1. ఆదాము షేతును, షేతు ఎనోషును కనెను.
2. ఎనోషు కుమారుడు కేనాను. అతని కుమారుడు మహలలేలు. అతని పుత్రుడు యారెదు.
3. యారెదు నుండి క్రమముగా హనోకు, మెతూషెల, లామెకు, నోవా అనువారు జన్మించిరి.
4. షేము, హాము, యాఫెతు నోవా కుమారులు.
5. యాఫెతు వంశజులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తూబాలు, మెషెకు, తీరసు.
6. గోమెరు వంశజులు అష్కేనను, దీఫతు, తొగర్మా.
7. యావాను వంశజులు ఎలీషా, తార్షీషు, కిత్తీము, రోదానీము.
8. హాము వంశజులు కూషు, మిస్రాయీము, పూతు, కనాను.
9. కూషు వంశజులు సెబా, హవీలా, సబ్తా, రామా, సబ్తేకా. రామా వంశజులు షెబా, దెదాను.
10. కూషు పుత్రుడు నిమ్రోదు ప్రపంచము నందలి మొదటి విజేత.
11-12. మిస్రాయీమునుండి పుట్టిన ప్రజలే లూదీయులు, అనామీయులు, లెహబీయులు, నప్తుహీయులు, పత్రుసీయులు, కస్లుహీయులు (ఫిలిస్తీయులకు మూలపురుషులు) మరియు కఫ్తోరీయులు.
13. కనాను పెద్దకొడుకు సీదోను, రెండవ కుమారుడు హేతు.
14-16. యెబూనీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులుకూడ పై కనాను వంశజులే.
17. షేము పుత్రులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరాము, ఊజు, పూలు, గెతెరు, మెషకు.
18. అర్పక్షదు పుత్రుడు షెలా. అతని పుత్రుడు ఏబెరు.
19. ఏబెరు పుత్రులలో ఒకని పేరు పెలెగు. అతని కాలమున భూమి నెఱలిచ్చినది. కనుక అతనికి ఆ పేరువచ్చెను. మరియొకని పేరు యోక్తాను.
20-23. యోక్తానువంశజులు అల్మోదాదు, షెలెపు, హసర్మావెతు, యెరా, హదోరాము, ఊసాలు, దిక్లా, ఏబాలు, అబీమాయేలు, షేబ, ఓఫీరు, హవీలా, యోబాబు.
24-28. షేమునుండి అబ్రహామువరకు గల వంశవృక్షమిది: షేము, అర్పక్షదు, షేలా, ఏబెరు, పెలెగు, రవూ, సెరూగు, నాహోరు, తెరా, అబ్రహాము అని పేరు పొందిన అబ్రాము. అబ్రహాము కుమారులు ఈసాకు, యిష్మాయేలు.
29-31. యిష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. తరువాతి కుమారులు కేదారు, అద్బయేలు, మిబ్సాము, మిష్మా, దూమా, మస్సా, హాదదు, తేమా, యేతూరు, నాఫీషు, కేద్మా.
32. అబ్రహామునకు తన ఉంపుడు కత్తెయైన కెతూర వలన కలిగిన సంతానము సిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షువా. యోక్షాను పుత్రులు షేబా, దేదాను.
33. మిద్యాను కుమారులు ఏఫా, ఏఫేరు, హానోకు, అబీదా, ఎల్గా.
34. అబ్రహాము కుమారుడు ఈసాకునకు ఏసావు, యిస్రాయేలు అని ఇద్దరు కుమారులు.
35. ఏసావు పుత్రులు ఎలీషాసు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరా.
36. ఎలీఫాసు వంశజులు తేమాను, ఓమరు, సెఫి, గాతాము, కనసు, తిమ్నా, అమాలేకు.
37. రెయూవేలు వంశజులు నహతు, సెరా, షమ్మా, మిస్సా,
38. సేయీరు కుమారులు లోతాను, బాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
39. లోతాను కుమారులు హోరీ, హోమాము. తిమ్నా లోతానునకు సోదరి.
40. షోబాలు కుమారులు అల్యాను, మనహతు, ఏబాలు, షెఫి, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా.
41. అనా కుమారుడు దిషోను. దిషోను పుత్రులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
42. ఏసేరు కుమారులు బిల్హాను, సావాను, యాకాను. దిషోను కుమారులు ఊసు, అరాను.
43-50. యిస్రాయేలున రాచరికము ఏర్పడక మునుపే ఎదోము నేలిన రాజుల పేర్లివి: బెయోను కుమారుడైన బెలా, దిన్హాబా పట్టణమునుండి రాజ్యము చేసెను. బెలా చనిపోగా, బోస్రా వాసియైన సెరా కుమారుడు యోబాబు అతని స్థానమున రాజయ్యెను. యోబాబు మరణించగా తేమానీయుడైన హుషాము అతనికి బదులుగా రాజయ్యెను. హుషాము మరణించిన తరువాత మోవాబు దేశమున మిద్యానీయులను చంపిన బెదదు కుమారుడగు హదదు అతనికి బదులుగా రాజయ్యెను. ఇతడు అవీతు నుండి పరిపాలన చేసెను. హదదు మరణించిన తరువాత మస్రేకా వాసియైన సమ్లా అతని స్థానమున రాజయ్యెను. సమ్లా మరణించిన తరువాత ఏటి యొడ్డుననున్న రెహబోతు వాసియైన షావూలు అతనికి బదులుగా రాజయ్యెను. షావూలు మరణించిన తరువాత అక్బోరు కుమారుడగు బాలుహానాను అతనికి బదులుగా రాజయ్యెను. బాలుహానాను మరణించిన తరువాత అతనికి బదులుగా హదదు రాజయ్యెను. అతడు పాయిము నుండి రాజ్యము చేసెను. ఇతని భార్య మెహితబేలు. ఈమె మెసహాబు కుమార్తెయైన మత్రేదునకు పుట్టినది.
51-54. హదదు మరణించిన తరువాత ఎదోము నందుండిన నాయకుల పేరులివి: తిమ్నా, అల్యా, యత్తు, ఓహాలీబామా, ఏలా, పీనోను, కనసు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు, ఈరాము.
1-2. యిస్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, యిస్సాఖారు, సెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
3. యూదాకు కనానీయ వనితయైన బాత్షువ వలన ఏరు, ఓనాను, షేలా అను ముగ్గురు కుమారులు కలిగిరి. వారిలో పెద్దవాడైన ఏరు దుష్టుడైనందున ప్రభువు వానిని వధించెను.
4. యూదాకు అతని కోడలైన తామారు వలన పెరెసు, సెర అను పుత్రులు కలిగిరి. కనుక యూదా తనయులు మొత్తము ఐదుగురు.
5. పెరెసు కుమారులు హెస్రోను, హామూలు.
6. సెర కుమారులు సిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార అను ఐదుగురు.
7. కర్మీ కుమారులలో ఆకోను ఒకడు. ఇతను ఆకోరునందు శాపగ్రస్తమైన వస్తువులు దొంగిలించి యిస్రాయేలునకు తిప్పలుతెచ్చెను.
8. ఏతాను కుమారుడు అసర్యా.
9. హెన్రాను కుమారులు యెర హ్మెయేలు, రాము, కెలూబయి.
10-12. కెలూబయి నుండి యిషాయి వరకును గల వంశవృక్షమిది: రాము, అమ్మినాదాబు, యూదీయులలో ప్రముఖుడైన నహషోను, సల్మా, బోవజు, ఓబేదు, యిషాయి.
13-15. యిషాయి ఏడుగురు కుమారులు క్రమముగా వీరు: ఏలీయాబు, అబీనాదాబు, షిమ్యా, నెతనేలు, రద్దయి, ఓ సెము, దావీదు.
16. ఈ సోదరులకు సెరూయా, అబీగయీలు అను తోబుట్టువులు కలరు. సెరూయా కుమారులు అబీషయి, యోవాబు, అసాహేలు.
17. అబీగయీలు యిష్మాయేలు వంశజుడైన యేతేరును పెండ్లియాడి అమాసాను కనెను.
18. హెస్రోను కుమారుడు కాలేబు అసూబాను పెండ్లియాడి యెరియోతును కనెను. ఈమె కుమారులు వీరు: యేషేరు, షోబాబు, అర్ధోను.
19. అసూబా గతించిన తరువాత కాలేబు ఎఫ్రాతాను పెండ్లియాడి హూరును కనెను.
20. హూరు కుమారుడు ఊరి. అతని పుత్రుడు బెసలేలు.
21. హెస్రోను అరువది యేండ్ల ఈడున మాకీరు పుత్రిక, గిలాదు సోదరియైన ఆడుపడుచును పెండ్లియాడి సెగూబును కనెను.
22. ఇతని కుమారుడు యాయీరు. ఈ యాయీరు గిలాదు మండలమున ఇరువది మూడుపట్టణములను ఏలెను.
23. కాని గెషూరు, ఆరాము రాజులు, యాయీరు మండలము నుండి అరువది పట్టణములు గెలిచిరి. యాయీరు, కెనాతు మరియు వాని సమీప నగరములు ఆ రాజులు గెలిచినపట్టణముల లోనివే. అచటి ప్రజలెల్లరు గిలాదు తండ్రియైన మాకీరు వంశమునకు చెందిన వారే.
24. కాలెబుదైన ఎఫ్రాతాలో హెస్రోను మరణించిన పిదప అతని భార్య అబియా అతనికి అష్షూరును కనెను. ఇతని కుమారుడే తెకోవ.
25. హెస్రోను జ్యేష్ఠపుత్రుడు యెరహ్మయేలు కుమారులు రాము, బూనా, ఓరెను, ఓసెము, అహీయా.
26. యెరహ్మయేలునకు అతారా అను మరియొక భార్యవలన ఓనాము కలిగెను.
27. రాము కుమారులు మాసు, యామీను, ఏకెరు.
28. ఓనాము కుమారులు షమ్మయి, యాదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు.
29. అబీషూరు అబీహాయిలును పరిణయమాడి అహ్బాను, మోలీదు అనువారిని కనెను.
30. నాదాబు కుమారులు సేలెదు, అప్పయీము. సేలెదునకు సంతానము కలుగలేదు.
31. అప్పయీమునకు ఇషీ, అతనికి షేషాను, అతనికి అహ్లాయి జన్మించిరి.
32. షమ్మయి సోదరుడు యాదాకు యెతెరు, యోనాతాను జన్మించిరి. యెతెరునకు సంతానము లేదు.
33. యోనాతాను పుత్రులు పేలెతు, సాస.
34-35. షేషానునకు కుమార్తెలు మాత్రమే కలిగిరి. అతనికి ఐగుప్తీయుడైన యర్హా అను బానిస కలడు. ఈ బానిసకు తన కుమార్తెలలో నొకతెనిచ్చి పెండ్లి చేయగా అత్తయి అను కుమారుడు కలిగెను.
36–41. అత్తయి నుండి ఎలీషామా వరకు గల వంశవృక్షమిది: అత్తయి, నాతాను, సాబాదు, ఎఫ్లాలు, ఓబేదు, యెహూ, అసర్యా, హెలెసు, ఎల్యాసా, సిస్మాయి, షల్లూము, యెకమ్యా, ఎలీషామా.
42. యెరహ్మయేలు సోదరుడు కాలేబు జ్యేష్ఠ కుమారుడు మెర్షా. ఇతని కుమారుడు సీపు. ఇతని తనయుడు మరేషా. ఇతని పుత్రుడు హెబ్రోను.
43. హెబ్రోను కుమారులు కోరా, తపూవా, రేకెము, షేమ.
44. షెమ కుమారుడు రహము. అతని తనయుడు యోర్కెయాము. షెమ సోదరుడగు రెకెము తనయుడు షమ్మయి.
45. షమ్మయి కుమారుడు మఓను. అతని తనయుడు బేత్సూరు.
46. కాలేబునకు అతని ఉంపుడు గత్తె అయిన ఏఫావలన హారాను, మోసా, గాసేసు అను కుమారులుకలిగిరి. హారాను కొడుకు పేరుకూడగాసేసు.
47. యహ్దాయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏఫా, షాపు.
48. కాలేబునకు మరియొక ఉంపుడుకత్తె మాకా వలన షెబెరు, తిర్హనా పుట్టిరి.
49. అటుపిమ్మట ఆమెకు మరి ఇద్దరు కుమారులు కలిగిరి. వారిలో షావు కుమారుడు మద్మన్నా. షేవా కుమారులు మక్బేనా, గిబియా, కాలేబు కుమార్తె పేరు అక్సా.
50. వీరందరు కాలేబు కుమారులు.
51. హూరు కాలేబునకు పెద్దకొడుకు. హోరునకు ఎఫ్రాతా వలన ముగ్గురు కుమారులు కలిగిరి. వారిలో షోబాలు కిర్యత్యారీమునకు తండ్రి. సల్మా బేత్లెహేమునకు, హారేపు బేద్గాదేరునకు తండ్రులు.
52. కిర్యత్యారీము తండ్రి ఇతర కుమారులు : షోబాలునకు హరొయె, మనహోతీయులలో సగము మంది ఇతని వంశజులే.
53. కిర్యత్యారీము కుటుంబీకులు వీరు: ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు షోబాలు వంశజులే. సోరా, ఎష్టావోలు ప్రజలును ఇతని సంతతివారే.
54. షల్మా వంశజులు హేము, నెటోతీయులు, అట్రోత్బెత్మోహెబు, బేతు, మరియు మనహతీయులందు సోరాయీయులందు సగభాగము ప్రజలు అతని వంశజులే.
55. తిరాతీయులు, షిమ్యాతీయులు, సుకోతీయులను లేఖకుల జాతులు యాబేసున వసించిరి. వీరు హమ్మతు నుండి వచ్చిన కేనీయులు. వారి వంశకర్త రేకాబు.
1-3. దావీదునకు హెబ్రోనున కలిగిన కుమా రులు వరుసక్రమముగా వీరు: యెస్రెయేలునకు చెందిన అహీనోవమునకు పుట్టిన అమ్నోను. కర్మేలునకు చెందిన అబీగయీలునకు జన్మించిన దానియేలు. గెషూరు రాజగు తల్మయికుమార్తె మాకాకు ఉద్భవించిన అబ్షాలోము. హగ్గీతు కనిన అదోనీయా. అబీతలు కుమారుడు షెఫట్యా. ఎగ్లా పుత్రుడు ఈత్రేయాము.
4. దావీదు హెబ్రోనున పరిపాలనము చేసిన ఏడున్నరయేండ్లలో ఈ ఆరుగురు కుమారులు కలిగిరి.
5. అతడు యెరూషలేమున ముప్పది మూడేండ్లు రాజ్యము చేసెను. అతనికి యెరూషలేమున పుట్టిన కుమారులు వీరు.
6. అమ్మీయేలు పుత్రికయైన బత్షెబ వలన షిమ్యా, షోబాబు, నాతాను, సొలోమోను అను నలుగురు కుమారులు జన్మించిరి.
7-8. ఇంకను దావీదునకు ఇభారు, ఎలీషామా, ఎల్పేలెతు, నోగా, నెఫెగు, యాఫీయ, ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు అను తొమ్మండుగురు తనయులు గలరు.
9. వీరితో పాటు ఉపపత్నులకు పుట్టిన పిల్లలు కూడా కలరు. అతనికి తామారు అను పుత్రికయును గలదు.
10-14. సొలోమోను వంశజులు క్రమముగా వీరు: సొలోమోను, రెహబాము, అబీయా, ఆసా, యెహోషాఫాత్తు, యెహోరాము, అహస్యా, యోవాషు, అమస్యా, అసర్యా, యోతాము, ఆహాసు, హిజ్కియా, మనష్షే, ఆమోను, యోషీయా.
15. యోషీయా నలుగురు కుమారులు యోహానాను, యెహోయాకీము, సిద్కియా, షల్లూము.
16. యెహోయాకీము పుత్రుడు యెకొన్యా, అతని తనయుడు సిద్కియా. ,
17-18. బందీగా కొనిపోబడిన యెకొన్యా కుమారులు వీరు: ఆసీరు, షల్తీయేలు, మల్కీరాము, పెదాయా, షెనస్సరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా,
19. పెదాయా తనయులు సెరుబ్బాబెలు, షిమీ. సెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా. షెలోమితు వారిరువురికి సోదరి.
20. మెషుల్లాము పుత్రులు హషూబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషబేష్షెదు అను ఐదుగురు.
21. హనన్యా వంశజులు వీరు: పెలట్యా, యెషయా, రెఫాయా, అర్నాను, ఓబద్యా, షెకన్యా.
22. షెకన్యా వంశజులు వీరు: షెమయా, హట్టూషు, ఇగాలు, బారియా, నెయర్యా, షాఫాతు అను ఆరుగురు.
23. నెయర్యా పుత్రులు ఎల్యోయేనయి, హిస్కియా, ఆస్రీకాము అనుముగ్గురు.
24. ఎల్యోయేనయి సుతులు హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయా, అనాని అను ఏడుగురు.
1. యూదా వంశజులు పెరెసు, హెస్రోను, కర్మి, హూరు, షోబాలు.
2. షోబాలు కొడుకు రెయాయా. అతని పుత్రుడు యహతు. అతని పుత్రులు అహూమయి, లహదు. వీరు సోరాతీయుల వంశజులు.
3-4. కాలేబు వలన ఎఫ్రాతాకు పుట్టిన పెద్ద కొడుకు హూరు. బేత్లెహేము హూరు వంశమునకు చెందినవాడు. హూరు వంశజులు అబీయేతాము, యెస్రేలు, ఈష్మా, ఇద్భాషు, వారి సోదరి హస్సెలెల్పోని. పెనూవేలు వంశజుడు గెదోరు. ఎజేరు వంశజుడు హూషా.
5. తెకోవా తండ్రియైన అష్షురునకు హేలా, నారా అను ఇద్దరు భార్యలుండిరి.
6. అతనికి నారా వలన అహూస్సాము, హెఫెరు, తెమెని, హహస్తారీ అను కుమారులు కలిగిరి.
7. హేలా వలన సెంతు, ఇశ్హారు, ఎత్నాను పుట్టిరి.
8. కోసు కుమారులు అనూబు, సోబేబా, హరుము కుమారుడైన అహర్హేలు వలన కలిగిన జాతులకు కోసు వంశకర్త.
9. యాబేసు అతని సోదరుల అందరిలో సుప్రసిద్ధుడు, యాబేసుతల్లి తీవ్రమైన ప్రసవవేదనతో అతనిని కనెను. కనుక అతనిని ఆ పేరు పెట్టెను.
10. అతడు యిస్రాయేలు దేవుని ప్రార్థించి "ప్రభూ! నన్ను దీవింపుము. నాకు భూమిని సమృద్ధిగా దయచేయుము. నీవు నాకు బాసటగానుండుము. ఎట్టి కీడును కలుగకుండ నన్ను కాపాడుము" అని మనవి చేసెను. దేవుడు అతని మొర ఆలించెను.
11. షూవా సోదరుడైన కెలూబునకు మోహీరు, అతనికి ఎష్టోను జన్మించిరి.
12. ఎష్టోను తనయులు బెత్రాఫా, పాసెయా, తెహిన్నా. తెహిన్నా కుమారుడు ఈర్నహషు. వీరు రెకా మండల నివాసులు.
13-14. కనసు కుమారులు ఒత్నీయేలు, సెరాయా. ఒత్నీయేలు పుత్రులలో హతాతు ఒకడు. ఓఫ్రా తండ్రి మెయోనొతాయి మరియొకడు. సెరాయా కుమారుడు యోవాబు. ఈ యోవాబు లోయలోని చేతి వృత్తుల వారికి మూలపురుషుడు.
15. యెఫున్నె కుమారుడగు కాలేబు తనయులు ఈరు, ఏలా, నాము. ఏలా కుమారుడు కనసు.
16. యహల్లేలు పుత్రులు సిపు, సిఫా, తీర్యా, అసరేలు.
17. ఎస్రా కుమారులు ఎతెరు, మెరెదు, ఏపేరు, యాలోను. మెరెదు ఐగుప్తు రాజుపుత్రిక బిత్యాను పెండ్లియాడి మిర్యాము అను కుమార్తెను, షమ్మయి, ఈష్బా అను కుమారులను కనెను. ఈష్బా ఎస్తెమోవాను కనెను.
18. మెరెదు యూదా తెగకు చెందిన మరియొక వనితను గూడ పెండ్లియాడి ముగ్గురు కుమారులను కనెను. వారు గెదోరు తండ్రియైన యెరెదు, సోకో తండ్రియైన హెబెరు, సనోవా తండ్రియైన యెకూతీయేలు.
19. హోదీయా నాహాము సోదరిని పెండ్లియాడెను. అతనికి గార్మి వంశమునకు చెందిన కెయిలా, మాకతి వంశమునకు చెందిన ఎష్టేమోవా జన్మించిరి.
20. షీమోను కుమారులు: అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోను. ఇషీ కుమారులు: సోహేతు, బెంసోహేతు.
21-22. యూదా కుమారుడు షేలా. అతని తనయులు వీరు: లేకా తండ్రియైన ఏరు, మరేషా తండ్రియైన లద్దా. బెతషేబాయలోని నేతపనివారికి ఈ లద్దాయే మూలపురుషుడు. యోకీము, కోసేబా నగరవాసులు, యోవాసు, మోవాబు వనితను పెండ్లి యాడి బేత్లెహేమున స్థిరపడిన సారఫు. ఇవి పురాతన చరిత్రలు.
23. ఈ ప్రజలు మట్టిపాత్రలు చేయువారు. రాజునకు కుండలు చేయుచు నెతాయీము, గెదేరా అను పట్టణములందు వసించిరి.
24. షిమ్యోను కుమారులు నెమూవేలు, యామీను, యారీబు, సెరా, షావూలు.
25-26. షావూలు వంశజులు క్రమముగా సల్లూము, మిబ్షాము, మిష్మా, హమ్మూవేలు, సక్కూరు, షిమీ
27. షిమీకి పదునారుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు కలరు. కాని అతని సోదరులకు సంతానము అంతగా కలుగలేదు. కనుక షిమీ తెగ, యూదా తెగ వలె వృద్ధి చెందలేదు.
28-33. షిమ్యోను తెగలు దావీదు పాలనా కాలము వరకు బేర్షెబ, మొలదా, హజర్షువాలు, బిల్హా, ఏసేము, తొలాదు, బెతూవేలు, హోర్మా, సిక్లాగు, బేత్మర్కా బోతు, హసర్సూసీము, బెత్బీరీ, షారీము అను నగరములలో వసించిరి. మరియు వారు ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను, ఆను అను ఐదునగరములందు, బాలు వరకు ఆ నగరములకు చుట్టుపట్ల వ్యాపించియున్న పల్లెలలో వసించిరి. తమ కుటుంబములనుగూర్చి, తాము వసించిన పట్టణ ములనుగూర్చి వారు పదిలపరచిన వివరములివి.
34. వారి వంశములకు నాయకులు ఈ క్రిందివారు: మెషోబాబు, యమ్లేకు, అమస్యా కుమారుడైన యోషా,
35. యోవేలు, మరియు అసియేలు మునిమనుమడు, సెరాయా మనుమడు, యోషిబ్యా కుమారుడైన యెహూ.
36. ఎల్యోయేనయి, యాకోబా, యెషోహాయా, అసాయా, అదీయేలు, యెసీమియేలు, బెనాయా,
37. సీసా, ఇతని మూలపురుషులు క్రమముగా షిఫి, అల్లోను, యెదాయా, షిమ్రి, షేమాయా.
38. ఈ నాయకులెల్లరు వారివారి కుటుంబములతో, వంశములతో వచ్చి బాగుగా వృద్ధిచెందిరి.
39. వారు పశువుల మేతకొరకు గెదోరు కనుమనుండి లోయ తూరుపు కొనవరకును ప్రయాణము చేసిరి.
40. అచట వారికి మంచి గడ్డిమైదానములు కనిపించెను. ఆ ప్రదేశము సువిశాలముగా శాంతియుతముగా యుండెను. అచట పూర్వము హాము వంశజులు వసించిరి.
41. యూదా రాజయిన హిజ్కియా కాలమున షిమ్యోను వంశజులు అచట పూర్వమునుండి నివసించుచున్న మెయినీము వారిని, వారి గుడారములను గుడిసెలను కూలద్రోసిరి. ఆ ప్రజలను పూర్తిగా నాశనముచేసి అచట స్థిరనివాసములు ఏర్పరచుకొని, తమ పేరు నమోదు చేసుకొనిరి. ఆ తావున వారికి పశుగ్రాసము సమృద్ధిగా లభించెను.
42. షిమ్యోను వంశమునకు చెందినవారు ఐదు వందలమంది సేయీరు కొండకువెళ్ళిరి. వారి నాయకులు ఈషి కుమారులైన పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు.
43. వారు అచట అమాలెకు వంశమున తప్పించుకుని మిగిలియున్న వారినెల్లవధించిరి. వారు నేటివరకు అచటనే వసించుచున్నారు.
1. యాకోబు పెద్దకుమారుడుడైన రూబేను వంశజులు వీరు: రూబేనునకు జ్యేషాధికారము కలదు. కాని అతడు తన తండ్రి ఉంపుడుగత్తెను కూడి నందున ఆ అధికారమును కోల్పోయెను. యోసేపు కుమారులకు ఆ అధికారము సిద్ధించెను.
2. అయినను యూదా తెగ మిగిలిన తెగలకంటె బలసంపన్నమయ్యెను. అందరిని పరిపాలించు రాజు ఆ తెగనే జన్మించెను.
3. యాకోబు జ్యేష్ఠపుత్రుడు రూబేను తనయులు హానోకు, పల్లు, హెస్రోను, కర్మి.
4-6. యోవేలు వంశజులు క్రమముగా వీరు: షమయా, గోగు, షిమీ, మీకా, రెయాయా, బాలు, బేరా. అస్సిరియా రాజు తిగ్లత్ పిలేసరు రూబేను తెగనాయకుడైన బేరాను బందీగా కొనిపోయెను.
7. రూబేను తెగనందలి వివిధ కుటుంబములకు నాయకులు యెయీయేలు, జెకర్యా, బేల. ఈ బేల వంశకర్తలు క్రమముగా అసాసు, షెమ, యోవేలు,
8. రూబేను తెగవారు అరోయోరు మండలమున స్థిరపడిరి. అచటినుండి నెబో, బాల్మెయోను నగరముల వరకు వ్యాపించిరి.
9. వారికి గిలాదు మండలమున విస్తారమైన మందలు కలవు. కనుక వారు తూర్పుదిశ యందు యూఫ్రటీసునది తీరమువరకు వ్యాపించి యున్న ఎడారి వరకుగల భూమినంతటిని ఆక్రమించు కొనిరి.
10. సౌలురాజు పరిపాలనా కాలమున ఆ ప్రజలు హగ్రీయులతో యుద్ధముచేసి వారిని ఓడించిరి. గిలాదునకు తూర్పు వైపుననున్న హగ్రీయుల భూమినంత ఆక్రమించుకొనిరి.
11. గాదు తెగవారు రూబేను తెగవారికి ఉత్తరదిక్కున స్థిరపడిరి. వారు బాషాను మండలమున సలేఖానగరము వరకు వ్యాపించిరి.
12. యోవేలు ఆ ప్రజలలో ప్రధానమైన వంశమునకు నాయకుడు. షాఫాము రెండవ పెద్దవంశమునకు నాయకుడు. యానయి, షాఫాతు అనువారు ఇతర తెగలకు నాయకులు.
13. ఆ తెగయందలి ఇతరజనులు ఈ క్రింది ఏడువంశములకు చెందినవారు. మిఖాయేలు, మెషుల్లాము, షెబ, యోరయి, యాకాను, సీయ, ఏబేరు.
14. వీరి మూలపురుషుడు అబీహాయిలు. ఇతని వంశకర్తలు క్రమముగా హూరి, యరోవ, గిలాదు, మిఖాయేలు, యషీషయి, యహదో, బూసు.
15. గూనీ మనుమడును అబ్దీయేలు తనయుడైన అహీ వారికి నాయకుడు.
16. వారు గిలాదు, బాషాను మండలములందును, వాని పరిసరములందును, షారోను మండలములోని పచ్చిక మైదానములలోను నివసించిరి.
17. యూదా రాజైన యోతాము, యిస్రాయేలు రాజు యెరోబాము కాలమున వారు పలు తెగలుగా ఏర్పడిరి.
18. రూబేను గాదు తెగవారిలో మనష్షే అర్ధతెగ ప్రజలలో 44, 760 మంది యోధులు ఉండెడివారు. వారు కత్తులు, విల్లులు, డాళ్ళను వాడగలవారు.
19. వారు యేతూరు, నఫీషు, నోదాబు మండలములలో వసించు హగ్రీయులతో పోరాడిరి.
20. వారు ప్రభువును నమ్మి అతని సహాయమును అర్థించిరి. కనుక అతడు వారి వేడికోలు ఆలించెను. హగ్రీయులను వారి సహాయులను యిస్రాయేలీయుల వశము చేసెను.
21. యిస్రాయేలీయులు శత్రుప్రజల దేశము నుండి 50,000 ఒంటెలు, 250,000 గొఱ్ఱెలు, 2000 గాడిదలు తోలుకొనివచ్చిరి. లక్షమంది బందీ లను చెరపట్టిరి.
22. ఆ యుద్ధము దేవుడు సంకల్పించినది కనుక యిస్రాయేలీయులు చాలమంది హగ్రీయులను వధించిరి. తాము ప్రవాసమునకు కొనిపోబడువారకు వారు హగ్రీయుల మండలముననే వసించిరి.
23. మనష్షే అర్ధతెగవారు బాషాను మండలమున బాల్హేర్మోను, సెనీరు, హెర్మోను పర్వతము సమీపము వరకు స్థిరపడిరి. వారి ప్రజలు తామర తంపరగా వృద్ధిచెందిరి.
24. వారి తెగలకు నాయకులు ఏఫేరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహ్దీయేలు. వీరెల్లరు ఆయా వంశములకు నాయకులు, సుప్రసిద్ధులు, మహావీరులు.
25. కాని ఈ ప్రజలు తమ పితరుల దేవుని విస్మరించిరి. ప్రభువు నాశనము చేసిన స్థానిక జాతుల దైవములను కొలిచిరి.
26. కనుక యిస్రాయేలు ప్రభువు అస్సిరియా రాజైన పూలు లేక తిగ్లత్పిలేసరు అనునాతని కోపమును రెచ్చగొట్టెను. అతడు రూబేను, గాదు తెగలమీదికి మనష్షే అర్థతెగ వారిమీదికి దండెత్తి వచ్చి వారిని బంధీలనుగా కొనిపోయెను. హాలా, హాబోరు, హారా నగరములందు, గోసాను నదీతీరము నందు వారికి శాశ్వతనివాసములు కల్పించెను.
1. లేవి కుమారులు గెర్షోము, కోహాతు, మెరారి.
2. కోహాతు తనయులు అమ్రాము, ఇష్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
3. అమ్రాము సంతానము అహరోను, మోషే, మిర్యాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియెజెరు, ఈతామారు.
4-14. ఎలియెజెరు వంశజులు క్రమముగా వీరు: ఫీనెహాసు, అబీషూవ, బుక్కి ఉస్సి, సెరహ్యా, మెరాయోతు, అమర్యా, అహీతూబు, సాదోకు, అహిమాసు, అజర్యా, యోహానాను, అసర్యా (సొలోమోను రాజు యెరూషలేమునిర్మించిన దేవాలయమున యాజకత్వము చేసినవాడితడే) అమర్యా, అహీతూబు, సాదోకు, షల్లూము, హిల్కియా, అజర్యా, సెరాయా, యెహోసాదాకు.
15,. ప్రభువు నెబుకద్నెసరు ద్వారా యూదా యెరూషలేము ప్రజలను ప్రవాసమునకు పంపెనుగదా! వారిలో యెహోసాదాకు ఒకడు. .
16. అవి కుమారులు గెర్షోము, కోహాతు, మెరారి.
17. గెరోము తనయులు లిబ్నీ, షిమీ.
18. కోహాతు కుమారులు అమ్రాము, ఇష్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
19. మెరారి కుమారులు మస్లి, మూషి,
20-22. గెర్షోమీయులు క్రమముగా వీరు:లిబ్నీ, యహతు, సిమ్మా, యోవా, ఇద్ధో, సెర, యెయాతిరయి.
23-24. కోహాతు వంశజులు క్రమముగా వీరు: అమ్మీనాదాబు, కోరా, అస్సీరు, ఎల్కానా, ఎబ్యాసాపు, అస్సీరు, తాహతు, ఊరియేలు, ఎస్సీయా, షావూలు.
25-27. ఎల్కానా కుమారులు అమాసయి, అహీమోతు. అహీమోతు వంశజులు క్రమముగా వీరు: ఎల్కానా, జోఫయి, నహతు, ఎలియాబు, యెరోహాము, ఎల్కానా.
28. సమూవేలు కుమారులు యోవేలు, అబీయా.
29-30. మెరారి వంశీయులు క్రమముగా వీరు: మహ్లి, లిబ్నీ, షిమీ, ఉస్సా, షిమ్యా, హగ్గీయా, అసాయా.
31. నిబంధనమందసమునకు స్థలము ఏర్పాటు అయిన తరువాత దేవుని ఆలయమునందు సంగీత సేవకొరకు దావీదు గాయకులను నియమించెను.
32. సొలోమోను యెరూషలేములో యావే మందిరము కట్టినంత వరకు వీరు సమావేశపు గుడారము ముంగిట వంతులవారిగా పాటలుపాడిరి.
33-38. ఈ గాయకుల వంశవృక్షములివి: కోహాతు వంశజులు వీరు: సమూవేలు కుమారుడగు యోవేలు కుమారుడు హేమాను మొదటి గాయక బృందమునకు నాయకుడు. ఇతని పూర్వులు క్రమముగా వీరు: యోవేలు, సమూవేలు, ఎల్కానా, యెరోహాము, ఎలీయేలు, తోవా, సూపు, ఎల్కానా, మహతు, అమాసయి, ఎల్కానా, యోవేలు, అజర్యా, జెఫన్యా, తాహతు, అస్సీరు, ఎబ్యాసాపు, కోరా, ఇష్హారు, కోహాతు, లేవి, యిస్రాయేలు.
39-43. హేమాను సోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కన నిలుచువాడు. ఇతని పూర్వులు క్రమముగా బెరఖ్యా, షిమ్యా, మికాయేలు, బాసేయా, మల్కీయా, యెత్నీ, సెర, అదాయా, ఎతాను, సిమ్మా, షిమీ, యాహతు, గెర్షోము, లేవి.
44-47. మెరారి తెగకుచెందిన ఎతాను ఎడమ ప్రక్కన నిలుచువాడు. ఇతని పూర్వులు క్రమముగా కీషి, అబ్ది, మల్లూకు, హషబ్యా, అమస్యా, హిల్కీయా, అమ్సీ, బానీ, షమేరు, మహ్లి , మూషీ, మెరారి, లేవి.
48. పైవారి సోదరులైన ఇతర లేవీయులు ప్రభు గుడారమున ఇతర సేవలు చేయుటకు నియమింపబడిరి.
49. అహరోను, అతని వంశజులు ధూప పీఠము మీద సాంబ్రాణి పొగ వేసిరి. బలిపీఠము మీద దహన బలులర్పించిరి. మహాపవిత్రస్థలమున జరుగు పరిచర్యనంతటిని, యిస్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తార్ధబలులను వారే నిర్వహించిరి. ప్రభు దాసుడైన మోషే ఆజ్ఞాపించినట్లే వారు ఈ కార్యము లెల్లచేసిరి.
50-53. అహరోను వంశజులు క్రమముగా వీరు: ఎలియెజెరు, ఫీనెహాసు, అబీషూవ, బుక్కి ఉస్సీ, సెరహ్యా, మెరాయోతు, అమర్యా, అహీతూబు, సాదోకు, అహీమాసు.
54. కోహాతు వంశమునకు చెందిన అహరోను సంతతివారైన యాజకులకు లభించిన భాగమిది. లేవీయులకు ఉద్దేశింపబడిన భూమిలో వారికి మొదటి భాగమును పంచియిచ్చిరి.
55. యూదా రాజ్యము లోని హెబ్రోను, దాని చుట్టుపట్టులగల పచ్చిక మైదానములు వారికి లభించెను.
56. కాని ఈ నగరమునకు చెందిన పల్లెలను, పొలములను యెఫున్నె కుమారుడగు కాలెబునకు ఇచ్చిరి.
57-59. అహరోను సంతతివారికి వచ్చిన నగరములేవనగా: ఆశ్రయ నగరమైన హెబ్రోను, యాత్తీరు, లిబ్నా, ఎస్తేమోవా, హిలేను, దెబీరు, ఆషాను, బేత్ షేమేము అను నగరములు, వాని గడ్డి బీడులుకూడ వారికి చెందెను.
60. బెన్యామీను మండలమున వారికి గేబా, అలెమెతు, అనాతోతు అను నగరములు వాని గడ్డి బీడులతో లభించెను. ఈ రీతిగా వారి వంశములకు లభించిన నగరములు మొత్తము పదుమూడు.
61. కోహతీయుల వంశములో మిగిలినవారికి అర్ధతెగ నుండి అనగా మనష్షే అర్ధతెగలవారి స్థానములలో నుండి పదిపట్టణములను కుటుంబముల వారిగా చీట్లువేసి పంచియిచ్చిరి.
62. యిస్సాఖారు, ఆషేరు, నఫ్తాలి అను తెగలను, బాషానునందలి మనష్షే స్థానములలోనుండి పదుమూడు నగరములను తీసికొని గెర్షోము వంశీయులకు కుటుంబములవారిగా పంచియిచ్చిరి.
63. అదే రీతిగా రూబేను, గాదు, సెబూలూను తెగలవారి స్థానములలోనుండి పండ్రెండు నగరములను మెరారి వంశీయులకు కుటుంబములవారిగా ఓట్లు వేసి పంచి యిచ్చిరి.
64. ఈ రీతిగా యిస్రాయేలీయులు, లేవీయులకు ఆయా నగరములను, వాని చుట్టుపట్లగల గడ్డిమైదానములను ఇచ్చిరి.
65. పైన పేర్కొన బడిన యూదా, షిమ్యోను, బెన్యామీను మండలములలోని నగరములను ట్లు వేసి పంచియిచ్చిరి.
66-70. కోహాతు వంశములో కొన్ని కుటుంబములకు ఎఫ్రాయీము మండలమున కొన్ని పొలిమేర నగరములును, వానికి చెందిన గడ్డి బీడులును లభించెను. అవి ఇవి: నరహంతలు ఆశ్రయము పొందగలిగినదై ఎఫ్రాయీము కొండలలోనున్న షెకెము, గేసేరు, యాక్మెయాము, బేత్ హోరోను, అయ్యాలోను, గాత్ రిమ్మోను. ఇంకను మన అర్ధతెగ నుండి ఆనేరు, బిలియాము.
71-76. గెర్షోము వంశమునకు చెందిన కుటుంబములకు ఈ క్రింది నగరములు, వాని చుట్టుపట్లగల గడ్డి బీడులు లభించెను. మనష్షే అర్ధతెగ నుండి బాషానునందలి గోలాను, అష్టారోతు. యిస్సాఖారు మండలము నుండి కాదేషు, దాబెరతు, రామోతు, ఆనెము. ఆషేరు మండలము నుండి మాషాలు, అబ్దోను, హుక్కోకు, రెహోబు. నఫ్తాలి మండలము నుండి కాదేషు, గలిలీయలోని హమ్మోను, కిర్యతాయీము.
77-81. మెరారి వంశములో మిగిలిన కుటుంబములకు ఈ క్రింది నగరములును మరియు వాని చుట్టుపట్లగల గడ్డి బీడులును లభించెను. సెబూలూను మండలము నుండి రిమ్మోను, తాబోరు మరియు వాని చుట్టుపట్లగల గడ్డి బీడులును, యెరికోకు ఆవల యోర్దానునకు తూర్పుననుండు రూబేను తెగస్థానము నుండి క్రింది నగరములు ఇవి: పీఠభూమిలోని బేసేరు మరియు యహసు, కెదెమోతు, మేఫాతు అను పట్టణములు మరియు వాని చుట్టుపట్లగల గడ్డి బీడులు. గాదు మండలమునుండి గిలాదునందలి రామోతు, మహనాయీము, హెష్బోను, యాసెరు, వాని చుట్టుపట్ల గల గడ్డి బీళ్ళు ఇవ్వబడెను.
1. యిస్సాఖారు తనయులు తోలా, పువా, యాషూబు, షిమ్రోను అను నలుగురు.
2. తోలా కుమారులు ఉస్సీ, రెఫాయా, యెరీయేలు, యహ్మాయి, యిబ్సాము, షెమూవేలు. వారు తోలా వంశములో ఆయా కుటుంబములకు నాయకులు, యుద్ధవీరులు. దావీదుకాలమున వీరి వంశజులు 22,600 మంది ఉండిరి.
3-4. ఉస్సీ కుమారుడు ఇస్రహ్యా. అతని పుత్రులు మికాయేలు, ఓబద్యా, యోవేలు, ఈష్యా. వీరు ఐదుగురు ఆయా కుటుంబములకు నాయకులు. వారికి పలువురు భార్యలును, పెక్కండ్రు కుమారులును కలరు. కనుక వారి వంశజులు యుద్ధమునకు 36 వేలమంది యోధులను సిద్ధము చేయకలిగిరి.
5. యిస్సాఖారు వంశమంతట కలసి 87 వేలమంది యోధులుండిరి.
6. బెన్యామీను పుత్రులు బేల, బేకేరు, యెదీయేలు అను ముగ్గురు.
7. బేల కుమారులు ఎస్బోను, ఉస్సి, ఉస్సీయేలు, యెరీమోతు, ఈరి అను ఐదుగురు. వారెల్లరు ఆయా కుటుంబములకు నాయకులు, గొప్ప యోధులు. వారి వంశజులు 22,034 మంది యుండిరి.
8. బేకేరు తనయులు సెమీరా, యోవాసు, ఎలియెజెరు, ఎల్యోయేనయి, ఒమీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, అలేమేతు.
9. వీరెల్లరును ఆయా కుటుంబములకు నాయకులు, గొప్ప యోధులు. వారి వంశజులు 20,200 మంది ఉండిరి. వారెల్లరును యుద్ధము చేయగలవారు.
10. యెదీయేలు కుమారుడు బిల్హాను. అతని పుత్రులు యేమూషు, బెన్యామీను, ఏహూదు, కెనానా, సేతాను, తర్షీషు, అహీషహరు.
11. వీరెల్లరును ఆయా కుటుంబములకు నాయకులు, యోధులు. వీరి వంశజులు 17,200 మంది యుండిరి. వీరెల్లరును యుద్ధము చేయగలవారు.
12. షుప్పీము, హుప్పీము ఈరు కుమారులు. అహేరు కుమారుడు హషీము.
13. నఫ్తాలి కుమారులు యహసీయేలు, గూని, యేజెరు, షల్లూము. వీరెల్లరు బిల్హాకు జన్మించినవారు.
14. మనష్షేకు అరామియా ఉపపత్ని వలన అస్రీయేలు, మాకీరు అను పుత్రులు కలిగిరి. మాకీరు కుమారుడు గిలాదు.
15. మాకీరు హుప్పీము, షుప్పీముల సహోదరిని పెండ్లియాడెను. దాని సహో దరి పేరు మాకా. మాకీరు రెండవ కుమారుడు సెలో ఫెహాదు. ఇతనికి ఆడుబిడ్డలు మాత్రమే కలిగిరి.
16. మాకీరు భార్య మాకాకు పెరేషు, షెరెషు అను కుమారులు కలిగిరి. పెరేషు సుతులు ఊలాము, రాకెము.
17. ఊలాము కుమారుడు బేదాను. వీరెల్లరు గిలాదు వంశజులు. ఈ గిలాదు మాకీరు కుమారుడు, మనష్షే మనుమడు.
18. మాకీరునకు సహోదరియైన హమ్మోలెకేతునకు ఇషోదు, అబీయెజెరు, మహ్లా అను పుత్రులు కలిగిరి.
19. ఫెమిదా కుమారులు అహీయాను, షెకెము, లికీ, అనీయాము.
20-21. ఎఫ్రాయీము వంశజులు క్రమముగా వీరు: షూతలాహ్, బెరెదు, తాహతు, ఎలాదా, తాహతు, సాబాదు, షూతలాహ్. ఎఫ్రాయీముకు షూతలాహ్ కాక యేజెరు, ఎల్యాదు అను మరి ఇరువురు పుత్రులు కలరు. వీరు గాతు ప్రజల పశువులను అపహరింపబోగా వారు వీరిని చంపిరి.
22. ఎఫ్రాయీము వారి మరణమునకు చాలనాళ్ళు శోకించెను. అతని సోదరులు అతనిని ఓదార్చిరి.
23. అటుతరువాత ఎఫ్రాయము భార్యను కూడగా ఆమె గర్భవతియై ఒక కుమారుని కనెను. తన కుటుంబమునకు కీడు వాటిల్లినదని తెలియజేయుచు ఎఫ్రాయీము ఆ బిడ్డనికి బెరియా అని పేరు పెట్టెను.
24. ఎఫ్రాయీమునకు షేరా అను కుమార్తె గలదు. ఆమె ఎగువ బేత్ హోరోను, దిగువ బేత్ హోరోను, ఉస్పేను షేరా అను నగరములను నిర్మించెను.
25-27. ఎఫ్రాయీమునకు పుట్టిన కుమారులు రేఫా, రెషెఫు. అతని వంశజులు క్రమముగా రెషేపు, తేలా, తహాను, లాదాను, అమ్మీహూదు, ఎలీషామా, నూను, యెహోషువ.
28. వీరు బేతేలును దాని చుట్టు పట్లగల గ్రామములను ఆక్రమించుకొనిరి. తూర్పు నారానువరకు పడమరయందు గేసేరు వరకుగల గ్రామములను వారు స్వాధీనము చేసికొనిరి. షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములు, వాని చుట్టుపట్ల గల పట్టణములు వారికే చెందెను.
29. మనష్షే వంశజులు బేత్షేయాను, తానాకు, మెగిద్ధో, దోరు పట్టణములను వాని చుట్టుపట్ల గల గ్రామములను ఆక్రమించుకొనిరి. ఈ తావులందెల్ల యాకోబు కుమారుడు యోసేపు వంశజులు వసించిరి.
30. ఆషేరు కుమారులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. అతని పుత్రిక పేరు సెరా.
31. బెరీయా కుమారులు హేబేరు, మల్కీయేలు. మల్కీయేలు బిర్సాయీతుకు తండ్రి.
32. హేబేరు కుమారులు యఫ్లేతు, షోమేరు, హోతాము. అతని పుత్రిక పేరు షువా.
33. యఫ్లేతు ముగ్గురు కుమారులు పాసకు, బింహాలు, అష్వతు.
34. షోమేరు తనయులు అహి, రోగా, యెహుబ్బా, ఆరాము.
35. హేలేము నలుగురు కుమారులు సోఫా, ఇమ్నా, షెలెషు, ఆమాలు.
36-37. జోఫా పుత్రులు సువా, హర్నెఫెరు, షూవాలు, బేరి, ఇమ్రా, బేజేరు, హోదు, షమ్మా, షిల్హా, ఇత్రాను, బేరా.
38. యేతేరు వంశజులు యెఫున్నె, పిస్పా, ఆరా.
39. ఉల్లా వంశజులు ఆరా, హన్నియేలు, రిసియా.
40. వారెల్లరు ఆషేరు వంశజులు. వారు ఆయా కుటుంబములకు నాయకులు, గొప్ప యోధులు. ఆషేరు వంశజులు ఇరువది ఆరు వేలమంది ఉండిరి. వారెల్లరును యుద్ధము చేయ గలవారు.
1-2. బెన్యామీను కుమారులు వరుసగా వీరు: బెల, అష్బేలు, అహర, నోహ, రాఫా.
3-5. బెల వంశజులు అద్దారు, గెరా, అబీహూదు, అబీషువా, నామాను, అహోవా, గెరా, షెఫూఫాను, పూరాము.
6-7. ఏహూదు వంశజులు ఉస్సా, అహీహూదు, నామాను, అహీయ, గెరా. వీరు గేబాలోని ఆయా వంశములకు నాయకులు. కాని ఆ వంశీయులు వీరిని మహతునకు ప్రవాసముగా తీసుకొనిపోయిరి. ఉస్సా, అహీహూదు అను వారికి తండ్రియైన గెరా వారిని తీసికొనిపోయెను.
8-10. షహరాయీము తన భార్యలైన హూషీము, బారాలను పరిత్యజించెను. తరువాత అతడు మోవాబు దేశమున వసించి, అచట హోదేషును పెండ్లియాడి యోబాబు, జిబ్య, మేషా, మల్కము, యెయూసు, సాక్యా, మిర్మా అను కుమారులను కనెను. వారెల్లరు ఆయావంశములకు నాయకులైరి.
11. షహరాయీమునకు హూషీము అను భార్యవలన అబితూబు, ఎల్పాలు అను కుమారులు కలిగిరి.
12. ఎల్పాలు కుమారులు ఎబెరు, మిషాము, షెమెదు. థైమెదు ఓనో, లోదు పట్టణములను వాని చుట్టుపట్లగల పల్లెలను నిర్మించెను.
13-16. బెరీయ, షెమ అనువారు అయ్యాలోను నగరమునందలి వంశములకు నాయకులు. వీరు గాతు నగరవాసులను తరిమివేసిరి. బెరీయ వంశజులు అహ్యో, షాషకు, యెరెమోతు, జెబద్యా, అరాదు, ఏదెరు, మికాయేలు, ఇష్పా, యోహా.
17-18. జెబద్యా, మెషుల్లాము, హిజ్కీ హేబెరు, ఇష్మెరాయి, ఇజ్లియా, యోబాబు అనువారు ఎల్పాలు వంశజులే.
19-21. షిమీ వంశజులు యాకీము, సిక్రి, సబ్ది, ఎల్యేనయి, జిల్లెతయి, ఎలీయేలు, అదాయా, బెరాయా, షిమ్రాతు అనువారు.
22-25. షాషకు వంశజులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, అబ్దోను, సిక్రి, హానాను, హానన్యా, ఏలాము, అంతోతియా, ఇఫెదయా, పెనూవేలు అనువారు.
26-27. యెరోహాము వంశజులు షంషేరయి, షెహర్యా, అతల్యా, యారెష్యా, ఏలీయా, సిక్రీ.
28. వారెల్లరును ఆయా వంశములకు నాయకులు మరియు ప్రము ఖులై యెరూషలేముననే వసించిన వారు.
29-32. గిబ్యోను తండ్రి యెయోవేలు గిబ్యోనున వసించెను. అతని భార్య పేరు మాకా. అతని కుమారులు వరుసగా అబ్దోను, సూరు, కీషు, బాలు, నాదాబు, గేదోరు, అహ్యో, జేకెరు, షిమ్యా తండ్రి మిక్లోతు. వీరి వంశజులు యెరూషలేమున తమ బంధువుల చెంత వసించిరి.
33. నేరు కుమారుడు కీషు. అతని కుమారుడు సౌలు. సౌలు తనయులు యోనాతాను, మల్కీషువ, అబీనాదాబు, ఎష్పాలు.
34. యోనాతాను కుమా రుడు మెరిబ్బాలు. అతని తనయుడు మీకా.
35. మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ, ఆహాసు.
36. ఆహాసు కుమారుడు యెహోయాదా. అతని తనయులు అలేమెతు, అజ్మావెతు, సిమ్రీీ.
37. సిమ్రీ వంశజులు మొసా, బిన్యా, రెఫాయా, ఎల్యాసా, ఆసేలు.
38. ఆసేలు కుమారులు అజ్రికాము, బోకేరు, యిష్మాయేలు, షేయర్యా, ఓబద్యా, హానాను.
39. ఆసేలు సోదరుడైన ఏషెకు తనయులు ఊలాము, యెయూషు, ఎలీఫేలెటు.
40. ఊలాము తనయులు ఆరితేరిన యోధులు, విలుకాండ్రు. అతని కుమారులు, మనుమలు అందరు కలిసి నూట ఏబదిమంది. పైని పేర్కొనబడిన వారందరు బెన్యామీను వంశజులే.
1. యిస్రాయేలీయులను వారివారి కుటుంబముల ప్రకారము గణించి వారి పేర్లను యిస్రాయేలు రాజులచరిత్రలో లిఖించిరి. యూదా నివాసులను వారి పాపములకు గాను బబులోనియాకు బందీలుగా కొనిపోయిరి.
2. ఆ ప్రవాసమునుండి మరలివచ్చి యిస్రాయేలు దేశములోని తమ నగరములను, పొలములను తిరిగి స్వాధీనము చేసికొనినవారిలో మొదటివారు యాజకులు, లేవీయులు, నెతీనీయులు'.
3. యూదా, బెన్యామీను, ఎఫ్రాయీము, మనష్షే తెగలకు చెందినవారు యెరూషలేమునకు వచ్చి అచట స్థిరపడిరి.
4-6. యూదా తెగకు చెందినవారు 690 మంది యెరూషలేమున వసించిరి. యూదా కుమా రుడైన పేరెసు వంశజులకు నాయకుడు ఉత్తయి. ఇతని పూర్వులు క్రమముగా అమ్మీహూదు, ఒమ్రి, ఇమ్రి, బాని. షేలా వంశజులకు నాయకుడు అసాయ. సెరా వంశజులకు నాయకుడు యెవూయేలు.
7-9. బెన్యామీను తెగలలో ఈ క్రిందివారు యెరూషలేమున వసించిరి. షల్లు-ఇతని పూర్వులు క్రమముగా మెషుల్లాము, హోదవ్యా, హస్సెనూయా, యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రి మనుమడును ఉజ్జి కుమారుడైన ఏలా. మెషుల్లాము - ఇతని పూర్వులు క్రమముగా షేపట్యా, రెవూవేలు, ఇబ్నియా. ఈ తెగలవారు మొత్తము 956 మంది యెరూషలేమున వసించిరి. పైన పేర్కొనబడిన వారందరు ఆయా వంశీయులకు నాయకులు.
10-13. ఈ క్రింది యాజకులు యెరూషలేమున నివసించిరి: యెదాయా, యెహోయారీబు, యాకీను. దేవళమున ప్రధానాధికారియైన అజర్యా- ఇతని పూర్వులు క్రమముగా హిల్కీయా, మెషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహిటూబు. అదయా - ఇతని పూర్వులు క్రమముగా యెరోహాము, పాష్షూరు, మల్కియా. మాసయి - ఇతని పూర్వులు క్రమముగా అదీయేలు, యహజేరా, మెషుల్లాము, మెషిల్లీమీతు, ఇమ్మెరు. ఆయా కుటుంబములకు నాయకులైన ఈ యాజకులు మొత్తము 1760 మంది. వారు దేవాలయ కార్యములలో నిపుణులు.
14-16. ఈ క్రింది లేవీయులు యెరూషలేమున వసించిరి: షెమాయా-ఇతని పూర్వులు క్రమముగా హష్షూబు, అజ్రీకాము, హషబ్యా, మెరారి, బక్బక్కరు, హెరేషు, గాలాలు. మత్తన్యా-ఇతని పూర్వులు క్రమముగా మీకా, సిక్రీ, ఆసాపు. షెమాయా కుమారుడు ఓబద్యా-ఇతని పూర్వులు క్రమముగా షేమాయా, గాలాలు, ఎదూతూను. నెటోఫా మండలమున జీవించిన బెరక్యా - ఇతని పూర్వులు క్రమముగా ఆసా, ఎల్కానా.
17. ఈ క్రింది దేవాలయ ద్వారపాలకులు యెరూషలేమున వారి సహోదరులతో వసించిరి: షల్లూము, అక్కూబు, తల్మోను, అహీమాను. షల్లూము వీరికి నాయకుడు.
18. వారి వంశజులు నేటివరకు దేవాలయమున తూర్పుదిశయందున్న రాజద్వారమునకు పాలకులుగా ఉండిరి. పూర్వము వీరు లేవీయుల శిబిరపు ద్వారమునకు కాపుండెడివారు.
19. కోరా మునిమనుమడును ఎబ్యాసాపు మనుమడును కోరె కుమారుడైన షల్లూము. కోరా వంశజులు సాన్నిధ్యపు గుడారము గుమ్మమునకు కాపుండెడివారు. వారి పూర్వులుకూడ ప్రభువు శిబిరమునకు కాపుండెడివారు.
20. ఎలియెజెరు కుమారుడు ఫీనెహాసు వారికొకప్పుడు అధికారిగానుండెను. ప్రభువతనికి తోడైయుండెను.
21. మెషెలెమ్యా కుమారుడు జెకర్యాగూడ ఒకప్పుడు సాన్నిధ్యపు గుడారము గుమ్మమునకు కాపుండెడివాడు.
22. ఈ ద్వారపాలకులందరు కలిసి 212 మంది. వారివారి గ్రామముల ప్రకారము వారిని నమోదు చేసిరి. దావీదు, సమూవేలు ప్రవక్త వారి పూర్వులను ఈ ఉద్యోగమున నియమించిరి.
23. అప్పటినుండి వారును, వారి కుమారులు దేవాలయ ద్వారములకు కావలికాయుచు వచ్చిరి.
24. ఉత్తర దక్షిణములందు, తూర్పు పడమరలందు గల నాలుగుద్వారములకు నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉండెడివారు.
25. పల్లెలలో వసించు ఆ ద్వారపాలకుల బంధువులు వచ్చి వారముపాటు ద్వారములకు కావలికాసెడివారు.
26. నలుగురు ప్రధాన ద్వారపాలకులు లేవీయులే. దేవాలయరక్షణ బాధ్యత వారిదే. దేవాలయములోని గదులను, వానిలోని సామగ్రిని కాపాడునదికూడ వారే.
27. వారెల్లరు దేవాలయము దాపున వసించిరి. వారే ఆలయాన్ని కాచునది, ఉదయము దాని తలుపులు తెరచునది.
28. ఇతర లేవీయులు ఆరాధనలోవాడు వివిధ పాత్రలమీద అధికారులుగానుండిరి. వారు ఈ పాత్ర లను ఇచ్చునప్పుడు, పుచ్చుకొనునపుడుగూడ లెక్క పెట్టెడివారు.
29. లేవీయులలో ఇంక కొందరు ఆరాధనలో వాడు పరికరముల మీద మరియు పిండి, ద్రాక్షసారాయము, నూనె, సాంబ్రాణి, సుగంధ ద్రవ్యములు మొదలైన వానిమీద అధికారులుగ నుండిరి.
30. కాని సుగంధ ద్రవ్యములను మిశ్రమము చేయువారు మాత్రము యాజకులే.
31. మత్తిత్యా అను లేవీయుడు పెనముమీద కాల్చి బలిగా అర్పించు రొట్టెలమీద అధికారిగా నుండెను. ఇతడు షల్లూము పెద్దకొడుకు, కోరా వంశజుడు.
32. ప్రతి విశ్రాంతిదినమున దేవాలయమున అర్పించు రొట్టెలను ప్రతి సబ్బాతు దినమున తగిన విధముగా వరుసక్రమములో సిద్ధముచేయు పూచీ కోహాతు వంశజులది.
33. దేవాలయమున సంగీతముపాడుట మరి కొందరు లేవీయుల పూచీ. వారి నాయకులు దేవాలయ గృహములలోనే వసించిరి. వారు రేయింబవళ్ళు గానము చేయవలయును గనుక వారికి ఇతర పనులేమి ఒప్పజెప్పరైరి.
34. పైన పేర్కొనబడిన వారు ఆయా వంశములకు చెందిన లేవీయ కుటుంబములకు పెద్దలు. ఈ నాయకులు యెరూషలేముననే వసించిరి.
35-38. గిబ్యోను తండ్రియైన యెయీవేలు గిబ్యోనున వసించెను. అతని భార్య పేరు మాకా. అతని కుమారులు వరుసగా అబ్దోను, జూరు, కీషు, బాలు, నేరు, నాదాబు, గేదోరు, అహ్యో, జెకర్యా, షిమెయాము తండ్రి మిక్లోతు. వీరి వంశజులు యెరూషలేమున తమ బంధువులచెంత వసించిరి.
39. నేరు కుమారుడు కీషు. అతని కుమారుడు సౌలు. సౌలు తనయులు యోనాతాను, మల్కీషువ, అబీనాదాబు, ఎష్బాలు.
40. యోనాతాను కుమా రుడు మెరీబ్బాలు. అతని తనయుడు మీకా.
41. మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ, ఆహాసు.
42-43. ఆహాసు కుమారుడు యరా'. అతని కుమారులు అలెమెతు, అజ్మావెతు, సిమ్రీ. సిమ్రీ వంశజులు క్రమముగా మోసా, బిన్యా, రెఫాయా, ఏల్యాసా, ఆసేలు.
44. ఆసేలు తనయులు అజ్రికాము, బోకేరు, యిష్మాయేలు, షేయర్యా, ఓబద్యా, హానాను.
1. ఫిలిస్తీయులు యిస్రాయేలీయుల మీదికి యుద్ధమునకు వచ్చిరి. యిస్రాయేలీయులు రణము నుండి పారిపోవుచుండగా ఫిలిస్తీయులు వారిని వెన్నాడి గిల్బోవా కొండమీద వధించిరి.
2. శత్రువులు సౌలును, అతని కుమారులను చుట్టుముట్టిరి. యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అను సౌలు కుమారులను సంహరించిరి.
3. సౌలు చుట్టూ పోరు ముమ్మరమయ్యెను. కొందరు విలుకాండ్రు అతనిని బాణములతో కొట్టి గాయపరచిరి.
4. అతడు తన అంగరక్షకునితో “నీ బాకుతో నన్ను పొడిచిచంపుము, లేదేని సున్నతి సంస్కారము లేని ఈ ఫిలిస్తీయులు నా మీదబడి కసిదీర్చుకొందురు” అనెను. కాని అంగరక్షకుడు అతనిని చంపుటకు భయపడెను. సౌలు తన బాకును తీసి దానిమీదపడి ప్రాణములు విడచెను.
5. అటుల సౌలు చనిపోవుటచూచి అతని అంగ రక్షకుడు తానును తన కత్తిమీద తానే పడి అసువులు వీడెను.
6. ఆ రీతిగా సౌలు అతని ముగ్గురు కుమారులును గతించిరి. అతని కుటుంబము నాశనమయ్యెను.
7. క్రిందిలోయలో వసించు యిస్రాయేలీయులు తమ సైన్యము పారిపోయెననియు, సౌలు, అతని కుమారులు పోరున కూలిరనియు విని తమ నగరములను విడిచి పారిపోయిరి. అంతట ఫిలిస్తీయులు ఆ పట్టణములను ఆక్రమించుకొని వానిలో వసింపమొదలిడిరి.
8. మరునాడు ఫిలిస్తీయులు శవములను దోచుకొనుటకురాగా గిల్బోవా కొండమీద సౌలు, అతని కుమారుల శవములు కనిపించెను.
9. వారు సౌలు తల తెగనరికిరి. అతని ఆయుధములను ఊడదీసిరి. వానిని ఫిలిస్తీయ దేశము నలుమూలలకు పంపి తమ దేవతలకును ప్రజలకును విజయ వార్తలను చాటించిరి.
10. వారు సౌలు ఆయుధములను తమ దేవళమున భద్రపరచిరి. అతని తలను దాగోను మందిరమున వ్రేలాడగట్టిరి.
11. గిలాదునందలి యాబేషు పౌరులు ఫిలిస్తీయులు సౌలుకు అపకారము చేసిరని వినిరి.
12. వారి వీరులందరును పయనమై వచ్చి సౌలు శవమును, అతని తనయుల శవములను, యాబేషుకు కొనివచ్చిరి. ఒక సింధూరపువృక్షము క్రింద వారి అస్థులను పాతిపెట్టి ఏడుదినములు ఉపవాసముండిరి.
13. ప్రభువును లక్ష్యము చేయలేదు కనుక సౌలు చచ్చెను. అతడు ప్రభుని ఆజ్ఞను త్రోసిపుచ్చెను. చనిపోయినవారి భూతములను ఆవాహము చేయు వారిని సంప్రదించెను.
14. ప్రభువును సంప్రదింపడయ్యెను కనుక ప్రభువు సౌలును సంహరించి అతని రాజ్యమును యిషాయి కుమారుడైన దావీదు వశము చేసెను.
1. యిస్రాయేలు తెగలన్ని హెబ్రోనున ఉన్న దావీదునొద్దకు వచ్చి “మేము నీకు ఎముకనంటిన వారలము, రక్తసంబంధులము.
2. సౌలు పరిపాలనా కాలమునగూడ యుద్ధములందు యిస్రాయేలీయులను నడిపించినవాడవు నీవే. నీ దేవుడైన ప్రభువు నీవు తన ప్రజలకు నాయకుడవు, ఏలికవు అగుదువని ప్రమాణము చేసెను” అనిరి.
3. ఆ రీతిగా యిస్రాయేలు పెద్దలందరు హెబ్రోనుననున్న దావీదుచెంతకు రాగా అతడు దేవునిసమక్షమున వారితో నిబంధనము చేసికొనెను. వారక్కడ దావీదుని అభిషేకింపగా ప్రభువు సమూవేలు ద్వారా చెప్పినట్లే అతడు యిస్రాయేలీయులకు రాజయ్యెను.
4. దావీదు యిస్రాయేలీయులతో పోయి యెరూషలేమును ముట్టడించెను. అప్పుడు ఆ నగరము పేరు యెబూసు. ఆ నగరవాసులకు యెబూసీయులని పేరు.
5. వారు దావీదుతో నీవు ఈ నగరమున అడుగుపెట్టజాలవని బింకములాడిరి. కాని దావీదు వారి దుర్గమైన సియోనును పట్టుకొనెను. దానికే తరువాత దావీదునగరమని పేరు వచ్చినది.
6. అందరికంటే ముందుగా యెబూసీయుని చంపిన వానిని సైన్యాధిపతిని చేయుదునని దావీదు పలికెను. సెరూయా పుత్రుడైన యోవాబు పైకెక్కిపోయి యెబూసీయులను ఎదుర్కొనెను. కనుక అతడు సైన్యాధిపతి అయ్యెను.
7. దావీదు బలమైన ఆ కోటలో నివసింపమొదలిడెను. కనుక దానికి దావీదునగరమని పేరువచ్చెను.
8. అతడు తూర్పువైపున పల్లమును పూడ్చిన మిల్లో అను తావునుండి మొదలు పెట్టి ఆ నగరమును పునర్నిర్మించెను. యోవాబు నగరమున మిగిలిన భాగమును బాగుచేయించెను.
9. సైన్యములకధి పతియైన ప్రభువు దావీదునకు బాసటగా నుండెను కనుక అతడు నానాటికి మహా బలసంపన్నుడయ్యెను.
10. దావీదు వీరుల పేరులివి: యిస్రాయేలీయులతోపాటు వీరు కూడా దావీదు రాజగుటకు తోడ్పడిరి. అతడు రాజగునని ప్రభువు ముందుగానే ప్రమాణము చేసెను. ఈ వీరులు అతని రాజ్యమును సురక్షితము చేసిరి.
11. హక్మోని వంశమునకు చెందిన యాషోబాము మొదటివాడు. ఇతడు ముగ్గురు మహావీరుల జట్టుకు నాయకుడు. మూడువందల మందిని ఒక్కపెట్టున గండ్రగొడ్డలితో నరికి చంపినవాడు ఇతడే.
12. అహోహి వంశమునకు చెందిన దోదో కుమారుడైన ఎలియాసరు రెండవవాడు. ఇతడు ముగ్గురు సుప్రసిద్ధ వీరులలో నొకడు.
13. పస్ధమ్మీము యుద్ధమున దావీదు కోపుతీసికొని ఫిలిస్తీయులతో పోరాడినవాడు. ఎలియాసరు యవలు పెరిగిన చేనిలోనుండగా యిస్రాయేలీయులు యుద్ధమునుండి పారిపోజొచ్చిరి.
14. అప్పుడు ఎలియాసరు, అతని అనుచరులు ఆ చేనులోనే ఫిలిస్తీయుల నెదిరించి పోరాడిరి. ఆ పోరున ప్రభువు ఆ వీరునికి గొప్ప విజయమును ప్రసాదించెను.
15. ఒక రోజు ముప్పదిమంది వీరుల జట్టు నుండి ముగ్గురు యోధులు దావీదు వసించు కొండకు వెళ్ళిరి. ఆ రోజులలో దావీదు అదుల్లాము గుహచెంత వసించుచుండెను. అప్పుడు ఫిలిస్తీయుల సైన్యము రెఫాయీము లోయలో మకాము చేయుచుండెను.
16. దావీదు ఒక సురక్షితమైన కొండమీద వసించు చుండగా కొందరు ఫిలిస్తీయులువెళ్ళి బెత్లెహేమును ఆక్రమించుకొనిరి.
17. దావీదు స్వీయనగరము మీద బెంగగొని బేత్లెహేము నగర ద్వారముచెంతనున్న బావినుండి ఎవరైనా గ్రుక్కెడు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చిన ఎంత బాగుండును అని పలికెను.
18. వెంటనే ఆ ముగ్గురు వీరులు ఫిలిస్తీయుల శిబిరము గుండ పోయి బేత్లెహేము బావినుండి నీరు తోడుకొని వచ్చి దావీదున కిచ్చిరి. కాని అతడు ఆ నీటిని ముట్టడయ్యెను.
19. దానిని దైవార్పణముగా నేలమీద ధారగాపోసి, “ప్రభూ! నేను ఈ నీటిని త్రాగుదునా? ఈ వీరులు తమ ప్రాణములొడ్డి ఈ జలము గొనివచ్చిరి. నేను దానిని త్రాగినచో వీరి నెత్తుటిని త్రాగినట్లే” అని అనెను. కనుక అతడు ఆ పానీయమును ముట్టడయ్యెను. ఈ ముగ్గురు శూరులు చేసిన వీరకృత్యమట్టిది.
20. యోవాబు సోదరుడైన అబీషయి ముప్పది మంది వీరుల జట్టుకు నాయకుడు. అతడు ఈటెను చేపట్టి మూడువందల మంది శత్రువులతో పోరాడి వారినందరిని సంహరించెను. ముప్పదిమంది వీరులలో పేరు తెచ్చుకొనెను.
21. ఆ వీరులందరిలో మొనగాడై వారికి నాయకుడు అయ్యెను. కాని అబీషయి సుప్రసిద్ధులైన ముగ్గురు వీరులకు సాటి కాలేకపోయెను.
22. కబ్సీయేలు తెగకు చెందిన యెహోయాదా కుమారుడు బెనాయా ఒక వీరుడు. అతడు చాల వీర కార్యములు చేసెను. ఇద్దరు మోవాబు పరాక్రమవంతులను కూడ మట్టుపెట్టెను. అతడు మంచుపడిన ఒకానొక దినమున గుంటలోనికి దిగి దానిలోనున్న సింగమును చంపెను.
23. ఇంకను అతడు ఒక ఐగుప్తీయ యోధుని కూడ వధించెను. వాడు ఏడున్నర అడుగుల పైన ఎత్తుగా నుండెడివాడు. వాని చేతిలోని ఈటె సాలెవాని చేతిబద్దవలె నుండెడిది. బెనాయా బడితతోబోయి ఆ ఐగుప్తీయుని మీదబడి వాని చేతిలోని ఈటెను లాగుకొని దానితోనే వానిని పొడిచి చంపెను.
24. ఇట్టి వీరకృత్యములలో బెనాయా ముప్పదిమంది వీరులలో పేరు తెచ్చుకొనెను.
25. అతడు ఆ ముప్పదిమందిలో ప్రసిద్ధుడయ్యెను గాని ముగ్గురు మహావీరులకు మాత్రము సమఉజ్జి కాలేక పోయెను. దావీదు అతనిని తన అంగరక్షకులకు నాయకునిగా నియమించెను.
26-47. మిగిలిన వీరుల పేరులివి; యోవాబు తమ్ముడు అసాహేలు; దోదో కుమారుడును, బేత్లెహేము వాసియైన ఎల్హానాను; హరోరు నివాసి షమ్మోత్తు; పెలెతు నివాసి హెలెసు; తెకోవా నివాసియగు ఇక్కేషు తనయుడైన ఈరా; అనాతోతు నివాసియగు అబీయెజెరు; హూషా నివాసి సిబ్బెకాయి; అహోహి నివాసి ఈలయి; నెటోఫా నివాసి మహరయి; నెటోఫా నివాసియగు బానా తనయుడైన హేలేదు. బెన్యామీనుగిబియా నివాసియగు రీబయి తనయుడైన ఇత్తయి; పిరతోను నివాసి బెనాయా; గాషులోయ నివాసి హూరయి; అర్బా నివాసి అబీయేలు; బహూరీము వాసి అజ్మావెతు; షాల్బోను నివాసి ఎల్యాహ్బా; గీసోను నివాసి హాషేము; హరారు నివాసియగు షాగీ పుత్రుడు యోనాతాను; హరారు నివాసియగు సాకారు పుత్రుడు అహీయాము; ఊరు కుమారుడు ఎలీఫాలు; మెకెరా నివాసి హేఫేరు; పెలోను నివాసి అహీయా; కర్మేలు నివాసి హెస్రో; ఎస్బయి కుమారుడు నారయి; నాతాను సోదరుడు యోవేలు; హగ్రి కుమారుడు మిబాహారు; అమ్మోను నివాసి సెలెకు; బేలోతు నివాసి, యోవాబు అంగరక్షకుడు నహరయి; యాత్తీరు నివాసులు ఈరా, గారేబు; హేలీయుడైన ఊరియా; అహ్లాయి కుమారుడైన సాబాదు; షీజా తనయుడైన అదీనా. ఇతడు రూబేను తెగలో ప్రముఖుడు, ముప్పదిమంది యోధులకు పెద్ద; మాకా కుమారుడైన హానాను; మీతాను నివాసియగు యెహోషాఫాత్తు; అష్టెరా నివాసియగు ఉజ్జియా; హోతాము కుమారులును అరోయేరు నివాసులగు షమ్మా, యెయీయేలు; షిమ్రీ కుమారులైన తీజు నివాసులు యెదీయేలు, యోహా; మహవా నివాసియైన యెలీయేలు; ఎల్నాము కుమారులైన యెరీబాము, యోషవ్యా; మోవాబు నివాసియైన ఈత్మా; మెసోబాయా ఊరివారైన ఎలీయేలు, ఓబెదు, యాసియేలు.
1. దావీదు కీషు కుమారుడైన సౌలు బారి నుండి పారిపోయి సిక్లాగున వసించుచుండెను. అచట యుద్ధములో పరాక్రమశాలులు విశ్వసనీయులైన యోధులు చాలమంది దావీదు పక్షమున చేరిరి.
2. వారెల్లరు సౌలువలెనే బెన్యామీను తెగకు చెందిన వారు. అందరును కుడిచేతితో, ఎడమచేతితోగూడ బాణములు రువ్వగలరు, ఒడిసెల త్రిప్పగలరు.
3-7. గిబ్యోను నివాసి షెమయా కుమారులు అహీయెజెరు, ఇతడు అధిపతి. అతని తదుపరివాడైన యోవాసు. ఆ యోధుల పేరులివి: అస్మావేతు తనయులు యెజీయేలు, పెలెటు. అనాతోతు నివాసులగు బెరాకా, యెహూ. గిబ్యోను నివాసి సుప్రసిద్ధ యోధుడు ఇష్మాయా, ఇతడు ముప్పదిమంది వీరుల జట్టుకు నాయకుడు. గెదారా వాసులు యిర్మీయా, యహజీయేలు, యోహానాను, యోసాబాదు. హరీపు నివాసులు ఎలూసయి, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, షేపట్యా. కోరా తెగకు చెందిన ఎల్కానా, యిష్షీయా, అసరేలు, యోయెజెరు, యాషాబాము. గెదోరు నివాని యరోహాము కుమారులు యోహేలా, జెబద్యా.
8-13. దావీదు ఎడారిలోని కొండలో దాగి యుండగా గాదు తెగకు చెందినవారు కొందరు అతని పక్షమున చేరిరి. వారెల్లరును సుప్రసిద్ధులు, యుద్ధ కుశలురైన యోధులు. ఈటెలను, డాళ్ళను నేర్పుతో వాడగలవారు. సింహము ముఖమువంటి ముఖము గలవారు, కొండజింకలవలె శీఘ్రముగా పరుగెత్తగల వారు. పదవీక్రమమున వారి పేరులివి: ఏసేరు, ఓబద్యా, ఎలీయాబు, మిష్మన్నా, యిర్మీయా, అత్తయి, యెలీయేలు, యోహానాను, ఎల్జాబాదు, యిర్మీయా, మక్బన్నయి.
14. గాదీయులైన వీరు సైనిక బృందములకు నాయకులు. కొందరు వేయిమందికి కొందరు నూరుమందికి అధిపతులు.
15. యోర్దాను పొంగి పారు మొదటినెలలో వీరు ఆ నదిని దాటి దానికి తూర్పుపడమర లోయలందు వసించుచున్న జాతుల నెల్ల తరిమికొట్టిరి.
16. దావీదు ఒక దుర్గమున వసించుచుండగా కొందరు బెన్యామీనీయులు, కొందరు యూదీయులు అతని చెంతకువచ్చిరి.
17. దావీదు వారికెదురుబోయి “మీరు నాకు సహాయము చేయుటకు స్నేహితులవలె వచ్చితిరేని నాతో కలియవచ్చును. కాని నేను మీకే అపకారము చేయకున్నను, మీరు నన్ను శత్రువులకు పట్టించుటకు వచ్చితిరేని మన పితరుల దేవుడు మిమ్ము శిక్షించునుగాక!” అనెను.
18. అప్పుడు ముప్పదిమంది జట్టుకు నాయకుడైన అమాసయి అనువానిని ఆత్మ ప్రేరేపింపగా అతడు “యిషాయి కుమారుడవైన దావీదూ! మేము నీవారము. నీకు సమాధానము కలుగుగాక! నీకును, నీ సహాయులకును విజయము సిద్ధించుగాక! ప్రభువు నీకు బాసటయై యున్నాడుసుమా!" అని పలికెను. దావీదు వారినందరిని ఆహ్వానించి తన సైన్యములకు నాయకులను చేసెను.
19. దావీదు ఫిలిస్తీయులతో కలిసి సౌలుతో యుద్ధము చేయబోవుచుండగా కొందరు మనష్షేతెగ యోధులు దావీదు పక్షమున చేరిరి. యధార్థముగా దావీదు ఫిలిస్తీయ నాయకులకు సాయము చేయలేదు. దావీదు తన యజమానుడైన సౌలు పక్షమున చేరినచో తమకు చావుమూడునని భయపడి వారు అతనిని సిక్లాగునకు పంపివేసిరి.
20. దావీదు సిక్లాగు నుండి తిరిగివచ్చుచుండగా అతని పక్షమున చేరిన మనష్షీయ యోధులు వీరు: అద్నా, యోసాబాదు, యెదీయేలు, మికాయేలు, యోసాబాదు, ఎలీహు, జిల్లెతాయి. మనష్షే తెగకు చెందిన వీరెల్లరు తమ తెగలో వేయి మంది సైనికులకు అధిపతులు.
21. వారెల్లరు సుప్రసిద్దులైన వీరులు కనుక మొదట దావీదు సైన్య బృందములకు అధిపతులైరి. తరువాత యిస్రాయేలు సైన్యమునకు నాయకులైరి.
22. రోజు రోజుకి క్రొత్త యోధులు వచ్చి దావీదు సైన్యమున చేరుచునే యుండెడివారు. కనుక అతని సైన్యము విపరీతముగా పెరిగిపోయెను.
23-37. దావీదు హెబ్రోనున వసించుచుండగా యుద్దకుశలురైన యోధులు చాలమంది అతని పక్షమున చేరిరి. ప్రభువు ప్రమాణము చేసినట్లే సౌలుకు బదులుగా దావీదును రాజును చేయుటకు వారెల్ల రును కృషిచేసిరి. వారి సంఖ్యలివి: యూదా తెగనుండి 6,800 మంది యుద్ధమునకు సన్నద్ధులైన యోధులు. వారు డాళ్ళు, బల్లెములు కలవారు. షిమ్యోను తెగనుండి 7,100 మంది యుద్ధ కుశలురు. లేవి తెగనుండి 4,600 మంది యోధులు, అహరోను వంశజుల అధిపతి యోహోయాదా, అతని అనుచరులు 3,700 మంది. యువకుడును, వీరుడునైన సాదోకు బంధువులు, నాయకులైన వారు ఇరువది యిద్దరు. సౌలునకు చెందిన బెన్యామీను తెగనుండి 3,000 మంది. ఈ తెగకు చెందినవారు చాలమంది సౌలు పక్షమునే యుండిరి. ఎఫ్రాయీము తెగనుండి తమతమ వంశములలో సుప్రసిద్ధులైన వారు 20,800 మంది. మనష్షే అర్ధతెగనుండి 18,000 మంది. వీరి నెల్లరిని దావీదును రాజును చేయుటకే పంపిరి. యిస్సాఖారు తెగనుండి 200 మంది నాయకులు, వారి అనుచరులు. ఈ నాయకులెల్లరికి ఎప్పుడు ఎట్లు పోరాడవలయునో బాగుగా తెలియును. సెబూలూను తెగ నుండి 50,000 మంది. వారెల్లరు యుద్ధమునకు సన్నద్దులైనవారు, నమ్మదగిన వారు, పలువిధములైన ఆయుధములు కలవారు. నఫ్తాలి తెగ నుండి 1,000 మంది నాయకులు, డాళ్ళు ఈటెలు గలిగిన ముప్పది ఏడువేల మంది అనుచరులు. దాను తెగనుండి 28,600 మంది యుద్ధ కుశలులు. ఆషేరు తెగనుండి యుద్ధమునకు సన్నద్ధులైన వారు నలువదివేల మంది. యోర్దానునకు తూర్పున నున్న రూబేను, గాదు, మనష్షే అర్ధ తెగనుండి పలువిధములైన ఆయుధములు గలవారు లక్షయిరువది వేలమంది.
1. దావీదు వందమందికి, వేయిమందికి అధికారులుగానున్న తన సైన్యాధిపతులను ఇతర నాయకులను సంప్రదించెను.
2. అంతట అతడు యిస్రాయేలీయులతో “ఈ ఆలోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యావేవలన కలిగినచో దూతలను పంపి మన దేశమున మిగిలియున్న మన సహోదరులను, తమతమ నగరములలోను, పల్లెల లోను వసించు యాజకులను, లేవీయులను ఇచ్చటకు పిలిపింతము.
3. మనమెల్లరము పోయి ప్రభుమందస మును కొనివత్తము. సౌలు పరిపాలనాకాలమున దానియొద్ద మనము సంప్రదించకపోతిమి” అనెను.
4. ప్రజలకు ఆ ఆలోచన నచ్చెను గనుక వారెల్లరును సమ్మతించిరి.
5. కనుక దావీదు మందసమును కొనివచ్చుటకై దక్షిణమున సీహోరు అను ఐగుప్తు పొలిమేరనున్న నదినుండి ఉత్తరమున హమాతు పొలిమేర వరకు గల యిస్రాయేలీయులను అందరిని ప్రోగుచేసెను.
6. దావీదు, యిస్రాయేలీయులు కలిసి దైవమందసమును కొనివచ్చుటకై యూదా మండలములోని బాలా అనబడు కిర్యత్యారీమునకు వెళ్ళిరి. కెరూబు దూతల నడుమ ఆసీనుడై ఉండు ప్రభువు పేరుతో ఆ మందసము విరాజిల్లుచుండెను.
7. వారు అబీనాదాబు గృహము నుండి మందసమును వెలుపలికి తీసికొనివచ్చి క్రొత్త బండిమీద పెట్టిరి. ఉస్సా, అహ్యోలు బండి తోలించు చుండిరి.
8. దావీదు, యిస్రాయేలీయులు మందసము ముందు ఉత్సాహముతో నాట్యముచేసిరి. స్వరమండలములు, మృదంగములు, బూరలు, తాళములు వాయించుచు గానముచేసిరి.
9. బండి కీదోను కళ్ళము చెంతకు రాగానే ఎద్దులకు కాలుజారగా మందసము ప్రక్కకు ఒరిగెను. కనుక ఉస్సా చేయిచాచి దానిని పట్టుకొనబోయెను.
10. ప్రభువు ఉస్సా మీద ఆగ్రహముచెంది మందసమును ముట్టుకొనినందులకుగాను అతనిని చంపివేసెను. అతడు అక్కడికక్కడే ప్రభువు సమక్షమున కన్నుమూసెను.
11. ఆ రీతిగా ప్రభువు ఆగ్రహముతో ఉస్సాను చంపివేసెను గనుక దావీదు దుఃఖాక్రాంతుడయ్యెను. ఆ ప్రదేశమునకు నేటి వరకు "పెరెస్ ఉస్సా”' అని పేరు.
12. ప్రభువునకు భయపడి మందసమును దావీదు తన ఇంటికి కొనిపోవుట మేలాయని సంశయించెను,
13. కనుక అతడు దానిని దావీదు దుర్గమునకు కొనిపోకుండ గాతు పౌరుడైన ఓబేదెదోము అనువాని నింట వదలిపెట్టెను.
14. అది మూడునెలలపాటు అతని ఇంటనుండెను. ప్రభువు ఓబేదెదోము కుటుంబమును అతని ఆస్తిపాస్తులను దీవించెను.
1. తూరు రాజగు హీరాము దావీదు చెంతకు దూతలను పంపి, అతనికి రాజగృహము కట్టిపెట్టుటకు దేవదారు కొయ్యలను, వడ్రంగులను, తాపీ పని వారిని సరఫరా చేసెను.
2. ప్రభువు తన ప్రజలైన యిస్రాయేలీయులమీద తనను రాజుగా నెలకొల్పేనని, ఆ ప్రజల క్షేమముకొరకై తమ రాజ్యమును వృద్దిలోనికి తెచ్చుచుండెనని దావీదు అప్పుడు గ్రహించెను.
3. యెరూషలేమున దావీదు చాలమంది స్త్రీలను పెండ్లియాడెను. అతనికి పెక్కుమంది కుమారులు, కుమార్తెలు కలిగిరి.
4-7. ఆ నగరమున అతనికి పుట్టినబిడ్డలు వీరు: షమ్మూవ, షోబాబు, నాతాను, సొలోమోను, ఇభారు, ఎలీషూవ, ఎల్పేలెతు, నోగహు, నెఫెగు, యాఫీయ, ఎలీషామా, బేల్యెదా, ఎలీఫేలెటు.
8. దావీదు యిస్రాయేలు దేశమంతటికిని రాజయ్యెనని విని ఫిలిస్తీయులు అతనిని పట్టుకొనుటకు వచ్చిరి. కనుక దావీదు వారి నెదుర్కొనబోయెను.
9. ఫిలిస్తీయులు రేఫాయీము లోయలో దాడిచేసి దోపిడి ప్రారంభించిరి.
10. దావీదు దేవుని సంప్రదించి “నన్ను వారి మీద పడుమందువా? నీవు నాకు విజయమును ప్రసాదింతువా?” అని యడిగెను. ప్రభువు “పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగింతును” అని చెప్పెను.
11. కనుక దావీదు బాల్పెరాసీము నొద్ద ఫిలిస్తీయుల నెదరించి ఓడించెను. అతడు "ప్రవాహము వలన కట్టకు గండిపడినట్లు ప్రభువు నా వలన శత్రు సైన్యమున గండిపడునట్లు చేసెను” అనెను. కనుకనే ఆ తావుకు “బాలు పెరాజీము' అని పేరు వచ్చెను.
12. అప్పుడు ఫిలిస్తీయులు తమ విగ్రహములను లోయలోనే వదలి పెట్టి పారిపోయిరి. దావీదు వానిని తగుల బెట్టించెను.
13. ఫిలిస్తీయులు మరల లోయలో ప్రవేశించి దోపిడి మొదలు పెట్టిరి.
14. దావీదు మరల ప్రభువును సంప్రదించెను. యావే “నీవు వారినిచట ఎదిరింపవలదు. చుట్టును తిరిగిపోయి కంబళిచెట్ల వద్ద వారిని ఎదుర్కొనుము.
15. ఆ చెట్లకొనల మీద అడుగుల చప్పుడు వినిపించినప్పుడు నీవు వారిమీద పడుము. నేను నీకు ముందుగా పోయి ఫిలిస్త్రీయ సైన్యమును కలవరపెట్టెదను” అని చెప్పెను.
16. అతడు ప్రభువు చెప్పినట్లే చేసి ఫిలిస్తీయ సైన్యమును గిబ్యోను నుండి గేజేరు వరకు తరిమి చంపివేసిరి.
17. దావీదు పేరు యెల్లెడల మారుమ్రోగెను. ప్రభువు ప్రతిజాతి అతనికి భయపడునట్లు చేసెను.
1. దావీదు స్వీయనగరమున భవనములు నిర్మించుకొనెను. ప్రభు మందసమునకుగూడ ఒక స్థలమును సిద్ధముచేసి గుడారమును నిర్మించెను.
2. అతడు “మందసమును లేవీయులు మాత్రమే మోసి కొనిరావలయును. మందసమును మోయుటకును, ఎల్లప్పుడు తనకు ఊడిగము చేయుటకును ప్రభువు వారినెన్నుకొనెను” అనెను.
3. తాను సిద్ధము చేసిన తావునకు మందసమును కొనివచ్చుటకై అతడు యిస్రాయేలీయులందరిని యెరూషలేమున ప్రోగు చేసెను.
4. అతడు అహరోను వంశజులను, లేవీయుల నుండి పిలిపించెను.
5. లేవీయులలో కోహాతు వంశమునుండి ఊరీయేలును, అతని బంధువులు 120 మంది వచ్చిరి.
6. మెరారి వంశమునుండి అసాయా అతని బంధువులు 220 మంది వచ్చిరి.
7. గెర్షోను వంశమునుండి యోవేలు అతని బంధువులు 130 మందివచ్చిరి.
8. ఎలీషాఫాను వంశమునుండి షేమాయా అతని బంధువులు 200 మంది వచ్చిరి.
9. హెబ్రోను వంశమునుండి ఎలీయేలు అతని బంధువులు 80 మందివచ్చిరి.
10. ఉస్సీయేలు వంశము నుండి అమ్మీనాదాబు అతని బంధువులు 112 మంది వచ్చిరి.
11. దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును మరియు లేవీయులైన ఊరీయేలు, అసాయా, యోవేలు, షెమాయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనువారిని పిలిపించెను.
12. అతడు వారితో “మీరు లేవీయులకు పెద్దలు కదా! మీరును, మీ తోడి లేవీయులును శుద్ధిచేసుకొని యిస్రాయేలు దేవుడైన ప్రభువు మందసమును నేను సిద్ధము చేసిన స్థలమునకు కొనిరండు.
13. మొదటిసారి మందసమును కొనివచ్చినపుడు మీరచటలేరు కనుకనే ప్రభువు మమ్ము శిక్షించెను. మేమతనిని ఉచితరీతిని కొనిరామై తిమి' అనెను.
14. అంతట యిస్రాయేలు దేవుడైన ప్రభువు మందసమును తీసికొని వచ్చుటకై యాజకులు, లేవీయులు తమనుతాము శుద్ధి చేసుకొనిరి.
15. ప్రభువు మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లే లేవీయులు దేవుని మందసమును దాని మోతకర్రలతో తమ భుజములపైన మోసికొని వచ్చిరి.
16. దావీదు లేవీయుల పెద్దలను పిలిచి 'స్వర మండలములతోను, చిటితాళములతోను, సితారాలతోను గంభీరధ్వని చేయుచూ సంతోషకరమైన సంగీతము పాడుటకు లేవీయులను నియమింపుడు' అని చెప్పెను.
17-21. వారు కంచుతాళములను వాయించుటకు గాను యోవేలు కుమారుడైన హేమానును, అతని బంధువు బెరక్యా పుత్రుడైన ఆసాపును, మెరారి వంశమునకు చెందిన కుషాయాకుమారుడు ఏతానును ఎన్నుకొనిరి. వీరితోపాటు రెండవ వరుసగానున్న తమ బంధువులు జెకర్యా, బేను, యాజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలీయాబు, బెనాయా, మాసెయా, మత్తత్యా, ఎలీఫ్లెహు, మిక్నేయా అనువారిని, ద్వార పాలకులగు ఓబేదేదోమును, యెయీయేలును గాయకులుగా నియమించిరి. గాయకులయిన హేమాను, ఆసాపు, యేతానులు పంచలోహతాళములు వాయించుటకు నియమింపబడిరి. జెకర్యా, యేజీయేలు, సెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలీయాబు, మాసెయా, బెనాయా అనువారు తారాస్థాయి స్వరమండలములను వాయించుటకు నియమింపబడిరి. మరియు మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నెయాహు, ఓబేదెదోము, యెహీయాలు, అసద్యా అనువారు రాగమెత్తుటకును, సితారా వాయించుటకును నియమింపబడిరి.
22. లేవీయులకు అధిపతియైన కెనన్యా నేర్పుగల పాటగాడగుటచే ఈ సంగీతకారులకు పెద్దగా నియమించిరి.
23-24. ఓబేదెదోము యెహీయాలతో పాటు బెరక్యా, ఎల్కానాను మందసమునకు సంరక్షకులుగా నుండిరి. యాజకులైన షెబన్యా, యోషాషాత్తు, నెతనేలు, అమాసయి, జెకర్యా, బెనాయా, ఎలీయెసెరు మందసము ముందు బూరలను ఊదుటకు నియ మింపబడిరి. ఒబేదెదోము, యెహీయాయీములు అనువారు మందసమునకు వెనుక కనుపెట్టువారిగా నియమింపబడిరి.
25. దావీదు, యిస్రాయేలు నాయకులు, సహస్ర సైన్యాధిపతులు గొప్పసంబరముతో దైవమందసమును కొనివచ్చుటకై ఓబేదెదోము ఇంటికి వెళ్ళిరి.
26. మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయము చేయగా వారు ఏడుకోడెలను, ఏడుపొట్టేళ్ళను బలియిచ్చిరి.
27. సంగీతకారులు, వారి నాయకుడైన కెనన్యా, మందసమును మోయు లేవీయులు మొదలైన వారు మేలిమి నారబట్టలను ధరించిరి. దావీదుకూడ మేలిమి నారతో నేయబడిన ఎఫోదును ధరించెను.
28. ఆ రీతిగా యిస్రాయేలీయులెల్లరు బూరలు, కొమ్ములు, చిటితాళములు, స్వరమండలములు, సితారా మొదలైన వాద్యములను వాయించుచు సంతోషనాదములతో మందసమును యెరూషలేమునకు కొనివచ్చిరి.
29. మందసము నగరమును చేరుచుండగా సౌలు కుమార్తె మీకాలు కిటికీనుండి పారజూచెను. దావీదు నాట్యము చేయుచు సంతోషముతో గంతులు వేయుట గమనించి ఆమె తన మనసులో అతనిని తృణీకారముతో చూచెను.
1. వారు మందసమును కొనివచ్చి దావీదు సిద్ధముచేయించిన గుడారమున ఉంచిరి. దేవునికి దహనబలులు, సమాధానబలులు అర్పించిరి.
2. దావీదు బలులర్పించి ముగించిన తరువాత దేవుని పేరిట ప్రజలను దీవించెను.
3. అటుపిమ్మట యిస్రాయేలు స్త్రీ పురుషులలో ఒక్కొక్కరికి ఒక రొట్టె, కొంతమాంసము, ఎండిన ద్రాక్షపండ్లు పంచి ఇచ్చెను.
4. దావీదు మందసమునొద్ద ప్రభువును సేవించుటకు కొందరు లేవీయులను నియమించెను. యిస్రాయేలు దేవుడైన ప్రభువును స్తుతించి గానముచేయుట వారిపని.
5. ఆసాపు వారికి నాయకుడు. జెకర్యా ఉప నాయకుడు యెమీయేలు, షామీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఎలీయాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను, సితారాలను వాయించుటకు నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు.
6. యాజకులైన బెనాయా, యహసీయేలు మందసమునొద్ద నిరంతరము బూరలను ఊదవలయును.
7. అప్పుడు దావీదు ఈ క్రింది పాటతో దేవుని స్తుతింపవలెనని ఆసాపును, అతని అనుచరులను ఆజ్ఞాపించెను.
8. “ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపుడు. ఆయన నామమును ప్రకటింపుడు. ఆయన మహాకార్యములను ప్రచారము చేయుడు.
9. ప్రభువును స్తుతించి గానముచేయుడు. ఆయన అద్భుతకార్యములను వెల్లడిచేయుడు.
10. ఆయన పవిత్రనామములో మహిమ కలదు. ఆయనను అన్వేషించు వారెల్లరును ఆనందింతురుగాక!
11. ప్రభువును సాయమునకై ఆశ్రయింపుడు. ఆయన బలమును ఆశ్రయింపుడు.
12-13. ప్రభువు దాసుడైన యాకోబు వంశజులారా! ప్రభువు ఎన్నుకొనిన యాకోబుని తనయులారా! ప్రభుని అద్భుతకార్యములను స్మరింపుడు. ఆయన న్యాయము చెప్పిన తీరు గుర్తింపుడు.
14. ఆయన మన దేవుడైన ప్రభువు. అతని ఆజ్ఞలు భూతలమంతటికిని చెల్లును.
15. మీరు అల్పసంఖ్యాకులుగాను, మీరు స్వల్పజనముగాను, కనానుదేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దానినీ కెచ్చెదనని
16. ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను,
17. ఈసాకుతో ఆయనచేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడు.
18-19. వేయితరముల వరకు తన మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. యాకోబునకును కట్టడగాను, యిస్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.
20. వారు దేశమునుండి దేశమునకు తిరిగిరి . రాజ్యము నుండి రాజ్యమునకు తరలిరి.
21. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు ప్రభువు వారినెవరును పీడింపకుండునట్లు చేసెను. వారి క్షేమమునెంచి రాజులను మందలించెను.
22. 'నా ప్రవక్తలను బాధింపవలదు' అని పలికి, ఆయన వారికెవరికిని హింసచేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను సైతము గద్దించెను.
23. సకల భూనివాసులారా! ప్రభుని స్తుతింపుడు, ఆయన రక్షణమును దినదినము ప్రకటింపుడు.
24. ఆయన కీర్తిని సకల జాతులకు వెల్లడిచేయుడు. ఆయన మహాకార్యములను సకల ప్రజలకు ఎరిగింపుడు.
25. ప్రభువు గొప్పవాడు, కీర్తింపదగినవాడు సమస్తదైవములకంటె అధికముగా సేవింపవలసినవాడు.
26. అన్యజాతులు కొలుచు దైవములు వట్టి విగ్రహములు, కాని ప్రభువు ఆకాశమండలమును చేసెను.
27. కీర్తి ప్రాభవములు ఆయనను అంటియుండును. శక్తిసంతోషములు ఆయన దేవళమున నిండియుండును.
28. సకల జాతులారా! ప్రభువును కీర్తింపుడు. ఆయన మహాత్మ్యమును శక్తిని సన్నుతింపుడు.
29. ప్రభుని ఘనమగు నామమును కొనియాడుడు మీ అర్పణములతో దేవాలయమునకు రండు పవిత్రుడై చూపట్టు ప్రభువునకు నమస్కరింపుడు
30. సకల భూనివాసులారా! ఆయన ముందు గడగడలాడుడు. ఆయన భూలోకమును కదలకుండునట్లు స్థిరపరచెను.
31. యావే ఏలికయని జనములలో చాటుడి, భూమ్యాకాశములు ప్రమోదము చెందునుగాక!
32. సముద్రమును దానిలోని సమస్తమును ఘోషించునుగాక! పొలములును వానిలోని పైరులును ఆనందమునొందుగాక!
33. ప్రభువు భూజనులకు తీర్పుతీర్చుటకై వేంచేయుచున్నాడు! అడవులలోని చెట్లన్నియు ఆయన ఎదుట ఆనందముతో కేకలిడునుగాక!
34. ప్రభువు మంచివాడు కనుక ఆయన ప్రేమ శాశ్వతమైనది కనుక ఆయనకు వందనములర్పింపుడు.
35. ఆయనతో “రక్షకుడైన ప్రభూ! మమ్ము కావుము. అన్యజాతుల నడుమనుండి మమ్ము ప్రోగుచేసి కాచికాపాడుము. అప్పుడు మేము నీ దివ్యనామమును కీర్తించుచు, నీకు వందనములు అర్పింతుము” అని చెప్పుడు.
36. యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఇప్పుడును ఎప్పుడును సదా స్తుతింపబడునుగాక” అని పలికెను. అప్పుడు ప్రజలెల్లరు “ఆమెన్" అని పలికి ప్రభుని కీర్తించిరి.
37. మందసము ఎదుట నిరంతరము ప్రభువును సేవింప ఆసాపును, అతని సహోదరులను దావీదు నియమించెను. దినదినము వారు ప్రభువును అర్చింపవలయును.
38. యెదూతూను కుమారుడు ఓబేదేదోమును, అతని వంశమునకు చెందిన అరువదెనిమిది మంది వారికి సాయము చేయవలయును. యెదూతూను కుమారుడైన ఓబేదెదోము, హోసా అనువారిని ద్వారపాలకులనుగా నియమించెను.
39. గిబ్యోను ఉన్నత స్థలముననున్న యావే గుడారము మీదను, అచటి బలిపీఠము మీదను ప్రభువు యిస్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారము
40. ప్రతిదినము ఉదయ సాయంకాలములందు బలిపీఠముపైన దహనబలులు అర్పించుటకై అచట యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.
41. ప్రభువు శాశ్వతకృపకుగాను, అతనిని స్తుతించి కొనియాడుటకై హేమానును, యెదూతూనును మరియు ఇతరులను కొందరిని నియమించిరి.
42. స్తుతిగీతము పాడునపుడు బూరలు, చిటితాళములు మరియు ఇతర వాద్యములు ఉపయోగించుట హేమాను, యెదూతూనుల బాధ్యత. యెదూతూను వంశమునకు చెందిన వారు ద్వారపాలకులుగానుండిరి.
43. పనులన్నియు ముగిసిన తరువాత ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపో యిరి. దావీదు కూడ తనవారిని దీవించుటకుగాను ఇంటికి వెళ్ళిపోయెను.
1. దావీదు ప్రాసాదమున వసింప మొదలిడెను. అతడు నాతాను ప్రవక్తతో “నేను దేవదారు ప్రాసాదమున నివసించుచున్నాను. కాని మందసము మాత్రము గుడారముననే పడియున్నది” అనెను.
2. ఆ మాటలకు నాతాను “నీవు సంకల్పించుకొన్న కార్యములెల్ల చేయుము. ప్రభువు నీకు బాసటగా నుండును” అని పలికెను.
3-4. కాని ఆ రాత్రియే ప్రభువువాణి నాతానుతో ఇట్లు చెప్పెను: “నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో నా పలుకులుగా ఇట్లు వినిపింపుము. నేను నివసించుటకు మందిరము నీ చేత కట్టబడదు.
5. యిస్రాయేలీయులను ఐగుప్తునుండి తరలించుకొని వచ్చినప్పటి నుండి నేటివరకును నేను మందిరములో నివసింప లేదు. గుడారములందే వసించుచు ఒకచోటు నుండి మరొక చోటుకు కదలుచుంటిని.
6. యిస్రాయేలీయులతో నేను చేసిన ప్రయాణములందు నేను ప్రజలకు నాయకులుగా నియమించిన వారితో మీరు నాకు దేవదారు మందిరమును కట్టి పెట్టరైతిరిగదా అని ఎప్పుడైన అంటినా?
7. నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకధిపతియు ప్రభుడనైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నీవు పొలములో గొఱ్ఱెలు కాయుచుండగా నేను నిన్ను పిల్చి నా ప్రజలకు నాయకునిగా నియమించితిని.
8. నీ దండయాత్రలందెల్ల నీకు తోడై యుంటిని. నీ శత్రువులనెల్ల రూపుమాపితిని. ఇపుడు ప్రపంచములోని మహానాయకులకు అబ్బిన కీర్తి నీకును దక్కునట్లు చేయుదును.
9. నా ప్రజలైన యిస్రాయేలీయులకొరకు ఒక తావును ఎన్నుకొని వారికచట నివాసమేర్పరచితిని. ఎట్టి బాధలకు గురి కాకుండ వారచట సుఖముగా జీవింతురు.
10. వారు ఈ దేశమున కాలు మోపినప్పటినుండియు దుష్టులు వారిని పీడించుచుండిరి. కాని ఇక అటుల జరుగ బోదు. నేను నీ శత్రువులనెల్ల అణగదొక్కెదను. నేనే నీకొక మందిరమును' కట్టి పెట్టెదను.
11. నీవు చనిపోయి నీ పితరులను కలసికొనినపుడు నేను నీ సంతానములో ఒకనిని రాజును చేయుదును.
12. నాకు మందిరమును నిర్మించువాడు అతడే. నేనతని రాజవంశము కలకాలము నిల్చునట్లు చేయుదును.
13. నేనతనికి తండ్రినైయుందును. అతడు నాకు తనయుడై యుండును. నీకంటే ముందున్నవాడు నా అనుగ్రహమునకు నోచుకోలేదు కాని ఇతడు నా మన్ననకు పాత్రుడగును.
14. కలకాలము అతడు నా ప్రజలకు, రాజ్యమునకు అధిపతిగా నుండును. అతని రాజవంశమునకు అంతమేయుండదు”.
15. నాతాను ప్రభువు తనకు తెలిపిన సంగతులన్నింటిని దావీదునకు విన్నవించెను.
16. అంతట దావీదు ప్రభువు గుడారమున ప్రవేశించి ప్రభువు సాన్నిధ్యమున కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. “ప్రభూ! నీవు నాకిట్టి ఉపకారములు చేయుటకు నేను ఏపాటివాడను? మా కుటుంబము ఏపాటిది?
17. ఇంతవరకు నీవు చేసిన ఉపకారములు చాలవో అన్నట్లు భవిష్యత్తులో రానున్న నా వంశస్తులను కూడ నీవు దీవింతుననుచున్నావు. మనుష్యులు పరస్పరము మాట్లాడునట్లు దయతో మాతో మాట్లాడి, నా సంతతి ఘనతచెందునని మాట ఇచ్చితివి.
18. నీ సేవకుడనైన నన్ను ఇంతగా ఆదరించితివి. నీవు నన్ను బాగుగా ఎరుగుదువు. ఇక నేనేమి విన్నవించుకోగలను!
19. నాకు ఇట్టి మేలుచేయుటయు, భవిష్యత్తులో నాకు సిద్దింపనున్న ఖ్యాతిని ముందుగా ఎరిగించుటయు నీ అభీష్టము.
20. ప్రభూ! నీ వంటివాడెవడును లేడు. నీవుతప్ప మరియొక దైవములేడని మేము వినినది నిజము.
21. నీవు ఐగుప్తునుండి తరలించు కొనివచ్చి నీవారిగా చేసికొనిన యిస్రాయేలువంటి జాతి ఈ భూమిమీద మరియొకటి కలదా? నీవు వారికొరకు చేసిన మహా కార్యములు, భయంకర కృత్యములు నీకు ఖ్యాతి తెచ్చిపెట్టినవి. నీవు ఐగుప్తుదాస్యము నుండి నీ ప్రజలను విడిపించుకొని వచ్చితివి. ఇతర జాతులనెల్ల తరిమివేసి వారికి ఒకతావు కల్పించితివి.
22. ప్రభూ! నీవు యిస్రాయేలీయులను శాశ్వతముగా నీ ప్రజలను చేసికొంటివి. నీవు వారి దేవుడవైతివి.
23. ప్రభూ! నీవు ఇపుడు ఈ దాసునిగూర్చి ఇతని వంశజులనుగూర్చి చేసిన ప్రమాణములెల్ల నెరవేర్పుము. నీవు చేయుదునన్న కార్యమును చేయుము.
24. ఇట్లు చేసినచో నీ ఖ్యాతి మిన్నంటును. ప్రజ లెల్లరును ఎల్లకాలము సైన్యములకధిపతియైన ప్రభువు యిస్రాయేలునకు దైవమయ్యెనని చెప్పుకొందురు. నీవు నా రాజవంశమును కలకాలము కొనసాగింతువు.
25. నా రాజవంశమును నిలబెట్టుదునని నీవే ఈ దాసునికి ఎరిగించితివి కనుక నేనిపుడు నీ సమక్షమున ఇట్టి ప్రార్థనచేయ సాహసించితిని.
26. ప్రభూ! నీవు నిక్కముగా దేవుడవు. ఈ దాసుని పట్ల దయగలిగి ఇట్టి ప్రమాణము చేసితివి.
27. ప్రభూ! నన్ను కరుణించి నా వంశజులను దీవింపుము. అప్పుడు నా వంశము కలకాలము కొనసాగును. నీవు దీవించినవారు ఎల్లకాలము దీవెనలు పొందుదురు.”
1. అటు తరువాత దావీదు ఫిలిస్తీయులతో పోరాడి వారిని ఓడించెను. గాతు నగరమును, దాని పరిసరగ్రామములను వారినుండి స్వాధీనము చేసి కొనెను.
2. అతడు మోవాబీయులనుగూడ జయించెను. వారతనికి దాసులై కప్పములు కట్టిరి.
3. సోబా రాజు హదదెసెరు యూఫ్రటీసు నది కెగువనున్న మండలమును ఆక్రమించుకొనబోవు చుండగా దావీదు అతనిని హమాతు వద్ద ఎదిరించి ఓడించెను.
4. అతని రథములను వేయింటిని, ఆశ్వి కులను ఏడువేలమందిని, కాలిబంటులను ఇరువది వేలమందిని పట్టుకొనెను. అతడు నూరు రథములకు చాలినన్ని అశ్వములను మాత్రము ఉంచుకొని మిగిలిన వానికన్నిటికి గుదికాలినరములు తెగగొట్టించెను.
5. సోబారాజు అయిన హదదెసెరునకు సహాయము చేయుటకై దమస్కునకు చెందిన సిరియనులు రాగా వారిలో ఇరువది రెండువేలమందిని దావీదు మట్టు పెట్టెను.
6. అతడు అరామీయుల మీద అధికారులను నియమింపగా వారతనికి లొంగి కప్పముకట్టిరి. ప్రతి దండయాత్రయందును ప్రభువు దావీదునకు విజయము ప్రసాదించెను.
7. అతడు హదదెసెరు బంటులనుండి బంగారుడాళ్ళను గైకొని వాటిని యెరూషలేమునకు కొనివచ్చెను.
8. ఆ రాజునకు చెందిన తిబ్బాతు, కూను నగరములనుండి చాల కంచును గూడ కొని వచ్చెను. సొలోమోను నీటిసంద్రమను తొట్టిని, స్తంభములు, పాత్రములను ఆ కంచుతో చేయించెను.
9. హమాతురాజు తోవూ, దావీదు హదదెసెరు సైన్యమునంతటిని జయించెనని వినెను, సోబా రాజైన హదదెసెరు అతనికి శత్రువు.
10. కనుక ఆ రాజు దావీదును అభినందించుటకు తన కుమారుడు హదోరమును పంపెను, హదోరము దావీదునకు కంచు, వెండి, బంగారములతో చేయబడిన బహుమతులు కొనివచ్చెను.
11. దావీదు ఆ వస్తువులనెల్ల దేవాలయమునకు అర్పించెను. అతడు తాను జయించిన ఎదోము, మోవాబు, అమ్మోను, ఫిలిస్తి, అమాలెకు దేశములనుండి కొనివచ్చిన వెండి, బంగారములను కూడ అట్లే దేవాలయమునకు అర్పించెను.
12. సెరూయా కుమారుడైన అబీషయి ఉప్పు లోయలో ఎదోమీయులను జయించి, వారి సైనికులను పదునెనిమది వేలమందిని మట్టుపెట్టెను.
13. అతడు ఎదోమీయుల మీద కావలిదండును నియమింపగా వారు దావీదునకు లొంగిపోయిరి. ప్రతి దండయాత్రయందును ప్రభువు దావీదునకు విజయము ప్రసాదించెను.
14. దావీదు యిస్రాయేలీయులనందరిని న్యాయముతోను, ధర్మముతోను పరిపాలించెను. సెరూయా పుత్రుడైన యోవాబు సైన్యాధిపతి.
15. అహీలూదు కుమారుడైన యెహోషాపాత్తు రాజకార్యముల దస్తావేజులు భద్రపరచువాడు.
16. అహీటూబు కుమారుడైన సాదోకు, అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు యాజకులు. షవషా కార్యదర్శి.
17. యెహోయాదా కుమారుడైన బెనాయా, దావీదు అంగరక్షకులైన కెరెతీయులకును, పెలెతీయులకును అధిపతి. దావీదుయొక్క కుమారులు అతని కొలువులో ప్రముఖ స్థానములను ఆక్రమించుకొనిరి.
1. కొంతకాలము గడచిన తరువాత అమ్మోనీయ రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు హానూను రాజయ్యెను.
2. దావీదు, 'నాహాషు నన్ను అభిమానముతో చూచినట్లే నేనుకూడ అతని కుమారుడగు హానూనును అభిమానముతో చూచెదను' అని అనుకొని, నాహాషు మృతికి సంతాపము తెలుపుచు హానూను వద్దకు దూతలను పంపెను. వారు అమ్మోనీయుల రాజ్యమును చేరి హానూనును దర్శించి సంతాపమును తెలిపిరి.
3. కాని అమ్మోను నాయకులు వారి రాజుతో “దావీదు సంతాప సూచకముగా దూతలనంపినది నీ తండ్రిని గౌరవించుటకే అనుకొంటివా? అతడు త్వరపడి ఈ దేశమును ఆక్రమించుకొనగోరి వారిని పంపెను” అని చెప్పిరి.
4. హానూను దావీదు దూతల గడ్డములు గొరిగించి వారి దుస్తులను పిరుదుల వరకు కత్తిరించి పంపివేసెను.
5. ఆ దూతలు సిగ్గుతో మ్రగ్గిపోయి తిరిగిరాలేకపోయిరి. దావీదునకు ఆ సంగతి తెలిసెను. అతడు సేవకులనంపి మీరు గడ్డములు పెరుగువరకు యెరికో నగరముననే ఉండి అటు తరువాత తిరిగిరండని చెప్పించెను.
6. అమ్మోనీయులు దావీదు కోపమును రెచ్చ గొట్టితిమని గ్రహించిరి. కనుక వారు ఆరాము, మాకా, సోబా రాష్ట్రములనుండి రథములను, రథికులను బాడుగకు తెప్పించుకొనుటకై రెండువేల మణుగుల వెండినంపిరి.
7. అటుల వారు బాడుగకు తెచ్చుకొనిన ముప్పది రెండువేల రథములు, మాకా రాజు సైన్యములు వెడలివచ్చి మేడెబావద్ద విడిదిచేసెను. అమ్మోనీయులును వారివారి నగరములనుండి వెడలివచ్చి యుద్ధమునకు సన్నద్ధులైరి.
8. ఈ సంగతివిని దావీదు యోవాబు నాయకత్వమున తన సైన్యమునంతటిని పంపెను.
9. అప్పుడు అమ్మోనీయులు, వెడలివచ్చి రబ్బా నగరము ప్రవేశద్వారములచెంత బారులు తీరిరి. వారికి తోడ్పడుటకు వచ్చిన రాజులు మాత్రము వెలుపలి పొలమున మోహరించియుండిరి.
10. యోవాబు ఆ సైన్యముల చూచి తాను ముందు వెనుక లందుగూడ పోరు నడపవలెనని గ్రహించెను. కనుక అతడు యిస్రాయేలు సైన్యమున మెరికలవంటి బంటులనెన్నుకొని వారిని అరామీయులతో పోరాడ నియమించెను.
11. మిగిలిన సైనికులను అమ్మోనీయులతో పోరాడ నియమించి, వారికి తన తమ్ముడు అబీషయిని నాయకునిగా నియమించెను.
12. అతడు తమ్మునితో “అరామీయులు నన్ను గెలువ జూతురేని నీవు నాకు సహాయము చేయరమ్ము. అమ్మోనీయులు నిన్ను గెలువ జూతురేని నేను నీకు తోడువత్తును.
13. నీవు ధైర్యముతో నిలువుము. మన ప్రజల కొరకును, మన దేవుని నగరముల కొరకును పోరాడుదము. ఆ మీదట ప్రభువు తన ఇష్టము వచ్చినట్లు చేయును” అనెను.
14. యోవాబు అతని సైన్యము అరామీయులతో యుద్ధము ప్రారంభింపగా వారతని ఎదుట నిలువ జాలక పారిపోయిరి.
15. అరామీయులు కాలికి బుద్ధిచెప్పుట చూచి అమ్మోనీయులుకూడ అబీషయి ఎదుటినుండి పారిపోయి పట్టణమున దాగుకొనిరి. యోవాబు యెరూషలేమునకు వెళ్ళిపోయెను.
16. అరామీయులు యిస్రాయేలీయులకు ఓడిపోతిమి గదా అనుకొని యూఫ్రటీసు నదికి తూర్పు వైపునున్న అరామీయులనెల్ల పిలిపించుకొనిరి. హదదెసరు యొక్క సైన్యాధిపతియైన షోఫకు వారికి నాయకుడుగా ఉండెను.
17. ఈ సంగతి విని దావీదు యిస్రాయేలు సైన్యమును ప్రోగుజేసికొనివచ్చి యోర్దాను దాటెను. అరామీయులకు అభిముఖముగా తన సేనలను బారులు తీర్చి యుద్ధము ప్రారంభించెను.
18. అరామీయులు వెన్నిచ్చిరి. దావీదు, అతని సైన్యము కలిసి ఏడు వేల మంది రథారూఢులను, నలువదివేల మంది పదాతులను సంహరించిరి. వారి నాయకుడైన షోఫకును కూడ వధించిరి.
19. హదదెసెరు, సామంతరాజులు తాము దావీదుతో ఓడిపోయితిమని గ్రహించి, అతనితో సంధి చేసికొని అతనికి లొంగిపోయిరి. అటు తరువాత అరామీయులు అమ్మోనీయులకు మరల సహాయము చేయలేదు.
1. నూతన సంవత్సరారంభము రాజులు యుద్ధమునకు పోవుటకు అనువైన కాలము. అప్పుడు యోవాబు సైన్యములతో పోయి అమ్మోనీయుల రాజ్యము మీదపడెను. వారి రాజధాని రబ్బానగరమును ముట్టడించి సర్వనాశనముచేసెను. దావీదు యెరూషలేముననే యుండెను.
2. అమ్మోనీయుల దేవత మిల్కోమునకు రెండుమణుగుల బంగారు కిరీటముకలదు. దానిలో ఒకరత్నము కలదు. దావీదు ఆ కిరీటమును తీసికొని ఆ రత్నమును తన కిరీటమున పెట్టుకొనెను. అతడు రబ్బా నగరమునుండి కొనివచ్చిన కొల్లసొమ్మునుగూడవిస్తారముగా స్వీకరించెను.
3. దావీదు ఆ నగర పౌరులను కొనివచ్చి వారిచే రంపములతో, ఇనుపదంతెలతో, గొడ్డళ్ళతో చాకిరి చేయించెను. అమ్మోనీయ నగరములు అన్నిటి పట్ల అతడు ఇదే పద్ధతిననుసరించెను. ఆ పిమ్మట అతడు సైన్యములతో యెరూషలేమునకు తిరిగి వచ్చెను.
4. అటుపిమ్మట గేసేరువద్ద ఫిలిస్తీయులతో పోరు జరిగెను. ఈ యుద్ధమున హూషా నగరవాసియైన సిబ్బెకాయి ఫిలిస్తీయ రాక్షసుడు సిప్పయిని వధించెను. దానితో ఫిలిస్తీయులు లొంగిపోయిరి.
5. ఫిలిస్తీయులతో మరల యుద్ధము జరిగెను. ఈ రణమున యాయీరు కుమారుడైన ఎల్హానాను అనువాడు లహ్మీని చంపెను. ఇతడు సాలెవాని మగ్గపు బద్దవంటి పెద్ద యీటెగల గాతు నివాసి గొల్యాతు తమ్ముడు.
6. గాతువద్ద మరల సమరము జరిగెను. ఈ యుద్ధమున మిగుల యెత్తరియై రెండు చేతులకును రెండు కాళ్ళకును ఆరేసి వ్రేళ్ళచొప్పున మొత్తము ఇరువదినాలుగు వ్రేళ్ళుగల రెఫాయీయు డొకడుండెను.
7. వాడు యిప్రాయేలీయులను సవాలుచేయగా దావీదు సోదరుడగు షిమ్యా కుమారుడైన యోనాతాను వానిని సంహరించెను.
8. పై ముగ్గురు గాతునకు చెందిన రెఫాయీయులు. దావీదు, అతని సైనికులును వారిని హతమార్చిరి.
1. సైతాను యిస్రాయేలీయులను తిప్పలు పెట్టనెంచి జనాభా లెక్కలు తయారు చేయింపవలెనని దావీదును ప్రేరేపించెను.
2.కనుక దావీదు యోవాబుతో, అధిపతులతో “మీరు వెళ్ళి బేర్షెబ నుండి దానువరకు గల యిస్రాయేలీయులందరిని లెక్కపెట్టి మొత్తమెంత మంది ఉన్నారో నాకు తెలియజేయుడు” అనెను.
3. ఆ మాటలకు యోవాబు “యావే మన ప్రజలను నూరంతలుగా వృద్ధిచేయుగాక! ఈ జనులెల్లరును దేవర వారి దాసులేకదా! ఇప్పుడు ఈ లెక్కల వలన యిస్రాయేలీయులు అందరు నేరము కట్టుకొందురు. ప్రభువు ఇట్టి కార్యముచేయనేల?” అనెను.
4. కాని రాజు తన ఆజ్ఞను పాటింపుమని యోవాబును ఒత్తిడి చేసెను. కనుక అతడు దేశమంత తిరిగి జనాభా లెక్కలు సిద్ధము చేసికొనివచ్చెను.
5. అతడు యిస్రాయేలీయులలో యుద్ధము చేయగలవారు మొత్తము పదునొకండు లక్షలమంది అనియు, యూదా నివాసాలలో యుద్ధము చేయగలవారు మొత్తము నాలుగు లక్షలడెబ్బదివేలమంది అనియు రాజునకు విన్నవించెను.
6. యోవాబునకు రాజాజ్ఞ నచ్చలేదు కనుక అతడు లేవీయులను, బెన్యామీనీయులను లెక్కపెట్టలేదు.
7. రాజు చేసినపని ప్రభువునకు ప్రీతి కలిగింపలేదు. కనుక ఆయన యిస్రాయేలును శిక్షించెను.
8. దావీదు “ప్రభూ! ఈ జనాభా లెక్కల మూలమున నేను పెద్ద తప్పిదము చేసితిని, నేను చాల అవివేకముతో ప్రవర్తించితిని. నన్ను క్షమింపుము” అని వేడుకొనెను.
9-10. యావే దావీదునకు దీర్ఘదర్శి అయిన గాదుతో “నీవు వెళ్ళి రాజుతో నా మాటలుగా ఇట్లు చెప్పుము: నేను నీకు మూడు కార్యములు నిర్ణయించితిని. వానిలో నీవు ఎన్నుకొన్నదానిని చేసెదను” అనెను
11. గాదు దావీదువద్దకు వచ్చి ప్రభువు పలుకులను ఇట్లు ఎరిగించెను.
12. “మూడేండ్లపాటు కరువు లేదా మూడునెలలు నీవు శత్రువుల ఎదుట నిలువలేక నాశనమగుట లేదా మూడు దినములు ప్రభువు ఖడ్గము నిన్నువెన్నాడ అంటురోగము ఈ దేశమును పీడింపగా ప్రభువుదూత యిస్రాయేలీయులను నాశనము చేయుట ఈ మూడింటిలో ఏది కావలయునో కోరుకొనుము. ప్రభువునకు నన్నేమి జవాబు చెప్పుమందువో తెలియజేయుము” అనెను.
13. దావీదు “నేను ఇరుకున పడితిని. అయినను ప్రభువు దయాసముద్రుడు కనుక నరులచేతికి చిక్కుటకంటే ఆయన చేతికి చిక్కుట మేలు” అనెను.
14. అప్పుడు ప్రభువు యిస్రాయేలీయులను అంటురోగమువాత బడునట్లు చేసెను. దానివలన డెబ్బదివేలమంది చచ్చిరి.
15. ఆయన యెరూషలేమును నాశనము చేయుటకు తన దూతను పంపెను. కాని ఆ దూత నగరమును పాడుచేయబోవు చుండగా ప్రభువు జాలినొంది అతనితో “ఓయి! ఇక చాలు” అనెను. అప్పుడు దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమువద్ద సాక్షాత్కరించెను.
16. దావీదు ప్రభువు దూత భూమ్యాకాశములకు మధ్య నిలచి కత్తిదూసి యెరూషలేమును నాశనము చేయుటకు సంసిద్ధమగుటను గమనించెను. వెంటనే గోనె తాల్చియున్న దావీదు, ప్రజానాయకులు సాష్టాంగపడిరి.
17. దావీదు “ప్రభూ! ప్రజలను లెక్కపెట్టుట అను చెడుపని చేయించినది నేను. గొఱ్ఱెలవంటి ఈ ప్రజలు ఏ పాపమును ఎరుగరు. కనుక నీవు నన్నును, నా కుటుంబమును శిక్షించి ఈ నీ జనులను వదలివేయుము” అని మనవి చేసెను.
18. అప్పుడు ప్రభువుదూత గాదుతో ఒర్నాను కళ్ళము నందు ప్రభువునకు ఒక బలిపీఠము నిర్మింపుమని దావీదుతో చెప్పుమనెను.
19. గాదు చెప్పినట్లే దావీదు ప్రభువు ఆజ్ఞకు బద్దుడై కళ్ళము చెంతకు పోయెను.
20. అప్పుడు ఒర్నాను తన నలుగురు కుమారులతో గోధుమలు నూర్చుచుండెను. వారు ప్రభువు దూతను చూచి భయపడి దాగుకొనిరి.
21. ఒర్నాను దావీదు రాజు తనయొద్దకు వచ్చుట చూచి కళ్ళమునుండి వెలుపలికొచ్చి శిరము నేలమోపి దండము పెట్టెను.
22. రాజతనితో “ఈ కళ్ళమును నాకు అమ్ముము. నేనిట ప్రభువునకు బలిపీఠము నిర్మింపవలయును. అప్పుడు గాని ఈ అంటురోగము సమసిపోదు. నేను దీనికి నిండువెలను ఇత్తును” అనెను.
23. ఒర్నాను “ప్రభువు ఈ స్థలముతో తమ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చును. ఇవిగో ఈ ఎద్దులను దహనబలిగా అర్పింపవచ్చును. గోధుమలను సూర్చు ఈ మ్రానును వంటచెరకుగా వాడుకోవచ్చును. ఈ గోధుమలను ధాన్యబలిగా అర్పింపవచ్చును. వీనినెల్ల నీకు ఇచ్చెదను, గైకొనుము” అని దావీదుతో అనెను.
24. దావీదు అతనితో “నేను నీకు పూర్తి వెల యిత్తును. నేనేమియు ఖర్చుపెట్టకుండ నీ వస్తువులను తీసికొని దేవునికి బలియర్పింతునని అనుకొంటివా?” అనెను.
25. కనుక దావీదు ఆ తావునకుగాను ఒర్నానునకు ఆరువందల తులముల బంగారము చెల్లించెను.
26. దావీదు అచట ఒక బలిపీఠము నిర్మించి దహనబలులు, సమాధానబలులు అర్పించెను. అతడు ప్రభువునకు ప్రార్థనచేయగా ప్రభువు ప్రత్యుత్తరముగా ఆకసమునుండి నిప్పు పంపి బలిపీఠముమీది బలులను దహించెను.
27. ప్రభువు ప్రభువుదూతతో ఇక నీ కత్తిని ఒరలో పెట్టుమని చెప్పెను.
28. దావీదు ప్రభువు తనమొర ఆలకించెనని గుర్తించి ఒర్నాను కళ్ళము నందు బలిపీఠముమీద బలులు అర్పించెను.
29. మోషే ప్రభువు కొరకు ఎడారిలో తయారుచేసిన గుడారము, దహనబలులు అర్పించు బలిపీఠము అంత వరకు గిబ్యోను క్షేత్రముననేయుండెను.
30. దావీదు ప్రభువుదూత కత్తిని జూచి భయపడి ప్రభువును సంప్రతించుటకు గిబ్యోనునకు వెళ్ళడయ్యెను.
1. కనుక అతడు “దేవుడైన యావే నివాస స్థలము ఇచటయే ఉండవలయును. యిస్రాయేలీయులు ప్రభువునకు దహన బలులుర్పించు దహనబలిపీఠము ఇచ్చటనే ఉండవలయును” అని పలికెను.
2. దావీదు తన రాజ్యమునవసించు విదేశీయులను అందరిని ప్రోగుచేయించి వారిని పనికి నియమించెను. వారిలో కొందరు దేవుని మందిర నిర్మాణమునకుగాను పెద్ద పెద్ద రాళ్ళుచెక్కిరి.
3. తలుపులకు, ద్వారములకు చీలలు, బందులు చేయించుటకు అతడు ఇనుమును సమృద్ధిగా చేకూర్చెను. ఎవరును తూకము వేయ జాలనంతగా కంచునుగూడ ప్రోగుచేసెను.
4. తూరు, సీదోను ప్రజలతనికి దేవదారు మ్రానులనుగూడ పుష్కలముగా సరఫరా చేసిరి. కనుక అతడు వానిని గూడ సమృద్ధిగా ప్రోగుచేసెను.
5. దావీదు “నా కుమారుడు సొలోమోను నిర్మింపనున్న దేవాలయము వైభవముతో అలరారి జగద్విఖ్యాతి చెందవలయును. కాని అతడింకను చిన్నవాడు, అనుభవము లేనివాడు. కనుక నేను ముందుగనే మందిరనిర్మాణమునకు సన్నాహములు చేయుదును” అనుకొనెను. కావున అతడు చనిపోక ముందు దేవాలయ నిర్మాణమునకు విస్తారవస్తువులను ఆర్జించెను.
6. అతడు కుమారుని పిలిపించి యిస్రాయేలు దేవుడైన ప్రభువునకు మందిరము కట్టవలయునని ఆదేశించెను.
7. ఇంకను అతడు సొలోమోనుతో “కుమారా! నేను నా ప్రభువైన దేవునికి మందిరము కట్టవలయునని ఉవ్విళ్ళూరితిని.
8. కాని ప్రభువు నాతో 'నీవు ఘోరమైన యుద్ధములనుచేసి రక్తము అపారముగా నేలపై ఒలికించితివి. ఇంతగా రక్తపాతము కావించితివి కనుక నీవు నా నామమునకు దేవాలయము కట్టరాదు.
9. అయినను నీకొక కుమారుడు కలుగును. అతడు శాంతియుతముగా పరిపాలనము చేయును. శత్రువుల బారిదప్పి శాంతి సుఖములు అనుభవించును. ఆ కుమారుని యేలు బడిలో యిస్రాయేలీయులకు శాంతిభద్రతలు సిద్ధించును. కనుక అతనిని సొలోమోను' అని పిలుతురు. అతడే నాకు దేవాలయము నిర్మించును. అతడు నాకు కుమారుడుకాగా నేనతనికి తండ్రినగుదును. అతని రాజవంశము కలకాలము యిస్రాయేలును పరిపాలించును' అని చెప్పెను.
10-11. కనుక కుమారా! ప్రభువు నీకు అండగా నుండి తాను మాట ఇచ్చినట్లే, నీ ద్వారా దేవాలయమును కట్టించుగాక!
12. ఇంకను ప్రభువు నీకు వివేక విజ్ఞానములు ప్రసాదించి నీవు ఆయన ధర్మశాస్త్రము ప్రకారము ప్రజలను సక్రమముగా పరిపాలించునట్లు చేయునుగాక!
13. ప్రభువు మోషే ద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్రమును పాటింతువేని నీకు తప్పక విజయము సిద్దించును. నీవు మాత్రము దేనికిని భయపడక, దేనికిని జంకక, స్థిరచిత్తముతోను, ధైర్యముతోను మెలగుము.
14. నా మట్టుకు నేను ప్రయత్నముచేసి దేవాలయమునకు రెండు లక్షల మణుగుల బంగారమును, ఇరువదిలక్షల మణుగుల వెండిని సిద్ధము చేయించితిని. ఎవరు తూకము వేయజాలనంతగా ఇనుమును, కంచును ప్రోగుజేయించితిని. దేవదారు కలపను రాళ్ళనుగూడ చేకూర్చి పెట్టితిని. కాని ఈ రెండింటిని నీవింకను అధికముగా ప్రోగుజేయవలయును.
15-16. నీకు చాలమంది పనివారున్నారు. రాతిపనివారు, తాపీ పనివారు, వడ్రంగులపనివారు ఉన్నారు. వెండి, బంగారము, కంచు, ఇనుములతో పనిచేయువారున్నారు. కనుక నీవు పని ప్రారంభింపుము. ప్రభువు నీకు బాసటయైయుండును” అని పలికెను.
17. దావీదు యిస్రాయేలు నాయకులను అందరిని సొలోమోనునకు తోడ్పడవలయునని ఆజ్ఞా పించెను.
18. అతడు వారితో “మీ దేవుడైన ప్రభువు మీకు తోడుగానున్నాడుగదా!. అతడు మీకు అన్ని దిక్కులందు శాంతిని ప్రసాదించెనుగదా! ప్రభువు అనుగ్రహము వలన నేను ఇచటి స్థానిక జాతులనెల్ల జయించితిని. నేడు వారు దేవునియెదుటను, మీ యెదుటను లొంగియున్నారు.
19. కనుక మీరిపుడు పూర్ణహృదయముతో ప్రభువును సేవింపుడు. దేవాలయము కట్టుడు. అప్పుడు ప్రభువు మందసమును, ఆరాధన సామగ్రిని దానిలో భద్రపరుపవచ్చును” అని చెప్పెను.
1. దావీదు ఏండ్లుచెల్లి పండు ముదుసలైనపుడు తన కుమారుడు సొలోమోనును యిస్రాయేలీయులకు రాజును చేసెను.
2. దావీదు యిస్రాయేలు నాయకులను, యాజకులను, లేవీయులను ప్రోగుచేసెను.
3. లేవీయులలో ముప్పది మరియు అంతకుమించిన ఏండ్లు గల పురుషులకు జనాభా లెక్కలు తయారు చేయించెను. వారు ముప్పది ఎనిమిది వేలమంది తేలిరి.
4. దావీదు వారితో “ఇరువది నాలుగు వేలమందిని దేవాలయమున పరిచర్య చేయుటకును, ఆరువేలమందిని అధికారులుగను మరియు న్యాయాధిపతులుగను,
5. నాలుగువేల మందిని ద్వారపాలకులుగను, నాలుగువేలమందిని నేను స్వయముగా తయారు చేయించిన సంగీత వాద్యములతో దేవుని స్తుతించుటకును నియమించితిని” అనెను.
6. గెర్షోను, కోహాతు, మెరారి అను లేవీయులను దావీదు మూడువరుసలుగా విభజించెను.
7. గెర్షోను నకు గెర్షోనీయులలో లదాను, షిమీ అను ఇద్దరు కుమారులు కలరు.
8-9. లదానుకుమారులు యహీయేలు, సేతాము, యోవేలు. వారు లదాను వంశములకు నాయకులైరి. షిమీ కుమారులు షెలోమోతు, హాజియేలు, హారాను.
10-11. షిమీ కుమారులు వయస్సు క్రమములో యహాతు, సీనా, యేయూషు, బెరీయా అనువారు నలుగురు. యోయూషు, బెరీయాలకు కుమారులు అంతగా కలుగలేదు. కనుక వారు ఇరువురు కలసి ఒక వంశముగా పరిగణింపబడిరి.
12. కోహాతు నలుగురు కుమారులు అమ్రాము, ఇసాహారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
13. అమ్రాము తనయులు అహరోను, మోషే అనువారు. అహరోను, అతని వంశజులు నిత్యము పరమపవిత్రమైన వస్తువులను నివేదించుటలో నిమగ్నులైయుండిరి. ప్రభువు సాన్నిధ్యమున సాంబ్రాణి పొగవేయుట, ఆయనను సేవించుట, ప్రభువు నామమున ప్రజలను దీవించుట వారి పనులు.
14. కాని దైవసేవకుడైన మోషే తనయులు మాత్రము లేవీయులుగా పరిగణింపబడిరి.
15. గెర్షోము, ఎలియెజెరు మోషే తనయులు.
16. గెర్షోము తనయులకు నాయకుడు షెబూవేలు.
17. ఎలియెజెరు కుమారుడు రెహబ్యా ఒక్కడే. కాని అతని వంశజులు మాత్రము చాలమంది ఉండిరి.
18. ఇసాహారు కుమారుడు షెలోమీతు అతని వంశనాయకుడు.
19. హెబ్రోను నలుగురు కుమారులు వయస్సు క్రమములో యెరీయా, అమర్యా, యెహజీయేలు, యెక్మెయాము.
20. ఉజ్జీయేలు కుమారులు మీకా, యిషియా.
21. మెరారి ఇద్దరు పుత్రులు మహ్లి, మూషి, మహ్లికి ఇద్దరు కుమారులు ఎలియెజెరు, కీషు.
22. ఎలియెజెరునకు చనిపోవునాటికి కుమార్తెలే కాని కుమారులు లేరైరి. ఆ కుమార్తెలు తమ బంధువులైన కీషు వంశజులను పెండ్లియాడిరి.
23. మూషీ ముగ్గురు తనయులు మహ్లి, ఎదేరు, యెరేమోతు.
24. లేవీ వంశములవారిగాను, కుటుంబముల వారిగాను వీరుండిరి. వారెల్లరును తమ పేర్లు నమోదు చేయించుకొనిరి. ఇరువది లేక అంతకు మించిన ఏండ్లుగల లేవీ వంశజులెల్లరును దేవాలయమున ఊడిగము చేసిరి.
25. దావీదు “ప్రభువుయిస్రాయేలీయులకు శాంతిని దయచేసెను. ఆయన స్వయముగా యెరూషలేమున వసించును.
26. కనుక ఇక మీదట లేవీయులు ప్రభువు మందసమునుగాని ఆరాధన సమయమున వాడెడి వస్తుసామగ్రినికాని, మోసికొని పోనక్కరలేదు” అని చెప్పెను.
27-29. దావీదు తుది యాజ్ఞ ప్రకారము ఇరువదియేండ్లు అంతకు పైబడి ప్రాయముగల లేవీయులందరిని లెక్కించి వారికి ఈ క్రింది పనులను ఒప్పజెప్పిరి: “అహరోను వంశజులైన యాజకుల చేతిక్రింద దేవాలయ ఆరాధనలో తోడ్పడుట, దేవాలయ ప్రాంగణములు, గదులను చూచుకొనుట, పరిశుద్ధ వస్తువులను శుద్ధిచేయుట, దేవునియెదుట రొట్టెలను సమర్పించు పిండిని, పులిపిడి ద్రవ్యము లేకుండ చేసిన రొట్టెలను, పెనముమీద కాల్చిన రొట్టెలను, ఓలివు తైలముతో కలిపిన పిండిని మొదలైన వానిని పరిశీలించుట, కానుకలుగా అర్పించిన వస్తువులను కొలుచుట లేక తూచుట వారి బాధ్యతలు.
30. వారు ప్రతిదినము ఉదయ సాయంకాలములందు దేవాలయమున ప్రోగై ప్రభువును స్తుతింపవలయును.
31. విశ్రాంతిదినములందుగాని, అమావాస్యలందు గాని, ఇతర పండుగలందుగాని, ప్రభువునకు దహన బలులర్పించునపుడు వారు ప్రోగుకావలెను. ఈ సమయమున ఎందరు లేవీయులు హాజరు కావలెనో ముందుగనే నిర్ణయింపబడెను. ప్రభువును నిరంతరము సేవించుట వారిపని.
32. దేవాలయమును, గుడారమును కాపాడుటయు, అహరోను వంశజులును మరియు తమకు బంధువులైన యాజకులకు సహాయము చేయుటయు వారి పూచీ”.
1. అహరోను వంశజులు ఈ క్రింది వర్గములుగా విభజింపబడిరి; అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియెజెరు, ఈతామారు అను నలుగురు.
2. నాదాబు, అబీహు తండ్రికంటే ముందే గతించిరి. వారికి సంతానములేదు. కనుక వారి తరువాత ఎలియెజెరు, ఈతామారు యాజకులైరి.
3. దావీదు అహరోను వంశజులను వారివారి పనులనుబట్టి వర్గములుగా విభజించెను. ఎలియెజెరు వంశజుడైన సాదోకు, ఈతామారు వంశజుడైన అహీమెలెకు అతనికి ఈ కార్యమున తోడ్పడిరి.
4. ఎలియెజెరు వంశజులను పదునారువర్గములుగను, ఈతామారు వంశజులను ఎనిమిది వర్గములుగను విభజించిరి. ఎలియెజెరు వంశజులలో కుటుంబ అధిపతులైన పురుషులు ఎక్కువమంది ఉండిరి కనుక అటులచేసిరి.
5. ఇరుతెగల వారియందు దేవాలయాధికారులు, ఆధ్యాత్మిక అధికారులు ఉండిరి. కనుక చీట్లు వేసి వారికి పనులు నిర్ణయించిరి.
6. లేవీయులలో లేఖికుడుగా నున్న నెతనేలు కుమారుడును, లేఖకుడైన షెమయా వారివారి పేర్లను నమోదుచేసెను. రాజు, అతని అధికారులు, యాజకుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడు అహీమెలెకు, మరియు యాజకుల యొక్కయు, లేవీయులయొక్కయు కుటుంబ అధిపతులు ఈ నమోదునకు సాక్షులు. ఇరువంశముల వారి యాజకులకు అనగా ఎలియెజెరునకు చెందిన ప్రతి రెండువర్గముల తదుపరి ఈతామారునకు చెందిన ఒకవర్గము చొప్పున చీట్లు వేసి పనులు నిర్ణయించిరి.
7-18. చీట్లు వేసి ఈ క్రింది వరుస క్రమములో ఇరువదినాలుగు వర్గములవారికి పనులు నిర్ణయించిరి. వారు వరుసగా : మొదటిచీటి యెహోయారీబు, రెండవది యెదాయా, మూడవది హారిము, నాలుగవది సెయోరీము, ఐదవది మల్కీయా, ఆరవది మియామిను, ఏడవది హక్కోజు, ఎనిమిదవది అబీయా, తొమ్మిదవది యేషువ, పదవది షెకన్యా, పదకొండవది ఎల్యాషీబు, పన్నెండవది యాకీము, పదమూడవది హుప్పా, పదునాలుగవది యేషెబెవాబు, పదిహేనవది బిల్గా, పదునారవది ఇమ్మేరు, పదినేడవది హెసీరు, పదునెనిమిది హప్పిస్సేసు, పందొమ్మిదవది పెతహాయా, ఇరువదియవది యెహెజ్కేలు, ఇరువదియొకటవది యాకీను, ఇరువది రెండవది గామూలు, ఇరువది మూడవది దెలాయా, ఇరువదినాలుగవది మాస్యా అనువారలు నిర్ణయింపబడిరి.
19. పై వారినందరిని వారివారి పనులతో నమోదుచేసిరి. వారు దేవాలయమునకు పోయి యిస్రాయేలు దేవుడైన ప్రభువు పూర్వము వారి వంశ కర్త అహరోను ద్వారా ఆజ్ఞాపించిన పనులన్నియు చేయవలయును.
20. మిగిలియున్నవారు అనగా లేవీ వంశమునకు చెందిన ఇతర కుటుంబాధిపతుల పేర్లివి: అమ్రాము సంతతికి చెందిన షుబూవేలు, షుబూవేలు సంతతికి చెందిన యెహ్దియా.
21. రెహబ్యా కుమారులలో పెద్దవాడైన ఇష్షీయా.
22. ఇసాహారు సంతతికి చెందిన షెలోమితు, షెలోమితు సంతతికి చెందిన యాహాతు.
23. హెబ్రోను తనయులు వయసు క్రమమును బట్టి వీరు: యెరీయా, అమర్యా, యహానీయేలు, యెక్మెయాము.
24. ఉజ్జీయేలు సంతతికి చెందిన మీకా. మీకా సంతతికి చెందిన షామీరు.
25. మీకా సోదరుడైన ఇష్షీయా మరియు ఇష్షీయా సంతతికి చెందిన జెకర్యా.
26. మెరారి సంతతికి చెందిన మహ్లి, మూషి.
27. యహనీయా సంతతికి చెందిన బెనోయు, యహాసియా వలన మెరారికి కలిగిన కుమారులు: బెనోయి, షోహాము, సక్కూరు, ఇబ్రి.
28-29. మహ్లికి ఎలియెజెరు, కీషు అని ఇరువురు పుత్రులు కలిగిరి. ఎలియెజెరునకు కుమారులు లేదు. కాని కీషునకు యెరాహ్మేలు అను తనయుడు కలిగెను.
30. మూషికి ముగ్గురు కుమారులు కలిగిరి. వారు మహ్లి, ఎదేరు, యెరీమోతు అనువారు. లేవీయుల సంతతికి చెందిన కుటుంబములివి.
31. తమ బంధువులు, అహరోను వంశజులైన యాజకులవలెనె వీరుకూడ చీట్లు వేసికొని ఆయా కుటుంబాధిపతులకును, వారి కనిష్ఠ సోదరులకును రావలసిన పనులేవో నిర్ణయించుకొనిరి. రాజైన దావీదు, యాజకులగు సాదోకు, అహీమెలెకులు, యాజకుల యొక్కయు, లేవీయుల యొక్కయు కుటుంబ అధిపతులు ఈ చీట్లు వేయుటకు సాక్షులుగానుండిరి.
1. దావీదు రాజు, లేవీయ నాయకులు కలిసి దేవాలయమున ఆరాధనలో పాటలు పాడుటకు ఆసాపు, హేమాను, ఎదూతూను అనువారి సంతతిలో కొందరిని ఎన్నుకొనిరి. వారు సితారా, స్వరమండలము, చిటితాళములు మొదలైన వాద్యముల సంగీతముతో ప్రభువు సందేశము ప్రవచింపవలయును. ఆరాధన యందు పాటలు పాడువారి జాబితా, వారు చేయవలసిన పనులతో చేర్చిన జాబితా యిది:
2. ఆసాపు నలుగురు కుమారులు సక్కూరు, యోసేపు, నెతన్యా, అషరేలాలు. వారు ఆసాపు చేతిక్రిందపనిచేసిరి. ఇతడు రాజుచెంత ప్రవచించెడివాడు.
3. ఎదూతూను యొక్క ఆరుగురు కుమారులు గెదల్యా, జెరీ, యెషయా, షిమెయి, హషబ్యా, మత్తిత్యా అనువారలు స్వరమండలము సంగీతముతో ప్రభువును స్తుతించుచు ఆయన సందేశమును ప్రవచించుచు తమ తండ్రి చేతిక్రింద పనిచేసిరి.
4. హేమాను పదునలుగురు తనయులు బుక్కీయా, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూవేలు, యెరీమోతు, హనన్యా, హననీ, ఎలీయాతా, గిద్దల్తీ, రోమామితియెసరు, యోష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహనీయోతు.
5. వీరందరును ప్రభువు వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియైన హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని పదునలుగురు కుమారులను మరియు ముగ్గురు కుమార్తెలుగా ప్రభువు వృద్ధిచేసెను.
6. వారందరును తమ తండ్రి చేతిక్రింద పనిచేయుచు దేవాలయ ఆరాధనమున సితార, స్వరమండలము, చిటితాళములు వాయించుచు సంగీతము పాడెడివారు. ఆసాపు, ఎదూతూను, హేమాను రాజాజ్ఞకు లోబడియుండిరి.
7. ప్రభువు మందిరమున సంగీతము పాడెడి వారినందరిని తోడి లేవీయులతోపాటు నమోదుచేసిరి. వారందరు కలిసి 288 మంది.
8. వారందరు వృద్ధులైననేమి, యువకులైననేమి, ప్రావీణ్యము కల వారైననేమి, ప్రారంభకులైననేమి, తమతమ పనులను నిర్ణయించుకొనుటకు ఓట్లు వేసికొనిరి.
9-31. పై 288 మందిని కుటుంబముల వారిగా 24 బృందములుగా చేసిరి. ఒక్కొక్క బృంద మున పండ్రెండుమంది కలరు. ఒక్కొక్కనికి ఒక నాయకుడుండెను. వారు ఈ క్రింది క్రమములో పని చేపట్టిరి. మొదటిచీటి ఆసాపు వంశమునకు చెందిన యోసేపు, రెండవది గెదల్యా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. మూడవది సక్కూరు, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. నాలుగవది యిస్రీ, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఐదవది నెతన్యా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఆరవది బుక్కియా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఏడవది యెషరేలా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఎనిమిదవది యెషయా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. తొమ్మిదవది మత్తన్యా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పదవది షిమీ, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పదకొండవది అసరెల్, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పన్నెండవది హషబ్యా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండు గురు. పదమూడవది షుబాయెలు, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పదునాలుగవది మత్తిత్యా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పదిహేనువది యెరేమోతు, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పదునారవది హనన్యా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పదిహేడవది యోష్బెకాషా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పద్దెనిమిదవది హననీ, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పందొమ్మిదవది మల్లోతి, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఇరువయ్యవది ఎల్యాతా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఇరువదియొకటవది హోతీరు, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఇరువది రెండవది గిద్దల్తీ, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఇరువది మూడవది మహసీయోతు, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఇరువదినాలుగవది రొమమితియేసేరు. అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు.
1. దేవాలయ ద్వారసంరక్షకులుగా నియమింపబడిన లేవీయులు వీరు: కోరా వంశమునుండి ఆసాపు కుటుంబమునకు చెందినవాడును, కోరె కుమారుడైన మెషెలెమ్యా.
2-3. ప్రాయము క్రమములో అతని ఏడుగురు కుమారులు వీరు: జెకర్యా, యెదీయేలు, సెబద్యా, యత్నీయేలు, ఎలాము, యెహోహానాను, ఎల్యోయేనయి.
4-5. ప్రభువు ఓబేదెదోమును దీవించి అతనికి ఎనిమిదిమంది కుమారులను దయచేసెను. ప్రాయము క్రమములో వారు షెమయా, యెహోసాబాదు, యోవా, సాకరు, నెతనేలు, అమ్మీయేలు, యిస్సాఖారు, పెయుల్లెతయి.
6-7. షెమయాకు ఆరుగురు కుమా రులు కలిగిరి, వారు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్సాబాదు, ఎలీహు, సెమక్యా. వీరందరు పరాక్రమ శాలులు, సమర్థవంతులు.
8. ఓబేదెదోము కుటుంబము నుండి దేవాలయ ద్వారసంరక్షణకు ఉపకరించిన వారు మొత్తము అరువదియిద్దరు.
9. మెషెలెమ్యా కుటుంబము నుండి పనికి ఉపకరించినవారు పదునెనిమిది మంది.
10. మెరారి సంతతికి చెందిన హోసాకు నలుగురు తనయులుండిరి. షిమ్రీ జ్యేష్ఠుడు కాకపోయినను తండ్రి అతనికి జ్యేష్ఠవంతును ఇచ్చెను.
11. మిగిలిన ముగ్గురు హిల్కియా, తెబల్యా, జెకర్యా, హోసా కుటుంబమునుండి పనికి నియమింపబడినవారు మొత్తము పదముగ్గురు.
12. దేవాలయ ద్వారసంరక్షకులను వారి వారి కుటుంబముల ననుసరించి కొన్ని బృందములుగా విభజించిరి. ఇతర లేవీయులకువలెనే వారికిని దేవాలయమున పని నియమింపబడెను.
13. కొద్ది వారేమి, ఎక్కువవారేమి వారి పితరుల ఇంటి వరుసను బట్టి వారందరు చీట్లు వేసికొని ఏ ద్వారమును ఎవరు సంరక్షింపవలయునో నిర్ణయించుకొనిరి.
14. షెలెమ్యాకు తూర్పు ద్వారము వచ్చెను. అతని కుమారుడు జెకర్యా మంచిసలహాదారుడు. అతనికి ఉత్తరద్వారము వచ్చెను.
15. ఓబేదెదోమునకు దక్షిణద్వారము, అతని కుమారులకు వస్తుసంభారములు ఉన్న గదులు వచ్చెను.
16. షుప్పీమునకు, హోసానునకు పడమటి దిక్కున రాజ మార్గమునకుపోవు షల్లెకెతు గుమ్మమునకు కావలియుండు చీటిపడెను. నియమితకాలము ప్రకారము ద్వారసంరక్షకులు మారుచుండిరి.
17. తూర్పు ద్వారమునకు రోజుకు ఆరుగురు సంరక్షకులు, ఉత్తర ద్వారమునకు నలుగురు, దక్షిణ ద్వారమునకు నలుగురు, వస్తుసంభారములున్న రెండు గదులకు ఒక్కొక్కదానిలో ఇద్దరు కాపుండిరి.
18. పడమటి భవనమునకు ఇద్దరు, దాని చెంతనున్న మార్గమునకు నలుగురు కాపుండిరి.
19. కోరా సంతతివారికి, మెరారీయులకు దేవాలయ ద్వారసంరక్షణకు ఇట్లు వంతులు ఏర్పరచబడెను.
20. మరియు లేవీయులనుండి అహీయా అను వాడు దేవాలయమునందలి కోశాగారమును, దేవునికి నివేదింపబడిన కానుకలను భద్రపరచు గదులను కాయుటకు నియమింపబడెను.
21. గెర్షోము కుమారులలో ఒకడైన లదాను, చాలా వంశములకు మూలకర్త. తన కుమారుడైన యెహీయేలు వంశమునకు ఇతడే మూలకర్త.
22. యెహీయేలు ఇద్దరు కుమారులు సేతాము, అతని సోదరుడైన యోవేలు దేవాలయ కోశాగారమునకు కాపుండిరి.
23. అమ్రాము, ఇసాహారు, హెబ్రోను, ఉజ్జీయేలు సంతతి వారికి పైన తెలిపిన పనులు అప్పగింపబడినవి.
24. మోషే మనుమడును, గెర్షోము కుమారుడునైన షెబూవేలు దేవాలయ కోశాగారమునకు ప్రధానాధికారి.
25. గెర్షోము సోదరుడైన ఎలియెజెరు ద్వారా అతడు షెలోమీతుకు చుట్టమయ్యెను. షెలోమీతునకు తండ్రి సిక్రి, సిక్రి తండ్రి యోరాము, యోరాము తండ్రి యెషయా, యెషయా తండ్రి రెహబ్యా, రెహబ్యా తండ్రి ఎలియెజెరు.
26. ప్రభువు ఆలయమును వైభవముగా కట్టించుటకై దావీదురాజు, ఆయా కుటుంబముల నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, సైనికాధిపతులు,
27. వారు యుద్దములలో తాము కొల్లగొట్టిన దానిలో దేవునికి నివేదించిన సొమ్ము గల కోశాగారములకు షెలోమీతు అతని సోదరులు సంరక్షులుగా నుండిరి.
28. దీర్ఘదర్శి సమూవేలును, కీషు కుమారుడైన సౌలు రాజును, నేరు కుమారుడైన అబ్నేరును, సెరూయా కుమారుడైన యోవాబును దేవాలయమునకు అర్పించిన కానుక లకు కూడ షెలోమీతు మరియు అతని కుటుంబ సభ్యులే సంరక్షకులు.
29. ఇసాహారు వంశజుల పనులివి: కెనన్యా, అతని కుమారులకు దేవాలయమునకు వెలుపలి పనులు అప్పగించిరి. వారు లేఖకులు, ప్రజల తగవులు తీర్చువారు.
30. హెబ్రోను వంశమునుండి హషబ్యాను, అతని బంధువులు పదునేడు వందలమందిని ఎన్ను కొనిరి. వారందరు శూరులు. వారిని యోర్దానునకు పడమరనున్న యిస్రాయేలీయులకు అధిపతులుగా నియమించిరి. వారు ఆ ప్రజల మత, ఆర్థిక సమస్య లను చక్కదిద్దిరి.
31. యెరీయా వారికందరికి నాయకుడు. దావీదు పరిపాలనాకాలము నలువదియవయేట హెబ్రోను వంశపువారిని గూర్చి పరిశీలన చేయగా శూరులైన అతని సంతతివారు కొందరు గిలాదు నందలి యాసేరు మండలమున వసించుచున్నారని తెలియవచ్చెను.
32. దావీదు యెరీయా బంధువుల నుండి ఇరువదియేడు వందలమంది శూరులైన కుటుంబ అధిపతులను ఎన్నుకొని వారిని రూబేను, గాదు, మనష్షే అర్ధ తెగలవారికి నాయకులుగా నియమించెను. వారు ఆ తెగలవారి మత, ఆర్థిక సమస్యలను చక్కదిద్దిరి.
1. యిస్రాయేలీయులకు అధికారులుగానుండిన కుటుంబాధిపతుల, సైనికనాయకుల మరియు వారి సహాయుల జాబితా ఇది: సంవత్సరము పొడవున ప్రతినెల ఇరువదినాలుగువేలమంది చొప్పున అధికా రులుగా ఉండిరి. వారికొక నాయకుడు కూడ ఉండెను.
2-15. ఈ క్రింది వారు ఆయా నెలల అధికారులకు నాయకులుగా ఉండిరి. మొదటినెలకు సబ్దియేలు కుమారుడు యషోబాము నాయకుడు. అతడు యూదా తెగకు చెందిన పెరెసు వంశములోనివాడు. వానిభాగములో ఇరువదినాలుగు వేలమందియుండిరి. రెండవనెలకు అహోహి వంశజుడైన దోదయి నాయకుడు. అధికార నిర్వహణలో అతనికి మిక్లోతు సహాయుడుగా ఉండెను. వాని భాగములో ఇరువది నాలుగువేలమంది యుండిరి. మూడవనెలకు బెనాయా కుమారుడును, యాజకుడైన యెహోయాదా. అతడు ముప్పదిమంది పరాక్రమ వంతుల జట్టుకు నాయకుడు. అతని తరువాత అతని కుమారుడు అమిస్సాబాదు అధికారిఅయ్యెను. వాని భాగములో ఇరువది నాలుగువేలమంది యుండిరి. నాలుగవ నెలకు యోవాబు తమ్ముడు అసాహేలు. అతని తరువాత అతని కుమారుడు జెబద్యా అధికారి అయ్యెను. వాని భాగములో ఇరువదినాలుగు వేల మంది యుండిరి. ఐదవ నెలకు ఇసాహారు వంశజుడైన షాముహుతు. వాని భాగములో ఇరువదినాలుగు వేలమందియుండిరి. ఆరవ నెలకు తెకోవా నగరవాసియు, ఇక్కేషు కుమారుడైన ఈరా. వాని భాగములో ఇరువది నాలుగు వేలమంది యుండిరి. ఏడవనెలకు పెలోను నగరవాసియు, ఎఫ్రాయీమీయుడైన హెలెసు. వాని భాగములో ఇరువదినాలుగు వేలమందియుండిరి. ఎనిమిదవ నెలకు హూషా నగరవాసియైన సిబ్బెకాయి. అతడు సేరా వంశములోనివాడు. వాని భాగములో ఇరువదినాలుగు వేలమంది యుండిరి. తొమ్మిదవనెలకు బెన్యామీను మండలమునకు చెందిన అనాతోతు నగరవాసియైన అబీయెరు. వాని భాగములో ఇరువదినాలుగు వేలమంది యుండిరి. పదియవనెలకు నెటోఫా మండలవాసియు, సెరా వంశములోనివాడు మహరాయి. వాని భాగములో ఇరువదినాలుగు వేలమంది యుండిరి. పదునొకండవనెలకు ఎఫ్రాయీము మండలములోని పిరతోను నగరవాసియైన బెనాయా. వాని భాగములో ఇరువదినాలుగువేలమంది యుండిరి. పండ్రెండవనెలకు నెటోఫా మండలవాసియు, ఒత్నీయేలు వంశజుడైన హెల్దయి. వాని భాగములో ఇరువదినాలుగు వేలమంది యుండిరి.
16-22. యిస్రాయేలు తెగలకు పాలకులుగా నుండినవారి జాబితా ఇది: రూబేనునకు సిక్రి కుమారుడైన ఎలియెజెరు, షిమ్యోనునకు మాకా కుమారుడైన షెఫట్యా, లేవీకి కెమోవేలు కుమారుడైన హషబ్యా, అహరోనీయులకు సాదోకు, యూదాకు దావీదు సోదరుడైన ఎలీహు, యిస్సాఖారునకు మికాయేలు కుమారుడైన ఓమ్రీ, సెబూలూనుకు ఓబద్యా కుమారుడైన ఇష్మయా, నఫ్తాలికి అస్రియేలు కుమారుడైన యెరెమోతు, ఎఫ్రాయీమునకు అసస్యా కుమారుడైన హోషేయ, పడమటి మనష్షేకు పెదయా కుమారుడైన యోవేలు, గిలాదున తూర్పు మనష్షేకు జెకర్యా కుమారుడైన ఇద్ధో, బెన్యామీనునకు అబ్నేరు కుమారుడైన యసీఏలు, దానునకు యెరోహాము కుమారుడైన అసరేలు.
23. ప్రభువు యిస్రాయేలు ప్రజలను ఆకాశము నందలి చుక్కలవలె వ్యాప్తి చేయుదునని చెప్పెను. కావున దావీదు ఇరువదియేండ్లకంటే క్రింది వయస్సు వారి లెక్కలు సేకరింపలేదు.
24. సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు సేకరింప మొదలు పెట్టెనుగాని పూర్తిచేయలేదు. ఈ లెక్కల మూలమున దేవుడు యిస్రాయేలీయులను శిక్షించెను. కావున జనసంఖ్య మొత్తము ఇంతయని రాజు దస్తావేజులలో లిఖింపబడలేదు.
25-31. రాజు ఆస్తిపాస్తులకు అధికారులుగా నున్నవారి జాబితా ఇది: రాజు వస్తుసంభారములను భద్రపరచిన గదులకు అదియేలు కుమారుడైన అస్మావేతు. పట్టణములలోను, పల్లెలలోను, కోటలలోను వస్తుసంభారములను భద్రపరచిన గదులకు ఉజ్జీయా కుమారుడైన యెహోనాతాను. రాజు పొలములలో పనిచేయు కూలీలకు, కెలూబు కుమారుడైన ఎస్రి, ద్రాక్షతోటలకు రామా నగరవాసియైన షిమీ. ద్రాక్షసారాయమును పదిలపరచిన గదులకు షెఫాము నగరవాసియైన సాబ్ది. పడమటి కొండలలోయలలోని ఓలివు తోటలకు, మేడిచెట్లకు గేదేరు నగరవాసియైన బాల్హానాను. ఓలివునూనె కొట్లకు యోవాసు. షారోను మైదానములోని పశువులకు షారోను మండలవాసియైన షిట్రాయి. లోయలలోని పశువులకు అధ్లాయి కుమారుడైన షాఫాత్తు. ఒంటెలకు యిష్మాయేలీయుడైన ఓబీలు. ఆడుగాడిదలకు మెరోనోతు మండలవాసియైన యెహ్దియా . గొఱ్ఱెలు, మేకలు, పశువుల మందలకు హగ్రి జాతివాడైన యాసీసు.
32. దావీదు పినతండ్రియైన యోనాతాను నేర్పరియైన సలహాదారు, పండితుడు. అతడును, హక్మోని కుమారుడైన యెహీయేలును రాజకుమారుల విద్యాభ్యాసమునకు బాధ్యులు.
33. అహీతో ఫెలు రాజునకు సలహాదారు. ఆర్కీయుడైన హూషయి రాజు స్నేహితుడు.
34. బెనాయా కుమారుడైన యెహోయాదా, అబ్యాతారు అనువారు అహీతోఫెలు మరణానంతరము రాజునకు సలహాదారులైరి. యోవాబు సైన్యాధిపతి.
1. దావీదు యిస్రాయేలు అధికారులనందరిని యెరూషలేమున సమావేశపరచెను. తెగనాయకులును, రాజోద్యోగులును, ఆయా వంశనాయకులును, సైనికసహస్ర, శతాధిపతులును, రాజునకును, అతని కుమారులకును చెందిన ఆస్తిపాస్తులను, పశుగణములను సంరక్షించువారును, రాజప్రాసాదపాలకులును, వీరులును, ప్రముఖులును మొదలైన వారందరును హాజరైరి.
2. దావీదు వారిముందట నిలుచుండి ఇట్లు పలికెను: “సోదరులారా! నా ప్రజలారా! వినుడు. నేను మన ప్రభువునకు పాదపీఠమైన మందసమునకు శాశ్వతమైన మందిరమును నిర్మింపగోరి సన్నాహములు చేసితిని.
3. కాని ప్రభువు నాతో 'నీవు యుద్ధములుచేసి రక్తమొలికించితివి కనుక నీ చేతులతో నా నామమునకు మందిరము కట్టింపరాదు' అని చెప్పెను.
4. ప్రభువు మా కుటుంబమునుండి నన్నును, నా సంతతిని యిస్రాయేలునకు శాశ్వత పాలకులుగా ఎన్నుకొనెను.
5. ఆయన యూదా తెగలవారిని, వారిలోమా కుటుంబమువారిని నాయకులుగా ఎన్నుకొనెను. మా కుటుంబమునుండి నన్ను ఎన్నుకొని యిస్రాయేలీయులెల్లరికి రాజుగా చేసెను. అది ఆయన అనుగ్రహము. ఆయన నాకు చాలమంది తనయులను దయచేసెను. వారిలో సొలోమోనును ఎన్నుకొని యిస్రాయేలీయులపై తన రాజ్య సింహాసనమున కూర్చుని పరిపాలించుటకు అతనిని నియమించెను.
6. ప్రభువు నాతో 'నీ కుమారుడు సొలోమోను నాకు మందిరము కట్టించును. అతనిని నా కుమారునిగా ఎన్నుకొంటిని. నేనతనికి తండ్రినగుదును.
7. అతడు ఇప్పటివలెనే ఇకమీదట గూడ నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించెనేని నేనతని రాజ్యము శాశ్వతముగా నిలుచునట్లు చేయుదును” అని చెప్పెను.
8. “కనుక ఇప్పుడు నేను మన దేవుడైన ప్రభువు ఎదుట, ఆయన సమాజమున చేరిన ఈ యిస్రాయేలీయుల ఎదుటను మిమ్ము ఆజ్ఞాపించుచున్నాను. మీరు ప్రభువు ఆజ్ఞాపించిన విధులనెల్ల పాటింపుడు. అప్పుడు మీరు ఈ సారవంతమైన నేలను స్వాధీనము చేసికొని, దానిని తరతరములవరకు మీ సంతతికి భుక్తము చేయుదురు.
9. కుమారా! సొలోమోనూ! నీ మట్టుకు నీవు నీ తండ్రియొక్క దేవుడైన ప్రభువును అంగీకరింపుము. పూర్ణహృదయముతోను, పూర్ణమనస్సుతోను ఆయనను సేవింపుము. ఆయనకు నరుల హృదయములును వారి ఆలోచనలును బాగుగా తెలియును. నీవు ప్రభువును ఆశ్రయింతువేని ఆయన నిన్ను అంగీకరించును. కాని నీవు ప్రభువునుండి వైదొలగెదవేని ఆయన నిన్ను శాశ్వతముగా విడనాడును,
10. తనకు పవిత్రమైన మందిరమును కట్టించుటకు ప్రభువు నిన్నెన్నుకొనెను. కనుక నీవు దీక్షతో ఆ కార్యమునకు పూనుకొనుము.”
11. అంతట దావీదు దేవాలయ నిర్మాణ నమూనాను సొలోమోనునకు చూపించెను. మరియు సంబంధిత వస్తుసంభారములు ఉంచుగదులు, మీది గదులు, లోపలిగదులు, కరుణాపీఠమునుంచు గది మొదలైనవాని నమూనాలనుగూడ అతనికి చూపించెను.
12. ఇంకను అతడు తన మనసులో భావించుకొనిన దేవాలయ ప్రాంగణములు వాని చుట్టు గల గదులు, కానుకలను సంబంధిత వస్తుసంభారములను పదిలపరచుటకు వలయుగదులు మొదలైన వాని నమూనాలను గూడ సొలోమోనునకు చూపించెను.
13. యాజకులను, లేవీయులను బృందములుగా విభజించుట గూర్చియు, వారిచేత ఆరాధన కార్యక్రమములను కొనసాగింపవలసిన తీరునుగూర్చియు, ఆరాధనమున వాడబడు పాత్రలను పదిలపరచుట గూర్చియు వివరించెను.
14-16. ఆయాపాత్రలను, పలురకముల దీపములను, దీపస్తంభములను, వెండి ఉపకరణములను, దేవుని ఎదుటనుంచు రొట్టెలను పెట్టు బంగారు బల్లను తయారుచేయుటకు ఎంత వెండిని, ఎంత బంగారమును వినియోగింపవలయునో కూడ తెలియ జేసెను.
17. గరిటెలను, గిన్నెలను, కూజాలను చేయించుటకెంత మేలిమిబంగారము వాడవలయునో, పాత్రలు చేయించుటకు ఎంత వెండి కావలయునో చెప్పెను.
18. ధూపపీఠమును చేయించుటకు, మందసముమీదికి రెక్కలు చాచిన కెరూబుదూతల ప్రతిమలకు రథమును చేయించుటకు ఎంత మేలిమి బంగారము కావలయునో వివరించెను.
19. దేవాలయ నిర్మాణమునుగూర్చి ప్రభువే స్వయముగా తనకు తయారుచేసి ఇచ్చిన నమూనాయందు పై వివరములన్నియు కలవని సొలోమోనుతో చెప్పెను.
20. కడన దావీదు సొలోమోనుతో “నీవు ధైర్య స్టైర్యములు అలవరచుకొనుము. దేనికిని భయపడక దేవాలయ నిర్మాణమునకు పూనుకొనుము. నేను సేవించిన ప్రభువు నీకు బాసటయైయుండును. దేవాలయ నిర్మాణము పూర్తియగువరకును,
21. అతడు నిన్ను విడనాడక నీకు తోడైయుండును. యాజకులు, లేవీయులు దేవాలయమున చేయవలసిన పనులు ముందుగనే నిర్ణయింపబడినవి. ఆయా కళలలో ఆరితేరిన పనివారు నీకు తోడ్పడుటకు సిద్ధముగానున్నారు. ఎల్ల ప్రజలు, వారి నాయకులు నీ ఆజ్ఞలు మనసావాచా పాటించుటకు వేచి యున్నారు” అని చెప్పెను.
1. దావీదు ప్రజాసమూహముతో "ప్రభువు నా కుమారుడు సొలోమోనును ఎన్నుకొనెను. కాని అతడు ఇంకను పసివాడు. అనుభవము లేనివాడు. చేయవలసిన కార్యము చాల గొప్పది. ఇది నరుల కొరకుకాదు, ప్రభువు నివాసముకొరకు నిర్మింపవలసిన మందిరము.
2. నా శక్తి కొలది నేను ముందుగనే వస్తువులు సేకరించి ఉంచితిని.
3. వెండి బంగారములు, ఇత్తడి, ఇనుము, కొయ్య, పలువిధముల రత్నములు, చలువరాయి ప్రోగుచేసి ఉంచితిని. ఇవి మాత్రమేకాక దేవాలయముపట్ల గల మక్కువచేత నా సొంత ఆస్తినుండి, వెండి బంగారములర్పించితిని.
4-5. గోడలకు పూతపూయించుటకును' అయా కళాకారులచే వివిధ వస్తువులను తయారు చేయించుటకును నేను ఆరువేల మణుగుల ఓఫిరు బంగారమును కానుకగా ఇచ్చితిని. ఆయా వెండి పనికి పదునాలుగు వేల మణుగుల వెండిని కూడ సమర్పించితిని. ఇప్పుడు మీలో ప్రభువునకు మనఃపూర్వకముగా కానుకలిచ్చుటకు సిద్ధముగానున్న వారెవ్వరు?” అనెను.
6-7. అపుడు కుటుంబాధిపతులు, ఆయా తెగల నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, సైన్యాధిపతులు, రాజు ఆస్తిపాస్తులను పరామర్శించువారు దేవాలయ నిర్మాణమునకు ఐదువేల మణుగుల బంగారమును, పదివేల బంగారు నాణెములను, ఇరువదివేల మణుగుల వెండిని, ముప్పది ఆరువేల మణుగుల ఇత్తడిని, రెండు లక్షల మణుగుల ఇనుమును హృదయ పూర్వకముగ సమర్పించిరి.
6-7. అపుడు కుటుంబాధిపతులు, ఆయా తెగల నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, సైన్యాధిపతులు, రాజు ఆస్తిపాస్తులను పరామర్శించువారు దేవాలయ నిర్మాణమునకు ఐదువేల మణుగుల బంగారమును, పదివేల బంగారు నాణెములను, ఇరువదివేల మణుగుల వెండిని, ముప్పది ఆరువేల మణుగుల ఇత్తడిని, రెండు లక్షల మణుగుల ఇనుమును హృదయ పూర్వకముగ సమర్పించిరి.
8. ఈ సొత్తునంతటిని, అచట ప్రోగైన రత్నములను కలిపి దేవాలయపు ఖజానాలో ముట్టజెప్పిరి. గెర్షోనీయుడైన యెహీయేలు ఈ సొత్తునకు అధికారిగా ఉండెను.
9. ప్రజలు ఈ బహుమతులనెల్ల మనఃపూర్వకముగా సమర్పించిరి. అందుకు ఎల్లరును సంతోషించిరి. దావీదురాజుకూడ మిగుల సంతసించెను.
10. దావీదు ప్రజలందరియెదుట ప్రభువును స్తుతించుచు ఇట్లనెను: “మా పితరుడు యిస్రాయేలుని దేవుడవైన ప్రభూ! నీకు కీర్తి కలుగునుగాక!
11. నీవు ఘనుడవు, శక్తిమంతుడవు, మహిమాన్వితుడవు, తేజస్వివి, ప్రాభవో పేతుడవు. భూమ్యాకాశము లందున్న వస్తుకోటి అంతయు నీదే. నీవు సార్వభౌముడవు. అన్నిటి మీదను సర్వాధికారివి.
12. నరులందరికిని సిరిసంపదలను, గౌరవములను దయ చేయువాడవు నీవే. బలసామర్థ్యములతో నీవు సర్వమును పరిపాలింతువు. ఎల్లరికిని ఘనతను, బలమును ప్రసాదించునదిగూడ నీవే.
13. ప్రభూ! ఇప్పుడు మేము నిన్ను స్తుతించుచున్నాము. మహిమాన్వితమైన నీ నామమును కీర్తించుచున్నాము.
14. నీకు ఉదారబుద్ధితో కానుకలు అర్పించుటకు నేనుగాని, నా ప్రజలుగాని ఏపాటివారము? అన్నియు నీవు ఇచ్చినవేకావా? నీవు మాకు దయచేసిన వానినే మేము నీకు తిరిగి సమర్పించుచున్నాము.
15. మేము కేవలము పరదేశులవలె, అతిథులవలె ఈ జీవితమును కొనసాగించువారలము. మా పితరులు కూడ అట్లే చేసిరి. మా జీవితము నీడవలె క్షణికమైనది. మేము మృత్యువును తప్పించుకోజాలము.
16. ప్రభూ! నీకు దేవళమును కట్టించి, నీ దివ్యనామమును కీర్తించుటకు నేను ఈ సొత్తు నంతటిని ప్రోగుచేసితిని. కాని ఈ సంపదయంతయు నీయొద్దనుండి వచ్చినదే, నీదే.
17. ప్రభూ! నీవు నరుల హృదయములను పరిశీలించువాడవని నేను ఎరుగుదును. చిత్తశుద్ధిగల నరుడు నీకు ప్రియుడగును. చిత్తశుద్ధితోనే నేను ఈ కానుకలన్నిటిని ఇష్టపూర్తిగా నీకు సమర్పించితిని. ఇచట ప్రోగైన ఈ ప్రజలు ఈ బహుమతులన్నిటిని మనఃపూర్వకముగా అర్పించుట చూచి నేనెంతయో సంతసించుచున్నాను.
18. మా పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులు కొలచినదేవా! ఈ ప్రజల హృదయములలో ఈ 'భక్తి భావము కలకాలము నిలచియుండునట్లు చేయుము. వారి హృదయములెల్లపుడు నీపై లగ్నమై ఉండునట్లు చేయుము.
19. నా కుమారుడు సొలోమోను పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించునట్లును, నీకు దేవళమును నిర్మించునట్లును తోడ్పడుము. దానికొరకే నేను ఈ సన్నాహములన్నింటిని చేసితిని.”
20. అంతట దావీదు ప్రజలతో “ఇక మీ ప్రభువును స్తుతింపుడు” అనెను. వెంటనే జనులెల్లరు తమ పితరుల దేవుడైన ప్రభువును కీర్తించిరి. శిరస్సు నేలపై మోపి ప్రభువును స్తుతించిరి. రాజును కూడ గౌరవించిరి.
21. ఆ మరుసటినాడు యిస్రాయేలీయులు వేయికోడెలను, వేయిపొట్టేళ్ళను, వేయి గొఱ్ఱె పిల్లలను వధించి ప్రభువునకు బలులు, దహనబలులు అర్పించిరి, పానీయార్పణములు సమర్పించిరి. ప్రజల తరపున ఎన్నియో బలులర్పించిరి.
22. ఎల్లరు ప్రభువు సమక్షమున భోజనముచేసి, పానీయములు సేవించి పరమానందమునొందిరి. వారు రెండవ మారు సొలోమోనును రాజుగా ప్రకటించిరి. దేవుని పేర అతనిని రాజుగాను, సాదోకుని యాజకునిగాను అభిషేకించిరి.
23. దావీదునకు బదులుగా సొలోమోను ప్రభువు సిద్ధముచేయించిన సింహాసనమును అధి స్థించెను. అతడు నానాటికి వర్ధిల్లుచుండెను. యిస్రాయేలీయులెల్లరు అతని ఆజ్ఞలను పాటించిరి.
24. రాజోద్యోగులు, వీరులు, దావీదు. ఇతర కుమారులు కూడ సొలోమోను రాజునకు నమ్మినబంటులమై ఉందుమని ప్రమాణముచేసిరి.
25. ప్రభువు యిస్రాయేలీయులు ఎల్లరు సొలోమోను వైభవము చూచి ఆశ్చర్యపడునట్లు చేసెను. అతనికి ముందుగా యిస్రాయేలీయులను ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతనికి అనుగ్రహించెను.
26. యిషాయి కుమారుడైన దావీదు యిస్రాయేలీయులు అందరికి రాజుగానుండెను.
27. అతడు నలువదియేండ్లు పరిపాలించెను. హెబ్రోనున ఏడేండ్లు, యెరూషలేమున ముప్పది మూడేండ్లు రాజ్యము చేసెను.
28. అతడు సిరిసంపదలతో తులతూగి గౌరవాదరములకు పాత్రుడై పండువంటి నిండు ప్రాయమున మరణించెను. అతని తరువాత అతని తనయుడు సొలోమోను రాజయ్యెను.
29. దావీదు చరిత్ర మొదటినుండి తుదివరకు దీర్ఘదర్శియైన సమూవేలు, ప్రవక్తయగు నాతాను, దార్శనికుడైన గాదు వారల మాటలయందు లిఖింపబడియే ఉండెను.
30. దావీదు పరిపాలనము, అతని శక్తి సామర్థ్య ములు, అతనికి, యిస్రాయేలీయులకు, ఇరుగు పొరుగు రాజ్యములకు సంభవించిన సంఘటనలను పై చరిత్రలు వర్ణించుచునే ఉన్నవి.