ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము

 1. సర్వ విజ్ఞానము ప్రభువు నుండి వచ్చును. అది కలకాలము ఆయన చెంతనే ఉండును.

2. సముద్రపు ఇసుక రేణువులను, వర్ష బిందువులను, అనంతకాలపు దినములను గణీంపగల వాడెవడు?

3. ఆకాశము ఎత్తును, భూమి వైశాల్యమును, అగాధ విజ్ఞానముల లోతును తెలియగల వాడెవడు?

4. అన్నిటికంటె ముందుగా ప్రభువు విజ్ఞానమును సృజించెను. కావున వివేకము ఎల్లవేళల ఉన్నదియే.

5. ఆకాశమందలి దేవుని వాక్కే విజ్ఞానమునకు ఆధారము. శాశ్వతములైన ఆజ్ఞలు దానికి నిలయములు.

6. విజ్ఞానపు జన్మస్థానము ఎవరికి తెలియును? దాని తెలివిని ఎవరు గ్రహింపగలరు?

7. విజ్ఞానమునకు ఉండు తెలివిని ఎవరు అర్ధము చేసికోగలరు? దానికి ఉన్న అనుభవమును ఎవరు గ్రహింపగలరు?

8. జ్ఞానియైన వాడొక్కడే, అతడు మహా భయంకరుడు, సింహాసనాసీనుడైన ప్రభువు.

9. ఆయనే విజ్ఞానమును సృజించెను. దానిని పరిశీలించి చూచి దాని విలువను గ్రహించెను. తాను సృజించిన ప్రతి వస్తువును విజ్ఞానముతో నింపెను.

10. ప్రభువు ప్రతి నరునికి విజ్ఞానము నొసగెను. తనను ప్రేమించు వారికి మాత్రము దానిని సమృద్దిగా దయచేసెను.

11. ప్రభువు పట్ల భయభక్తులు గలవారికి గౌరవాదరములను, సంతోష సౌభాగ్యములను చేకూర్చును.

12. దేవుని పట్ల భయ భక్తులు కలవాని హృదయము సంతసించును. అతడు సుఖ సంతోషములతో దీర్ఘకాలము జీవించును.

13. అట్టి వాడు ప్రశాంతముగా కన్నుమూయును. అతడు మరణించునపుడు ప్రభువు అతడిని దీవించును.

14. ప్రభువుపట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. భక్తులు మాతృ గర్భము నుండియే విజ్ఞానమును పొందుదురు.

15. ఆదిమ కాలము నుండి విజ్ఞానము నరులతో వసించుచున్నది. భావి తరమువారు కూడ దానిని నమ్మెదరు.

16. దేవునిపట్ల భయభక్తులు చూపుటయే పరిపూర్ణ విజ్ఞానము. నరులు దాని ఫలములతో ఆనంద పరవశులగుదురు.

17. అది మన గృహములను, గాదెలను మనము కోరుకొనిన మంచి వస్తువులతో నింపును.

16. అతని దృష్టిలో మనము చలామణికాని నాణెముల వంటి వారలము. మన కార్యములు అశుద్ధమువలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రియని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు.

19. ప్రభువు తెలివిని వివేచనమును నరుల మీద క్రుమ్మరించును. అది తనను స్వీకరించు వారికి మహా గౌరవమును చేకూర్చి పెట్టును.

20. దేవునిపట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మూలము. దీర్గాయువు దాని కొమ్మలు.

21. దేవుని పట్ల భయభక్తులు చూపినచో పాపము తొలగి పోవును. కోపము మటుమాయమైపోవును.

22. అనుచితమైన కోపము తగదు. అది కోపిష్టినే నాశము చేయును.

23. సహనవంతుడు తగిన సమయము కొరకు ఓపికతో వేచియుండును. కడన అతడు సంతోషము చెందును.

24. తగిన కాలము వచ్చువరకు అతడు నోరు విప్పి మాట్లాడడు. కనుక అతడి ఉచిత విజ్ఞతను ఎల్లరును మెచ్చుకొందురు.

25. విజ్ఞానము, వివేక సూక్తులకు నిధి వంటిది, కాని పాపాత్ములకు దైవభక్తి గిట్టదు.

26. నీవు విజ్ఞానమును ఆశింతువేని దైవాజ్ఞలను పాటింపుము. అప్పుడు ప్రభువు దానిని నీకు సమృద్ధిగా దయచేయును.

27. దైవభయమే విజ్ఞానము, ఉపదేశముకూడ.  విశ్వసనీయత, వినయము ప్రభువు మెచ్చెడి గుణములు.

28. నీవు దైవభీతిని విడనాడ వలదు. చిత్తశుద్ధి లేకుండ దేవుని పూజింప వలదు.

29. జనుల ముందు నటన చేయవలదు. నీ మాటలను అదుపులో ఉంచుకొనుము.

30. అహంకారముతో విఱ్ఱవీగెదవేని కూలిపోయెదవు. నగుబాట్లు కూడ తెచ్చుకొందువు. ప్రభువు నీ రహస్యములను వెల్లడి చేసి భక్త సమాజము ముందట నీకు తలవంపులు తెచ్చును. ఎందుకన, దైవభీతి లేనందున నీ హృదయము కపటముతో నిండెను.

 1. కుమారా! నీవు దేవుని సేవింపగోరెదవేని పరీక్షకు సిద్దముగా ;నుండుము.

2. చిత్తశుద్ధితో, పట్టుదలతో మెలగుము. ఆపదలు వచ్చినపుడు నిబ్బరముగా నుండుము.

3. ప్రభువును ఆశ్రయింపుము. ఆయనను విడనాడకుము. అప్పుడు నీ జీవితాంతమున విజయమును పొందుదువు.

4. నీకెట్టి ఆపదలు వచ్చిన వానినెల్ల అంగీకరింపుము. శ్రమలు కలిగినను సహనముతో ఉండుము.

5. కుంపటిలో పుటము వేయుట బంగారమునకు పరీక్ష. శ్రమలకు గురియగుట నరునికి పరీక్ష

6. ప్రభువును నమ్మెదవేని ఆయన నిన్ను కాపాడును. ఋజు మార్గమున నడచుచు ప్రభువును విశ్వసింపుము.

7. దైవభీతి కలవారందరు ప్రభుని దయకొరకు వేచియుండుడు. అతనిని విడనాడెదరేని మీరు తప్పక నశించెదరు.

8. దైవభీతి కలవారందరు ప్రభుని నమ్ముడు. మీరు బహుమతిని పొందెదరు.

9. దైవభీతి కల వారందరు శుభముల నాశింపుడు. ప్రభువునుండి కరుణ, నిత్యానందము పొందుడు.

10.పూర్వ తరములను పరిశీలించి చూడుడు ప్రభువును నమ్మిన వాడెవడైన భంగపడెనా? నిరంతర దైవభీతి కలవానినెవనినైన ప్రభువు చేయివిడచెనా? తనకు మొరపెట్టిన వానినెవనినైన ఆయన అనాదరము చేసెనా?

11. ప్రభువు దయ, కనికరముకలవాడు. ఆయన మనపాపములను మన్నించును. ఆపదలలో నుండి మనలను కాపాడును.

12. పిరికివారు అధోగతి పాలయ్యెదరు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టు పాపులు నాశనమయ్యెదరు.

13. ధైర్యము కోల్పోవు వారు చెడుదురు. వారు విశ్వాసమును కోల్పోయిరి కనుక వారి నెవరును రక్షింపరు.

14. పోరాటము నుండి వైదొలగువారికి అనర్ధము కలుగును. ప్రభువు తీర్పు తీర్చుటకు వచ్చినపుడు వారికి దిక్కెవరు?

15. దైవభీతి కలవారు ప్రభువు ఆజ్ఞలను ఉల్లంఘింపరు. దైవప్రేమ కలవారు ప్రభువు మార్గములను విడనాడరు.

16. దైవభీతి కలవారు ప్రభువునకు ప్రియము గూర్తురు. దైవప్రేమ కలవారు ధర్మశాస్త్రమునకు బద్దులగుదురు.

17. దైవభీతి కలవారు దేవుని సేవించుటకు సిద్దముగా ఉందురు. దేవుని యెదుట వినయ విధేయతలను ప్రదర్శింతురు.

18. వారు "మేము దేవుని పాలబడెదముకాని నరుల పాలబడుటకు ఇష్టపడము. ఆ ప్రభువు మాహాత్మ్యము వలెనే ఆయన కరుణయు ఘనమైనది" అని పల్కుదురు.

 1. బిడ్డలారా! మీ తండ్రినైన నా పల్కు లాలింపుడు. నేను చెప్పినట్లు చేసినచో మీకు భద్రత కల్గును.

2. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెను. తల్లికి బిడ్డల మీద హక్కును ప్రభువు కల్పించెను.

3. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసికొనినట్లే,

4. తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే,

5. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థనను దేవుడు ఆలించును.

6. తండ్రిని ఆదరించువాడు దీర్గాయుష్మంతుడగును. తల్లిని సంతోష పెట్టవాడు దేవునికి విధేయుడైనట్లే,

7. పిల్లలు తల్లిదండ్రులకు బానిసల వలె లొంగి యుండవలెను.

8. నీవు వాక్కు,క్రియలలో నీ తండ్రికి లొంగియుండుము. అప్పుడు నీవతని దీవెనలు పొందుదువు.

9. తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధిచెందును. తల్లి శాపమువలన పిల్లల కొంపలు కూలిపోవును.

10. నీవు కీర్తిని పొందుటకు నీ తండ్రిని అవమానపరపరాదు. తండ్రికి అవమానము కలిగినపుడు పుత్రునికి గౌరవము కలుగదు.

11. తండ్రిని సన్మానించుట వలన తనయుడు గౌరవము పొందును. తల్లిని అవమాన పరచు సంతానము నిందను తెచ్చుకొనును.

12. నాయనా! వృద్దుడైన నీతండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించి యున్నంతవరకు కష్టపెట్టకుము.

13. అతనికి మతి తప్పినా నీవు ఆదరముతో చూడవలెను. నీవు బలముగ ఆరోగ్యముగ ఉన్నావు గనుక అతనిని అలక్ష్యము చేయరాదు.

14. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసిపెట్టును.

15. నీవు ఇక్కట్టులో ఉన్నపుడు ప్రభువు నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొనును. ఎండవేడిమికి మంచువలె, నీ పాపములెల్ల కరిగిపోవును.

16. తండ్రిని పరిత్యజించువాడు దైవదూషకుని వంటి వాడు. తల్లికి కొపము రప్పించు వాడు దైవశాపమునకు గురియగును.

17. కుమారా! నీవు చేయు పనులన్నిట వినయముతో మెలగుము. బహుమతులిచ్చు వానికంటె గూడ వినయవర్తనుని నరులు అధికముగా మెచ్చుకొందురు.

18. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము అప్పుడు ప్రభువ మన్నను పొందుదువు.

19. గొప్ప వారు, పేరు ప్రసిద్దులు కలవారు చాలమంది కలరు. కాని ప్రభువు వినయాత్మలకు తన రహస్యములను ఎరిగించును.

20. ప్రభువు మహా ప్రభావము కలవాడయినా వినవ్రముల పూజలందుకొనును.

21. నీ శక్తికి మించిన కార్యములను అర్ధము చేసికోవలెనని యత్నము చేయకుము. నీకు అందనివిషయములను పరిశీలింప వలెనని ప్రయాసపడకుము.

22. నీకనుగ్రహింపబడిన ధర్మశాస్త్రము మీద మనసు నిల్పుము. దేవుడు రహస్యముగా ఉంచినవానిని నీవు తెలిసికోనక్కరలేదు.

23. కనుక నీకు మించిన విషయముల జోలికి పోవలదు. అసలు నీకీయబడిన ధర్మశాస్త్రమే నరుల బుద్ధికి మించినది.

24. స్వీయాభిప్రాయము వలన చాలమంది అపమార్గము పట్టిరి. వారి తప్పుడు భావములు వారి ఆలోచనలను మందగింప జేసినవి.

25. కన్నులు లేనివాడు చూడలేడు. జ్ఞానశూన్యుడు తనకు జ్ఞానమున్నట్లు వాదము చేయకూడదు.

26. మొండితనము కలవాడు కదన ఆపద తెచ్చుకొనును. అపాయముతో చెలగాటమాడువానిని ఆ అపాయమే నాశము చేయును.

27. పెడసరపు బుద్ధి కలవానికి అనేక ఆపదలు వచ్చును. పాపి పాపము మీద పాపము మూట కట్టుకొనును .

28. గర్వాత్ముని వ్యధలను తొలగించుటకు మందు లేదు. దుష్టత్వము వానిలో లోతుగా వ్రేళ్లు పాతుకొన్నది.

29. తెలివికలవాడు సూక్తులనుండి విజ్ఞానమును పొందును. నేర్చుకోవలెనను కోరిక కలదు కనుక, అతడు శ్రద్ధతో వినును.

30. జలములు మంటను చల్లార్చును. దానధర్మములు పాపములకు ప్రాయశ్చిత్తము చేయును.

31. పరులకు ఉపకారము చేయువాడు తన భావిజీవితమును భద్రము చేసికొనినట్లే కష్టములు వచ్చినపుడు అతనికి సహాయము లభించును.

 1. కుమారా! నీవు పేదవాని బ్రతుకుదెరువును చెడగొట్టవలదు. అతడినాదుకొనుటలో ఆలస్యము చేయవలదు.

2. ఆకలిగొన్నవానికి ఆగ్రహము రప్పింపకుము. అక్కరలో ఉన్నవాని కోపమును రెచ్చగొట్టకుము.

3. నిరాశ చెందియున్న వాని బాధలను అధికము చేయకుము. అతడు చేయిచాచి అడిగినచో జాప్యము చేయకుము.

4. బిచ్చగాడు యాచించినపుడు నిరాకరింపకుము. పేదవాని నుండి మొగము ప్రక్కకు త్రిప్ప కొనకుము.

5. దరిద్రుని నుండి చూపు మరల్పకుము. అతడు నిన్ను శపింపకుండునట్లు చూచుకొనుము.

6. హృదయ వేదనను భరింపజాలక ఆ దరిద్రుడు నిన్ను శపించినచో ప్రభువతని మొరను ఆలించును

7. నీవు భక్త సమాజ మన్నన పొందుము. ఉన్నతవ్యక్తికి తలయొగ్గుము.

8. పేదలు విన్నవించుకొను సంగతులు వినుము. వారికి మర్యాదగా బదులు చెప్పుము.

9. పీడకుని బారి నుండి పీడితుని విడిపింపుము. నీవు తీర్చు తీర్పులలో ఖండితముగా నుండుము.

10. అనాథలకు తండ్రి వలె నుండుము. వితంతువులకు వారి భర్త వలె సాయపడుము. అప్పుడు నీవు మహోన్నతుడైన దేవునికి పుత్రుడవగుదువు. అతడు నీ సొంత తల్లి కంటె గూడ అధికముగా నిన్ను ప్రేమించును.

11. విజ్ఞానము తన బిడ్డలను పెంచి గొప్ప వారిని చేయును. తన చెంతకు వచ్చు వారిని ఆదరించును.

12. విజ్ఞానమును ప్రేమించు వాడు జీవమునే ప్రేమించినట్లు, విజ్ఞానము కొరకు వేకువనే ల చువాడు ఆనందమునుపొందును.

13. విజ్ఞానమును ఆర్థించువాడు మిగుల గౌరవమును పొందును. అతడెచటికి వెళ్లినా ప్రభువతనిని దీవించుచునే యుండును.

14. విజ్ఞానమును సేవించుటయనగా పవిత్రుడైన ప్రభువును సేవించుటే. దానిని ప్రేమించు నరుని ప్రభువు ప్రేమించును.

15. దానికి లోబడి యుండువారు చక్కగా తీర్పు తీర్తురు. దాని మాట పాటించువారు భద్రముగా బ్రతుకుదురు.

16. విజ్ఞానమును నమ్మువాడు దానిని సంపాదించుకొనును. తన సంతతికిగూడ దానిని వారసత్వముగా ఇచ్చి పోవును.

17. విజ్ఞానమును ఆర్జింప వలెనన్న మొదట కష్టముగానుండును. భయము, నిరుత్సాహము కలుగును. అది తన్నార్ధింప గోరు నరులను కఠినమైన క్రమ శిక్షణకు గురి చేయును. తనకు నమ్మకము కల్గినదాక వారిని పరీక్షించును.

18. కాని పిమ్మట అది ఆ నరులకు సులువుగా దొరకిపోవును. తన రహస్యములనెల్ల తెలియచేసి వారిని సంతోష పెట్టును.

19. కాని ఆనరులు తనను ఆనాదరము చేసినచో అది వారినివిడనాడును. వారి దుర్గతికి వారిని వదిలివేయును.

20. కుమారా! నీకు లభించిన అవకాశమును సద్వినియోగ పరచుకొనుము. కాని దుష్ట కార్యములకు పూనుకొనకుము. నిన్నుచూచి సిగ్గుపడకుము.

21. వినయవర్తనము గౌరవమును, కీర్తిని తెచ్చిపెట్టును. కాని తనను తాను తక్కువగా ఎంచుకొనుట పాప హేతువు.

22. ఇతరులపట్ల గల మోజుచే నీ ఆత్మ గౌరవమును చెరచుకోవలదు. నీ హక్కును వదలుకొని స్వీయనాశమును తెచ్చుకోవలదు.

23. అవసరము వచ్చినపుడు మౌనముగా ఉండకుము. నీ విజ్ఞానమును దాచిపెట్టు కొనకుము.

24. మన మాటల వలననే కదా మన విజ్ఞానము తెలియునది. మన పలుకుల వలననే కదా మన విద్య బయటపడునది.

25. ఐనను సత్య విరుద్ధముగా వాదింపకుము. నీ అజ్ఞానమును నీవు అంగీకరింపుము.

26. నీ పాపములను ఒప్పుకొనుటకు సిగ్గు పడకుము. ఏటికి ఎదురీదరాదు కదా!

27. మూర్ణుని చేతిలో కీలుబొమ్మవు కావలదు. పలుకుబడికలవారియెడ పక్షపాతము చూపవలదు.

28. చావుకుగూడ తెగించి సత్యముకొరకు పోరాడుము. ప్రభువు నీపక్షముననే యుద్దము చేయును.

29. మాటలలో దిట్టతనము చూపి, క్రియలలో సోమరితనము, జాప్యము చూపుట పనికిరాదు.

30. నీ ఇంటిలో సింహము వలె ప్రవర్తింపకుము. నీ సేవకులను శంకింపకుము.

31. తాను తీసికొనునప్పుడు చేయి చాచుట, తానీయవలసి వచ్చినపుడు చేయి ముడుచుకొనుట తగదు.

 1. నీవు ధనము మీద ఆధారపడకుము. డబ్బుతో "నాకు స్వయం సమృద్ధి" కలదని, అన్ని కలవు" అని తలపకుము.

2. నీవు కోరుకొనినదెల్ల సంపాదించు యత్నము చేయకుము. నీ హృదయ వాంఛల ప్రకారము ప్రవర్తింపకుము.

3. "నా మీదెవరికి అధికారము కలదు?” అని ఎంచకుము. అట్లు ఎంచెదవేని ప్రభువు నిన్ను శిక్షించును.

4. నేను పాపము చేసినను శిక్ష పడలేదుకదా అనుకొనకుము. ప్రభువు దీర్ఘకాలముసహించి ఊరకుండును.

5. దేవుడు క్షమింపక పోడులే అని యెంచి పాపముమీద పాపము మూట గట్టుకోవలదు.

6. "ప్రభువు మహా కృప గలవాడు. కనుక నేనెన్ని పాపములు చేసినను క్షమించునులే” అని తల పకుము. ఆయన కృపను, కోపమును గూడ ప్రదర్శించును. పాపులను కఠినముగా దండించును.

7. కనుక నీవు రోజుల తరబడి జాప్యము చేయక శిఘ్రమే   దేవుని యొద్దకు మరలిరమ్ము ప్రభువు కోపాగ్ని నీ మీద దిడీలున రగుల్కొన వచ్చును. అప్పుడు ఆయన శిక్ష వలన నీవు సర్వనాశమయ్యెదవు.

8. అన్యాయార్జితమైన ధనమును నమ్మకుము. నాశము సంభవించినపుడు అది నిన్ను కాపాడలేదు.

9. ప్రతిగాలికి తూర్పార పట్టవద్దు. ప్రతిత్రోవ త్రోక్కవద్దు. చిత్తశుద్ధిలేని పాపులకది చెల్లును.

10. నీవు నమ్మినదానికి కట్టువడి ఉండుము. నీ పలుకులలో నిజాయితి చూపెట్టుము.

11. ఇతరులు మాటలాడినపుడు జాగ్రత్తగా వినుము. కాని నిదానముగా ఆలోచించి జవాబు చెప్పుము.

12. నీకు తెలియనేని బదులుచెప్పుము. లేదేని మౌనము వహింపుము.

13. నీ మాటలవలననే నీకు ఖ్యాతి, అపఖ్యాతికూడ కలుగును. నీ నాలుక వలననే నీవు నాశము తెచ్చుకొందువు.

14. నీవు చాడీలుచెప్పుటలో దిట్టవనిపించుకోవలదు. నీ నాలుకతో ఉచ్చులు పన్నువద్దు. దొంగలు అవమానమునకు గురియైనట్లే అసత్య వాదులు తీవ్రనిందకు పాత్రులగుదురు.

15.పెద్ద తప్పులను, చిన్న తప్పులనుకూడ మానుకొనుము.

 1. మిత్రుడుగా మెలగ వలసిన చోట శత్రువుగా మెలగవలదు. చెడ్డపేరు వలన నీవు అపకీర్తి తెచ్చుకొందువు. కల్లలాడు దుర్మార్గులకు అట్టిది చెల్లును.

2. ఆశాపాశములకు తావీయకుము. అవి నిన్ను ఎదువలె కొమ్ములతో పొడిచివేయును.

3. నీవు ఎండిపోయి, ఆకులను పండ్లను కోల్పోయిన చెట్టు వంటివాడ వగుదువు.

4. ఆశాపాశము వలన నరుడు చెడును. నీ శత్రువులు నిన్ను చూచి నవ్వుదురు.

5. మృదుభాషణము వలన చాలమంది స్నేహితులు కల్గుదురు, మర్యాద వర్తనము వలన మిత్రులు పెరుగుదురు.

6. నీకు పరిచితులు చాల మంది ఉండవచ్చు గాక! సలహా దారునిగా మాత్రము వేయి మందిలో ఒక్కని ఎన్నుకొనుము.

7. పరీక్షించి చూచినపిదపనేగాని ఎవనినైన మిత్రునిగా అంగీకరింపరాదు. త్వరపడి ఎవరిని నమ్మరాదు.

8. కొందరు తమకు అనుకూలముగా ఉన్నపుడు నీకు మిత్రులగుదురు. కాని ఆపదలువచ్చినపుడు నిన్ను పట్టించుకొనరు.

9. మరికొందరు ఏదో వివాదమును పరస్కరించుకొని నీ నుండి విడిపోయెదరు. ఆ వివాదమును ఎల్లరికిని తెలియజేసి నిన్ను చీకాకు పెట్టెదరు.

10-11. ఇంక కొందరు నీ యింట భుజింతురు. నీ కలిమిలో నీకు అంటి పెట్టుకొని ఉండి, నీ సేవకులకు ఆజ్ఞలిడుదురు. కాని నీకు ఆవదలు వచ్చినపుడు నీ చెంతకు రారు.

12. నీకు దీనదశ ప్రాప్తించినపుడు వారు నీకు విరోధులగుదురు. నీ కంటికి కూడ కన్పింప కుండ మరుగైపోవుదురు.

13. నీ శత్రువులకు దూరముగా నుండుము. నీ మిత్రులను జాగ్రత్తగా పరీక్షించు చుండుము.

14. నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటి వాడు. అట్టి వాడు దొరికినచో నిధి దారికినటే.

15. అతనికి వెల కట్టలేము, అతని విలువ అన్నిటిని మించినది.

16. అతడు కాయసిద్ధినొసగు రసాయనము వంటివాడు. దైవభీతి కలవారికే అట్టి స్నేహితుడు దొరకును.

17. దైవభీతి కల వానికి మంచి మిత్రులు దొరకుదురు. అతని మిత్రులు దైవభీతి కలవారే అగుదురు.

18. కుమారా! బాల్యము నుండి ఉపదేశమును నేర్చుకొనుము. ముదిమి పైబడు వరకు విజ్ఞానమును గడించుచుండుము.

19. రైతు పొలము దున్ని విత్తనములు నాటినట్లే నీవు విజ్ఞానార్థన కొరకు కృషి చేయుము. అప్పుడు నీకు చక్కని పంట లభించును. ఆ కృషిలో నీవు కొంత శ్రమపడ వలెను. కాని అనతి కాలముననే నీవు మంచి పంటను సేకరింతువు.

20. క్రమ శిక్షణకు లొంగని వారికి విజ్ఞానము కటువుగా నుండును. మూర్ఖుడు దీర్ఘకాలము విజ్ఞానముతో మానలేదు.

21. విజ్ఞాన మతనికి పెద్ద బండ వలె భారముగా చూపట్టగా శీఘ్రమే దానిని అవతలికి నేట్టివేయును.

22. విజ్ఞానము తన పేరుకు తగిన గౌరవము తెచ్చును. అది అందరిలో కనిపించదు.

23. కుమారా! నా హెచ్చరికలు ఆలింపుము, నా ఉపదేశమును నిరాకరింప కుము.

24. విజ్ఞానపు గొలుసులతో నీ పాదములను బంధించు కొనుము. దాని కాడిని నీ మెడ మీద పెట్టుకొనుము.

25. విజ్ఞా నమును నీ భుజముల మీద పెట్టుకొని మోయుము. దాని పగ్గములపట్ల అనిష్టము చూపకుము.

26. విజ్ఞానమును ప్రీతితో చేపట్టుము. హృదయ పూర్వకముగా దాని మార్గములలో నడువుము.

27. విజ్ఞానమును అన్వేషింపుము, అది నీకు దర్శనమిచ్చును. ఒకసారి దొరకిన తరువాత దానిని మరల చేజారిపోనీయ వద్దు.

28. కడన దాని వలననే నీవు హృదయ శాంతిని పొందుదువు. దానివలననే మహానందమును పొందుదువు.

29. విజ్ఞానపు గొలుసులు నీకు రక్షణదాయకములు. దాని కాడి నీకు గౌరవ సూచకమైన వస్త్రము వంటిది.

30. దాని కాడి నీకు బంగారు నగ వంటిది. దాని పగ్గములు అరుణ పట్టబంధముల వంటివి.

31. గౌరవ ప్రదమైన రాజ వస్త్రము వలె, వైభవోపేతమైన కిరీటమువలె నీవు విజ్ఞాన మును ధరింతువు.

32. నాయనా! నీకు కోర్కె కలదేని నేర్చుకొన వచ్చును. నీకు పట్టుదల కలదేని తెలివిని పొందవచ్చును.

33. నీకు వినుటకిష్టము కలదేని గ్రహింప వచ్చును. సావధాన ముగా విందువేని నీవు విజ్ఞానమును పొందుదువు.

34. నీవు పెద్దల యొద్దకు పొమ్ము జ్ఞాని నెవనినైన గుర్తుపట్టి అతనికి శిష్యుడవు కమ్మ

35. ధార్మిక బోధలను శ్రద్ధగా వినుము. విజ్ఞాన సూక్తులను వేనిని అలక్ష్యము చేయకుము.

36. జ్ఞాని ఎవడైన దొరకెనేని వేకువనే అతని యొద్దకు పొమ్ము నీ రాక పోకలతో అతని గడప అరిగిపోవునట్లు చేయుము.

37. ప్రభువు ఆజ్ఞలను ధ్యానింపుము. అతడి శాసనములను ఎల్ల వేళల అధ్యయనము చేయుము. అతడు నీమనస్సునకు ప్రబోధముకలిగించి, నీవు కోరుకొనిన విజ్ఞానమును దయచేయును.

 1. నీవు దుష్కార్యములను చేయకుందువేని అవి నీకెట్టి కీడు చేయవు.

2. అధర్మమునువిడనాడెదవేని అది నిన్ను విడనాడును.

3. అధర్మమను నాగటిచాళ్లలో విత్తనములు విత్తకుము. విత్తెదవేని ఏడు రెట్లుగా పండిన చెడ్డపంటను కోసికోవలసి వచ్చును.

4. దేవుని నుండి ఉన్నతమైన పదవిని కోరుకొనకుము. రాజు నుండి గౌరవప్రదమైన ఉద్యోగమును అర్ధింపకుము.

5. దేవుని ముందు నీ పుణ్యమును ఏకరువు పెట్టవద్దు. రాజునెదుట నీ విజ్ఞతను ప్రదర్శింపవద్దు.

6. అన్యాయమును తొలగించు సామర్థ్యము లేనపుడు న్యాయాధిపతివి కావలె నని ఉబలాట పడకుము. నీవు ఎవడైన పేరు ప్రఖ్యాతులు కలవానికి లొంగిపోయి న్యాయము చెరచి అపఖ్యాతి తెచ్చుకోవచ్చును.

7. పౌరులకు అపకారము చేసి లోకమునెదుట నగు బాట్లు తెచ్చు కొనకుము.

8. ఒకసారి చేసిన తప్ప మరల చేయవద్దు. అసలు ఒక తప్పకే శిక్ష పడవలెను.

9. “నేను ఉదార బుద్ధితో సమర్పించిన కానుకలను మహోన్నతుడైన ప్రభువు అంగీకరించునులే, నేనేమిచ్చినను అతడు చేకొనునులే” అని తలపకుము.

10. విసుగు చెందక ప్రార్ధింపుము. దాన ధర్మములు చేయటలో వెనుకాడకుము.

11. భంగపాటుకు గురియైన నరుని పరిహాసము చేయకుము. నరుని తగ్గించుటకు హెచ్చించుటకు గూడ ప్రభువే సమరుడు.

12. నీసోదరుని మీద చాడీలు చెప్పవలెనని తలపకుము. నీ మిత్రుని మీద కొండెములు తల పెటకుము.

13. అసలు కొండెములు చెప్పకుము. వాని వలన ఏ ప్రయోజనమును లేదు.

14.పెద్దలున్న సభలో దీర్ఘోపన్యాసములు చేయకుము. ప్రార్థన చేయునపుడు చెప్పిన సంగతులనే చెప్పు కొనుచు పోవలదు.

15. వ్యవసాయము గాని, ఇతరములైన కాయ కష్టములను గాని తప్పించుకోవలదు. మ హోన్నతుడైన ప్రభువే వానిని నియమించెను.

16. పాపుల పక్షమున చేరకుము. పాపులు దేవుని శిక్షను తప్పించుకో జూలరు.

17. వినయమును ప్రదర్శింపుము. అగ్నికి, క్రిములకు ఆహుతియగుటయే దుర్మార్గులకు శిక్ష

18. డబ్బుకొరకై మిత్రునివదలుకోవలదు. మేలిమి బంగారముకొరకు సోదరుని విడనాడవలదు.

19. యోగ్యురాలు, వివేకవతియైన వధువు దొరకినపుడు ఆమెను పెండ్లియాడుటకు సంసిద్దముగా ఉండవలెను. మనోహరియైనభార్య బంగారముకంటె విలువకలది.

20. చిత్తశుద్ధితో పనిచేయు సేవకునకుగాని, పూర్ణ హృదయముతో శ్రమచేయు కూలివానికిగాని హాని చేయ రాదు.

21. బుద్ధిమంతుడైన బానిసను అత్మీయునిగా ఎంచి అభిమానింపుము. అతనికి స్వాతంత్య్రము  దయచేయుము.

22. నీకుగల పశువులను జాగ్రత్తగా మేపుకొనుము. ఆదాయము లభించెనేని వానిని ఉంచుకొనుము.

23. నీకు సంతానము కలరేని వారికి విద్యా బుద్ధులు నేర్పుము. చిన్న ప్రాయము నుండి క్రమ శిక్షణను గరపుము.

24. పుత్రికలు కలరేని వారిని శీలవతులనుగా తీర్చిదిద్దుము. వారిపట్ల నెక్కువ గారాబము చూపవలదు.

25. కుమార్తెకు పెండ్లి చేయువాడు దొడ్డకార్యము చేసినట్లగును. కాని ఆమెను వివేకముకల యువకునికి ఇమ్ము

26. నీ భార్య నీకు ప్రీతి కలిగించునదైనచో విడాకులీయవద్దు. కాని నీ కిష్టముకాని దైనచో, నమ్మవద్దు.

27. పూర్ణ హృదయముతో నీ తండ్రిని గౌరవింపుము. నిన్నుగన్న తల్లి పురిటినొప్పలను మరిచిపోవలదు.

28. నీకు ప్రాణమి చ్చిన వారు నీ జననీ జనకులు. వారిఋణమును నీవెట్ల తీర్చుకోగలవు?

29. పూర్ణ హృదయముతో ప్రభువుపట్ల భయభక్తులు చూపుము. ఆయన యాజకులను గౌరవింపుము.

30. నీ పూర్ణబలముతో నీ సృష్టి కర్తను ప్రేమింపుము. ఆయన యాజకులను ఆదుకొనుము.

31. దేవునికి భయపడి యాజకులను గౌరవింపుము. విద్యుక్త ధర్మముగా వారికీయవలసిన కానుకల నిమ్మ ప్రథమ ఫలములు, పాప పరిహార బల్యర్పణములు, బలి పశువు జబ్బ, బల్యర్పణములు, పవిత్రార్పణములను ఇమ్ము.

32. పేద సాదలకు దాన ధర్మములు చేయుము. అప్పుడు దేవుడు నిన్ను నిండుగా దీవించును.

33. బ్రతికున్న వారందరికి దానధర్మములు చేయుము. చనిపోయిన వారిని కూడ నెనరుతో స్మరించుకొనుము.

34. శోకతప్తులకు సానుభూతి చూపము. బాధార్తుల బాధలలో పాలు పంచుకొనుము.

35. వ్యాధిగ్రస్తులను సందర్శించుటలో అశ్రద్ధ చూపవలదు. అట్టి సత్కార్యములద్వారా ప్రజల మన్నన పొందుదువు.

36. ఒక దినమున నీవు మరణించి తీరుదువని నీవు చేయు కార్యము లన్నింటను గుర్తుంచుకొనుము. అప్పుడెన్నడు పాపము కట్టుకొనవు.

 1. పేరు ప్రసిద్దులు కలవానితో పోటీకి దిగవద్దు. నీవతని ఆధిక్యమునకు లొంగిపోవలసివచ్చును.

2. సంపన్నునితో కలహము తెచ్చుకోవద్దు. అతడు లంచము పెట్టి నిన్నోడింప వచ్చును. బంగారము చాలమందిని చెరచినది. రాజుల హృదయాలను అపమార్గము పట్టించినది.

3.మదరు బోతుతో వివాదమునకు దిగవద్దు. నీవు అతని అగ్నికి సమిధలు పేర్చినట్లగును.

4. సభ్యత లేని వానితో సరసమునకు దిగవద్దు. అతడు నీ పూర్వులను దెప్పిపొడవవచ్చును.

5. తన పాపములకు పశ్చాత్తాప పడినవానిని నిందింపవద్దు. మన మందరము తప్పులు చేయువారమే కదా!

6. వృద్దుని చిన్నచూపు చూడ వలదు. మన మందరము ముసలి వారమగుదుముకదా!

7. ఎట్టివాడు చనిపోయినను సంతోషింపవలదు. మన మందరము మరణింప వలసినదేకదా!

8. విజ్ఞల బోధను అనాదరము చేయవద్దు. వారి సూక్తులను జాగ్రత్తగా పఠింపుము. వాని వలన నాగరికతను అలవరచుకొని ఉన్నతులకు సేవలు చేయు విధానమును నేర్చుకొందువు.

9. వృద్దుల ఉపదేశములను అనాదరము చేయవలదు. వారు తమ పూర్వుల నుండియే వానిని నేర్చుకొనిరి. వారి నుండి నీవు విజ్ఞానమును గడింతువు. అవసరము కల్గినప్పుడు జవాబును ఎట్లు చెప్పవలెనో కూడ తెలిసికొందువు.

10. దుష్టుని ఉద్రేకములను రెచ్చగొట్ట వలదు. అప్పుడు అతడు నీకు హాని చేయవచ్చును.

11. వాదమాడుచు పొగరుబోతుతో నడువ వలదు. అతడు నీ పలుకులకు అపార్ధము కల్పించి వానిని నీ మీదనే త్రిప్పికొట్టును.

12. నీ కంటె బలాఢ్యుడైన వానికి ఏవస్తువు అరువీయకుము. ఇత్తువేని, అది పోయినదాని క్రిందనే లెక్క

13. నీ శక్తికి మించి అన్యునుకి హామీగా నుండ వలదు. ఉందువేని, ఆ సొమ్ము చెల్లించుటకు సిద్ధపడుము.

14. న్యాయాధిపతి మీద వ్యాజ్యెము తేవలదు. తెత్తువేని, పదవీ బలము వలన అతడే నెగ్గును.

15. అపాయమును లక్ష్య పెట్టని దుస్సాహసితో పయనింపకుము. అతడు నీకు తంటాలు తెచ్చును. తన ఇష్టము వచ్చినట్లు వెఱ్ఱి పోకడలు పోయి, మూర్ఖ చేష్టల వలన నిన్నుకూడ నాశముచేయును.

16. కోపిష్టితో వాదింపకుము. అతనితో ఒంటరిగా ప్రయాణము చేయకుము. ప్రాణములు తీయుట అతనికి చాల చులకన. కనుక ఎవరి సహాయములభింపనిచోట నిన్ను మట్టు పెట్టవచ్చును.

17.మూర్ఖుని సలహా అడుగకుము. అతడు నీ రహస్యములను బట్ట బయలు చేయును.

18. అన్యుని యెదుట రహస్య కార్యముల నెట్టివేని చేయరాదు. అతడు ఆ రహస్యములను దాచునో లేదో తెలియదు.

19. ప్రతి వానికి హృదయము విప్పరాదు. ప్రతివాని నుండి ఉపకారములు పొందరాదు.

 1. నీవు అనురాగముతో చూచుకొను భార్యను శంకింపకుము. శంకింతువేని ఆమెను నీకు కీడు చేయ ప్రోత్సాహించినట్లగును.

2. ఏ స్త్రీకి మనసిచ్చి దాసుడవు కావలదు.

3. పరకాంతతో సాంగత్యము వలదు, నీవు ఆమె వలలో చిక్కుకొందువు.

4. పాట కత్తెతో చెలిమి వలదు, ఆమె నిన్ను బుట్టలోవేసికొనును.

5. కన్నెవైపు వెట్టిగా చూడకుము, ఆమెకు నష్ట పరిహారము చెల్లింపవలసి వచ్చును.

6. వేశ్యకు హృదయము అర్పింపకుము. నీ ఆస్తి అంత గుల్లయగును.

7. నగర వీదులలో నడుచునపుడు నలువైపుల తేరిపార చూడకుము. నరసంచారము లేని తావుల లోనికి పోవలదు.

8. అందకత్తె ఎదురుపడినపుడు నీ చూపు లను ప్రక్కకు త్రిప్పుకొనుము. పరకాంత సౌందర్యము మీదికి మనస్సు పోనీకుము. స్త్రీ సౌందర్యము వలన చాల మంది తప్పుత్రోవ పట్టిరి. అది అగ్ని జ్వాలలను రగుల్కొల్పును.

9. పరకాంత్ర సరసన కూర్చుండి భోజనము చేయకుము, ఆమెతో కలిసి పానీయము సేవింపకుము. నీవు ఆమె ఆకర్షణకు లొంగిపోయి, ఉద్రేకమునకు గురియై, స్వీయ నాశము తెచ్చుకోవచ్చును. తోడి నరులతో మెలగవలసిన తీరు

10. ప్రాత మిత్రుని పరిత్యజింపకుము. క్రొత్త మిత్రుడతనికి సాటిరాడు. నూత్న మిత్రుడు నూత్న ద్రాక్షాసవము వంటి వాడు, ప్రాతపడిన పిదపగాని మధువు సేవించుటకింపుగా నుండదు.

11. పాపి విజయమును గాంచి అసూయ చెంద వలదు. వానికెట్టి వినాశము దాపరించునో నీవెరుగవు.

12. దుష్టులు అనుభవించు ఆనందములను ఆశింపకుము. బ్రతికి యుండగనే వారికి శిక్షపడును.

13. నిన్ను చంపగోరు వానికి దూరముగా ఉండుము, అప్పుడు నీవు మృత్యు భయమును తప్పించు కొందువు. అతని యొద్దకు వెళ్లవలసి వచ్చెనేని జాగ్రత్తతో మెలగుము. లేదేని అతడు నిన్ను మట్టుపెట్టును. నీవు ఉచ్చుల నడుమ నడుచుచున్నావని, అపాయమునకు గరికానున్నావని గ్రహింపుము.

14.నీ ఇరుగు పొరుగు వారిని గూర్చి బాగా తెలిసికొనుము. జ్ఞానులను మాత్రమే సలహా అడుగుము.

15. విజ్ఞలతో మాత్రమే సంభాషణలు జరుపుము. మహోన్నతుని ధర్మశాస్త్రము గూర్చి మాత్రమే సంభాషింపుము.

16. సజ్జనుల సరసన మాత్రమే కూర్చుండి భుజింపుము. దైవభీతియే నీ గొప్పతనము అనుకొనుము.

17. నేర్పరియైన పనివాడు తాను చేసిన వస్తువు ద్వార కీర్తి పొందును. నాయకుడు తన ఉపన్యాసముల ద్వారా గణుతి కెక్కును.

18.వదరు బోతును చూచి యెల్లరు దడియదురు. నోటికి వచ్చినట్లు వాగునని అందరు వానిని అసహ్యించు కొందురు.

 1.విజ్ఞతగల పాలకుడు తన ప్రజలకు శిక్షణ నిచ్చును. అతని పరిపాలన క్రమబద్ధముగా ఉండును.

2.పాలకుడెట్టివాడో ఉద్యోగులును అట్టి వారగుదురు. ప్రజలుకూడ అతని వంటి వారే అగుదురు.

3.విద్యా రహితుడైన రాజు ప్రజలను చెరచును, పాలకులు విజ్ఞలైనచో ప్రభుత్వము బాగు పడును.

4. ప్రభువే లోకమును పరిపాలించును, అతడు తగిన కాలమున తగిన వానిని పాలకుని చేయును.

5.ఆ పాలకుని విజయము ప్రభువు చేతిలో నుండును, ఏ అధికారి కీర్తియైన ప్రభువు మీదనే ఆధారపడి యుండును.

6. తోడి నరుడు చేసెడి ప్రతి తప్పిదమునకు కోపపడకుము. దురహంకారముతో అమర్యాదగా ప్రవర్తింపకుము.

7. దేవుడు, నరుడు కూడ గర్వమును ఏవగించుకొందురు. ఆ యిరువురు కూడ అన్యాయమును అసహ్యించుకొందురు.

8. అన్యాయము, అహంకారము, సంపదలు అను వాని వలన రాజ్యములు కూలి, జాతినుండి జాతికి మారుచుండును.

9. దుమ్మును, బూడిదయునైన నరులు ఏమి చూచుకొని గర్వపడవలెను? మనము బ్రతికి యుండగనే మన శరీరము క్రుళ్లిపోవును.

10. నరుని దీర్ఘవ్యాధి వైద్యుని చీకాకు పెట్టును, నేడు బ్రతికి యున్న రాజు కూడ రేపు చచ్చి శవమగును.

11.నరుడు చచ్చిన పిదప అతనికి దక్కునది పరుగులు, ఈగలు మాత్రమే.

12. సృష్టికర్తయైన ప్రభువును విడనాడుట గర్వమునకు తొలిమెట్టు, వాని హృదయము వాని సృ ష్టికర్తను విడనాడును.

13.పాపముతో గర్వము ప్రారంభ మగును, గర్వితులుగానే మనుగడ సాగించువారు మహా దు పులగుదురు. ప్రభువు అట్టి వారిని తీవ్ర శిక్షకు గురిచేసి సర్వనాశము చేయును.

14. ప్రభువు రాజులను సింహాసనము నుండి కూలద్రోసి, వినయాత్మలను గద్దెనెక్కించెను.

15. అన్య జాతులను సమూలముగా పెరికివేసి, వారి స్థానమున వినములను పాదుకొల్చెను. 

16. రాజ్యములను నాశముచేసి వానిని అడపొడ కానరాకుండ చేసెను.

17. అతడు కొన్ని రాజ్యముల నెంతగా నాశము చేసెననగా నేడు నేల మీద వాని పేరుకూడ విన్పింపదు.

18. దేవుడు నరులు కోపింపవలెనని కోరుకొనడు. కనుక నరులు ఉగ్రులగుట తగదు.

19. ప్రాణులలో గౌరవారులు ఎవరు? నరులు. ఆ నరులలో గౌరవారులు ఎవరు? దైవభీతికలవారు. నిందారులు ఎవరు? దైవాజ్ఞలు మీరువారు.

20. అనుచరులు తమ నాయకుని గౌరవింతురు. దైవభీతి కలవారిని దేవుడు గౌరవించును.

21. దైవభీతి విజయమునకు తొలిమెట్టు. కాని గర్వము, మూర్ఖత్వము అపజయమునకు సోపానములు.

22. ధనవంతులు, సుప్రసిద్దులు దరిద్రులెల్లరు కూడ దైవభీతియే తమ గొప్ప అని తలంపవలెను.

23. జ్ఞానియైన పేదవానిని చిన్నచూపు చూడరాదు. దుష్టుని గౌరవింపరాదు.

24. పాలకులు, న్యాయాధిపతులు, సుప్రసిద్దులు గౌరవింపదగినవారే. కాని వారెవరు దైవభీతికలవారి కంటె ఎక్కువవారు కారు.

25. తెలివిగల సేవకుని స్వేచ్చా పరులైన పౌరులు సేవింతురు. తాము తెలివి కలవారేని వారికి అది తప్పగా చూపట్టదు. వినయము, ఆత్మగౌరవము

26. నీవు పని చేయునపుడు నీ నైపుణ్యమును ప్రదర్శింప నక్కరలేదు. ఇక్కట్టులలో నున్నపుడు డాంభికము పనికి రాదు.

27. ప్రగల్భములు పల్కుచు ఆకటితో చచ్చుట కంటె కష్టపడి పనిచేసి నిండుగా తిండి సంపాదించుకొనట మేలు.

28. కుమారా! ఆత్మాభిమానమును, వినయమును కలిగియుండుము. నీకు తగినట్లుగానే నిన్ను నీవు గౌరవించుకొనుము.

29. తనను తాను నిందించుకొనుట వలన ప్రయోజనము లేదు. ఆత్మగౌరవము లేనివానిని ఇతరు లు గౌరవింతురా?

30. పేదలైనా తెలివికల వారిని గౌరవింపవచ్చును. ధనికులను వారి సంపదలను చూచి సన్మానింతురు.

31. పేదవానిగనే గౌరవింపబడినచో అతడు ధనికుడైనపుడు ఇంకను గౌరవము పొందునుకదా! ధనికునిగానున్నప్పుడే అవమానము కలిగినచో అతడు దరిద్రుడైనపుడు ఇంకను అవమానమును పొందునుకదా!

 1. పేదవారి జ్ఞానము వారిని తల ఎత్తుకొనునట్లు చేయును. వారిని అధికులమధ్య కూర్చుండునట్లు చేయును. వెలుపలి డంబమును లెక్కచేయవద్దు

2. అందముగానున్నందువలన ఎవరిని మెచ్చుకోవలదు. అందముగా లేనందువలన ఎవరిని నిరాకరింపవలదు.

3. రెక్కలతో ఎగురు ప్రాణులలో తేనెటీగ చాలచిన్నది కాని దాని తేనె మహామధురముగా ఉండును. 

4. నీ నాణ్యమైన దుస్తులను చూచుకొని మురిసిపోవలదు. గౌరవము అబ్బినపుడు పొగరుబోతువు కావలదు. ప్రభువు అద్భుతకార్యములు చేయును. వానిని నరులు తెలిసికొనజాలరు. 

5. చాలమంది రాజులు గద్దె దిగి నేలమీద కూర్చుండిరి ఎవరు ఊహింపని వారువచ్చి, ఆ రాజుల కిరీటములు ధరించిరి.

6. పాలకులు చాలమంది అవమానమున మునిగిరి. సుప్రసిద్ధులు చాలమంది అన్యుల శక్తికి లొంగిపోయిరి.

7. విషయమును జాగ్రత్తగా పరిశీలించి చూచినగాని తప్పుపట్టవద్దు. ఆలోచించి చూచిన పిదపగాని విమర్శకు పూనుకోవద్దు.

8. ఇతరులు చెప్పినది వినిన పిదపగాని జవాబు చెప్పవద్దు. మాటలాడు వానికి మధ్యలో అడ్డురావద్దు.

9. నీకు సంబంధింపని విషయములలో తలదూర్చి తగవు తెచ్చుకొనకుము. పాపాత్ముల కలహములలో జోక్యము కలిగించుకొనకుము.

10. కుమారా! నీవు చాల కార్యములను నెత్తిన పెట్టుకోవద్దు. చాలపనులను చేపట్టెదవేని కష్టములను కొనితెచ్చుకొందువు. త్వరపడి పనిచేసినను నీవు మొదలు పెట్టిన కార్యములెల్ల ముగింపజాలవు. వానిని విడనాడజాలవు కూడ.

11. ఒకడు ఎంత శ్రమించి పనిచేసినను ఎల్లపుడు వెనుకబడుచునే యుండును.

12. మరియొకడు మందమతి, , అన్యుల సహాయము కోరువాడు, శక్తిలేనివాడు, పరమదరిద్రుడు కావచ్చును. కాని ప్రభువు వానిని కరుణతో వీక్షించి, దీనావస్థనుండి ఉద్దరింపవచ్చును.

13. అప్పుడతడు ఔన్నత్యము పొందగా చూచి ఎల్లరు ఆశ్చర్యచకితులగుదురు.

14. మేలు- కీడు, బ్రతుకు-చావు, కలిమి-లేమి అన్నియు దేవునినుండియే వచ్చును.

15. విజ్ఞానము, వివేకము, ధర్మశాస్త్రజ్ఞానము, ప్రేమ, సత్కార్యాచరణను ప్రభువే దయచేయును.

16. చెడు, అంధకారము దుష్టులకు పుట్టుకతోనే వచ్చును. చెడును కోరుకొనే వారు వృద్ధులగువరకు చెడ్డవారుగనే ఉండిపోయెదరు.

17. ప్రభువు భక్తిపరునికొసగు దీవెనలు దీర్ఘ కాలము నిలుచును. ఆయన మన్నన పొందినవాడు నిత్యము విజయములు చేపట్టును.

18. నరుడు కష్టించి, సుఖములు త్యజించి, ధనమార్జించినను కడన ఫలితమేమున్నది?

19. అతడు, “ఇక శ్రమచేయుట చాలించి నేనార్జించిన సొత్తుననుభవింతును” అని యెంచవచ్చునుగాక! కాని అతడు చనిపోవుటకును, అతని సొత్తు అన్యులు పాలగుటకును ఇంకెన్నినాళ్ళ వ్యవధియున్నదో అతడికే తెలియదుకదా!

20. నీ బాధ్యతలను పట్టుదలతోను, దక్షతతోను నిర్వహింపుము. నీవు చేయవలసిన పనులు చేయుటలోనే ముసలివాడవుకమ్ము.

21. పాపాత్ముల విజయములనుగాంచి అసూయ చెందకుము. దేవుని నమ్మి నీ పనులు నీవు శ్రద్ధగా చేయుము. క్షణకాలములోనే దరిద్రుని సంపన్నుని చేయుట ప్రభువునకు కష్టముకాదు.

22. భక్తుడు దేవుని దీవెననే బహుమతిగా బడయును. ఆ దీవెన క్షణకాలముననే సత్పలమొసగును.

23. కనుక నా అవసరములెట్లు తీరును? భవిష్యత్తులో నాకు విజయములు ఎట్లు సిద్ధించును? అని ఆందోళన చెందకుము.

24. మరియు, “నాకు కావలసిన వస్తువులన్నియు ఉన్నవి. భవిష్యత్తులో నాకెట్టి కీడు వాటిల్లదులే” అని తలపకుము.

25. జనులు కలిమి కలిగినపుడు రానున్న కష్టములు గుర్తింపరు. చెడుకాలము వచ్చినపుడు ముందటి లాభములను స్మరింపరు.

26. నరుడు చనిపోవుదినము వరకు వేచియుండి, అప్పుడు అతనిని బహూకరింప పూనుకొనుట ప్రభువునకు కష్టముకాదు.

27. ఆ క్షణమున అతని మంచిచెడ్డలు ఎల్లరును తెలిసికొందురు. ఆ కష్టపు క్షణములోనే అతని ఆనందమంతయు ఎగిరిపోవచ్చును.

28. కనుక చనిపోక పూర్వము ఏ నరుని ధన్యునిగా ఎంచవలదు. అతని సంతానము ద్వారానే అతడు ఎట్టివాడో తెలియును.

29. ప్రతివానిని నీ ఇంటికి ఆహ్వానింపవద్దు. కపటాత్ములెన్ని పన్నాగములైనను పన్నుదురు.

30. స్వజాతిపక్షులను వలలోనికి ఆహ్వానించు కౌజువలె దుష్టుడు మనలను అపాయము పాలుచేయును వేగుల వానివలెనతడు మన పతనమును పొంచి చూచుచుండును.

31. అతడు మన మంచినిగూడ చెడుగా ప్రదర్శించును. మన మంచిపనులలోకూడ తప్పుపట్టును.

32. చిన్న నిప్పురవ్వ గంపెడు బొగ్గులను రగిలించును. దుష్టుడు హత్యచేయుటకు కాచుకొని ఉండును.

33. అట్టి దుర్మార్గుని పన్నుగడలను కనిపెట్టి ఉండవలెను. లేదేని అతడు మనలను సర్వనాశనము చేయును

34. పొరుగు వానిని నీ ఇంటికి కొనివత్తువేని అతడు తగవులు పెట్టి నీకును, నీ కుటుంబమునకును మధ్య చీలికలు తెచ్చును.

 1. ఉపకారము చేయగోరెదవేని యోగ్యులెవరో పరిశీలింపుము. అప్పుడు నీ సత్కార్యము వ్యర్థముకాదు.

2. భక్తిపరునికి చేసిన ఉపకారమునకు అతనినుండి కాకున్నను, దేవుని నుండియైనను బహుమతి లభించును.

3. ఎల్లవేళల దుష్కార్యములు చేయువానికి, ఏనాడు దానధర్మములు చేయనివానికి మేలు కలుగదు.

4. దైవభక్తి కలవారికేగాని పాపాత్ములకు ఉపకారము చేయవద్దు.

5. వినయవంతునికి సహాయము చేయవలెను గాని భక్తిహీనునికి చేయరాదు. భక్తిలేని వానికి అన్నము పెట్టినచో అతడు నీ కరుణను విస్మరించి నీ మీద తిరుగబడును. నీవతడికి చేసిన మంచికిగాను రెండంతలు అదనముగా చెడ్డను అనుభవింప వలసివచ్చును.

6. మహోన్నతుడైన ప్రభువుకూడ పాపాత్ములను అసహ్యించుకొనును. వానిని శిక్షించితీరును.

7. సత్పురుషులకు దానము చేయవలెను. పాపాత్ములకు సహాయము చేయరాదు.

8. సంపదలలో మంచిమిత్రుని గుర్తింపజాలము. కాని ఆపదలలో చెడ్డమిత్రుని తప్పక గుర్తింపవచ్చును.

9. ఆపదలలో మిత్రులుకూడా మనలను విడిచిపోయెదరు. కాని, సంపదలలో చెడ్డవారును మిత్రులవలె నటింతురు.

10. చెడ్డ స్నేహితుని ఎప్పుడును నమ్మరాదు. త్రుప్పు లోహమునువలె  అతని దుష్టత్వము మనలను నాశనము చేయును

11. దుష్టుడు నక్కవినయములతో దండము పెట్టినను అతనినిగూర్చి జాగ్రత్తగా ఉండవలెను కంచుటద్దము మీది త్రుప్పువలె ఉండు వానిని తుడిచి వేయవలెను. అప్పుడు ఆ త్రుప్పు ఎట్టి హానియు చేయదు.

12. దుష్టమిత్రుని నీ ఎదుట ఉండ నిచ్చెదవేని అతడు నిన్ను ప్రక్కకునెట్టి, నీ స్థానమును ఆక్రమించుకోవచ్చును. అతనిని నీ కుడిప్రక్కన కూర్చుండనిచ్చెదవేని నీ పీఠమును కాజేయజూచును. అప్పుడు నీవు నా మాటలలోని సత్యమును గ్రహింతువు. నా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాపపడెదవు

13. పాములనాడించు వానిని పాము కరచినచో, వన్యమృగములను మచ్చిక చేయువానికి మృగము హానిచేసినచో, ఎవరైన దుఃఖింతురా?

14. పాపాత్ములతో దిరుగుచు వారి పాపకార్యములలో పాల్గొనువాని విషయముకూడ అంతియే.

15. దుష్టమిత్రుడు కొంతకాలము నీ చుట్టు తిరుగవచ్చుగాక ! కష్టములు రాగానే నిన్ను విడిచి వెళ్ళిపోవును.

16. దుష్టునికి పెదవులమీద తేనెయుండును. అతడు హృదయములో మాత్రము నిన్ను గోతిలో కూలద్రోయవలెనని కోరుకొనుచుండును. ఈ అతడు నీ కష్టములలో సానుభూతి చూపుచున్నట్లే నటించును. కాని అవకాశము దొరికినపుడు నీ ప్రాణము తీయును

17. నీకు కష్టములు వచ్చినపుడు అతడు నీ ఎదుటికి వచ్చును. కాని నీకు సాయము చేయుచున్నట్లే నటించి నిన్ను గోతిలో ద్రోయును.

18. ఆ మీదట సంతసముతో చేతులు చరచి తలయాడించును. తాను మరొక వ్యక్తిగా మారిపోయి నీ మీద పుకార్లు పుట్టించును.మన స్తోమతకు తగిన వారితోనే కలియవలెను.

 1. కీలు ముట్టుకొన్నచో చేతులకు మురికియగును. గర్విష్ఠులతో చెలిమి చేయువాడు వారివంటివాడే అగును.

2. నీకు మించిన బరువు మోయవలదు. నీ కంటె ధనవంతులు, బలవంతులైన వారితో చెలిమి చేయవలదు. మట్టికుండను లోహపు పాత్ర చెంత ఉంచరాదు. అవి ఒకదానితోనొకటి తగిలినచో కుండపగులును

3. ధనికుడు తోటివానికి , అపకారము చేసికూడ దర్పము జూపును. పేదవాడు అపకారము పొందినను తానే మన్నింపు వేడుకోవలెను.

4. నీవు ఉపయోగపడినంత కాలము ధనికుడు నిన్ను వాడుకొనును. కాని నీకు అవసరము కలిగినపుడు అతడు నిన్ను చేయి విడచును.

5. నీ యొద్ద ధనమున్నంతకాలము అతడు నీతో చెలిమి చేయును. ఏమాత్రము సంకోచింపక నీ సొత్తును కాజేయును.

6. అతనికి నీతో అవసరము కలిగినపుడు నిన్ను నమ్మించును. నవ్వు మోముతో నిన్ను ప్రోత్సహించుచున్నట్లే చూపట్టును. నీతో తీయగా మాటలాడుచు “నా నుండి నీకేమైన కావలెనా?” అని అడుగును.

7. తన విందులతో నిన్ను మోమాటపెట్టి రెండు మూడు సార్లు నీ సొమ్ము కాజేయును. అటు తరువాత నిన్ను పరిహానము చేయును. ఆ మీదట నీవు అతనికి ఎచ్చటైనను కన్పింతువేని నిన్నెరుగనట్లు నటించి, తన దారిన తాను సాగిపోవును.

8. కనుక నీవు మోసమునకు గురికాకుండ జాగ్రత్తపడుము. లేదేని ఆనందమును అనుభవించుచుండగనే అవమానము తెచ్చుకొందువు. 

9. పలుకుబడి కలవాడు ఎవడైనను నిన్ను తన ఇంటికి ఆహ్వానించినచో నీవు బెట్టు చూపుము. అప్పుడతడు నిన్ను మరెక్కువగా బ్రతిమాలును.

10. నీ అంతట నీవతని యొద్దకు వెళ్ళెదవేని అతడు నిన్ను నిర్లక్ష్యము చేయును. అట్లని అతడికి మిక్కిలి దూరముగా ఉండకుము. అప్పుడతడు నిన్ను పూర్తిగా విస్మరింపవచ్చును.

11. నీవు అతనితో సరిసమానుడవు అన్నట్లు ప్రవర్తింపవలదు. అతడు ఏమేమో చెప్పినను ఆ మాటలు నమ్మవద్దు. నిన్ను పరీక్షించుటకే అతడు అధికముగా సంభాషించును. నవ్వుచున్నట్లే నటించి నిన్ను నిశితముగా పరిశీలించి చూచును.

12. నీ రహస్యములను దాచనివాడు నిర్దయుడు. అట్టి వాడు నీకు హాని చేయుటకును, నిన్ను చెరలో త్రోయించుటకును వెనుకాడడు.

13. కనుక నీ రహస్యములను పొక్కనీక జాగ్రత్తగా ఉండుము. నీవు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావని గుర్తింపుము.

14. ఈ సంగతి గూర్చి వినగానే నిద్రమేల్కొనుము. నీవు జీవించినంతకాలము ప్రభువును ప్రేమింపుము అతని సహాయముకొరకు మనవిచేయుము.

15. ప్రతి ప్రాణి తనకు తుల్యమైన ప్రాణితో కలియగోరును. నరుడు తనకు సరిసమానమైన వాని పొత్తుగోరును

16. ప్రతిప్రాణి సజాతి ప్రాణితో కలియును. నరులును తమవంటి వారితో చెలిమి చేయుదురు.

17. తోడేలు గొఱ్ఱెపిల్లతో కలియనట్లే, పాపాత్మునికి భక్తిపరునితో పొత్తులేదు.

18. దుమ్ముల గొండికి, కుక్కకు చెలిమిలేనట్లే, ధనికునికి, దరిద్రునికి బాంధవ్యము లేదు.

19. అడవిలో సింగము గాడిదను వేటాడినట్లే ధనికుడు పేదవానిని వేటాడును.

20. గర్వాత్మునికి వినయము పొసగదు. అట్లే ధనికునికి పేదవాడు అసహ్యము.

21. ధనికుడు పడిపోయినపుడు అతని మిత్రులు అతనిని లేవనెత్తుదురు. కాని పేదవాడు కూలిపోయినపుడు అతని మిత్రులు అతనిని విడనాడుదురు.

22. ధనికుడు తప్పు పలికినచో చాల మంది అతనిని సమర్థింతురు. ఈ పలుకగూడని పలుకు పలికినను ఏమేమో చెప్పి అతనిని సమర్థింతురు. కాని పేదవాడు తప్పుపలికినచో అందరు అతనిని నిందింతురు. అతడు ఒప్పు పలికినపుడెవరును వినరు.

23. ధనికుడు మాట్లాడినపుడెల్లరును మౌనముగా ఉందురు. అతని సంభాషణను కొండంతచేసి పొగడుదురు దరిద్రుడు మాట్లాడినచో ఎల్లరును “వీడెవడయ్యా ?" అందురు. ఏదైనా పొరపాటు మాట చెప్పినచో అతనిని క్రింద పడద్రోయుదురు.

24. పాపము లేనపుడు ధనమును చెడ్డదికాదు, దారిద్య్రమును చెడ్డదికాదు. దుష్టులు మాత్రము పేదరికమును చెడ్డదానినిగా ఎంతురు.

25. నరుని హృదయములోని భావములనుబట్టి అతని మోము ఆనందముగానైనా, విచారముగానైనా చూపట్టును.

26. నీ హృదయము సంతోషముగా ఉన్నచో నీ ముఖము కూడ ఉల్లాసముగా నుండును. కాని లోకోక్తులను చెప్పవలెనన్న చాల శ్రమపడవలెను.

 1. ఏనాడును తప్పుగా మాట్లాడని నరుడు ధన్యుడు. అతడు తాను పొరపాటు చేసితినేమో అని భయపడనక్కరలేదు.

2. తన అంతరాత్మ తనను నిందింపనివాడును, నమ్మకముతో జీవించువాడునగు నరుడు ధన్యుడు.

3. పిసినిగొట్టునకు సిరిసంపదలు తగవు. లోభికి సంపదతో ఏమి ప్రయోజనము?

4. తాను అనుభవింపక సొమ్ము కూడబెట్టువాడు ఇతరుల కొరకే కూడబెట్టుచున్నాడు. అతని సొత్తుతో ఇతరులు హాయిగా బ్రతుకుదురు.

5. తన కొరకు తాను ఖర్చు పెట్టుకొననివాడు ఇతరుల కొరకు ఖర్చు పెట్టడు. అతడు తన సొత్తును తానే అనుభవింపడు.

6. తన కొరకు తాను ఖర్చు చేసికొననివానికంటె నికృష్ణుడు లేడు. నీచ బుద్ధికి తగిన శిక్షయే కలదు.

7. లోభి మంచిని చేసినను యాదృచ్చికముగనే చేయును కాలక్రమమున అతని పిసినిగొట్టుతనము బయటపడును.

8. పిసినారి అయిన నరుడు దుష్టుడు, అక్కరలో ఉన్నవారిని ఆదుకొనడు.

9. పేరాశకలవాడు తనకు ఉన్నదానితో తృప్తి చెందడు. దురాశవలన అతని హృదయము కుదించుకొని పోవును.

10. లోభి కడుపునిండ తినుటకు ఇష్టపడడు, కనుక చాలినంత భోజనము సిద్ధము చేసికొనడు.

11. కుమారా! నీవు నీ స్థితికి , తగినట్లుగా చూచుకొనుము. ప్రభువునకు మేలికానుకలు అర్పింపుము.

12. మృత్యువు నీ కొరకు వేచియుండదు. నీవేనాడు పాతాళము చేరుదువో నీకే తెలియదు.

13. కనుక నీవు చనిపోక పూర్వమే నీ స్నేహితులపట్ల దయచూపుము. నీ శక్తికొలది వారికి ఈయగలిగినది ఇమ్ము,

14. ప్రతిదినము నీవు అనుభవింపగల్గినది అనుభవింపుము. ఉచితములైన నీ వంతు సుఖములను విడనాడకుము.

15. నీ సొత్తును ఇతరులకు వదలనేల? నీవు కష్టపడి కూడబెట్టినది అన్యులు పంచుకోనేల?

16. కనుక ఇచ్చిపుచ్చుకొనుచు, సుఖములను అనుభవింపుము. పాతాళలోకమున సుఖించుటకు వీలుపడదుకదా!

17. ప్రాణులెల్ల జీర్ణవస్త్రమువలె శిథిలమైపోవును. పురాతన నియమము ప్రకారము జీవకోటికి మృత్యువుతప్పదు.

18. గుబురుగా ఎదిగిన చెట్టుమీది ఆకులు కొన్ని పండి రాలిపోవుచుండగ మరికొన్ని చిగుర్చుచుండును అట్లే తరతరముల నరజాతికి సంభవించును. కొందరు చనిపోవుచుండగా మరికొందరు పుట్టుచుందురు.

19. నరుడు సాధించిన ప్రతి కార్యము నశించును. ఆ కార్యముతోపాటు దానిని సాధించిన నరుడును గతించును.

20. విజ్ఞానమును మననము చేసికొనుచు  చక్కగా ఆలోచించువాడు ధన్యుడు.

21. విజ్ఞానమును అధ్యయనము చేయువాడు, దాని రహస్యముల నెరుగువాడు ధన్యుడు.

22. వేటగాడు మృగముకొరకు గాలించునట్లుగ అది పోవు త్రోవప్రక్కన పొంచియుండునట్లుగా, నీవును విజ్ఞానమును వెదకుము.

23. విజ్ఞానమను గృహపు గవాక్షమునుండి లోపలికి తొంగిచూడుము, దాని తలుపునొద్ద చెవియొగ్గి వినుము.

24. విజ్ఞానమను ఇంటి ప్రక్కనే నీ గుడారముపన్నుకొని దాని చేరువలోనే వసింపుము.

25. దానిచెంత శిబిరము పన్నుకొనుట అనగా శ్రేష్ఠమైన తావున వసించుటయే.

26. నీ బిడ్డలను విజ్ఞానవృక్షపు నీడలో వసింపనిమ్ము. నీవు దాని క్రోమ్మల క్రింద కాపురము చేయుచు

27. ఎండను తప్పించుకొనుము. తేజోమయమైన ఆ చెట్టుసన్నిధిలో బసచేయుము.

 1. దైవభీతి గలవాడు ఇట్టి పనిచేయును. ధర్మశాస్త్ర పారంగతుడైనవాడు విజ్ఞానమును పొందును.

2. విజ్ఞానము తల్లివలెను, , ఎలప్రాయపు వధువువలెను వచ్చి అతడిని ఆహ్వానించును.

3. అది అతనికి తెలివి అను అన్నము పెట్టును. వివేకమను పానీయము నొసగును.

4. అతడు ఊతకఱ్ఱ మీదవలె దానిమీద వాలి క్రింద పడిపోవుట అను అవమానమునుండి తప్పించుకొనును.

5. అది అతనికి అనన్యసాధ్య మైన ఖ్యాతిని అర్జించి పెట్టును. సభలో మాట్లాడుటకు వాగ్దాటిని అనుగ్రహించును

6. అతనికి సుఖసంతోషములు సిద్ధించును. అతని పేరు కలకాలము నిలుచును.

7. కాని మూర్ఖులు విజ్ఞానమును బడయజాలరు. పాపాత్ముల కంటికది కన్పింపనుగూడ కన్పింపదు.

8. గర్వాత్ములకది దూరముగా ఉండును. అసత్యవాదుల మనసులోనికది ప్రవేశింపదు.

9. పాపాత్ముడు దేవుని కీర్తింపజాలడు. ప్రభువు అతడికి ఆ బుద్ది దయచేయడు.

10. దైవ సంకీర్తనమును విజ్ఞానము వలననే పలుకవలెను. ప్రభువే ఆ సంకీర్తనమును ప్రేరేపించును.

11. నేను పాపము చేయుటకు దేవుడే కారణమని చెప్పకుము. తాను అసహ్యించుకొను దానిని దేవుడెట్లు చేయించును?

12. దేవుడు నన్ను పెడత్రోవ పట్టించెనని అనకుము. ఆయన పాపాత్ములను తన పనికి వాడుకొనడు.

13. ప్రభువు దౌష్ట్యమును పూర్తిగా అసహ్యించు కొనును. దైవభీతికల నరుడు చెడ్డను అంగీకరింపడు.

14. దేవుడు ఆదిలో నరుని చేసినపుడు అతనికి తన నిర్ణయములను తాను చేసికొను స్వేచ్ఛనొసగెను.

15. నీవు కోరుకొందువేని ప్రభుని ఆజ్ఞలు పాటింపవచ్చును.  అతనిని అనుసరింపవలెనో లేదో నిర్ణయించునది నీవే.

16. ప్రభువు నిప్పును, నీళ్ళనుగూడనీముందుంచెను చేయిచాచి వానిలో నీకిష్టము వచ్చినది తీసికొనుము

17. మృత్యువు జీవముకూడ నరుని ముందటనున్నది. అతడు తాను కోరుకొనినది తీసికోవచ్చును.

18. ప్రభువు విజ్ఞానము అనంతమైనది. ఆయన మహాశక్తిమంతుడు, సర్వమును పరిశీలించువాడు.

19. ఆయన నరులు చేయు ప్రతికార్యమును గమనించును. తనపట్ల భయభక్తులు చూపువారిని కాపాడును.

20. ప్రభువు ఏ నరుని పాపముచేయుమని ఆజ్ఞాపింపడు, ఎవనికి చెడ్డను చేయుటకు అనుమతినీయడు.

 1. దుర్మార్గులైన తనయులు చాలమంది ఎందులకు? భక్తిహీనులైన పుత్రులవలన ప్రమోదము కలుగదుకదా!

2. దైవభక్తిలేని బిడ్డలెంతమంది ఉన్నను, వారిని చూచి సంతృప్తి చెందకుము. 

3. ఆ బిడ్డల భవిష్యత్తు శుభప్రదమగుననియు, వారు దీర్ఘకాలము జీవింతురనియు ఆశింపకుము. వేయిమంది పుత్రులకంటె ఒక్కడు మెరుగు. భక్తిహీనులైన బిడ్డలను కనుటకంటె , అసలు బిడ్డలు లేకుండ చనిపోవుటే మేలు.

4. ఒక్కని విజ్ఞతవలన నగరపు జనసంఖ్య పెరుగును. దుర్మార్గుల తెగ మాత్రము నాశనమగును.

5. ఇట్టి ఉదంతములను నేను పలుమార్లు చూచితిని. వీనికంటె గొప్ప సంఘటనలను నా చెవులతో వింటిని.

6. పాపాత్ముల సమాజమున ప్రభువు కోపాగ్ని రగుల్కొనును. అవిధేయుల బృందమున ఆయన క్రోధము గనగనమండును.

7. ప్రాచీనకాలపు రాక్షసజాతివారు తమ బలమును చూచుకొని , దేవునిమీద తిరుగబడగా ఆయన వారిని క్షమింపడయ్యెను.

8. లోతుతో కలిసి జీవించిన ప్రజల గర్వమునకుగాను ప్రభువు వారిని చీదరించుకొని శిక్షకు గురిచేసెను.

9. ఆయన పాపము చేసిన జాతిని నాశనము చేయ సంకల్పించుకొనెను. దానిమీద కరుణ చూపడయ్యెను.

10. ఎడారి ప్రయాణమున ఆరు లక్షలమంది ఏకమై మూర్ఖముగా తనమీద తిరుగబడగా వారిని కనికరింపడయ్యెను.

11. పెడసరి బుద్ధికల వాడొక్కడే ఉండినను  ఆ ఒక్కడుకూడ శిక్ష తప్పించుకోజాలడు. ప్రభువు కృపాకోపములు రెండింటిని ప్రదర్శించును ఆయన క్షమించుటకు, కోపించుటకును కూడ సమర్థుడు.

12. ఆయన కృప ఎంత గొప్పదో శిక్షయు అంత తీవ్రమైనది. నరులు చేసిన క్రియలబట్టి, ఆయన వారికి తీర్పుచెప్పును.

13. పాపాత్ముడు తాను దోచుకొనిన దానికి , శిక్షననుభవింపక తప్పదు.  పుణ్యపురుషుని శ్రమకు ఫలితమును దక్కకపోదు

14. దేవుడు అపార కృపకలవాడు. అయినను ప్రతివానికి వాని క్రియలకు తగినట్లే ప్రతిఫలమిచ్చును.

15. ప్రభువు ఐగుప్తు రాజు గుండెను రాయిచేసెను. కనుక రాజు ప్రభువును అంగీకరింపడయ్యెను. అందువలన ప్రభువుని మహాకార్యములు లోకమునకు వెల్లడి అయ్యెను.

16. ప్రభువు తాను చేసిన సృష్టికంతటికిని దయ జూపును. ఆయన చీకటినుండి వెలుతురును విడదీసెను.

17. "నేను ప్రభువు కంటబడకుండ దాగుకొందును. ఆకాశముననున్నవాడు నన్ను పట్టించుకొనునా? ఇంతమందిలో ఆయన నన్ను గుర్తుపట్టునా? '' ఇంతటి మహాప్రపంచములో నేనేపాటివాడను” అని ఎంచకుము.

18. ప్రభువు విజయము చేయుటను చూచి ఆకాశమును, దానిమీద మహాకాశమును, సముద్రమును, భూమియు భీతితో కంపించును

19. ప్రభువు తమవైపుచూడగా కొండలును, నేలపునాదులును గడగడ వణకును.

20. కాని ఈ అంశములను పట్టించుకొనువాడెవడు? ప్రభువు కార్యరీతులను అర్థము చేసికొను వాడెవడు?

21. తుఫాను గాలి కంటికి కన్పింపదు. అట్లే ప్రభువు కార్యములను గూడ కంటితో చూడజాలము.

22. మన కార్యములకు తీర్పు జరుగునో లేదో ఎవరు చెప్పగలరు? ప్రభువు తీర్పుకొరకు ఎవడుకాచుకొనియుండును? ఆయన నిర్ణయించిన మరణదినము ఇప్పటిలో రాదు కదా అని

23. అల్పబుద్ధియు, పెడదారిలో పోవునట్టివాడునగు నరుడు భావించు చుండును.

24. కుమారా! నా పలుకులు విని విజ్ఞానము పొందుము. ఆ నా మాటలను సావధానముగా ఆలకించుము.

25. నేను నీకు జాగ్రత్తగా ఉపదేశము చేయుదును. నికరమైన పద్దతిలో నీకు విజ్ఞానమును బోధింతును

26. ఆదిలో భగవంతుడు సృష్టి చేసినపుడు ప్రతి వస్తువునకు దాని స్థానమును నియమించెను

27. ఆయన తాను చేసిన వస్తువులన్ని కలకాలము మనునట్లు చేసి, వానికి శాశ్వతగతి కల్పించెను. ఆ వస్తువులకు ఆకలి కలుగదు. అవి అలసిపోవు, తమ పనులను విరమించుకొనవు

28. అవి ఒక దానితోనొకటి ఒరసికొనవు. ఆ ప్రభువాజ్ఞ ఇసుమంతయును మీరవు.

29. ఈ వస్తువులన్నిటిని చేసిన తరువాత ప్రభువు నేలమీదికి పారజూచి దానిని ఉత్తమ ప్రాణులతో నింపెను.

30. అతడు నానావిధ ప్రాణులను మంటిమీద నెలకొల్పెను. అవి అన్నియు మరల మంటిలోనే కలిసిపోవును.

 1. ప్రభువు మట్టి నుండి నరుని చేసెను. అతడు మరల ఆ మట్టిలోనే కలిసి పోవునట్లు చేసెను.

2. ఆయన నరులకు ఆయుఃప్రమాణమును నిర్ణయించెను. కాని వారికి సృష్టి వస్తువులన్నిటి మీదను అధికారమిచ్చెను.

3. ఆ నరులను తనను పోలినవారినిగా చేసి వారికి తన శక్తి నొసగెను.

4. ప్రతి ప్రాణి నరుని చూచి భయపడునట్లు చేసెను. మృగపక్షి గణములకు అతనిని యజమానుని చేసెను

5. అతనికి పంచేంద్రియముల నొసగెను. ఆరవ ఇంద్రియముగా బుద్దిశక్తినొసగెను. ఏడవదానిగా తెలివినిచ్చెను.  దానితోనే నరుడు తాను పంచేంద్రియములద్వారా గ్రహించిన జ్ఞానమును అర్థము చేసికొనును.

6. ఆయన నరులకు నాలుకలు, కన్నులు, చెవులు దయచేసెను. ఆలోచించుటకు మనస్సునిచ్చెను.

7. తెలివితేటలు, బుద్ధివివరములు ప్రసాదించెను. మంచిచెడ్డలనెరుగు శక్తి నొసగెను.

8. తాను చేసిన సృష్టి మాహాత్మ్యమును గుర్తించుటకు వారి హృదయములలో ఒక వెలుగునిల్పెను.

9. తాను చేసిన మహాకార్యములను గాంచి నరులెల్లవేళల పొంగి పోవునట్లు చేసెను.

10. నరులు ప్రభువుచేసిన మహాకార్యముల నుగ్గడింతురు. ఆయన పవిత్ర నామమును కీర్తింతురు.

11. ఆయన వారికి జ్ఞానమునొసగెను. జీవనదాయకమైన ధర్మశాస్త్రమును దయచేసెను.

12. నరులతో శాశ్వతమైన ఒడంబడిక చేసికొని, తన తీర్పులు వారికి తెలియపరచెను.

13. నరుల నేత్రములు ఆ మహాప్రభువు వైభవమును వీక్షించెను. వారి శ్రవణములు ఆయన మహిమాన్విత వాక్కులను వినెను.

14. ఆయన నరులతో “మీరెట్టి పాపకార్యములు చేయరాదు” అని చెప్పెను. ప్రతివానికి తన పొరుగువానితో మెలగవలసిన తీరును వివరించెను.

15. నరుల చెయిదములను ప్రభువు నిత్యము గమనించుచుండును. ఆయన కన్ను గప్పజాలము.

16. నరులు బాల్యమునుండి చెడువైపునకే మొగెదరు. వారు తమ దుష్టహృదయమును మార్చుకొనరు.

17. ప్రభువు భూమిమీద జాతులన్నిటిని విభజించెను. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరాజును నియమించెను. కాని యిస్రాయేలు సంతతిని మాత్రము తన సొంత ప్రజను చేసికొనెను.

18. యిస్రాయేలు ప్రభువు తొలికుమారుడు. వారికి ఆయన శిక్షణనిచ్చును. వారిని ప్రేమించి నిరంతరము కాపాడుచుండును.

19. నరుల కార్యములను ప్రభువు నిత్యము గమనించుచునే ఉండును. వారి చెయిదములు ఆయనకు పట్టపగలువలె కన్పించును.

20. నరుల పాపములు ఆయనకు కన్పింపకుండ ఉండవు ఆయన వానిని స్పష్టముగా చూచుచుండును.

21. ప్రభువు మంచివాడు, తాను చేసిన ప్రాణులను బాగుగా ఎరిగినవాడు. - ఆయన వానిని కరుణతో చూచునేగాని చేయివిడువడు.

22. నరుడు పేదలకు చేసిన దానధర్మములను , ప్రభువు తన అంగుళీయకమునువలె విలువతో చూచును. నరుడు పేదలపట్ల చూపు కరుణను ప్రభువు తన కంటిపాపనువలె మన్ననతో చూచును

23. ప్రభువు కట్టకడన దుష్టులకు తీర్పు చెప్పి శిక్ష విధించును. వారు తమ చెయిదములకు తగిన ప్రతిఫలమనుభవింతురు.

24. కాని ఆయన పశ్చాత్తాపపడు వారిని తన చెంతకు చేర్చుకొనును. నిరాశ చెందువారికి ఆశ కల్పించును.

25. మీ పాపములను విడనాడి ప్రభువునొద్దకు రండు. ఆయన యెదుట ప్రార్థన చేసి మీ దోషములను తొలగించుకొనుడు.

26. పాపక్రియల నుండి వైదొలగి, మహోన్నతుని వద్దకు మరలిరండు. దుష్టత్వమును పూర్తిగా విడనాడుడు.

27. బ్రతికియున్నవారు మహోన్నతుని కీర్తింపనిచో మృతలోకమున ఆయననెవరు స్తుతింతురు?

28. చనిపోయి తమ ఉనికిని కోల్పోయినవారు దేవుని స్తుతింపలేరు. బ్రతికి ఆరోగ్యముగా ఉన్నవారు మాత్రమే ఆయనను కొనియాడుదురు. 

29. ఆయన మహాకృపతో తన చెంతకు వచ్చు వారినెల్ల క్షమించును.

30. నరునికి ఎల్ల సౌభాగ్యములును సిద్ధింపలేదు. అతడికి అమరత్వము లేదుకదా!

31. సూర్యునికంటెను ప్రకాశవంతమైనదేమి కలదు? కాని ఆ సూర్యునికిగూడ గ్రహణముపట్టును. నరమాత్రులైనవారు చెడుతలంపులనే తలంతురు

32. ప్రభువు ఉన్నతమైన ఆకాశములోని చుక్కలను పరీక్షించును. ఇక నరులలోయనిన వట్టి దుమ్ము, బూడిదయు మాత్రమే.

 1. చిరంజీవియైన ప్రభువు ఈ విశ్వమును సృజించెను.

2. ఆయనొక్కడే నీతిమంతుడు. ఆయనతప్ప మరియెవడును లేడు.

3. ఆయన తనచేతితో ఈ ప్రపంచమును నడిపించును ఎల్లప్రాణులును ఆయనకు విధేయములగును. అన్నింటికి ఆయనే రాజు. ఆయన దక్షతతో పవిత్రులను అపవిత్రులనుండి వేరుచేయును.

4. ఏ నరుడును ఆయన సృష్టిని సరిగా వర్ణింపజాలడు ఎవడును ఆయన అద్భుతకార్యములను పూర్తిగా గ్రహింపజాలడు.

5. ఆయన మహాశక్తిని ఎవడు అర్థము చేసికోగలడు? ఆయన కరుణకార్యములనెవ్వడు సంపూర్ణముగా ఉగ్గడింపగలడు?

6. మనము ఆ కార్యములకు ఏమి చేర్పజాలము. వానినుండి యేమియు తీసివేయజాలము. ప్రభుని అద్భుతకార్యములను ఎరుగుట అసాధ్యము

7. ఆయన మహాకార్యములను పూర్ణముగా తెలిసికొనినపుడు వాని విషయమున ఇంకా ప్రారంభముననే ఉన్నామనుకోవలెను. ఆ కార్యములను గాంచి నోటమాటరాక దిగ్ర్భాంతి చెందుదుము.

8. నరుడేపాటివాడు? అతనివలన ఏమి ప్రయోజనము? అతడుచేయు మంచికిగాని, చెడుకుగాని విలువెంత?

9. నరుడు వందయేండ్లు జీవించినచో దీర్ఘకాలము బ్రతికినట్లే.

10. కాని అనంతకాలముతో పోల్చిచూచినచో ఆ నూరేండ్లు సాగరములో ఒక్క నీటిచుక్క వంటివి. ఒక్క యిసుక రేణువు వంటివి.

11. కనుకనే ప్రభువు నరులపట్ల మిక్కిలి ఓర్పుచూపును. వారిమీద దయను క్రుమ్మరించును.

12. నరులు మృత్యువువాత బడుదురని గ్రహించి వారిని ఉదారముగా క్షమించును.

13. నరుడు తోడినరునిపై మాత్రమే దయచూపును. కాని ప్రభువు ప్రతిప్రాణిని కరుణతో చూచును. ఆయన నరులను మందలించుచు, చక్కదిద్దుచు, ప్రబోధించుచు, కాపరినుండి తప్పి పోయిన గొఱ్ఱెలనువలె వారిని మరల తన చెంతకు కొనివచ్చును.

14. ఆయన దిద్దుపాటునకు లొంగి ఆయన ఆజ్ఞలకు తలయెగ్గు వారిపై ఆయన కరుణ చూపును.

15. నాయనా! నీవు దానము చేయునపుడు నిందావాక్యములు పలుకవలదు. ఇతరులకు ఇచ్చునపుడు వారి మనసు నొప్పింపవలదు.

16. మంచు కురిసినపుడు ఎండవేడిమి సమసిపోవును కదా! నీవిచ్చు వస్తువుకంటెను నీ మాటలు ముఖ్యము.

17. కరుణపూరిత వాక్యములు ప్రశస్తదానముకంటె శ్రేష్ఠమైనవి. కాని ఉదారస్వభావుడు ఆ రెంటిని కూడ ఇచ్చును

18. మూర్ఖుడు ఏమీ ఈయక వచ్చినవారిని అవమానించును. అయిష్టముగా నిచ్చు దానమును ఎవడు ప్రీతితో చూడడుగదా!

19. నీవు చెప్పనున్న సంగతిని బాగుగా తెలిసికొనిన పిమ్మట మాట్లాడుము. వ్యాధి రాకముందే నీ ఆరోగ్యమునుగూర్చి జాగ్రత్తపడుము.

20. ప్రభువు నీకు తీర్పు తీర్చక పూర్వమే నీ అంతరాత్మను పరిశోధించి చూచుకొనుము. అట్లయినచో ఆ క్షణము వచ్చినపుడు ప్రభువు నిన్ను క్షమించును.

21. వ్యాధియను శిక్షకు గురిగాకముందే వినయమును ప్రదర్శింపుము. తప్పు చేసినపుడు పశ్చాత్తాపపడుము.

22. దేవునికి చేసిన మ్రొక్కులు వెంటనే తీర్చుకొనుము. చనిపోవు సమయమువరకు జాప్యము చేయకుము

23. మ్రొక్కుబడి చేసికొనునపుడు దానిని చెల్లించు ఉద్దేశము వుండవలెను. దేవుని సహనమును పరీక్షింపవలదు.

24. నీ మరణ కాలమున ప్రభువు నీపట్ల ఆగ్రహమును చూపకుండునట్లును, నీకు తీర్పు చెప్పునప్పుడు నీకు విముఖుడుగా ఉండకుండునట్లును జాగ్రత్తపడుము.

25. పంటలు పండిన కాలమున కరువును గుర్తుంచుకొనుము. సంపదలు కలిగిన కాలమున పేదరికమును జ్ఞప్తికి తెచ్చుకొనుము.

26. ఉదయసాయంకాలముల మధ్యలోనే పరిస్థితులు మారిపోవచ్చును. ప్రభువు తలపెట్టినపుడు మార్పు అతి శీఘ్రముగా కలుగును.

27. జ్ఞాని తన కార్యములన్నింటను జాగ్రత్తగానుండును పాపము విస్తరించియున్నపుడు అతడు మెలకువతో దోషమునుండి వైదొలగును.

28. తెలివికలవాడెవడైనను విజ్ఞానమును గుర్తించును. విజ్ఞానము కలవానిని గౌరవించునుకూడ.

29. విజ్ఞానమును అభిమానించువారు విజ్ఞానవేత్తలగుదురు. వారి పలుకులు విజ్ఞాన సూక్తులగును.

30. కామమునకు లొంగవలదు. ఆశాపాశములను జయింపుము.

31. నీలోని ఆశలకు లొంగిపోయెదవేని నీ శత్రువులు నిన్ను చూచి నవ్వుదురు.

32. సుఖభోగములకు దాసుడవు కావలదు. భోగజీవనము వలనయగు ఖర్చులు నిన్ను గుల్లజేయును.

33. నీ చేత డబ్బు లేనపుడు అప్పులు చేసి విందులారగించి బిచ్చగాడివై పోవలదు.

 1. త్రాగుబోతు సంపన్నుడు కాజాలడు. చిన్న విషయములలో జాగ్రత్త చూపనివాడు క్రమముగా నశించును.

2. మధువు, ముదితలు విజ్ఞుల జ్ఞానమును చెరతురు వేశ్యలను కూడువాడు శీలము కోల్పోవును.

3. శీలము కోల్పోయిన వాడు ప్రాణహాని తెచ్చుకొనును. కుళ్ళు పట్టి పురుగులు పడిచచ్చును.

4. ప్రజలను సులభముగా నమ్మువాడు తెలివిలేనివాడు. పాపము చేయువాడు తనకు తానే హానిచేసికొనును.

5. దుష్కార్యములందు అనురక్తి చూపువాడు నిందితుడగును.

6. వాచాలత్వమును కట్టిపెట్టువాడు పాపమును జయించును.

7. ఒకరినుండి విన్నదానిని ఇతరులకు చెప్పకుము. అప్పుడు నీవు పశ్చాత్తాపపడవలసిన అవసరముండదు.

8. నీవు విన్న సంగతిని ఇతరులకు చెప్పకుము. ఇతరులకు చెప్పకుండుట పాపహేతువైననే తప్ప, మిత్రులకుగాని, శత్రువులకుగాని దానిని చెప్పవద్దు.

9. నీ నుండి ఆ వర్తమానమును వినినవాడు నిన్ను శంకించును. అటుపిమ్మట నిన్నుగూడ ద్వేషించును.

10. నీవేదైన సంగతిని విన్నచో దానిని నీతోనే సమసిపోనిమ్ము, భయపడకుము. దాని వలన నీ కడుపు పిగిలిపోదు!

11. మూర్ఖుడు తాను విన్న రహస్యమును దాచలేక ప్రసవవేదనను అనుభవించు స్త్రీవలె బాధపడును.

12. తొడలో దిగబడిన బాణమెట్లో మూర్ఖుని యెదలోనున్న రహస్యవార్తలు అట్లుండును.

13. నీ మిత్రుడేదో పాడుపని చేసెనని వార్త పొక్కినచో అతనినే అడుగుము, అతడు అట్టి పనిని చేసియుండకపోవచ్చును. ఒకవేళ చేసినా, మరల దానిని చేయబోడు.

14. నీ ప్రక్కవాడేదో పాడుమాట చెప్పెనని వార్త పుట్టినచో అతనినే అడుగుము, అతడట్టి మాట చెప్పియుండకపోవచ్చును. ఒకవేళ చెప్పినను మరల ఆ మాటచెప్పడు.

15. నీ మిత్రుని గూర్చి ఏదో వదంతి పుట్టినచో అతనినే అడుగుము, అది అపనింద కావచ్చును. మనము వినిన దానినెల్లా నమ్మరాదు.

16. ఒక్కొక్కసారి నరునికి నోరు జారవచ్చును. కాని అతడామాటను ఉద్దేశపూర్వకముగా అని యుండకపోవచ్చును.  నోటి మాటలలో తప్పులు దొరలని వాడెవడు?

17. ప్రక్కవానినిగూర్చి యేదో విని వానిని కోపింతువేని, వానిమీదికి వెళ్ళకముందు అసలుసంగతి ఏమో అడుగుము. మహోన్నతుని ధర్మశాస్త్రము అతనికి తీర్పుచెప్పును నీవు శాంతింపుము.

18. దేవుని మన్ననను పొందుటకు మా మొదటిమెట్టు దైవభీతి. విజ్ఞానము కలవానిని ప్రభువు ఆదరించును.

19. ప్రభువు ఆజ్ఞల నెరుగుటయనిన జీవనదాయకమైన విద్యను పొందుట, ఆయనకు ప్రీతిగొల్పు పనులు చేయుట, జీవనవృక్ష ఫలములను భుజించుట.

20. విజ్ఞానమెల్ల దేవునికి భయపడుటయే, విజ్ఞానమెల్ల దైవాజ్ఞలను పాటించుటయే, ఆ ప్రభువు సర్వాధిపత్యమును గుర్తించుటయే.

21. సేవకుడు యజమానుని ధిక్కరించినచో, తరువాత అతని మాటవిన్నను అతని కోపము తగ్గదు

22. దుష్టత్వమునుగూర్చి నీకు విశేషముగా తెలిసియున్నను, దానివలన నీవు విజ్ఞుడవు కాజాలవు. పాపాత్ముల సలహాలను పాటించుటలో విజ్ఞతలేదు

23. కొందరు తమ తెలివిని దుష్కార్యములకు వినియోగింతురు. కొందరు తెలివిలేకపోవుట వలననే మూర్ఖులగుదురు.

24. తెలివికలవాడైయుండి ధర్మవిధులను మీరుటకంటె, మందబుద్దియైయుండి దైవభీతితో బ్రతుకుట మేలు.

25. నరుడు ధీమంతుడయినా ధర్మవర్తనుడు కాకపోవచ్చును. తన కార్యమును నెరవేర్చుకొనుటకే అతి వినయమును ప్రదర్శింపవచ్చును.

26. కొందరు దుర్మార్గులు దుఃఖాక్రాంతులవలె వంగి నడుతురు. కాని లోలోపల వంచకులై ఉందురు.

27. అట్టివారు మొగము ప్రక్కకు తిప్పుకొని నీ మాటలు విననట్లే నటింతురు. కాని నీవు ఊహింపని గడియలో వచ్చి నీ మీద పడెదరు.

28. ప్రస్తుతము చెడుకు పాల్పడకున్నను, అవకాశము దొరికినపుడు దుష్కార్యములు చేసి తీరుదురు.

29. నరుని ఆకారమును బట్టియే అతడెట్టివాడో చెప్పవచ్చును. మొదటిసారి చూచినప్పుడే అతని తెలివిని అంచనా వేయవచ్చును.

30. నరుని బట్టలు, నవ్వు, నడక అతని శీలమును పట్టియిచ్చును.

 1. తగని సమయమున మందలించుట అనునది కలదు. ఉచితము గాని సమయమున మౌనముగా నుండుటయేమేలు.

2. కోపముతో మండిపడుటకంటే మందలించుటయే మెరుగు.

3. తన తప్పునొప్పుకొనువాడు శిక్షను తప్పించుకొనును.

4. బలవంతముగా తన వాదమును నెగ్గించుకోజూచుట నపుంసకుడు యువతిని చెరుపగోరినట్లేయగును

5. కొందరు మితముగా మాటలాడుటచే జ్ఞానులని అనబడుదురు. కొందరు అమితముగా మాట్లాడుటచే చెడ్డ పేరు తెచ్చుకొందురు.

6. ఏమి మాట్లాడవలెనో తెలియక కొందరు మౌనముగా నుందురు. ఎప్పుడు మాట్లాడవలెనో తెలిసి కొందరు మౌనము వహింతురు.

7. జ్ఞాని తగిన సమయము లభించువరకు మౌనముగా నుండును. కాని గొప్పలు చెప్పుకొను మూర్ఖునకు, ఉచిత సమయము తెలియదు. 

8. అమితముగా ప్రేలెడు వానిని జనులు అసహ్యించుకొందురు. మాట్లాడుటకు తమకు అవకాశమీయని వానిని నరులు అసహ్యించెదరు.

9. ఒక్కొక్కసారి దురదృష్టము వలన లాభమును, అదృష్టము వలన నష్టమును కలుగును.

10. కొన్నిసార్లు ఉదారముగా ఇచ్చుటవలన లాభము కలుగదు. కొన్నిసార్లు మాత్రము రెండింతలుగా ఫలితము కల్గును.

11. కొందరు గౌరవము పొందుటవలననే హీనులగుదురు. కొందరు హీనదశ నుండియు గౌరవపదమును చేరుకొందురు.

12. ఒక్కొక్కసారి కొద్దిసొమ్మునకే చాలవస్తువులు వచ్చినట్లు కన్పించును, కాని కడన ఆ వ్యాపారమున రెండురెట్లు నష్టము కలుగును.

13. జ్ఞాని వివేకముతో మాట్లాడి నరుల మన్నన పొందును. మూర్చుడు ఎల్లరిని మెచ్చుకొనిన ఏ ఫలితమూ పొందడు.

14. మూర్ఖుని నుండి బహుమతి పొందుటవలన లాభములేదు. అతడు గ్రహీతనుండి ప్రతిఫలము ఎక్కువగనే ఆశించును.

15. అతడు తక్కువ ఇచ్చి ఎక్కువగా విమర్శించును. వార్తావహునివలె పెద్ద గొంతు చేసికొని అరచును. ఈనాడు ఏదైనా ఇచ్చినచో రేపు దానిని తిరిగి ఇచ్చివేయుమనును. అతడు వట్టి నీచుడు.

16. అటుపిమ్మట ఆ మూర్ఖుడు “నేననిన ఎవరికి ఇష్టము లేదు, నేను చేసిన సత్కార్యములనెవరు మెచ్చుకొనుటలేదు నా ఉప్పు తిన్నవారే నా చాటున నన్ను తూలనాడుచున్నారు” అని వాపోవును.

17. అట్టి వానినెల్లరును నిరతము గేలిచేయుదురు.

18. రాళ్ళు పరచిన నేలమీద జారిపడుటకంటె నోరుజారుట ఎక్కువ హానికరము. ఆ రీతిననే దుష్టుల పతనము త్వరితగతిన సంభవించును.

19. మర్యాదనెరుగని మనుష్యుడు, ఆ పామరులు మాటిమాటికి చెప్పుకొను బూతుకథ వంటివాడు.

20. మూర్ఖుడు సుభాషితము పలికినను ఎవరు వినరు. అతడు అనుచితమైన కాలముననే దానిని బలుకును

21. నరుడు నిరుపేదయైనను పాపము చేయడేని అంతరాత్మ అతడిని నిందింపదు.

22. మూర్ఖుల సమక్షమున మాట్లాడనొల్లనివాడు గౌరవమును కోల్పోవును.

23. కాదనలేక మిత్రుని వేడుకోలును అంగీకరించువాడు అనవసరముగా అతనిని శత్రువును జేసికొనును.

24. అబద్ధము నరుని శీలమునకు మచ్చదెచ్చును. అది ఎల్లప్పుడు అజ్ఞానుల పెదవులపై ఉండును.

25. అలవాటు చొప్పున అబద్దములాడు వానికంటే దొంగ మేలు. కాని ఆ ఇరువురికి నాశనము తప్పదు.

26. బొంకులాడుట వలన అవమానము కలుగును. ఆ అపకీర్తి ఏనాటికిని తొలగదు.

27. జ్ఞాని తన విజ్ఞాన వాక్యముల వలన రాణించును. తన పలుకులద్వారా ప్రముఖుల మన్ననలు పొందును.

28. నేలను దున్నువానికి మంచిపంట పండును. ప్రముఖులు తమను మెప్పించినవాని అపరాధమును మన్నింతురు.

29. లంచములు, బహుమతుల వలన జ్ఞానులును గ్రుడ్డివారగుదురు. అవి వారి నోటికి చిక్కములై వానినుండి సద్విమర్శలు వెలువడనీయవు.

30. దాచియుంచిన విజ్ఞానము గుప్తమైయున్న నిధివంటిది. ఆ రెండింటి వలన ప్రయోజనము లేదు.

31. తన విజ్ఞానమును దాచియుంచిన వానికంటే తన మూర్ఖత్వమును దాచియుంచినవాడు మెరుగు పాపము.

 1. కుమారా! నీవు యిదివరకే పాపము చేసియుంటివేని మరలచేయవద్దు. పూర్వము చేసిన తప్పులను మన్నింపుమని దేవుని వేడుకొనుము.

2. సర్పమునుండివలె పాపమునుండి దూరముగా పారిపొమ్ము. దానిచెంతకుబోయెదవేని అది నిన్ను కాటువేయును పాపము కోరలు, సింహపుపళ్ళు వంటివి. అవి నరుల ప్రాణములు తీయును.

3. రెండంచులకత్తి నయముకాని గాయము గావించును. దైవాజ్ఞ మీరి చేసిన పాపము కూడ అట్లే చేయును.

4. దౌర్జన్యపరుడును, గర్వాత్ముడును అయినవాడు సర్వము కోల్పోవును.

5. పేదవాడు పెట్టిన మొర తిన్నగా దేవుని చెవిలో పడును. ప్రభువు అతనికి తక్షణమే తీర్పుచెప్పును.

6. మందలింపు నంగీకరింపనివాడు పాపపుత్రోవలో నడచును. దైవభీతికలవాడు పరివర్తన చెందును.

7. మంచివక్త ఎల్లెడల పేరు తెచ్చుకొని ఉండవచ్చును. కాని అతడు నోరు జారినచో విజ్ఞుడు వెంటనే గుర్తించును.

8. ఇల్లు కట్టుకొనుటకు సొమ్ము అప్పు తెచ్చుకొనుట,  తన సమాధికి తానే రాళ్ళు ప్రోగుజేసుకొనుట వంటిది.

9. దుర్మార్గులు గుమిగూడినపుడు మండెడు కట్టెలవలె నుందురు. వారెల్లరు కాలి నాశనమగుదురు.

10. దుష్టుడు నడచెడి త్రోవ నునుపుగా నుండును. కాని అది మృతలోకమును చేర్చును.

11. దైవాజ్ఞలను పాటించువాడు తన వాంఛలను అదుపులో పెట్టుకొనును. దైవభీతి కలవాడు పరిపూర్ణమైన విజ్ఞానమును పొందును.

12. తెలివిలేనివానికి బోధింపజాలము. కాని తెలివిగలవానివలె నటించువాడు కష్టముల పాలగును.

13. జ్ఞాని విజ్ఞానము పారుయేరువలె ఎపుడును తరుగకుండును. అతడి ఉపదేశము వట్టిపోని చెలమవలె వూరుచుండును.

14. మూర్ఖుని మనస్సు పగిలిన కుండవంటిది. అతడు నేర్చిన విజ్ఞానమేమియు హృదయమున నిలువదు.

15. విద్యావంతుడు విజ్ఞానసూక్తిని మెచ్చుకొనును. అది అతని హృదయములో నూత్న భావములను రేకెత్తించును. కాని అజ్ఞానుడు విజ్ఞానసూక్తిని వినినను మెచ్చుకొనడు. దానిని వెంటనే మరచిపోవును.

16. మూర్ఖుని సంభాషణను వినవలెనన్న బరువు నెత్తికెత్తుకొని ప్రయాణము చేసినట్లు భారముగా నుండును. కాని జ్ఞాని పలుకులు వినుటకు యింపుగా నుండును.

17. సభలోని ప్రజలు జ్ఞాని పలుకుల కొరకు ఎదురు జూతురు. వారతని భావములకు ఎనలేని విలువనిత్తురు.

18. మూర్ఖుని విజ్ఞానము అర్థము పర్థములేని మాటలప్రోగు. అది కూలిపోయిన ఇంటివలె నుండును.

19. అజ్ఞానికి ఉపదేశమును అర్జింపవలెనన్న కాలు సేతులకు సంకెళ్ళు పడినట్లుండును.

20. కాని జ్ఞాని ఉపదేశమును బంగారునగగా, ముంజేతికి దొడిగిన మురుగుగా భావించును.

21. అజ్ఞుడు పకపకనవ్వును. కాని విజ్ఞుడు మందస్మితము చేయును.

22. మూర్ఖుడు తిన్నగా పొరుగింటిలోనికి వెళ్ళును. కాని అనుభవశాలి మర్యాదగా వెలుపల నిలుచుండును

23. మందబుద్ధి గలవాడు వాకిటనుండి లోపలికి తొంగిచూచును. కాని మర్యాద తెలిసినవాడు వెలుపల నిలుచుండును

24. వాకిలి వద్ద నిలుచుండి లోపలి మాటలు వినుట సభ్యత కాదు. సంస్కారము కలవాడు అట్టి పనికి సిగ్గుపడును.

25. కొండెములు చెప్పువారు పరుల మాటలను పునశ్చరణము చేయుదురు. కాని జ్ఞాని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడును.

26. అజ్ఞుడు ఆలోచన లేక నోటికి వచ్చినట్లు వదరును.జ్ఞాని చక్కగా ఆలోచించిగాని సంభాషింపడు.

27. మూర్ఖుడు తన శత్రువును శపించునపుడు తనను తానే శపించుకొనుచున్నాడు.

28. కొండెములు చెప్పువాడు తన పేరును తాను చెడగొట్టుకొనును. ఇరుగుపొరుగువారు అతనిని అసహ్యించుకొందురు

 1. సోమరిపోతు అశుద్దము సోకిన రాతివంటి వాడు. అతని సిగ్గుమాలినతనమును జూచి ఎల్లరు అసహ్యించుకొందురు.

2. అతడు మల పిండము వంటివాడు. దానిని చేతిలోనికి దీసికొనినవాడు, అసహ్యముతో విసరికొట్టును.

3. పోకిరి బిడ్డకి తండ్రి అనిపించుకొనుట అవమానకరము. ఆడుబిడ్డ పుట్టుటవలన నష్టమే కలుగును.

4. తెలివితేటలు కల బాలికకు పెండ్లిఅగును. కాని సిగ్గు సెరములేని పిల్ల తండ్రియెదపై కుంపటి అగును.

5. పొగరుబోతు పడుచు తండ్రికి, మగనికికూడ తలవంపులు తెచ్చును. ఆ ఇరువురు ఆమెను చులకన చేయుదురు.

6. తగని సమయమున పిల్లలకు బుద్ధిచెప్పుట, శోకించువారికి సంగీతమును విన్పించుటవలెను నిరర్థకమైనది. కాని, వారిని మందలించి క్రమశిక్షణను నేర్చుట ఎల్లవేళల మంచిది.

7. మూర్ఖునికి విద్య గరపబూనుట పగిలిపోయిన కుండ పెంకులను అతికించుటవలె గాఢనిద్రలోనున్న వారిని లేపజూచుటవలె వ్యర్ధమైన కార్యము.

8. మూర్ఖునికి బోధించుట నిద్రతో తూలువానికి బోధించుట వంటిది. అంతయు విన్న పిదప అతడు నీవేమి చెప్పితివని అడుగును.

9. వినయ విధేయతలతో పెరిగిన పిల్లలను జూచినపుడు వారి తల్లిదండ్రులు తక్కువ స్థాయికి చెందిన వారు కారని గ్రహింతుము.

10. పొగరుబోతులుగ, మర్యాదలేనివారుగ . పెరిగిన పిల్లలు గౌరవముగల కుటుంబమునకుగూడ అపకీర్తి తెత్తురు

11. జ్యోతి ఆరిపోయినది కనుక మృతునికొరకు విలపింతుము. తెలివి కొరత పడినది కనుక మూర్ఖునికొరకు విలపింపవలెను.

12. మృతునికొరకు ఏడునాళ్ళు విలపింతుము. కాని మూర్ఖుడైన మృతుని కొరకు వాని జీవితాంతము విలపింపవలెను.

13. మూర్ఖుని దగ్గరకు వెళ్లవద్దు. అతనితో ఎక్కువగా మాట్లాడవద్దు. అతని దగ్గరకు వెళ్ళినచో నీకు తిప్పలు తప్పవు. అతని స్పర్శవలన నీకు కళంకము సోకును. వానికి దూరముగానున్నచో నీకు మనశ్శాంతి కలుగును. వాని మూర్ఖత్వము వలన నీవు విసుగు చెందనక్కరలేదు.

14. సీసము కన్న బరువైనదేమిటి?  నిక్కముగా మూర్ఖుడే.

15. ఇసుక, ఉప్పు, ఇనుము బరువు కంటె మూర్ఖుని బరువెక్కువ.

16. భూకంపము వచ్చినను కూలిపోని విధమున కొయ్యదూలమును ఇంటికి అమర్చుదురు. అట్లే విజ్ఞానమున శిక్షణనొందిన నరుడు ఆపత్కాలమున కూలిపోడు.

17. చక్కగా ఆలోచించు మేధస్సు, చిత్రములు గీసిన నునుపైన గోడవంటిది.

18. ప్రహరి గోడమీద పోసిన చిన్నరాళ్ళు, పెనుగాలికి నిలువవు. అట్లే వెఱ్ఱి మొఱ్ఱి  తలపులతో తనకు తానే భయపడు మూర్ఖుడు, కష్టమైన సంఘటనములకు తట్టుకొని నిలువజాలడు.

19. కంటికేదైన పొడుచుకొనినచో నీరు కారును.  అట్లే హృదయమును గాయపరచినచో కోపతాపములు కలుగును.

20. రాయి విసరినచో పక్షులు ఎగిరిపోవును. స్నేహితుని అవమానించినచో చెలిమి చెడిపోవును

21. నీవు నీ స్నేహితునిమీద కత్తిదూసినను నిరాశ పడనక్కరలేదు. మరల సఖ్యత కలిగించుకో వచ్చును.

22. అతనితో ఘర్షణనకు దిగినను. చింతింపనక్కరలేదు, మరల రాజీపడవచ్చును. కాని అవమానము, అహంకారము, రహస్యములను బయలుపరచుట, వెన్నుపోట్లు పొడుచుట అను బుద్ధిగలవానిని ఏ మిత్రుడు సహింపలేడు.

23. తోటివాడు పేదవాడుగనున్నపుడే అతనికి నీమీద నమ్మకము కలుగునట్లు చేసికొనుము. తరువాత అతడు వృద్ధిలోనికి వచ్చినపుడు నీవు అతని సిరిని అనుభవింపవచ్చును.

24. పొగలు, సెగలు నిప్పుమంటలకు సూచనలు. అట్లే పరావమానములు హత్యలకు సూచనలు.

25. నేను మిత్రునికి ఆశ్రయమిచ్చుటకు వెనుకాడను. అతడు అవసరము కలిగి వచ్చినపుడు మొగము తప్పించుకొనను.

26. ఆ మిత్రుని వలన నాకు కీడు కలిగెనేని, ఆ సంగతి తెలిసిన వారెల్ల, అతనిపట్ల మెలకువతో ప్రవర్తింతురు.

27. నా నోటికి ఎవరైన కావలియుండి విజ్ఞతతో నా పెదవులను మూయించిన ఎంత బాగుండును! అప్పుడు నేను తప్పులు చేయకుందును, నా జిహ్వ నన్ను నాశనము చేయకుండును.

  1. నాకు తండ్రివియు, నా జీవమునకు కర్తవైన ప్రభూ! నేను నా జిహ్వకు లోబడకుండునట్లును అనుగ్రహింపుము.

2. ఎవరైన నా తలపులకుగాను నన్ను దండించినచో విజ్ఞానము నా హృదయమునకు శిక్షణనిచ్చినచో, ఎంత బాగుండును! నేను తప్పుచేసినపుడు. శిక్షననుభవింపవలెను. నా అపరాధములన్నిటికి దండనమును పొందవలెను

3. అప్పుడు నా తప్పులు పెరిగి పోకుండును. నేను మితిమీరిపాపములు కట్టుకొనకుందును. అప్పుడు నేను నా విరోధులకు దొరికిపోకుందును. వారు నన్ను గేలిచేయకుందురు.

4. నాకు తండ్రివియు, నా జీవమునకు దేవుడవునైన ప్రభూ! అహంకారము నుండి నన్ను కాపాడుము.

5. నా హృదయమునుండి కామమును తొలగింపుము.

6. . నేను మోహమునకు లొంగిపోకుండునట్లును, సిగ్గుమాలి కామవికారమునకు లోబడకుండునట్లును కరుణింపుము.

7. బిడ్డలారా! మీ నోటిని అదుపులో పెట్టుకోవలసిన తీరును వినుడు. నా ఉపదేశమును పాటింతురేని మీరు మోసపోరు

8. పాపాత్ముని, అతని పలుకులే పట్టియిచ్చును. నిందాగర్వములతో కూడిన అతని మాటలే అతనిని కూలద్రోయును.

9. నీవు ఒట్టు పెట్టుకోవలదు. పరిశుద్ధుడైన ప్రభువు నామమును తేలికగా ఉచ్చరింపవలదు.

10. మాటిమాటికి దండనమును అనుభవించు బానిసకు గాయములు తప్పనట్లే తేపతేపకు ప్రభువు పవిత్రనామముతోప్రమాణము చేయువానికి పాపము తప్పదు.

11. నిరతము ఒట్టు పెట్టుకొనువాడు మహాదుష్టుడు. అతని కుటుంబము శిక్షకు గురియగును. అతడు తాను చేసిన ప్రమాణమును తీర్పడేని పాపము కట్టుకొనును. తేలికగా ప్రమాణము చేసెనేని రెండింతలుగా పాపమును కట్టుకొనును. అబద్ద ప్రమాణము చేసెనేని దోషపాత్రుడగును. అతని కుటుంబమునకు కడగండ్లు తప్పవు.

12. మృత్యువుతో సమానమైన సంభాషణ వైఖరి కలదు యిస్రాయేలీయులలో ఎవడును దానికి పాల్పడకుండుగాక! భక్తులు ఆ పాపపంకమున కాలు పెట్టక, దానికి దూరముగా నుందురుగాక!

13. అసభ్యమైన కామ సంభాషణలకు పాల్పడవలదు, అట్టి చెయిదము పాపమును తెచ్చిపెట్టును.

14. నీవు ప్రముఖుల మధ్య కూర్చుండియున్నప్పుడు మైమరచి, నీ అవివేకమును చాటుకోవచ్చును. ఆ సంగతి విన్నచో నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుదురో ఊహింపుము. అప్పుడు నీవు నీ పుట్టిన దినమును శపింతువు. నీవు పుట్టకుండనే ఉండిన బాగుండెడిది గదా అని తలంతువు.

15. అసభ్య పలుకులకు అలవాటుపడినవాడు తాను జీవించియున్నంత కాలము ఆ దురభ్యాసమును సవరించుకోలేడు.

16. రెండువర్గముల పాపులు తప్పులు కుప్పలుగా చేయుదురు. మూడవవర్గము పాపులు కూడ దేవుని శిక్షననుభవింతురు. కొలిమివలె మండెడు కామాగ్నినెవరు చల్లార్పలేరు అది తననుతాను కాల్చివేసికొని ఆరిపోవలసినదే. కామవాంఛను తీర్చుకొనుటకు మాత్రమే జీవించునరుని, కడన ఆ కామాగ్నియే కాల్చివేయును.

17. అట్టివాడు ప్రతి స్త్రీని కామించును. అతడు జీవించియున్నంత కాలము అతని కామవాంఛతీరదు.

18. వివాహధర్మము మీరి వ్యభిచారమునకు పాల్పడువారు “నన్నెవరు చూతురు? ఇది చీకటివేళ, గోడలు అడ్డముగా ఉన్నవి. ఎవరును నన్ను గమనింపరు, నేను భయపడనేల? మహోన్నతుడైన ప్రభువు నా దోషమును పట్టించుకొనడు” అని అనుకొనును

19. నరులు తనను చూతురేమో అని మాత్రమే అతని భయము. కాని ప్రభువు నేత్రములు సూర్యునికంటె పదివేలరెట్లు కాంతిమంతముగా ఉండుననియు అవి మనము చేయు ప్రతికార్యమును, మన రహస్యములన్నిటిని గమనించుననియు అతడు ఎరుగడు.

20. జగత్తును సృజింపక పూర్వమే ప్రభువునకు అన్నియు తెలియును. సృష్టి ముగిసిన పిదప ఆయనకు అన్నియు తెలియును

21. కనుక ఆ పాపి తాను ఊహింపనపుడు పట్టువడి బహిరంగముగా శిక్షను అనుభవించును.

22. భర్తకు ద్రోహము చేసి పరపురుషుని వలన బిడ్డను కనిన స్త్రీని పై శిక్షయే ప్రాప్తించును.

23. ఆమె మొదటితప్పు మహోన్నతుని శాసనమును మీరుట. రెండవ తప్పు తన పెనిమిటికి ద్రోహముచేయుట. మూడవతప్పు రంకులాడియై అన్యపురుషుని వలన బిడ్డను కనుట.

24. ఆ పతితను సభ యెదుటికి కొనివత్తురు. ఆమె పిల్లల పుట్టుపూర్వోత్తరములను విచారింతురు

25. ఆమె బిడ్డలను సమాజము గౌరవింపదు. వారు స్వీయకుటుంబములను నెలకొల్పుకొని సంతానమును కనజాలరు.

26. ఆ వనిత శాపగ్రస్తురాలగును. ఆ అపకీర్తి ఏనాటికిని తొలిగిపోదు.

27. ఆమె గతించిన తరువాత లోకులు దైవభీతి కంటే శ్రేష్ఠమైనది ఏదియును లేదని, దైవాజ్ఞలను పాటించుటకంటే మధురమైనది ఏదియును లేదని గుర్తింతురు.

 1. విజ్ఞానము తన కీర్తిని తాను ఉగ్గడించుకొనుచున్నది. తన ప్రజలైన యిస్రాయేలీయుల మధ్య తనను తాను స్తుతించుకొనుచున్నది.

2. మహోన్నతుడైన ప్రభువు సమాజము ఎదుట దేవదూతల సమక్షమున ఆమె తన కీర్తినిట్లు వెల్లడించుకొనుచున్నది:

3. నేను మహోన్నతుడైన ప్రభువు పలికిన వాక్కును. పొగమంచువలె నేను భూమిని కప్పితిని. "

4. అత్యున్నతమైన ఆకాశము నా నివాసస్థలము, నా సింహాసనము మేఘస్తంభముమీద ఉండెడిది

5. ఏ తోడును లేక నేనొక్కరైనే ఆకాశపు అంచుల చుట్టు తిరిగితిని. సాగరగర్భమున సంచరించితిని.

6. సాగర తరంగములమీదను, సర్వభూమిమీదను, సమస్తజాతులమీదను నా ఆధిపత్యమును నెరపితిని.

7. నా నివాసమునకు అనువైన స్థలము కొరకు ఎల్లయెడల గాలించితిని. నేను ఏ ప్రదేశమున వసింతునా అని పరిశీలించి చూచితిని. 

8. అపుడు సర్వమును కలిగించిన దేవుడు నాకు ఆ యిచ్చెను. 'సృష్టికర్త నేనెచట వసింపవలెనో నిర్ణయించెను. అతడు నీవు యాకోబు వంశజులనడుమ వసింపుము యిస్రాయేలీయులు నీ ప్రజలగుదురు' అని సెలవిచ్చెను.

9. కాలము కలుగకమునుపే ఆదిలోనే అతడు నన్ను చేసెను. నేను కలకాలము మనుదును.

10. పవిత్రమైన గుడారమున నేను ప్రభువును సేవించితిని. అటు తరువాత సియోను కొండమీద వసించితిని

11. ప్రభువు తనకు ప్రీతికరమైన నగరమున నాకు నివాస మేర్పరచెను. యెరూషలేము మీద నాకు ఆధిపత్యము నొసగెను.

12. ఆయన తన సొంత ప్రజగా ఎన్నుకొని ఆదరాభిమానములతో చూచుకొను జనులనడుమ నేను స్థిరపడితిని.

13. నేను లెబానోనునందలి దేవదారు తరువులవలెను హెర్మోను పర్వతముమీది వృక్షరాజములవలెను ఎదిగితిని.

14. ఎంగిడిలోని ఖర్జూర వృక్షములవలెను, యెరికోలోని గులాబి పొదలవలెను వర్ధిల్లితిని. పొలములోని అందమైన ఓలివు చెట్లవలెను, నీటియొడ్డున ఎదుగు అష్ట వృక్షమువలెను పెంపొందితిని.

15. నా శ్వాస లవంగమువలెను, సుగంధతైలమువలెను, గోపరసమువలెను, గోపీచందనమువలెను, జటామాంసి వలెను, దేవుని గుడారమున వాడు సాంబ్రాణి పొగ వలెను సువాసనలొలికెను.

16. నేను సింధూరమువలె సుదీర్ఘములును, సుందరములైన శాఖలును తొడిగితిని.

17. ద్రాక్షలతవలె సొగసైనరెమ్మలు చాచి పూలు పూచి శోభాయమానముగను, సమృద్ధిగను ఫలించితిని.

18. నిర్మలమైన ప్రేమకు, దైవభీతికి, విజ్ఞానముకు, నిరీక్షణకు నేను జననిని. నేను శాశ్వతముగా జీవించుదానను. గనుక దేవుడు తానెన్నుకొనిన ప్రజలందరికి నన్ను దయచేసెను.

19. నన్ను అభిలషించు వారందరు నా చెంతకు రండు. మీ ఆకలిదీర నా ఫలములు భుజింపుడు.

20. మీరు నన్ను స్మరించుకోగా, నేను మీకు తేనెకంటె తీయగా నుందును. మీరు నన్ను సంపాదించుకోగా నేను మీకు తేనెపట్టు కంటె తీయగా నుందును.

21. నన్ను భుజించువారు, మరి అధికముగా భుజింపగోరెదరు. నన్ను పానము చేసినవారు, మరి అధికముగా పానము చేయగోరెదరు.

22. నాకు విధేయులైనవారు అవమానమునకు గురికారు. నేను చెప్పినట్లు చేయువారు పాపము కట్టుకొనరు”.

23. ఈ విజ్ఞానము, మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము, మహోన్నతుడైన ప్రభువు నిబంధన గ్రంథము, యిస్రాయేలు సమాజములకు వారసత్వముగా లభించిన ఆస్తి.

24. ఎల్లవేళల మీరు ప్రభువునుండి బలమును పొందుడు. ఆయనను ఆశ్రయించి ఆయన నుండి శక్తిని పొందుడు. సర్వశక్తుడైన ప్రభువు తప్ప, మరొక దేవుడు కాని, రక్షకుడు కాని లేడు.

25-26. నీటితో నిండిన పీషోను నదివలెను, పంటకారు నందలి టిగ్రీసు నదివలెను ధర్మశాస్త్రము విజ్ఞానముతో నిండియుండును జలముతో నిండిన యూఫ్రటీసు నదివలెను పంటకారునందలి యోర్దాను నదివలెను ధర్మశాస్త్రము వివేకముతో నిండియుండును.

27. నీరముతో నిండిన నైలునదివలెను, ద్రాక్షపండ్లు కోయుకాలము నందలి గీహోను నదివలెను ధర్మశాస్త్రము ఉపదేశముతో నిండియుండును.

28. తొలి నరునికి విజ్ఞానముగూర్చి పూర్తిగా తెలియదు. కడపటి నరుడును దానిని సంపూర్ణముగా గ్రహింపజాలడు.

29. విజ్ఞాన భావములు సముద్రము కంటెను విశాలమైనవి. దాని ఆలోచనలు అగాధజలములకంటెను లోతైనవి

30. నామట్టుకు నేను నదినుండి తోటలోనికి నీటినికొనివచ్చు చిన్నకాల్వవంటివాడనని అనుకొంటిని.

31. నేను నా తోటకు, నా పూలమడులకు నీరు పెట్టుదును అని అనుకొంటిని. కాని ఆ కాలువ అనతికాలములోనే నదియైనది, ఆ నదియు సముద్రమైనది.

32. నేనిపుడు ఉదయభానునివలె ఉపదేశకిరణములు విరజిమ్ముదును. ఆ ఉపదేశపు కాంతి చాలదూరము వరకు ప్రసరించునట్లు చేయుదును.

33. ప్రవక్తవలె నా బోధను వెలువరించెదను. అది భావితరముల వారికి ఉపయోగపడును.

34. కేవలము నా కొరకు మాత్రమేగాక విజ్ఞానమును అన్వేషించు వారందరి కొరకు నేనీ కృషి చేసితిని.

 1. మూడు కార్యములు నాకు ఇష్టము. దేవునికిని నరులకుగూడ ఇవి ప్రీతి కలిగించును. సోదరులు ఐకమత్యముగా జీవించుటయు, ఇరుగుపొరుగువారు స్నేహముగా జీవించుటయు, భార్యాభర్తలు పొందికగా జీవించుటయు.

2. క్రింది మూడు రకముల మనుష్యులనిన నాకు గిట్టరు. వారి పోకడలను నేనెంతమాత్రమును సహింపజాలను గర్వాత్ముడైన దరిద్రుడును, అబద్దములాడు ధనికుడును, వ్యభిచారము చేయు మూర్ఖవృద్దుడును.

3. నీవు బాలుడవుగా ఉన్నప్పుడు విజ్ఞానమును గణింపవేని వృద్ధుడవైనపుడు జ్ఞానివి కాజాలవు.

4. చక్కగా ఆలోచించుట వృద్దులకు చెల్లును. మంచిసలహా ఇచ్చుట వృద్ధులకు తగును.

5. వృద్ధులకు జ్ఞానము తగును. పెద్ద వారికి మంచి ఆలోచన చెప్పుట తగును.

6. పండిన అనుభవమే వృద్ధులకు కిరీటము. దైవభీతియే వారికి అనంతకీర్తి.

7. తొమ్మిదిరకముల నరులనెరిగి యుండుట నా అదృష్టము. పదియవ రకము మనుజునెరిగి యుండుటయు నా భాగ్య విశేషము. తన బిడ్డలను చూచి ఆనందించువాడును, తాను గతింపకముందే తన శత్రువుల పతనమును చూచినవాడును,

8. తెలివి తేటలుగల భార్యను బడయుట అను భాగ్యమునకు నోచుకొనిన భర్తయును, పరస్పరము తగిన దంపతులును, నోటి దురుసుతనము వలన పాపము చేయనివాడును, తనకంటె నికృష్టుడైనవానికి సేవలు చేయనివాడును

9. మంచిస్నేహితుని బడయుట అను భాగ్యమునకు నోచుకొనినవాడును, శ్రోతలు శ్రద్ధగా వినునట్లు మాట్లాడగలవాడును,

10. విజ్ఞానమును అర్జించిన మహానుభావుడును. కాని వీరందరికంటె ఘనుడు దైవభీతి కలవాడు.

11. దైవభీతికి మించిన భాగ్యములేదు. దైవభయముగల నరునికి సమతుల్యుడును లేడు.

12. దైవభీతి దైవప్రేమకు మొదటిమెట్టు. విశ్వాసమువలన నరుడు దేవుని అంటిపెట్టుకొనును

13. గాయములన్నింటిలో ప్రేమను భగ్నము చేయు గాయము పెద్దది. ఆ దుష్టత్వములన్నిటిలో స్త్రీ దుష్టత్వము పెద్దది.

14. అపకారములన్నిటిలో శత్రువు చేయు అపకారము గొప్పది. నేను నా ప్రతీకారములన్నిటిలో పగవాని ప్రతీకారము ఘోరమైనది.

15. పాము విషమును మించిన విషము లేదు. పగతుని కోపమును మించిన కోపము లేదు.

16. నేను సింహముతోను, కాలసర్పముతోను కలిసి వసింపగలను, కాని దుష్టురాలైన భార్యతో కలిసి జీవింపలేను.

17. భార్యకు కోపము వచ్చినపుడు ఆమె రూపము మారిపోయి ఆగ్రహము చెందిన తోడేలువలె అగును.

18. ఆమె పెనిమిటి పొరుగింట భోజనము చేయవలెను అచట అతడు నిట్టూర్పులు విడువక తప్పదు.

19. స్త్రీ దుష్టత్వమును మించిన దుష్టత్వములేదు. ఆమెకు పాపికి పట్టెడు దుర్గతిపట్టునుగాక.

20. వృద్ధునికి ఇసుకదిబ్బను ఎక్కుట ఎంత కష్టమో, సాధుపురుషునికి నిరతము గొణిగెడు భార్యతో కాపురము చేయుట అంత కష్టము.

21. స్త్రీ సౌందర్యమునకు భ్రమసిపోవలదు. అతివను చూసి మతికోల్పోవలదు.

22. స్త్రీ చే పోషింపబడు పురుషుడు కోపమునకు, అహంకారమునకు, అవమానమునకు గురియగును.

23. దుష్టురాలైన భార్యవలన భర్తకు విషాదమును, విచారమును, హృదయవేదనయు కలుగును. ధైర్యసాహసములు లేని భర్తను, భార్య సంతోషపెట్టదు.

24. పాపము స్త్రీతోనే ప్రారంభమైనది. ఆమె మూలమున మన మందరము చావవలసి వచ్చినది.

25. తొట్టినుండి నీటిని కారనీయగూడదు. దుష్టురాలైన భార్యను నోటికి వచ్చినట్లు వాగనీయకూడదు.

26. నీ మాట విననిచో ఆమెకు విడాకులిమ్ము.

 1. గుణవతియైన భార్యను బడసినవాడు ధన్యుడు. ఆమె మూలమున అతని ఆయుష్షు రెండు రెట్లు పెరుగును.

2. సద్బుద్ధికల భార్య భర్తకు పరమానందము కలిగించును. అతడు శాంతిసమాధానములతో జీవితమును గడపును.

3. మంచి ఇల్లాలు శ్రేష్ఠమైన వరము వంటిది. దైవభీతి కలవారికేగాని ఆ వరము లభింపదు.

4. అట్టివారు ధనికులైనను, దరిద్రులైనను సంతసముతో జీవింతురు. వారి ముఖములు ఎల్లవేళల యందు ఆనందముతో నిండియుండును.

5. మూడు సంగతులనిన నాకు భయము. నాలుగవదనిన నా గుండె దడదడలాడును. పుకారులు నగరమంతట ప్రాకుట, జనులు గుమిగూడుట, నీలాపనిందలను మూడును మృత్యువుతో సరిసమానము.

6. కాని స్త్రీని చూచి స్త్రీ అసూయపడినపుడు మితిమీరిన బాధయు, దుఃఖమును కలుగును. ఆమె సూటిపోటుమాటలు ఎల్లరిని నొప్పించును. 

7. దుష్టురాలైన భార్య కుదరని కాడివలె ఉండును. ఆమెను అదుపులో పెట్టుకొనుట, తేలును చేతబట్టుకొనుట వంటిది.

8. త్రాగియున్న భార్య మహాకోపమును రప్పించును. ఆమె సిగ్గుమాలినతనమును ఎల్లరును గమనింతురు.

9. కులటయైన స్త్రీ ధైర్యముగా కన్నెత్తి చూచును. ఆమె వాలు చూపులను బట్టియే ఆమె గుణమును గ్రహింపవచ్చును.

10. తలబిరుసు కుమార్తెను . ఒక కంట కనిపెట్టియుండవలెను, లేదని ఆమె అవకాశము చూచుకొని కానిపనికి పాల్పడును,

11. ఆ యువతి సిగ్గుమాలిన చూపులను గమనించు చుండుము. ఆమె నీకు తలవంపులు తెచ్చినను ఆశ్చర్యపడవలదు

12. ఆమె దప్పికగొనిన బాటసారివలె ఏ నీరు దొరకిన ఆ నీటినే త్రాగును. ఏ తావుననైనను, ఏ పురుషునికైనను కాళ్ళుచాచును. ఏ బాణమునైనను తన అమ్ములపొదిలో పెట్టించుకొనును

13. యోగ్యురాలైన భార్యవలన భర్త ఆనందము చెందును. ఆమె సామర్థ్యమువలన అతడు బలాఢ్యుడగును.

14. మితభాషిణియైన భార్య దేవుడిచ్చిన వరము అనవలెను. ఆమె సంయమనమునకు వెలకట్టలేము.

15. శీలవతియైన భార్య మనోజ్ఞత అంతింతకాదు. ఆమె సచ్ఛీలమును ఏ తక్కెడతోను తూచజాలము

16. ప్రభుని ఆకాశమున ఉదయభానుడు ప్రకాశించినట్లే మంచి ఇల్లాలు తాను చక్కగా తీర్చిదిద్దుకొనిన ఇంట వెలుగొందుచుండును.

17. పవిత్ర దీపస్తంభముమీద దీపము వెలిగినట్లే, సుందరమైన తనువుమీద ఆమె మొగము మెరయుచుండును.

18. వెండి దిమ్మెలమీద నిలిచిన బంగారుస్తంభమువలె బలమైన మడమల మీద ఆమె అందమైన కాళ్ళు వెలుగొందుచుండును.

19. నాయనా! యువకుడవుగా ఉన్నపుడు, నీ ఆరోగ్యమును కాపాడుకొనుము. అన్యకాంతలను కూడి నీ బలమును వమ్ము జేసికొనకుము.

20. దేశమున సారవంతమైన క్షేత్రమును వెదకి దానిలో నీ సొంత బీజములను వెదజల్లుము. నీ మంచి విత్తనములను నీవు నమ్మవలెను.

21. అప్పుడు నీ బిడ్డలు తాము మంచి కుటుంబమున పుట్టితిమని నమ్మి, పెరిగి పెద్దవారై వృద్ధిలోనికి వత్తురు.

22. ఉంపుడుకత్తె ఉమ్మివలె హేయమైనది. వ్యభిచారిణియైన భార్య తన ప్రియులకు చావు తెచ్చును.

23. దుర్మార్గునికి అతనికి తగినట్లే భక్తిహీనురాలైన భార్య లభించును. దైవభీతిగల నరునికి భక్తిగల భార్య దొరకును.

24. సిగ్గుమాలిన భార్య తనకు తానే అవమానమును తెచ్చుకొనును. కాని శీలవతియైన భార్య తన భర్త ఎదుటకూడ సిగ్గుపడును.

25. పొగరుబోతు భార్య కుక్కతో సమానము. గుణవతియైనసతి దేవుని గౌరవించును.

26. పెనిమిటిని గౌరవించు ఇల్లాలిని ఎల్లరు వివేకవతిగానెంతురు. కాని పొగరుబోతుతనముతో భర్తను ధిక్కరించుదానిని ఎల్లరు దుష్టురాలిగా గణింతురు యోగ్యురాలైన భార్యను పొందినవాడు ధన్యుడు. ఆమెవలన అతని ఆయష రెండంతలు పెరుగును

27. వదరుబోతు భార్య యుద్ధారంభమున ఊదు బాకావంటిది. అట్టి భార్యను బడసినవాడు పోరుననే జీవితమును గడుపవలెను.

28. రెండు విషయములు నాకు విచారము పుట్టించును మూడవది నాకు కోపము రప్పించును. శూరుడు పేదవాడగుట, బుద్ధిమంతులకు మన్నన లభింపకపోవుట, పుణ్యపురుషుడు పాపిగా మారిపోవుట. ఇట్టి వానికి ప్రభువు మరణశిక్ష విధించును.

29. వర్తకుడు దుష్కార్యమును చేయకుండ నుండలేడు. ప్రతి వ్యాపారి, పాపమునకు పాల్పడును.

 1. లాభము గణింపవలెనన్న పేరాశతో చాలమంది పాపము చేసిరి. ధనికుడు కాగోరువాడు, కన్నులు మూసికోవలెను.

2. బిగించిన రెండు రాళ్ళమధ్య మేకు ఇరుకుకొనియున్నట్లే క్రయవిక్రయముల నడుమ అన్యాయము దాగుకొనియుండును.

3. నరుడు దైవభీతికి లొంగడిని, వానిఇల్లు వానిమీదనే కూలిపడును.

4. ఊపిన జల్లెడలో మట్టిపెళ్ళలు మిగులునట్లే నరుని సంభాషణమున దోషములు కన్పించును.

5. కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవము. అట్లే నరునికి పరీక్ష అతడి సంవాదము.

6. చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహింపవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలమును గుర్తింపవచ్చును.

7. నరుని సంభాషణమే అతనికి పరీక్ష. కనుక ఏ నరునిగాని అతడు మాట్లాడకముందు స్తుతింపవలదు.

8. నీవు ధర్మమును సాధింపగోరెదవేని సాధింపవచ్చును. దానిని సుందరమైన వస్త్రమునువలె ధరింపవచ్చునుగూడ.

9. పక్షులు తమ జాతి పక్షులతో కలియును. అట్లే ధర్మమును ధర్మాత్మునితో కలియును.

10. సింహము ఎరకొరకు పొంచియున్నట్లే పాపము దుష్కార్యములు చేయువారి కొరకు పొంచియుండును.

11. సత్పురుషుని సంభాషణము పొందికగానుండును కాని మూర్ఖుని మాటలు చంద్రబింబమువలె మాటిమాటికి మారుచుండును.

12. మూర్ఖులు తటస్థపడినపుడు ఏదో ఒక నెపముతో తప్పించుకొని వెళ్లిపొమ్ము. జ్ఞానులు తటస్థపడినపుడు దీర్ఘకాలము నిలువుము.

13. మూర్ఖుల సంభాషణము రోతపుట్టించును. వారు తమ దుష్కార్యములను గూర్చి పెద్దగా నవ్వుచు మాటలాడుదురు.

14. వారి శాపవచనములు వినినచో ఒడలు గగుర్పొడుచును. ఆ వారి కలహవాక్యములు వినినచో చెవులు మూసికోగోరుదుము.

15. గర్వాత్ముల కలహములు హత్యకు దారితీయును. వారి దూషణ భాషణములను మన చెవులు వినజాలవు.

16. రహస్యములను వెలిబుచ్చువాడు నమ్మదగనివాడు. అతనికి ఆప్తమిత్రులు దొరకరు.

17. నీ స్నేహితుని ప్రేమించి విశ్వసనీయునిగా మెలగుము అతని రహస్యములను వెల్లడిజేసెదవేని, ఇక అతనిని వదులు కోవలసినదే.

18. నరుడు తన శత్రువును నాశనము చేసినట్లే నీవును రహస్య ప్రకాశనము ద్వారా నీ స్నేహమును నాశనము చేసికొంటివి.

19. నీ చేతిలోని పక్షి జారిపోయినట్లుగానే నీ స్నేహితుడును తప్పించుకొనెను. అతడు మరల నీకు చిక్కడు.

20. అతడు చాలదూరము వెళ్ళిపోయెను. కనుక అతని వెంటబడవలదు. ఉచ్చులలో నుండి తప్పించుకొనిన లేడివలె అతడు పారిపోయెను.

21. గాయమునకు కట్టు కట్టవచ్చును, అపరాధమును మన్నింపవచ్చును, కాని రహస్యమును వెల్లడించినచో ఇక ఆశ వదులుకోవలసినదే.

22. కన్ను గీటువాడు అపకారమును తల పెట్టును. అతడు అపకారమును చేయకమానడు.

23. అతడు నీ ఎదుట తీయగా మాట్లాడును. నీ పలుకులెల్ల మెచ్చుకొనును. కాని నీ పరోక్షమున నీ మీద నేరములు తెచ్చును.

24. నేను అసహ్యించుకొను విషయములు చాల గలవుగాని ఇట్టి నరుని అన్నింటికంటే అధికముగా ఏవగించుకొందును. ప్రభువు కూడా వానిని రోయును.

25. ఎవడైనను రాతిని పైకి విసరినచో అది వాని తలమీదనే పడును. ఎవడైనను ఇతరుని కొట్టినచో వానికే దెబ్బలు తగులును.

26. ఎవడు త్రవ్విన గోతిలో వాడే పడును. ఎవడు పన్నిన ఉరులలో వాడే చిక్కుకొనును.

27. అపకారము చేయువాడు అపకారమునకు గురియగును. ఆ అపకారమెచటనుండి వచ్చినదో అతడికి తెలియదు.

28. గర్వాత్ములు ఇతరులను అవమానించి ఎగతాళి చేయుదురు. కాని ప్రతీకారము అతని మీదికి సింహము వలె దూకి పగతీర్చుకొనును.

29. సత్పురుషుల పతనమునకు సంతసించువారు ఉరులలో తగుల్కొని ఘోరబాధలతో చత్తురు.

30. పగ, కోపము అనునవి ఘోరమైనవి. పాపి ఈ రెండింటికి వశుడగును.

 1. ప్రభువు నరుని పాపములనెల్ల గమనించును.  పగతీర్చుకొను నరునిమీద ఆయన పగ తీర్చుకొనును.

2. నీవు తోడి నరుని అపరాధములను మన్నించినచో నీవు మొర పెట్టినపుడు దేవుడు నీ అపరాధములను మన్నించును.

3. నీవు తోడినరుని మీద కోపముగానున్నచో, నిన్ను క్షమింపుమని భగవంతుని ఎట్లడుగగలవు?

4. తోడినరుని మన్నింపనివాడు, తన తప్పిదములను మన్నింపుమని దేవుని ఎట్లు వేడుకొనగలడు?

5. నరమాత్రుడైనవాడు కోపమును అణచుకోజాలనిచో ఇక అతని తప్పిదములను ఎవడు మన్నించును?

6. నీవు చనిపోవుదువని జ్ఞప్తికి తెచ్చుకొని నీ పగను అణచుకొనుము. నీవు చనిపోగా నీ దేహము క్రుళ్ళిపోవునని గ్రహించి దైవాజ్ఞలు పాటింపుము.

7. దేవుని ఆజ్ఞలను స్మరించుకొని పొరుగు వాని మీద కోపము మానుకొనుము. దేవుని నిబంధనమును తలచి అన్యుని తప్పిదములను మన్నింపుము.

8. కలహములను పరిహరింతువేని నీ పాపములు తగ్గును. కోపము వలన కలహములు పెరుగును.

9. దుష్టుడు స్నేహితుల మధ్య తగవులు పెట్టి కలిసియున్న వారిని విడదీయును.

10. కట్టెకొలది మంటలు, మొండితనము కొలది కలహములు. నరుడు బలవంతుడును, ధనవంతుడైన కొలది. అతని కోపము రెచ్చిపోవును.

11. దిడీలున పుట్టుకొనివచ్చు కలహము ఉద్రేకమును పెంచును. ఆ త్వరపడి కలహించువారు, రక్తపాతమునకు ఒడిగట్టుదురు.

12. నిప్పురవ్వ మీద ఊదినచో మంటలేచును. దానిమీద ఉమ్మి వేసినచో అది ఆరిపోవును. ఈ రెండు క్రియలను మనము నోటితోనే చేయుదుము.

13. కల్లలాడువారును, అపనిందలు పుట్టించువారును శాపగ్రస్తులు. అందుకు డల అట్టివారు శాంతియుతముగా జీవించువారిని అనేకులను నాశనము చేయుదురు.

14. అపదూరులు మోపువారు చాలమందిని  నాశనము చేసిరి. తావునుండి తావునకు తరిమికొట్టిరి. ఆ దుష్టులు బలమైన పట్టణములను కూల్చివేసిరి. ప్రముఖుల గృహములను కూలద్రోసిరి.

15. ఇంకను వారు యోగ్యురాండ్రయిన ఇల్లాండ్రకు విడాకులిప్పించిరి. వారి కష్టార్జితములను అపహరించిరి.

16. అపదూరులుమోపు వాని మాటలు నమ్మువాడు శాంతిని, విశ్రాంతిని కోల్పోవును

17. కొరడాదెబ్బ ఒడలిమీద బొబ్బలు పొక్కించును. కాని దుష్టజిహ్వ ఎముకలనుగూడ విరుగగొట్టును

18. కత్తివాత పడి చాలమంది చచ్చిరి. కాని నాలుక వాతబడి చచ్చినవారు ఇంకను ఎక్కువ.

19. నాలుక ఉపద్రవమునకు లొంగనివాడు, దాని ఆగ్రహమునకు గురికానివాడును, దాని కాడిని మెడమీద పెట్టుకొని మోయనివాడును దాని గొలుసులచే బంధింపబడనివాడును ధన్యుడు

20. నాలుకకాడి యినుపకాడి, దానిగొలుసులు ఇత్తడిగొలుసులు.

21. అది తెచ్చిపెట్టు చావు ఘోరమైన చావు. నాలుక కంటె పాతాళలోకము మెరుగు.

22. కాని నాలుక భక్తులను జయింపలేదు, దాని మంటలు వారిని తాకజాలవు.

23. ప్రభువును విడనాడిన వారినే జిహ్వ బాధించును. ఆరని మంటలతో వారిని దహించివేయును. అది సింహమువలె వారి మీదికి దూకును. చిరుతపులివలె వారిని చీల్చివేయును.

24. నీ పొలమునకు ముళ్ళకంచె వేయుదువుకదా! నీ ధనమును పెట్టెలో పెట్టి . తాళము వేయుదువుకదా!

25. అట్లే నీ ప్రతిపలుకును తక్కెడలో పెట్టి తూచుము. నీ నోటికి తలుపు పెట్టి గడె బిగింపుము.

26. నీ నాలుకవల్లనే నీవు నాశనమై పోకుండునట్లును, నీ పతనమును ఆశించువాని ఎదుట నీవు వెల్లకిల పడకుండునట్లును, జాగ్రత్త పడుము.

 1. దయగలవాడు తన పొరుగువానికి అరువిచ్చును. అతనిని తన హస్తముతో బలపరచువాడు దేవుని ఆజ్ఞలను పాటించును.

2. తోడివాడు అక్కరలోనున్నపుడు సాయము చేయుము. నీవు బాకీపడియున్నప్పుడు వెంటనే ఋణము తీర్పుము.

3. నీవు ఋణదాతకు ఇచ్చిన మాటను నెరవేర్చుకొన్నచో అతడు నీ అక్కరలలో ఎల్లపుడు సాయము చేయును.

4. చాలమంది అప్పును ఉచితముగా దొరకిన సొమ్మనుకొందురు. ఆపదలో అప్పిచ్చి ఆదుకొన్నవారిని తిప్పలు పెట్టుదురు.

5. అప్పుకొరకు వచ్చినవాడు ఋణదాత చేతిని ముద్దు పెట్టుకొనును. అతని సంపదనుగూర్చి పొగడుచు మాటలాడును. కాని గడువు వచ్చినపుడు సొమ్ము చెల్లింపక జాప్యము చేయును. బాకీ తీర్చుటకు ఇది అదనుకాదని పలుకును. ' ఏవేవో కల్లబొల్లి సాకులు చెప్పును.

6. ఋణదాత ఋణగ్రస్తుని నిర్బంధ పెట్టి తానిచ్చిన అసలులో సగము రాబట్టుకోగలిగిన అదృష్టము పండినట్లుగానే భావింపవచ్చును. నిర్బంధముచేయనిచో ఋణదాత తన సొమ్మును కోల్పోవును. అనవసరముగా ఒక శత్రువునుగూడ సిద్ధము చేసికొనకుము. అప్పు తీసికొనినవాడు అతనిని శపించి తిట్టిపోయును. అతనిని గౌరవించుటకు మారుగా అవమానించి పంపును.

7. కనుకనే చాలమంది అరువిచ్చుట కంగీకరింపరు. వారు పిసినిగొట్టులు కాదుగాని, సొమ్మిచ్చి అనవసరముగా మోసపోనేల అని ఎంతురు.

8. అయినను పేదసాదలను సానుభూతితో చూడుము. వారిచే దీర్ఘకాలము బతిమాలించుకోవలదు.

9. దైవాజ్ఞలమీది గౌరవముచే పేదలకు సాయముచేయుము. అక్కర ఉండి వచ్చిన వారిని వట్టిచేతులతో పంపివేయకుము.

10. నీ కాసులను ఏ బండక్రిందనో దాచి త్రుప్పుపాలు చేయుటకంటె వానిని నీ పొరుగువాని కొరకో, స్నేహితుని కొరకో వెచ్చించుటమేలు.

11. దైవాజ్ఞ సూచించినట్లు దానధర్మములు అను నిధిని ప్రోగుచేసికొనుము. ఆ నిధి నీకు బంగారముకంటె అధికముగా ఉపయోగపడును.

12. పేదలకిచ్చినదే నీవు భద్రపరచిన నిధి అనుకొనుము. అది నిన్ను సకల ఆపదలనుండి కాపాడును,

13. ఆ నిధి బలమైన డాలుకంటెను, బరువైన ఈటెకంటెను అధికముగా నీ శత్రువుతో పోరాడి నిన్ను రక్షించును.

14. సజ్జనుడు తోడివానికి హామీ ఉండవలెను. సిగ్గు సెరము లేనివాడు మాత్రమే ఈ ధర్మమును మీరును.

15. నీకు పూటకాపుగా నుండినవాని ఉపకారమును మరువకుము. అతడు తన పరువును పణముగా పెట్టి నిన్ను కాపాడునుగదా!

16. దుర్మార్గుడు తన పూటకాపు ఆస్తిని నాశనము చేయును. కృతఘ్నుడు తన్ను కాపాడిన వానిని విస్మరించును.

17. హామీగా ఉండుటవలన చాలమంది తమ ఆస్తిని కోల్పోయిరి. హామీ అను తుఫాను వారిని సర్వనాశనము చేసెను

18. హామీవలన బలవంతులే ఇల్లువాకిలి పోగొట్టుకొని పరదేశములలో తిరుగాడవలసి వచ్చెను.

19. కాని స్వలాభము కోరి హామీగా నుండెడి దుష్టుడు తగవులలో చిక్కుకొనును.

20. నీకు సాధ్య మైనంత వరకు నీ పొరుగు వానికి తోడ్పడుము. కాని దానివలన నీవు చిక్కులలో పడకుండునట్లు చూచుకొనుము.

21. కూడు, గుడ్డ, నీళ్ళు నరునికి ప్రాథమిక అవసరములు. గుట్టుగా మనుటకు కొంపకూడ అవసరము.

22. ఇతరుల ఇంటరాజభోజనములు ఆరగించుటకంటె లేమితో తన సొంత గుడిసెలో వసించుట మేలు.

23. నీకున్నది కొద్దియే అయినను దానితోనే తృప్తి చెందుము.

24. కొంపనుండి కొంపకు పోవుటయు, ఎక్కడను నోరెత్తుటకు ధైర్యము లేకపోవుటయు నికృష్టము.

25. జనుడు అన్యుల ఇంట అతిథులను ఆహ్వానించి పానీయములందించినూ, ఆ ఇంటి వారతనిని మెచ్చరు. పైగా అతనిని నిందించుచు

26. “ఓయి అన్యుడా! ఇట వచ్చి భోజనపాత్రములు కడుగుము. ఇచటనున్న భోజనపదార్థములు నాకు వడ్డింపుము

27. ఓయి అన్యుడా! నేడొక ముఖ్యఅథితి మా ఇంటికి వచ్చుచున్నాడు, మా సోదరుడు వచ్చుచున్నాడు, కనుక నీవీ గదిని ఖాళీ చేయుము” అని పలుకుదురు.

28. ఎచటను ఆతిథ్యము లభింపకుండుటయు, బాకీ ఇచ్చినవాడు వెంటబడుటయు అనునవి సున్నితమైన మనస్తత్వము కలవారికి భరింపరాని కార్యములు.

 1. ప్రేమగల తండ్రి తన కుమారుని తరచుగా శిక్షించును. సుశిక్షుతుడైన పుత్రుడు పెరిగి పెద్దవాడైనపుడు తండ్రిని సంతోషపెట్టును.

2. కుమారుని క్రమశిక్షణమునకు గురిచేసిన తండ్రి ఫలితము బడయును. అతడు ఆ పుత్రునిగూర్చి తన మిత్రులతో గొప్పలు చెప్పుకోగలడు.

3. కుమారునికి విద్య గరపిన తండ్రి, తన శత్రువులకు అసూయ పుట్టించును.  అతడు ఆ పుత్రుని తలచుకొనుచు మిత్రుల మధ్య సగర్వముగా తిరుగును.

4. తండ్రి చనిపోయినను చనిపోయినట్లుకాదు. అతని ప్రతిబింబమైన కుమారుడు మిగిలియున్నాడు కదా!

5. తండ్రి బ్రతికియున్నప్పుడు పుత్రుని చూచి ఆనందించును. చనిపోవునపుడు నిశ్చింతగా చనిపోవును.

6. అతడు దాటిపోయిన తరువాత కుమారుడు తండ్రి విరోధులమీద పగతీర్చుకొనును. తండ్రి మిత్రులు తండ్రికి జేసిన ఉపకారమునకు గాను వారికి కృతజ్ఞుడై ఉండును.

7. కాని పుత్రుని చెడగొట్టు తండ్రి వాని గాయములకు కట్టుకట్టును. వాడు ఏడ్చినప్పుడెల్ల అతని హృదయముకరుగును

8. చక్కగా తర్పీదునీయని గుఱ్ఱము మొండిదగును. అదుపు మీరిన కుమారునికి పొగరెక్కును.

9. గోముగా పెరిగినబిడ్డడు కడన తండ్రికి నిరాశను కలిగించును. తండ్రి పుత్రునితో ఆడిపాడెనేని, తరువాత అతనికి దుఃఖము తప్పదు.

10. ఇప్పుడు నీ బిడ్డతో కలిసి ఆనందింతువేని తరువాత అతని గూర్చి చింతింపవలసి వచ్చును. విచారముతో పెదవి గరచుకోవలసి వచ్చును.

11. బాల్యమున బిడ్డనకు స్వేచ్చనీయరాదు. అతని తప్పిదములకు దండన విధించి తీరవలయును.

12. బాలుడుగా ఉన్నప్పుడే వానిని శిక్షింపుము. చిన్నవాడుగానున్నప్పుడే వాని ఎముకలు విరుగగొట్టుము. లేదేని వాడు పొగరుబోతు తనముతో నీకు ఎదురు తిరుగును. నీ మనసును కష్టపెట్టును.

13. కనుక శ్రమపడి నీ తనయునికి శిక్షణనిమ్ము. లేదేని వాడు నీకు అపకీర్తిని తెచ్చును.

14. ధనికుడై రోగాలగొట్టుగా ఉండుటకంటె, దరిద్రుడై ఆరోగ్యముగాను, బలముగాను ఉండుట మేలు.

15. ఆరోగ్యము, బలము, బంగారముకంటెను మెరుగు. దృఢమైన శరీరము అనంత సంపదలకంటెను మిన్న.

16. దేహారోగ్యమును మించిన సంపదలేదు. సంతోషచిత్తమును మించిన సంబరము లేదు.

17. నికృష్టజీవనము కంటెను మరణము మేలు. దీర్ఘకాలవ్యాధికంటెను, చచ్చి శాశ్వతముగా విశ్రాంతిచెందుట మెరుగు.

18. వ్యాధి వలన భుజింపలేని వానికి, విశిష్టాన్నము వలన ప్రయోజనములేదు. సమాధిమీద భోజనము పెట్టిన లాభమేమి?

19. విగ్రహమునకు బలినర్పించిన ఏమి ఫలితము? అది భోజనమును తినలేదు, వాసనచూడలేదు. ప్రభువుచే వ్యాధితో శిక్షింపబడువాని గతియునంతియే.

20. అతడు యువతిని కౌగిటిలోనికి తీసికొనిన నపుంసకుని వలె తన ఎదుటనున్న భోజనమును చూచి నిట్టూర్పు విడుచును.

21. నీవు దుఃఖమునకు గురికావలదు. బుద్ధిపూర్వకముగా విషాదమునకు లోను కావలదు

22. ఆనందమువలన జీవితము సార్థకమగును. సంతోషమువలన దీర్ఘాయువు కలుగును.

23. కావున సుఖములను అనుభవించుచు సంతసింపుము. విచారమును పారద్రోలుము. విచారమువలన చాలమంది నశించిరి. దాని వలన ఎవరికిని మేలు కలుగదు.

24. విచారమువలన నరుడు ప్రాయము రాకమునుపే ముసలివాడగును. అసూయ, కోపము ఆయుష్షును తగ్గించును.

25. సంతోషచిత్తుడైన నరునికి ఆకలి బాగుగా వేయును అతడు తృప్తిగా భుజించగలుగును.

 1. సంపదలు కలవాడు జాగరణలు చేయుచు తన బరువును కోల్పోవును. సొత్తును గూర్చిన ఆందోళన అతని నిద్రను చెరచును.

2. సొమ్ము చేసికోవలెనను చింత, ఘోరవ్యాధివలె అతని నిద్రను పాడుచేయును.

3. ధనికుడు కష్టించి డబ్బు విస్తారముగా ప్రోగుజేసికొనును. తరువాత విశ్రాంతి తీసికొనుచు సుఖములు అనుభవించును.

4. దరిద్రుడు కష్టించి స్వల్పాదాయము గడించును. అతడు విశ్రాంతి తీసికొనునపుడు చేతిలో పైసా ఉండదు.

5. ధనాశ గలవాడు సత్పురుషుడు కాజాలడు. డబ్బు చేసికోగోరువాడు పాపమును కట్టుకొనును.

6. డబ్బువలన చాలమంది నాశనమైరి. ధనమువలన వారు వినాశనమునకు చిక్కిరి.

7. ధనమువలన సమ్మోహితుడగు వానికది ఉరియగును. మూర్ఖులు ఆ ఉరిలో తగుల్కొందురు.

8. పాపమార్గమున డబ్బు కూడబెట్టనివాడును, నిర్దోషియైన ధనికుడును ధన్యుడు.

9. అట్టివాడు దొరకెనేని అతనిని అభినందింపవలెను అతడు ధనికులెవ్వరును చేయలేని అద్భుతమును చేసెను.

10. ఈ పరీక్షలో నెగ్గినవాడు నిక్కముగా గర్వింపవచ్చును. పాపము చేయగలిగినా చేయనివాడును, పరుని మోసగింపగలిగినా మోసగింపనివాడును, ఎవడైనగలడా?

11. అట్టి వాడెవడైన వున్నచోఅతని సంపదలు స్థిరముగా నిలుచునుగాక! ప్రజలెల్లరు అతని మంచితనమును సన్నుతింతురు.

12. విందును ఆరగించుటకు కూర్చుండినపుడు నోరు తెరచి చూడకుము. ఇచట ఎన్ని పదార్ధములున్నవి అని ఆశ్చర్యవచనములు పలుకకుము.

13. దృష్టిదోషము చెడ్డదని ఎరుగుము. సృష్టిలో కంటికంటె పేరాశగలది ఏదియును లేదు కనుకనే అది మాటిమాటికి నీరుగార్చును.

14. నీ కంటికి కనిపించిన పదార్దములనెల్ల తీసికోవలదు. వానిని తీసికొనునపుడు తోటివారిని ప్రక్కకు త్రోయవలదు.

15. ఇతరుల కోరికలు కూడ నీ కోరికలవంటివే కనుక తోడివారిని అర్థము చేసికొని ఆదరముతో మెలగుము.

16. నీకు వడ్డించిన భోజనమును మర్యాదగా భుజింపుము. ఆత్రముతో తిందువేని ఎల్లరికి రోతపుట్టింతువు.

17. భోజనము చేసి ముగించు వారిలో, నీవు మొదటివాడవగుదువేని మర్యాదగానుండును మితిమీరి తిందువేని జనులు నిన్నుమెచ్చరు. 

18. పదిమందితో కలిసి భుజించునపుడు, అందరికంటే ముందుగా నీవు పదార్థములను తీసికోవలదు.

19. మర్యాద తెలిసినవాడు స్వల్పముగా భుజించును. కొద్దిగా తిన్నచో నిద్రించునపుడు ఆయాసపడనక్కరలేదు.

20. మితభోజనమువలన బాగుగా నిద్రపట్టును. వేకువనే ఉత్సాహముతో మేల్కొనవచ్చును. మితముమీరి తిన్నచో కడుపునొప్పియు, నిద్రపట్టమియు దాపురించును.

21. అమితముగా తిన్నచో వెలుపలికి వెళ్ళి వాంతి చేసికొనుము. అప్పుడు నీకు ఆరోగ్యము చేకూరును.

22. కుమారా! నా పలుకులు ఆలకింపుము. నన్ను నిర్లక్ష్యము చేయకుము. కడన నీవు నా మాటలు నిజమని గ్రహింతువు. నీవు చేయు పనులలోనెల్ల శ్రద్ధ పాటింపుము, రోగము నిన్ను పీడింపదు.

23. ఉదారముగా అన్నము పెట్టు గృహస్తుని ఎల్లరును మెచ్చుకొందురు. వారి మెప్పుకోలు ఉచితమైనదే.

24. కాని అరకొరగా అన్నము బెట్టువానిని అందరు నిందింతురు. వారినిందయు ఉచితమైనదే.

25. నీ గొప్పను నిరూపించుకొనుటకుగాను అమితముగా త్రాగకుము. మధువు వలన చాలమంది నాశనమైరి.

26. నిప్పు మరియు నీరు ఇనుము స్వభావమును పరీక్షించును. త్రాగి వాదులాడు గర్వాత్ములకు పరీక్ష ద్రాక్షరసము

27. మితముగా సేవించినచో ద్రాక్షరసము ఆ నరునికి అట్లే ఉత్తేజమునొసగును. ఆ మధువులేనిచో జీవితమున ఉత్తేజము యుండదు నరుల ఆనందము' కొరకు అది కలిగింపబడినది.

28. తగిన కాలమున తగినంతగా సేవించినచో ద్రాక్షరసము ఆనందోల్లాసములను చేకూర్చును.

29. కాని మితముమీరి త్రాగినచో అది ద్వేషమును, కలహమును, పతనమును తెచ్చి పెట్టును.

30. త్రాగి మత్తెక్కియున్న మూర్ఖుడు కోపముతో తనకు తానే కీడు చేసికొనును. ఆకులు , అతడు సత్తువ కోల్పోవును,  కొట్లాటలకును దిగును.

31. తోడివాడు విందులో ద్రాక్షారసమును సేవించుచుండగా నీ ఋణము తీర్చనందుకుగాను వానిని మందలింపకుము. అతడు సుఖించుచుండగా నీవు అతనిని చీవాట్లు పెట్టకుము. అతనితో తగవులాడుటకుగాని, నీ బాకీని చెల్లింపుమని పీడించుటకుగాని అది అదను కాదు.

 1. నిన్ను విందు పెద్దను చేసిన యెడల గర్వింపకుము. విందుకు వచ్చిన వారందరివలె నీవును నిగర్వివై ఉండుము. మొదట అతిథులను పరామర్శించి, పిమ్మట నీ స్థానమున కూర్చుండుము.

2. నీ బాధ్యతను నెరవేర్చిన పిదప నీవు కూర్చుండవచ్చును. తోడివారితో కలిసి ఆనందింపవచ్చును. అప్పుడు ఆ తోడివారు. నిన్ను అభినందింతురు.

3. వృద్ధులారా! మీరు విందులో మాటలాడవచ్చును కాని మీరేమి చెప్పుచున్నారో మీకు తెలిసియుండవలెను. మీ మాటలు సంగీతమునకు ఆటంకము కలిగింపరాదు.

4. వినోద కార్యక్రమము నడుచునపుడు మీ సోదిని ఆపివేయుడు. మీ విజ్ఞానమును ప్రదర్శించుటకు అది అదనుకాదు.

5. విందులో సంగీతము సువర్ణాంగుళీయమున సూర్యకాంతమును తాపించినట్లుండును.

6. ద్రాక్షరసముతో గూడిన విందులో గానము, బంగారమున పొదిగిన మరకతమువలె నుండును

7. యువకులారా! అవసరమునుబట్టి మీరు విందులో మాట్లాడవచ్చును. కాని రెండుసారులే, అదియును ఇతరులు మిమ్ము ప్రశ్నించినపుడే మాటలాడవచ్చును.

8. అడిగిన అంశమునకు మీరు క్లుప్తముగా జవాబుచెప్పుడు. మీరు సంగతి తెలిసియు, మౌనము వహించుచున్నారనిపించుకొనుడు.

9. మేమును పెద్దవారితో సమానమన్నట్లు ప్రవర్తింపకుడు. ఇతరులు ఉపన్యసించునపుడు మీలో మీరు మాటలాడుకోవలదు.

10. ఉరుమునకు ముందు మెరుపు చూపట్టినట్లే, వినయవంతుని మంచిపేరు అతనికి ముందుగా నడచును.

11. అతిథులారా! మీరు సకాలమున విందుశాలనుండి వెళ్ళిపొండు. అచటినుండి వెళ్ళువారిలో మీరు చివరి వారుకారాదు. విందుశాలచుట్టు తారాడక నేరుగా మీ ఇంటికి వెళ్ళిపొండు.

12. మీ ఇంట మీ ఇష్టము వచ్చినట్లు ఆనందింపవచ్చును. కాని ప్రగల్భములు పలికి పాపము మాత్రము కట్టుకోవలదు.

13. కడన మీకు ఇన్ని సుఖములను దయచేసిన మీ సృష్టికర్తకు తప్పక వందనములు అర్పింపుడు.

14. దైవభీతి కలవాడు దేవుని శిక్షణకు లొంగును. తనను మక్కువతో వెదకువారిని ప్రభువు దీవించును.

15. శ్రద్ధగా పఠించువాడు ధర్మశాస్త్రమును నేర్చుకొనును. కాని చిత్తశుద్దితో పఠింపనివానికి అది వశపడదు.

16. దైవభీతి కలవారు న్యాయమును గ్రహింతురు. వారి న్యాయవర్తనము దీపమువలె వెలుగును.

17. పాపాత్ములు శిక్షణను అంగీకరింపరు. ఏవేవో సాకులతో తాము కోరిన పనులెల్ల చేయుదురు.

18. బుద్ధిమంతులు ఇతరుల అభిప్రాయములను ఆలింతురు. కాని భక్తిహీనులైన గర్వాత్ములు దేనికీ జంకరు.

19. ఆలోచన లేకుండ ఏ పనిని చేయరాదు. ఆలోచించి కార్యము చేసిన పిదప వగవనక్కరలేదు.

20. కరకుమార్గమున పయనింతువేని రాళ్ళుతట్టుకొని పడిపోయెదవు.

21. నునుపు మార్గమున పోవునపుడును జాగ్రత్తగా ఉండవలెను.

22. నీ గమ్యమునెల్లపుడు పరిశీలించి చూచుకొనుచుండవలెను.

23. ఏ పని చేసినను జాగ్రత్తగా చేయుము. అట్లయిన దేవుని ఆజ్ఞలను పాటించినట్లగును.

24. ధర్మశాస్త్రమును నమ్ముట అనగా దాని ఆజ్ఞలు పాటించుటయే. ప్రభువుని నమ్మిన వానికి ఏ అపాయమును వాటిల్లదు.

 1. దైవభీతి కలవానికి ఎట్టి కీడు కలుగదు.  అపాయము కలిగినపుడెల్ల ప్రభువు అతనిని మరల మరల ఆదుకొనును.

2. జ్ఞాని ధర్మశాస్త్రమును ద్వేషింపడు. దేవుని ఆజ్ఞలు పాటించుటలో చిత్తశుద్దిలేనివాడు తుఫానులో చిక్కిన నావవలె కొట్టుమిట్టాడును.

3. విజ్ఞుడు ధర్మశాస్త్రమును ప్రభువువాణివలె నమ్మును

4. నీవు చెప్పగోరు సంగతిని జాగ్రత్తగా సిద్ధము చేసికొనుము. అప్పుడు జనులు నీ పలుకులు సావధానముగా విందురు.

5. మూర్ఖుని ఆలోచన, బండిచక్రమువలె గిరగిర తిరుగును. వాని తలపులు చక్రపుకుండవలె గుండ్రముగా తిరుగును.

6. వ్యంగ్యముగా మాట్లాడు స్నేహితుడు అడవి గుఱ్ఱము వంటివాడు. ఎవరెక్కినా అది అనిష్టముతో సకిలించును.

7. సంవత్సరమున ప్రతిదినమున అదియే సూర్యుడు వెలుగుచుండగా, కొన్నిదినములు మాత్రమే ఇతరదినములకంటె మెరుగుగయినవి ఎట్లయినవి?

8. ప్రభువే ఈ వ్యత్యాసమును చేసెను. అతడు కొన్నినాళ్ళను పండుగలుగాను, సెలవులుగాను నియమించెను.

9. కొన్నిటిని పవిత్రములు ప్రముఖమైన దినములుగాను, మరికొన్నిటిని సామాన్య దినములు గాను నిర్ణయించెను.

10. అందరు మట్టినుండి పుట్టినవారే. ఆదామును అట్లు జన్మించినవాడే.

11. అయినను ప్రభువు వివేకముతో నరుల మధ్య వ్యత్యాసముకలిగించి వారికి భిన్నకార్యములు ఒప్పగించెను.

12. అతడు కొందరిని దీవించి ప్రముఖులనుగా చేసెను కొందరిని పవిత్రపరచి తనయెదుట నిలుపుకొనెను. కొందరిని శపించి మన్నుగరపించి స్థానభ్రష్టులను చేసెను.

13. మట్టి కుమ్మరి చేతిలో నున్నది. అతడు దానిని తన ఇష్టము వచ్చినట్లుగా మలచుకొనును అట్లే నరులు ప్రభువు చేతిలో ఉన్నారు. ఆయన వారిని తన ఇష్టము వచ్చినట్లు చేయును

14. మంచికి చెడ్డ, మృత్యువునకు జీవమును వ్యతిరేకములు. అట్లే పాపికి పుణ్యాత్ముడు వ్యతిరేకి.

15. మహోన్నతుడైన ప్రభువు కార్యములను పరిశీలించినచో, అవి పరస్పర విరుద్ధములైన ద్వంద్వములవలె కన్పించును.

16. నా మటుకు నేను పనివారిలో కడపటివాడను. నేను ద్రాక్షపండ్లు కోయు పనివారి వెనుక పరిగెలేరుకొను వానివలె పనిని ప్రారంభించితిని.

17. కాని దేవుని దీవెన వలన ఆ పనివారినెల్ల మించితిని. వారివలె నేనును నా ద్రాక్ష తొట్టిని రసముతో నింపగలిగితిని.

18. నా కొరకు మాత్రమే నేనీ శ్రమనంతటిని చేయలేదు. ఉపదేశమును ఆశించువారందరి కొరకు కృషి చేసితిని.

19. ప్రజానాయకులారా! మీరు నా మాట వినుడు. సమాజాధ్యక్షులారా! మీరు నా పలుకులాలింపుడు.

20. నీవు బ్రతికియుండగా నీ కుమారుడు, భార్య, స్నేహితుడు మొదలైన వారికి ఎవరికిని నీ మీద అధికారమీయకుము. నీ ఆస్తిని ఎవరికిని పంచి ఈయవద్దు. నీ నిర్ణయము మార్చుకొని నీవు దానిని మరల ఆశింపవచ్చును.

21. నీ బొందిలో ప్రాణముండగా నీ మీద ఎవరికిని అధికారము నీయవద్దు.

22. నీ బిడ్డలు నీ ఆస్తిని అర్థించుటసబబు గాని, నీవు వారి దయాదాక్షిణ్యముల మీద  ఆధారపడుట సబబుకాదు.

23. నీ పనులన్నిట నీవే అధికారము నెరపుచు, నీకు మచ్చ రాకుండునట్లు చూచుకొనుము.

24. చివరి క్షణమువరకు ఆగి చనిపోవునపుడు మాత్రమే నీ ఆస్తిని ఇతరులకు పంచి పెట్టుము.

25. గాడిదకు మేత, కజ్జి, బరువు అవసరము. అట్లే బానిసలకు తిండి, శిక్షణ, పని అవసరము.

26. నీ బానిస పనిచేసినచో నీవు నిశ్చింతగా ఉండవచ్చును. చేతినిండ పనిలేనిచో వాడు స్వాతంత్య్రమును ఆశించును.

27. కాడిచేతను, జీనుచేతను జంతువును లోబరచుకొందుము. హింస, బొండకొయ్య దుష్టుడైన దాసునికి తగును.

28. నీ బానిసకు పనిని అప్పగింపవేని వాడు సోమరియగును. సోమరియైన బానిస చెడుపనులకు పూనుకొనును

29. వాడు తప్పనిసరిగా పని చేయవలెను. నీ మాట వినడేని వానికి సంకెళ్ళు వేయింపుము.

30. కాని ఎవరిపట్ల కఠినముగా ప్రవర్తింపకుము. న్యాయము మీరకుము.

31. నీ బానిసను నీవలె చూచుకొనుము. వానిని కషార్జితముతో తెచ్చుకొంటివికదా!

32. అతనిని నీ సోదరునివలె చూచుకొనుము. నీవు నీకెంతవసరమో, వాడును నీకు అంతవసరము.

33. నీవు వానిని పీడింపగా వాడు పారిపోయెనేని ఇక వానినెచట గాలింతువు?

 1. మూర్ఖులు లేనిపోని ఆశలవలన మోసపోవుదురు. కలలవలన వారి ఆలోచనలు రెక్కలు కట్టుకొని ఎగురును.

2. స్వప్నములను నమ్ముట నీడను పట్టుకొనుటవంటిది, గాలిని తరుముటవంటిది.

3. అద్దములో ముఖమువలె కలలలో మన అనుభవములే ప్రతిబింబించును.

4. కల్మషత్వము నుండి నిర్మలత్వము రాదు. నిజము కానిదానినుండి నిజమైనది రాదు.

5. సోదె, శకునములు, కలలు నిజములు కావు. అవి ప్రసవవేదనలో నున్న స్త్రీ ఊహలవలె వట్టి ఊహలు.

6. సర్వోన్నతుడైన ప్రభువు కలిగించిన కలను నమ్మవచ్చును, కాని వట్టి కలలను విశ్వసింపరాదు.

7. స్వప్నములవలన చాలమంది అపమార్గము పట్టిరి వానిని నమ్మి చాలమంది నిరాశ చెందిరి.

8. ధర్మశాస్త్రమున అట్టి అబద్దమేమియు లేదు. సత్పురుషులు బోధించిన విజ్ఞానమున అట్టి అనృతము లేదు.

9. ప్రయాణములు చేసినవానికి అనేక విషయములు తెలియును. అనుభవశాలి అర్ధయుక్తముగా మాట్లాడును.

10. కష్టముల నెదుర్కొననివానికి కొద్దిగానే తెలియును. దేశాటనములు సల్పిన వానికి అనుభవము పెరుగును.

11. నా సంచారములలో నేను చాలా సంగతులు తెలిసికొంటిని. మాటలలో చెప్పగలిగిన దానికంటె ఎక్కువ అంశములనే గ్రహించితిని.

12. నేను చాలా అపాయములను ఎదుర్కొంటిని. కాని నా పూర్వానుభవము వలన వాని నుండి తప్పించుకొంటిని.

13. దైవభీతికలవారు. జీవనమును పొందుదురు. వారు నమ్మిన దేవుడు వారిని కాపాడును.

14. దైవభీతి కలవాడు భయము చెందనక్కరలేదు. ప్రభువును నమ్మెను కనుక అతడు పిరికివాడు కానక్కరలేదు.

15. ప్రభువును నమ్మినవాడు ధన్యుడు. ఏ దిక్కునుండి సహాయము లభించునో అతనికి తెలియును.

16. దేవుడు తనను ప్రేమించువారిని ఒక కంట కనిపెట్టి ఉండును. వారిని తప్పక ఆదుకొని శక్తితో సంరక్షించును. వారిని వడగాలినుండి మధ్యాహ్నపువేడిమి నుండి కాపాడును. వారిని కాలుజారి పడనీయడు, నాశనమైపోనీయడు.

17. వారికి సేదదీర్చి, వారి కన్నులలో కాంతిని నెలకొలుపును. ఆయురారోగ్యములతో వారిని దీవించును.

18. అన్యాయార్జితమైన పశువును బలిగా అర్పించిన ఆ బలి దోషపూరితమైనదగును. దుష్ఠులబలిని దేవుడు అంగీకరింపడు.

19. మహోన్నతుడు దుర్మార్గుల బలివలన సంతుష్టి చెందడు. పెక్కు బలులర్పించుట వలన వారి పాపములు తొలగిపోవు.

20. పేదవాని పశువునపహరించి బలిగా అర్పించుట తండ్రి చూచుచుండగా అతని కుమారుని చంపుట వంటిది.

21. పేదలకు అన్నమే ప్రాణము. ఆ అన్నమును నాశనము చేయుట అనగా పేదవానిని చంపుటయే.

22. పేదవాని జీవనోపాధి చెరచువాడు వానిని చంపినట్లే. కూలివానికి కూలి ఎగగొట్టువాడు వానిని హత్య చేసినట్లే.

23. ఒకడు గోడ కట్టుచుండగా మరియొకడు . పడగొట్టెనేని శ్రమ తప్ప ఏమి మిగులును?

24. ఒకడు ప్రార్థించుచుండగా మరియొకడు శపించెనేని దేవుడు ఎవరి మనవి ఆలింపవలెను?

25. శవమును ముట్టి, శుద్ది చేసికొని మరల ముట్టెనేని ఆ శుద్దివలన ప్రయోజనమేమి?

26. ఎవడైనను తన పాపములకు పరిహారముగా ఉపవాసముండి మరల అవియే పాపములను చేసినచో వాని ఉపవాసమునకును ఫలితమేమైన కలదా? వాని ప్రార్థననెవరు ఆలింతురు?

 1. ధర్మశాస్త్రమును పాటించినచో చాల బలులు అర్పించినట్లే. దేవుని విధులను పాటించినచో సమాధానబలిని అర్పించినట్లే.

2. ఉపకారికి నుపకారము చేయుట ధాన్యబలిని అర్పించుటవంటిది. పేదలకు దానముచేయుట స్తుతిబలిని అర్పించుట వంటిది.

3. పాపమునుండి వైదొలగినచో ప్రభువు సంతసించును. కిల్బిషమును విడనాడుట ప్రాయశ్చిత్తబలిని అర్పించుటతో సమానము.

4. వట్టి చేతులతో దేవునిసన్నిధిలోనికి రావలదు.

5. ధర్మశాస్త్రమే కట్టడచేసెను. కనుక బలులర్పింపవలెను.

6. పుణ్యపురుషుడు బలిపశువు క్రొవ్వును పీఠముపై వేల్చినపుడు దాని సువాసన ప్రభువు సాన్నిధ్యమునకు ఎగసిపోవును.

7. నిర్మలాత్ముడు అర్పించిన బలిని ప్రభువు అంగీకరించును. ఆయన దానిని విస్మరింపడు.

8. ప్రభువునకు ఉదారముగా కానుకలిమ్ము. నీ తొలిఫలములను అర్పించుటలో పిసినారివి కావలదు.

9. చిరునవ్వుతో నీ కానుకలర్పింపుము. సంతసముతో దశాంశములనిమ్ము.

10. మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును ఆయనకు ఇమ్ము. నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము.

11. తనకిచ్చిన వారిని ప్రభువు బహూకరించును. ఆయన నీకు ఏడురెట్లు అదనముగా నిచ్చును. దేవుడు న్యాయము పాటించును

12. దేవునికి లంచమిచ్చినను ఆయన అంగీకరింపడు అన్యాయముగా ఆర్జించిన దానిని ఆ ప్రభువునకు అర్పింపకుము. ఆయన న్యాయవంతుడు. పక్షపాతికాడు.

13. ఆయన పేదలకు అన్యాయము చేయడు. బాధితుని మొరను అశ్రద్ధ చేయడు.

14. అనాథ ప్రార్ధనను అనాదరము చేయడు. వితంతువు వేడుకోలును పెడచెవిన పెట్టడు.

15. వితంతువు నేత్రములవెంట కారు కన్నీరు ఆమెను పీడించిన వాని మీదకు నేరముతెచ్చి దేవునికి మొర పెట్టును.

16. హృదయపూర్వకముగా తనను సేవించువానిని ప్రభువు అంగీకరించును. అతని ప్రార్థనలు ఆకాశమున కెక్కిపోవును.

17. దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును. మహోన్నతుని సమక్షముచేరి కాని అది ఆగదు.

18. ప్రభువు జోక్యము చేసికొని దీనాత్మునికి న్యాయము దయజేసి దుష్టుని శిక్షించువరకును అది అతనిని వదలదు.

19. ప్రభువు తామసింపడు. దుష్టులను సహించి ఊరకుండడు.

20. ప్రభువు అన్యజాతులను రూపుమాపి వారిపై పగతీర్చుకొనును. నిర్దయులను అణగదొక్కును.

21. గర్వాత్ములను నేల మీదినుండి పెరికివేయును. ఈ దుష్టుల పరిపాలనను అంతము చేయును.

22. ఆయన ప్రతినరునికిని వానివాని తలపులు, పనులను బట్టి ప్రతిఫలమిచ్చును.

23. ప్రభువు తన ప్రజలకు న్యాయము చేకూర్పగా వారు ఆయన కరుణను తలచుకొని సంతసింతురు.

24. బెట్టలో వానమబ్బువలె ఆపత్కాలమున ప్రభువుకరుణ ఆనందము నొసగును.

 1. విశ్వాధిపతివైన ప్రభూ! మమ్ము చల్లనిచూపున చూచి కరుణింపుము

2. ప్రతి జాతియు నీకు భయపడునట్లు చేయుము.

3. అన్యజాతులను శిక్షించి, ఆ వారు నీ బలమును గుర్తించునట్లు చేయుము.

4. నీ పావిత్ర్యమును ప్రదర్శించినట్లే మా ఎదుట వారిని శిక్షించి నీ శక్తిని నిరూపింపుము.

5. నీవు తప్ప మరియొక దేవుడులేడని అను మేము అంగీకరించినట్లే అన్యులు కూడ అంగీకరించునట్లు చేయుము.

6. ఇప్పుడు నూత్నముగా అద్భుతములను సూచక క్రియలను చేసి నీ మహాబలమును నిరూపింపుము.

7. నీ కోపమును చూపెట్టి, నీ రౌద్రమును ప్రదర్శించి మా శత్రువులను మట్టుపెట్టుము.

8. నీవు నిర్ణయించిన తీర్పు రోజును త్వరగా రప్పించి ప్రజలు నీ మహాకార్యములను కొనియాడునట్లు చేయుము.

9. నీ కోపము దుర్మార్గులను కదిలించివేయునుగాక! నీ ప్రజలను పీడించువారు సర్వనాశనమగుదురు గాక!

10. “మా అంతటివారు లేరు” అని విఱ్ఱవీగు శత్రురాజులను నలిపివేయుము.

11. యిస్రాయేలు తెగలన్నిటిని మరల ప్రోగుజేయుము. నీవు పూర్వమొసగిన భూమిని వారికి మరల దయచేయుము.

12. నీ పేరు మీదుగా పిలువబడు ఈ యిస్రాయేలీయులను, నీవు నీ ప్రథమ కుమారుడని చెప్పుకొనిన ఈ ప్రజను కరుణింపుము.

13. నీవు నీ నివాసస్థలముగా ఎన్నుకొనినదియు నీ పరిశుద్ధనగరమునైన యెరూషలేమును కటాక్షింపుము.

14. సియోను నీ స్తుతిగానములతో మారుమ్రోగునుగాక! దేవాలయము నీ మహిమతో నిండునుగాక!

15. నీవు మొట్టమొదట సృజించిన ఈ ప్రజలను అంగీకరింపుము. నీ పేరిట ప్రవక్తలు పలికిన  ప్రవచనములను నెరవేర్చుము.

16. నీ కొరకు కాచుకొనియున్నవారిని బహూకరింపుము. నీ ప్రవక్తలు నమ్మదగినవారు అని ఋజువు చేయుము.

17. అహరోను దీవెనలు పొందిన వారమును, నీ దాసులమయిన మా మొరనాలింపుము. అప్పుడు భూమిమీద నరులెల్లరు నీవే ప్రభుడవనియు, నిత్యుడవైన దేవుడవనియు నమ్ముదురు.

18. నరుడు ఏ రకపు భోజనమునైన ఆరగింపగలడు. కాని కొన్నిరకముల ఆహారములు మెరుగైనవి.

19. నాలుక వివిధ మాంసముల రుచిని గుర్తించును. అట్లే తెలివి కలవాడు అబద్దములను గుర్తుపట్టును

20. సంకుచిత మనస్తత్వము కలవారు బాధలు తెచ్చి పెట్టుదురు. కాని అనుభవశాలి వారికి తగినట్లుగా బుద్ధిచెప్పును.

21. స్త్రీ ఏ పురుషుడినైనా వరించును. కాని పురుషుడు తనకు నచ్చిన యువతిని ఎన్నుకొనును.

22. స్త్రీ సౌందర్యము పురుషునికి ఆనందము కలిగించును. నరుని కంటికి అంత కంటె ఇంపయినది లేదు.

23. స్త్రీ కరుణతో మృదువుగా మాటలాడగలిగినచో ఆమె భర్త మహాదృష్టవంతుడైనట్లే.

24. భార్యను బడసిన వారు అదృష్టమును పొందినట్లే. ఆమె అతనికి సాయము చేసి అతనిని ప్రోత్సాహించును.

25. కంచెలేని స్థలమును అన్యులు ఆక్రమించుకొందురు. భార్యలేని పురుషుడు నిట్టూర్పులతో ఊళ్ళవెంట తిరుగును.

26. సాయుధుడై ఊరినుండి ఊరికి తిరుగాడు దొంగవానిని ఎవ్వరును నమ్మరు.

27. అట్లే సొంతయిల్లు లేక ఎక్కడ చీకటిపడిన అక్కడనే నిద్రించు వానిని ఎవ్వరు నమ్మరు.

 1. “నేనును నీ స్నేహితుడనే” అని ఎవడైన అనవచ్చును. కాని కొందరు పేరునకు మాత్రమే స్నేహితులు.

2. ఆప్తమిత్రుడు శత్రువుగా మారిపోయినపుడు ఘోరసంతాపము కలుగును.

3. నరులలో ఈ దుర్గుణము కన్పించును. కాని ఈ అనర్థమేల పుట్టినది?  ఇది లోకమంతటని యేల మోసపుచ్చుచున్నది?

4. కొందరు మనము పచ్చగానున్నప్పుడు మిత్రులవలె కన్పింతురు. కాని ఆపదలు వచ్చినపుడు మనకు ఎదురు తిరుగుదురు.

5. కాని కొందరు కష్టములలో మనలను ఆదుకొందురు. శత్రువు మనమీదికి వచ్చినపుడు వానితో పోరాడుదురు.

6. నీ తరపున పోరాడిన నేస్తుని మరచిపోవలదు. నీకు సంపదలు అబ్బినపుడు అతనిని విస్మరింపకుము

7. ఎవడైన ఉపదేశము చేయగలడు, కొందరు స్వలాభము కొరకే సలహా ఇత్తురు.

8. సలహా ఇచ్చినవానిని జాగ్రత్తగా పరిశీలించి చూడుము. అతనికోరిక ఏమిటో తెలిసికొనుము, అతడు స్వార్థమును ఆశించుచుండ వచ్చును. కడన నీకు అపకారము తలపెట్టవచ్చును.

9. అతడు “అన్నీ నీకు అనుకూలముగానే ఉన్నది” అని చెప్పుచు నీవెట్లు పతనమగుదువాయని పొంచి చూచుచుండవచ్చును.

10. నిన్ను నమ్మనివానిని నీకు సలహా ఇమ్మని అడుగకుము. నీ మీద అసూయ కలవానికి నీ ఆలోచనలు ఎరిగింపకుము.

11. స్త్రీని ఆమె సవతిని గూర్చియు, పిరికివానిని యుద్ధమును గూర్చియు, వర్తకుని వ్యాపారమును గూర్చియు, పిసినిగొట్టును కృతజ్ఞతను గూర్చియు, క్రూరుని దయనుగూర్చియు, సోమరిపోతును పనిని గూర్చియు, రోజువారికూలీని పనిని సంపూర్తిగా ముగించుటను గూర్చియు, సోమరియైన సేవకుని కష్టకార్యమునుగూర్చియు సలహా అడుగకుము. వారి ఉపదేశమును ఎంత మాత్రము అంగీకరింపవలదు.

12. కాని భక్తి పరుడైన వానిని, దైవాజ్ఞలను పాటించువానిని, నీతో సమానమైన అభిరుచులు గలవానిని, నీ పతనమును చూచి విచారించువానిని సలహా అడుగుము.

13. కడన నీ హృదయము చేయు ఉపదేశమునుగూడ నమ్ముము. దానికి మించిన మంచి సలహా లేదని ఎరుగుము.

14. బురుజుమీద కూర్చుండిన ఏడుగురు పహారావారికంటే, మన హృదయము మనకు ఎక్కువ తెలుపును.

15. అన్నిటికంటే మిన్నగా నిన్ను సత్యమార్గమున నడుపుమని మహోన్నతుని ప్రార్థింపుము.

16. పరిశీలించి చూచినగాని ఏ పనికిని పూనుకోరాదు. ఆలోచించినగాని ఏ కార్యమును ప్రారంభింపరాదు

17-18. మంచి, చెడు, జీవము, మరణమను నాలుగు అంశములకు మన ఆలోచనమే జన్మస్థానము. - కాని వీనినన్నిటిని నాలుకయే పరిపాలించును.

19. ఒకనికి ఇతరులకు ఉపదేశము చేయు సామర్థ్యము ఉండవచ్చును. కాని తనకు తాను మేలు చేసికోలేకపోవచ్చును.

20. అతడు మాటకారియై ఉండవచ్చును. . కాని ప్రజలు ఆదరింపనందున కూడు దొరకక ఆకలితో చచ్చును.

21. అతడు ఉచితజ్ఞుడు కాదు. ప్రభువతనికి వివేకమును ప్రసాదింపలేదు.

22. ఒకడు తాను విజ్ఞానినని భావింపవచ్చును. తన విజ్ఞతను గూర్చి తనకు రూఢిగా తెలియునని చెప్పుకోవచ్చును.

23. కాని నిజముగా విజ్ఞుడైనవాడు తన ప్రజలకు బోధచేయును. ఆ ప్రజలు అతని బోధ సత్యమైనదని అంగీకరింతురు.

24. అట్టి వానిని ఎల్లరును కీర్తింతురు. అతడు ధన్యాత్ముడని వాకొందురు.

25. నరుడు కొన్ని ఏండ్లు మాత్రమే జీవించును. కాని యిస్రాయేలు ప్రజల జీవితకాలము లెక్కలకు అందదు.

26. జ్ఞానిని అతని ప్రజలెల్లరు నమ్ముదురు. అతని పేరు శాశ్వతముగా నిలుచును.

27. కుమారా! ఈ జీవితయాత్రలో నిన్ను నీవు పరీక్షించి చూచుకొనుచుండుము. నీకు గిట్టని భోజన పదార్థములను ఆరగింపకుము.

28. ప్రతి భోజనము ప్రతివానికి సరిపడదు. అందరికిని ఒకేరకమైన ఆహారము రుచింపదు.

29. విశిష్టాన్నముల మీద మక్కువ వదులుకొనుము. ఎట్టి భోజనమునైనను మితముమీరి తినకుము.

30. మితిమీరి తిన్నచో రోగమువచ్చును. భోజనప్రియత్వము వలన పిత్తము ముదురును.

31. భోజనప్రియత్వము వలన చాలమంది చచ్చిరి. ఈ విషయమున జాగ్రత్త వహించి నీ ఆయుస్సును పెంచుకొనుము.

 1. నీకు చికిత్స చేసినందుకుగాను వైద్యుని సన్మానింపుము, ప్రభువే అతనిని కలిగించెను.

2. వైద్యుల ద్వారా మహోన్నతుడే వ్యాధిని నయముచేయును. రాజులు ఆ వైద్యులను బహూకరింతురు.

3. వైద్యునికి వైద్యజ్ఞానము గౌరవమును చేకూర్చిపెట్టును. ప్రముఖులైన వారు అతనిని మన్ననతో చూతురు.

4. ప్రభువే భూమినుండి మందులు కలిగించెను. బుద్ధిమంతుడు వానిని వినియోగించుకొనుటకు వెనుకాడడు.

5. పూర్వము ఒక కొయ్యముక్క చేదునీటిని తీపినీటిగా మార్చి తన శక్తిని వెల్లడించెనుగదా!

6. ప్రభువు నరులకు వైద్య విజ్ఞానమును దయచేసెను. అతని అద్భుతములకుగాను నరులు అతనిని సన్నుతింతురు.

7. ఔషధకారుడు మందులను తయారుచేయగా వైద్యుడు ఆ మందులతో నరుల రోగమును కుదిర్చి, వారి బాధలు తొలగించును.

8. ప్రభువు కార్యములకు అంతములేదు. ఆయన లోకములోని నరులు అందరికి ఆరోగ్యము దయచేయును.

9. కుమారా! నీకు జబ్బు చేసినచో అశ్రద్ధ చేయకుము. ప్రభువును వేడుకొనినచో ఆయన ఆరోగ్యమును దయచేయును.

10. నీ తప్పిదములను విడనాడి నిర్దోషివి కమ్ము. నీ హృదయమునుండి కిల్బిషమును నిర్మూలింపుము.

11. దేవుని ముందట సాంబ్రాణి పొగవేసి శ్రేష్ఠమైన ధాన్యబలి నర్పింపుము.

12. అటుపిమ్మట వైద్యుని పిలువుము, ప్రభువే అతనిని కలిగించెను. నీకు అవసరము కలదు గనుక అతనిని నీ చెంతనే ఉంచుకొనుము.

13. ఒక్కొక్కసారి నీ ఆరోగ్యము ఆ వైద్యుని చేతిలో నుండును.

14. అతడు రోగి బాధలను తొలగించి, వ్యాధిని కుదిర్చి ప్రాణము నిలుపుటకు శక్తిని దయ చేయుమని దేవుని ప్రార్ధించును.

15. సృష్టి కర్తకు ద్రోహముగా పాపము చేసిన నరుడు రోగియై వైద్యుని ఆశ్రయించుట న్యాయము.

16. కుమారా! నీవారెవరైన చనిపోయినచో కన్నీరు కార్పుము. నీ సంతాపము తెలుపుటకు బోరున ఏడ్వుము. మృతదేహమును తగిన రీతిగా సిద్ధముచేసి సమాధిచేయుము.

17. శోకముతో గుండెలు పగులునట్లు ఏడ్వుము. నియమిత కాలమువరకు విచారము వెలిబుచ్చుము నీపై దుర్విమర్శలు రాకుండునట్లు ఒకటి రెండునాళ్ళు దుఃఖింపుము. అటు పిమ్మట భేదము విడనాడుము.

18. విచారము వలన నీ ఆరోగ్యము చెడును. నీకు మరణము గూడ సిద్దింపవచ్చును.

19. చచ్చినవారిని పాతి పెట్టుటతోనే సంతాపము ముగియవలెను. విచారమువలన మనసు పాడగును.

20. కనుక నీవు విచారమును విడనాడుము. దుఃఖమును దూరముగా పారద్రోలుము. నీవును చనిపోవలసినవాడవే అని గుర్తింపుము.

21. చచ్చిన వారు తిరిగిరారని గ్రహింపుము. నీ దుఃఖము మృతునికెట్టి మేలును చేయదు. నీకు మాత్రము కీడును చేయును.

22. “మృతునికి పట్టిన దుర్గతియే నీకును పట్టును. నేడు అతని వంతు, రేపు నీ వంతు”.

23. భూస్థాపనము ముగిసిన తరువాత మృతునిగూర్చి తలంపకుము. అతడు పోయిన తరువాత ఇక విచారింపకుము.

24. విరామము వలన ధర్మశాస్త్ర బోధకుని విజ్ఞానము పెరుగును. అన్యకార్యముల నుండి వైదొలగినచో విజ్ఞానము అభివృద్ధి అగును.

25. రైతు మనసంతయు మేడిపట్టి, ఎద్దులను అదలించి, అరక దున్నుటమీదను, తన పశువులను గూర్చి మాట్లాడుట మీదను ఉన్నచో, ఇక అతని జ్ఞానమెట్లు పెరుగును?

26. అతని దృష్టి అంతయు తిన్నగా నాగటిచాలువేయుట మీదనే ఉండును. అతడు రేయి ప్రొద్దు పోయినవరకు తన పశువులను మేపుచుండును.

27. విరామములేక పనిచేయు వివిధ వృత్తుల వారందరును ఇంతియే, ముద్రలలో వినియోగించు అనగా రత్నములను చెక్కువారును ఇంతియే. వారు ఎప్పటికప్పుడు క్రొత్త నమూనాలను వెదకుచుందురు. ఆ ఆకృతులను మూలమునకు సరిపడునట్లు చెక్కుటకు రేయి ప్రొద్దుపోవు వరకు కృషి చేయుదురు.

28. కొలిమికెదుట కూర్చుండు ఇనుపసామాగ్రి పనిచేయువాడును ఇంతియే. అతడు ముతక ఇనుముతో ఏమి చేయుదునా? అని ఆలోచించును. కొలిమి వేడిమికి తట్టుకొని పనిచేయుచుండగా నిప్పు సెగలు అతని ఒడలిని కాల్చివేయును. తాను సాగగొట్టు వస్తువును నిశితముగా పరిశీలించుచుండగా సమ్మెట దెబ్బలవలన అతని చెవులకు చిల్లులుపడును. అతడు తనపనిని త్వరగా ముగింపగోరి ప్రొద్దుపోయినవరకు తన ముందటనున్న వస్తువునకు మెరుగులు దిద్దుచుండును.

29. సారె ఎదుట గూర్చుండి దానిని కాలితో త్రిప్పు కుమ్మరియును ఇంతియే. అతడు తన పని మీదనే మనసున నిలిపి నేను ఎన్నికుండలు చేయుదునా అని ఆలోచించును

30. బంకమట్టిని కాళ్ళతో తొక్కి చేతులతో మలచును. తరువాత కుండకు మెరుగు పూతపూయును. ఆవమును శుభ్రము చేయుటకు ప్రొద్దుపోయినవరకు పనిచేయును.

31. వీరందరును చేతులతో శ్రమచేయువారు. ప్రతి ఒక్కడును తన పనిలో తాను నైపుణ్యమును చూపును.

32. వీరు పని చేయనిచో పట్టణములు నిలువవు. నగరములలో ఎవరు వసింపజాలరు. వాని దరిదాపులకు ఎవరురారు.

33. కాని ఈ చేతి వృత్తులవారు సభలలో పాల్గొనరు. పెద్ద పదవులను చేపట్టరు. న్యాయాధిపతులు కాజాలరు. న్యాయశాస్త్రాంశములను అర్థము చేసికోజాలరు. వారికి చదువు సంధ్యలు, విచక్షణ జ్ఞానము ఉండవు వారు విజ్ఞానసూక్తులను ఉదాహరింపలేరు.

34. కాని వారు తమ చేతి పనితో ఈ లోకమును నిలుపుదురు. వారి రోజువారి పనియే వారి ప్రార్థనలు

 1. కాని మహోన్నతుని ధర్మశాస్త్రమును పఠించుటలో కాలమును గడపు ధర్మశాస్త్ర బోధకుడు మాత్రము భిన్నమైనవాడు. అతడు పురాతన రచయితల జ్ఞానవాక్కులను పరిశీలించును. ప్రవచనములను పఠించుటకు కాలమును వినియోగించును.

2. సుప్రసిద్ధుల సూక్తులను పదిలపరుచును. ఉపమానములమీద నైపుణ్యముతో వ్యాఖ్య చెప్పును

3. సామెతల గూడార్థమును అర్థము చేసికొనును.  పొడుపుకథల మర్మార్గమును చర్చించును.

4. ప్రముఖులకు సేవలుచేయుచు రాజులతో కలిసితిరుగును. అన్యదేశములలో సంచరించి నరుల బాగోగులను గమనించును.

5. వాడుక చొప్పున వేకువనే లేచి తన సృష్టికర్తయైన దేవునికి జపము చేయును. మహోన్నతుడైన దేవుని ఎదుట గొంతెత్తి ప్రార్థనచేసి తన పాపములను మన్నింపుమని వేడుకొనును.

6. ఆ మహాప్రభువు కరుణించెనేని అతని హృదయము విజ్ఞానముతో నిండును. అతడు జ్ఞాన వాక్యములను వెదజల్లుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించును.

7. తన విజ్ఞానమును, ఉపదేశమును అన్యులకు పంచిపెట్టును. నిగూఢమైన దైవరహస్యములను అర్ధముచేసికొనును

8. తానుగ్రహించిన విజ్ఞానమును ఎల్లరికిని తెలియజేయును. ప్రభువు నిబంధన ధర్మశాస్త్రముపట్ల అత్యంత శ్రద్ధజూపును.

9. అతని విజ్ఞానమును అనేకులు మెచ్చుకొందురు. ఆ విజ్ఞానము ఏనాటికిని అంతరింపదు. భావితరములవారు అతడిని స్మరించుకొందురు. అతని పేరు మాసిపోదు.

10. అన్యజాతులును అతని విజ్ఞానమును సన్నుతించును విద్వత్సభ అతనిని కీర్తించును.

11. ముసలి ప్రాయముదాక జీవించెనేని అతడు సుప్రసిద్ధుడగును. కీర్తిని పొందకముందే గతించినను అతనికి ఏ కొదవయులేదు.

12. నేను చెప్పగోరిన భావములు ఇంకను గలవు. వానితో నా హృదయము పూర్ణచంద్రునివలె నిండియున్నది.

13. భక్తిగల బిడ్డలారా! మీరు నా సూక్తులు ఆలించి ఏటి యొడ్డున ఎదుగు గులాబీవలె పుష్పింపుడు.

14. సాంబ్రాణిపొగవలె కమ్మని పరిమళము వెదజల్లుడు లిల్లీ పుష్పమువలె వికసింపుడు. ప్రభువు చేసిన సత్కార్యములకుగాను ఆయనను స్తుతించి కీర్తింపుడు.

15. ఆ ప్రభువు మహాత్మ్యమును ఉగ్గడింపుడు. సితారతో ఈ పాట పాడుడు.

16. "ప్రభువు సృజించినది అంతయు మంచిదే. ఆయన ఆజ్ఞాపించినది అంతయు సకాలమున జరుగును.

17. ఇది ఏమిటి? ఇది ఇట్లెందుకున్నది?” అని ఎవరును అడుగరాదు. దేవునినుండి తగిన సమయమున ఇట్టి ప్రశ్నలన్నిటికి జవాబు లభించును. ఆయన ఆజ్ఞాపింపగనే నీటివెల్లువ ఆగిపోయినది. ఆయన పలుకు వినగనే జలము రాశిగా ఏర్పడినది.

18. ఆయన ఆజ్ఞాపించినది సత్వరమే జరుగును. ఆయన రక్షణ శక్తిని ఎవ్వరు అడ్డగింపజాలరు.

19. నరులు చేయు ప్రతికార్యమును ప్రభువు గమనించును. ఎవరును ఆయన కన్ను కప్పజాలరు.

20. ఆయన కాలమును ప్రారంభమునుండి అంతము వరకు వీక్షించును. ఆయనకు ఆశ్చర్యము కలిగించునది ఏదియులేదు.

21. ఇదేమిటి? ఇదిబ్లెందుకున్నది అని ఎవరును ఆయనను అడుగరాదు. సృష్టిలోని ప్రతి వస్తువునకు నిర్ణీతమైన ఉద్దేశమున్నది.

22. ప్రభువు దీవెనలు నది, మరుభూమి మీదికి పారి దానిని తడిపినట్లుగా ఉండును.

23. ఆయన మంచినీటిని ఉప్పునీటిగా మార్చినట్లే, జాతులమీద తన కోపమును కూడ వెళ్ళగ్రక్కును.

24. సన్మార్గులకు ఆయన మార్గములు తిన్నగా ఉండును. కాని దుర్మార్గులకు అవి గోతులతో నిండియుండును.

25. లోకారంభము నుండి ఆయన మంచివారి కొరకు మంచివస్తువులను, చెడ్డవారికొరకు చెడు వస్తువులను కలిగించెను.

26. నరులకు కావలసిన ప్రాథమిక వస్తువులు: నీరు, నిప్పు, ఇనుము, ఉప్పు, పిండి, తేనె, పాలు, ద్రాక్షారసము, నూనె, బట్టలు.

27. సత్పురుషులకివి అన్నియు మేలుచేయును. కాని దుర్మార్గులకివియే కీడు చేయును.

28. ఆయన నరులను శిక్షించుటకు కొన్ని వాయువులను కలిగించెను. అవి భీకరముగా వీచి మనుష్యులను దండించును. న్యాయనిర్ణయదినమున అవి ఉధృతముగా వీచి ప్రభువు కోపమును చల్లార్చునట్లు చేయును.

29. నిప్పు, వడగండ్లు, కరవు, వ్యాధి నరులను శిక్షించుటకు సృజింపబడినవి.

30. క్రూరమృగములు, తేళ్ళు, పాములు, దుష్టుల పనిబట్టు కత్తులు సంతోషముతో ప్రభువు ఆజ్ఞను పాటించును.

31. అవి ప్రభువును సేవించుటకు సిద్ధముగానుండును ఆయన ఆజ్ఞను సత్వరమే నెరవేర్చును.

32. నేను మొదటినుండియు ఈ సంగతిని రూఢిగా నమ్మితిని. బాగుగా ఆలోచించిన పిదపనే ఈ విషయములను లిఖించితిని.

33. ప్రభువు చేసిన కార్యములన్నియు మంచివే, అన్ని అవసరములను ఆయన సకాలములో తీర్చుచుండును.

34. “ఇది దాని కంటె నాసిది” అని ఎవడును అనకూడదు, ప్రతిదియు దాని మేరలో అది మంచిదే.

35. కనుక పూర్ణహృదయముతో ప్రభువును కీర్తింపుము. ఆయన నామమును సన్నుతింపుము.

 1. ప్రతి నరుడును కష్టించి పనిచేయవలసినదే. ప్రతి మనుజుని తలమీదను పెద్దబరువు మోపబడియున్నది. మాతృగర్భము నుండి పుట్టినది మొదలు భూగర్భమును చేరువరకును నరునికి ఈ భారము తప్పదు.

2. వారి సందిగ్ధతలు, వారి హృదయ భయాలు, వారి ఆతురతతో కూడిన ఆలోచనలు కలిగిన రోజు అది వారికి మరణదినము.

3. సింహాసనమును అధిష్టించు రాజునుండి మట్టిలో పడి పొర్లాడు దరిద్రుని వరకును,

4. రాజ వస్త్రములను, కిరీటమును ధరించు ప్రభువు నుండి గోనెతాల్చు నిరుపేద వరకును,

5. నరులెల్లరు కోపము, అసూయ, విచారము, సంక్షోభము, మృత్యుభయము, కలహము, వైరము మొదలైనవానికి లోనగుదురు. నరుడు రేయి నిద్రించునపుడు కూడ పూర్వపు బాధలే నూత్నరీతిలో గోచరించును.

6. అతని కంటికి కొంచెము కునుకు పట్టినదో లేదో నిద్రలో పగటిపూట కన్పించినట్లుగా దృశ్యములు చూపట్టును. అతడా ఘోరమైన దృశ్యములను గాంచి భీతిజెందును తాను యుద్ధమునుండి పరుగు తీయుచున్నట్లు భావించును.

7. ఆ పరుగులో తాను సురక్షితస్థానమును చేరినట్లు తలచును. అంతలో మెలకువ వచ్చి ఇకను భయపడనక్కరలేదని ఎంచును.

8. శరీరధారులైన నరులు, మృగములు మొదలైన జీవకోటి కంతటికిని, పాపాత్ములకును ఏడురెట్లు అధికముగా పట్టు దుర్గతులు ఏవనగా

9. మృత్యువు, హింస, కలహము, హత్య, వినాశనము, క్షామము, దుఃఖము, మహమ్మారి.

10. ఈ అనర్థములన్నియు దుర్మార్గులకొరకే కలిగింపబడినవి. జలప్రళయము తెచ్చిపెట్టినది ఈ దుష్టులే.

11. జలమంతయు సముద్రమునకు మరలిపోవునట్లుగా నేలనుండి పుట్టినదంతయు నేలకు తిరిగిపోవును.

12. లంచములు, అన్యాయములు అడుగంటును. ధర్మము మాత్రమే శాశ్వతముగా నిలుచును.

13. దుర్మార్గుల సంపదలు నదివలె ఎండిపోవును. గాలివానలో విన్పించు ఉరుములవలె అంతరించును

14. ఉదారముగా దానముచేయువాడు సంతోషమును పొందును. కాని దుర్మార్గుడు సర్వనాశనమగును. .

15. భక్తిహీనుల తనయులకు పెద్ద కుటుంబములుండవు వారు రాతిమీద మొలచిన మొక్కలవలె క్షీణింతురు.

16. ఏటి ఒడ్డున ఎదుగు తుంగలు అన్ని మొక్కల కంటే ముందుగా కోసివేయబడినట్లే వారును నాశనమగుదురు.

17. కాని కరుణ, భాగ్యవనము వంటిది. దానము శాశ్వతముగా నిలుచును.

18. సంపన్నుడుగా నుండుటయు, కూలి చేసికొని బ్రతుకుటయు రెండును మంచివే. కాని ఈ రెండింటికంటెను నిధిని పొందుట మెరుగు.

19. బిడ్డలవలనను, నగర నిర్మాణము వలనను కీర్తి అబ్బును. కాని ఈ రెండిటికంటెను విజ్ఞానార్జన శ్రేష్ఠమైనది. పశుసంపద వలనను, తోటల పెంపకము వలనను పేరు వచ్చును. కాని ఈ రెండింటికంటెను యోగ్యురాలైన భార్య మెరుగు.

20. ద్రాక్షారసము, సంగీతము ముదమును చేకూర్చును. కాని ఈ రెండిటికంటెను విజ్ఞానప్రీతి మేలైనది.

21. పిల్లన గ్రోవి, సితారల వలన చక్కని సంగీతము వెలువడును. కాని ఈ రెండిటికంటెను సాదు కంఠము లెస్స.

22. అందము, ఆకర్షణము నేత్రములకు ప్రీతిని కలిగించును. కాని ఈ రెండిటికంటెను వసంతకాలపు పచ్చని మొక్కలు మిన్న.

23. స్నేహితులు, ఇరుగుపొరుగు వారు కలిసియున్నచో ముచ్చటగానుండును. కాని ఆ ఇరువురికంటెను భార్యాభర్తలు కలిసియుండుట మెరుగు.

24. ఆపదలలో తోబుట్టువులు సహాయులు చెంతనున్న బాగుగా నుండును. కాని దానధర్మములు చేయుటవలన సిద్ధించు సహాయము అంతకంటెను శ్రేష్ఠమైనది.

25. వెండిబంగారమువలన భద్రత చేకూరును. కాని ఆ రెండిటికంటెను సదుపదేశము మెరుగైనది.

26. ధనబలమువలన ఆత్మవిశ్వాసము కలుగును. కాని ఆ రెండిటికంటెను దైవభీతిమేలు. దైవభీతి కలవానికి వేరేమియు అక్కరలేదు. ఇతర ఆధారములు ఏమియును అవసరములేదు.

27. దైవభీతి పలులాభములొసగు ఉద్యానవనమువంటిది. దానిని మించిన సదాశ్రయము లేదు.

28. కుమారా! ముష్టి ఎత్తుకొని బ్రతుకవద్దు. భిక్షమెత్తుటకంటె చావుమేలు.

29. కూటికొరకు ఇతరులమీద ఆధారపడువాని జీవితము అసలు జీవితమే కాదు. అన్యులకూడు తినువాడు తనను తాను మైలపరచుకొనును. గౌరవమర్యాదలు కలవాడు అట్టిపనికి పాల్పడడు.

30. సిగ్గు సెరము లేనివాడు బిచ్చమెత్తుకొనుట మంచిదే అని చెప్పును. కాని భిక్షము అతని కడుపునకు చిచ్చు పెట్టును.

 1. ఓ మృత్యువా! ఆస్తిపాస్తులతో హాయిగా కాలము గడపువానికిని, చీకు చింతలేక జీవించుచు, అన్నిటను విజయము సాధించువానికిని, కడుపునిండ తినగల శక్తి కలవానికిని, నిన్ను గూర్చిన తలంపు ఎంత దుఃఖకరమైనది!

2. పేదరికమున జీవించుచు రోగియై ఉన్నవాడు, వృద్ధుడు, విచారగ్రస్తుడై ఉన్నవాడును, కోపమువలన సహనము కోల్పోయి ఉన్నవాడును మృత్యువును ఆహ్వానించును.

3. కాని మృత్యుశాసనమునకు భయపడనక్కరలేదు. నీ పూర్వులను, నీ తరువాతి వారిని జప్తికి తెచ్చుకొనుము.

4. ప్రభువు బ్రతికియున్న వారికందరికి మరణమను శిక్ష విధించెను. మహోన్నతుని సంకల్పమును కాదనుటకు నీవెవరివి? నీవు జీవించునది పదియేండ్లయినను వందయేండ్లయినను, వెయ్యేండ్లయినను మృత్యులోక మున ఎవడును పట్టించుకొనడు.

5. భక్తి ఇసుమంతలేని పాడుకొంపలలో పెరిగిన దుర్మార్గుల బిడ్డలు రోతను పుట్టింతురు. 

6. వారు తాము వారసత్వముగా పొందిన ఆస్తిని కోల్పోవుదురు. వారి బిడ్డలకును కలకాలము మచ్చతప్పదు.

7. భక్తిహీనుని బిడ్డలు మా అపకీర్తికి నీవే కారకుడవని తమ తండ్రిని నిందింతురు.

8. భక్తిహీనుడా! నీవు దేవుని ధర్మశాస్త్రమును విడనాడితివి, కనుక నీకు వినాశనము తప్పదు.

9. నీవు జన్మించినపుడే శాపగ్రస్తుడవైతివి. చనిపోవునపుడును నీకు శాపము తప్పదు.

10. నేలనుండి పుట్టినది నేలకే తిరిగిపోవును. భక్తిహీనులు అడపొడ కానరాకుండ పోవుదురు.

11. నరులు చనిపోయిన వారి కొరకు విలపింతురు. కాని దుర్మార్గుల మరణానంతరము వారి పేరుకూడ మిగులదు.

12. నీ కీర్తిని నిలబెట్టుకొనుము. నీవు గతించిన పిదపకూడ నీ మంచిపేరు నిలిచి యుండును. అది వేయిసువర్ణ  నిధులకంటెను ఎక్కువ కాలము మనును.

13. నరుని మంచి జీవితము కొన్నాళ్ళపాటు మాత్రమే కొనసాగును. కాని అతని సత్కీర్తి శాశ్వతముగా నిలుచును.

14. బిడ్డలారా! నా ఉపదేశమును పాటించి శాంతిని పొందుడు. విజ్ఞానమును, నిధిని దాచియుంచినచో ఎట్టి ప్రయోజనము లేదు.

15. విజ్ఞానమును దాచియుంచువానికంటె మూర్ఖతను దాచియుంచువాడు మెరుగు.

16. నేను పేర్కొను సందర్భములలో మాత్రము సిగ్గును పాటింపుడు. అన్ని రకములైన సిగ్గులు మంచివికావు. అన్ని సందర్భములలో సిగ్గుపడనక్కరలేదు.

17. కామప్రవర్తనమును గూర్చి మీ తల్లిదండ్రుల ఎదుటయు, బోంకులాడుటను గూర్చి, రాజులు ప్రముఖుల ఎదుటయు సిగ్గుపడుడు.

18. అట్లే దుష్కార్యముల గూర్చి, న్యాయాధిపతి ఎదుటయు, చట్టమును మీరుట గూర్చి న్యాయసభ ఎదుటయు, వంచనముగూర్చి మిత్రుడు లేక భాగస్వామి ఎదుటయు,

19. దొంగతనముగూర్చి తోడి వారి ఎదుటయు, భోజనపు బల్ల మీద మోచేతులానించుట గూర్చియు పిసినిగొట్టుతనముతో దానము చేయకుండుట గూర్చియు దేవుని సత్యనిబంధనము ఎదుటను సిగ్గుపడుడు.

20. ఇంకను మీకు నమస్కరించిన వారికి ప్రతి నమస్కారము చేయకుండుట గూర్చియు, వేశ్యవైపు గుడ్లప్పగించి చూచుట గూర్చియు,

21. బంధువు ప్రార్థనను ఆలింపకుండుట గూర్చియు, ఇతరునికి ముట్టవలసినది మీరు కొట్టివేయుటనుగూర్చియు, పరుని భార్యమీద కన్నువేయుటను గూర్చియు,

22. అన్యుని దాసిని వలచుట, ఆమె పడకచెంతకు వెళ్ళుట గూర్చియు, మిత్రుని అవమానించుట గూర్చియు, దానము చేసి విమర్శించుటగూర్చియు, రహస్యములను వెల్లడి చేయుటను గూర్చియు సిగ్గుపడుడు.

23. ఇట్టి సందర్భములలో సిగ్గుపడుట సబబు. ఇట్లు చేసినచో ప్రజలు మిమ్ము మెచ్చుకొందురు.

 


1. కాని ఇతరులకు జడిసి ఈ క్రింది విషయములలో పాపము చేయుదురేమో జాగ్రత్త!  మీరు ఈ క్రింది విషయములను గూర్చి సిగ్గుపడకుడు.

2. మహోన్నతుని ధర్మశాస్త్ర నిబంధనములగూర్చియు భక్తిహీనులనుగూడ సద్భావముతో చూచుట గూర్చియు,

3. తోడి ప్రయాణికునితోకాని భాగస్వామితోగాని లెక్కలు సరిచూచుకొనుట గూర్చియు, వారసత్వముగా వచ్చిన ఆస్తిని పంచుకొనుటను గూర్చియు,

4. సరియైన కొలమానములు, పడికట్టురాళ్ళు వాడుటను గూర్చియు, పెద్దదోచిన్నదో వ్యాపారము చేయుటను గూర్చియు

5. వ్యాపారమున లాభము గడించుటను గూర్చియు, చిన్నపిల్లలకు శిక్షణనిచ్చుటను గూర్చియు, దుష్టుడైన బానిసను నెత్తురు కారువరకు కొట్టుటను గూర్చియు సిగ్గుపడకూడదు.

6. నీ భార్య నమ్మజాలనిదైనచో, అది పదిమంది తిరుగు తావైనచో, నీ వస్తువులను దాచి తాళము వేయుము.

7. నీవు ఇతరులకిచ్చు వస్తువులను తూచి, లెక్కపెట్టి ఇమ్ము. ఇచ్చిపుచ్చుకొను వానిని పద్దులో వ్రాసి ఉంచుకొనుము.

8. బుద్ది హీనులను చక్కదిద్దుటయు, వేశ్యగామియైన వృద్దుని మందలించుటకును వెనుకాడకుము. ఈ అంశములను పాటించినచో నీవు సంస్కారవంతుడవని రుజువగును. ఎల్లరును నిన్ను మెచ్చుకొందురు.

9. తండ్రి తన కుమార్తెనుగూర్చి ఆందోళన చెందును. రేయి అతని కంటికి కునుకు రాదు. ఈ సంగతి కుమార్తెకు తెలియదు. కుమార్తె బాలికగా ఉన్నచో ఆమెకు పెండ్లి కాదేమో అనియు, పెండ్లియైనచో ఆమె సుఖింప జాలదేమో అనియు తండ్రి విచారించును.

10. పుత్రిక కన్యయైనచో ఎవరైన అమెను చెరతురేమో అనియు, అమె పుట్టినింటనే గర్భవతియగునేమో అనియు అతని భయము. ఆమెకు పెండ్లియైనచో శీలవతిగానుండదేమో అనియు లేదా సంతానము కలుగదేమో అనియు అతని చింత.

11. నీ పుత్రికకు తలబిరుసుతనము ఉన్నచో కనిపెట్టియుండుము. లేదేని ఆమె నీ శత్రువుల ముందు నీకు తలవంపులు తెచ్చును. . నీవు నగర ప్రజల నోళ్ళలో నానుదువు. బహిరంగముగా అవమానము పాలగుదువు.

12. ఆమె ప్రతి మగవాని ముందు తన అందమును ప్రదర్శింపకుండునట్లును, స్త్రీలతో ముచ్చట్లు పెట్టుకొనకుండునట్లును జాగ్రత్తపడుము.

13. బట్టలను చిమ్మటలువలె, స్త్రీలు స్త్రీలను నాశనము చేయుదురు.

14. ఆడుదాని మంచితనము కంటే మగవాని చెడ్డతనము మేలు. స్త్రీలు నిందావమానములను తెత్తురు.

15. ఇక దేవుని సృష్టినిగూర్చి వివరింతును. నేను కన్నులారాగాంచిన సంగతులు విన్నవింతును దేవుని వాక్కువలన విశ్వము పుట్టినది. సృష్టి అంతయు ఆయన ఆజ్ఞను పాటించును.

16. సూర్యుని తేజస్సు ప్రతివస్తువు మీద పడినట్లే ప్రతివస్తువును దేవుని మహిమతో నిండియుండును.

17. పరిశుద్ధులైన దూతలకుకూడ ప్రభువు సృష్టి రహస్యములనెల్ల వెల్లడి చేయు శక్తిని దయచేయలేదు. ప్రభువు సృష్టిని భద్రముగా నిర్వర్తించెను. ఈ విశ్వమంతయు తన మహిమతో నిండియున్నట్లు చేసెను.

18. ఆయన సముద్రగర్భమును, మనుష్య హృదయమును పరిశీలించును. ఆ రెండిటి మర్మములను గ్రహించును. తెలియవలసినదంతయు మహోన్నతునికి తెలియును. ఆయన కాలగతులనెల్ల ఎరుగును.

19. భూత భవిష్యత్తులను ఆయన పరిశీలించును. నిగూఢ రహస్యములుకూడ ఆయనకు తేటతెల్లమగును.

20. నరులు ఆలోచించు ఆలోచనలన్నియు, పలికెడి పలుకులన్నియు ఆయనెరుగును.

21. ప్రభువు తాను విజ్ఞానముతో చేసిన మహాకార్యములన్నిటికిని ఒక క్రమపద్ధతిని నిర్ణయించెను. ఆయన అనాదినుండి అనంతమువరకు వర్థిల్లును. ఆయన చేసిన సృష్టికి మనమేమి చేర్పజాలము. దానినుండి మనమేమి తొలగింపజాలము. మన సలహాతో ఆయనకు అవసరములేదు.

22. ఆయన సృజించిన వస్తువులన్ని కంటికి కన్పించు చిన్ననలుసు వరకును సౌందర్యశోభితములే.

23. అవియన్నియు శాశ్వతముగా నిలుచును. వానిలో ప్రతిదానికి నిర్ణీతమైన ఉద్దేశము కలదు.

24. వస్తువులన్నియు పరస్పర భిన్నములైన ద్వంద్వములుగా గోచరించును. ఆయన కలిగించిన వానిలో ఏదియు అసంపూర్ణము కాదు.

25. ప్రతివస్తువును మరియొక వస్తువు శోభను ఇనుమడింపజేయును. ఆయన మహిమను పరిపూర్ణముగా గ్రహించువారెవరు!

 1. ఆకాశమెంత కాంతిమంతముగాను, ఎంత నిర్మలముగాను ప్రకాశించును!

2. ఉదయభానుడు మింట ఎగయుచు మహోన్నతుని సృష్టి మహాద్భుతమైనదని ప్రకటన చేయును.

3. మిట్టమధ్యాహ్నమున సూర్యుడు భూమిని మాడ్చివేయును, మందు తన అగ్నినెవరును భరింపజాలరు.

4. కొలిమివద్ద పనిచేయువాడు ఒడలిని మాడ్చు వేడిమిని సహింపవలెను. కాని సూర్యుడు మూడురెట్లు అధికముగా పర్వతములను మాడ్చివేయును. ప్రొద్దు అగ్నికిరణములను వెళ్ళగ్రక్కును. దాని ప్రకాశమును భరింపలేక, మన కన్నులు గ్రుడ్డివగును.

5. సూర్యబింబమును చేసిన ప్రభువు మహాఘనుడు. ఆయన ఆజ్ఞపై అది త్వరత్వరగా పయనించును.

6. చంద్రబింబము కలకాలము మాసములను, ఋతువులను సూచించుచుండును.

7. ఉత్సవదినములను నిర్ణయించునదియు అదియే. ఆ తేజోగ్రహము కాంతి పెరిగితరుగుచుండును.

8. చంద్రుని పేరే మాసము పేరు. పున్నమిచంద్రుడు సొగసుతో వెలుగును. అది ఆకసమున వెలుగొందుచు, నక్షత్రరాసులకు దివిటీవలె ఒప్పును.

9. నక్షత్రకాంతి ఆకాశమునకు శోభనొసగును. ప్రభుని ఉన్నతాకాశమునకు తారలు దేదీప్యమానమైన అలంకారములు.

10. పవిత్రుడైన ప్రభువు నిర్ణయించిన స్థానమునుండి అవి కదలవు. కావలికాయుటను అవి ఎన్నడును మానవు.

11. రంగులధనుస్సును చూచి సృష్టికర్తను కొనియాడుము. అది మహాసౌందర్యముతో తళతళలాడుచుండును

12. ప్రభువు తన చేతితో వంచినవిల్లో అన్నట్లు అది ఆకాశమున అర్థచంద్రాకృతితో అలరారుచుండును.

13. ప్రభువు ఆజ్ఞాపింపగా మంచుపడును. ఆయన శాసింపగా మెరుపు మెరయును.

14. ఆయన ఆకాశపుకొట్లను తెరవగా మేఘములు పక్షులవలె ఎగిరిపోవును.

15. ఆయన మేఘసముదాయమును ప్రోగుజేయును. మంచును ముక్కలు ముక్కలు చేసి వడగండ్లు కురియించును.

16-17. ఆ ప్రభువును చూచి పర్వతములు కంపించును. ఆయన ఉరుములకు భూమి బాధతో ఘర్థిల్లును ఆయన ఆజ్ఞాపింపగనే దక్షిణ వాయువు వీచును. ఉత్తరమునుండి తుఫాను, గాలి దుమారములు బయలుదేరును. ఆయన మంచును కురిపించగా అది పక్షులవలె దిగి వచ్చును. మిడుతల దండువలె నేలమీద వాలును.

18. తెల్లని మంచును చూచి , మన కన్నులు ఆశ్చర్యము చెందును. అది నేలమీద పడుట చూచి మనము తన్మయులమగుదుము.

19. ప్రభువు పొడిమంచును ఉప్పువలె నేలమీద చల్లును.  అది గడ్డకట్టి ముండ్లమొనలవలె కన్పించును.

20. ఉత్తరమునుండి చలిగాలి వీచును. వెంటనే నీరు ఘనీభవించును. చెరువులు, సరస్సులు మంచుతో నిండిపోయి, హిమము అను కవచమును ధరించును.

21. బెట్టతో ఆయన ఎడారులలోని కొండలను మాడ్చివేయును.  ఆ సెగకు గడ్డి ఎండిపోవును.

22. కాని పొగమంచుపడి ప్రకృతి మరల తెప్పరిల్లును. వేడిమి పోయిన తరువాత ఉపశమనమునొసగు మంచు పడును.

23. ప్రభువు విజ్ఞానముతో మహాసముద్రములను శాంతింపజేసి, వానిలో ద్వీపములను నెలకొల్పెను.

24. నావికులు సముద్రము వలన అపాయములను గూర్చి చెప్పుదురు. వారి సుద్దులు విని మనము ఆశ్చర్యచకితులమగుదుము

25. ఆ సముద్రములో విచిత్ర ప్రాణులు జీవించును. పలురకముల జీవులును, మహాజల జంతువులును వసించును.

26. ప్రభువు సామర్యము వలన అన్ని కార్యములును సవ్యముగా జరుగును. ఆయన వాక్కువలన సమస్తవస్తువులు ఐక్యమైయుండును.

27. సృష్టిని గూర్చి ఇంకను చాల సంగతులు చెప్పవచ్చును. కాని ఈ అంశమును ఎప్పటికిని ముగింపజాలను. కనుక సంగ్రహముగా చెప్పవలెనన్న “సమస్తమును ప్రభువే”.

28. ప్రభువును స్తుతించు సామర్థ్యము మనకు లేదు. ఆయన తాను చేసిన సృష్టికంటె అధికుడు.

29. ఆయన మహాఘనుడు, మహాభయంకరుడు. అద్భుతశక్తి సంపన్నుడు.

30. నీ శక్తికొలది దేవుని సన్నుతించినను నీవు కీర్తించిన దానికంటే ఆయన అధికుడుగానుండును, అలయక నీ బలముకొలది ప్రభువును వినుతించినను, నీవు ఆయనను తగినట్లుగా ప్రస్తుతింపజాలవు.

31. కంటితో చూచిన వారెవరున్నారు కనుక ఆయనను వర్ణింపగలరు? సముచితరీతిన ఆయనను ఎవరు కీర్తింపగలరు?

32. ఇంక మహారహస్యములు చాలగలవు. ప్రభువు సృష్టిలో మనకు తెలిసినది అత్యల్పము మాత్రమే.

33. సమస్తమును ప్రభువే సృజించెను. ఆయన తన భక్తులకు విజ్ఞానమును దయచేసెను.

 1. ఇక సుప్రసిద్ధులను సన్నుతింతము. వారు మనకెల్లరికి పూర్వవంశకర్తలు.

2. ప్రభువు వారిని మహిమాన్వితులను చేసెను. వారిద్వారా సృష్ట్యాదినుండి ఆయన కీర్తి వెల్లడైనది.

3. వారిలో కొందరు రాజ్యములేలి బలాఢ్యులుగా గణుతికెక్కిరి. కొందరు జ్ఞాననిధులైన ఉపదేశకులై ప్రవచనములు పలికిరి.

4. కొందరు నేతలై, ప్రజలను నడిపించిరి. న్యాయచట్టములను తయారుచేసి యిచ్చిరి. విజ్ఞానముతో బోధలు చేసిరి.

5. కొందరు వీరగాథలు పాటలుగా వ్రాసిరి.

6. కొందరు ధనవంతులును, బలవంతులునై ఇంటిపట్టుననే ప్రశాంతముగా కాలము గడపిరి.

7. వీరెల్లరును తమ జీవితకాలమున సుప్రసిద్ధులై ఉండిరి. తాము బ్రతికియున్న దినములందు కీర్తితో శోభిల్లిరి.

8. కొందరి పేరు ఇప్పటికిని నిలిచియున్నది. జనులు ఇప్పటికిని వారిని కొనియాడుచున్నారు.

9. కాని కొందరి పేరు నిలువలేదు. వారు నేలమీద జీవింపని వారివలె విస్మృతికి గురియైరి. అసలు పుట్టని వారివలె జనులు వారిని మరచిపోయిరి. వారి సంతతియు అట్లే అయ్యెను.

10. కాని ఈ క్రింది పంక్తిలోనివారు మేటి భక్తులు. వారి పుణ్యకార్యములను జనులు విస్మరింపలేదు.

11. వారికీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది  అది ఆ పుణ్యపురుషులు వదలిపోయిన వారసత్వము

12. ఆ ధర్మాత్ముల సంతానము నిబంధనమును పాటించును. ఆ ధన్యాత్ముల చలువవలన ఆ సంతానమునకు కలిగిన సంతానమును అట్లే చేయును.

13. ఆ మహాత్ముల కుటుంబములు కలకాలము నిలుచును. వారి యశస్సు ఏ నాటికిని క్షీణింపదు.

14. వారు సమాధిలో విశ్రాంతి నొందుచున్నారు. వారి పేరు శాశ్వతముగా నిలుచును.

15. అన్యజాతి ప్రజలు వారి విజ్ఞానమును కీర్తింతురు. యిస్రాయేలు ప్రజలు వారిని కొనియాడుదురు.

16. హనోకు ప్రభువునకు ప్రీతిని కలిగింపగా ప్రభువు అతడిని పరమండలమునకు కొనిపోయెను. అతడు భావితరముల వారికి పశ్చాత్తాపప్రేరకుడుగా నుండెను.

17. నోవా పరిపూర్ణ భక్తుడు.  అతడి వలన జలప్రళయానంతరము నూతన నరజాతి ఉద్భవించినది. అతడి వలననే జలప్రళయము ముగిసిన పిదప భూమిమీద నరజాతి శేషము మిగిలినది.

18. జలప్రళయము వలన ప్రాణులు మరల నశింపవని తెలుపుచు ప్రభువు అతడితో శాశ్వతమైన నిబంధనము చేసికొనెను.

19. బహుజాతులకు సుప్రసిద్ధుడైన పితామహుడు అబ్రహాము. అతని యశస్సు అనన్య సామాన్యమైనది.

20. అతడు మహోన్నతుని ధర్మశాస్త్రమును పాటించి ఆ ప్రభువుతో నిబంధనమును చేసికొనెను. ఆ నిబంధనపుగురుతు అతని దేహముమీద కన్పించెను. అతడు ప్రభువు పంపిన శోధనలకు తట్టుకొని నిలిచెను.

21. కనుక అతని వంశజుల వలన లోకమునకు దీవెనలు అబ్బుననియు, అతని వంశజులు భూరేణువులవలె విస్తరిల్లుదురనియు, వారు ఇతర జాతులకంటె ఎక్కువగా గౌరవింపబడుదురనియు, వారి దేశము సముద్రమునుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నదినుండి నేల అంచుల వరకు వ్యాపించుననియు, ప్రభువతనికి రూఢిగా ప్రమాణము చేసెను.

22. అబ్రహాము మీదగల ఆదరముచే అతని సంతతివలన లోకమునకు దీవెనలు అబ్బుననెడి ప్రమాణమును ప్రభువు ఈసాకునకు గూడ విన్పించెను.

23. అతడు యాకోబునకు గూడ ప్రమాణము చేసి అతనికి కూడ దీవెనలు ఒసగెను. తాను వారసత్వముగా ఇచ్చెదనన్న నేలను అతని కొసగెను. ఆ నేలను పండ్రెండు భాగములుచేసి పండ్రెండు తెగలకు పంచియిచ్చెను.

 1. యాకోబు వంశజుల నుండి ప్రభువు ఒక భక్తుని సంసిద్ధము చేసెను. ప్రజలెల్లరు అతడిని ఆదరముతో చూచిరి. అతడు దేవునికిని, నరులకును , ప్రీతిపాత్రుడయ్యెను. అతడే మోషే,  ఆ నామమును స్మరించుటయే మహాభాగ్యము.

2. ప్రభువు అతనిని దేవదూతలవలె మహిమోపేతుని చేసెను. అతని శక్తిని చూచి శత్రువులెల్ల భయపడిరి.

3. మోషే ప్రార్థింపగా ప్రభువు అరిష్టములు పుట్టించెను ప్రభువు రాజులు అతనిని గౌరవించునట్లు చేసెను అతనిద్వారా ప్రజలకు ధర్మశాస్త్రము నొసగెను. అతనికి తన తేజస్సును చూపించెను.

4. ప్రభువు మోషే భక్తి వినయములకుగాను నరులందరి లోను అతనినే ఎన్నుకొని పవిత్రుని చేసెను.

5. ఆ భక్తునికి తనస్వరమును వినిపించి, అతనిని కారుమేఘములోనికి కొనిపోయెను. అచట అతనికి ముఖాముఖి ధర్మశాస్త్రమును ఒసగెను అది జీవమును, జ్ఞానమును వొసగు చట్టము. మోషే ఆ చట్టమును యిస్రాయేలీయులకు బోధింపవలెనని ప్రభువు ఆజ్ఞాపించెను.

6. ప్రభువు మోషేకు అన్నయును, అతనివలె పవిత్రుడును, లేవీ వంశజుడైన అహరోనును సంసిద్ధము చేసెను

7. అతనితో శాశ్వతమైన నిబంధనము చేసికొని తల తన ప్రజలకు అతనిని యాజకునిగా నియమించెను. ప్రశస్తమైన వస్త్రములతోను, విలువగల ఆభరణములతోను అతనిని సత్కరించెను.

8. అతనికి పరిపూర్ణ మహిమను దయచేసెను. అహరోను అధికారమునకు సూచనముగాను, అతడికి నారలోదుస్తులను, నిలువుటంగీని, ఎఫోదు ఉపరివస్త్రమును దయచేసెను.

9. ఆ నిలువుటంగీ వస్త్రపుటంచులకు బంగారు చిరుగంటలు గలవు. అహరోను నడచినప్పుడెల్ల వానిశబ్దము దేవాలయమున విన్పించెడిది. ఆ నాదమునువిని ప్రభువును ప్రజలు స్మరించుకొనెడివారు.

10. ప్రభువు అతనికి పసుపు, ధూమ్ర, ఊదావర్ణముల బుట్టాపనిగల పరిశుద్ధ వస్త్రమును దయచేసెను. తన చిత్తమును తెలియజేయుటకు ఉరీము, తుమ్మీము పరికరములను రత్నములు పొదిగిన తన వక్షఃఫలకమునందు ధరించునట్లు చేసెను.

11. నిపుణుడైన కళాకారుడు పేనిన ఎఱ్ఱని త్రాటిని దయచేసెను. సువర్ణకారుడు నామములు చెక్కి బంగారమున పొదిగిన రత్నములనుగూడ ప్రభువు అతనికి ప్రసాదించెను. ప్రభువు పండ్రెండుతెగల యిస్రాయేలీయులను స్మరించుకొనుటకుగాను అహరోను ,ఆ రత్నములను వక్షఃస్థలమున ధరించెడివాడు.

12. ప్రభువు అతనికి తలపాగాను కూడ దయచేసెను. దానిమీద “ప్రభువునకు నివేదితము” అను అక్షరములు చెక్కిన కిరీటము కలదు. ఆ పాగా కడునైపుణ్యముతో చేయబడినది. కంటికింపునుగూర్చు రమ్యమైన కళాఖండిక అది. దానిని ధరించుట మిక్కిలి గౌరవప్రదము.

13. ఇట్టి సుందరవస్తువులను ముందెవ్వరు ధరింపలేదు అహరోను అతని వంశజులు మాత్రమే వానిని ధరించిరి. వారు మాత్రమే కలకాలము అట్టివానిని తాలురు.

14. దినమునకు రెండుసారులు ప్రభువునకు ధాన్యబలి అర్పింపబడును. ఆ ధాన్యమును సంపూర్ణముగా దహింతురు.

15. మోషే అహరోనుని పరిశుద్దతైలముతో అభిషేకించి యాజకునిగా ప్రతిష్ఠించెను. ప్రభువు అహరోనుతోను, అతని వంశజులతోను శాశ్వతమైన నిబంధనము చేసికొనెను. వారు యాజకులై ప్రభువును సేవింతురు. ఆయన పేరు మీదుగా ప్రజలను దీవింతురు.

16. ప్రభువు నరులందరిలోను అహరోనునే ఎన్నుకొనెను. బలులర్పించుటయు, పరిమళముతోగూడిన సాంబ్రాణి పొగ వేయుటయు ద్వారా ప్రభువు తన ప్రజలను జ్ఞప్తికి తెచ్చుకొని, వారి పాపములను పరిహరించునట్లు చేయుటయు అతని పనులు.

17. ప్రభువు ధర్మశాస్త్రమును అతని అధీనమున ఉంచెను. ధర్మశాస్త్ర సంబంధమైన నియమములు చేయుటకు ఆ శాస్త్రమును ప్రజలకు బోధించుటకు అతనికి అధికారమిచ్చెను.

18. అసూయ వలన ఎడారిలో కొందరు అహరోనుమీద తిరుగబడిరి. దాతాను, అబీరాము మరియు వారి వర్గమువారు కోరా మరియు అతని అనుచరులు కోపముతో అతనినెదిరించిరి.

19. ప్రభువు ఆ చెయిదమునకు కోపించి మహోగ్రుడై ఆ దుష్టులనెల్ల మట్టుపెట్టెను. అద్భుతములు కావించి వారినెల్ల మంటలకు ఆహుతి చేసెను.

20. ప్రభువు అహరోనును విశిష్ట గౌరవములతో సత్కరించెను. దేవాలయమున ప్రథమ ఫలములు అతనికి దక్కునట్లు చేసెను. దానివలన యాజకులకు సమృద్ధిగా తిండి దొరికెను

21. యాజకులు దైవార్పితములైన కానుకలను భుజింతురు. అహరోనునకును అతని అనుయాయులకును ప్రభువు ఈ హక్కును ఒసగెను.

22. కాని అహరోను ఇతర ప్రజలవలె భూమిని పొందలేదు. నేలలో అతనికి వాటా లేదు. అతని వాటాయు, వారసత్వముగూడ ప్రభువే..

23. ఎలియెజెరు పుత్రుడు ఫీనెహాసు కీర్తిని పొందినవారిలో మూడవవాడు. అతడు ప్రభువు పట్ల మహాభక్తి కలవాడు. ప్రజలు దేవునిమీద తిరుగబడినపుడు అతడు స్థిరచిత్తముతోను, ధైర్యముతోను నిలిచి యిస్రాయేలీయుల పాపములకు ప్రాయశ్చిత్తము చేసెను.

24. కనుక ప్రభువు ఫీనెహాసుతో సమాధానపు నిబంధనము చేసికొని అతనిని గుడారమునకును, ప్రజలకును అధికారిని చేసెను. అతనికిని అతని అనుయాయులకును శాశ్వతముగా ప్రధాన యాజకత్వమును ఒప్పగించెను.

25. ప్రభువు యీషాయి కుమారుడును, యూదా తెగవాడును అయిన దావీదుతో చేసికొనిన ఒడంబడిక ప్రకారము రాచరికము తండ్రి నుండి కుమారునికి సంక్రమించెడిది. కాని అహరోను యాజకత్వము అతని అనుయాయులందరికిని సంక్రమించెను.

26. యాజకులైన మీకు ప్రభువు విజ్ఞానమును దయచేయునుగాక! మీరు ప్రజలకు న్యాయబుద్దితో తీర్పు చెప్పుదురుగాక! మీ పూర్వుల ధర్మవర్తనము ఏ నాటికిని అంతరింపకుండునుగాక! వారి కీర్తి తరతరములదాక నిలుచునుగాక!

 1. నూను కుమారుడు యెహోషువ మహావీరుడు. మోషే తరువాత అతడు ప్రవక్త అయ్యెను. అతడు తన పేరునకు తగినట్లుగానే జీవించి, దైవ ప్రజలను ఆపదనుండి రక్షించెను. తనకు అడ్డువచ్చిన శత్రువులనెల్ల ఓడించి, యిస్రాయేలీయులకు వాగ్దత్తభూమిని సంపాదించి పెట్టెను.

2. అతడు చేయెత్తి శత్రు పట్టణములమీదికి దండెత్తిపోయినపుడు మిక్కిలి వైభవముతో అలరారెను.

3. యెహోషువ ధైర్యము ఎవరికున్నది? అతడు ప్రభువు యుద్ధములను నడిపెను.

4. సూర్యుని ఆకాశమున ఆపివేసి, ఒక రోజును రెండు రోజులంత దీర్ఘముగా చేసెను

5. శత్రువులు తనను చుట్టుముట్టగా సర్వశక్తిమంతుడు మహోన్నతునికి ప్రార్థన చేసెను. ప్రభువు అతని మొరనాలించి భయంకరమైన వడగండ్లవానను కురిపించెను.

6. ప్రభువే శత్రువులను వడగండ్లవానకు గురిచేసి బేత్ హోరోను కనుమ వద్ద సర్వనాశనము చేసెను. విరోధివర్గము యెహోషువ శౌర్యమును గ్రహించెను.

7. మోషే కాలమున యెహోషువ విశ్వసనీయత వెల్లడియయ్యెను. అతడును, యెఫున్నె కుమారుడు కాలేబును నమ్మిన బంటులు. వారిరువురు యిస్రాయేలు సమాజమునెదిరించి వారి గొణగుడును ఆపివేసి పాపమును తొలగించిరి.

8. ఎడారిలో పయనించిన ఆరులక్షలమందిలో ఈ ఇరువురు మాత్రమే ప్రాణములతో బ్రతికి, పాలు తేనెలు జాలువారు వాగ్రత్త భూమిని చేరుకోగలిగిరి.

9. ప్రభువు కాలేబునకు మహాబలమును దయ చేసెను. అతడు వృద్ధుడు అయినపుడును ఆ సత్తువను కొల్పోలేదు. ఆ కనుకనే పర్వతసీమను ఎక్కిపోయి దానిని స్వాధీనము చేసికొనెను. అతని అనుయాయులు నేటికిని ఆ సీమను ఆక్రమించుకొనియున్నారు.

10. అతని ఉదంతమును చూచి యిస్రాయేలీయులందరును ప్రభువును సేవించుట మంచిదని గ్రహించిరి.

11. న్యాయాధిపతులలో ప్రతివాడును సుప్రసిద్ధుడే. వారిలో ఎవడును విగ్రహారాధనకు పాల్పడలేదు. ఎవడును ప్రభువును విడనాడలేదు.

12. వారి సంస్మరణము దీవెనలను పొందునుగాక! ఆ పుణ్యపురుషులు సమాధులలోనుండి లేచి, మరల వారి అనుయాయులతో జీవింతురుగాక!

13. సమూవేలు ప్రభువునకు ప్రీతి పాత్రుడు. ప్రభువు ప్రవక్తగా అతడు రాచరికమును నెలకొల్పి దేవుని ప్రజలకు రాజులను నియమించెను.

14. అతడు ధర్మశాస్త్రము ప్రకారము ప్రజలకు తీర్పుజెప్పెను. కనుక దేవుడు ప్రజలను కాపాడెను.

15. విశ్వసనీయుడు గనుక ప్రజలు అతనిని నిజమైన ప్రవక్తగా గణించిరి. అతడి పలుకులను బట్టియే అతడు దీర్ఘదర్శి అని నమ్మిరి.

16. శత్రువులు తనను చుట్టుముట్టగా సమూవేలు సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్ధన చేసి, లేత గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించెను.

17. ప్రభువు ఆకాశము నుండి గర్జించెను. ఉరుముల ద్వారా తన ధ్వనిని విన్పించెను.

18. తూరు, ఫిలిస్తీయా దేశపాలకులైన శత్రునాయకులనెల్ల హతమార్చెను.

19. సమూవేలు కన్నుమూయకముందు తాను ఇతరులఆస్తిని, ఇతరుల చెప్పులనుగూడ అపహరింపలేదని దేవుని ఎదుటను, రాజు ఎదుటను ప్రమాణముచేసి చెప్పెను. అతని బాసకెవరును అడ్డురాలేదు.

20. అతడు చనిపోయిన పిదపకూడ ప్రవచించి రాజునకు అతని మరణము గూర్చి ముందే తెలిపెను. సమాధినుండి ప్రవచనము పలికి ప్రజల పాపములను తొలగించెను.

 1. సమూవేలు తరువాత నాతాను వచ్చెను. అతడు దావీదు కాలమున ప్రవక్తగానుండెను.

2. సమాధానబలిలో క్రొవ్వువలె యిస్రాయేలీయుల నుండి దావీదు ప్రత్యేకింపబడెను.

3. అతడు మేకపిల్లలతో ఆడినట్లు సింహములతో పోరాడెను. గొట్టిపిల్లలతో ఆడినట్లు ఎలుగుబంట్లతో తలపడెను

4. బాలుడుగా ఉన్నప్పుడే రాక్షస ఆకారుడైన ఫిలిస్తీయుని చంపి తన ప్రజలు అవమానమును బాపెను. ఒడిసెలతో రాయి విసిరి, గొల్యాతు గర్వమణచెను

5. దావీదు మహోన్నతుడైన ప్రభువును ప్రార్థింపగా ఆయన బలమును దయచేసెను. కనుక ఆ రాజు మహావీరుని చంపి తన ప్రజల శక్తిని విశదము చేసెను.

6. ప్రజలు అతడు పదివేలమందిని చంపెనని కొనియాడిరి. మరియు అతడు కిరీటమును స్వీకరింపగా ప్రభువు ఎన్నికకు నోచుకొనినవాడని అతనిని స్తుతించిరి.

7. అతడు చుట్టుపట్లనున్న శత్రువులనెల్ల హతమార్చెను. విరోధులైన ఫిలిస్తీయుల పీచమణచగా నేటివరకు వారు మరల తలయెత్తరైరి.

8. అతడు తానుచేయు పనులన్నిటను కృతజ్ఞతాభావముతో పవిత్రుడును, మహోన్నతుడునైన ప్రభువును స్తుతించెను. తన సృష్టికర్తయైన ప్రభువును ప్రేమించుచు, పూర్ణహృదయముతో ఆయనను కీర్తనలతో వినుతించెను.

9. పీఠమునెదుట గాయకులను నిలిపి వారిచే మధురమైన గీతములు పాడించెను.

10. ఏడాది పొడుగున పండుగలను నెలకొలిపి, వానిని వైభవోపేతముగా జరిపించెను. దినమంతయు దేవాలయము ప్రభునామస్తుతితో ప్రతిధ్వనించునట్లు చేసెను.

11. ప్రభువు దావీదు తప్పిదమును మన్నించి అతని రాజ్యాధికారమును సుస్థిరము చేసెను. అతనితో రాజ్యసంబంధమైన నిబంధనము చేసికొని అతని రాజ్యము నిత్యవైభవముగా కొనసాగునట్లు చేసెను.

12. దావీదు తర్వాత విజ్ఞానవేత్తయైన అతని పుత్రుడు రాజయ్యెను. తండ్రి సమస్తము సిద్ధము చేసి ఈయగా అతడు సురక్షితముగా జీవించెను.

13. సొలోమోను కాలమున యుద్దములు లేవు. అతని రాజ్యపు ఎల్లలందెల్ల శాంతి నెలకొనెను. కనుక అతడు ప్రభువు పేరిట శాశ్వతమైన మందిరమును నిర్మించెను.

14. “సొలోమోను! యువకుడివిగా ఉన్నప్పుడు నీవెంతటి విజ్ఞానివి నీ హృదయము వివేకముతో నదివలె నిండియుండెనుగదా!

15. నీ ప్రభావము ప్రపంచమంతటా వ్యాపించినది. నీ సామెతలు, పొడుపుకథలు ఎల్లెడల విన్పించినవి.

16. నీ పేరు దూరప్రాంత ద్వీపములకును ప్రాకియున్నది. శాంతిని నెలకొల్పినందులకు ప్రజలు నిన్ను ప్రేమించిరి.

17. నీ గేయములు, సామెతలు, ఉపమానములు, సూక్తులువిని లోకములోని జాతులెల్ల విస్తుపోయినవి.

18. యిస్రాయేలు దేవుడైన ప్రభువు పేరుమీదుగా నీవు బంగారమును తగరమువలె స్వీకరించితివి. వెండిని సీసమువలె కూడబెట్టితివి. - -

19. కాని నీవు నీ శరీరమును వనితలకు అప్పగించితివి నీవువారికి దాసుడవైతివి.

20. నీ కీర్తిని కళంకిత మొనర్చుకొంటివి. నీ వంశజులకు కూడ మచ్చతెచ్చితివి. నీవలన నీ అనుయాయులు దైవశాపములకు గురియైరి. నీ మూర్ఖత్వమునకుగాను వారు విచారమున మునిగిరి.

21. నీ రాజ్యము రెండుముక్కలుగా చీలిపోయెను. ఎఫ్రాయీము మండలమున శత్రురాజ్య మేర్పడెను”.

22. కాని ప్రభువు తనకృపను విడనాడడు. తన ప్రమాణములను వమ్ము చేయడు. . ఆయన తాను ఎన్నుకొనిన భక్తుని సంతతిని నాశనము చేయడు. తాను ప్రేమించిన సేవకుని అనుయాయులను రూపుమాపడు. కనుక ఆయన యాకోబునకు శేషజనమును మిగిల్చెను. దావీదునకు వంశాంకురమును వదలిపెట్టెను.

23. సొలోమోను తన పితరులను కలిసి కొనగా అతడి కుమారులలో ఒకడు రాజయ్యెను. రెహబాము మందబుద్ధి గలవాడు. ఆ నలు యిస్రాయేలీయులందరిలోను మూర్ఖుడు. అతడి పరిపాలన పద్ధతి నచ్చక ప్రజలు తిరుగబడిరి. యెరోబాము అటు తరువాత నెబాతు కుమారుడు యరోబాము యిస్రాయేలీయులచే పాపము చేయించెను.  ఎఫ్రాయీము తెగవారిని దుర్మార్గమున నడిపించెను

24. ఆ ప్రజల పాపములు పెచ్చుపెరిగిపోగా వారు స్వీయదేశమునుండి బహిష్కృతులైరి.

25. ఆ జనులుచేయని దుష్కార్యములేదు. కనుక ప్రభువు వారిని దండించెను.

 1. అటుపిమ్మట ఏలీయా నిప్పుమంటవలె పొడచూపెను, అతని పలుకులు దివిటీవలె మండెను.

2. అతడు కరువును కలిగించెను. అతని పట్టుదలవలన చాలమంది అసువులు కోల్పోయిరి.

3. ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము నాపివేసెను. మూడుమారులు అగ్నిని కురిపించెను.

4. ఏలియా! నీ అద్భుతములు ఎంత ఆశ్యర్యకరమైనవి! అట్టి కార్యములను ఇతరులెవరైన చేయగలరా? 

5. ప్రభువు పేరు మీదుగా నీవు చచ్చిన శవమును బ్రతికించితివి. పాతాళము నుండి అతనిని వెలుపలికి కొనివచ్చితివి

6. నీవు రాజులను, సుప్రసిద్ధులను మంచము పట్టించితివి. వారిని వ్యాధిగ్రస్తులను కావించి, మరణము పాలుచేసితివి.

7. సీనాయి కొండమీద నీవు ప్రభువు మందలింపులను ఆలించితివి. ఆయన శత్రువులను శిక్షించునని చెప్పిన మాటలను వింటివి.

8. ఆ శిక్షను నిర్వహించుటకు ఒక రాజును అభిషేకించితివి. నీ అనుయాయులుగా ప్రవక్తలను అభిషేకించితివి 

9. దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో, నిప్పు గుఱ్ఱములు లాగెడి రథమున మేఘములలోనికి గొనిపోయెను.

10. నీవు నిర్ణీత సమయమున తిరిగివచ్చి హెచ్చరికలు చేసెదవనియు, దేవునికోపము ప్రజ్వరిల్లకముందే దానిని చల్లార్చిదవనియు, తండ్రులకు, కుమారులకు రాజీ కుదిర్చెదవనియు యిస్రాయేలుతెగలను ఉద్దరించెదవనియు లేఖనములు నుడువుచున్నవి.

11. నీ ఆగమనమును దర్శించువారును, ప్రేమతో జీవించి చనిపోవువారును ధన్యులు. మనముకూడా జీవనమును పొందుదుము.

12. ఏలీయా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను. ఎలీషా జీవించినంతకాలము ఏ రాజును అతనిని భయపెట్టజాలడయ్యెను. ఎవరు అతనిని లొంగదీసికొనజాలరైరి.

13. ఎట్టి కార్యమును అతనికి కష్టమనిపించలేదు. చనిపోయినపిదప గూడ, అతని దేహము అద్భుతముచేసెను.

14. జీవించియున్నపుడు అతడు అద్భుతములు చేసెను చనిపోయినపుడు కూడ మహిమలు ప్రదర్శించెను.

15. ఇన్ని కార్యములు జరిగినను ప్రజలు పశ్చాత్తాపపడలేదు. తమ పాపములను విడనాడనులేదు. కనుక శత్రువులు వారిని సొంతదేశము నుండి గెంటివేసి నేల నాలుగుమూలల చెల్లాచెదరుచేసిరి కనుక వారు స్వీయదేశమున కొద్దిమంది మాత్రమే మిగిలిరి. ఆ కొద్దిమందిని దావీదు వంశజులు పరిపాలించిరి

16. ఆ ప్రజలలో కొందరు దేవునికి ప్రీతికలిగించు కార్యములు చేసిరి. ఇతరులు పాపము మూటకట్టుకొనిరి.

17. హిజ్కియా నగరమును సురక్షితము చేసి నీటిని సరఫరా చేయించెను. ఇనుప పనిముట్లతో కొండలో సొరంగము తొలిపించి నీటిని నిలువచేయుటకు చిన్నచెరువులు నిర్మించెను.

18. అతని పరిపాలన కాలమున సెన్హరీబు పట్టణము మీదికి ఎత్తివచ్చి తన ప్రధానోద్యోగిని పంపించెను. ఆ ఉద్యోగి యెరూషలేమును సవాలుచేసి, పొగరుబోతు తనముతో డంభములు పలికెను.

19. ప్రజలు ధైర్యముకోల్పోయి, భయకంపితులై ప్రసవ వేదనను అనుభవించు స్త్రీవలె వేదనపడిరి.

20. కాని వారు చేతులెత్తి కరుణాళుడైన దేవుని ప్రార్థించిరి. పవిత్రుడైన ప్రభువు ఆకాశము నుండి సత్వరమే వారి మొరను ఆలించెను. వారిని కాపాడుటకుగాను యెషయాను పంపెను

21. ప్రభువు అస్సిరీయుల సైన్యమును శిక్షించెను. అతని దూత వారిని సర్వనాశనము చేసెను.

22. హిజ్కియా ప్రభువునకు ప్రీతిగొల్పు కార్యములు చేసెను. తన వంశకర్తయైన దావీదు మార్గమున నడచెను. ప్రవక్త యెషయా ఆ రాజును అటు నడువ ఆజ్ఞాపించెను. ఆ మహా ప్రవక్త చూచిన దర్శనములు సత్యములు.

23. ఆ ప్రవక్త సూర్యుని వెనుకకు పంపెను. రాజు ఆయుస్సును పొడిగించెను.

24. అతడు దివ్యదృష్టితో భవిష్యత్తు సంఘటనలనుగాంచి యెరూషలేమున దుఃఖితులైయున్న వారిని ఓదార్చెను.

25. అతడు యుగాంతమునకు ముందు జరుగబోవు సంగతులు ఎరిగించెను. అంతవరకును జరుగక నిగూఢముగా కార్యములను తెలియజేసెను.

 1. యోషీయా పేరు నేర్పుతో తయారు చేసిన సాంబ్రాణి నుండి వెలువడు పొగవలె కమ్మగా నుండును. తేనెవలె తీయగా నుండును. ద్రాక్షసారాయపు విందునందలి సంగీతమువలె మధురముగా నుండును

2. అతడు దీక్షతో కృషిచేసి ప్రజల బుద్ధులు మార్చెను. ఘోరాచారమైన విగ్రహారాధనను రూపుమాపెను.

3. ప్రభువునకు నమ్మదగిన బంటయి, విశ్వాసము లేశమైన లేని రోజులలో భక్తిని పెంపొందించెను.

4. దావీదు, హిజ్కియా, యోషీయా తప్ప మిగిలిన రాజులెల్లరును ఘోరపాపములు చేసిరి. మహోన్నతుని ధర్మశాస్త్రమును అశ్రద్ధ చేసిరి. కనుకనే ఆ రాజులెల్లరు అంతరించిరి.

5. ఆ రాజులు అన్యజాతులకు లొంగిపోగా వారి కీర్తిప్రతిష్ఠలు వమ్మయిపోయెను.

6. అన్యులు పవిత్రనగరమును తగులబెట్టగా వీధులు నిర్మానుష్యమయ్యెను. ఈ సంఘటనను యిర్మీయా ముందే ప్రవచించెను.

7. ప్రభువు యిర్మీయాను మాతృగర్భమునుండే ప్రవక్తగా ఎన్నుకొనినను ప్రజలు అతనిని హింసించిరి. పెరికివేయుటకును, నాశనము చేయుటకును, నిర్మూలించుటకును, పునర్నిర్మించుటకును, నాటుటకుగూడ ప్రభువు అతనిని నియమించెను.

8. దేవదూతలతో గూడిన రథముమీద నెలకొనియున్న ప్రభువు మహిమను యెహెజ్కేలు దర్శనమున వీక్షించెను.

9. ప్రభువు తన శత్రువులను తమ వడగండ్ల వానకు అప్పగించెను. కాని ఋజుమార్గమున నడుచువారికి మేలుచేసెను

10. ద్వాదశప్రవక్తల అస్థికలు నూత్నజీవముతో లేచునుగాక! వారు యిస్రాయేలీయులను ఉత్సాహపరచిరి. నమ్మకమును, విశ్వాసమును పుట్టించి జనులను కాపాడిరి.

11. సెరుబ్బాబెలును ఎట్లు సన్నుతింపగలము? అతడు ప్రభువు కుడిహస్తముననొప్పు ముద్రాంగుళీకము వంటివాడు.

12. యెహోసాదాకు పుత్రుడు యెహోషువయు అట్టివాడే వారు ప్రభువు పవిత్రమందిరమును పునర్నిర్మించిరి అది శాశ్వతమైన కీర్తికి నోచుకొనిన ఆలయము.

13. నెహెమ్యా పేరుకూడ గొప్పదే. అతడు శిథిలమైపోయిన నగర ప్రాకారములు పునర్నిర్మించెను. ద్వారములు నిర్మించి వానికి గడెలు పెట్టించెను. నాశనమైపోయిన మన గృహములను కూడా మరల కట్టించెను.

14. ఈ భూమి మీద సృజింపబడినవారిలో హనోకుతో సమానమైనవాడు లేడు. ప్రభువు అతనిని నేలమీదినుండి కొనిపోయెను.

15. లోకములో జన్మించిన వారిలో యోసేపు వంటివాడులేడు. అతడు తన సోదరులకు నాయకుడు, తన ప్రజలకు ఆదరువు. అతని అస్తులకు కూడ కీర్తి అబ్బెను.

16. షేము, సేతు కీర్తిని పొందిరి. కాని ఆదాము కీర్తి ఏ నరునికిని అబ్బలేదు.

 1. ఓనీయా కుమారుడును ప్రధాన యాజకుడైన సీమోను దేవాలయమును మరమ్మతు చేయించి దృఢపరచెను.

2. ఎత్తున నున్న రెండువరుసల ప్రాకారమునకు పునాదులు వేసినదియు అతడే. దేవాలయముచుట్టు బురుజులు కట్టించినదియు అతడే.

3. అతడు యాజకుడుగానున్న కాలమున సొలోమోను కంచుతొట్టియంతటి జలాశయమును త్రవ్విరి.

4. అతడు శత్రువుల ముట్టడినుండి ప్రజలను కాపాడగోరి నగరమును సురక్షితము చేసెను.

5. దేవాలయ అంతర్భాగపు తెరనుండి వెలుపలికి వచ్చినపుడు సీమోను మహామహిమతో వెలుగొందెడివాడు.

6. మబ్బులగుండ మెరయు ఉదయకాల నక్షత్రమువలెను, పూర్ణచంద్ర బింబమువలెను,

7. మహోన్నతుని దేవాలయము మీద ప్రకాశించు సూర్యబింబమువలెను, మేఘములమీద కాంతితో మెరయు రంగులధనుస్సువలెను,

8. వసంతకాలపు గులాబీలవలెను, జలధారచెంత వికసించు లిల్లీ పూలవలెను, వేసవిలో లెబానోనున ఎదుగు దేవదారువలెను,

9. ధూపకలశమునుండి వెలువడు సాంబ్రాణి పొగవలెను, పోతపోసి తీసిన బంగారముతో చేయబడి నానావిధ రత్నములతో పొదుగబడిన పానపాత్ర వలెను,

10. ఫలములతో నిండిన ఓలివువృక్షమువలెను, మేఘములవరకు ఎదిగిన దేవదారు తరువువలెను సీమోను ప్రకాశించెను.

11. సీమోను ప్రశస్తమైన ఆరాధనవస్త్రములను ధరించి వైభవముతో పవిత్రమైన పీఠముమీదికి ఎక్కినపుడు దేవాలయ ఆవరణమంతయు తేజస్సుతో నిండిపోయెడిది.

12. సహాయ అర్చకులు తన చుట్టును బృందముతీరి ఉండగా, అతడు పీఠముకొనన నిలుచుండి, యాజకులు అర్పించు బలి అర్పణములను స్వీకరించునపుడు, చుట్టును ఖర్జూర వృక్షములు కమ్ముకొని ఉండగా వాని మధ్యనున్న లెబానోను దేవదారు మొక్కవలె చూపట్టెను.

13. అహరోను అనుయాయులైన యాజకులు ప్రశస్త వస్త్రములు ధరించి దేవునికి అర్పింపవలసిన బలిఅర్పణములు చేతబూని యిస్రాయేలు సమాజము ముందట నిలుచుండెడివారు.

14. సీమోను మహోన్నతుడైన దేవునికి బలినర్పించి పీఠము మీది ఆరాధనమును ముగించిన పిదప

15. సంతర్పణ పాత్రము తీసికొని సువాసనలొలుకు ద్రాక్షాసారాయమును మహోన్నతుడును, మహారాజునునైన దేవునికి అర్పణగా పీఠముపాదున కుమ్మరించెడివాడు.

16. అప్పుడు అహరోను కుమారులు పెద్దగా నాదముచేసి పోతపోసి తీసిన వెండితో చేయబడిన బూరలను ఊదెడివారు. వారు చేసిన మహానాధమును ప్రభువు ఆలించెడివాడు.

17. వెంటనే జనులెల్లరు శిరస్సును నేలమీదికి వంచి సర్వశక్తిమంతుడును, మహోన్నతుడునైన ప్రభువును ఆరాధించెడివారు.

18. అంతట గాయకబృందము మధుర సంగీతముతో ప్రభుని స్తుతించి కీర్తించెడిది.

19. ఆరాధన ముగియువరకు ప్రజలెల్లరు కరుణాళువును, మహోన్నతుడనైన ప్రభువునకు మొర పెట్టి విన్నపములు చేసెడివారు.

20. అప్పుడు సీమోను పీఠము మీదినుండి దిగివచ్చి యిస్రాయేలు సమాజముపై చేతులు చాచి, ప్రభువు దివ్యనామమును ఉచ్చరించి, ప్రజలను దీవించెడివాడు.

21. ప్రజలు మరల ఆరాధనపూర్వకముగా శిరమువంచి మహోన్నతుని దీవెనలను స్వీకరించెడివారు.

22. సమస్తమును సృజించిన ప్రభువును కొనియాడుడు. సర్వత్ర మహాకార్యములుచేసిన దేవుని కీర్తింపుడు. ఆయన మనము పుట్టినప్పటినుండియు మనలను హెచ్చించి కరుణతో ఆదరించెను.

23. ప్రభువు మనకు ఆనందము దయచేయుగాక! మన యిస్రాయేలీయులకు సదా శాంతిని ప్రసాదించుగాక!

24. ఆయన మనలను ఎల్లవేళల కరుణతో పోషించుగాక! ఆపదలో మనలను కాపాడుగాక!

25. నేను అసహ్యించుకొను జాతులు రెండు కలవు. మూడవది అసలు జాతియే కాదు.

26. సేయీరు కొండపై నుండువారు, ఫిలిస్తీయులు, మూర్ఖులైన షెకెము నివాసులు.

27. యెరూషలేము నివాసి సీరా ఎలియెజెరు . పుత్రుడను యేసు నామధేయుడనైన నేను విజ్ఞానమును, వివేకమును పొందుపరచుటకు గాను ఈ గ్రంథమును లిఖించితిని. విజ్ఞానము నా హృదయమునుండి జాలువారినది.

28. ఈ ఉపదేశమును చేకొనువాడు ధన్యుడు. దీనిని స్వీకరించువాడు జ్ఞాని అగును.

29. ఈ ఉపదేశమును పాటించువాడు  ఎట్టి సంఘటననైనను తట్టుకొనగలడు అతడు దేవుని వెలుగులో నడచును.

 1. రాజువైన ప్రభూ! నేను నిన్ను స్తుతించెదను. రక్షకుడవైన దేవా! నేను నిన్ను కొనియాడెదను, నిన్ను కీర్తించెదను.

2. నీవు నాకు సాయముచేసి నన్ను కాపాడితివి. మృత్యువునుండి నన్ను తప్పించితివి. కొండెములనుండియు, అపదూరులనుండియు నన్ను సంరక్షించితివి. శత్రువులబాధ నుండి నాకు విముక్తి దయచేసితివి.

3. నీ కరుణతోను, మహిమతోను నన్నుకాచితివి. నన్ను మ్రింగనున్న విషపు కోరలనుండియు, నా ప్రాణములు తీయనున్న వారినుండియు, నా కెదురైన నానాయాతనల నుండియు,

4. నన్ను చుట్టుముట్టిన మంటలనుండియు, నేను రగిలింపకయే ప్రజ్వరిల్లిన జ్వాలలనుండియు,

5. అగాధపు పాతాళమునుండియు, దుష్టులు నా మీద రాజుకు చెప్పిన కొండెముల నుండియు నీవు నన్ను కాపాడితివి.

6. నేనొక పర్యాయము మృత్యువునెదుర్కొంటిని. పాతాళపు అంచులవరకు వెళ్ళితిని.

7. శత్రువులు నన్ను చుట్టుముట్టగా, ఎవరైన నన్ను రక్షింతురేమోయని ఎదురు చూచితినిగాని, ఎవరు నన్నాదుకోరైరి.

8. ప్రభూ! అప్పుడు నేను నీ కరుణను జ్ఞప్తికి తెచ్చుకొంటిని. పూర్వము నీవు చేసిన కార్యములనుస్మరించుకొంటిని నిన్ను నమ్మినవారిని నీవు ఆదుకొందువనియు, శత్రువులనుండి కాపాడుదువనియు విశ్వసించితిని.

9. వెంటనే ఈ భూమి మీది నుండి నీకు ప్రార్థన చేసితిని. మృత్యువునుండి నన్ను కాపాడుమని వేడుకొంటిని.

10. నేనిట్లు మనవి చేసితిని: “ప్రభూ! నీవు నాకు తండ్రివి, ఈ ఆపదలలో నన్ను చేయి విడువకుము. అహంకారులైన శత్రువులు నన్నెదిరించిరి. నీవు నన్ను విడనాడకుము.

11. నేను నిన్ను ఎల్లవేళల స్తుతించెదను. కృతజ్ఞతతో నీకు వందనములు అర్పించెదను. ఇట్లు మనవిచేయగా నీవు నా మొరనాలించితివి.

12. నన్ను మృత్యువునుండి కాపాడితివి. కీడునుండి నన్ను రక్షించితివి. కనుక నేను నిన్ను స్తుతించి, కీర్తించెదను. ప్రభూ! నేను నిన్ను కొనియాడెదను.

13. నేను బాలుడుగానున్నపుడే, దేశ సంచారములకు పూనుకొనక పూర్వమే, ధైర్యముగా విజ్ఞానము కొరకు ప్రార్థించితిని.

14. దేవాలయమునకు వెళ్ళి ఆ వరముకొరకు మనవి చేసితిని. నేను బ్రతికియున్నంతకాలము విజ్ఞానమును వెదకెదను.

15. యవ్వనము నుండి వార్థక్యము వరకును నా హృదయము విజ్ఞానమును ఆశించెను. బాల్యము నుండియు నేను వివేకమార్గముననే నడచితిని.

16. నేను విజ్ఞానమునకు చెవియొగ్గగనే, అది నాకు దొరికెను. ఉపదేశమును సమృద్ధిగా సంపాదించితిని.

17. విజ్ఞానార్జనమునందు అభివృద్ధి గాంచితిని. నాకు వివేకమును దయచేసిన దేవునికి వందనములు.

18. నేను విజ్ఞానిగా జీవింపనిశ్చయించుకొంటిని. మంచిని సాధింపగోరితిని. గనుక నేనెన్నడును నిరాశచెందను.

19. నేను విజ్ఞానముకొరకు పోరాడితిని. విశుద్ధవర్తనమును అలవరుచుకొంటిని. దేవునికి ప్రార్థనచేసి నేను ఎంతటి అజ్ఞానినో తెలిసికొంటిని.

20. కాని నేను విజ్ఞానమును అభిలషించితిని. నిర్మల హృదయమును అలవరచుకొని దానిని సాధించితిని. దానిని ఆర్జించినప్పటినుండి వివేకవంతుడనైతిని. ఇక నేను దానిని విడనాడను.

21. నా హృదయము దానిని గాఢముగా వాంఛించెను, కనుక నాకు గొప్పనిధి లభించెను.

22. ప్రభువు నాకు వాక్చక్తిని ప్రసాదించెను. ఆ శక్తితో నేను అతనిని కీర్తించితిని.

23. ఉపదేశమును అభిలషించు వారు నా యొద్దకు వచ్చి, నా పాఠశాలలో దానిని నేర్చుకొనుడు.

24. మీకు ఉపదేశము లభింపలేదని తెలిసియు మీ హృదయములోని కోరికను తీర్చుకొనరేల?

25. నా ప్రకటనమిది: డబ్బు వెచ్చింపకయే విజ్ఞానమును కొనుడు.

26. విజ్ఞానమునకు లొంగి దానిని సంపాదింపుడు. దానికొరకు మీరు దూరము వెళ్ళనక్కరలేదు.

27. నా విషయమునే చూడుడు. కొద్దిపాటియత్నముతోనే నేనింతటి చిత్తశాంతిని పొందగలిగితిని.

28. మీరు చాల వెండిని వెచ్చించియైన విజ్ఞానమును కొనుడు. కడన మీకు అది బంగారమును సంపాదించి పెట్టును.

29. మీరు ప్రభువు కరుణను తలచుకొని సంతసింపుడు. ఆయనను స్తుతించుటకెన్నడును సిగ్గుపడకుడు.

30. సకాలమునకు మునుపే మీ పనిని మీరు చేసినచో ఉన్నతకాలమున ప్రభువు మిమ్ము బహూకరించును.