Sirach Chapter 47 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 47వ అధ్యాయము
1. సమూవేలు తరువాత నాతాను వచ్చెను. అతడు దావీదు కాలమున ప్రవక్తగానుండెను.
2. సమాధానబలిలో క్రొవ్వువలె యిస్రాయేలీయుల నుండి దావీదు ప్రత్యేకింపబడెను.
3. అతడు మేకపిల్లలతో ఆడినట్లు సింహములతో పోరాడెను. గొట్టిపిల్లలతో ఆడినట్లు ఎలుగుబంట్లతో తలపడెను
4. బాలుడుగా ఉన్నప్పుడే రాక్షస ఆకారుడైన ఫిలిస్తీయుని చంపి తన ప్రజలు అవమానమును బాపెను. ఒడిసెలతో రాయి విసిరి, గొల్యాతు గర్వమణచెను
5. దావీదు మహోన్నతుడైన ప్రభువును ప్రార్థింపగా ఆయన బలమును దయచేసెను. కనుక ఆ రాజు మహావీరుని చంపి తన ప్రజల శక్తిని విశదము చేసెను.
6. ప్రజలు అతడు పదివేలమందిని చంపెనని కొనియాడిరి. మరియు అతడు కిరీటమును స్వీకరింపగా ప్రభువు ఎన్నికకు నోచుకొనినవాడని అతనిని స్తుతించిరి.
7. అతడు చుట్టుపట్లనున్న శత్రువులనెల్ల హతమార్చెను. విరోధులైన ఫిలిస్తీయుల పీచమణచగా నేటివరకు వారు మరల తలయెత్తరైరి.
8. అతడు తానుచేయు పనులన్నిటను కృతజ్ఞతాభావముతో పవిత్రుడును, మహోన్నతుడునైన ప్రభువును స్తుతించెను. తన సృష్టికర్తయైన ప్రభువును ప్రేమించుచు, పూర్ణహృదయముతో ఆయనను కీర్తనలతో వినుతించెను.
9. పీఠమునెదుట గాయకులను నిలిపి వారిచే మధురమైన గీతములు పాడించెను.
10. ఏడాది పొడుగున పండుగలను నెలకొలిపి, వానిని వైభవోపేతముగా జరిపించెను. దినమంతయు దేవాలయము ప్రభునామస్తుతితో ప్రతిధ్వనించునట్లు చేసెను.
11. ప్రభువు దావీదు తప్పిదమును మన్నించి అతని రాజ్యాధికారమును సుస్థిరము చేసెను. అతనితో రాజ్యసంబంధమైన నిబంధనము చేసికొని అతని రాజ్యము నిత్యవైభవముగా కొనసాగునట్లు చేసెను.
12. దావీదు తర్వాత విజ్ఞానవేత్తయైన అతని పుత్రుడు రాజయ్యెను. తండ్రి సమస్తము సిద్ధము చేసి ఈయగా అతడు సురక్షితముగా జీవించెను.
13. సొలోమోను కాలమున యుద్దములు లేవు. అతని రాజ్యపు ఎల్లలందెల్ల శాంతి నెలకొనెను. కనుక అతడు ప్రభువు పేరిట శాశ్వతమైన మందిరమును నిర్మించెను.
14. “సొలోమోను! యువకుడివిగా ఉన్నప్పుడు నీవెంతటి విజ్ఞానివి నీ హృదయము వివేకముతో నదివలె నిండియుండెనుగదా!
15. నీ ప్రభావము ప్రపంచమంతటా వ్యాపించినది. నీ సామెతలు, పొడుపుకథలు ఎల్లెడల విన్పించినవి.
16. నీ పేరు దూరప్రాంత ద్వీపములకును ప్రాకియున్నది. శాంతిని నెలకొల్పినందులకు ప్రజలు నిన్ను ప్రేమించిరి.
17. నీ గేయములు, సామెతలు, ఉపమానములు, సూక్తులువిని లోకములోని జాతులెల్ల విస్తుపోయినవి.
18. యిస్రాయేలు దేవుడైన ప్రభువు పేరుమీదుగా నీవు బంగారమును తగరమువలె స్వీకరించితివి. వెండిని సీసమువలె కూడబెట్టితివి. - -
19. కాని నీవు నీ శరీరమును వనితలకు అప్పగించితివి నీవువారికి దాసుడవైతివి.
20. నీ కీర్తిని కళంకిత మొనర్చుకొంటివి. నీ వంశజులకు కూడ మచ్చతెచ్చితివి. నీవలన నీ అనుయాయులు దైవశాపములకు గురియైరి. నీ మూర్ఖత్వమునకుగాను వారు విచారమున మునిగిరి.
21. నీ రాజ్యము రెండుముక్కలుగా చీలిపోయెను. ఎఫ్రాయీము మండలమున శత్రురాజ్య మేర్పడెను”.
22. కాని ప్రభువు తనకృపను విడనాడడు. తన ప్రమాణములను వమ్ము చేయడు. . ఆయన తాను ఎన్నుకొనిన భక్తుని సంతతిని నాశనము చేయడు. తాను ప్రేమించిన సేవకుని అనుయాయులను రూపుమాపడు. కనుక ఆయన యాకోబునకు శేషజనమును మిగిల్చెను. దావీదునకు వంశాంకురమును వదలిపెట్టెను.
23. సొలోమోను తన పితరులను కలిసి కొనగా అతడి కుమారులలో ఒకడు రాజయ్యెను. రెహబాము మందబుద్ధి గలవాడు. ఆ నలు యిస్రాయేలీయులందరిలోను మూర్ఖుడు. అతడి పరిపాలన పద్ధతి నచ్చక ప్రజలు తిరుగబడిరి. యెరోబాము అటు తరువాత నెబాతు కుమారుడు యరోబాము యిస్రాయేలీయులచే పాపము చేయించెను. ఎఫ్రాయీము తెగవారిని దుర్మార్గమున నడిపించెను
24. ఆ ప్రజల పాపములు పెచ్చుపెరిగిపోగా వారు స్వీయదేశమునుండి బహిష్కృతులైరి.
25. ఆ జనులుచేయని దుష్కార్యములేదు. కనుక ప్రభువు వారిని దండించెను.