1. యేసుక్రీస్తు సేవకులగు పౌలు తిమోతిలు వ్రాయునది: సంఘాధిపతులకును, పరిచారకులకును, క్రీస్తుయేసునందు విశ్వాసముగల ఫిలిప్పీయందలి సమస్త దైవజనులకును,
2. మన తండ్రియగు దేవునినుండియు, ప్రభువగు యేసుక్రీస్తునుండియు కృప,శాంతి కలుగునుగాక!
3. మిమ్ము స్మరించినప్పుడెల్లను, మీ కొరకై నా దేవునకు కృతజ్ఞతలను అర్పింతును.
4. నేను మీ అందరికొరకై ప్రార్థించునపుడెల్లను ఎంతయో సంతోషముతో ప్రార్థించుచుందును.
5. ఏలయన, మొదటినుండి ఇప్పటివరకు సువార్తా కృషియందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణం.
6. కనుక మీయందు ఇంతటి మంచివనిని ప్రారంభించిన దేవుడు, క్రీస్తుయేసు దినమున అది సంపూర్ణమగువరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను.
7. మీకు ఎప్పుడును నా హృదయమున స్థానమున్నది. కనుక మిమ్ము గూర్చి నేను ఈ విధముగ భావించుట యుక్తమే. నేను చెరయందున్న ఈనాడును, సువార్తకొరకు వాదించి సుస్థిరము చేసిన ఆనాడునూ, మీరు నాతో భాగస్తులైతిరి.
8.యేసుక్రీస్తు హృదయమునుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యం .
9. జ్ఞానముతోను, అన్ని విధములగు వివేచనతోను మీ ప్రేమ వర్ధిల్లాలనియే నేను ప్రార్థించుచున్నాను.
10. అందువలన, మీరు ఉత్తమమైన దానినే ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషము లేనివారును, నిర్దోషులుగా ఉండ గలుగుదురు.
11. దేవుని మహిమ స్తుతులకొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు నీతిఫలములచే మీ జీవితములు నింపబడును.
12. సోదరులారా! నాకు సంభవించిన విషయములు నిజముగ సువార్త పురోగమనమునకు తోడ్పడినవని మీరు తెలిసికొనవలెనని నా వాంఛ.
13. తత్పలితముగ క్రీస్తు సేవకుడను అగుటచేతనే నేను చెరయందు ఉంటినని, ఇచ్చటి చక్రవర్తి కావలివారికిని, తదితరులకును, అందరకును తెలియును.
14. నేను చెరయందు ఉండుట, మన సోదరులలో పెక్కుమందికి ప్రభువునందు విశ్వాసమును అధికము చేసినది. కనుక దేవుని వాక్కును బోధించుటలో వారు భయములేక మరింత ధైర్యమును కలిగియున్నారు.
15. నిజమునకు, వారిలో కొందరు అసూయా పరులై కలహస్వభావముతో క్రీస్తును బోధింతురు. కాని తదితరులు మంచి ఉద్దేశముతో బోధించుచున్నారు.
16. ఈ రెండవ వర్గమువారు ప్రేమచేతనే అటుల చేయుదురు. ఏలయన, సువార్త పక్షమున వాదించు బాధ్యతను దేవుడు నాకు ఒప్పగించెనని వారు ఎరుగుదురు.
17. మొదటి వర్గము వారు నిజాయితీగ క్రీస్తును గూర్చి ప్రకటింపరు. కేవలము పక్షపాతముతో మాత్రమే వారు అటుల చేయుదురు. నేను చెరయందుండగా నాకు అధిక కష్టమును కలిగించుచున్నామని వారు భావింతురు.
18. అది అంత పట్టించుకొనవలసిన విషయము కాదు! అంతేగాక అది నాకు సంతోషదాయకము. ఏలయన, సత్సంకల్పముచేగాని లేక మరియొక విధ ముగాగాని ఎటులైనను సర్వవిధముల క్రీస్తునే బోధించుచున్నారుగదా! కనుక నేను సంతోషించెదను.
19. ఏలయన, మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు ఆత్మనుండి లభించు సాయము తోడను, నేను విముక్తుడను అగుదునని నాకు తెలియును.
20. నా విధి నిర్వహణలో నేను ఎట్టిలోటును చేయరాదని నా గాఢమైన అభిలాష, నమ్మిక. అంతేకాక, అన్ని సమయములందును, ప్రత్యేకించి, ఈ సమయమున సంపూర్ణ ధైర్యముతోనుండి, నేను జీవించినను, మరణించినను నా సర్వస్వము ఉపయోగించి క్రీస్తునకు గౌరవమును కలిగించెదను.
21. ఎందుకనగా నా మట్టుకు జీవించడమే క్రీస్తు, మరణించడమే లాభము.
22. కాని సజీవుడనై ఎక్కువ ఉపయోగకరమైన పనులను నేను నిర్వహింపగలిగినచో, దేనిని ఎన్నుకొనవలయునో నాకు తెలియదు.
23. నేను ఇరుప్రక్కల చిక్కుకొంటిని. ఈ జీవితమును త్యజించి క్రీస్తును చేరవలెనని నేను గాఢముగా వాంఛించుచున్నాను. అది ఉత్తమమైనదే.
24. నేను జీవించియుండుట మీకు మరింత అవసరము.
25. అందులో సందేహము లేదు. కనుక నేను జీవించియే ఉందునని నాకు తెలియును. విశ్వాసమునందలి మీ పురోగమనమునకును, అనందమునకును తోడ్పడుటకై నేను మీ అందరితో పాటు జీవించి ఉండెదను.
26. కనుక నేను మిమ్ము మరల కలసికొనినపుడు, యేసుక్రీస్తునందు నన్ను గూర్చి అధికముగా గర్వించగలుగుదురు.
27. కనుక, మీ జీవితవిధానము క్రీస్తు సందేశా నుసారముగ ఉండవలెను అనునదియే ప్రస్తుత ముఖ్యాంశము. ఏలయన, నేను మిమ్ము కలిసికొన గలిగినను లేకున్నను సువార్తయందలి విశ్వాసమునకై ఏకాభిప్రాయముతో మీరు అందరును ఒకటిగా నిలిచి కలిసి పోరాడుదురని వినగలను.
28. మీ శత్రువులను గూర్చి భయపడకుడు. ఇదియే వారి వినాశనమునకు గుర్తు. కాని అది మీ రక్షణకు, మరియు అది దేవుని నుండియే అనుటకు నిదర్శనము.
29. క్రీస్తునందు విశ్వాసము కలిగియుండుట మాత్రమేకాక, ఆయన కొరకై శ్రమలను అనుభవించుటకు, మీకు విశేషమైన అవకాశము ప్రసాదింపబడినది.
30. కనుక ఇప్పుడు మీరు పోరాటములో నాతో పాల్గొనవచ్చును. ఆ పోరాటము పూర్వమునుండియు నేను చేయుచున్నదే. మీరు చూచితిరికదా! ఆ నా పోరాటము ఇప్పటికిని కొనసాగుచునేయున్నది. మీరు విని ఉన్నారుగదా!
1. క్రీస్తునందలి మీ జీవితము మిమ్ము బలపరచు చున్నచో, ఆయన ప్రేమ మిమ్ము ఊరడించుచున్నచో, ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో, మీలో ఒకరియెడల ఒకరికి దయకనికరములు ఉన్నచో,
2. ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి ఒక్కదాని యందే మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయుడు.,
3. స్వార్దముతోగాని, అహంభావముతో గాని ఎట్టి పనియు చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటె అధికులుగా భావింపుడు.
4. ప్రతి ఒక్కరు కేవలము స్వార్ధమునే చూచుకొనక, పరస్పరము ఉపకారులై ఉండవలెను.
5. క్రీస్తుయేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు:
6. ఆయన ఎల్లప్పుడును. దైవస్వభావమును కలిగిఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్ధబుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము.
7. కాని ఆయన తన్నుతాను రిక్తుని చేసికొని, సేవక రూపమును దాల్చి మానవమాత్రుడుగా జన్మించెను.
8. ఆయన అన్నివిధముల మానవమాత్రుడై ఉండి, అంతకంటె వినయముగలవాడై, మరణమువరకును, సిలువపై మరణము వరకును, విధేయుడాయెను.
9. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటె ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను.
10. అందువలననే పరలోక భూలోక పాతాళలోకములయందలి సమస్త జీవులును క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను.
11. పితయగు దేవుని మహిమార్థమై, యేసు క్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను.
12. కనుక ప్రియ మిత్రులారా! నేను మీతో ఉన్నపుడు మీరు నాకు విధేయులై ఉన్నదానికంటె, నేను మీకు దూరముగా ఉన్న ఇప్పుడు మీరు నాకు విధేయులైయుండుట అత్యవసరము. భయముతోను వణుకుతోను మీ రక్షణముకై శ్రమింపుడు.
13. ఏలయన, ఆయన ఉద్దేశమునకు, మీరు విధేయులై సమ్మతించునట్లు చేయుటకు దేవుడు మీయందు కార్యసిద్ధిని కలిగించుచున్నాడు.
14. మీరు అన్ని పనులను సణుగుకొనక, వివాదములు లేకుండ చేయుడు.
15. అప్పుడు నీచు లును, వక్రబుద్దులుగల ఈ లోకములో, మీరు దేవుని సుపుత్రులవలె నిరపరాధులుగను, పరిశుద్ధులుగను ఉందురు.
16. మీరు జీవవాక్కునకు అంటిపెట్టుకొని వారిమధ్య ప్రకాశవంతమైన దీపికలవలె వెలుగొందు దురు. మీరు అటుల చేసినచో క్రీస్తుదినమున మిమ్ము గూర్చి నేను గర్వించుటకు కారణము ఉండును. ఏలయన నా ప్రయత్నముగాని, కృషిగాని వ్యర్థము కాలేదని అది నిరూపించును.
17. ఒకవేళ మీ విశ్వాసమనెడు బల్యర్పణపై నన్ను నేను ఒక పానబలిగా ధారపోయవలసినప్పటికిని, నేను ఆనందించి మీ అందరితో కూడ సంతోషింతును.
18. అటులనే మీరును ఆనందించి నాతో సంతోషింపుడు.
19. మీ సమాచారము తెలిసికొని సంతోషించుటకు తిమోతిని త్వరలోనే మీవద్దకు పంపగలనని యేసు ప్రభువునందు నేను నమ్ముచున్నాను.
20. మీ యందు నిజముగ శ్రద్ధగలవాడును, నా భాగములో పాలుపంచుకొనువాడును అతనొక్కడే.
21. ఇతరు లందరును ఎవరిపనులు వారు చూచుకొందురు. యేసుక్రీస్తు కార్యమునందు శ్రద్ధలేదు.
22. తిమోతి తన యోగ్యతను ఎట్లు నిరూపించెనో మీరు ఎరుగు దురు. తండ్రికి కుమారుడు సేవచేయునట్లు అతడు సువార్తకొరకై నాతో కలిసి పనిచేసెను.
23. నా విషయము ఎట్లుండగలదో తెలిసినంతనే, అతనిని మీ వద్దకు పంపగలనని అనుకొనుచున్నాను.
24. నేనే త్వరలో మిమ్ము చేరగలనని ప్రభువునందు నాకు నమ్మకము కలదు.
25. మరియు నా సోదరుడు, తోటి పనివాడు, యోధుడు, మీ దూతయు, నా అవసరమునకు ఉపక రించిన వాడైన ఎపప్రోదితును, ఇప్పుడు మీ వద్దకు తిరిగిపంపుట అవసరమని తోచినది.
26. మిమ్ము అందరిని చూడవలెనని అతనికి చాల కోరికగ ఉన్నది. అతని అనారోగ్యస్థితిని గూర్చి మీరు వినియున్నారని కలవరపడుచున్నాడు.
27. అతడు నిజముగా వ్యాధితో మరణావస్థలో ఉన్నాడు. కాని దేవుడు అతనిపై కనికరము వహించినాడు. అతని పైననే కాదు, నా మీదను కృప చూపినాడు. అధికమగు దుఃఖమునుండి నన్ను కాపాడినాడు.
28. కనుకనే అతనిని మీ వద్దకు తిరిగి పంపవలెనని మరింత గాఢముగ అభిలషించుచు న్నాను. అతనిని చూచి మీరు సంతోషింపగలరు. నా విచారము కూడ ఉపశమించును.
29. కనుక ప్రభువు నందు సంతోషముతో అతనికి స్వాగతమిండు. అట్టి వారిని గౌరవింపుడు.
30. ఏలయన, మీరు చేయలేని సాయమును అతడు నాకు చేసి, క్రీస్తు కార్యార్ధమై తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక చావసిద్ధమైనాడు.
1. సోదరులారా! ప్రభువునందు ఆనందింపుడు. పూర్వము వ్రాసినదానినే తిరిగి వ్రాయుటకు నాకు విసుగులేదు. పైగా అది మీకు క్షేమము.
2. కుక్కలను గూర్చి జాగ్రత్తపడుడు. దుష్టకార్యములను చేయువారిని గురించి మెలకువగా ఉండుడు. సున్నతి చేసికొను వారిని గూర్చి జాగ్రత్తపడుడు.
3. నిజమైన సున్నతిని పొందినది మనమేగాని వారు కాదు. ఏలయన, మనము దేవుని యొక్క ఆత్మద్వారా దేవుని పూజింతుము. మన యేసు క్రీస్తునందలి జీవితమున మనము ఆనందింతుము గదా! బాహ్య ఆచారములయందు మనకు ఎట్టి నమ్మకము లేదు.
4. నిజమునకు నేను అట్టి విషయములను విశ్వసింపవచ్చును. ఏలయన, బాహ్యాచారములతో క్షేమముగ ఉండగలనని ఎవడైనను అనుకొనినచో, నేను అటుల అనుకొనుటకు నాకు మరింత ఎక్కువ కారణము ఉన్నది.
5. నేను పసిబిడ్డగా ఉన్నప్పుడే ఎనిమిదవ రోజున నాకు సున్నతి కావింపబడినది. పుట్టుకచే యిస్రాయేలీయుడను, బెన్యామీను గోత్రీయుడను. స్వచ్ఛమైన రక్తము ప్రవహించుచున్న హెబ్రీయుడను, యూదుల ధర్మశాస్త్రమును అనుసరించు విషయమున నేను పరిసయ్యుడను.
6. నా మత ఆసక్తిచే దైవసంఘమును హింసించితిని. ధర్మశాస్త్రమునకు విధేయుడై, మానవుడు నీతిమంతుడు అగుటకు ఎంత అవకాశము ఉన్నదో, అంత వరకు నేను నిర్దోషిని.
7. కాని నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నింటిని క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కించుకొనుచున్నాను.
8. వానిని మాత్రమేగాక అంతకంటె అధికమైన విలువ గల దానికై అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగనే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటిని చెత్తగ భావించుచున్నాను.
9. ధర్మశాస్త్రమునకు విధేయుడనైనందువలన పొందదగినదియు, నాదని చెప్పుకొనదగినదియు అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తునందలి విశ్వాసమువలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవునినుండి కలుగునదై, విశ్వాసముపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణముగ ఐక్యము పొందవలెనని నా కోరిక.
10. క్రీస్తును తెలిసికొనవలెననియు, ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెననియు నావాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలెననియు, మృత్యువునందు ఆయనను పోలియుండవలయుననియు మాత్రమే నా కోరిక.
11. సాధ్యమగునేని మృతులలోనుండి పునరుత్థానము పొందవలెనన్నదే నా ఆశ.
12. దీనిలో నేను ఉత్తీర్ణుడనైతిననిగాని, పరిపూ ర్ణుడనైతిననిగాని చెప్పుకొనను. కాని, దానికొరకై సదా ప్రయత్నించెదను. ఏలయన, నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని.
13. సోదరులారా! నిజమునకునేను ఇప్పటికే దానిని చేరితినని అనుకొనుటలేదు. కాని నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. ఏమన, గతమును మరచి ముందున్నదానిని చేరుటకు తీవ్రముగ కృషి చేయుచున్నాను.
14. కనుక, బహుమానమును గెలుచుకొనుటకు నేను ధ్యేయము వంకకు సూటిగా పరుగిడుదును. పరలోక జీవితమునకై క్రీస్తుయేసు ద్వారా వచ్చు దేవుని పిలుపే ఆ బహుమానము.
15. ఆధ్యాత్మికముగ పరిపక్వ దశకు చెందిన మనమందరము ఇట్టి మనస్తత్వమునే కలిగి ఉండవలెను. కాని, ఒకవేళ మీకు ఏమైన భిన్నాభిప్రాయాలు ఉన్నచో దేవుడే దీనిని మీకు స్పష్టము చేయును.
16. అది ఎటులైనను, మనము ఇప్పటి వరకును పాటించుచున్న నియమములతోనే ముందుకు సాగిపోదము.
17. సోదరులారా! మీరు అందరు నన్ను అనుస రించుచునే ఉండుడు. మేము చూపిన సదాదర్శమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండుడు.
18. క్రీస్తు సిలువ మరణమునకు శత్రువులుగ జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పియుంటిని. .కన్నీటితో దానినే మరల చెప్పుచున్నాను.
19. అట్టివారికి తుదకు మిగులునది వినాశనమే. వారికి దేహవాంఛలే దైవము. సిగ్గుపడదగిన విషయములనుగూర్చివారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు.
20. కాని మనము పరలోక పౌరులము. దివినుండి మన రక్షకుడును ప్రభువు అగు యేసుక్రీస్తు రాకడకై మనము అతురతతో వేచియున్నాము.
21. బలహీనములగు మన మర్త్యశరీరములను, ఆయన తన శరీరమువలె దివ్యముగ చేయును. సర్వమును లోబరచుకొనగల తన శక్తిచేతనే ఆయన అటుల చేయును.
1. కనుక సోదరులారా! మీరు నాకు ఎంతో ప్రియులు. మిమ్ము చూడవలెనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా! ప్రభువునందలి మీ జీవితములో మీరు ఇట్లు గట్టిగా నిలువవలెను.
2. ప్రభువునందు ఏకమనస్కులై ఉండుడని యువోదియను, సుంతుకేనును వేడుకొనుచున్నాను.
3. విశ్వాసపాత్రుడవు, నా సహకారివి అగు నిన్ను కూడ అర్థించుచున్నాను. నీవు ఈ స్త్రీలకు సాయపడవలెనని నా కోరిక. ఏలయన, సువార్త ప్రచారమున వారు నాతోను, క్లెమెంటుతోను, తదితరులగు నా సహప్రచారకులతోను, కలసి కష్టపడి పనిచేసిరి. వారి నామములు దేవుని జీవగ్రంథమునందు చేర్చబడినవి.
4. ప్రభువునందు మీరు ఎల్లప్పుడును ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను. ఆనందింపుడు!
5. అందరియెడల సాత్త్వికముగ ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు.
6. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వానికొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్ధింపుడు. కాని, ఆ విధముగ అర్థించునపుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్ధింపుడు.
7. మానవ అవగాహనకు అతీతమైన దేవునిశాంతి మీ హృదయములను, మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగ ఉంచును.
8. నా సోదరులారా! చివరి మాటగా చెప్పుచున్నాను. మంచివియు, స్తుతిపాత్రములునైన వానితో మీ మనస్సులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్ధమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు విషయములు అట్టివి.
9. నా మాటలనుండియు, చేతలనుండియు మీరు గ్రహించినవానిని, పొందినవానిని, ఆచరణలో పెట్టుడు. శాంతిని ఒసగు దేవుడు మీకు తోడగునుగాక!
10. ఇంతకాలము తరువాత నాయందు మీకు శ్రద్ధ సజీవముగ మారినందుకు, ప్రభువునందు నేను ఎంతయో ఆనందించుచున్నాను. నాయందు మీరు శ్రద్ధ కలిగివున్నను, మీ శ్రద్ధను నిరూపించుకొను అవకాశము ఇంతవరకు లభింపలేదుకదా!
11. నేను ఏదో నిర్లక్ష్యపరచబడితిని అను అభిప్రాయముతో మీతో ఇట్లు పలుకుట లేదు. ఏలన, నాకు ఉన్నవానితో సంతృప్తిపడుట నేను నేర్చుకొంటిని.
12. కలిమి లేములలో ఉండుట అననేమియో నాకు తెలియును. నాకు ఆకలిగా ఉన్నను, లేక కడుపునిండి ఉన్నను, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడును, ఎచ్చటను సంతృప్తిగ ఉండుట అను రహస్యమును నేను నేర్చుకొంటిని.
13. క్రీస్తు అను గ్రహించు శక్తిచే నేను అన్నిటిని చేయగలను.
14. కాని నా కష్టములలో మీరు నాకు తోడ్ప డుటకు మీ మంచితనమే కారణము.
15. సువార్తను బోధింప నారంభించిన మొదటి దినములలో నేను మాసిడోనియా వదలి వచ్చినపుడు మీ సంఘము మాత్రమే నాకు సాయపడినదని ఫిలిప్పీయులగు మీకే బాగుగా తెలియును. నా లాభనష్టములలో పాల్గొను వారు మీరు ఒక్కరే.
16. తెస్సలోనికలో నాకు సాయము అవసరమైనపుడు పెక్కు మారులు, మీరు నాకు సహాయము పంపితిరి.
17. కానుకలు పొందవలెనని నాకు కోరిక ఉన్నదను కొందురేమో! అటుల కాదు. మీ లెక్కకు విస్తార ఫలము కలుగవలెనని కోరుచున్నాను.
18. నేను అన్నియును సమృద్ధిగ పొందితిని. అవసరముకంటె ఎక్కువగనే మీరు నాకు ఒసగితిరి. ఎపఫ్రోదితు మీ కానుకలను నాకు అందించినాడు. ఇవి సువాసనా భరితమై దేవునకు అర్పింపబడినవి. కనుక ఆయనకు ఆమోదయోగ్యమై, ప్రీతికరమై ఉన్నవి.
19. క్రీస్తు యేసునందలి తన మహిమైశ్వర్యములకనుగుణముగా నా దేవుడు మీ అవసరములనన్నిటిని తీర్చును.
20. తండ్రియైన మనదేవునికి సదా మహిమ కలుగునుగాక! ఆమెన్.
21. క్రీస్తు యేసునకు చెందిన పవిత్ర ప్రజలంద రకు నా శుభాకాంక్షలు. ఇచటనున్న నా సోదరులు మీకు తమ శుభాకాంక్షలను అందజేయుచున్నారు.
22. ఇచటి పవిత్రులందరును, విశేషించి, చక్రవర్తి ఇంటివారును మీకు శుభాకాంక్షలు పలుకుచున్నారు.
23. ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహము మీ ఆత్మతో ఉండునుగాక!