్పినదంతయు జరిగి తీరును. ఆ భక్తుని దర్శింతము రమ్ము. ఒకవేళ అతడు మనకు మార్గము చూపునేమో” అనెను.

7. ఆ మాటలకు సౌలు “మనము అతని వద్దకు వెళ్ళినచో బహుమానముగా ఏమికొని పోగలము? సంచిలోని రొట్టెయంతయు అయిపోయినది. ఆ దైవభక్తునకు కానుక ఈయదగిన వస్తువేదియు మనకడలేదు. ఏమున్నది?” అని అడిగెను.

8. సేవకుడు “నా చెంత పావుతులము వెండినాణెమున్నది. దానిని ఇచ్చెదము. అతడు మనకు మార్గము చూపును” అని చెప్పెను.

9. పూర్వము యిస్రాయేలీయులు యావేతో సంప్రతించుటకు పోవునపుడు, దీర్ఘదర్శియొద్దకు పోవుదమని అనుకొనెడివారు. ఇప్పుడు ప్రవక్త అనబడే జనుడు ఆ రోజులలో దీర్ఘదర్శి అని పిలువబడెడివాడు.

10. సౌలు “చక్కగా నుడివితివి, పోవుదమురమ్ము” అనెను. అంతట వారిద్దరు దైవభక్తుని దర్శించుటకు నగరమునకు పోయిరి.

11. వారు కొండమీదనున్న పట్టణమునకెక్కి పోవుచు నీళ్ళు తోడుకొనుటకు దిగివచ్చు బాలికలను చూచి దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి.

12. ఆ బాలికలు “అవును, ఆయన ఇక్కడనే ఉన్నాడు. ఇప్పుడే నగరమునకు వచ్చియున్నాడు. ఈ దినము ఉన్నత స్థలమున బలి అర్పింపబోవుచున్నాడు.

13. అతడు భోజనమునకై ఉన్నతస్థలమునకు వెళ్ళకమునుపే మీరు ఆయనను కలిసికోవచ్చును. ఆయన వెళ్ళి బలిభోజ్యమును ఆశీర్వదించిన గాని అచ్చటి జనులు ఆహారమును ముట్టుకోరు. కనుక త్వరగా వెళ్ళుడు. ఆయనను దర్శింపవచ్చును” అని చెప్పిరి.

14. సౌలు సేవకునితో పైకెక్కిపోయి పట్టణమున ప్రవేశింపగనే సమూవేలు ఉన్నత స్థలమునకు పోవుటకై బయలుదేరి పురద్వారముచెంత వారికి ఎదురు పడెను.

15. ఆ ముందురోజు ప్రభువు సమూవేలుతో

16. “రేపు నిర్ణీత సమయమునకు బెన్యామీను దేశీయుని ఒకనిని నీ యొద్దకు పంపెదను. అతనిని యిస్రాయేలునకు నాయకునిగా అభిషేకింపుము. అతడు నా ప్రజలను ఫిలిస్తీయుల బారినుండి కాపాడును.ఆ జనులమొర నాకు విన్పించినది. నేను వారిని కనికరించితిని” అని చెప్పెను.

17. సౌలు సమూవేలునకు ఎదురుపడగనే ప్రభువు అతనితో “నా ప్రజలను పరిపాలించునని నేను ముందుగా నీకెరిగించినవాడు ఇతడే” అని పలికెను.

18. సౌలు పురద్వారముచెంత సమూవేలును సమీపించి "అయ్యా! దీర్ఘదర్శి ఇల్లెక్కడ?” అని అడిగెను.

19. సమూవేలు సౌలుతో “దీర్పదర్శిని నేనే. నాకంటే ముందుగా పోయి ఉన్నతస్థలమును చేరుకొనుము. నేడు నీవు నాతో భుజింపవలెను. రేపు నిన్ను సాగనంపెదను. నీవు వెళ్ళునపుడు నీ మనస్సులోని సందియము కూడ తీర్చెదను.

20. మూడురోజుల క్రిందట తప్పిపోయిన మీ గాడిదలు దొరికినవి. కనుక వానిని గూర్చి చింతింపకుము. ఇక ఈ యిస్రాయేయులందరు కోరు కొనునది ఎవరిని? నిన్నును నీ కుటుంబము వారిని కాదా?” అనెను.

21. అందులకు సౌలు "నేను యిస్రాయేలు తెగలన్నిటిలో అల్పమైన బెన్యామీను తెగవాడను. బెన్యామీను తెగనందలి కుటుంబములన్నింటికంటె అల్పమైనది నా కుటుంబము. మీరిట్టి పలుకు పలుకనేల?" అనెను.

22. సమూవేలు సౌలును అతని దాసుని భోజనశాలకు తోడ్కొనిపోయెను. అచ్చట పిలువగా వచ్చి పంక్తి దీరియున్న ముప్పదిమంది అతిథులకు ముందటి భాగమున వారిని కూర్చుండబెట్టెను.

23. సమూవేలు వంటలవానిని పిలిచి, నేను నీ చేతికిచ్చి వండి వేరుగా నుంచుమని చెప్పిన మాంసఖండము కొనిరమ్మనెను.

24. అతడు వండియుంచిన వేట తొడను తెచ్చి సౌలు ముందట పెట్టెను. సమూవేలు సౌలుతో “నీ కొరకు వేరుగా నుంచిన మాంసమిదియే. అతిథులను ఆహ్వా నించిన ఈ విందునందు ఈ భాగమును నీకొరకు ప్రత్యేకముగా అట్టిపెట్టితిని. ఇక భుజింపుము” అనెను. ఆ రీతిగా సౌలు నాడు సమూవేలుతో విందారగించెను.

25. అంతట వారు ఉన్నత స్థలము నుండి నగరమునకు దిగివచ్చిరి. సౌలుకు మిద్దెమీదపడక సిద్ధము చేయగా అతడు నిద్రించెను.

26. మరునాటి వేకువనే సమూవేలు సౌలును పిలిచి “లెమ్ము! నేను నిన్ను సాగనంపవలెను” అనెను. సౌలు లేచెను. వారిద్దరు పయనమై వీధిలోనికి వెళ్ళిరి.

27. నగరము చివరకు రాగానే సమూవేలు సౌలుతో “నీ పని వానిని సాగిపొమ్మనుము. నీవు మాత్రము ఒక్క క్షణము నాయొద్ద నిలువుము. యావే ఆజ్ఞను నీకు తెలియజేసెదను” అనెను.

1. అంతట సమూవేలు తైలపుబుడ్డి పుచ్చుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతనిని ముద్దు పెట్టుకొనెను. అతనితో “యావే తన ప్రజకు నిన్ను నాయకునిగా అభిషేకించెను. నీవు ప్రభువు ప్రజను పరిపాలించి చుట్టుపట్లనున్న శత్రువుల నుండి వారిని కాపాడవలెను. ప్రభువు తన జనమునకు నిన్ను నాయకునిగా నియమించెననుటకు గుర్తులివియే:

2. నీవు నన్ను వీడిపోవగనే బెన్యామీను పొలిమేరలలోని సెల్సా వద్దగల రాహేలు సమాధిచెంత ఇద్దరు జనులు నిన్ను కలిసికొని “మీరు వెదకబోయిన గాడిదలు దొరకినవి. మీ నాయన వానినిగూర్చి చింతించుట లేదు. కుమారుడు తిరిగివచ్చుటకు ఏమిచేయుదు నాయని రేయింబవళ్ళు నిన్ను గూర్చియే పలవరించు చున్నాడు' అని చెప్పుదురు.

3. అక్కడినుండి నీవు కొంచెము దూరముపోయి తాబోరు సింధూరము చేరగనే దేవుని దర్శించుటకు బేతేలు పోవుచున్న జనులు ముగ్గురు కన్పింతురు. వారిలో ఒకడు మూడు మేకకూనలను, రెండవవాడు మూడు రొట్టెలను, మూడవవాడు తిత్తెడు ద్రాక్షసారాయమును మోసికొని పోవుచుందురు.

4. వారు నీకు దండము పెట్టి రెండు రొట్టెలు కానుక ఇత్తురు. నీవు వానిని గైకొనుము.

5. పిమ్మట నీవు గిబియా, తెలోహీము వెళ్ళెదవు. అచ్చటనే ఫిలిస్తీయుల సైనిక శిబిరము ఉన్నది. నీవు ఆ నగరము చేరునప్పటికి ప్రవక్తలసమాజము ఉన్నత స్థలము దిగి వచ్చుచుండును. వారు సితారా, బాకా, ఫిడేలు, మృదంగము మొదలగు వాద్యములు మ్రోగించు వారి వెంట నడచుచు ఆవేశమునొంది ప్రవచనములు పలుకుచుందురు.

6. అప్పుడు యావే ఆత్మ నిన్ను ఆవేశింపగా వారితోపాటు నీవును ప్రవచనములు పలికెదవు. దానితో నీవు పూర్తిగా మారిపోయి కొత్త వ్యక్తివి అయ్యెదవు.

7. ఈ గురుతులన్ని నెరవేరిన పిదప ఆయా పరిస్థితులకు తగినరీతిగా కార్యములు నడుపుము. యావే నీకు బాసటగా నుండును.

8. ఇక నీవు నాకంటె ముందుగా పోయి గిల్గాలు చేరుము. దహనబలులు, సమాధానబలులు సమర్పించుటకు నేను అచ్చటికి వచ్చెదను. నిన్నట కలిసికొందును. నీవు మాత్రము నాకొరకై ఏడురోజులు వేచి యుండుము. నేను వచ్చి నీవు చేయవలసిన కార్యము నెరిగింతును” అని చెప్పెను.

9. సౌలు సమూవేలును వీడి వెళ్ళిపోగానే దేవుడు అతని హృదయమును మార్చి కొత్త మనస్సును అనుగ్రహించెను. సమూవేలు చెప్పిన గురుతులన్ని ఆ దినమే కనబడెను.

10. అతడు గిబియా చేరగనే ప్రవక్తలు ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యనుండి ప్రకటన చేయుచుండెను.

11. సౌలును ఎరిగిన వారు అతడు కూడ ప్రవక్తలలో చేరి ప్రవచనములు పలుకుచుండుట గాంచి విస్తుపోయి “కీషు కుమారునకు ఏమి గతి పట్టినదో చూచితిరా? సౌలుకూడ ప్రవక్తలలో కలిసి పోయెనా?” అని అనుకొనిరి.

12. కాని ఆ పలుకులు ఆలించిన ప్రవక్తల సమాజము నుండి ఒకడు “మరి ఈ ప్రవక్తల తండ్రి ఎవరో?” అని ఒక పోటుమాట విసరెను. నాటినుండి "సౌలుకూడ ప్రవక్త అయ్యెనా?” అను లోకోక్తి ఏర్పడెను.

13. ప్రవచించుట చాలించిన పిదప సౌలు ఇల్లు చేరుకొనెను.

14. అప్పుడు సౌలు పినతండ్రి సౌలును, అతని సేవకుని చూచి మీరెక్కడికి వెళ్ళితిరని అడిగెను. సౌలు “మేము గాడిదలను వెదకబోయితిమి, అవి కన్పింపకుండుటచే సమూవేలు చెంతకు వెళ్ళితిమి” అని చెప్పెను.

15. “సమూవేలు మీతో ఏమిచెప్పెను?” అని పినతండ్రి మరల ప్రశ్నించెను.

16. “అతడు గాడిదలు దొరకినవని నొక్కిచెప్పెను” అని సౌలు జవాబిచ్చెను. కాని సమూవేలు తనతో పలికిన రాచరికమును గూర్చి మాత్రము సౌలు ఒక్కమాట గూడ పొక్కనీయలేదు.

17. సమూవేలు యిస్రాయేలు ప్రజలను మిస్పా వద్దకు పిలిపించి యావే ఎదుటకు రప్పించెను.

18. అతడు వారితో “యిస్రాయేలు దేవుడైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నేను మిమ్ము ఐగుప్తునుండి, ఐగుప్తుపాలకుల బెడదనుండి విడిపించుకొని వచ్చితిని. మిమ్ము బాధించు శత్రురాజ్యముల నుండి కాపాడితిని.

19. అయితే మీ కష్టములనుండి, యాతనలనుండి మిమ్ము కాపాడుచు వచ్చిన దేవుని నేడు తేలికగా నిరాకరించి, మాకు రాజును నియమించి తీరవలెనని మీరు పట్టుపట్టితిరి. అది సరి, మీ తెగల ప్రకారముగా కుటుంబముల ప్రకారముగా యావే ముందట నిలవుడు” అనెను.

20. సమూవేలు యిస్రాయేలు తెగలన్నిటికిని చీట్లు వేయగా బెన్యామీను తెగవంతు వచ్చెను.

21. బెన్యామీను తెగలోని కుటుంబములన్నిటిని పిలిచినపుడు మత్రీ కుటుంబము వంతు వచ్చెను. మత్రీ కుటుంబములోని జనులనందరను పిలిచినపుడు కీషు కుమారుడైన సౌలు వంతు వచ్చెను. వెంటనే వారు సౌలు కోసము వెదకిరి గాని అతడు కనబడలేదు.

22. కనుక వారు మరల ప్రభువు సమ్మతి నడిగిరి. సౌలు ఇచ్చటికి వచ్చెనా అని ప్రశ్నించిరి. ప్రభువు “అతడు సామానుల మధ్య దాగుకొనియున్నాడు” అని చెప్పెను.

23. వెంటనే కొంతమంది అచటికి వెళ్ళి సౌలును కొనివచ్చిరి. అతడు వచ్చి ప్రజలముందు నిలబడెను. జనులు అతని భుజముల వరకైనను రాలేదు.

24. సమూవేలు ప్రజలతో “యావే ఎవ్వరిని ఎన్నుకొనెనో చూచితిరిగదా? ఇతనివంటి వాడు ప్రజలలో ఎవ్వడునులేడు” అనెను. జనులు "మా రాజు కలకాలము జీవించుగాక!” అని పెద్ద పెట్టున కేకలు వేసిరి.

25. అప్పుడు సమూవేలు, రాజు ఏ తీరున పరిపాలించునో ప్రజలకు వివరించి చెప్పెను. ఆ వైనమును ఒక గ్రంథమున వ్రాసి యావే ముందట నుంచెను. ఆ పిమ్మట ప్రజలనందరను వారివారి ఇండ్లకు సాగనంపెను.

26. సౌలు కూడ గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. దేవుడు హృదయములు మార్పగా వీరావేశమునొందిన శూరులు కొందరు అతని వెంటపోయిరి.

27. కాని సౌలనిన గిటని దుర్మార్గులు కొందరు “వీడు మనలనెట్లు రక్షింపగలడు” అని తేలికగా మాటలాడిరి. వారతనిని చిన్నచూపు చూచుటచే బహుమానములు కూడ సమర్పింపలేదు. అయినను అతడు చెవిటివాడైనట్టు మిన్నకుండెను. 

1. ఈ సంగతులు జరిగిన ఒక నెలకు అమ్మోనీయుడగు నాహాషు, యాబేషు గిలాదుపై దండెత్తివచ్చెను. యాబేషు ప్రజలు నాహాషుతో “మాతో ఒడంబడిక చేసికొనుము. మేము మీకు లోబడి ఉండెదము” అనిరి.

2. కాని నాహాషు “నేను మీ కుడికన్నులు పెరికివేసెదను. ఇది మీ యిస్రాయేలీయులందరకు అవమానము కలిగించును. ఈ నియమమునకు మీరు ఒప్పుకొందురేని మీతో ఒడంబడిక చేసికొందును” అనెను.

3. అందుకు యిస్రాయేలు పెద్దలు నాహాషుతో “మాకు ఏడురోజులు గడువిమ్ము, మేము యిస్రాయేలు దేశము నాలుగు చెరగులకు దూతలనంపెదము. ఎవ్వరును మమ్ము ఆదుకొనుటకు రానిచో నీకు లొంగిపోయెదము” అని చెప్పిరి.

4. అంతట వారి దూతలు సౌలునగరమైన గిబియాకు వచ్చి జరిగినదానిని ఎరిగింపగనే పురజనులందరు బావురుమని ఏడ్చిరి.

5. అంతలోనే సౌలు పొలమునుండి ఎద్దులను తోలుకొనివచ్చుచుండెను. అతడు “ప్రజలు ఇట్లు దుఃఖించుచున్నారేల? ఏమి కీడు మూడినది?” అని అడిగెను. పురజనులు యాబేషు నుండి వచ్చిన వార్తలు విన్పించిరి.

6. ఆ మాటలు చెవినబడగనే యావే ఆత్మ సౌలును ఆవహించెను. అతడు కోపముతో మండి పోయెను.

7. వెంటనే సౌలు ఒక కాడిఎడ్లను కండ తుండెములుగా ఖండించెను. ఆ ముక్కలను వార్తాహరులతో యిస్రాయేలు దేశము నాలుగుమూలలకు పంపి సౌలు పక్షమున పోరాడుటకు రానివారి ఎద్దులకు ఇదేగతి పట్టునని వర్తమానము పంపెను. అప్పుడు యావే యిస్రాయేలీయులకు భయము కలిగించెను. కావున వారెల్లరు ఒక్కుమ్మడిగా వచ్చి సౌలుతో చేరిరి.

8. అతడు బేసెకు వద్ద అనుచరులను లెక్కించి చూడగా యిస్రాయేలీయులు మూడులక్షలమందియు, యూదీయులు ముప్పదివేలమందియు యుండిరి.

9. అంతట సౌలు యాబేషు నుండి వచ్చిన దూతలతో “రేపు ఎండ పొడ కాన్పించునప్పటికి సహాయము లభించును” అని మీ వారికి తెల్పుడనెను. దూతలు ఆ పలుకులను యాబేషువాసులకెరిగింపగా వారు మిక్కిలి సంతసించిరి. 

10. కనుక వారు నాహాషుతో “రేపు నీ చెంతకు వచ్చెదము, మమ్ము మీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చును" అనిరి.

11. ఆ రాత్రి సౌలు తన సైన్యములను మూడు భాగములుగా విభజించెను. వారు వేకువజాముననే అమ్మోనీయుల శిబిరములపై పడి ప్రొద్దెక్కి ఎండ ముదురు వరకు శత్రువులను తునుమాడిరి. చావక మిగిలినవారు చెట్టుకొకడుగా పారిపోయిరి.

12. అంతట ప్రజలు సమూవేలుతో “సౌలు మమ్మెట్లు పరిపాలించునో చూతమనిన వారిని ఇచ్చటికి కొనిరమ్ము. వారినందరిని వధించెదము” అనిరి.

13. కాని సౌలు “ఈ దినము యావే యిస్రాయేలీయులను సంరక్షించెను. కనుక నేడు మీరు ఎవ్వరిని చంపరాదు” అనెను.

14. సమూవేలు ప్రజలతో “మనమందరము గిల్గాలునకు పోవుదము రండు. రాజనియామకమునకు సమ్మతింతుమని అట మరల మాటిత్తము” అనెను.

15. కావున జనులందరు గిల్గాలునకు వెళ్ళిరి. అచ్చట యావేముందట సౌలును రాజుగా ప్రకటించిరి. ప్రజలు ప్రభువునకు సమాధాన బలులు సమర్పించిరి. సౌలును, యిస్రాయేలుజను లును మిక్కిలి సంతోషించిరి. 

 1. సమూవేలు ప్రజలతో “మీ మనవులను ఆలించియే రాజును నియమించితిని.

2. ఇకమీదట రాజే మిమ్ము నడిపించును. నేనా ముదుసలిని. నా తల వెంట్రుకలుకూడ నెరసినవి. మీచెంతనున్న నా కుమారులే నా ప్రాయమునకు సాక్ష్యము. చిన్ననాటి నుండి నేటివరకును నేనే నాయకుడనై మిమ్ము నడి పించుచు వచ్చితిని.

3. నేడు మీ ముందటనిలుచుండి మాట్లాడుచున్నాను. నాయందు ఏదేని దోషమున్న యావే యెదుట, యావే అభిషిక్తుడగు రాజు నెదుట నిరూపింపుడు. నేనెవరి ఎద్దునైన తీసికొంటినా? ఎవరి గాడిదనైన పట్టుకుంటినా? ఎవరినైన మోసగించితినా? ఎవరినైనా పీడించితినా? ఎవరి యొద్దనుండైన లంచ ములు పుచ్చుకొని న్యాయము చెరచితినా? నేనిట్లు చేసినయెడల ఋజువుచేయుడు. మీ సొమ్ము మీకు తిరిగి ముట్టచెప్పెదను” అనెను.

4. వారు “నీవు మమ్ము మోసగింపలేదు, పీడింపలేదు. మా యెద్ద నుండి లంచములు పుచ్చుకొననులేదు” అనిరి.

5. అతడు “నాయెడల అపరాధము ఏమియు లేదనుటకు యావే సాక్షి. ప్రభువుచే అభిషిక్తుడగు రాజు సాక్షి” అనెను. వారు “అవును, ప్రభువే సాక్షి” అని బదులు పలికిరి.

6. సమూవేలు ప్రజలతో “అవును, ప్రభువే సాక్షి. మోషే, అహరోనులు అను నాయకులను ఒసగి మీ పితరులను ఐగుప్తునుండి ఈవలకు కొనివచ్చినది ఈ ప్రభువే గదా!

7. కొంచెము సేపిట నిలిచి నా పలుకులు సావధానముగా వినుడు. మీకు, మీ పితరులకు యావే యొనర్చిన రక్షణ కార్యములను ప్రభువు ఎదుటనే మీకు వివరించి చెప్పెదను.

8. యాకోబు తనయులు ఐగుప్తులో స్థిరపడిన తరువాత ఐగుప్తీయులు పెట్టు బాధలు భరింపలేక దేవునకు మొరపెట్టిరి. ప్రభువు మోషే, అహరోనులను పంపెను. వారు మీ పితరులను ఐగుప్తునుండి తోడ్కొనివచ్చి ఈ దేశమున స్థిరముగ నెలకొల్పిరి.

9. కాని యిస్రాయేలీయులు తమ దేవుడైన యావేను విస్మరించిరి. కావున ప్రభువు వారిని హాసోరు సైన్యములకధిపతియైన సీస్రాకు కైవసము చేసెను. ఫిలిస్తీయులకును, మోవాబు రాజునకును బానిసలను గావించెను. కావున మీ పితరులు శత్రువు లతో పోరాడవలసి వచ్చెను.

10. అందుచే వారు 'మేము ప్రభువును విడనాడి బాలు, అష్టారోతు దేవతలను పూజించి పాపము కట్టుకొంటిమి. శత్రువులనుండి మమ్ము విడిపించెదవేని ఇక మీదట నిన్నే కొలిచెదము' అని యావేను వేడుకొనిరి.

11. అప్పుడు ప్రభువు యెరుబాలు, బారాకు, యెఫ్తా, సంసోను అను నాయకులను పంపి చుట్టు పట్లనున్న శత్రువుల బానిసత్వమునుండి మిమ్ము విడిపించెను. మీరును ఇన్నాళ్ళు చీకు చింత లేక బ్రతికితిరి.

12. యావే మీ రాజు అయినను, అమ్మోనీయుల రాజైన నాహాషు మీమీదికి దండెత్తివచ్చుట చూచి, 'మాకు యావే కాక మరియొక రాజు కావలెను' అని పట్టుపట్టితిరి.

13. ఇదిగో ఇతడే మీరెన్నుకొనిన రాజు. ప్రభువు మీకు ఈ రాజును నియమించెను.

14. మీరు ప్రభువుపట్ల భయభక్తులు చూపి ఆయనను కొలిచి, ఆయన మాటవిని ఆయన ఆజ్ఞలను పాటింతురేని, మీరును మిమ్ము పాలించు రాజును ప్రభువు చిత్తానుసారముగా నడుచుకొందురేని మీకు మేలు కలుగును.

15. కాని మీరు ప్రభువుమాట వినక ఆయన ఆజ్ఞలు ధిక్కరింతురేని, యావే మిమ్మును, మీ రాజును ముప్పుతిప్పలు పెట్టును.

16. ఇంకొక క్షణమిచ్చటనే నిలువుడు. మీ యెట్టఎదుటనే యావే చూపబోవు మహాశ్చర్యమును గూడ తిలకింపుడు.

17. ఇది గోధుమపంట కాలముకదా? అయినను నా ప్రార్థనవిని యావే ఉరుములతో వాన కురిపించును. దీనినిబట్టి మీరు రాజు కావలెనని అడుగుట వలన ప్రభువు ఎదుట ఎంత చెడ్డపని చేసితిరో తెలిసి కొందురు” అనెను. 

18. అంతట సమూవేలు ప్రార్థింపగా ప్రభువు ఉరుములతో వాన కురిపించెను. కావున ప్రజలు ప్రభువునకు, సమూవేలునకు జడిసిరి.

19. వారు సమూవేలుతో “ఈ దాసుల తరపున నీ దేవుడైన యావేకు విన్నపము చేయుము. మేము చావు తప్పించుకొని బ్రతికిపోయెదము. రాజును కోరుకొనుట యను ఈ నేరముకూడ మా పాపములపట్టికకు చేర్చితిమి” అని పలికిరి. .

20. అందుకు సమూవేలు ప్రజలను చూచి “భయపడకుడు. మీరింతటి పాపము చేసితిరి అన్నది యదార్ధమే. అయినను ప్రభువును అనుసరించుట మాత్రము మానకుడు. ఆయనను పూర్ణహృదయముతో సేవింపుడు.

21. విగ్రహములు మాయయే. అవి మిమ్ము కాపాడలేవు. వానివలన ప్రయోజనము లేదు. కావున వట్టిబొమ్మలను కొలువకుడు.

22. అయితే యావే తన ఘనమైన నామమును నిలబెట్టుకొనువాడు కనుక మిమ్ము పరిత్యజింపబోడు. అతడు మిమ్ము తన ప్రజగా చేసికోగోరెను.

23. నా మట్టుకు నేను మీ తరపున మనవిచేయుట మానను, ఉత్తమమైన ధర్మమార్గమును మీకు చూపకుండా ఉండను. అటుల చేసినచో ప్రభువునకు ద్రోహము చేసినట్లే అగును. ఇట్టి పాపము నేను ఏనాటికిని కట్టుకొనను.

24. మీరు మాత్రము యావేపట్ల భయభక్తులు కలిగి నడచుకొనుడు. విశ్వాసముతోను, పూర్ణహృదయముతోను ప్రభువును సేవింపుడు. ఆయన మీ కొరకు ఎంతటి అద్భుతకార్యము చేసెనో ఇప్పుడే కన్నులార చూచితిరి గదా!

25. కాని మీరింకను దుష్కార్యములు సల్పుట మానరేని మీరును, మీ రాజును సర్వనాశనమయ్యె దరు” అని పలికెను.

 1. సౌలు ముప్పదిఏండ్ల ప్రాయమువాడై రాజుగా పరిపాలన మొదలిడి ఏడాది గడచెను. రెండవ ఏడాది పాలించిన మీదట '

2. సౌలు యిస్రాయేలీయుల నుండి మూడువేలమంది వీరులనెన్ను కొనెను. వీరిలో రెండువేలమంది మిక్మాషునందు, బేతేలు కొండయందు విడిదిచేసిరి. సౌలు వారికి నాయకుడు. వేయిమంది బెన్యామీనీయుల గిబియా యందు మకాము చేసిరి. యోనాతాను వారికి నాయకుడు. మిగిలిన వారిని సౌలు వారి వారిండ్లకు పంపి వేసెను.

3. యోనాతాను గెబా వద్దనున్న ఫిలిస్తీయుల దండును హతము చేసెను. దానితో ఫిలిస్తీయులు హెబ్రీయులు తిరుగుబాటు మొదలిడిరని గ్రహించిరి. సౌలు యుద్ధమునకు గుర్తుగా దేశమంతట హెబ్రీయులు వినవలెనని బాకా ఊదించెను.

4. సౌలు ఫిలిస్తీయుల దండును హతము చేసినందున ఫిలిస్తీయులు హెబ్రీయులనిన పండ్లు కొరుకుచుండిరని యిస్రాయేలీయులు గుర్తించిరి. కనుక వారు సౌలు పిలుపునందుకొని గిల్గాలువద్ద అతనిని కలిసిరి.

5. ఫిలిస్తీయులు కూడ యుద్ధమునకు సన్నద్ధులైరి. వారికి ముప్పదివేల రథములు, ఆరువేలమంది రౌతులు, సముద్రతీరము నందలి ఇసుకరేణువులవలె లెక్కకందని కాలిబంటులు కలరు. ఫిలిస్తీయులు బేతావెనుకు తూర్పుననున్న మిక్మాషువద్ద శిబిరముపన్నిరి.

6. శత్రు సైన్యము యిస్రాయేలీయులచుట్టు క్రమ్ముకొనెను. అదిచూచి యిస్రాయేలీయులు ఆశవదలుకొని కలవరపాటున  గుహలలో, బొరియలలో, రాతినెరియలలో, గోతులలో, నూతులలో దాగుకొనిరి. చాలమంది యోర్దాను రేవుదాటి గాదు, గిలాదు మండలములకు పారిపోయిరి.

7. సౌలు ఇంకను గిల్గాలు వద్దనేయుండెను. జనులందరు భయపడుచు అతనిని వెంబడించిరి.

8. సమూవేలు పెట్టిన గడువు ప్రకారముగా సౌలు ఏడు రోజులు వేచియుండెను. కాని సమూవేలు గిల్గాలునకు రాలేదు. అది చూచి జనులు సౌలును విడనాడి ఎవరి త్రోవను వారు వెడలిపోజొచ్చిరి.

9. సౌలు జనులు చెదరిపోవుట చూచి దహనబలిని, సమాధానబలిని సిద్ధము చేయించెను. తానే దహనబలిని అర్పించెను.

10. సౌలు దహనబలిని అర్పించి ముగింపగనే సమూవేలు వచ్చెను. సౌలు వందనము చేయుటకై సమూవేలునకు ఎదురువోయెను.

11. అతనిని చూడగనే సమూవేలు “ఎంతపని చేసితివి!” అనెను. సౌలు అతనితో “జనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నీవేమో గడువు లోపల రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మాషు వద్ద మోహరించి ఉండుటయు చూచి

12. వారు తప్పక గిల్గాలునకు వచ్చి నా మీదపడెదరు. నేనింకను యావేను మనవి చేయనైతిననుకొంటిని కనుక ఎటులనో గుండెనిబ్బరముతో ఈ దహనబలిని అర్పించితిని” అనెను.

13. సమూవేలు “నీవు పిచ్చి పని చేసితివి. ' నీ దేవుడైన యావే ఆజ్ఞ పాటించి యుంటివేని ప్రభువు కలకాలము నీ వంశము వారినే యిస్రాయేలీయులకు రాజులుగా నియమించియుండెడి వాడు'. ఇక నీ వంశమువారికి రాచరికము లభింపదు. నీవు యావేఆజ్ఞ పాటింపవైతివి.

14. అందుచే ప్రభువు తనకు నచ్చినవానిని వేరొకనిని ఎన్నుకొనును. అతనినే తన ప్రజకు నాయకునిగా నియమించును” అని పలికెను. అటుల పలికి సమూవేలు గిల్గాలు నుండి వెళ్ళిపోయెను.

15. పిమ్మట సౌలు గిల్గాలు నుండి బయలుదేరి శత్రుసైన్యములున్న దిక్కుకువెడలెను. సౌలు అనుచరులు అతని వెంటబోయిరి. బెన్యామీనీయుల గిబియా వద్ద సౌలు తన జనమును లెక్కించి చూడగా ఆరువందల మంది మాత్రము తేలిరి.

16. సౌలు, అతని కుమారుడైన యోనాతాను అనుచరులు బెన్యామీనీయుల గిబియావద్ద విడిది చేసిరి. ఫిలిస్తీయులు మిక్మాషువద్ద బారులు తీరి యుండిరి.

17. ఫిలిస్తీయుల శిబిరము నుండి మూడు దోపిడిదండులు బయలుదేరెను. ఒక దండు షూవాలు రాష్ట్రములోని ఒఫ్రాకు వెళ్ళెను.

18. రెండవది బేత్ హోరోనుకు వెడలెను. మూడవది సెబోయీము లోయకు, దాని ఆవలి ఎడారికి ఎదురుగానున్న కొండ వరుసవైపు నడచెను.

19. ఫిలిస్తీయులు హెబ్రీయులను కత్తులు, ఈటెలు తయారు చేసికొననీయలేదు. కావున యిస్రాయేలు దేశమున ఇనుపపనిముట్లు చేయువారు కరువైరి.

20. అందుచే యిస్రాయేలీయులు కఱ్ఱు, గొడ్డలి, పార, పోటుకత్తి మొదలైన వానికి పదును పెట్టించు కొనుటకు ఫిలిస్తీయుల వద్దకే వెళ్ళెడివారు.

21. ఫిలిస్తీయులు కట్టులను గొడ్డళ్ళను సాగగొట్టుటకు వెండికాసున మూడింట రెండుపాళ్ళు పుచ్చుకొనెడి వారు. పారలకు, పోటుకత్తులకు పదును పెట్టుటకు మూడవపాలు పుచ్చుకొనెడివారు.

22. కావున పోరాటము చెలరేగునప్పటికి సౌలు సైన్యమునగాని, యోనాతాను సైన్యమునగాని ఒకని చేతిలోనైన కత్తి, ఈటె కనబడవయ్యెను. సౌలు, యోనాతాను చేతులలో మాత్రము ఆయుధములుండెను.

23. మిక్మాషు కనుమను కాచుటకై ఫిలిస్తీయులు కావలిదండును పంపిరి.

1. ఒకనాడు సౌలు కుమారుడు యోనాతాను తన అంగరక్షకునితో, ఆవలనున్న ఫిలిస్తీయుల కావలి దండుమీదకు పోవుదము రమ్మనెను. కాని అతడు తండ్రికి ఈ విషయము తెలుపలేదు.

2. అప్పుడు సౌలు గిబియా అవతల విగ్రేనులో దానిమ్మ చెట్టు క్రింద విడిది చేయుచుండెను. అతనితోనున్న యోధులు సుమారు ఆరువందలమంది.

3. షిలో యాజకుడగు ఏలీ కుమారుడైన ఫీనెహాసు పుత్రుడు ఈకాబోదు అన్నయైన అహిటూబు కుమారుడైన అహీయా ప్రభుచిత్తము తెలియజేయు ఏఫోదు ధరించుకొని యుండెను. యోనాతాను వెళ్ళిన సంగతెవ్వరికిని తెలియదు.

4. అతడు ఫిలిస్తీయుల పటాలము చేరుటకు ఒక లోయ దాటవలెను. ఈ లోయలో ఇరువైపుల  రెండు కొండకొమ్ములు కలవు. మొదటిదాని పేరు బోసేసు. రెండవదాని పేరు సేనే.

5. మొదటిది మిక్మాషునకు ఎదురుగా ఉత్తర దిక్కున గలదు. రెండవది గిబియాకెదురుగా దక్షిణదిక్కున గలదు.

6. యోనాతాను అంగరక్షకునితో “సున్నతి సంస్కారము లేని ఈ ఫిలిస్తీయుల దండుకాపరుల మీద పడుదము రమ్ము. ప్రభువు మనకు మేలుచేయవచ్చును. కొలది మందివలనైనను లేక అనేకులవలనైనను మనలను రక్షింప యావేకు అడ్డుకాజాలదు గదా!” అనెను.

7. అంగరక్షకుడు “నీ ఇష్ట ప్రకారము కానిమ్ము. నీవు ముందు నడువుము. నేను నిన్ను అనుసరించి వచ్చెదను” అని పలికెను.

8. యోనాతాను అంగరక్షకునితో “మనము ఫిలిస్తీయుల సమీపమునకు పోయి వారి కంటపడుదము.

9. సైనికులు మనలను జూచి 'నిలువుడు, మేము మీ చెంతకు వచ్చేదము' అందురేని, వారి దగ్గరకు వెళ్ళక ఇక్కడనే ఆగిపోవుదము.

10. కాని వారు 'మా చెంతకురండు' అందు రేని వారియొద్దకు వెళ్ళుదము. యావే ఫిలిస్తీయులను మన వశముచేసెననుటకు అదియే గురుతు” అని చెప్పెను.

11. ఫిలిస్తీయులు యోనాతానును చూడగనే “అరుగో! హెబ్రీయులు దాగియున్న గోతులనుండి వెలువడుచున్నారు” అని పలికిరి.

12. అంతట వారు యోనాతానును అతని అనుచరుని పిలిచి “మా యొద్దకురండు, మీకొకమాట చెప్పవలయును” అనిరి. యోనాతాను అంగరక్షకునితో "యావే వీరిని యిస్రాయేలీయుల వశముకావించెను. నీవు నా వెంటరమ్ము” అనెను.

13. యోనాతాను లోయనుండి చేతులతో, కాళ్ళతో కొండకొమ్ము పైకెగబ్రాకెను. ఆ రీతినే అంగరక్షకుడును అతని వెంట ప్రాకిపోయెను. ఫిలిస్తీయులు యోనాతాను చేతబడి మడిసిరి. అంగరక్షకుడు కూడ అతని వెనువెంటనే వచ్చి అక్కడక్కడ మిగిలిన వారిని మట్టుపెట్టెను.

14. యోనాతాను మరియు అతని అనుచరుడును కొట్టిన మొదటి దెబ్బకే సుమారు ఇరువదిమంది కూలిరి. పొలములో ఒక జతఎడ్లు ఒక దినమున దున్ను అరెకరము నేల విస్తీర్ణములో అది జరిగెను.

15. యోనాతాను కావలిదండును కొట్టగనే ఫిలిస్తీయుల శిబిరమునందును, దాని చుట్టుపట్టులందును భయము అలముకొనెను. వారి కావలి దండును, దోపిడిదండును భీతిచే కంపించెను. నేల అదరెను. అది యావే పుట్టించిన వణుకు.

16. సౌలు కావలి బంటులు బెన్యామీనీయుల గిబియా నుండి చూడగా ఫిలిస్తీయుల శిబిరము చెల్లాచెదరగుచుండెను.

17. సౌలు తన అనుచరులతో, మన జనులను లెక్కించి ఎవరు వెళ్ళిపోయిరో తెలిసికొనుడని చెప్పెను. వారు జనుల పేర్లు పిలువగా యోనాతాను, అతని అంగరక్షకుడు కనిపింపరైరి.

18. సౌలు అహియాను పిలిచి యావే మందసము తీసుకొనిరమ్ము అనెను. ఆ దినమున మందసము యిస్రాయేలీయుల మధ్యనుండెను.

19. కాని సౌలు యాజకునితో మాట్లాడుచుండగనే ఫిలిస్తీయుల శిబిరమున కల్లోలము అంతకంతకు హెచ్చయ్యెను. కావున అతడు యాజకునితో అది అక్కరలేదు పొమ్మనెను.

20. అంతట సౌలు అతని అనుచరులు బారులుతీరి యుద్ధరంగమునకువచ్చిరి. అచ్చట శత్రువులు మిక్కిలి కలవరపాటుపడి ఒకరినొకరు గుర్తింపజాలక వారిలో వారే పోరాడుకొనుచుండిరి.

21. అంతవరకు ఫిలిస్తీయులకు దాసులైయుండి వారితోపాటు శిబిరమునకు వచ్చిన హెబ్రీయులు సౌలు, యోనాతానుల ననుసరించి వచ్చిన యిస్రాయేలీయులతో చేరిపోయిరి.

22. ఎఫ్రాయీము కొండలలో దాగుకొనియున్న యిస్రాయేలీయులు కూడ ఫిలిస్తీయులు పారిపోవుచున్నారని విని శత్రువులను వెన్నాడిరి.

23. ఆ రోజు యావే యిస్రాయేలీయులను ఈ విధముగా రక్షించెను. బేతావెను ఆవలివైపు వరకు యుద్ధము వ్యాపించెను.

24. ఆ దినము యిస్రాయేలీయులు చాల అలసి పోయిరి. సౌలు “నేను నా శత్రువులపై పగతీర్చుకొనువరకు, అనగా సాయంకాలమగు వరకును ఎవ్వడైనను భోజనము ముట్టుకొన్నచో శాపము పాలగును” అని ఒట్టు పెట్టెను. కనుక ఎవ్వరును ఆహారము ముట్టుకొనలేదు.

25-26. యిస్రాయేలీయులకు పొలమున ఒక తేనెపట్టు కనిపించెను. దానినుండి తేనె చిప్పిలు చుండెను. కాని ఒట్టు తప్పినట్లగునను భయమువలన తేనెపట్టుపై ఎవ్వడు చేయివేయలేదు.

27. అయినను సౌలు ఒట్టు పెట్టినమాట యోనాతానునకు తెలియదు. అతడు చేతనున్నకఱ్ఱకొనతో పట్టును పొడిచి కొంచెము తేనెను గైకొని ఆరగించెను. దానితో అతనికి సత్తువ కలిగెను.

28. అప్పుడు భటుడొకడు యోనాతానుతో “ఈ దినము భోజనము గైకొనినవాడు శాపమునకు గురియగునని నీ తండ్రి ఒట్టుపెట్టెను. కనుకనే గదా మన జనులు ఇంతగా బడలియున్నారు” అనెను.

29. యోనాతాను “నా తండ్రి ప్రజలకు కష్టము కలిగించెను. నేను కొంచెము తేనెను పుచ్చుకొనగనే ఏపాటి సత్తువ కలిగినదో చూడుము.

30. ఈ రీతినే మన జనులు కూడ నేడు శత్రువుల నుండి దోచుకొనివచ్చిన పశువులను చంపి భుజించియున్నచో ఎంత మేలయ్యెడిది! ఆ బలముతో మనవారు ఫిలిస్తీయులను ఊచముట్టుగ తునుమాడియుందురుగదా!” అనెను.

31. ఆ రోజు యిస్రాయేలీయులు మిక్మాషు నుండి అయ్యాలోను వరకు శత్రువులను తునుమాడిరి. కాని వారు మిక్కిలి అలసిపోయిరి.

32. అందుచే వారు శత్రువులనుండి దోచుకొని వచ్చిన గొఱ్ఱెలు, ఎడ్లు, దూడలు మొదలైన జంతువులపై ఎగబడిరి. ఎక్కడి వానిని అక్కడనే నేలమీదనే వధించిరి. నెత్తురు తొలగింపకయే మాంసముకాల్చి భుజింపమొదలిడిరి.

33. జనులు నెత్తురుతొలగింపని మాంసము భుజించి యావే యెదుట పాపము కట్టుకొనుచున్నారని సౌలు తెలిసికొనెను. అతడు “ప్రజలు యావే ఆజ్ఞ మీరు చున్నారుగదా!” అనెను. పెద్ద రాతిబండను తన యొద్దకు దొర్లింప ఆజ్ఞయిచ్చెను.

34. చెంతనున్న వారితో “ప్రజలకడకు వెళ్ళి 'మీ ఎడ్లను, గొఱ్ఱెలను కొనివచ్చి ఈ రాతిబండపై కుత్తుకలుకోసి భుజింపుడు. నెత్తురుతో భుజించి యావే ఎదుట పాపము కట్టుకొనకుడు' అని మందలింపుడు” అని చెప్పెను. కావున ప్రజలు ఆ రేయి వారివారి ఎడ్లను కొనివచ్చి రాతి బండపై వధించిరి'.

35. సౌలు ప్రభువునకు ఒక బలిపీఠము కట్టెను. అదియే అతడు నిర్మించిన మొదటి బలిపీఠము.

36. సౌలు “రాత్రికి పోయి ఫిలిస్తీయుల మీదపడి వారిని తరుముదము. వేకువజాము వరకు వారి సొత్తు దోచుకొందము. ఒక్కడుకూడ మిగులకుండ శత్రువులను చంపుదము” అనెను. అనుచరులు నీ ఇష్ట ప్రకారముగనే కానిమ్మనిరి. కాని యాజకుడు మొదట దేవుని చిత్తము తెలిసికొందమనెను.

37. సౌలు ప్రభువును ఉద్దేశించి “ఫిలిస్తీయులను వెన్నాడవచ్చునా? నీవు వారిని యిస్రాయేలు వశము గావించెదవా?" అని అడిగెను. కాని ఆ దినమున యావే ప్రత్యుత్తరము ఈయలేదు.

38. సౌలు ప్రజాధిపతులను చూచి “నాయకులారా! ముందుకురండు. ఈ దినము జరిగిన అపరాధమేమియో తెలిసికొనవలయును.

39. యిస్రాయేలు విమోచకుడైన యావే ప్రభువుతోడు! అపరాధము చేసినవాడు నా తనయుడు యోనాతానే అయినను తప్పక చావవలసినదే” అనెను. అతని పలుకులకు ప్రజలలో ఒక్కడును నోరు మెదప లేదు.

40. సౌలు జనులతో “మీరందరు ఒక ప్రక్క నిలువుడు. నేనును, నా కుమారుడైన యోనాతాను మరియొకప్రక్క నిలచెదము” అనెను. వారు “నీ ఇష్టప్రకారముగనే కానిమ్ము" అనిరి.

41. అంతట సౌలు “యిస్రాయేలు దేవుడవైన ప్రభూ! ఈ రోజు నీ దాసునకు బదులు పలుకవైతివేల? నేనుగాని, నా పుత్రుడైన యోనాతానుగాని లేక ప్రజలుగాని అపరాధము చేసినచో నీవే దీనిని నిర్ణయించుము అని వేడుకొనెను. అప్పుడు ట్లు వేయగా యోనాతాను సౌలుల పేర్లు వచ్చెను. కావున ప్రజలు తప్పించు కొనిరి.

42. మరల సౌలు తనకు, తన కుమారునకు చీట్లు వేయగా యోనాతాను పేరు వచ్చెను.

43. అంతట సౌలు యోనాతానుతో “నీవేమి పాడుపని చేసితివో తెలియజేయుము” అనెను. అతడు “నా చేతనున్న కఱ్ఱకొనతో కొంచెము తేనెనుగైకొని త్రాగితిని. నేను నిక్కముగా చావవలసినదే” అనెను.

44. సౌలు ఇట్లనెను 'యోనాతాను, నీవు నిక్కముగా చావవలసినదే, కానిచో దేవుడు నాకు ఎంతైనా కీడు చేయునుగాక!' అనెను. “యోనాతాను చావవలసినదే” అని గట్టిగా ఒట్టు వేసికొనెను.

45. కాని ప్రజలు మాత్రము “యిస్రాయేలీయులకు ఇంతటి మహావిజయము సాధించి పెట్టిన యోనాతాను చనిపోవలసినదేనా? అది ఎన్నటికిని కూడదు. సజీవుడైన యావే తోడు! యోనాతాను తలపూవువాడకుండుగాక! అతడు ఈ దినము సాధించిన విజయము యావే తోడ్పాటువలననే సిద్ధించినది” అనిరి. ఇట్లనుచు యోనాతానును విడిపించిరి. కనుక అతడు చావును తప్పించుకొనెను.

46. అటుపిమ్మట  సౌలు ఫిలిస్తీయులను వెన్నాడలేదు. కావున వారు తమ స్థలమునకు వెళ్ళిపోయిరి.

47. సౌలు యిస్రాయేలు దేశమున పరిపాలన మును సుస్థిరము చేసికొనెను. చుట్టుపట్లనున్న శత్రువులతో యుద్ధములు చేసెను. మోవాబీయులను, అమ్మోనీయులను, ఎదోమీయులను, సోబా రాజులను, ఫిలిస్తీయులను గెలిచెను. అతడు ఏ వైపు మరలినను విజయము లభించెడిది.

48. సౌలు పరా క్రమముతో అమాలేకీయులను ఓడించి వారి దోపిడి దండుల నుండి యిస్రాయేలీయులను కాపాడెను.

49. సౌలు తనయులు: యోనాతాను, యిష్వీ, మెల్కీ షూవా అనువారు. అతనికి కుమార్తెలు ఇద్దరు. మేరబు పెద్ద కూతురు. మీకాలు రెండవ కూతురు.

50. అహిమాసు కూతురగు అహీనోవము సౌలు భార్య. అతని సైన్యాధిపతి నేరు కుమారుడైన అబ్నేరు. ఇతడు సౌలు పినతండ్రి కుమారుడు.

51. సౌలు తండ్రి అయిన కీషును, అబ్నేరు తండ్రియైన నేరును అబీయేలు తనయులు.

52. సౌలు బ్రతికి యున్నన్ని నాళ్ళు ఫిలిస్తీయులతో హోరాహోరిగా పోరాడెను. అతడు వీరుడుగాని, పరాక్రమవంతుడుగాని కంట బడగనే వానిని తన సైన్యమున చేర్చుకొనెడివాడు. 

 1. సమూవేలు సౌలుతో “నేను యావే పంపగా వచ్చి ప్రభు ప్రజయైన యిస్రాయేలీయులకు నిన్ను రాజుగ అభిషేకించితిని. కావున ఇప్పుడు ప్రభువు పలుకులు ఆలింపుము.

2. సైన్యములకు అధిపతియైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చునప్పుడు అమాలెకీయులు త్రోవలో వారినెదిరించి బాధించిరి. నేను వారిని శిక్షింపవలెను.

3. కావున నీవు శీఘ్రమే పోయి అమాలెకీయులను వధింపుము. వారి ఆస్తిపాస్తులను శాపముపాలు చేయుము. వారిలో ఒక్కనిగూడ బ్రతుకనీయవద్దు. స్త్రీలను, పురుషులను, నెత్తురు కందులను, చంటిబిడ్డలను, ఎడ్లను, గొఱ్ఱెలను, ఒంటెలను, గాడిదలను అన్నింటిని మట్టుపెట్టుము. ఇది యావే ఆజ్ఞ" అని చెప్పెను.

4. సౌలు జనులను సమకూర్చుకొని తెలాయీము నొద్ద లెక్కించి చూడగా రెండు లక్షలమంది కాలి బంటులు, పదివేలమంది యూదీయులు ఉండిరి.

5. అతడు అమాలేకీయుల నగరముపైకి దండెత్తిపోయి ప్రక్కలోయలో పొంచియుండెను.

6. అచట వసించుచున్న కేనీయులను చూచి “ఈ అమాలెకీయులలో నుండి బయటకి వెడలిపొండు. లేదేని వారితో పాటు మిమ్మునుకూడ నాశనము చేయవలసివచ్చును. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి బయలుదేరి వచ్చినపుడు మీరు వారిని చాల ఆదరించిరి” అని చెప్పెను. వెంటనే కేనీయులు అమాలెకీయులను వీడి వెడలిపోయిరి.

7. సౌలు హవీలానుండి ఐగుప్తు పొలిమేరలలో నున్న షూరు వరకుగల అమాలేకీయులందరిని సంహరించెను.

8. వారి రాజైన అగాగు ప్రాణములతో చిక్కెను. మిగిలిన వారినందరను శాపముపాలుచేసి కత్తికి బలిచేసెను.

9. కాని సౌలు అతనివైపున పోరాడిన వీరులు అగాగు ప్రాణములు తీయలేదు. క్రొవ్విన ఎడ్లను, దూడలను, గొఱ్ఱెలను, గొఱ్ఱె పిల్లలను చంప లేదు. శ్రేష్ఠములైన పశువులనన్నిటిని మిగుల్చుకొని, పనికిరాని నీచపశువులను మాత్రము శాపముపాలు చేసి వధించిరి.

10-11. అంతట ప్రభువు దివ్యవాణి “సౌలును రాజును చేసినందులకు విచారించుచున్నాను. అతడు నన్ను లెక్కచేయక నా ఆజ్ఞను ధిక్కరించెను” అని సమూవేలుతో చెప్పెను. ఆ మాటలకు సమూవేలు చాల నొచ్చుకొనెను. అతడు రాత్రియంతయు ప్రభువునకు మొర పెట్టెను.

12. మరునాటి వేకువనే సమూవేలు సౌలును చూడబోయెను. కాని సౌలు కర్మేలు పట్టణమునకు పోయి తన గౌరవార్థము విజయస్తంభము నిలిపి, అటనుండి కదలి గిల్గాలునకు వెడలిపోయెనని తెలియవచ్చెను.

13. సమూవేలు సౌలును కలిసికొనరాగా, సౌలు సమూవేలును చూడగనే “ప్రభువు నిన్ను దీవించుగాక! నేను యావే ఆజ్ఞ పాటించితిని” అని పలికెను.

14. సమూవేలు “అటులయిన ఈ గొఱ్ఱెల అరపులు, ఈ ఎద్దుల రంకెలు నా చెవులలో ఇంకను రింగున మారుమ్రోగుచున్నవేల?" అనెను.

15. సౌలు “వీనిని అమాలెకీయుల నుండి కొనివచ్చితిమి. ప్రజలు శ్రేష్ఠమైన ఎడ్లను, గొఱ్ఱెలను చంపక నీ దేవుడైన యావేకు బలియర్పించుటకై అట్టిపెట్టుకొనిరి. మిగిలిన వానిని శాపముపాలుచేసి సంహరించితిమి" అని బదులుపలికెను.

16. సమూవేలు అతనితో “నీ మాటలు ఇక కట్టి పెట్టి రాత్రి ప్రభువు నాతో నుడివిన పలుకులు ఆలింపుము” అనెను. సౌలు “చిత్తము! సెలవిమ్ము” అనెను.

17. సమూవేలు “నీవు అల్పుడవైనను యావే నిన్ను యిస్రాయేలు తెగలకు నాయకునిగా నియమింపలేదా? యిస్రాయేలీయులకు నిన్ను రాజుగా అభి షేకింపలేదా? 

18. యావే నీకొక పనిని అప్పగించెను. దుర్మార్గులైన అమాలేకీయులను వధింపుమనెను. వారితో పోరాడి అడపొడ కానరాకుండ వారిని నిర్మూలింపుమనెను.

19. మరి యావే ఆజ్ఞను నీవేల ధిక్కరించితివి? దోపిడి సొమ్ము దక్కించుకొని యావే ఎదుట ఏల పాపము చేసితివి?” అని అడిగెను.

20. సౌలు "నేను యావే మాటలను వింటినిగదా? ప్రభువు ఆజ్ఞ పాటించితిని. అమాలెకీయుల రాజు అగాగును పట్టి తెచ్చితిని. వారినందరను శాపముపాలు చేసి నిర్మూలించితిని.

21. ప్రజలు దోపిడిసొత్తు నుండి శాపముపాలు కావలసిన మేలిఎడ్లను, గొఱ్ఱెలను మిగుల్చుకొనిన మాట నిజమే. కాని గిల్గాలు వద్ద నీ దేవుడైన యావేకు బలియర్పించుటకే జనులు శపిత ములగు వానిని అట్టిపెట్టుకొనిరి” అని చెప్పెను.

22. అందులకు సమూవేలు ఇట్లనెను: “బలులవలన, దహనబలులవలన యావే సంతృప్తి చెందునా? విధేయతవలనగాదా? బలి యర్పించుటకంటె విధేయత మేలు. పొట్టేళ్ళక్రొవ్వు వేల్చుటకంటె అణకువ లెస్స.

23. తిరుగుబాటు సోదె చెప్పించుకొనుట వంటిది. గర్వము విగ్రహములను పూజించుట వంటిది. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేసెను."

24. సౌలు సమూవేలును చూచి "ప్రజలకు భయపడి వారిమాట వినినందున నేను యావే ఆజ్ఞను, నీ పలుకులను ఉల్లంఘించి పాపము కట్టుకొంటిని.

25. నా తప్పు క్షమించి, నేను యావేను మ్రొక్కునట్లు నాతోకూడ నీవు వెంటరమ్ము.” అని అడిగెను.

26. కాని సమూవేలు “నేను నీ వెంటరాను. నీవు యావే పలుకు తిరస్కరించితివి. కనుక యావే నీ రాజపదవిని తిరస్కరించెను” అని చెప్పెను.

27. అంతట సమూవేలు ప్రక్కకు మరలి వెళ్ళిపోబోగా సౌలు గబాలున అతని అంగీచెంగు పట్టుకొనెను. అది చినిగెను.

28. సమూవేలు అతనితో “ఈ రోజు ప్రభువు యిస్రాయేలు రాజ్యమును నీ చేతినుండి లాగివేసి నీకంటె యోగ్యుడైన వానికి ఇచ్చివేసెను” అని చెప్పెను.

29. “అయినను యిస్రాయేలీయుల వెలుగైన ప్రభువు మాటతప్పనులేదు, విచారపడను లేదు. విచారపడుటకు అతడు నరుడా ఏమి?” అనెను.

30. అప్పుడు సౌలు “నేను పాపము చేసినమాట నిజమే. అయినను నా జనుల పెద్దల ఎదుటను, యిస్రాయేలు జనుల ముందును నన్ను హెచ్చించిన యావేకు మ్రొక్కుటకై నాతోకూడ తిరిగిరమ్మని అతనిని వేడుకొనెను. 

31. సమూవేలు సౌలు వెంట పోయెను. అతడు యావేకు మ్రొక్కెను.

32. అంతట సమూవేలు అగాగును కొని రమ్మనెను. అగాగు సంకెళ్ళతో బంధింపబడినవాడై సమూవేలు కడకు వచ్చెను. అతడు విడుదల పొందవచ్చుననుకొని “నిక్కముగా మరణ భయతీవ్రత తగ్గినది” అనెను. కాని సమూవేలు అతనితో “మునుపు నీ కత్తి వలన తల్లులు తమ బిడ్డలను కోల్పోయినట్లే నేడు నీ తల్లియు తన బిడ్డను కోల్పోవునుగాక!” అనెను.

33. ఇట్లని గిల్గాలునందు యావే ఎదుట అతనిని ముక్కలు ముక్కలుగా నరికివేసెను.

34. సమూవేలు రామాకు వెళ్ళిపోయెను. సౌలు గిబియాలోని తన ఇల్లు చేరుకొనెను.

35. సౌలు చనిపోవువరకు సమూవేలు అతనిని తిరిగి ఎన్నడును కలిసికొనలేదు. అయిన అతడు సౌలును గూర్చి చాల పరితపించెను. యావే మాత్రము సౌలును రాజుగా చేసినందులకు విచారించెను.

 1. యావే సమూవేలుతో “నేను సౌలును రాజుగా నుండనీయలేదని ఎంతకాలము ఇట్లు దుఃఖింతువు? కొమ్మును తైలముతో నింపుకొని పయనమై పొమ్ము. బేత్లెహేము వాసియైన యిషాయి కడకు నిన్ను పంపె దను. అతని కుమారులలో ఒకనిని రాజుగా ఎన్ను కొంటిని” అని చెప్పెను.

2. సమూవేలు "నేను పోజాలను. ఈ మాట విన్నచో సౌలు నన్ను చంపివేయును” అనెను. యావే “నీవొక ఆవు పెయ్యను తోలుకొని పొమ్ము. ఆ ఊరి వారితో యావేకు బలి అర్పించుటకై వచ్చితినని నుడువుము.

3. యిషాయినిగూడ బల్యర్పణమునకు ఆహ్వానింపుము. పిమ్మట నీవేమి చేయవలయునో అచ్చట వివరించెదను. నీవు మాత్రము నేను నిర్ణయించిన వానిని అభిషేకింపవలెను” అనెను.

4. సమూవేలు యావే నుడివిన రీతినే బేత్లెహేము వెళ్ళెను. ఆ ఊరి పెద్దలతనిని చూచి మిక్కిలి భయపడి “నీవు మా మేలెంచి వచ్చితివా లేక కీడెంచి వచ్చితివా” అని అడిగిరి. 

5. అతడు “మీ మేలు కోరియే వచ్చితిని. నేను యావేకు బలి అర్పించెదను. కనుక మీరెల్లరు శుద్ధిచేసికొని నాతోపాటు బలి అర్పించుటకు రండు” అని చెప్పెను. యిషాయిని అతని కుమారులను తానే శుద్ధిచేసి బలికి ఆహ్వానించెను.

6. వారు బలికి వచ్చిరి. అప్పుడు సమూవేలు ఎలీయాబును చూచి ప్రభువు ఎన్నుకొనిన రాజు నిక్కముగా యావే ఎదుటికి రానే వచ్చినాడుగదా అను కొనెను.

7. కాని యావే “ఇతని రూపమును, ఎత్తును చూచి భ్రమపడకుము. నేను ఇతనిని నిరాకరించితిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును. కాని దేవుడు హృదయమును అవలోకించును” అని చెప్పెను.

8. అంతట యిషాయి అబీనాదాబును సమూవేలు ముందట నిలిపెను. కాని అతడు “యావే ఇతనిని గూడ ఎన్నుకోలేదు” అని చెప్పెను.

9. యిషాయి మరల షమ్మాను సమూవేలుచెంత నిలిపెను. కాని సమూవేలు “యావే ఇతనినిగూడ ఎన్నుకోలేదు” అని చెప్పెను.

10. ఈ రీతిగా యిషాయి తన ఏడుగురు కుమారులను సమూవేలు ఎదుట నిలిపెను. కాని అతడు “యావే వారిని ఎన్నుకోలేదు” అని చెప్పెను.

11. సమూవేలు “నీ కుమారులందరు వీరేనా?” అని యిషాయిని అడిగెను. అతడు “కడగొట్టువాడు ఇంకొకడున్నాడు. వాడు పొలమున గొఱ్ఱెలు కాయుచు ఉన్నాడు” అనెను. సమూవేలు “ఎవరినైన పంపి కుఱ్ఱవానిని పిలుపింపుము. అతడు వచ్చువరకు నేను భోజనమునకు కూర్చుండను” అని పలికెను.

12. యిషాయి చిన్నకొడుకును పిలువనంపెను. అతని మేను బంగారమువలెనుండెను. కండ్లు మిలమిల మెరయుచుండెను. ఆకృతి సుందరముగానుండెను. అప్పుడు యావే “నేను కోరుకొనినవాడు ఇతడే. ఇతనిని అభిషేకింపుము” అనెను.

13. సమూవేలు తైలపు కొమ్ము పుచ్చుకొని అన్నలెదుట అతనికి అభిషేకము చేసెను. ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయెను. అంతట సమూవేలు రామాకు వెడలిపోయెను.

14. యావే ఆత్మ సౌలును వదలి వెళ్ళిపోయెను. కాని యావే నుండి వచ్చిన వేరొక దుష్టాత్మ అతనిని పట్టి బాధింపదొడగెను.

15. సౌలు సేవకులు “యావే నుండి వచ్చిన దుష్టాత్మ నిన్ను పట్టి బాధించుచున్నది.

16. ప్రభువుల వారు ఆనతిచ్చినచో మీ సేవకులు నేర్పరియైన సితార వాద్యనిపుణుని ఒకనిని కొని వత్తురు. యావే వద్దనుండి వచ్చిన దుష్టాత్మ నిన్ను పీడించునపుడు వాద్యకారుడు సితార పుచ్చుకొని వాయించును. నీకు నెమ్మది కలుగును” అని చెప్పిరి.

17. సౌలు “చక్కని వాద్యకారుని వెదకి ఇటకు కొని రండు” అని పలికెను.

18. అపుడొక కొలువుకాడు సౌలుతో "బేత్లెహేము వాసియైన యిషాయి పుత్రుని నేనెరుగుదును. అతడు సితార చక్కగా వాయింప గలడు. మగసిరిగల యోధుడు. మాటనేర్పరి. రూప వంతుడు. యావే అనుగ్రహము వడసినవాడు” అని విన్నవించెను.

19. ఆ మాటలువిని సౌలు యిషాయి వద్దకు భటులనంపి “గొఱ్ఱెలమందలు కాయుచున్న నీ కుమారుడు దావీదును నా యొద్దకు పంపుము” అని వార్త పంపెను.

20. యిషాయి రొట్టెలను, తిత్తెడు ద్రాక్ష సారాయమును, మేకపిల్లను కానుకగా ఇచ్చి దావీదును పంపించెను.

21. ఈ రీతిగా దావీదు సౌలు కడకువచ్చి అతని కొలువున చేరెను. సౌలు అతనిని మిక్కిలి ఆదరించి అతనిని తన అంగరక్షకుని చేసికొనెను.

22. అంతట సౌలు "దావీదును నాకు కొలువు సేయనిమ్ము. అతడు నా మన్ననకు పాత్రుడయ్యెను” అని యిషాయిని ఆజ్ఞాపించెను.

23. యావే ఆత్మ సౌలును సోకినపుడెల్ల దావీదు సితార చేతపట్టి పాటవాయించెడివాడు. అతడు ఉప శాంతిపొంది నెమ్మదినొందెడివాడు. దుష్టాత్మ సౌలును విడిచి వెళ్ళెడిది.

 1. ఫిలిస్తీయులు సైన్యములను ప్రోగుచేసికొని యూదాకు చెందిన సోకో నగరము నొద్ద గుమిగూడిరి. సోకో, అసేకాల మధ్యనున్న ఏఫేసుదమ్మీము చెంత శిబిరము పన్నిరి.

2. సౌలు, యిస్రాయేలీయులు కూడ సైన్యములను చేకూర్చుకొని సింధూరపు లోయ దగ్గర గుడారములెత్తి ఫిలిస్తీయులను ఎదుర్కొనుటకు బారులు దీర్చిరి.

3. ఈ రీతిని ఫిలిస్తీయులొక కొండపైన యిస్రాయేలీయులు ఇంకొక కొండపైన సైన్యములను మోహరించిరి. ఇరువురకు నడుమ లోయఉండెను.

4. అంతట ఫిలిస్తీయుల పక్షమునుండి గొల్యాతు అను వీరుడు ముందుకు వచ్చెను. అతడు గాతు నివాసి. తొమ్మిదడుగుల పైని జానెడు ఎత్తున ఉండెను.

5. గొల్యాతు తలపై కంచు శిరస్త్రాణమును, రొమ్మున కంచు పొలుసుల కవచమును ధరించెను. ఆ కవచము ఐదువేల తులముల బరువు కలది.

6. కాళ్ళకు పదత్రాణములు తొడిగెను. భుజములపై కంచుతో చేసిన యీటెను ధరించెను.

7. అతని బల్లెపుకఱ్ఱ, సాలెవాడు చాపుచుట్టెడి మ్రానుపట్టెవలె నుండెను. ఆ బల్లెపు ఇనుపమొన ఆరువందల తులముల బరువు కలది. బంటు డాలు మోయుచు అతనిముందు నడచు చుండెను.

8. ఫిలిస్తీయుడు యిస్రాయేలీయుల ఎదుటికి వచ్చి “సౌలు బానిసలారా! మీరిచ్చటికి వచ్చి పోరాటమునకు మొనలు దీర్పనేల? నేను ఫిలిస్తీయుడనుగానా? మీ పక్షమునుండి నన్నెదిరింపగల వానిని ఎన్నుకొని ఇచ్చటికి పంపుడు.

9. అతడు నాతో పోరాడి నన్ను వధించెనేని మేము మీకు దాసులమగుదుము. నేనే వానిని గెలుతునేని మీరు మాకు బానిసలై సేవచేయుడు.

10. నేడు మీ యిస్రాయేలు సైన్యములమీద సవాలు చేయుచున్నాను. నాతో పోరాడుటకు మీ ఇష్టము వచ్చిన వానిని పంపుడు” అనెను.

11. సౌలును, యిస్రాయేలీయులును ఫిలిస్తీయుని మాట లాలించి నిశ్చేష్టులైరి.

12. దావీదు యూదాలోని బేత్లెహేము నివాసియు, ఏఫ్రతీయుడైన యిషాయి కుమారుడు. యిషాయికి ఎనమండుగురు పుత్రులు. సౌలునాటికి అతడు ప్రాయము చెల్లినవాడు.

13. యిషాయి పెద్దకొడుకులు ముగ్గురు సౌలు పక్షమున యుద్ధము చేయబోయిరి. వారిలో పెద్ద వాడు ఎలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా.

14. దావీదు కడగొట్టువాడు, పెద్దవారు ముగ్గురు సౌలుతో పోరాడ బోయిరిగదా!

15. దావీదు మాత్రము బేత్లెహేము నుండి సౌలు శిబిరము చెంతకు, శిబిరము నుండి బేత్లెహేములోని తండ్రి మందల వద్దకు వచ్చుచు బోవుచునుండెను.

16. ఫిలిస్తీయుడైన గొల్యాతు నలువదినాళ్ళు ప్రతిదినము యిస్రాయేలీయులను కవ్వించెను.

17. ఒకనాడు యిషాయి దావీదుతో “వేయించిన ఈ మానెడు ధాన్యమును, ఈ పది రొట్టెలను గైకొని వెంటనే శిబిరమునందలి నీ అన్నల యొద్దకు పొమ్ము.

18. ఈ పది జున్నుముక్కలను వారి సైన్యాధిపతికి కానుక ఇమ్ము. తోబుట్టువుల మంచిచెడ్డలు తెలిసికొని నాకొక ఆనవాలు కొనిరమ్ము.

19. వారు సౌలు యిస్రాయేలీయులతో గూడి సింధూరపులోయ దగ్గర ఫిలిస్తీయులతో యుద్ధము చేయుచున్నారు” అని చెప్పెను.

20. దావీదు వేకువనే లేచి మందలను ఇరుగు పొరుగు వారికి అప్పగించి సామానులను తీసికొని తండ్రి ఆజ్ఞాపించిన రీతినే బయలుదేరిపోయెను. అతడు శిబిరము చేరునప్పటికి సేనలు యుద్ధనాదము చేయుచు బారులు తీరుచుండెను.

21. యిస్రాయేలీ యులు, ఫిలిస్తీయులు ఎదురెదురుగనే దండులు తీర్చిరి.

22. దావీదు సామగ్రి భద్రపరచువారియెద్ద సామానులుంచి సిపాయి వరుసలను సమీపించి అన్నల యోగక్షేమములు అడిగెను.

23. అతడు సోదరులతో మాటలాడుచుండగనే గాతునుండి వచ్చిన ఫిలిస్తీయశూరుడు గొల్యాతు సేనల నుండి ముందుకు వచ్చి పూర్వపురీతినే సవాలు చేసెను. దావీదు అతని బింకములాలించెను.

24. యిస్రాయేలీయులు గొల్యాతును చూడగనే జడిసి గబగబ అతని ఎదుటినుండి ప్రక్కకు తొలగిపోయిరి.

25. వారు తమలోతాము “ఈ ముందటికి వచ్చిన వానిని జూచితిరా? వీడు యిస్రాయేలీయులను సవాలు చేయుటకే వచ్చినాడు. ఇతనిని చంపినవారికి రాజు సిరులు కొల్లలుగా ఇచ్చును. తన కుమార్తెనొసగి పెండ్లి చేసి, అతని తండ్రి ఇంటివారిని యిస్రాయేలీయులలో స్వతంత్రులనుగా' చేయును” అని అనుకొనుచుండిరి.

26. దావీదు తనయొద్ద నిలిచియుండిన వారిని జూచి “ఈ ఫిలిస్తీయుని చంపి యిస్రాయేలీయుల తలవంపులు తీర్చిన వారికి ఏమి బహుమానము లభించును? సున్నతి సంస్కారములేని ఈ ఫిలిస్తీయుడు సజీవుడైన యావే సైన్యములను తూలనాడువాడా?” అనెను.

27. వారు, వీనిని చంపినవానికి లభించు బహుమానము ఇట్టిదని తమలో తామాడుకొనిన మాటలనే ఉదాహరించి చెప్పిరి.

28. కాని దావీదు పెద్దన్న అయిన ఎలీయాబు, తమ్ముడు ప్రక్కవారితో సంభాషించుట చూచి మండిపడెను. అతడు సోదరునితో “నీవు ఇచ్చటకేల వచ్చితివి? నీ పొగరు నేనెరుగుదును. నీవు వట్టి వదరుబోతువు. పోరు చూచి పొంగిపోవుటకే నీవిటకు వచ్చితివి” అనెను.

29. దావీదు “నేనేమి చేసితిని? ఇచట మాటలాడుటకుగూడ వీలులేదా?” అని బదులుపలికెను.

30. అంతట అతడు మరియొకని చెంతకుపోయి మరల అదే ప్రశ్న వేసెను. అచటివారును అదే ప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి.

31. కాని సైనికులు దావీదు మాటలాలించి సౌలునకు విన్నవించిరి. అతడు దావీదును పిలువనంపెను.

32. దావీదు సౌలుతో “ఇతనినిగూర్చి ఎవ్వరును భయపడనక్కరలేదు. అనుమతియైనచో నీ దాసుడు ఈ ఫిలిస్తీయునితో పోరాడగలడు” అని పలికెను.

33. కాని సౌలు “ఈ ఫిలిస్తీయుని ఎటుల ఎదిరింప గలవు? నీవా బాలుడవు. అతడు బాల్యమునుండి యుద్ధమున కాకలుతీరినబంటు” అనెను.

34. దావీదు సౌలుతో “నీ దాసుడు తన తండ్రి గొఱ్ఱెలమందలను కాయుచుండెడివాడు. అప్పుడప్పుడు సింగము గాని, ఎలుగుబంటిగాని మందమీద పడి గొట్టైనెత్తుకొని పోయెడిది.

35. నేను వన్యమృగమును తరిమి, చావమోది దాని నోటినుండిగొఱ్ఱెను విడిపించు కొని వచ్చెడివాడను. అది నా మీద తిరుగబడెనేని మెడక్రింది జూలుపట్టుకొని చితుకబొడిచి చంపెడి వాడను.

36. నీ దాసుడు సింగములను, ఎలుగులను మట్టుపెట్టెను. సున్నతి సంస్కారములేని ఈ ఫిలిస్తీయుడును వానివలె చచ్చును. సజీవదేవుని సైన్యములను వీడు సవాలు చేయువాడా?

37. ఎలుగు, సింగముల వాడి గోళ్ళనుండి నన్ను రక్షించిన ప్రభువు ఈ ఫిలిస్తీయుని చేత చిక్కకుండ కాపాడకపోడు” అని పలికెను. సౌలు “అటులయిన పోయి పోరాడుము. యావే నీకు తోడుగానుండుగాక!” అనెను.

38. సౌలు దావీదునకు తన ఆయుధములను ఒసగెను. తలమీద శిరస్త్రాణము, రొమ్మున కవచము నుంచెను.

39. ఆ కవచముపై తన కత్తినిగూడ వ్రేలాడ గట్టెను. కాని దావీదునకు ఈ ఆయుధములు ధరించు అలవాటు లేకపోవుటచే వానితో నడువలేకపోయెను. అతడు సౌలుతో “నేను ఇంతవరకు ఆయుధములకు అలవాటుపడి యుండలేదు. వీనితో నడువజాలకున్నాను” అని చెప్పి ఆయుధములను తొలగించెను.

40. దావీదు తన కఱ్ఱచేత బట్టుకొనెను. ఏటి ఒడ్డునుండి ఐదు నున్ననిరాళ్లు ఏరుకొని సంచిలో వేసికొనెను. ఒడిసెల తీసికొని ఫిలిస్తీయునివైపు పోయెను.

41. ఫిలిస్తీయుడు తన డాలు మోయుచున్న బంటుతో ముందునడుచుచూ మెల్లమెల్లగా అడుగు లిడుచు దావీదును సమీపించెను.

42. అతడు దావీదును చిన్నచూపు చూచెను. దావీదు బాలుడు. బంగారము వంటి ఒడలితో సుందరమైన ఆకృతి గలవాడు.

43. ఫిలిస్తీయుడు దావీదుతో “కఱ్ఱనెత్తుకొని నా మీదికి వచ్చుటకు నేను కుక్కననుకొంటివాయేమి?" అనెను. తన దేవరల పేరెత్తి దావీదును శపించెను.

44. “ఇటురమ్ము, నీ కండలు కోసి ఆకాశపక్షులకు, అడవి మృగములకు ఆహారము గావించెదను” అని పలికెను.

45. దావీదు “నీవు కత్తి, యీటె, బాకు గైకొని నా మీదికి వచ్చితివి. కాని నేను సైన్యములకు అధిపతియైన యావే పేర, నేడు నీవు నిందించిన యిస్రాయేలు సైన్యముల దేవుని పేర, నీ మీదికి వచ్చి తిని.

46. నేడు యావే నిన్ను నా చేతికి చిక్కించును. నేను నిన్ను నిలువున కూల్చి నీ తల తెగవేసెదను. నీ శవమును, ఫిలిస్తీయుల శవములను ఆకాశపక్షులకు వన్యమృగములకు మేతగా వేసెదను. అప్పుడు గాని యిస్రాయేలీయులలో దేవుడున్నాడని ఎల్లరును తెలిసికో జాలరు.

47. ఇట గుమికూడియున్న ఈ దండులన్నియు, యావే కత్తి, బల్లెముల వలన విజయము ప్రసాదించువాడు కాడని గుర్తించును. యుద్ధము యావేదే. అతడు తప్పక నిన్ను నా చేతి కప్పగించును" అని బదులు పలికెను.

48. అంతట ఫిలిస్తీయుడు మెల్లమెల్లగా దావీదు దగ్గరకు వచ్చుచుండెను. దావీదు సేనలబారులు దాటి వడివడిగా ఫిలిస్తీయునకు ఎదురేగెను.

49. అతడు సంచిలో చేయిడి రాయితీసి ఒడిసెలలో పెట్టి గిఱ్ఱున  త్రిప్పి ఫిలిస్తీయుని నొసటిపైన కొట్టెను. ఆ రాయి నోసటిని చీల్చి లోనికి చొచ్చుకొనిపోగా ఫిలిస్తీయుడు గభీలున నేలపై బోరగిలపడెను.

50. దావీదు వడిసెలతో ఫిలిస్తీయునకు ఎదురునిలిచి, బలాఢ్యుడై వడిసెల రాతితో ఆ ఫిలిస్తీయుని కొట్టిచంపెను. దావీదు చేతిలో కత్తిలేదు.

51. అతడు వెనువెంటనే పరుగెత్తి ఫిలిస్తీయుని పైకెక్కి ఒరనుండి వాని కత్తిదూసి, దానితో వానిని పొడిచిచంపి తల తెగనరికెను.

52. ఫిలిస్తీయులు తమ వీరుడు నేలకూలుటచూచి గుండెలు చెదరి పారిపోయిరి. కాని యిస్రాయేలీయులు, యూదీయులు కో యని అరచుచు ఫిలిస్తీయులను వెన్నాడి గాతు వరకు, ఎక్రోను నగరద్వారముల వరకు తరుము కొనిపోయిరి. ఫిలిస్తీయులు గాయములు తగిలి షారీమునుండి గాతు, ఎక్రోనులవరకు మార్గము వెంట కుప్పతిప్పలుగా కూలిపోయిరి.

53. ఈ తీరున యిస్రాయేలీయులు ఫిలిస్తీయులను తరిమి, తిరిగివచ్చి వారి శిబిరముల పైబడి దొరికినవన్నియు దోచుకొనిరి.

54. దావీదు గొల్యాతు శిరమును యెరూషలేమునకు కొనిపోయెను. అతని ఆయుధములను మాత్రము తన గుడారముననే ఉంచెను.

55. దావీదు ఫిలిస్తీయుని ఎదుర్కొన బోవునపుడు సౌలు తన సైన్యాధిపతి అబ్నేరును చూచి “ఈ పడుచు వాడు ఎవరి కుమారుడు?” అని ప్రశ్నించెను. అతడు “ప్రభువు తోడు! నాకు తెలియదు” అనెను.

56. సౌలు “అటులయిన తెలిసికొనిరమ్ము” అనెను.

57. దావీదు ఫిలిస్తీయుని చంపి మరలి వచ్చిన తరువాత అబ్నేరు అతనిని సౌలు కడకు కొనిపోయెను. దావీదు ఫిలిస్తీయుని తల చేతబట్టుకొని సౌలు సమ్ముఖమునకు వచ్చెను.

58. సౌలు అతనిని జూచి “ఓయి! నీవెవరి కుమారుడవు?” అని అడిగెను. దావీదు "బేల్లె హేము నివాసియు, నీ దాసుడునగు యిషాయి కుమారుడను” అని బదులుపలికెను.

1. ఈ రీతిగా దావీదు సౌలుతో సంభాషించెను. అప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో పెనవేసుకొనెను. అతడు దావీదును ప్రాణమువలె ప్రేమింపజొచ్చెను.

2. సౌలు దావీదును ఇంటికి వెళ్ళనీయక తనయొద్దనే ఉంచుకొనెను.

3. యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునివలె చూచుకొనుచుండెను. దావీదుతో నిబంధనముకూడ చేసి కొనెను.

4. అతడు తన ఉత్తరీయము, కత్తి, విల్లు, నడికట్టు దావీదునకు ఇచ్చివేసెను.

5. సౌలు ఏ పనిమీద పంపినను దావీదు విజయము సాధించుచుండెను. కనుక సౌలు అతనిని తన సైన్యములకు నాయకుని చేసెను. అతడు సేనాధిపతియగుట జూచి ఇరుగు పొరుగువారును, రాజోద్యోగులును సంతసించిరి.

6. ఒకమారు దావీదు ఫిలిస్తీయులను గెలిచి నగరమునకు తిరిగివచ్చుచుండెను. యిస్రాయేలు పట్టణములనుండి స్త్రీలు తంబురా మొదలైన వాద్యములతో వెడలివచ్చి ఉత్సాహముతో పాడుచు, నాట్యమాడుచు సౌలునకు స్వాగతము పలికిరి.

7. వారు “సౌలు వేయిమందిని చంపెను, కాని దావీదు పది వేలమందిని చంపెను” అని వాద్యములు మీటుచు వంతుపాట పాడిరి.

8. ఆ మాటలు సౌలునకు నచ్చ లేదు. అతనికి అసూయ పుట్టెను. తనలో తాను “వీరు దావీదు పదివేలమందిని చంపెనని పలికి, నేను వేయి మందిని మాత్రమే చంపితినని నుడివిరి. ఇక రాచరిక మొకటి తప్ప అన్ని వైభవములు ఇతనికి అమరినట్లే గదా!” అనుకొనెను.

9. నాటినుండి సౌలునకు దావీదనిన కన్నుకుట్టెను.

10. ఆ మరుసటిరోజు దేవునియొద్దనుండి దుష్టాత్మ సౌలును ఆవేశించెను. అతడు ఇంటనుండగనే వెఱ్ఱి వికటతాండవమాడెను. అపుడు దావీదు ఎప్పటి వలెనే సితారా పుచ్చుకొని వాయించుచుండెను.

11. సౌలు చేతిలో ఈటెగలదు. దానితో అతడు దావీదును పొడిచి గోడకు గ్రుచ్చవలయుననుకొని అతనిపై ఈటె విసరెను. కాని దావీదు రెండుమారులు సౌలు ఎదుటినుండి తప్పుకొనెను.

12. యావే సౌలును విడనాడి దావీదునకు తోడయ్యెను. అందుచే అతడు దావీదును చూచి భయపడజొచ్చెను.

13. సౌలు అతనిని తన ఇంటి బలగము నుండి తొలగించి వేయిమంది సైనికులకు అధిపతిని చేసెను. దావీదు వారికి నాయకుడై కార్యములు నిర్వహించెను.

14. యావే తోడ్పాటువలన అతడు చేపట్టిన పనులన్నియు నెరవేరెను.

15. కాని దావీదు విజయవంతుడు అగుట చూచి సౌలు మరింత భయపడెను.

16. అయినను యూదీయులు, యిస్రాయేలీయులు దావీదును మెచ్చుకొనిరి. అతడు వారికి నాయకుడై కార్యములు నడిపెను.

17. సౌలు దావీదుతో “నా పెద్ద కూతురు మేరబును చూచితివిగదా! ఆ పిల్లను నీకిచ్చి పెండ్లి చేసెదను. నీవు మాత్రము పరాక్రమశాలివై యావే యుద్ధములు నడపవలయును సుమా!” అనెను. కాని అతడు హృదయమున "నేను వీనిపై చేయిచేసికోనేల? ఫిలిస్తీయులే ఇతనిని తుదముట్టింతురు” అనుకొనెను.

18. దావీదు సౌలుతో “రాజునకు అల్లుడనగుటకు నేను ఏపాటివాడను? మా పూర్వులు ఎంతటివారు? మా కుటుంబము ఏపాటి పేరుగాంచినది?” అనెను.

19. కాని సౌలు తన కూతురు మేరబుకు పెండ్లి చేయు సమయము వచ్చినపుడు ఆమెను దావీదునకు ఈయక మహోలతీయుడైన అద్రియేలునకిచ్చి వివాహము చేసెను.

20. అటుతర్వాత సౌలు చిన్నకూతురు మీకాలు దావీదును ప్రేమించెను. అది విని సౌలు సంతసించెను.

21. అతడు తన మనస్సులో “మీకాలును దావీదునకిచ్చి పెండ్లి చేసెదను. పిల్లను ఎర పెట్టి దావీదుని ఆకర్షించి ఫిలిస్తీయులమీదికి పంపెదను. వారతనిని తప్పక సంహరింతురు” అనుకొనెను. కనుక అతడు దావీదుతో రెండవమారు “నీవు నాకు అల్లుడవు అయ్యెదవు” అని చెప్పెను.

22. సౌలు తన సేవకులను చూచి "దావీదుతో రహస్యముగా సంభాషింపుడు. రాజు నిన్ను మెచ్చు కొనుచున్నాడు. సేవకులకందరకు నీవనిన మిక్కిలి అభిమానము. కనుక నీవు రాజునకు అల్లుడవగుము' అని చెప్పుడు” అని ఆజ్ఞాపించెను.

23. వారు ఈ మాటలు దావీదుతో చెప్పగా అతడు వారితో రాజకుమారిని పెండ్లియాడుట అంత తేలికయనుకొంటిరా? నేను ఊరు పేరులేని నిరుపేదను గదా!” అనెను.

24. దాసులు దావీదు పలుకులను మరల రాజునకు విన్నవించిరి.

25. అతడు వారిని జూచి “దావీదుతో 'నీవు రాజునకు పెండ్లికానుక చెల్లింప నక్కరలేదు. అతడు శత్రువులపై పగదీర్చుకోగోరుచున్నాడు. కనుక ఫిలిస్తీయుల చర్మాగ్రములు నూరుగొనివచ్చిన చాలును' అని చెప్పుడు” అనెను. దావీదు ఫిలిస్తీయులకు చిక్కి ప్రాణములు కోల్పోవలయుననియే సౌలు కోరిక.

26. సేవకులు సౌలు పలుకులను దావీదున కెరిగించిరి. అతడు రాజకుమారిని సులభముగనే పెండ్లియాడవచ్చునుగదాయని ఉబ్బి పోయెను. సౌలు పెట్టిన గడువు ఇంకను దాటిపోలేదు.

27. కనుక దావీదు అనుచరులతోపోయి ఫిలిస్తీయుల మీదబడి రెండువందలమందిని చంపెను. వారి చర్మాగ్రములు కొనితెచ్చి రాజు ముందటనే లెక్కించెను. సౌలు మీకాలును దావీదునకిచ్చి పెండ్లి చేసెను.

28. యావే దావీదునకు చేదోడు వాదోడుగా నుండెననియు, మీకాలు అతనిని ప్రేమించెననియు సౌలు గ్రహించెను.

29. కనుక అతడు దావీదును చూచి మునుపటికంటె అధికముగా భయపడజొచ్చెను. అతనిపై నిరంతర విరోధము పెంచుకొనెను.

30. అపుడు ఫిలిస్తీయ నాయకులు యిస్రాయేలీయులపై దండెత్తివచ్చిరి. కాని వారిని ఎదుర్కొని పోరాడిన సౌలు యోధులలో దావీదు అంతటివాడు కానరాడయ్యెను. కనుక అతని పేరు నలుమూలల మారు మ్రోగెను. 

 1. సౌలు తన కుమారుడైన యోనాతానుత, సేవకులతో, దావీదును వధింపవలయునని చెప్పెను.

2. కాని యోనాతానునకు దావీదనిన ప్రాణము. అతడు దావీదును చూచి “నా తండ్రి నిన్నెట్లయినను చంపవలయునని యత్నించుచున్నాడు. కనుక రేపు ప్రొద్దుట జాగ్రత్తతో నుండుము. ఎక్కడనైన రహస్య స్థలమున దాగుకొనుము.

3. పొలములందు నీవు దాగియున్న తావునకు దగ్గరనే నేను నా తండ్రిని కలిసికొని నిన్ను గూర్చి మాట్లాడెదను. ఆ మీదట సంగతులన్నియు నీకు తెలియజెప్పెదను” అని పలికెను.

4. యోనాతాను సౌలునకు దావీదుపై నమ్మిక పుట్టునట్లు మాటలాడెను. “నీ సేవకుడైన దావీదునకు ప్రభువు ద్రోహము తలపెట్టరాదు. అతడు నీకు ఏ ద్రోహమును చేయలేదు. దావీదు చేసిన పనులన్నియు మనకు మేలే చేసినవిగదా!

5. అతడు ఫిలిస్తీయునితో పోరాడి గెలిచినపుడు వెండ్రుక వాసిలో చావు తప్పించుకొనెను. నాడు దావీదు మూలముగా యావే ప్రభువు యిస్రాయేలీయులను అందరిని రక్షించెను. ఈ కార్యమును నీవును కన్నులార చూచితివి. అపుడు మనసార సంతసించితివి. మరి ఇపుడు ఈ నిరపరాధునకు కీడు తలపెట్టనేల? కారణములేకయే దావీదును చంపనేల?" అనెను.

6. సౌలు యోనాతాను పలుకులకు సంతృప్తి చెందెను. “యావే జీవముతోడు! దావీదును చంపను” అని ఒట్టు పెట్టుకొనెను.

7. అంతట యోనాతాను దావీదును పిలిచి జరిగిన సంగతియంతయు వివరించి చెప్పెను. అతనిని సౌలు వద్దకు కొనివచ్చెను. దావీదు వెనుకటి మాదిరిగానే సౌలు ఎదుట నిలిచి పరిచర్య చేయుచుండెను.

8. ఫిలిస్తీయులతో మరల పోరుమొదలయ్యెను. దావీదు ఫిలిస్తీయులతో పోరాడి పెక్కుమందిని కూర్చెను. శత్రువులు వెన్నుజూపి పారిపోయిరి.

9. అపుడు ప్రభువు దగ్గర నుండి దుష్టాత్మ వెడలివచ్చి సౌలును ఆవేశించెను. సౌలు ఈటె చేపట్టి ఇంట కూర్చుండెను. దావీదు సితారపుచ్చుకొని వాయించు చుండెను.

10. సౌలు దావీదుపై ఈటె విసరి అతనిని ఒకే పోటుతో గోడకు గ్రుచ్చవలయునని చూచెను. కాని దావీదు మెలకువతో అతని ఎదుటినుండి తప్పుకొనెను. సౌలు విసరిన బల్లెము పోయి గోడకు గ్రుచ్చుకొనెను. దావీదు ఆ రాత్రియే పారిపోయెను.

11. నాటి రాత్రి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి కావలివారిని పంపెను. మరునాడు ప్రొద్దుట అతనిని చంపవలయునని సౌలు తలంపు. కాని దావీదు భార్య మీకాలు అతనితో “ఈ రాత్రియే పారిపోయి ప్రాణములు కాపాడుకొనుము. లేదేని రేపు నిన్ను చంపివేయుదురు” అని చెప్పెను.

12. ఆమె అతనిని కిటికీ నుండి వెలుపలికి దింపెను. ఆ రీతిగా దావీదు తప్పించుకొని నాటి రాత్రియే పారిపోయెను.

13. అటుపిమ్మట మీకాలు గృహదేవతా విగ్రహమును దావీదు పడుకపై పరుండబెట్టెను. దాని తలకు మేక వెంట్రుకలు చుట్టి మీద దుప్పటికప్పెను.

14. సౌలు సేవకులు దావీదును బంధింపవచ్చిరి. కాని మీకాలు వారితో అతడు జబ్బుపడెనని చెప్పెను.

15. సౌలు మరల సేవకులను పంపి “పడుకమీద ఉన్నవానిని ఉన్నట్లే తీసికొనిరండు, నేను వానిని చంపివేసెదను” అని పలికెను.

16. సేవకులు వచ్చి చూడగా సెజ్జపై ఇలవేల్పు బొమ్మయు దాని తలచుట్టు మేకవెంట్రు కలును కనిపించినవి.

17. అంతట సౌలు మీకాలుతో “నన్నిట్లు వంచించితివేల? నీవలన శత్రువు తప్పించుకొని పారి పోయెనుగదా!” అనెను. ఆమె “నన్ను పారిపోనిమ్ము, లేదేని నీ ప్రాణములు తీసెదనని దావీదు నన్ను భయపెట్టెను” అని చెప్పెను.

18. అటుల పారిపోయి దావీదు రామాయందలి సమూవేలు వద్దకొచ్చి అతనికి జరిగిన సంగతు లన్నియు తెలియజెప్పెను. అతడును, సమూవేలును అక్కడినుండి కదలిపోయి నావోతు చేరి అచట వసించిరి.

19. దావీదు రామాచెంత నావోతున బస చేయుచున్నాడని విని అతనిని పట్టుకొనుటకై సౌలు సేవకులను పంపెను.

20. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రవచించుటయు, సమూవేలు వారిమీద నాయకుడుగా నిలుచుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు సేవకులను ఆవేశింపగా వారును ప్రవచనములు పలికిరి.

21. ఈ సంగతి విని సౌలు మరికొందరు సేవకులను పంపెను. వారును ప్రవచనములు పలుకదొడగిరి. సౌలు మూడవమారు కూడ మరికొందరు సేవకులను పంపెను. కాని వారును ప్రవచనములు చెప్పసాగిరి.

22. అంతట సౌలు స్వయముగా బయలుదేరి రామాకు వచ్చెను. అచట సేకు చెంతనున్న గొప్పబావి వద్ద ప్రోగైన జనులను చూచి “సమూవేలు దావీదులను చూచితిరా?” అని వారినడిగెను. వారు “రామా దగ్గర నావోతున బసచేయుచున్నారు” అని తెల్పిరి.

23. సౌలు అచ్చటికి ప్రయాణము సాగించుచుండగా దేవుని ఆత్మ అతనిని కూడ ఆవేశించెను. కనుక నావోతు చేరువరకు సౌలు ప్రవచనములు పలుకుచుండెను.

24. అతడు ఆవేశమునొంది బట్టలను తొలగించుకొని సమూవేలు ఎదుటనే ప్రవచనములు చెప్పెను. ఆ పగలు రేయి దిగంబరుడై పడియుండెను. కనుకనే “సౌలు కూడ ప్రవక్తలలో కలిసిపోయెనా?" అను సామెత పుట్టెను.

 1. అంతట దావీదు రామా చెంతనున్న నావోతునుండి పలాయనమై యోనాతాను వద్దకు వచ్చెను. అతడు యోనాతానును చూచి "నేను ఏ అపరాధము చేసితిని? ఏ దుష్కార్యము చేసితిని? ఏల నీ తండ్రి నన్ను చంపగోరుచున్నాడు?" అని అడిగెను,

2. దానికి యోనాతాను “ఇవి ఏటి మాటలు? మా తండ్రి నిన్ను చంపునను మాట నిజముగాదు. అతడు చిన్నపనిగాని, పెద్దపనిగాని నాతో చెప్పనిదే చేయడు. ఇక నీ చావుమాట ఒక్కటి నాతో చెప్పక దాచునా? కనుక మా తండ్రి నిన్ను చంపగోరుటకల్ల” అని పలి కెను.

3. కాని దావీదు “నేను నీ మన్ననకు పాత్రుడనైతినని నీ తండ్రికి బాగుగా తెలియును. దావీదు హత్యనుగూర్చి విన్నచో యోనాతాను మిక్కిలి విచారించును కనుక అతనికి ఈ సంగతి తెలుపరాదని నీ తండ్రి అనుకొనియుండును. యావే జీవముతోడు! నీ తోడు! నాకును, చావునకును ఒక్క అడుగు ఎడము మాత్రమున్నది” అని ఒట్టుపెట్టుకొని పలికెను.

4. యోనాతాను “ఇప్పుడు నీవు నన్నేమి చేయు మనినను చేసెదను” అనెను.

5. దావీదు “రేపు అమావాస్యగదా! నేను రాజు సరసన కూర్చుండి భోజనము చేయవలయును. నీవు అనుమతింతువేని నేను ఎల్లుండి సాయంకాలము వరకు పొలమున దాగుటకు నాకు సెలవిమ్ము.

6. నీ తండ్రి నేను భోజనమునకు రాకుండుట గుర్తించి దావీడు ఏడీ అని అడిగినచో నీవు, అతడు నన్ను బతిమాలి సెలవుపుచ్చుకొని స్వీయనగరమైన బేత్లెహేమునకు వెళ్ళినాడు. అచట దావీదు కుటుంబమువారందరు కూడి సాంవత్సరిక బలి సమర్పించుకొనుచున్నారు అని చెప్పుము.

7. నీ తండ్రి మంచిదని ఊకొట్టి ఊరకున్నచో మరి చింతింపనక్కరలేదు. కాని నీ జవాబువిని కోపము తెచ్చుకొన్నచో అతడు నాకు కీడెంచెననియే భావింపవచ్చును. ఈ దాసునకు ఈపాటి మేలుచేసి పెట్టుము.

8. నీవు, నేను యావే పేరిట ఒడంబడిక చేసికొంటిమి గదా! నాయందు ఏదేని అపరాధమున్నయెడల నీవే నన్ను చంపివేయుము. నన్ను నీ తండ్రిచే చంపింప నేల?” అని అనెను.

9. యోనాతాను “ఇవి ఏటి మాటలు. నా తండ్రి నీకు కీడు తలపెట్టెనని తెలియ వచ్చినచో నేను నీతో చెప్పకుందునా?” అని ప్రత్యుత్తర మిచ్చెను.

10. దావీదు మరల “నీ తండ్రి నన్నుగూర్చి పరుషముగా మాటాడినచో నాకెట్లు తెలియజేయుదువు?” అని ప్రశ్నించెను.

11. యోనాతాను దావీదుతో పొలమునకు పోవుదము రమ్మనెను. ఇరువురు పొలము వెళ్ళిరి.

12. అంతట యోనాతాను దావీదుతో “యిస్రాయేలీయుల దేవుడైన యావే సాక్ష్యముగా చెప్పుచున్నాను వినుము, రేపు ఈ సమయమున మా తండ్రి లోతుపాతు తెలిసికొందును. అతడు నీపట్ల సుముఖుడై యుండినను, విముఖుడైయుండినను నీకు వార్త పంపెదను.

13. నిన్ను ఈ విపత్తునుండి గట్టెక్కింపనేని ప్రభువు నన్ను ఆపదపాలు చేయుగాక! ప్రభువు నా తండ్రికివలె నీకును తోడైయుండవలయునని నా కోరిక.

14. నేను బ్రతికియున్నచో యావే పేరుమీద నన్ను కరుణింపుము.

15-16. కాని నేను చనిపోవుచో నా వంశము వారిపై దయచూపుము. ప్రభువు దావీదు శత్రువులను ఈ నేలనుండి తుడిచివేసినపుడు యోనాతాను కుటుంబము నాశనము కాకుండుగాక! నాశనమయ్యెనేని దావీదు యావేకు జవాబు చెప్పవలెను” అని పలికెను.

17. యోనాతాను దావీదుపట్ల గల స్నేహముచే అతని ఎదుట మరల ప్రమాణము చేసెను. అతడనిన యోనాతానునకు ప్రాణముతో సమానము.

18. యోనాతాను దావీదుతో “రేపు అమావాస్య. నీ స్థలము ఖాళీగా నుండును గనుక నీవు భోజనమునకు రాలేదని తెలిసిపోవును.

19. మూడు దినములు వేచియుండి, నీవు మునుపు దాగుకొనిన తావునకు వెళ్ళి అచట రాళ్ళకుప్ప వెనుక దాగియుండుము.

20. నేను లక్ష్యముపై గురిపెట్టినట్లు నటించి మూడు బాణములు వేయుదును.

21. అటుపిమ్మట ఆ బాణములు ఏరితెచ్చుటకు సేవకుని పంపెదను. నేనతనితో 'బాణములు నీకు ఈవలివైపుగా నున్నవి. ఏరితెమ్ము' అందునేని నీవు గుట్ట మరుగుననుండి లేచి రావచ్చును. యావే జీవముతోడు! నీకు ఏ అపాయమును కలుగదు.

22. కాని నేను కుఱ్ఱవానితో 'బాణములు నీకు ముందటివైపుననున్నవి' అని చెప్పుదునేని యావే నిన్ను పంపివేయుచున్నాడని గ్రహించి పారిపొమ్ము.

23. ఇంతకు పూర్వము మనము చేసికొనిన ప్రమాణములకు సదా కాలము యావే సాక్ష్యముగా నుండునుగాక!” అని పలికెను.

24. పైన చెప్పినట్లే దావీదు పొలమున దాగుకొనెను. అది అమావాస్య. రాజు భోజనమునకు వచ్చెను.

25. అతడు యథారీతిని గోడవైపున తన స్థానమున కూర్చుండెను. యోనాతాను రాజునకు ఎదుట, అబ్నేరు రాజునకు ప్రక్కన కూర్చుండెను. కాని దావీదు స్థానము ఖాళీగా నుండిపోయెను.

26. దావీదు మైలపడి శుద్ధిచేసికొనకపోవుటచే భోజనమునకు రాలేదు కాబోలు అనుకొని సౌలు ఆ దినము ఏమియు అనలేదు.

27. కాని రెండవనాడు అనగా అమావాస్యకు మరుసటి రోజున గూడ దావీదు స్థానము ఖాళీగానే నుండిపోయెను,

28. కనుక సౌలు “యిషాయి కుమారుడు నిన్న, నేడు భోజనమునకు రాలేదేమి?” అని యోనాతానును అడిగెను.

29. యోనాతాను “ దావీదు నాతో 'మా కుటుంబమువారు పట్టణమున సాంవత్సరిక బలిని అర్పించుచున్నారు. మా అన్న నన్ను రమ్మని కబురు పెట్టెను. నీవు అనుమతింతువేని వెళ్ళి సోదరులను చూచి వచ్చెదను' అని పలికెను. నన్ను బతిమాలి సెలవుపుచ్చుకొని బేత్లెహేమునకు వెళ్ళెను. కనుకనే నేడు దేవరవారితో భోజనము చేయుటకు రాలేదు" అని చెప్పెను.

30. ఆ మాటలకు సౌలు కోపముతో మండి పోయెను. అతడు యోనాతానుతో “మాట వినని ముష్కరురాలి కొడకా! నీకును, నీ తల్లి దిగంబరత్వమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యీషాయి కొడుకుతో జతకట్టితివను సంగతి నాకు తెలియనది కాదుకదా!

31. యిషాయి కొడుకు జీవించియున్నన్నినాళ్ళు నీవు నిలువవు. నీ రాజ్యము నిలువదు. తక్షణమే వానిని ఇచటికి పిలిపింపుము. ఇకవాడు బ్రతుకతగదు” అని పలికెను.

32. యోనాతాను తండ్రితో “దావీదు చేసిన దుష్కార్యమేమి? అతనిని చంపనేల?” అని అడిగెను.

33. సౌలు క్రోధముతో యోనాతానును పొడవవలెనని ఈటె విసిరెను. దానితో తండ్రి దావీదును మట్టుపెట్ట నిశ్చయించుకొనెనని యోనాతానునకు తెలిసిపోయెను.

34. యోనాతాను అమితకోపముతో భోజనబల్లనుండి వెడలిపోయెను. అమావాస్య పండుగ రెండవనాడు అతడు భోజనము ముట్టుకోలేదు. తండ్రి దావీదును అవమానపరచెను గదాయని యోనాతాను మిక్కిలి చింతించెను.

35. దావీదుతో చెప్పిన రీతిని యోనాతాను మరునాటి ప్రొద్దుట కుఱ్ఱవానిని వెంటబెట్టుకొని పొలమునకు వెళ్ళెను.

36. అతడు కుఱ్ఱవానితో, “పరుగెత్తి పోయి నేను వేసెడు బాణములను కొనిరమ్ము” అనెను. బాలుడు పరిగెత్తుచుండగా అతనికంటే ముందుగా పోయిపడునట్లే యోనాతాను బాణము ప్రయోగించెను.

37. బాలుడు బాణముపడిన తావు చేరగనే యోనాతాను “బాణము నీకు ముందటి వైపుననున్నది” అని కేకవేసెను.

38. అతడు మరల బాలుని “ఆలస్యము చేయకపొమ్ము, ఊరికే నిలచిచూడకుము” అని మందలించెను. బాలుడు యజమానుని యొద్దకు బాణమును తీసుకొనివచ్చెను.

39. యోనాతాను దావీదులకే ఆ మాటలగుట్టు తెలిసెను గాని బాలుడే మియు గ్రహింపలేదు.

40. అంతట యోనాతాను తన ఆయుధములను కుఱ్ఱవానికి అప్పగించి వీనిని పట్టణమునకు కొని పొమ్మనెను.

41. సేవకుడు వెడలిపోగానే దావీదు రాళ్ళగుట్ట చాటునుండి పైకిలేచెను. బోరగిలపడి ముమ్మారులు యోనాతానునకు దండము పెట్టెను. వారిరువురు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చిరి. యోనాతాను కంటె గూడ దావీదు మరింత అధికముగా శోకించెను.

42. యోనాతాను మిత్రునితో “ఇక వెళ్ళిపొమ్ము. మనమిరువురము యావే పేరిట బాసచేసితిమి. నీకును, నాకును; నీ సంతతివారికిని, నా సంతతివారికిని యావే కల కాలము సాక్ష్యముగా నుండునుగాక!”

 1. దావీదు వెడలిపోగా యోనాతాను పట్టణమునకు తిరిగివచ్చెను.

2. అంతట దావీదు నోబు నగరముచేరి యాజకుడైన అహీమెలెకు చెంతకు పోయెను. అహీమెలెకు భయవిహ్వలుడై దావీదును “పరివారము లేకయే ఇట్లు ఒంటరిగా వచ్చితివేల?” అని యడిగెను.

3. దావీదు అతనితో “రాజు నన్నొక పనిమీద పంపెను. తన పనిగాని, ఆజ్ఞగాని ఎవ్వరికి తెలియగూడదని ప్రభువు కట్టడచేసెను. ఇక నా పరివారమందువా, ఒకానొక తావున కలిసికొందునని వారికి ముందుగనే తెలిపియుంటిని.

4. నీయొద్ద తినుటకేమైన ఉన్నదా? ఐదురొట్టెలున్న ఇమ్ము. ఎన్ని యున్న అన్నియే ఇచ్చివేయుము” అనెను.

5. యాజకుడు నా యొద్ద మామూలు రొట్టె లేమియు లేవు. దేవునిసన్నిధినిడిన రొట్టెలు మాత్రమే కలవు. నీతో వచ్చినవారు స్త్రీ సంగమము వలన మైలపడలేదు కదా?” అని అడిగెను.

6. దావీదు అతనితో “మేము యుద్ధమునకు బయలుదేరినది మొదలు ఈ మూడు దినములు స్త్రీ పొందునకు దూరముగానే యున్నాము. వీరు సాధారణముగా యుద్ధమునకు బయలుదేరునపుడెల్ల స్త్రీల పొత్తును మానుకొనుచునే యున్నారనిన, రాజాజ్ఞనుబట్టి బయలుదేరిన ఈ వేళ వీరెంత శుద్దులుగా నుందురో గదా!" అని యాజకునితో అనెను.

7. అపుడు యాజకుడు వేరు రొట్టెలేమియు లేకపోవుటచే దేవుని సాన్నిధ్యమున నుంచిన రొట్టెలనే అతనికిచ్చెను. అవి అప్పుడే దైవసాన్నిధ్యమునుండి తొలగింపబడినవి. వాని స్థానమున క్రొత్తగాకాల్చిన రొట్టెలనుంతురు.

8. ఆ దినమున సౌలు సేవకుడొకడు అక్కడ యావే ముందుట నిలిపి ఉంచబడెను. అతడు ఎదోమీయుడగు దోయేగు. అతడు సౌలు పశువులకాపరులకు పెద్ద.

9. దావీదు అహీమెలెకుతో “నీ చెంత బల్లెము గాని, కత్తిగాని ఉన్నదా? రాజాజ్ఞను సత్వరము పాటింపవలసి వచ్చుటచే నేను ఖడ్గముగాని, ఆయుధముగాని కొనిరాలేదు” అనెను. 

10. యాజకుడు “ఏలా లోయలో నీవు సంహరించిన ఫిలిస్తీయ గొల్యాతు ఖడ్గము మాత్రము ఉన్నది. బట్టచుట్టి అల్లచ్చట దానిని యాజకవస్త్రము వద్ద ఉంచితిమి. వలయునేని తీసికొనుము. ఇక్కడ మరియొక ఆయుధమేమియులేదు” అని చెప్పెను. దావీదు “దానికి మించిన కత్తిలేదు. తీసికొనిరమ్ము" అనెను.

11. అంతట దావీదు సౌలు నుండి పారిపోయి గాతు దేశాధిపతి ఆకీషు వద్దకు వచ్చెను.

12. ఆకీషు సేవకులతనిని చూచి తమ రాజుతో "ఇతడు దావీదు. ఆ దేశపు రాజు. ఇతని నుద్దేశించియే నాడు స్త్రీలు నాట్యమాడుచు 'సౌలు వేయిమందినిచంపగా, దావీదు పదివేలమందిని చంపెను' అని గానము చేసిరి” అని నుడివిరి.

13. దావీదు ఆ మాటలు ఆలించెను. గాతు రాజు ఆకీషునుచూచి మిక్కిలి భయపడెను.

14. అతడు వెంటనే తన వర్తనమును మార్చుకొని కొలువువారి ఎదుట పిచ్చివానివలె నటింపజొచ్చెను. నగరద్వారము మీద పిచ్చిగీతలు గీయుచు, గడ్డము మీదుగా చొల్లు కార్చెను.

15. అది చూచి ఆకీషు తన పరివారముతో “వీడు పిచ్చివాడు. వీనిని నా యొద్దకేల కొనివచ్చితిరి?

16. ఇచట పిచ్చివారు కరువైరని, వీనినికూడ పట్టుకొని వచ్చితిరి? వీడు నా ఎదుట ఈ వెఱ్ఱిమొఱ్ఱి చేష్టలు చేయనేల? వీనిని కూడ నా ఇంట చేర్చుకోవలయునా?” అని అనెను.

 1. దావీదు గాతునుండి పారిపోయి అదుల్లాము గుహ చేరుకొనెను. అచ్చట సోదరులు, బంధువులు అతనిని కలిసికొనిరి.

2. పరపీడకు లొంగినవారును, ఋణము వలన మగువారును, అన్యులవలన అసంతృప్తి చెందినవారు నాలుగుదిక్కుల నుండి వచ్చి దావీదును ఆశ్రయించిరి. వారికందరకు అతడు నాయకుడయ్యెను. ఇట్లు దావీదు నాలుగువందల మందిని చేర్చుకొనెను.

3. అతడు మోవాబు మండల ములోని మిస్పా నగరమునకు వెళ్ళి మోవాబీయుల రాజును దర్శించెను. “దేవుడు నాకొక త్రోవ చూపు నంతవరకు నా తల్లిదండ్రులను నీ అండ చేర్చు కొనుము” అని రాజును వేడెను.

4. ప్రభువు అనుమతి పై వారిని రాజగృహమునకు చేర్చెను. దావీదు కొండబొరియలలో మసలినంతకాలము వారు రాజుకడనే వసించిరి.

5. తరువాత ప్రవక్తయగు గాదు దావీదుతో “నీవిక కొండనెరియలలో ఉండ తగదు. యూదా దేశమునకు వెడలిపొమ్ము ” అని చెప్పెను. కనుక దావీదు అచ్చటి నుండి పయనమై పోయి హారేతు అరణ్యమున వసించెను.

6. సౌలు ఈటె చేపట్టి గిబియా కొండమీది పిచులవృక్షము క్రింద కొలువుతీర్చెను. పరివారము అతనిచుట్టు మూగియుండెను. అప్పుడు దావీదు, అతని అనుచరులును కంటబడిరని వార్తలు వచ్చెను.

7. సౌలు కొలువుకాండ్రతో “బెన్యామీనీయులారా, వినుడు! యిషాయి కుమారుడు మీకు మాన్యములను, ద్రాక్షతోటలను ఈయగలడా? బంటులు వందమందికి, వేయిమందికి మిమ్ము నాయకులనుగా నియమింపగలడా? 

8. దీనికా మీరు నామీద కుట్రపన్నినది? నా కుమారుడు యీషాయి కొడుకుతో ఒడంబడిక చేసికొనినపుడు మీలో ఒక్కడైనను నాకు తెలియచేయలేదే? మీలో నామాట పట్టించుకొనువాడే లేడుగదా! నా కుమారుడు నా కొలువువానినొకనిని నాపై పురికొల్పుచున్నాడని ఒక్కడైనను నా చెవిలో చెప్పలేదే? అతడిపుడు నామీద పడుటకు వేచియున్నాడుగదా?” అనెను.

9. అప్పుడు కొలువుకాండ్రతోనున్న ఎదోమీయుడగు దోయేగు సౌలుతో “యిషాయి కుమారుడు నోబు నగరమునకువచ్చి అహీటూబు పుత్రుడైన అహీమెలెకును కలిసికొనుట నేను చూచితిని.

10. అహీమెలెకు దావీదు పక్షమున దేవుని సంప్రదించెను. అతనికి దారిబత్తెములందించి ఫిలిస్తీయ గొల్యాతు కత్తినిచ్చి సాగనంపెను” అని చెప్పెను.

11. వెంటనే రాజు అహీటూబు కుమారుడైన అహీమెలెకును పిలిపించెను. అహీమెలెకు కుటుంబముల వారందరును నోబు నగర మున ప్రభువును అర్చించు యాజకులు. వారందరు వచ్చి రాజుదర్శనము చేసికొనిరి.

12. రాజు అతనితో “అహీటూబు కుమారుడా! నా పలుకు లాలించుచున్నావా?” అని అడిగెను. అతడు “చిత్తము ప్రభూ!" అనెను.

13. సౌలు అతనితో “నీవును, యీషాయి కుమారుడును నాపై కుట్రపన్ననేల? నీవు అతనికి దారిబతైమును, కత్తిని అందించితివి. పైగా అతని కొరకు దేవుని సంప్రతించితివి. దావీదు తిరుగుబాటు చేసి నేడోరేపో నా పై పడనున్నాడు” అనెను.

14. అహీమెలెకు రాజుతో “ప్రభూ! దావీదువలె విశ్వాసపాత్రుడు నీ పరివారమున ఒక్కడుగలడా? అతడు ప్రభువునకు అల్లుడు. నీ అంగరక్షకులకు అధిపతి. నీ ఇంట మన్ననకెక్కినవాడు.

15. నేను అతని పక్షమున దేవుని సంప్రతించుట ఇదియే మొదటి సారియా యేమి? ఇవి ఏటిమాటలు? ప్రభువు ఈ దాసుని మీదగాని, అతని కుటుంబము వారి మీదగాని నేరము మోపకుండుగాక! నాకు ఈ సుద్దులతో పని లేదు” అని విన్నవించుకొనెను.

16. కాని రాజు అహీమెలెకుతో “నిన్నును, నీ కుటుంబము వారిని తప్పక వధింపవలసినదే" అని పలికెను.

17. అంతట సౌలు తన చెంతనున్న కావలి భటులను పిలిచి “రండు! ఈ యావే యాజకులను పట్టి వధింపుడు. వీరు దావీదుతో పొత్తుకలిసిరి. అతడు పారిపోవుచుండగా కన్నులార చూచియు నాకు మాట మాత్రమైనను తెలుపరైరి” అనెను. కాని రాజభటులలో ఎవ్వడును యావే యాజకులను వధించుటకు సాహసింపలేదు.

18. రాజు దోయేగుతో “నీవు ఇచ్చటి కొచ్చి ఈ యాజకుల తలలు తెగగొట్టుము” అనెను. వెంటనే ఎదోమీయుడగు దోయేగు వారిమీద బడి యాజకవస్త్రములు ధరించిన అర్చకులను ఎనుబది ఐదుగురను నరికివేసెను.

19. సౌలు యాజకనగరము నోబు నందలి స్త్రీ పురుషులను, పిల్లలు, చంటిబిడ్డలు, ఎద్దులు, గాడిదలు, గొఱ్ఱెలును కత్తివాదరకెర చేసెను.

20-21. అయితే అహీటూబు కుమారుడు అహీమెలెకు పుత్రులలో అబ్యాతారు అనువాడొక్కడు మాత్రము తప్పించుకొనెను. అతడు దావీదుకడకు పారిపోయి సౌలు యావే యాజకులను చంపించిన తీరు తెలియపరచెను.

22. దావీదు అతనితో “నాడు అచట నిలిచియున్న ఎదోమీయుడగు దోయేగును చూచి వీడు తప్పక నా గుట్టు సౌలునకు ఎరిగించునను కొంటిని. అనుకున్నంత జరిగినది. నీ కుటుంబము వారి మరణమునకు నేనే కారకుడనైతిని.

23. నీవు మాత్రము నా చెంతనుండవచ్చును. ఇక భయపడనక్కరలేదు. నిన్నును, నన్నును చంపగోరువాడు ఒక్కడే. నాచెంత ఉన్నంతకాలము నిన్ను వేయికన్నులతో కాపాడుదును” అని పలికెను.

 1. ఫిలిస్తీయులు కెయీలా నగరముమీద పడి కళ్ళములలోని ధాన్యము దోచుకొని పోవుచున్నారని దావీదు వినెను.

2. అతడు యావేతో సంప్రతించి “నన్ను ఫిలిస్తీయులను తునుమాడమందువా?” అని అడిగెను. ప్రభువు “పొమ్ము, ఫిలిస్తీయులను పట్టి పల్లార్చి కెయీలా పట్టణమును కాపాడుము" అని చెప్పెను.

3. కాని దావీదు అనుచరులు “మేము యూదా సీమలోనే భయముతో సంచరించుచున్నాము గదా! ఇక కెయీలా నగరమునకు పోయి ఫిలిస్తీయ సైన్యములను ఎదిరించినచో మన గతి ఏమగును?” అని పలికిరి.

4. కనుక దావీదు మరల యావేను సంప్రతించెను. ప్రభువు అతనితో “పొమ్ము, కెయీలా పట్టణమున ఫిలిస్తీయుల నెదుర్కొనుము. నేను వారిని నీవశము చేసితిని” అని చెప్పెను.

5. కనుక దావీదు అనుచరులతో పోయి కెయీలాకు వచ్చి ఫిలిస్తీయులను ఎదిరించి పోరాడెను. శత్రువులను ఊచముట్టుగ తునుమాడి వారి పశువులను తోలుకొనివచ్చెను. నాడు కెయీలా నివాసులు దావీదు వలన శత్రువుల బారి నుండి తప్పించుకొనిరి.

6. అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు సౌలుబారినపడక దావీదును ఆశ్రయించెను గదా! అతడు దైవచిత్తమును తెలిసికొను ఎఫోదు చేతపట్టుకుని కెయీలా నగరము చేరెను.

7. దావీదు కెయీలా పట్టణమునకు పోయెనని సౌలు వినెను. అతడు “ఇకనేమి! ప్రభువు దావీదును నా చేతికి అప్పగించెను. కవాటములతోను, అడ్డుగడల తోను మూయబడిన పట్టణమున ప్రవేశించి దావీదు బోనులో చిక్కుకొనెను” అని అనుకొనెను.

8. సౌలు తన జనులందరిని యుద్ధమునకు పిలిచెను. కెయీలా నగరమును ముట్టడించి దావీదును పరివారముతో పట్టుకొందమని చెప్పెను.

9. కాని దావీదు సౌలు తనకు కీడు తలపెట్టెనని పసికట్టి యాజకుడైన అబ్యాతారును పిలిచి ఎఫోదును తెమ్మనెను.

10. అతడు “యిస్రాయేలు ప్రభుడవైన యావే! సౌలు కెయీలాకు రానున్నాడనియు, నా కొరకు ఈ నగరమును నాశము చేయనున్నాడనియు రూఢిగా వింటిని.

11. ఈ మాట నిజమేనా? సౌలు ఇక్కడికి వచ్చునా? యిస్రాయేలు ప్రభుడవైన యావే! నీ సేవకునికి నిజము తెల్పుము” అని అడిగెను. ప్రభువు “అతడిచ్చటికి వచ్చును" అని పలికెను.

12. దావీదు మరల "కెయీలా పౌరులు నన్నును నా అనుచరులను సౌలునకు పట్టియిత్తురా?” అని అడిగెను. 'అవును!' అని ప్రభువు జవాబిచ్చెను.

13. వెంటనే దావీదు అతని అనుచరులును ఆరువందలమంది నగరము వీడి ఎచట తలదాచుకొనగలరో అచటకు పోయిరి. దావీదు పలాయితుడయ్యెనని విని సౌలు తన దాడి విరమించెను.

14. అటుల పారిపోయి దావీదు ఎడారులలో కొండచరియలలో వసించుచుండెను. సీఫు ఎడారిలోని కొండలలో కొంతకాలముండెను. సౌలు అను దినము దావీదును వెదకించెను గాని, ప్రభువు అతనిని సౌలు చేతికి చిక్కనీయలేదు.

15. సౌలు తనను వెదకవచ్చుచుండెనని దావీదు తెలిసికొనెను. అప్పుడతడు పీపు ఎడారిలో హోరేషువద్ద నుండెను.

16. సౌలు కుమారుడగు యోనాతాను హోరేషు వద్ద దావీదును కలిసికొనెను. యావే పేర అతనిని ప్రోత్సహించెను.

17. యోనాతాను దావీదుతో “భయపడకుము. నీవు నా తండ్రి సౌలుచేతికి దొరకవు. నీవు యిస్రాయేలీయులకు రాజువగుదువు. నేను నీ క్రింద సహకారిని అగుదును. ఈ సంగతి నా తండ్రికి కూడ తెలియును” అని పలికెను.

18. వారిరువురు యావే యెదుట ఒడంబడిక చేసికొనిరి. పిమ్మట యోనాతాను తన ఇంటికి మరలిపోయెను. దావీదు హోరేషు వద్దనే వసించెను.

19. సీపు నివాసులు కొందరు గిబియా యందున్న సౌలు వద్దకు వచ్చి "దావీదు మా పొరుగుననే హోరేషు కొండబొరియలలో, యెషీమోనునకు దక్షిణముననున్న హకీలా తిప్పలలో దాగుకొనియున్నాడు.

20. ప్రభూ! నీ మనోభీష్టమంతటి చొప్పున వెడలిరమ్ము. అతనిని పట్టిచ్చుట మావిధి” అనిరి.

21. సౌలు వారితో “మీరు నాకు చాల ఉపకారము చేసితిరి. ప్రభువు మిమ్ము దీవించుగాక!

22. మీరు వెడలిపోయి ఇంకను ఒక కన్నువేసి యుండుడు. దావీదు ఎక్కడనున్నాడో, ఎవరి కంటబడెనో నిశ్చితముగా తెలిసికొనుడు. అతడు జిత్తులమారి అని వింటిని.

23. వాని రహస్య స్థావరములు అన్నిటిని జాగ్రత్తగా గాలించి నా యొద్దకు రండు. అపుడు నేను మీతో వత్తును. దావీదు ఎక్కడ నుండినను యూదాయంతటిలో గాలించియైనను నేను వానిని పట్టుకొందును” అని యనెను.

24. కనుక వారు సౌలు కంటే ముందుగా సీపు సీమకు వెడలిపోయిరి. దావీదు అనుచరులతో యెషీమోనునకు దక్షిణముననున్న మరుభూమిలోని మావోను ఎడారిలో మసలుచుండెను.

25. సౌలు పరివారముతో తనను పట్టుకొనుటకు వచ్చుచున్నాడని విని దావీదు మావోను ఎడారిలోని కొండలలో దూరెను.

26. సౌలు అతని అనుచరులును కొండకు ఈవలివైపున ప్రయాణము సాగింపగా, దావీదు అతని అనుచరులు కొండకావలివైపున పయనము చేయుచుండిరి. సౌలువలన భయముచే దావీదు వడివడిగా సాగిపోవుచుండెను. అతనిని ఎటులయిన పట్టుకోవలయునని సౌలు బలగముతో వేగముగ వెంటనంటి పోవుచుండెను.

27. ఇంతలోనే ఒక దూత సౌలు నొద్దకు వచ్చి “ఫిలిస్తీయులు దండెత్తివచ్చి మన దేశమును ఆక్రమించిరి. దేవరవారు వెంటనే మరలి రావలయును” అని చెప్పెను.

28. సౌలు దావీదును వెన్నాడుటమాని ఫిలిస్తీయుల నెదుర్కొనుటకై తిరిగిపోయెను. కనుకనే ఆ తావునకు “విభజన పర్వతము” అని పేరు వచ్చినది.

29. దావీదు అచ్చటినుండి ప్రయాణము సాగించి ఎంగెడీ కొండలలో వసించెను.

 1. సౌలు ఫిలిస్తీయులతో పోరాడివచ్చిన పిమ్మట దావీదు ఎంగెడీ కొండస్థలములలో ఉన్నాడని వార్తలు వచ్చెను.

2. అతడు యిస్రాయేలీయుల నుండి మూడువేలమంది యోధులనెన్నుకొని దావీదును, అతని బలగమును పట్టుకొనుటకై అడవిమేకలు వసించు కొండకు తూర్పువైపుగా పయనమైపోయెను.

3. అచట త్రోవ చెంత గొఱ్ఱెలదొడ్లు కలవు. వాని దాపున కొండగుహ ఉన్నది. సౌలు కాలకృత్యములకై గుహ ప్రవేశించెను. అపుడు దావీదు కూడ అనుచరులతో ఆ గుహాంతరముననే దాగియుండెను.

4. సౌలు కంటబడగానే దావీదు బలగమువారు "నేడు శత్రువును నీ చేతికప్పగించెదను, అతనిని నీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చుననిన ప్రభువచనము నెరవేరినది గదా!” అనిరి. అపుడు దావీదు మెల్లగాపోయి సౌలుకు తెలియకుండగనే అతని ఉత్తరీయపు చెంగును కత్తిరించుకొని వచ్చెను.

5. కాని తరువాత దావీదు అట్టి పని చేసినందులకు మిక్కిలి చింతించెను.

6. అతడు అనుచరులతో “నా యజమానునకు కీడు తలపెట్టను. రాజునకు ద్రోహము చేయను. అతడు ప్రభువుచే అభిషేకము పొందినవాడు. యావే నన్ను ఈ పాపము నుండి కాపాడుగాక!" అనెను.

7. సౌలు మీదకు పోవలదని దావీదు అనుచరులను కఠినముగా శాసించెను.

8. అంతట సౌలు గుహవెడలి ప్రయాణము సాగించుచుండెను. దావీదుకూడ గుహవీడి వెలుపలకు వచ్చి “ప్రభూ!" అని సౌలును కేకవేసెను. సౌలు వెనుకకు తిరిగి చూచెను. దావీదు నేలమీదికి వంగి సాష్టాంగ నమస్కారము పెట్టెను.

9. అతడు సౌలుతో “దావీదు నీకు కీడు తలపెట్టెనని కొండెములు పలుకు వారిని నీవు విశ్వసింపనేల?

10. నేడు ప్రభువు నిన్ను కొండబిలమున నా చేతిలోని వానినిగా చేసెను గదా! అయినను నేను రాజు మీద చేయిచేసికోరాదు. అతడు ప్రభువు అభిషిక్తుడు' అని భావించి చేజిక్కిన నిన్ను చంపక వదలివేసితిని. ఇది నీకు తేటతెల్లమై ఉండును.

11. పైగా, ప్రభూ! ఇటు చూడుము. నా చేతనున్న నీ ఉత్తరీయపు చెంగును కనుగొనుము. నీ వస్త్రపు అంచును మాత్రము కత్తిరించి నిన్ను చంపక విడిచితిననిన, నేను నీకు కీడు తలపెట్టలేదని, నీపై కుట్ర పన్నలేదని ఋజువగుట లేదా? నేను నీకు ద్రోహము చేయలేదు. అయినను నీవు నన్ను వెంటాడి నా ప్రాణ ములు తీయగోరుచున్నావు.

12. మన ఇరువురికిని ప్రభువే తీర్పరిగా ఉండుగాక! నాకొరకై ప్రభువు నీపై పగ తీర్చుకొనినను నేను మాత్రము నీమీద చేయిచేసి కొనను.

13. ఏదో సామెత చెప్పినట్లు, దుష్టులనుండి దౌష్ట్యము పుట్టుచున్నది. అయిననేమి నేను మాత్రము నీ మీదికిరాను.

14. యిస్రాయేలురాజు ఎవరివెంట బడుచున్నాడు?, ఏపాటివాడిని తరుముచున్నాడు? ఒక చచ్చిన కుక్కను కదా! ఒక మిన్నల్లినిగదా!

15. మన కిరువురకు ప్రభువే తీర్పుతీర్చును. అతడే నా వ్యాజ్యెము చేపట్టి తీర్పుచేసి నీ బారినుండి నన్ను కాపాడుగాక!" అని పలికెను.

16. దావీదు సౌలుతో ఈ మాటలు పలుకుట ముగించగా, సౌలు దావీదుతో “ఈ మాటలు నా కుమారుడు దావీదువేనా?” అని పెద్దపెట్టున ఏడవ సాగెను.

17. సౌలు దావీదుతో “నా కంటె నీవు నీతి మంతుడవు. నేను నీకు కీడుతల పెట్టగా నీవు నాకు మేలు చేసితివి.

18. నేడు నాపట్ల ఎంత ఉదాత్తముగా ప్రవర్తించితివి! యావే నన్ను నీ చేతికప్పగించెను. అయినను నీవు నన్ను చంపవైతివి.

19. చేజిక్కిన శత్రువునెవడైన పోనిచ్చునా? నాయనా నీవు నాకు చేసిన ఉపకారమునకు ప్రభువు నీకు మేలుచేయుగాక!

20. నీవు రాజువగుదువని నాకు నిక్కముగా తెలియును. నీవలన యిస్రాయేలు రాజ్యము స్థిరపడును.

21. కనుక నేను దాటిపోయిన తరువాత మా వంశీయులను రూపుమాపనని, మాపూర్వుల కుటుంబమున నా పేరు మాపనని యావే పేరిట బాసచేయుము” అనెను.

22. దావీదు అట్లే బాసచేసెను. అటుపిమ్మట సౌలు ఇంటికి మరలిపోయెను. దావీదు అనుచరు లతో కూడ కొండ గుహలకు వెడలిపోయెను.

 1. సమూవేలు చనిపోయెను. యిస్రాయేలీయులందరు ప్రోగై అతని మరణమునకు శోకించిరి. రామాలో అతని ఇంటిలో అతని శవమును పాతిపెట్టిరి. అటుపిమ్మట దావీదు పారాను ఎడారికి వెడలి పోయెను.

2. మావోను సీమకు చెందిన కర్మేలునందు సంపన్నుడైన నరుడొకడు వసించుచుండెను. అతనికి మూడువేల గొఱ్ఱెలు, వేయిమేకలు కలవు. ఒకసారి అతడు కర్మెలు పట్టణమునందు గొఱ్ఱెలకు ఉన్ని కత్తిరించుచుండెను.

3. అతడు కాలేబు వంశీయుడు. పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగాయీలు. ఆమె తెలివితేటలుకలది, అందగత్తె. అతడు వట్టి మోటు వాడు, దుష్టుడు.

4. ఎడారియందు వసించుచున్న దావీదు, నాబాలు తనగొఱ్ఱెలకు ఉన్ని కత్తిరించుచుండెనని వినెను.

5. అతడు తన అనుచరులను పదిమందిని నాబాలు వద్దకు పంపుచు “మీరు కర్మేలు పట్టణమునకు పోయి నాబాలును దర్శించి నా పేర నమస్కారము చేయుడు.

6. అతనితో ఇట్లనుడు: నీకును, నీ బలగమునకును, నీ ఆస్తిపాస్తులకును శుభములు కలుగునుగాక!

7. నీవు గొఱ్ఱెలకు ఉన్ని కత్తిరించుచున్నావని వింటిని. ఇంతవరకు నీ కాపరులు మా చెంతనే మసలుచుండినను మేము వారిని బాధింపలేదు. వారు కర్మేలులో నున్నంతకాలము మందలనుండి ఒక్క జంతువును మాయము కాలేదు.

8. ఈ మాట నిజమోకాదో నీ జనముననే అడిగి తెలిసికోవచ్చును. నా సేవకులను చల్లనిచూపు చూడుము. నేడు శుభదినమున మేము వచ్చితిమికదా! కనుక నీ సేవకులకును, నీ కుమారుడు దావీదునకును నీ యిచ్చనుబట్టి ఇచ్చి పంపుము".

9-10. దావీదు సేవకులు నాబాలు వద్దకు వచ్చి తమ నాయకుని పలుకులు విన్నవింపగనే అతడు “దావీదనిన ఎవరికి గొప్ప? యిషాయి కుమారుడనిన ఎవరికి లావు? ఈ రోజులలో యజమానుల వద్ద నుండి పారిపోయిన సేవకులు చాలమంది కనిపించుచున్నారు.

11. నా రొట్టెలను, ద్రాక్షాసారాయమును, నా పనివారికొరకు కోసి ఉంచిన వేటమాంసమును తీసికొని ఊరు పేరు తెలియని ఈ దేశదిమ్మరులకు ఈయవలయును కాబోలు!" అనెను.

12. సేవకులు తిరిగిపోయి నాబాలు అనిన మాటలు తమ నాయకుడు దావీదునకు చెప్పిరి.

13. దావీదు ఎల్లరిని కత్తి చేపట్టుడని ఆజ్ఞాపించెను. పరిజనులందరు వారివారి కత్తు లను గైకొనిరి. దావీదు కూడ తన కత్తి పుచ్చుకొనెను. వారిలో రెండువందలమంది సామానులకు కావలి కాయుటకై అచ్చటనే ఉండిపోయిరి. నాలుగు వందల మంది దావీదును అనుసరించి వెళ్ళిరి.

14. అప్పుడు నాబాలు సేవకులలో ఒకడు అతని భార్యయైన అబీగాయీలుతో “అమ్మా! దావీదు ఎడారి నుండి మన యజమాని వద్దకు దూతలనంపెను. కాని ఆయన వారిమీద మండిపడెను.

15. ఈ జనులు చాల మంచివారు. మనలనెప్పుడు పీడించి యెరుగరు. మేము వారి దగ్గరి పొలములో మందలను మేపినంత కాలము ఒక్కజంతువుకూడ మాయమైపోలేదు.

16. అక్కడ మందలు తిరుగాడినంతకాలము రేయింబవలు వారే మాకు అండదండగానుండిరి.

17. కనుక ఇప్పుడు చేయవలసినపని ఏదియో లెస్సగా విచారింపుము. దావీదు సేవకులు మన యజమానునకు, మన పరివారమునకు నిక్కముగా కీడుచేయ నిశ్చయించియున్నారు. యజమానుడు వట్టి పనికిమాలిన వాడు. అతనితో మాట్లాడినను లాభములేదు” అని పలికెను.

18. అబీగాయీలు త్వరత్వరగా రెండు వందల రొట్టెలను, రెండుతిత్తుల ద్రాక్షసారాయమును, ఐదు వేటలను కోసివండిన మాంసమును, ఐదు కుంచములు వేపుడు ధాన్యమును, నూరుగుత్తులు ఎండు ద్రాక్షపండ్లను, రెండువందల అత్తిపండ్ల మోదకములను సిద్ధముచేసి గాడిదలపై వేయించెను.

19. ఆమె సేవకులను పిలిచి “మీరు వీనితో ముందుసాగిపొండు, నేను మీ వెనుకవత్తును” అని చెప్పెను. కాని నాబాలునకు ఈ సంగతేమియును తెలియదు.

20. అబీగాయీలు గాడిదనెక్కి కొండమలుపునకు వచ్చెను. అంతలోనే దావీదు పరివారముతో వచ్చుచు ఆమెకు ఎదురుపడెను.

21. అతడు తనలోతాను “ఇంతకాలము ఎడారిలో నాబాలు మందలను కాపాడుట గొడ్డువోయినదికదా! వీని గొఱ్ఱెలకు నష్టమే మియు కలుగలేదు. ఈ ఉపకారమునకు బదులుగా వీడు అపకారము చేసెనుగదా!

22. కానిమ్ము ప్రొద్దు పొడుచునప్పటికి వాని పరివారమునందలి మగవాండ్రనందరిని మట్టుపెట్టనేని దేవుడు ఇంకను గొప్ప ఆపదను దావీదు శత్రువులకు కలుగజేయునుగాక!” అని అనుకొనుచుండెను.

23. అబీగాయీలు దావీదును చూడగనే వడివడిగా గాడిదను దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసెను.

24. ఆమె దావీదు కాళ్ళమీదపడి “ప్రభూ! ఈ అపరాధమునాది. ఈ దాసురాలికి మాట్లాడుటకు సెలవిమ్ము. ప్రభువు నాపలుకులు వినిపించు కొనినచాలు.

25. ఏలినవారు పనికిమాలిన ఈ నాబాలును పట్టించుకోనేల? అతని నడవడిగూడ ఆ పేరునకు తగినట్లే ఉన్నది. అతని పేరు నాబాలు '. కనుకనే ఆ మొరటుతనము. నా మట్టుకు నేను నీవు పంపించిన సేవకులను చూడలేదు సుమా!

26. రక్తపాతమునుండి, స్వయముగ శత్రువు మీదపడి పగ తీర్చుకొనుట అను దుష్కార్యము నుండి ప్రభువు నిన్ను కాపాడుగాక! యావే జీవము తోడు! నీ జీవము తోడు! నీ శత్రువులకు, నీకును కీడు తలపెట్టిన దుర్మార్గులకు, ఈ నాబాలుకు పట్టినగతియే పట్టునుగాక!

27. ఇవిగో! నీ దాసురాలు కొనివచ్చిన బహుమానములు! వీనిని నా యేలినవాడవగు నీ వెంటవచ్చిన పరివారమునకు ఇమ్ము.

28. ప్రభువు ఈ దాసురాలి అపరాధమును క్షమించునుగాక! నీవు యావే పక్షమున యుద్ధములు చేయుచున్నావు కనుక, యావే నీ వంశమును కలకాలము కుదురుకొనునట్లు చేయును. బ్రతికి ఉన్నంతకాలము నీకు ఏ ఆపద వాటిల్లదు.

29. ఎవ్వడైనను నిన్ను వెంటపడి నీ ప్రాణములు తీయనెంచిన యెడల నీ దేవుడైన యావే నీ ప్రాణములను జీవపు మూటలో చుట్టిపెట్టి సురక్షితముగా తనచెంత నుంచుకొనును. కాని నీ శత్రువుల ప్రాణమును ఒడిసెలనుండి రాతిని విసరినట్టుగా దూరముగా విసరివేయును.

30-31. ప్రభువు నీకు వాగ్దానము చేసిన సత్కార్యములన్నిటిని నెరవేర్చినపిమ్మట, నిన్ను యిస్రాయేలీయులకు రాజుగా నియమించిన పిమ్మట నేడు శత్రువులపై పగతీర్చుకొని నిష్కారణముగా నెత్తురొలికించిన పాపము నీ హృదయమును బాధించి వేధింపకుండును గాక! ప్రభువు నిన్ను చల్లనిచూపున చూచిన పిమ్మట ఈ దాసురాలిని జ్ఞప్తికి తెచ్చుకొనుము" అని పలికెను.

32. దావీదు అబీగాయీలుతో “నేడు నిన్ను నా వద్దకు పంపిన యిస్రాయేలు దేవుడు యావే స్తుతింపబడునుగాక!

33. నీ తెలివితేటలు కొనియాడదగినవి. రక్తపాతమునుండి, శత్రువులపై పగ తీర్చుకొనుట అను దుష్కార్యము నుండి నేడు నన్ను కాపాడితివి కనుక నీవు ధన్యురాలవు.

34. యిస్రాయేలు దేవుడైన యావే మీద ఒట్టుపెట్టుకొని చెప్పుచున్నాను వినుము. నీకు కీడు చేయనీయకుండ ప్రభువే నాకు అడ్డుపడెను. నీవు శీఘ్రమేవచ్చి నన్నిట కలసికోనియెడల, రేపు ప్రొద్దు పొడుచునప్పటికి నాబాలు పరివారమున ఒక్క మగ పురుగుకూడ బ్రతికియుండెడివాడుకాడు సుమా!” అనెను.

35. అంతట దావీదు ఆమె కానుకలను గైకొని “ఇక ఏ దిగులులేకుండ నీ ఇంటికి మరలిపొమ్ము. నీ మొగము చూచి నీమాట పాటించితిని” అనెను.

36. అబీగాయీలు పతి యొద్దకు తిరిగిపోయెను. ఇంటివద్ద నాబాలు రాజవైభవముతో ఉత్సవముచేసి విందు నడపుచుండెను. అతడు హాయిగా త్రాగి మైమరచియుండుటచే మరునాటి ప్రొద్దుటివరకు ఆ ఇల్లాలు జరిగిన సుద్దులేమియు ఎత్తలేదు.

37. ఉదయము సారాయపుకైపు తగ్గగనే అబీగాయీలు జరిగినదంతయు పెనిమిటికి తెలియజేసెను. ఆ మాటలకు నాబాలు నిశ్చేష్టుడయ్యెను. అతనికి గుండెపగిలెను. కదలికలేని రాతిబొమ్మవలె బిగుసుకుపోయెను.

38. పది దినములు గడచిన తరువాత యావే నాబాలును శిక్షింపగా అతడు ప్రాణములు విడిచెను.

39. దావీదు నాబాలు చావు కబురువిని “నన్ను అవమానపరచినందులకు నాబాలునకు ఈ రీతిగా ప్రతీకారము చేసిన యావే స్తుతింపబడునుగాక! కీడు చేయనీయకుండ ప్రభువు నన్ను వారించెను. నాబాలు పాపము నాబాలునకే తగులునట్లు దేవుడు చేసెను” అనెను. 

40. అంతట దావీదు అబీగాయీలును పెండ్లి చేసికొనుటకై దూతలద్వారా వర్తమానమంపెను. వారు కర్మెలు నందున్న అబీగాయీలు వద్దకు వచ్చి "దావీదును పరిణయమాడుటకై నిన్నుతో డ్కొని పోవచ్చితిమి” అని విన్నవించిరి.

41. ఆమె వినయముతో లేచి నేలమీద సాగిలపడి “ఈ సేవకురాలు నా ప్రభువు పరిచారకుల పాదములు కడుగుటకుగూడ సిద్ధముగానే యున్నది” అనెను.

42. అంతట ఆమె వేగముగ పయనమై ఐదుగురు దాసీ కన్యలను వెంటనిడుకొని గాడిదపైనెక్కి దావీదు సేవకుల వెంటబోయెను. దావీదు ఆమెను పెండ్లియాడెను.

43. అంతకుముందే అతడు యెస్రేయేలు నగరవాసియైన అహీనోవమును గూడ పెండ్లి చేసుకొనియుండెను. ఆ ఇరువురు అతని భార్యలైరి.

44. ఇంతకుముందు సౌలు తన కుమార్తెయగు మీకాలును దావీదునకు అప్పగించెనుగదా! అతడు కుమార్తెను మరల గల్లీము నగరవాసియైన లాయీషు కుమారుడు ఫల్తీయేలునకిచ్చి పెండ్లి చేసెను.

1. సీపు నివాసులు గిబియాకు పయనమై వచ్చి సౌలును కలిసికొని, దావీదు యెషీమోను చెంతనున్న హకీలా కొండలలో దాగియున్నాడని తెలిపిరి.

2. సౌలు యిస్రాయేలీయులనుండి మూడు వేలమంది యోధులను ప్రోగుజేసికొని సీపు ఎడారిలో తిరుగాడు చుండిన దావీదును పట్టుకొనుటకై బయలుదేరెను.

3. అతడు యెషీమోను చేరువనున్న హకీలా కొండచెంత త్రోవ ప్రక్కన గుడారములెత్తెను. అంతవరకు దావీదు ఎడారియందే సంచరించుచుండెను. అతడు సౌలు తనను పట్టుకొనవచ్చెనని వినెను.

4. గూఢచారులను పంపి సౌలువచ్చెనని రూఢిగా తెలిసికొనెను.

5. దావీదు వెంటనే బయలుదేరి సౌలు దండుదిగిన తావు చేరుకొనెను. అచట సౌలును, అతని సేనాధిపతియైన నేరు కుమారుడగు అబ్నేరును పరుండియుండిరి. దావీదు వారినిచూచెను. సౌలు సైన్యములమధ్య శిబిరాంతరమున ఉండెను.

6. అప్పుడు హిత్తీయుడైన అహీమెలెకును, సెరూయా పుత్రుడు యోవాబు సోదరుడునగు అబీషయి దావీదు వెంటనుండిరి. అతడు వారినిచూచి “నేను సౌలు శిబిరమునకు పోయెదను. నా వెంట ఎవరు వత్తురు?” అని అడిగెను. వెంటనే అబీషయి “నేను వత్తును” అనెను.

7. దావీదు, అబీషయి రేచీకటిలో శిబిరమునొద్దకు వచ్చిరి. సౌలు పాళెమున పరుండి నిద్రించుచుండెను. అతని యీటె తలవైపున నేలలో దిగవేయబడియుండెను. అబ్నేరును, సైనికులును చుట్టు పరుండి నిదురించుచుండిరి.

8. అబీషయి దావీదుతో "నేడు ప్రభువు శత్రువును నీ చేతికి అప్పగించెను. ఇతనిని ఈ యీటెతో ఒకేఒక్క పోటున నేలకు గ్రుచ్చెదను. ఇక రెండవ పోటక్కరలేదు” అనెను.

9. కాని దావీదు అతనితో "సౌలును చంపవలదు. ప్రభువు అభిషిక్తుని మీద చేయిచేసికొనినచో పాపము చుట్టుకొనదా?

10. యావే జీవము తోడు! పోగాలము దాపురించినపుడో, అపాయముననో, యుద్ధరంగముననో ప్రభువే ఇతనిని సంహరించును.

11. నా అంతట నేను ప్రభువు అభిషిక్తుని మీద చేయి చేసుకోరాదు. తలదాపుననున్న ఆ యీటెను, నీటి కుండను గైకొని వెళ్ళుదము పద” అనెను.

12. అంతట దావీదు సౌలు తలదాపుననున్న ఈటెను, జలపాత్రను గైకొనగా ఇరువురు శిబిరమునుండి వెడలిపోయిరి. ఆ రాత్రి శిబిరమున ఏమి జరిగినదో ఎవడును చూడలేదు, ఎవడును గుర్తుపట్టలేదు, ఎవడును మేల్కొనలేదు. వారందరు మైమరచి నిద్రలోనుండిరి. యావే వారందరికి గాఢనిద్ర పట్టునట్లు చేసెను.

13. అంతట దావీదు గుడారమును దాటి ఆవలి వైపు వెడలిపోయి శిబిరమునకు దూరమున ఒక కొండ పైకెక్కి నిలిచెను.

14. అచటినుండి సౌలు సైన్యములను నేరు కుమారుడగు అబ్నేరును కేకలువేసి పిలిచెను. “అబ్నేరూ! నీవు మాట్లాడవా?” అని కేకవేయగా, అబ్నేరు మేల్కొని “రాజునే నిద్రలేపు నీవెవడివి?” అని అడిగెను.

15. దావీదు అతనితో “నీవు వీరుడవుగాదా ఏమి? యిస్రాయేలీయులలో నీపాటి మొనగాడెవడును లేడుగదా? మరి నీ ప్రభువైన రాజును కాపాడక ప్రమత్తుడవైతివేమి? ఎవడో ప్రభువును సంహరించు టకు ఇప్పుడే శిబిరమున చొచ్చెనుగదా?

16. నీ చేయిదము ఏమియు బాగుగాలేదుసుమా! సజీవుడైన యావే తోడు! యావేచే అభిషిక్తుడైన ప్రభువును కాపాడ మీరందరు జాగరూకులుకారైరి. కనుక వెంటనే మీ తలలు తీయింపవలసినదే! అవునుగాని, రాజు తలదాపుననున్న ఈటె, నీటికుండ ఏమైనవో చూడుము!” అనెను.

17. అప్పుడు సౌలు దావీదు స్వరమును గుర్తు పట్టి “నాయనా! దావీదూ! ఇది నీ కంఠమేనా?” అని అడిగెను. దావీదు “అవును, ఇది నా గొంతే” అని బదులుపలికి,

18. “ప్రభూ! ఈ సేవకుని వెన్నాడనేల? నేను ఏ దుష్కార్యము చేసితిని?

19. ఏలినవారు సావధానముగా ఈ సేవకుని పలుకులు ఆలింతురుగాక! ప్రభువే నిన్ను నా మీదికి పురికొల్పినేని, బలినర్పించి ఆయనను శాంతచిత్తుని చేయుదము. కాని నరులెవరునైనను నిన్ను నా మీదికి పురికొల్పిరేని, వారు యావే శాపమువలన మ్రగ్గిపోవుదురుగాక! ఆ నీచులు నన్ను యావే కాణాచిమీద నిలువనీయక ఈ అన్యభూములకు తరిమివేసిరి. నేను అన్యదేవతల కాళ్ళమీద పడునట్లు చేసిరి'.

20. ఇక యావే కంటికి దూరముగా ఈ అన్యభూములపై నా మేనినెత్తురులు ఒలుకకుండునుగాక! యిస్రాయేలు ప్రభుడవైన నీవేమో వేటగాడు కొండలపై కౌజు వెంటపడినట్లు అనామకుడనైన నా వెంటబడివచ్చితివి” అని పలికెను.

21. సౌలు దావీదుతో “నేను పాపము చేసితిని. నాయనా! నీవిక నాయొద్దకు రావచ్చును. నేను నీకు ఎటువంటి అపకారమును చేయను. నేడు నా ప్రాణము పట్ల ఇంత ఆదరము చూపితివి. అవును, నేను వెట్టివానివలె ప్రవర్తించితిని. నా దోషము మన్నింపరానిది” అనెను.

22. దావీదు అతనితో “ప్రభువు ఈటె ఇదిగో! నీ సేవకుడు ఇచ్చటికి వచ్చి దీనిని కొనిపోవచ్చును.

23. యావే ఎవరెవరి నీతికి, విశ్వసనీయతకు తగినట్లుగా వారిని సత్కరించుచుండును. నేడు ప్రభువు నిన్ను నాచేతికి అప్పగించెను. అయినను ప్రభువు అభిషిక్తునిపై నేను చేయి చేసికోలేదు.

24. నేడు నీ ప్రాణములను ఆదరముతో కాపాడితిని. అట్లే యావే నా ప్రాణములనుగూడ ఆదరమున కాపాడి అన్ని ఇక్కట్టులనుండి నన్ను బ్రతికించునుగాక!” అనెను.

25. సౌలు దావీదుతో “నాయనా! దేవుడు నిన్ను దీవించును గాక! నీవిక గొప్ప కార్యములు చేసెదవు. తప్పక విజయము సాధించెదవు” అని చెప్పెను. అంతట దావీదు, సౌలు ఎవరి త్రోవను వారు వెళ్ళిపోయిరి. 

 1. దావీదు “నేడో రేపో నేను సౌలు చేతికి చిక్కుటనిక్కము. కనుక శీఘ్రమే ఫిలిస్తీయుల దేశమునకు పారిపోయెదను. అటులైన సౌలు యిస్రాయేలు దేశము నలుమూలలు గాలించి నన్ను పట్టుకోవలయు నను ప్రయత్నమును మానును. అక్కడ నేను సురక్షితముగా ఉండిపోవచ్చును” అని అనుకొనెను.

2. కనుక అతడు ఆరువందలమంది అనుచరులను వెంటనిడు కొనివచ్చి గాతు రాజును, మావోకు కుమారుడునైన ఆకీషు శరణుజొచ్చెను.

3. దావీదు, అతని అనుచరులు కుటుంబసమేతముగా వచ్చి ఆకీషు నీడలో గాతు దేశమున వసింపమొదలిడిరి.

4. దావీదు తన ఇద్దరు భార్యలతో అనగా యెస్రేయేలు నుండి వచ్చిన అహీనోవముతో, కర్మెలు నాబాలు భార్యయైయుండిన అబీగాయీలుతో అచట కాపురముండెను.

5. దావీదు ఆకీషుతో “నేను నీ మన్ననకు పాత్రుడనైతినేని నీ దేశమున సాగునేలలోనున్న పట్టణమొకటి నాకిచ్చివేయుము. నేనచట స్థిరపడెదను. నీతోపాటు రాజధానిలో వసింపనేల?” అనెను.

6. ఆకీషు దావీదునకు సిక్లాగు పట్టణమునిచ్చెను. కనుకనే సిక్లాగు నగరము నేటికిని యూదారాజుల వశమున నున్నది.

7. ఈ రీతిగా దావీదు పదునారు నెలలు ఫిలిస్తీయ రాజ్యమున వసించెను.

8. దావీదు అనుచరులతో పోయి అమాలెకీయులు, గెషూరీయులు, గెరిసీయులు మొదలైన జాతులపై దాడిసల్పెను. వీరు తేలాము నుండి షూరుమీదుగా ఐగుప్తువరకు నివాసములు ఏర్పరచుకొనియుండిరి.

9. దావీదు ఆ ప్రాంతమును కొల్లగొట్టి స్త్రీలనక పురుషులనక చేతికి చిక్కినవారినందరిని హతమార్చి అచ్చటనున్న గొఱ్ఱెలు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు మొదలగు పశుసంపదను, జనులు తాల్చు బట్టలను దోచుకొని ఆకీషుచెంతకు కొనితెచ్చెడి వాడు.

10. ఆకీషు అతనిని చూచి "నేడు ఏ ప్రాంతములను దోచుకొని వచ్చితివి?” అని అడుగుచుండును. దావీదు అతనితో “నెగేబునందు యూదీయుల గ్రామ సీమనో లేక యెరాహ్మెయేలీయుల పల్లెపట్టునో లేక కేనీయుల పల్లెనో దోచుకొని వచ్చి తిని” అని చెప్పుచుండును.

11. కాని దావీదు ఎన్నడు ఆ ప్రాంతముల నుండి ఆడువారినిగాని, మగవారిని గాని ప్రాణములతో గాతునకు కొనిరాలేదు. వారు తనపైన, తన అనుచరుల పైన లేనిపోని నేరములు మోపుదురేమో అని అతడు శంకించెను. ఫిలిస్తీయ రాజ్యమున ఉన్నంతకాలము అతడు ఈ నియమమునే పాటించెను.

12. ఆకీషు దావీదు మాటలను గట్టిగా నమ్మెను. అతడు “దావీదు చేయు పాడుపనులకు అతనికి ఇష్టులైన యిస్రాయేలీయులు కూడ అతనిని ద్వేషింతురు. కనుక జీవితాంతము అతడు నాకు సామంతుడుగనే ఉండిపోవును” అని అనుకొనెను.

 1. ఆ రోజులలో ఫిలిస్తీయులు యిస్రాయేలీయులతో పోరాడుటకై సైన్యమును సమకూర్చుకొనిరి. ఆకీషు దావీదుతో “నీవు నీ అనుచరులు నా పక్షమున పోరాడవలయును సుమా!” అనెను.

2. దావీదు అతనితో “దానికేమి, నీ సేవకుడు ఏమిచేయునో నీవే చూడగలవు” అని బదులుపలికెను. ఆకీషు “ఇకమీద నిన్ను నా అంగరక్షకునిగా నియమించితిని” అని చెప్పెను.

3. సమూవేలు అప్పటికే దివంగతుడయ్యెను. యిస్రాయేలీయులందరు అతనికొరకు శోకించి, అతని మృతదేహమును అతని నివాసనగరమగు రామా యందే పూడ్చిపెట్టిరి. అప్పటికే సౌలు భూతములను, చనిపోయినవారిని ఆవాహకము చేయు మాంత్రికుల నందరిని దేశమునుండి వెడలగొట్టించెను.

4. ఫిలిస్తీయులు దండులు సమకూర్చుకొని షూనేము నొద్దదిగిరి. సౌలు యిస్రాయేలీయులను ప్రోగుచేసికొని గిల్బోవవద్ద వ్యూహము పన్నెను.

5. సౌలు ఫిలిస్తీయుల దళమునుచూచి మిక్కిలి భయపడెను. అతని గుండె దడదడ కొట్టుకొనెను.

6. అతడు యావేను సంప్రదించెనుగాని స్వప్నములోగాని, ఉరీము వలనగాని, ప్రవక్తద్వారా గాని ప్రభువు ఏమియు సెలవియ్యకుండెను.

7. సౌలు పరిజనముతో “చనిపోయిన వారిని ఆవాహకము చేయు మాంత్రికురాలిని ఒకతెను వెదకుడు. నేనామెతో సంప్రదించి చూచెదను” అనెను. వారు “ఎండోరు వద్ద మాంత్రికురాలు ఒకతె కలదు” అని చెప్పిరి.

8. సౌలు బట్టలుమార్చుకొని మారు వేషము వేసికొని ఇద్దరు సేవకులను వెంట గొని రాత్రి వేళ మాంత్రికురాలియొద్దకు వెళ్ళెను. ఆమెతో “మృతులను రప్పించి నాకు సోదె చెప్పింపుము. మృత లోకము నుండి నేను పేర్కొనిన వ్యక్తిని రప్పింపుము” అనెను.

9. ఆమె అతనితో “సౌలు భూతములను చనిపోయిన వారిని రప్పించు మాంత్రికులను అడపొడ గానరాకుండ చేసెను గదా! నీవు నా ప్రాణము తీయుటకేల వలపన్నెదవు?” అనెను.

10. సౌలు “సజీవుడైన యావే తోడు! సోదె చెప్పించిన నీకు ముప్పు వాటిల్లదు” అని ఒట్టు పెట్టుకొనెను.

11. ఆమె పాతాళమునుండి ఎవరిని రప్పింపమందువని అడుగగా, సౌలు సమూవేలును పిలిపింపుమనెను.

12. మాంత్రికురాలు సమూవేలు లేచివచ్చుట చూచి భయపడి కెవ్వున కేకవేసెను. ఆమె సౌలువైపు మరలి “నిక్క ముగా నీవు సౌలువే. నన్నేల ఇట్లు వంచించితివి?” అని అడిగెను.

13. సౌలు మాంత్రికురాలిని భయపడవలదని హెచ్చరించి “నీకెవ్వరు కనబడిరి” అని ప్రశ్నించెను. ఆమె “భూమిలోనుండి దైవములలో ఒకడు లేచి వచ్చుచున్నాడు” అని చెప్పెను.

14. సౌలు, అతని ఆకారమెట్లున్నదో చెప్పుమనగా మాంత్రికురాలు “దుప్పటి కప్పుకొనిన ముసలివదెవడో లేచి వచ్చు చున్నాడు” అనెను. సౌలు వెంటనే సమూవేలు లేచి వచ్చుచున్నాడని గ్రహించి నేలపై సాగిలపడి దండము పెట్టెను.

15. సమూవేలు సౌలుతో “నీవు నన్ను కుదురుగా కూర్చుండనీయక ఇటకేల రప్పించితివి?” అనెను. సౌలు “నేను ఆపదలో చిక్కుకొంటిని. ఫిలిస్తీయులు నాపై యుద్ధమునకు వచ్చిరి. ప్రభువు నన్ను త్రోసి వేసెను. ప్రవక్త ద్వారాగాని, స్వప్నమూలమునగాని నాతో మాట్లాడడయ్యెను. ఇక నేనేమి చేయవలెనో తెలియుటలేదు. దిక్కుతోచక నిన్ను రప్పించితిని” అని చెప్పెను.

16. అందులకు సమూవేలు “యావే నిన్ను విడనాడి, నీకు శత్రువుకాగా ఇక నన్ను సంప్రదించి ప్రయోజనమేమి?

17. యావే నాతో ముందు సెలవిచ్చినట్లే చేసెను. ప్రభువు రాజ్యమును నీ వశము నుండి తొలగించి నీ పొరుగువాడైన దావీదునకు ఇచ్చి వేసెను.

18. నీవు యావేమాట పాటింపవైతివి. ప్రభువు కోపముతో అమాలెకీయులను రూపుమాపుమని చెప్పిన మాటను చెవిన దూరనీయవైతివి. కనుకనే యావే నిన్ను వీడెను.

19. ఇంకను వినుము! ప్రభువు నిన్నును, యిస్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును, నీ తనయులును నాతో ఉందురు. అవును, ప్రభువు యిస్రాయేలు సైన్యములను తప్పక ఫిలిస్తీయుల వశముచేయును” అని నుడివెను.

20. సౌలు సమూవేలు మాటలకు వెరచి నిలువున నేలపై కూలెను. నాటి పగలుగాని, రేయిగాని ఎంగిలి పడకుండుటచే అతనికి సత్తువ తగ్గిపోయినది.

21. అపుడు మాంత్రికురాలు సౌలు వద్దకు వచ్చి అతని భయమును గుర్తించి “నేను ప్రాణములు గుప్పిట బట్టుకొని నీ మాట పాటించితిని.

22. ఆ రీతినే నీవును నా మాట పాటింపవలెను. ఇంత ఆహారము కొనివచ్చెదను, తిని సత్తువనొంది నీ త్రోవన నీవు వెడలి పొమ్ము ” అనెను. 

23. సౌలు మొదట అంగీకరింపలేదు. ఆహారము తిననని పట్టుపట్టెను. కాని సేవకులు, మాంత్రికురాలు బతిమాలుటచే చివరకు నేలపై నుండి లేచి మంచముమీద కూర్చుండెను.

24. మాంత్రికురాలి ఇంట క్రొవ్విన దూడకలదు. ఆమె దానిని కోసి వేగముగ మాంసమును వండెను. పిండి తీసికొని పిసికి పొంగనిరొట్టెలు కాల్చెను.

25. మాంత్రికురాలు సౌలునకు అతని సేవకులకు భోజనము వడ్డించెను. వారు భుజించి ఆ రాత్రియే పయనమై వెళ్ళిపోయిరి.

 1. ఫిలిస్తీయులు ఆఫెకు వద్ద మోహరించి యుండిరి. యిస్రాయేలీయులు యెస్రెయేలు నీటిబుగ్గ దగ్గర సైన్యమును చేర్చిరి.

2. ఫిలిస్తీయ దొరలు నూరు మందితో, వేయిమందితో వ్యూహపరిచి వచ్చియుండగా, దావీదును, అతని బలగమును ఆకీషుతో కలిసి అందరికంటె వెనుకవచ్చిరి.

3. దొరలు దావీదు పరివారమును చూచి ఈ హెబ్రీయులు ఇచట ఏమి చేయుచున్నారు అని అడిగిరి. ఆకీషు “ఇతడు యిస్రాయేలు రాజగు సౌలు సేవకుడైన దావీదు. ఏడాదికి పైగా నా కొలువున ఉన్నాడు. నా పంచ చేరినప్పటినుండి నేటివరకు ఇతనియందు దోషమేమియు చూపట్టదు” అని చెప్పెను.

4. కాని ఫిలిస్తీయ దొరలు ఆకీషు పై ఆగ్రహించి “వీనిని వెంటనే పంపివేయుము. ముందుగా నీవు చెప్పిన తావునకు వెడలిపోనిమ్ము. దావీదు మనతో రాతగదు. పోరాటము ఆరంభమైన పిదప ఇతడు మనపై తిరుగబడును. తన యజమానుని అనుగ్రహము వడయుటకై వీడు మనవారి తలలు తెగ నరకకుండునా?

5. ఈ దావీదును గూర్చియేకదా నాడు స్త్రీలు నాట్యమాడుచు- సౌలు వేయిమందిని సంహరించెను, కాని దావీదు పదివేలమందిని సంహరించెను అని గానము చేసినది?” అని అనిరి.

6. ఆకీషు దావీదుతో “సజీవుడైన యావే తోడు! నా కొలువున చేరినప్పటినుండి నేటివరకును నీయందు నేరమేమియు కనబడలేదు. నీవు ఉత్తముడవు కనుక దండున నాతోనుండుట మేలు. అయినను ఈ దొరలకు నీవనిన గిట్టదు.

7. నీవిక నిశ్చింతతో వెడలిపొమ్ము. వీరిని చిఱ్ఱుబుఱ్ఱులాడింపనేల?” అనెను.

8. కాని దావీదు ఆకీషుతో “నేను ఏ దుష్కార్యము చేసితిని? నీ కొలువున చేరిన నాటినుండి నేటివరకు నా వలన దోషమేమైన దొరలినదా? నేను యుద్ధమున నా దొర కొమ్ముకాచుకొని శత్రువులతో పోరాడవలదా?” అని అడిగెను.

9. ఆకీషు అతనితో “నా కంటికి నీవు దేవదూతవలె నిర్దోషివి. అయినను అధికారులు నిన్ను యుద్ధమునకు రానీయమనిరి.

10. కావున నీవు, నీ యజమానుని సేవకులు వేకువనే లేచి నేను చెప్పిన తావునకు వెడలిపొండు. నా కంటికి నీవు మంచివాడవే. నీవు మరొకలాగున భావింపవలదు. వేకువనే లేచి వెలుతురు చూపట్టగనే ఇంటికి వెడలిపొమ్ము " అని ఆజ్ఞ ఇచ్చెను.

11. కనుక దావీదు, అతని అనుచరులు ప్రాతఃకాలముననే లేచి తెల్లవారక మునుపే ఫిలిస్తీయ దేశమునకు మరలిపోవ ప్రయాణమైరి. ఫిలిస్తీయుల దండు యెస్రెయేలునకు పయనమై పోయెను.

 1. దావీదు అనుచరులతో మూడునాళ్ళు పయనము చేసి సిక్లాగు చేరునప్పటికి అమాలేకీయులు దక్షిణదేశమునందలి గ్రామసీమపై దాడిసల్పి సిక్లాగును ముట్టడించి కాల్చివేసిరి.

2. అచ్చటి స్త్రీలందరిని చెరగొనిపోయిరి. కాని ఎవరిని చంపలేదు.

3. దావీదు అనుచరులతో నగరము చేరునప్పటికి అది కాలి బుగ్గియై యుండెను. శత్రువులు వారి భార్యలను, కుమార్తెలను, కొడుకులను చెరపట్టిరి.

4. కనుక దావీదు, అతని అనుచరులు శోకముపట్టలేక పెద్దపెట్టున ఏడ్చిరి. ఓపిక ఉన్నంతవరకు విలపించిరి.

5. దావీదు భార్యలిద్దరు, అనగా యెస్రెయేలు నుండి వచ్చిన అహీనోవము, కర్మేలు నుండి వచ్చిన నాబాలు భార్యయైన అబీగాయీలు బందీలైరి.

6. దావీదు చాలబాధపడెను. కుమార్తెలను, కొడుకులను కోల్పోవుటచే జనులు మిక్కిలి కోపము తెచ్చుకొని దావీదును రాళ్ళురువ్వి చంపజూచిరి. కాని దావీదు తాను కొలుచు యావేవలన ధైర్యము తెచ్చు కొనెను.

7. అతడు అహీమెలెకు కుమారుడును యాజకుడైన అబ్యాతారును చూచి యావేచిత్తము తెలియజేయు ఎఫోదును తెమ్మనగా అతడు దానిని తెచ్చెను.

8. దావీదు "నన్నీదండును వెన్నాడమందువా? నేను వారిని పట్టుకోగలనా?” అని యావే నడిగెను. ప్రభువు “వెన్నాడుము. నీవు వారిని పట్టుకొని నీ జనులనందరను విడిపింతువు” అని సెలవిచ్చెను.

9. కనుక దావీదు తన చెంతనున్న ఆరువందల మందితో బయలుదేరి బేసోరులోయ చేరెను.

10. వారిలో రెండువందల మంది మిక్కిలి అలసి లోయ దాటలేక అక్కడనే ఉండిపోయిరి. మిగిలిన నాలుగు వందల మందితో దావీదు శత్రువులను వెదకబోయెను.

11. దావీదు అనుచరులు పొలమున ఒక ఐగుప్తీయుని కనుగొని తమ యజమాని వద్దకు కొని వచ్చిరి. అతనికి అన్నపానీయములను ఇచ్చిరి.

12. అత్తిపండ్ల కుడుములను, రెండు ఎండుద్రాక్షపండ్ల గుత్తులను వాని ముందు పెట్టిరి. ఐగుప్తీయుడు వానిని తిని తేరు కొనెను. అతడు మూడునాళ్ళనుండి తిండి తినలేదు. గ్రుక్కెడు నీళ్ళయిన త్రాగలేదు.

13. దావీదు వానిని “నీవెవరి సేవకుడవు? ఎక్కడనుండి వచ్చుచున్నావు?” అని అడిగెను. వాడు “నేను ఐగుప్తీయుడను. అమాలెకీయ యజమానునకు ఒకనికి ఊడిగము చేయుచుండువాడను. నేను త్రోవలో జబ్బు పడగా యాజమానుడు మూడునాళ్ళక్రితము నన్నిట వదలి వేసెను.

14. మేము కెరెతీయుల దక్షిణ దేశమునకును, యూదీయుల దేశమునకును, కాలేబీయుల దక్షిణ దేశమునకును వచ్చి పల్లెపట్టులను దోచుకొని సిక్లాగును కాల్చి బూడిదపాలు చేసితిమి” అని చెప్పెను.

15. దావీదు అతనితో “నన్ను నీ దోపిడిగాండ్రయొద్దకు గొనిపోయెదవా?” అని అడిగెను. వాడు “నన్ను చంపవేని, నా యజమానికి అప్పగింపనని దేవుని పేర ఒట్టు పెట్టుకొందువేని నిన్ను వారి చెంతకు కొనిపోయెదను” అనెను.

16. వాడు దావీదును దోపిడిగాండ్ర వద్దకు కొనిపోయెను. వారు యూదా నుండి, ఫిలిస్తీయా దేశమునుండి దోచుకొని వచ్చిన సొమ్మును చూచుకొని సంతోషము పట్టజాలక తినుచు, త్రాగుచు తందనా లాడుచు విడివిడిగా చెదరియుండిరి.

17. దావీదు ఉదయమునుండి సాయంకాలము వరకును, సాయంకాలమునుండి మరునాటి ఉదయము వరకును శత్రువులను హతమార్చెను. వారిలో నాలుగు వందల మంది మాత్రము ఒంటెలనెక్కి పారిపోయిరి. మిగిలిన వారెవ్వరును తప్పించుకోలేదు.

18. అతడు అమాలెకీయులు చెరగొనిపోయినవారిని విడిపించెను. తన భార్యలను కూడ విడిపించుకొనెను.

19. పెద్దవారు గాని, చిన్నవారు గాని, కొడుకులుగాని, కుమార్తెలుగాని ఎవరును తప్పిపోలేదు. కొల్లసొమ్ముగాని, శత్రువులు సొంతము చేసికొనిన సొమ్ముగాని ఏమియు తప్పిపోకుండ దావీదు అంతయు ప్రోగుచేసికొని వచ్చెను.

20. దావీదు జనులు గొఱ్ఱెలమందలను, గొడ్లమందలను విడిపించుకొని, అతనికి ముందుగా నడిపించుకొని వచ్చిరి. “ఇది దావీదుకొల్లసొమ్ము" అని కేకలిడిరి.

21. దావీదును అలసటచే అనుసరింపలేని వారు రెండువందలమంది బేసోరు లోయవద్ద నిలిచియుండిరికదా! దావీదు తిరిగివచ్చి వారిని కలిసికొనెను. వారు దావీదును అతని పరివారమును చూచి ఎదురువోయిరి. దావీదు వారిని కుశలమడిగెను.

22. కాని దావీదు పరివారమునందలి దుర్మార్గులు మాత్రము “వీరు మనతో రాలేదు. కనుక మనము కొనివచ్చిన దోపిడి సొమ్ములో వీరికి భాగమీయరాదు. వలయునేని వారు తమతమ భార్యలను పిల్లలను తీసికొని వెళ్ళిపోవచ్చును” అనిరి.

23. దావీదు వారితో “సోదరులారా! ప్రభువు మనలను కాపాడెను. పట్టణము మీదబడిన దోపిడిగాండ్రను మనచేతికి అప్పగించెను. ఇంత సొమ్మును మన వశము చేసెను.

24. ఇపుడా సొమ్ములో వీరికి భాగము లేదనరాదు. మీరు చెప్పిన మాటలు ఎవరొప్పుకొందురు? 'యుద్ధమునకు పోయిన వారికి ఎంతో, సామానులకు కావలి కాచిన వారికిని అంతే' అందరును సమముగనే పంచుకోవలయును” అనెను.

25. నాడు దావీదు ఈ నియమము చేసెను. నేటికిని యిస్రాయేలీయులలో ఈ నియమము చలామణి అగుచునే యున్నది.

26. దావీదు సిక్లాగు చేరిన పిమ్మట దోపిడి సొమ్ములో కొంతపాలు యూదాదేశపు పెద్దలకును, తన స్నేహితులకును పంపించెను.

27. “మేము ప్రభువు శత్రువులనుండి కొనివచ్చిన సొమ్మునుండి మీకు కానుకలు పంపుచున్నాము” అని చెప్పించెను.

28-31. బేతేలు నేగేబులోని రామోతు, యాతీరు, అరోయేరు, సిప్మోతు యెష్టమోవా, రాకాలు యెరాహ్మెయేలు పట్టణములకు, కేనీయ పట్టణములకు, హోర్మా, కోరోషాను, అతాక, హెబ్రోను మొదలైన పట్టణములకు, తాను తన అనుచరులు వసించిన నగరములకు దావీదు కానుకలు పంపించెను.

 1. యిస్రాయేలీయులు ఫిలిస్తీయులతో పోరా డిరి. కాని ఫిలిస్తీయులు వారిని ఓడించి గిల్బోవా కొండమీద మట్టుపెట్టిరి.

2. ఫిలిస్తీయులు సౌలును, అతని కుమారులను చుట్టుముట్టిరి. సౌలు తనయులైన యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవా రణమున కూలిరి.

3. సౌలు చుట్టు పోరు ముమ్మరమయ్యెను. కొందరు విలుకాండ్రు సౌలుపై బాణములు గుప్పించిరి. అతడు గాయపడి నేలపై కూలెను.

4. సౌలు తన అంగరక్షకునితో “నన్ను నీ బాకుతో పొడిచిచంపుము. లేదేని సున్నతిసంస్కారములేని వారు నా మీదబడి వేళాకోళము చేయుదురు” అనెను. కాని అతని అంగరక్షకుడు మిక్కిలి భయపడి అడుగైన కదల్పడయ్యెను. సౌలు తన కత్తినిదూసి, దాని మీదపడి ప్రాణములు వదలెను.

5. యజమానుడు ఈ విధముగా ప్రాణములు విడుచుట చూచి సౌలు అంగరక్షకుడు కూడ తన సొంత కత్తిమీదబడి అసువులు బాసెను.

6. ఆ రీతిని సౌలు, అతని మువ్వురు కుమారులు, అంగరక్షకుడు అందరు ఆనాడే ప్రాణములు కోల్పోయిరి.

7. కొండకు ఆవలివైపు లోయలోను యోర్దానులోను వసించు యిస్రాయేలీయులు తమవారు రణము నుండి పారిపోయిరనియు, సౌలు కుమారులతో పాటు, తన ఆయుధములు మోయువాడును ఒక దినముననే మరణించిరనియు విని స్వీయనగరములను వీడి పలాయితులయిరి. ఫిలిస్తీయులు వచ్చి ఆ నగరములలో వసించిరి.

8. మరునాడు ఫిలిస్తీయులు చచ్చినవారి వస్త్రములు ఊడదీసికొని పోవుటకువచ్చిరి. సౌలు ముగ్గురు కుమారులతో గిల్బోవాకొండపై చచ్చి పడియుండుటను చూచిరి.

9. వారు అతని తల తెగనరికిరి. ఆయుధములు ఊడ్చిరి. తమ దేవతలకు, పౌరులకు విజయ వార్తలు చాటి చెప్పుటకు దేశము నలుమూలలకు దూతలనంపిరి.

10. సౌలు ఆయుధములను అష్టారోతు దేవళమున పదిలపరిచిరి. అతని శవమును బేత్ షాను ప్రాకారమునకు వ్రేలాడగట్టిరి.

11. యాబేషుగిలాదు పౌరులు ఫిలిస్తీయులు సౌలును అవమానపరచిరని వినిరి.

12. వారి నగరమునందలి వీరులందరును బయలుదేరి రాత్రియంతయు ప్రయాణముచేసిరి. సౌలు శవమును, అతని కుమారుల శవములను బేత్ షాను ప్రాకారమునుండి దింపి యాబేషుకు కొనివచ్చి అచ్చట దహనము చేసిరి.

13. వారి అస్థికలను యాబేషులోని పిచులవృక్షము క్రింద పాతి పెట్టి ఏడునాళ్ళు ఉపవాసముండిరి.